కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 1/8 పేజీలు 25-27
  • బహుళ ప్రయోజనకరమగు ఒలీవ నూనె

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బహుళ ప్రయోజనకరమగు ఒలీవ నూనె
  • తేజరిల్లు!—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రాచీన కాలములలో దీని ఉపయోగములు
  • ఆధునిక కాలములలో
  • దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
తేజరిల్లు!—1993
g93 1/8 పేజీలు 25-27

బహుళ ప్రయోజనకరమగు ఒలీవ నూనె

ఒలీవ నూనె ఒక పండు రసం అనే విషయాన్ని తెలిసికొనుట నిన్ను ఆశ్చర్య పరచునా? ఒక వేళ నీవు మధ్యధరా దేశములో జీవిస్తున్నట్లైన, అలా ఆశ్చర్యపడవు. అంతెందుకు ప్రపంచంలో వేయబడుచున్న 80 కోట్ల ఒలీవ చెట్లలో, 98 శాత మధ్యధరా ప్రాంతంలో ఉన్నవని అంచనావేయబడింది. ఈ ప్రాంతంలో, వేల సంవత్సరాలుగా ఒలీవ నూనె ప్రజల జీవితంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.

కొద్దిమాటలలో చెప్పాలంటే, ఒలీవ అనేది సతత హరితంగా ఉండేచెట్టు యొక్క పండు, మరియు ప్రధానంగా దీనినుండి పిండబడినదే ఒలీవనూనె. అది నెమ్మదిగా పెరుగుచున్నందువల్ల, ఒలీవ చెట్టు మంచిగా ఫలించుటకు పది సంవత్సరాలు లేక అంతకంటె ఎక్కువ కాలమే పట్టవచ్చును. దాని తరువాత, ఆ చెట్టు వందల సంవత్సరాలు ఫలించగలదు. పాలస్తీనాలో వేయి సంవత్సరాల ముందునుండే ఇంకను జీవిస్తున్న ఒలీవ చెట్లు ఉన్నాయని చెప్పబడుచున్నది!

ఒలీవ పండ్లను తిరుగటి రాయి క్రింద నలుగగొట్టుటతో ఒలీవ నూనె తయారీ మొదలగును. నలుగకొట్టుట వలన గుజ్జు తయారగును. అది రసముతీయుటకు హైడ్రాలిక్‌ యంత్రముల క్రింద ఉంచబడును. అయినను ఇది సామాన్య పళ్లరసం కాదు. ఇది నిజానికి నీళ్లు నూనె కలిసియున్న మిశ్రమం. నీళ్లు తీసివేయబడిన తరువాత, నూనె శుద్ధీకరించబడి, నిల్వచేయబడి వినియోగం కొరకు సీసాలలో నింపబడును.

ప్రాచీన కాలములలో దీని ఉపయోగములు

ప్రత్యేకంగా, ప్రాచీన కాలంలో ఒలీవ నూనె యొక్క బహుముఖత స్పష్టమవుతుంది. ఉదాహరణకు, ఐగుప్తులో ఒలీవ నూనె బరువైన నిర్మాణ సామాగ్రిని కదల్చుటకు చమురుగా ఉపయోగించబడేది. అది మధ్య ప్రాచ్యములో సాధారణ ఆహారం కొరకు ఉపయోగించబడుటతోపాటు ఒలీవ నూనె పరిమళ ద్రవ్యంగాను, దీపాలలో నూనెగాను ఉపయోగింపబడేది.

అనేక బైబిలు వృత్తాంతాల ప్రకారం ఈ ఒలీవ నూనెను కొంత సుగంధ ద్రవ్యముతో కలిపి చర్మ ద్రవంలా ఉపయోగించెడివారు. స్నానం తరువాతను, సూర్యుని ఎండనుండి కాపాడుకొనుటకును దాన్ని చర్మానికి కూడా సామాన్యంగా రాసుకొనేవారు. (రూతు 3:3) అతిథి తలకు నూనె రాయుట ఆతిథ్యముగా పరిగణింపబడేది. (లూకా 7:44-46) గాయాలకు, పగుళ్లకు ఉపశమనం కలిగించడానికి ఆ నూనె వైద్యపరంగా కూడా పనిచేసేది. (యెషయా 1:6; లూకా 10:33, 34) ఒక వ్యక్తిని సమాధిచేయుటకై సిద్ధపరచుట కుపయోగించే సుగంధ ద్రవ్యంలో ఒలీవ నూనె ఒకటైయుండవచ్చును.—మార్కు 14:8; లూకా 23:56.

“ప్రతిష్ఠాభిషేక తైలమును” తయారుచేయుమని మోషేకు ఆజ్ఞాపించినప్పుడు ఆ పదార్థాలలో ఏ నూనెను చేర్చుమని యెహోవా వివరించాడు? అవును, అది స్వచ్ఛమైన ఒలీవ నూనెయే! దానితో మోషే గుడారము, అందులోని వస్తువులను, పరిశుద్ధ ఉపకరణాలను, నిబంధన మందసమును కూడా అభిషేకించాడు. యెహోవాకు యాజకులుగా ప్రతిష్ఠించుటకు అహరోను అతని కుమారులు దీని చేతనే అభిషేకింపబడిరి. (నిర్గమకాండము 30:22-30; లేవీయకాండము 8:10-12) ఈ విధంగానే, వారి తలపై ఒలీవ నూనె పోయుట ద్వారానే ఇశ్రాయేలు రాజులు అభిషేకింపబడిరి.—1 సమూయేలు 10:1; 1 రాజులు 1:39.

ప్రాచీన కాలం దీపములలో సామాన్యంగా ఏ నూనె వాడబడేది? మీరు జవాబును నిర్గమకాండము 27:20 నందు కనుగొనగలరు. ఇచ్చటకూడ, బహుళ ప్రయోజనకరమైన ఒలీవ నూనె వాడుకనే చూస్తాము. యెహోవా ఆలయంలో, అతి స్వచ్ఛమైన ఒలీవ నూనెతో వెలిగే పది పెద్ద సువర్ణ దీపస్తంభములు ఉండేవి. యెహోవాకు అర్పింపబడిన పానీయార్పణములోను అలాగే “నిత్యముగా అర్పించు దహనబలి” లోను యీ నూనె ఉపయోగింపబడేది.—నిర్గమకాండము 29:40, 42.

ఒలీవ నూనె ఎంతోవిలువైన పదార్థంగా పరిగణింపబడేది. అందుకే సొలొమోను తూరు రాజైన హీరాము ఆలయ నిర్మాణముకొరకు ఇచ్చిన సామాగ్రి నిమిత్తం చెల్లించే ధనములో యీ నూనె ఒక భాగమైయుండెను. (1 రాజులు 5:10, 11) ఇది మంచి శక్తిదాయకమైన ఆహారముగాను జీర్ణమయ్యే క్రొవ్వు పదార్థములలో ఒకటిగాను నేడు గుర్తింపబడియున్నది, మరియు ఒలీవ నూనె ఇశ్రాయేలీయుల ఆహారంలో కూడ ముఖ్య భాగంగా పనిచేసింది.

ఆధునిక కాలములలో

అప్పటివలె, ఈనాడు కూడా ఒలీవ నూనె బహుళ ప్రయోజనకరమైనది. అలంకరణ సామాగ్రి, డిటర్‌జెంట్‌లు, మందులు మరియు బట్టల ఉత్పత్తులలో కూడ యీ ఒలీవనూనె వాడుచున్నారు. ఈ నూనె ఇంకను ప్రాముఖ్యముగా ఆహారంగా ఉపయోగపడుతుంది. యూరోప్‌ మరియు మధ్య ప్రాచ్య దేశాలలో కూడా దానికి ఎంతో గిరాకీ పెరుగుచున్నది.

ఉదాహరణకు, కన్‌స్యూమర్‌ రిపోర్ట్‌ ప్రకారం, అమెరికాలో ఒలీవనూనె విక్రయం “1985 నుండి 1990 మధ్యకాలంలో రెట్టింపు కంటె ఎక్కువైంది.” ఎందుకని? ఒలీవ నూనెలో విటమిన్‌ ‘ఇ’ అధికంగా ఉన్నదనుట ఒక కారణం, తక్కువ క్రొవ్వు పదార్థాలుగల (మోనోఅన్‌సాచురేటెడ్‌) ఒలీవ నూనెను తినుటవలన గుండెకు ఎటువంటి దుష్పరిణామాలు సంభవించకుండ లాభము చేయుచున్నవని ఇటీవలి అనేక పరిశోధనలు కూడ చూపించినవి. ఒలీవ నూనె రక్తపోటును, రక్తములోని చక్కెర పరిమాణమును తగ్గిస్తుందని ఇంకొక పరిశోధన తెల్పింది.

కొందరు నిపుణులు, మోనోఅన్‌సాచురేటెడ్‌ ఒలీవ నూనెతో తయారు చేయబడిన అధిక క్రొవ్వుగల ఆహారమును సేవించుట మంచిదని సిఫారసు చేసిరి. ఎక్కువ క్రొవ్వుగల ఏ ఆహారమైనను గుండెకు మంచిదనే తలంపు పోషకాహార అవాస్తవం గనుక, అటువంటి సిఫారసు “ప్రజలలో సంచలనం కలిగించిందని” కన్‌స్యూమర్‌ రిపోర్ట్‌ తెల్పింది. వెంటనే మోనోఅన్‌సాచురేట్‌లు వార్తా పత్రికల దృష్టిని ఆకర్షించుటతో ఒలీవ నూనె అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.

ఈ వాదనలు సామాన్యంగా అంగీకరించబడుతున్నాయా? ఇతర ఆహార పదార్థములలో ఉండే క్రొవ్వు (పాలిఅన్‌సాచురేటెడ్‌ మరియు సాచురేటెడ్‌) పదార్థముల కంటె ఒలీవ, బేరిపండు, మరియు ఇతర పీచుగల కాయలలో ఉండే మోనోఅన్‌సాచురేటెడ్‌ క్రొవ్వును ఎన్నుకొను విషయంపై స్వల్ప వివాదము మాత్రమే కనబడుతుంది. అయిననూ, ఇతర వాదనలు అతిశయోక్తిగా చెప్పబడినవని కొందరు నిపుణులు భావించుచున్నారు. ఉదాహరణకు, ఒలీవ నూనె రక్తంలోని క్రొవ్వు పదార్థాన్ని, రక్తపోటును మరియు రక్తములో చక్కెర శాతాన్ని తగ్గించగలదని వైద్య శాస్త్రం ధృవపరచినదని కొన్ని వ్యాపార ప్రకటనలు ప్రగల్భములు చెప్పినవని,” కన్‌స్యూమర్‌ రిపోర్టు వివరించుచున్నది. కానీ డా. మార్గోడెంక్‌ అను ఒక పరిశోధకురాలి మాటల ప్రకారం, రక్తపోటు మరియు రక్తములో చక్కెర తక్కువగుటలో ఎంత సూక్ష్మమైన తేడా ఉందంటే అది చికిత్సాపరంగా చూస్తే దానికేం ప్రాధాన్యత లేదు.

ఒక పరిశోధనా బృందం ఈ సలహా ఇస్తుంది: “ప్రతివిధమైన ఒలీవ నూనె, “తేలికైనా” కాకపోయినా, నూటికి నూరు పాళ్లు క్రొవ్వు కలిగి ఉంటుంది మరియు ఒక గరిటె నూనెలో 125 కాలరీలు ఉంటాయి. ఆ కారణము చేతనే ఆరోగ్యకరమైన ఆహారములో దానికి పరిమితమైన పాత్ర ఉన్నది. వెన్న, కృత్రిమ వెన్న మరియు ఇతర కూరగాయల నూనెలకు బదులుగా ఉపయోగించటం వలన అధిక ప్రయోజనాలు కలుగవచ్చును. అయితే ఆ ప్రయోజనాలను గూర్చి కూడా అధికంచేసి చెబుతున్నారు.” మంచి కారణంచేత అంతర్జాతీయ ఆలివ్‌ ఆయిల్‌ కౌన్సిల్‌ ఈ హెచ్చరికను ప్రచురించింది: “మీరు ఆవేశ పూరితులై మీ ఆహారములో అనేక లీటర్ల ఒలీవ నూనెను కలపక మునుపు, మీ జాగ్రత్త కొరకై కొన్ని హెచ్చరిక మాటలు చెప్పుట అవసరము. ఎక్కువ శాతం ఒలీవ నూనె వాడుటవలన అది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచవచ్చు, కాని సన్నగా ఉంచక పోవచ్చును.”

ప్రాచీన కాలములలో వలె నేడు కూడా, యెహోవా ఇచ్చే ఆహారము మరియు ఇతర వరములను ఆనందించుటకు మితంగా ఉండడమే కీలకం. ఈ విషయమును మనస్సులో ఉంచుకొని, మీరు మధ్యదరా ప్రాంతంలో జీవిస్తున్నా లేక వేరే చోట ఉన్నా బహుళ ప్రయోజనమున్న యీ ఒలీవ నూనె యొక్క ప్రయోజనాలను సుఖాలను పొందండి. (g92 10/8)

[26వ పేజీలోని బాక్సు/చిత్రం]

ఒలీవ నూనెల రకములు

O అతి స్వచ్ఛమైనది: ఇది అత్యున్నత రకమైన ఒలీవ నూనె, ఇది కరిగించు పదార్థముల ఉపయోగం లేకుండానే అత్యంత నాణ్యమైన ఒలీవ పండ్లనుండి పిండబడినది. అది, గది ఉష్ణోగ్రత యందు తీయబడినది గనుక అది “శీతల పద్ధతిలో తీయబడినది” అని తరచుగా పిలువబడుచున్నది. ఏ రసాయన పదార్థంతో మిశ్రమం చెందనటువంటి, ఒలియిక్‌ ఆసిడ్‌ అందులో చాలా తక్కువ పరిమాణంలో ఉంది. ఈ క్రొవ్వుగల ఆసిడ్‌ ఒలీవనూనె రుచిని పాడుచేయగలదు. అది స్వచ్ఛమైన ఒలీవనూనె, చాలా రకాల రుచులు సువాసనలు కలిగియున్నది.

O స్వచ్ఛమైనది: అతి స్వచ్ఛమైన ఒలీవనూనెను తీసే పద్ధతిలోనే ఇది తీయబడినను, దీనిలో ఏ రసాయన పదార్థంతోను మిశ్రమం చెందనటువంటి ఒలియిక్‌ ఆసిడ్‌ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది.

O ఒలీవ నూనె: “శీతల పద్ధతిలో తీయబడిన” నూనెలో కొంతభాగము, దానిలోని యాసిడ్‌ పరిమాణమును బట్టిగాని, రుచి, రంగు లేక వాసన ఉండుట వలనగానీ వాడుటకు వీలుకానిదిగా పరిగణింపబడుచున్నది. ఉత్పత్తిదారులు కరిగించు పదార్థములు ఉపయోగించి ఈ విధమైన నూనెలను శుద్ధిచేస్తారు. తర్వాత, ఈ కరిగించు పదార్థములు వేడిచేత తొలగింపబడును. దీనివల్ల ఇంచుమించు రంగు, వాసన లేని నూనె తయారౌతుంది. ఈ నూనె ఉన్నత శ్రేణికి చెందిన అతి స్వచ్ఛమైన ఒలీవ నూనెతో కలిపి, స్వచ్ఛమైన ఒలీవ నూనెగా అమ్మబడేది, కాని 1991 నుండి ఆ పదము ఉపయోగింపబడుట లేదు. ఇప్పుడు అది కేవలము “ఒలీవ నూనె” గానే పిలువబడుచున్నది.

O ఒలీవ పండ్ల గుజ్జు నూనె: ఒలీవ పండ్లనుండి యంత్రాలలోను, చేతుల్తోను పిండిన తర్వాత నూనె, నీళ్లు వేరైనపుడు మిగిలే రసమే యీ గుజ్జు. కరిగించు పదార్థములు ఉపయోగించి, ఈ పండ్ల గుజ్జునుండి అదనపు నూనెను తీయవచ్చును. తరువాత ఈ నూనె శుద్ధి చేయబడి అత్యంత నాణ్యమైన స్వచ్ఛమైన ఒలీవ నూనెతో కలుపబడుతుంది.

O తేలికైన ఒలీవ నూనె: ఇది ఉత్తమ నూనె రకములలో ఒకటికాదు. ఇది కేవలము స్వచ్ఛమైన ఒలీవ నూనె కొంత భాగాన్ని శుద్ధీకరింపబడిన ఒలీవ నూనెతో కలుపగా వచ్చినదే. ఒలీవ నూనెలన్నీ 100 శాతం క్రొవ్వు కల్గివుంటున్నందువలన, “తేలికైన” అను పదమునకు నూనెలోని క్రొవ్వు పరిమాణంతో సంబంధంలేదు. అయితే ఆ పదం దానిలోని రంగు, సువాసన మరియు రుచియొక్క తక్కువ గుణమును సూచిస్తుంది.

[26వ పేజీలోని బాక్సు]

మీకు తెలుసా . . . ?

O తాజా ఒలీవ పండ్లలో ఒలిరూపెన్‌ అనే చేదుపదార్థం వున్నది గనుకే వాటిని ఏదోరూపేణ శుభ్రం చేస్తే తప్ప తినడానికి వీలుపడవు. నేచురల్‌ హిస్టరీ అనే పత్రిక తెలిపేదేమంటే, ఒలీవ పండ్లను తినే ముందు వాటిని “ఉప్పులో ఊరబెట్టవచ్చును; నీళ్లను మార్చుతూ అనేక రోజులు వాటిని నీళ్లలో నానబెట్టవచ్చును; వాటిని అలానే ఎండపెట్టవచ్చును.” అయితే, ఒలీవనూనె తీయడానికి ముందు చెప్పిన పద్ధతులలో తయారు చేయనక్కర్లేదు.

O అన్ని ఒలీవ నూనెలు ఒకే రుచిని కలిగి ఉండవు. అవి అనేక సహజ రంగుల్లో, రుచుల్లో, ప్రత్యేక వాసనలతో ఉంటాయి. అంతర్జాతీయ ఒలీవనూనె సభ తెల్పిన ప్రకారం “నిపుణులు సాధారణంగా ఒలీవనూనె యొక్క వివిధరుచులను అనగా మృదువైన, (తేలికైన, కోమలమైన లేదా ‘వెన్నవంటిది’); అర్థ రసంగలది, (బలమైన, బాగా ఒలీవ పండ్ల రుచిని కల్గియున్నది); మరియు రసంతో కూడినది (ఒలీవ పండ్ల పూర్తి సువాసన కల్గియున్నది) అని వేరు చేస్తారు.”

O ఒలీవనూనెను రిఫ్రిజరేటర్‌లో వుంచితే అది చిక్కగా పేరుకుని పోతుంది. అంటే అది పాడౌతుందని అర్థం కాదు; మామూలుగా గదిలోవున్న వేడికే త్వరగా అది కరిగిపోతుంది. నిజానికి ఒలీవ నూనెను రిఫ్రిజరేటర్‌ లేకుండానే నెలల తరబడి నిల్వ చేసుకోవచ్చును.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి