కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 1/8 పేజీలు 18-20
  • కాపిబారా సృష్టి అద్భుతమా లేక పొరపాటా

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కాపిబారా సృష్టి అద్భుతమా లేక పొరపాటా
  • తేజరిల్లు!—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రపంచంలోకెల్ల పెద్దది
  • “పచ్చిగడ్డిలో ప్రముఖులు”
  • ఈదుటకు రెక్కలున్న ఒక పంది
  • గొప్పరహస్యం
  • “పరస్పర శిశు సంరక్షణ క్రియ”
  • చివరి మాట
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1993
తేజరిల్లు!—1993
g93 1/8 పేజీలు 18-20

కాపిబారా సృష్టి అద్భుతమా లేక పొరపాటా

ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని వింతైనవాడని లేక మూర్ఖుడని పిలిస్తే మీకెలా వుంటుంది? బహుశా అవమానింప బడినట్లు భావించరా? అయితే, పరిణామ సిద్ధాంతికుడైన చార్లెస్‌ డార్విన్‌ ఇంకా ఇతరులు నన్ను అలాగే పిలిచారు. ఊహించండి, ఒకాయన నన్ను “సృష్టి యొక్క పొరపాటు” అని కూడ అన్నాడు. నేను స్వతహాగా సాధువుగానే వుంటాను, ఇది నిజంగా నాకు కోపం తెప్పిస్తుంది. కాబట్టి, నాపై ఉన్న అపవాదును తొలగించుకోవాలను కుంటున్నాను. నా బాహ్యరూపం, నా ఇష్టాలు, నా భయాలు, నాకున్న మంచి చెడు లక్షణాలనుగూర్చి మీకు చెబుతాను. అప్పుడు నేను సృష్టియొక్క పొరపాటునో లేక అద్భుతాన్నో మీరే నిర్ణయించుకోవచ్చును.

ప్రపంచంలోకెల్ల పెద్దది

క్షమించండి. నేనెంతగా కలవర పడుతున్నానంటే నన్ను నేను పరిచయం చేసుకోవడం కూడ మరిచిపోయాను నా పేరు కాపిబారా, నేను దక్షిణ అమెరికాలోని ఉష్ణ మండలం నుండి వచ్చాను.a స్పానిష్‌ మాట్లాడే ప్రజలు నన్ను కార్‌పిన్‌చో లేక చెగ్వెరో అని పిలుస్తారు. నా కివ్వబడిన 190 పేర్లలో ఇవి రెండుమాత్రమే. “ప్రపంచంలోకెల్ల ఒక పెద్ద ఎలుక జాతి” అని నన్ను ఎక్కువగా గుర్తిస్తారు.

ప్రగల్భాలు పలుకుతున్నట్లుంది, కాని నిజంగా అలా కాదు. చూడండి, నేను సుమారు గొఱ్ఱెంత పరిమాణంలో ఉంటాను. నన్ను తూకంవేసి చూస్తే 45 కిలోల బరువుంటాను. నా కవల సహోదరి 60 కిలోలు లేదా ఎక్కువ ఉంటుంది. అయినా ఆమె, బలిష్టంగా 90 కేజీలు ఉండే బ్రెజిల్‌లోని ఆడ కాపిబారాతో పోల్చిచూస్తే సన్నగానే ఉంటుంది.

“పచ్చిగడ్డిలో ప్రముఖులు”

ఆ బరువంతా మేము ఏదంటే అది తిన్నందువల్ల వచ్చింది కాదు, ఎందుకంటే మేము పూర్తిగా శాఖాహారులం. ముఖ్యంగా గడ్డినే తినేవాళ్లం. కొన్నిసార్లు ఇళ్లలోని పశువులతో కలిసి మేస్తాం కూడ. మునుపటి కాలాల అమెరిండియన్‌లు మమ్మల్ని మర్యాదపూర్వకంగా “పచ్చగడ్డిలో ప్రముఖులు” అని పిలిచేవారు. “వింతజంతువు” అనే దానికన్నా ఇది నిశ్చయంగా ఎంతో కారణ సహితమైన వర్ణనగా వుంది.

మేము నీటి మొక్కలను కూడ తింటాము, ఇంకా మీరు నిద్రిస్తున్నప్పుడు మీ లేత వరిమొక్కలను, తియ్యని చెఱకు గడలను, రసముగల మంచి పుచ్చకాయలను కొరికి తినకుండ ఉండలేము.

నిజానికి మీరు మమ్మల్ని ఎప్పుడు చూసినా మేము నములుతూ కనిపిస్తాము. ఎందుకంటే మేము తిండి పోతులమని కాదుగాని మేము ఎలుకల జాతికి చెందినవారం కాబట్టే. మా దవడ పళ్లు ఎప్పుడూ పెరుగుతూనే వుంటాయి. కాబట్టి చనిపోయేంత వరకు నములుతూ మరియు కొరుకుతూ ఉండడమే వాటిని అరగదీయడానికి ఏకైక మార్గం.

అంతేకాకుండ, జీవశాస్త్రవేత్తలు నమోదు చేసిన విధంగా ఏమి నమలాలో మాకు తెలుసు. కేవలం ఎక్కువ మాంసకృత్తులున్న మొక్కలనే మేము ఎన్నుకుంటాము. ఇంకా వాళ్లు చెప్పేదేమంటే “గొఱ్ఱెలు లేక కుందేళ్ల కన్నా మాకే గడ్డిని మాంస కృత్తులుగా మార్చే శక్తి ఎక్కువవుంది.” మేము మూర్ఖులమని ఎవరన్నారు?

ఈదుటకు రెక్కలున్న ఒక పంది

విశిష్టమైన రూపం ఉన్నదనే విషయాన్ని నేను ఒప్పుకుంటాను. ముందుకు వచ్చినట్లున్న కళ్లు, చిన్నని గుండ్రని చెవులు, ముడుచుకోగల నాసికారంధ్రాలు, మొదలగునవన్నీ నా పెద్ద తలపై ఉండడం చూచుటకు నాముఖం ఎల్లప్పుడు దిగ్భ్రాంతిని వ్యక్తపరుస్తుంది. “నీటి గుఱ్ఱపు పోలికలతో వున్న పెద్ద గిన్ని పందిలా ఉంటానని” కొందరంటారు. అలా అంటే నేను ఓర్చుకోగలను. “అయినను వంపుగల చెట్టు బోదెనుండి అనుభవంలేని వారు మలచినట్లుందని” నా చదరపు ముట్టెను గూర్చి వ్రాసిన వ్యక్తితో నేను ఏకీభవించను. వ్యక్తిగతంగా, “పందివంటి సునిశితమైన కళ్లతో హాస్య ముఖము” గలదని పిలువబడటానికి నేను ఇష్టపడతాను.

నేను పందులకు సంబంధించిన దానిని కాదుగాని, పొట్టి కాళ్లు మరియు పెద్ద పీపావంటి శరీరంతో నేను పందిలా కనిపిస్తాను. అంతేకాక, 200 సంవత్సరాల క్రితం స్వీడన్‌ దేశస్థుడైన వృక్షశాస్త్రవేత్త కారోలస్‌ లిన్నేస్‌ పొరపాటున నన్ను పంది జాతిలో లెక్కించాడు. అంతెందుకు, ఈదగలిగే రెక్కలున్న పందిని మీరెప్పుడైన చూశారా? చూసి ఉండరు! కాని సృష్టికర్త కచ్చితంగా వాటినే నాకిచ్చాడు, మరియు నన్ను నమ్మండి, ఈ పొరలతో కూడిన వ్రేళ్లుగల పాదాలు నాకెంతో ప్రయోజనకరంగా వున్నవి, ఎందుకంటే నేను నీళ్లను ప్రేమిస్తాను. వాస్తవానికి, పంది ఆకారంగల శరీరము మరియు నీళ్ల ఎడల నాకున్న మక్కువే నాకు నీటిపంది అనే మారుపేరును సంపాదించి పెట్టాయి.

గొప్పరహస్యం

వ్రేళ్లూని దట్టంగా పెరిగిన వృక్షాలతో చుట్టుముట్టిన చెరువులు, కొలనులు, నదులు మరియు బురద నేలలు, నాకు నివాసానికి సరిపడతాయి. నేను నీటిని ప్రేమించడమే కాక జీవించి వుండాలంటే నాకు నీళ్లు అవసరము.

అయిననూ 300 సంవత్సరాల క్రితం వెనిజ్యులాలో, నీటికొరకు మాకున్న మక్కువ మాకు తిప్పలు తెచ్చింది. ఉపవాస కాలంలో రోమన్‌ కాథోలిక్కులు మాంసము తినకూడదు, అయిననూ, చేపలు న్యాయసమ్మతమైన ఆహారము. కాబట్టి కాథోలిక్‌ చర్చి తమకు అనుకూలంగా మా పూర్వికులను చేపలుగా ప్రకటించారు. ఈనాటికి వెనుజ్యులాలో విశ్వాసులు మమ్మల్ని ఉపవాస కాలంలో నిరభ్యంతరంగా తింటారు.

అదృష్టవశాత్తు, నా పూర్వికులలో కొందరు తప్పించుకున్నారు. ఎలా? ఇతర ఎలుక జాతులవలె, దాగుకొనుటకు కన్నాలు చేసుకొనుట ద్వారా కాదు. కాని ఆపద ముంచుకొచ్చినప్పుడు నీళ్లకొరకు పరుగెత్తి, నీటిలో దూకి చాలా తేలికగా ఈత కొట్టుకుంటూ వెళతాము. నీటి జీవులకు వలె యీదుటకు అనువైన శరీర లక్షణములు నా శరీరానికి లేక పోయినప్పటికి నేను గజ ఈతగాన్నే. కారణం? ఇదే నా రహస్యం.

నా క్రొవ్వు పొరల మూలంగా, పరిమాణానికి పరిమాణం, నేను నీళ్లకంటే కేవలం కొంచెమే ఎక్కువ బరువుంటాను. ఊహించండి, ఒక పరిశోధకుడు, నేను నీళ్లలో ఉన్నప్పుడు నాకు నృత్యనాటిక నర్తకుని కదలికలు వున్నవని, అందుచేత అతనికి కవిత్వాన్ని గుర్తు తెప్పిస్తాయని నన్ను గూర్చి వ్రాశాడు. “సృష్టి యొక్క పొరపాటు” అని అనుటకు దీనికి ఎంత వ్యత్యాసమున్నది.

నాకు కష్టం వచ్చినప్పుడు నా పొరలతో కూడిన వ్రేళ్లు గల పాదములు నన్ను శత్రువులకు దూరంగా ఎంతో వేగంగా ముందుకు తోస్తాయి. నేను నీళ్లలోపల చాలా దూరం ఈది, కొన్ని నిమిషాలు నీళ్లలోనే మునిగి వుండగలను. నీటి గుర్రం చేసినట్లే, నేను నీళ్లలోనే మునిగివుండి కేవలం నా నాసికా రంధ్రాలను, కళ్లను మరియు చెవులను మాత్రమే బయటికి పెట్టి జాగ్రత్తగా పైకి వస్తాను. అడవి కుక్కలు చిరుతపులులు, మొసలివంటి జంతువులు, పెద్దపాములు మరియు మనుష్యులవంటి నా శత్రువులకు నీటి మొక్కలలో దాగి ఉన్న నా నాసికారంధ్రాలను కనుగొనుట కష్టమే. ఇతర జంతువులను చంపి తినేవాటిని నా నాసికారంధ్రములకున్న వాసన పసికట్టే శక్తిమూలంగా వాటిని నేను సులభంగా పసికడతాను.

ఎప్పుడు ఎండవేడిమికి గురౌతానో అప్పుడు నా చర్మం త్వరగా చిట్లి, పుండై పోతుంది, నీళ్లలో వుండడం ద్వారా శరీరం కాలకుండ కాపాడబడుతుంది. ఎరుపు-గోధుమవన్నె మరియు బూడిద రంగుగల నా వెంట్రుకలు పలుచగా ఉంటాయి గనుక నా శరీర చర్మం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి నా శరీర ఉష్ణోగ్రతను సమతూకంగా వుంచుకొనుటకు నేను ఊరికే నీటిలో మునిగి ఉంటాను లేదా బురదమట్టి నా శరీరానికి రుద్దుకొని, దానిలో దొర్లుతుంటాను.

“పరస్పర శిశు సంరక్షణ క్రియ”

మేమెప్పుడు నేలపై ఉండమా? కనీసం ఈనటానికైనా తల్లి అక్కడ వుండవలసిందే. నాలుగు నెలల గర్భం తరువాత ఒక్కొక్కటి ఒక కిలో కంటే ఎక్కువ బరువుండే రెండు నుండి ఎనిమిది వరకు పిల్లలు పుడతాయి. వాటి “పలుచని గోధుమ వన్నె, నిగనిగ లాడే బొచ్చు,” వాటిని తలిదండ్రులకన్న “అందంగా వస్త్రాలు” ధరించిన వాటిలా చేస్తాయి. అని ఒక పరిశీలకుడు తెలియజేస్తున్నాడు. 15 నెలల వయస్సులో ఆడ కాపిబారా ఈనుటకు మొదలు పెడుతుంది. అది పది సంవత్సరాల వరకు జీవించి, కనీసం 36 పిల్లలను తన జీవిత కాలంలో ఈనవచ్చును.

కొన్ని గంటలలోనే పిల్లలు తల్లి వెంటే నడుస్తాయి, ఈత కొట్టడం కష్టమే ఎందుకంటే మొదట్లో పిల్ల నీళ్లలోకి వెళ్లటానికి యిష్టపడదు. బలవంతంగా ఈత మొదలు పెట్టిన తరువాత అమితోద్రేకముతో తప్పటడుగులు వేసే కూన తల్లిని గాని లేక ఇతర ఆడ కాపిబారానుగాని అనుసరిస్తూ దాని వీపు పైకెక్కుతుంది. అప్పుడు తల్లి ఇష్టపూర్వకంగానే దానిని నీటిపై తేలియాడునట్లు చేస్తుంది. కూన పెద్దదౌతున్న కొలది సమతూకముకలిగి ఉండుట కష్టమైపోతుంది. త్వరలోనే అది తల్లి వీపుపైనుండి దొర్లి తను స్వంతగా ఈత కొట్టడం మొదలు పెడుతుంది.

పోషించుటలో పెద్ద అడవులు కూడ సహకరిస్తాయి. తల్లులు తన స్వంత బిడ్డకేగాక ఆకలిగొన్న ఇతర పిల్లలకు కూడ పాలిస్తాయి. ఎందుకు? వన్యప్రాణుల చిత్ర నిర్మాణకుడైన ఆఫేడ్రన్‌ వారెన్‌ ఇలా వివరిస్తున్నాడు: “పరస్పర శిశు సంరక్షణ క్రియ కూనలు జీవించి వుండే అవకాశాలను మెరుగుపరచగలదు.”

చివరి మాట

మేము సహజంగా సాత్వికులము కాబట్టి మేము సులభంగా సాధుచేయగల జంతువులం. సురినామ్‌లోని ఒక అంధుడైన రైతు ఒక కాపిబారాను “గైడ్‌ కుక్క” వంటిదానిగా కూడ ఉపయోగించుకున్నాడు. కాని ఎక్కువగా మా మాంసం రుచిగా ఉంటుందనే ఉద్దేశంతోనే మమ్మల్ని పెంచుతుంటారు. ఉదాహరణకు, వెనెజ్యులాలో మా మాంసంకొరకే పెంచబడు పశు పాలనా క్షేత్రములు వేలకొలదిగావున్నవి—సంశయాత్మకమైన ఘనత! ఎలాగైనా ఇప్పటికే మీరు నన్ను కేవలం రుచికొరకే కాక నేనేమైయున్నానో దాన్ని బట్టికూడ ఇష్టపడతారని అనుకుంటున్నాను.

మీరేమను కుంటారు? నేను సృష్టియొక్క పొరపాటునా లేక అద్భుతాన్నా? మీరు డార్విన్‌తో ఏకీభవిస్తారా లేక నాతోనా? మీకొరకు నిర్ణయం చేయడం నాకిష్టంలేదు. కాని, డార్విన్‌ గతంలో పొరబడ్డాడని గుర్తుంచుకోండి! (g92 9/22)

[అధస్సూచీలు]

a ఇక్కడ వివరించబడిన జంతువు హైడ్రొకోరస్‌ హైడ్రొకోరిస్‌. ఈ జాతికి చెందిన చిన్నరకం పనామాలో జీవిస్తాయి.

[19వ పేజీలోని చిత్రం]

విచిత్రమా? మూర్ఖత్వమా? నిజంగా మేము చక్కని జంట కాదా?

[20వ పేజీలోని చిత్రం]

ఆహారం కొరకే వేలకొలదిగా మేము పెంచబడుతున్నాము—సంశయాత్మకమైన ఘనత

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి