కన్నీళ్లన్నీ ఎందుకు వస్తాయి?
నీవు చివరిసారిగా బాగా ఏడ్చిందెప్పుడు? సంతోషాన్నిబట్టా, లేక దుఃఖాన్నిబట్టా? వ్యక్తిగత విజయాన్ని గురించా లేక చింతా క్రాంతమైన వైఫల్యాన్ని గురించా? ఆనందాన్ని పట్ట లేకనా లేక కలతచెందా? ఒకబిడ్డ పుట్టుక లేదా వివాహజత మరణము, ఒక ప్రియమైన జ్ఞాపకము లేదా బాధాకరమైన పునరాలోచన, ప్రియమైన స్నేహితున్ని ఆహ్వానించుట లేదా ఒకనికి వీడ్కోలు చెప్పుటవలన కల్గిందా? వ్యతిరేక పరిస్థితులు, విభిన్నభావనలు, అయినను, తరచు అవి ఒకే విధంగా కన్నీటితో వ్యక్తపర్చబడతాయి.
తీవ్రమైన భావోద్రేకతకు ప్రతిగా మనమెందుకు ఏడుస్తాము? అది దేనినైనా సాధిస్తుందా? లేదా మనము కన్నీళ్లు లేకుండా ఉండగలమా?
మనమెందుకు ఏడుస్తాము?
ఎవ్వరికి కచ్చితంగా తెలియదు. మానవులు, జంతువులు రెండురకాల కన్నీళ్లను ఉత్పన్నము చేస్తాయి. మౌలికమైన లేదా ఎడతెగక వచ్చు కంటిని తడిపే కన్నీళ్లు మరియు పరమూలకముచే కన్ను బాధకు గురియైన వెంటనే రంగములోకి దిగే కన్నీళ్లు. అయితే భావోద్రేకమైన కన్నీళ్లు, విలపించుట, కేవలం మానవులకే వస్తాయి—ఎందుకో అంతగా తెలియదు.
శరీరానికి హాని కరమైన, అనవసర పదార్థాలను, మూత్రపిండాలు, పురీష స్థానము, ఊపిరితిత్తులు, చర్మ రంధ్రాలు ఎలా బహిర్గతం చేస్తాయో, ఆలాగే భావోద్రేకమైన ఏడ్పుకూడా పని చేస్తుందని పరిశోధకుడు విలియం ప్రై సలహా యిస్తున్నాడు. దురద మూలంగా(ఉల్లిపాయమూలంగా) వచ్చే కన్నీళ్లతో భావోద్రేకము (దుఃఖకరమైన చలన చిత్రాలను చూచుట) వలన కల్గే కన్నీళ్లను పోల్చిన తన అధ్యయనాన్ని అతని పుస్తకము క్రయింగ్—ది మిస్టరీ ఆఫ్ టియర్స్ వర్ణిస్తున్నది. భావోద్రేక కన్నీరులో దాదాపు 24 శాతం ప్రొటీను మిశ్రమ పదార్థాలు అధికంగా ఉన్నాయి. కారణం నేటికి తెలియలేదు, అయితే శరీరం, దురద మూలంగా వచ్చే కన్నీటికి భిన్నమైన భావోద్రేకం వలనకల్గే కన్నీటిని ఉత్పన్నము చేస్తుంది.
“వీటినిబట్టి (స్త్రీవలె NW) నేను ఏడ్చుచున్నాను. నాకంటి నీరు ఒలుకుచున్నది,” అని యిర్మీయా ప్రవక్త వ్రాశాడు. (విలాపవాక్యములు 1:16) పురుషులకంటే స్త్రీలే ఎక్కువగా ఏడుస్తారా? లెక్కల ప్రకారం వాళ్లు దాదాపు నాలుగురెట్లు ఎక్కువ ఏడుస్తారు (పురుషులు ఒక నెలలో 1.4 సార్లు, స్త్రీలు 5.3 సార్లు). ప్రై ప్రకారం బాల్యంలో ఆడపిల్లలు, మగపిల్లలు, పుట్టిన తరువాత భావోద్రేక కన్నీరు కార్చేముందుగా అది రోజులైనాగాని, వారాలైనాగాని వారు సమానంగానే ఏడుస్తారు. అయితే, యుక్త వయస్సులో వ్యత్యాసం ప్రారంభమౌతుంది. బహుశా అది సామాజిక ప్రభావం మూలంగా కావచ్చును. పది సంవత్సరముల ప్రాయంవరకు బాలబాలికలలో ప్రోలాక్టిన్ హార్మోను (పాలనుత్పత్తి చేసే ప్రేరకం) సమానంగా ఉంటుంది. దాదాపు 13 నుండి 16 సంవత్సరాల మధ్యలో యువతులలో దీని స్థాయి పెరుగుతుంది.
ఈ ప్రోలాక్టిన్ కన్నీటిలో కనుగొనబడింది. వత్తిడి క్రింద ఉన్నపుడు అది శరీరంలో పెరుగుతూ ఉంటుంది. కావున వత్తిడికి లోనైనప్పుడు పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా హార్మోనులకు గురౌతుంటారు. పురుషులకంటే స్త్రీలే తరచు ఎక్కువగా ఏడ్చుటకు యిదియే కారణమా? భావోద్రేకమైన ఏడ్పు రసాయన సమతూకాన్ని తిరిగి సాధించుటకు శరీరం చేసే ప్రయత్నమేనని డా. ప్రై నమ్ముతున్నాడు. హార్మోనులు ఏడ్పును ప్రేరేపించవచ్చును, కనుకనే మనము ఏడ్చిన తరువాత తరచు బాగుగా ఉన్నట్లు భావిస్తూ ఉంటామని అతని సిద్ధాంతము.
మార్గరెట్ క్రెపో అనే మానసిక వైద్యనిపుణురాలు చేసిన మరో అధ్యయనములో, ఏడుపును ఆపుకొనుటకును, “వత్తిడికి సంబంధించిన అంతర్భాగ అనర్థాలైన పుండ్లు (అల్సర్లు), ప్రేగువాపులు ఎక్కువగుటకు” మధ్య సంబంధమున్నట్లు కనుగొనబడింది. (సెవన్‌టీన్, మే 1990) ఇతర పరిశోధకులు దానికి భిన్నమైన సాక్ష్యాధారమును కనుగొన్నారు. సూసన్ లబోట్ మరియు రాండల్ మార్టిన్ అనే డాక్టర్లు తరచుగా వచ్చే కన్నీళ్లను, అరుదుగా వచ్చే కన్నీళ్లను పరీక్షించారని హెల్త్ పత్రిక ప్రకటించింది. ఏడ్చుట వలన వత్తిడి తక్కువ కాలేదని, బహు తరచుగా ఏడ్చువారు “మరింత ఎక్కువ వ్యధకు, కృంగుదలకు లోను కావచ్చునని” వారి పరిశీలనలు చూపినవి. “సమస్య నుండి మనలను పెడత్రోవ పట్టించునదైతే” ఏడ్పు ప్రయోజనకరము కాదని వారి అభిప్రాయము. అయినను, ఏడ్పు అనేది హృదయ విదారక అనుభవములో ప్రముఖ పాత్ర వహించగలదు. ఇందుకు ఉదాహరణ, ప్రియమైన వారి మరణమే.
భావోద్రేక కన్నీళ్లకు కారణము, ఉద్దేశము అగమ్యగోచరంగా ఉన్నదని చెబితే సరిపోతుంది.
ఇతర కన్నీళ్లు
ప్రస్తుతము మీ కండ్లలో ఉన్న కన్నీళ్లు, ఎడతెగక వచ్చే కన్నీళ్లు చేసే పనిగురించి మనకు బాగా తెలుసు. అవి మీ కంటిని తడుపుట కంటే ఎంతో ఎక్కువ పనిచేస్తాయి. ఈ అద్భుతమైన ద్రవము అది ఉత్పత్తియై, వ్యాపించి, కన్నీటి ధారగా ప్రవహించే విధానాన్ని పరిశీలిద్దాము.
ప్రధాన కన్నీటి గ్రంధి మీ కంటి వెలుపటి కొనకు కొద్దిగా పైభాగమున ఉంటుంది. ఈ స్పాంజి లాంటి గ్రంధి, మరి యితర 60 గ్రంధులతో కలిసి శ్లేష్మము, సజల మరియు నూనె అను మూడుపొరలతో కూడిన సరియైన తెరను సృష్టిస్తాయి.
శ్లేష్మమనే లోపలి పొర, బయటకు కన్పించే కనుగుడ్డుపై కనురెప్పలు కదులాడు విధంగా దాని ఉపరితలాన్ని నునుపుగా చేస్తుంది. ఈ మూడింటిలో సజల పొర ఎక్కువ మందం. దీనిలో శుక్ల పటలమునకు ఉపయుక్తమగు ప్రాణవాయువు వంటి ముఖ్యమైన మిశ్రిత పదార్థములున్నవి. వీటికి తోడు లైసోజైమ్ మరి యితర 11 ఎన్‌జైమ్‌లు కన్నీటిలో కనుగొనబడ్డాయి. లైసోజైమ్ సూక్ష్మ క్రిములను ఎదిరించుటలో అతి శ్రేష్ఠమైనది. అది కంటిని తెల్లగాను, తేటగాను ఉంచుతుంది.
ఈ కన్నీటికి 30 మైబోమియన్ గ్రంధులు తుది మెరుగులు దిద్దుతాయి. ఆ పసుపు పచ్చని చిన్న చుక్కలు రెండు రెప్పల లోపలి భాగాన ఒకే వరుసలో ఉంటాయి. ఆ గ్రంధులు నూనె పొరను ఉత్పత్తి చేస్తాయి, మీ దృష్టిని చెరిపివేయనంత పలుచగా వుంటాయి. అయిననూ రెప్పలార్చే మధ్యలో కన్నీటిపొర ఆవిరై కంటిపై అసౌకర్యాన్ని కల్గించకుండా చేస్తాయి. నిజానికి కొంతమందికి ఈ నూనె సరఫరా ఎక్కువ ఉండనందున వారి కన్నీళ్లు మామూలుకన్నా ఎక్కువ వేగంగా ఆవిరైపోతాయి.
కనురెప్ప లార్పునప్పుడు
ఇవిగో కనురెప్పలు, అతివేగంగా తడుస్తూ సమపాళ్లలో మిశ్రిత పదార్థాలను తీసుకువచ్చి, మూడు పొరలుగా కంటిపై సమంగా పరుస్తున్నవి. బయటకు కన్పించే కన్నంతా సున్నితంగా తడిచేయులాగున కనురెప్పలు సరియైన విధంగా కలుసుకుంటాయి.
వినియోగమైన కన్నీటికి ఏమౌతుంది? మీ కంటిని జాగ్రత్తగా పరిశీలిస్తే, లోపలి కొననందు ఒక చిన్న రంధ్రము కనబడుతుంది, అది అధికంగా ఉన్న కన్నీటిని, కన్నీటి కోశములోనికి ఒక మార్గముగుండా పోనిస్తుంది. అక్కడినుండి ఆ కన్నీళ్లు ముక్కులోనికి, గొంతులోనికి వెళ్తాయి. అక్కడ శ్లేష్మముచే పీల్చుకొనబడతాయి. కనురెప్పలార్పేటప్పుడు కన్నీటికోశము ఒక పంపు వలె పనిచేస్తుంది, అది కన్నీటిని ఆ నాళములోనికి క్రిందికి పోయేటట్లు చేస్తుంది.
మీరు ఏడ్చుట కారంభించినపుడు, అధికంగా ఉన్న ఆ కన్నీటిని త్వరగా పంపించుటకు ఆ పంపును నడిపేందుకు మీరు సహజ సిద్ధంగా రెప్పలార్పుతూ ఉంటారు. అయితే కన్నీటి ప్రవాహం మొదలైతే, ఆ పంపు నిండిపోయి ముక్కు రంధ్రము నందున్న కన్నీటి కోశము పొర్లి ప్రవహిస్తుంది, అప్పుడు మీ ముక్కులోనికి కన్నీరు వస్తుంది. ఇప్పుడు మీరు మీ చేతిరుమాలును తీయక తప్పదు, ఎందుకంటే ఈ పాటికి ఆ కన్నీళ్లు కనురెప్పలను దాటి చెంపలపైనుండి జారుతూ ఉంటాయి.
కనుక, ఒక హృదయపూర్వక అభినందనేగాని, బాధకరమైన అవమానమేగాని, విరగబడి నవ్వినా లేక చింతాక్రాంతమైనా, విజయవంతమైన సంఘటనయైనా లేక గొప్ప నిరుత్సాహమైనా—వాటిని ఏది ప్రేరేపించినను మీ భావాలను వ్యక్తపర్చుటకు కన్నీళ్లు సిద్ధంగా ఉంటాయి. (g92 9/22)
[23వ పేజీలోని బాక్సు]
ఎరుపెక్కిన కళ్లకు సహాయం
నీ కళ్లు మంటెక్కి దురద పెడుతున్నట్లు తరచూ నీకు అనిపిస్తుండవచ్చును. ఎందుకలా జరుగుతుంది? తెల్లగుడ్డు మీదనున్న పలుచని పొర నందు రక్తకణాలు ఉబ్బినపుడు కళ్లు ఎరుపెక్కుతాయి.
కన్నీళ్లు తక్కువగుటే దోషంకావచ్చు. వీడియో దృశ్యాల టర్మినల్స్ దగ్గర గంటల తరబడి పనిచేసేవారు లేదా ఎక్కువ గంటలు చదివేవారు తగినంతగా కనురెప్పలు ఆర్పరు. సామాన్యంగా నిమిషానికి 15 సార్లు రెప్పలు ఆర్పుతారు. చదివేటప్పుడు, వాహనాన్ని నడిపేటప్పుడు లేదా మరి యితర విధంగా తదేకదృష్టి నిల్పేటప్పుడు ఆ స్థాయి నిమిషానికి మూడునుండి ఆరుసార్లకు పడిపోతుంది, అందుమూలంగా కన్ను ఆరిపోయి, దురదపుడుతుంది. కళ్లకు ఉపశమనం కల్గించు చుక్కల మందును వాడమని, రెప్పలార్పుటకు కొంత విరామము తీసుకొనవలెనని డాక్టర్లు సలహాయిస్తారు.
నిద్రనుండి లేచిన తరువాత కళ్లు కొద్దిగా ఎరుపెక్కి యుండుట నీవు గమనించే ఉంటావు. ఎందుకంటే చీకటిలోను, నిద్రపోయేటప్పుడు కంటిని తడిగా ఉంచే కన్నీళ్లు బహుగా తగ్గించబడతాయి.
వయస్సు మళ్లుట వలన కల్గినట్లే కొన్ని రకాల మందులు కన్నీటి గ్రంథుల ఉత్పత్తిని తగ్గించి వేస్తాయి. వాతావరణ తీవ్రత, దురద, లేక కాలుష్యం కారణంగా కనురెప్పలు వాచిపోవడం లేక అంటురోగం సోకడం మూలంగా కళ్లు ఎరుపెక్కవచ్చును.
అంగవిహీనము లేదా గాయమగుటవలన రెప్పలు లేదా గ్రంథులు ఆగిపోవుట లేదా జన్మతా వచ్చిన లోపాల వలన కన్నీటి శ్లేష్మము కన్నును పూర్తిగా కప్పుటను ఆటంకపరుస్తాయి, లేక ఆ శ్లేష్మమే దాని మిశ్రమములో సమతూకంగా లేకపోవచ్చును.
చివరిగా, లక్షలమంది ప్రజలు జోగ్రెన్స్ సిండ్రోమ్ అనే స్వయంవ్యాధినిరోధక లోపమునకు సంబంధించిన రోగముతో బాధపడుచున్నారు. ఇది కన్నీరు, లాలాజలము మరియు నూనెగ్రంధులపై పనిచేసి చర్మము, సోరు మరియు కళ్లు ఆరిపోవునట్లు చేయును.
కళ్లు మరీ ఎక్కువగా ఆరిపోతుంటే ఏమి చేయవచ్చు? చుక్కల మందు లేదా చిన్న పీపాల రూపంలో ఉండే కృత్రిమ కన్నీళ్లు నేడు బహుళ వ్యాప్తంగా లభ్యమౌతున్నాయి, అలాగే, కంటి తడి ఆవిరైపోవుటను తగ్గించుటకు గాలి చొరబడకుండా ఉండే ప్రత్యేక కళ్లద్దాలు కూడ లభ్యమౌతున్నాయి. అసౌకర్యంగా ఉన్నను, ఇట్టి స్థితిగతులున్నను అంధత్వం రావడం బహు అరుదు. అయితే, వైద్యము చేయకపోతే తీవ్రంగా పొడిదేరిపోతే, శుక్లమండలానికి హాని కలుగ వచ్చు. కావున వైద్య సలహా తీసుకొనుట ప్రాముఖ్యం.
[24వ పేజీలోని బాక్సు]
“నా కన్నీళ్లను నీ నీళ్ల తిత్తిలో ఉంచుము”
కీర్తనల గ్రంథకర్త దావీదు, తన దుఃఖముపై దృష్టినిలుపుమని తన దేవుని ప్రాథేయపడుతూ అలా వ్రాశాడు. (కీర్తన 56:8 NW) అవును నమ్మకమైన దేవుని సేవకుల జీవితాలలోని హృదయ విదారక పరిస్థితులు అట్టి ప్రలాపమునకు నడిపించినవి.
తన కుమారుడైన అమ్నోను అబ్షాలోము, తన ప్రాణమిత్రుడు యోనాతాను, రాజైన పౌలు వీరందరి మరణాల విషయమై రాజైన దావీదు యొక్క కన్నీటి ఆవేదనను ఊహించుము. (2 సమూయేలు 1:11, 12; 13:29, 36; 18:33.) అమాలేకీయులు సిక్లగు పట్టణముపై దండెత్తి దావీదు భార్యలను, పిల్లలను అతని శూరులను ఎత్తుకొనిపోయినపుడు వారు “ఇక ఏడ్చుటకు శక్తిలేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి.”—1 సమూయేలు 30:4.
యాకోబు మరియు మోషే చనిపోయినపుడు వారి జనాంగమంతా కొన్ని రోజులవరకు ఏడ్చినపుడు అది ఎంతో గొప్ప ప్రలాపమై యుండవచ్చును. (ఆదికాండము 50:3; ద్వితీయోపదేశకాండము 34:8) చెరగొనిపోబడుట, శ్రమలు కలిగినపుడు కూడా యెహోవా చెవులకు చింతాక్రాంతమైన ఏడ్పు వినిపించింది. (యోబు 3:24; కీర్తన 137:1; ప్రసంగి 4:1) విలాపవాక్యముల గ్రంథమంతా కన్నీరుతో మునిగి పోయిన యిర్మీయాచే వ్రాయబడిన ప్రలాపగీతమై యున్నది.—విలాపవాక్యములు 1:16; 2:11, 18; 1:1 అథస్సూచి.
ఏడ్చుట బలహీనతకు సూచన కాదుగాని, లోతైన భావోద్రేకాన్ని సహజంగా వ్యక్తపరచుటే. ఆ విధంగా, పరిపూర్ణ మానవుడైన యేసు సహితము కన్నీరు కార్చాడు. ఒకసారి ఆయన యెరూషలేము పట్టణాన్ని గూర్చి, చనిపోయిన లాజరును పోగొట్టుకున్న కుటుంబాన్ని, స్నేహితులను చూచి దుఃఖించాడు. (లూకా 19:41; యోహాను 11:33-35) అయితే, యేసు తన ప్రియస్నేహితున్ని సమాధినుండి బయటకు రమ్మని పిలిచినపుడు ఆ కుటుంబీకుల, స్నేహితుల కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారిపోయినవి.—యోహాను 11:41-44.