ప్రపంచ వ్యాప్తముగా కుటుంబములను తయారుచేయుట ప్రేమ, క్రమశిక్షణ, మాదిరి మరియు ఆత్మీయ విలువలతో పెంచుట
పసితనం నుండి పడుచుతనం వరకు తమ పిల్లలను విజయవంతంగా పెంచినట్లు అనేక దేశాలనుండి తలిదండ్రులు తమ నివేదికలను పంపియున్నారు. వారంతా యెహోవాసాక్షులే, గనుక పైన పేర్కొనబడిన నాలుగు విషయాల మీద అవధానమిచ్చు అవసరాన్ని గూర్చి వారి నివేదికలు నొక్కి తెల్పుచున్నవి. ఇచ్చట ఎత్తివ్రాయబడిన వృత్తాంతములు, వారనుసరించిన వివిధ కుటుంబ తర్ఫీదు పద్ధతులలో కొన్నింటిని మాత్రమే ప్రతిబింబిస్తున్నవి.
హవాయి నుండి
“బైబిలు మనకు తెలుపు రీతిగా, ప్రేమ ‘అత్యున్నత’ లక్షణం. ఇంటిలోను కుటుంబ మంతటను ప్రేమ దాని ప్రశస్త రూపములన్నింటిలోను విరజిమ్మవలెను. కారొల్, నేను మా వైవాహిక జీవితంలో యీ దైవ లక్షణాన్ని పంచుకున్నాము. మేము సన్నిహితులం. మేము కలిసి ఉండుటకు ఇష్టపడతాం. పిల్లలను విజయవంతంగా పెంచుటకు సంతోషభరితమైన వివాహజంటే కీలకమని నేను నమ్ముచున్నానని మరీమరీ నొక్కి చెప్పగలను.
“మాకు మొదటి శిశువు జన్మించిన తర్వాత కొన్ని రోజులు, వారముల వరకు నా హృదయం పొంగిపొర్లిన శక్తివంతమైన భావాలనుగూర్చి యీ రోజువరకు నాకు జ్ఞాపకమున్నవి. ఓ క్రొత్త ప్రాణి జీవించుట కారంభించగా ఎంతో ఆశ్చర్యమేసింది. పసికందు రేచల్‌కు పాలిచ్చుటకు కారొల్ చాలా సంతోషించినట్లు నాకు జ్ఞాపకమున్నది. నేను పాపనుచూసి మురిసిపోయేవాడినే గానీ నాకు కొంత అసంతృప్తి, కొంచెం ఈర్ష్య వుండేది. కారొల్ రేచల్తో ఎంతో సన్నిహితంగా వుండేది మరి నా స్థానమేమిటి? మాకుటుంబము నుండి నన్ను త్రోసివేశారని—మృదువుగానైనా మొత్తం మీద నన్ను వెనక్కునెట్టి వేశారని—అనుకున్నాను. యెహోవా సహాయంతో నాలోని భావాలను చింతను గూర్చి కారొల్తో చెప్పగలిగాను, ఆమె నాయెడల ఎంతో సానుభూతి చూపి మంచి మద్దతునిచ్చింది.
“అటు తర్వాత నేను మా పాపకు దగ్గరయ్యాను, పాపకు సంబంధించిన చిన్న చిన్న పనులన్నీ చేసేవాన్ని, అనంగీకారమైన వాటితో సహా అంటే మురికైన పొత్తిగుడ్డను ఉతకడమే నాకు విశేషానుభవం. రేచెల్ తర్వాత మాకు ఐదుగురు సంతానం కలిగారు, వారిలో రిబేకా చిన్నది, ఇప్పుడామెకు ఎనిమిదేండ్లు. మాపిల్లలందరికి ఒక్కొక్కరికి వ్యక్తిగత బైబిలు పఠనాలు చేశాము.
“చిన్నతనంలో పిల్లలను పెంచే విషయంలో మరొకటుంది. కారొల్, నేను పిల్లలు పుట్టినప్పటినుండే వారితో మాట్లాడుటలో ఆనందించేవారం. అన్నివిషయాలను గూర్చి మేము మాట్లాడేవారం. కొన్నిసార్లు మేము యెహోవాను గూర్చి ఆయన అందమైన ఆశ్చర్యకరమగు పనులను గూర్చి మాట్లాడేవారం. కొన్నిసార్లు ఆటలకు సంబంధించిన, తమాషా, చిలిపి విషయాలు మాట్లాడాము. మేము వారికి ఏదో ఉపదేశించడానికి ప్రయత్నించాము, అయితే దానికంటె ఎక్కువగా మేము వారితో కలిసి సరదాగా, ఉల్లాసంగా, సమయాన్ని గడిపేవారం. అలా మాట్లాడుట మూలంగా తల్లిదండ్రి-శిశువు బాంధవ్యం విషయంలో అదెంతో సహాయకారిగా వుంటుందని నేను నమ్ముతున్నాను. మాకుటుంబంలో మంచి పరస్పర సత్సంబంధాలు నెలకొనడానికి అవి నిశ్చయంగా తోడ్పడినవి.
“యెహోవా మాకు ఆత్మీయ విషయాల గొప్ప విలువలను గూర్చి అనగా మేము ఆయన సేవలో గడుపుటను గూర్చి నేర్పించాడు. కారొల్‌కు నాకు ఎప్పుడూ అధిక ఆస్తిపాస్తుల్లేవు గాని వాటికొరకు మేము ఎన్నడూ నిజంగా వెదకలేదు లేక లేవు అని బాధపడలేదు. ఐశ్యర్యం కొరకు అధిక సమయాన్ని వృధా చేసివుంటే యెహోవా కొరకును మాకుటుంబం కొరకును సమయం వ్యయపరచేంత వ్యవధి మాకు దొరికేది కాదు. మేము సరియైన నిర్ణయం చేసికున్నాము.” (కారొల్ వ్యాఖ్యానం ఈ క్రింద ఉన్నది.)
“తల్లులు పసివారికి పాలిచ్చి పెంచుట, శిశువులు వారి తల్లుల మధ్య అవినాభావ సంబంధం నెలకొనడానికి ఎంతో ఉపకరిస్తుందని నేననుకుంటున్నాను. నీ పాపను లాలించి ముద్దాడి ఎత్తుకొనుటకు నీవెక్కువ సమయం గడుపుదువు గనుక నిశ్చయంగా దగ్గరౌతావు. తల్లి శిశువును రెండు లేక నాలుగు గంటల కంటె ఎక్కువ వదిలిపెట్టలేదు. ఎడ్వర్డ్, నేను మాపిల్లలను శిశు సంరక్షణ శాలల్లో వదలిపెట్టకుండా చాలా జాగ్రత్తగా వుండేవాళ్లం. మాపిల్లలు పెరిగే కొలది వారికి అవధానమిచ్చి వుపదేశించాలని ఎల్లప్పుడు నేనాశించేదాన్ని. అందుకే వారు పసివారిగా వున్నంతకాలం నేను బయటి ఉద్యోగానికి వెళ్లేదాన్నికాదు. దీన్నిబట్టి వారు మాకెంత ప్రియమో వారు గుర్తెరుగుటకది సహాయపడిందని నేననుకుంటున్నాను. మీ పిల్లలు మీరు సన్నిహితులవడానికి ముఖ్యమార్గమేదంటే వారితో సమయాన్ని గడపడమే. మీరు వారి ఎదుటవుండుట కంటె మించిందేమీ లేదు. మీ బయటి సంపాదన అంతా మీరు వారితో గడిపే సమయంతో సమం కాదు.
“యౌవన దశ కష్టంగా వుండేది ఎందుకంటే పిల్లల పెరుగుదలకు అనుగుణంగా నేను సరిదిద్దుకోవలసి వచ్చేది. వారికి నా సహాయం అంతగా అవసరం లేదన్నట్లు భావిస్తు, స్వేచ్ఛాజీవులుగా వుండాలనుకొనుటను చూస్తే నాకెంతో బాధ కలిగేది. అది మనస్సునొప్పించే కాలం, అది నీ ఉపదేశం, క్రమశిక్షణ, మరియు మలచుట కొరకు నీవు చేసిన కృషి యంతటికి అదో పరీక్ష. వారు యౌవనులుగా వున్నపుడు అలా ప్రారంభించుట నిజంగా చాలా ఆలస్యమే. గనుక నీతి వుపదేశాలు చేయుటకు, మానవులయెడల ప్రేమను ముఖ్యంగా యెహోవా యెడల ప్రేమను గూర్చి ఉపదేశించుటకు ప్రయత్నించుటకది చాలా ఆలస్యం. వీటిని పుట్టిననాటి నుండి నూరి పోయాలి.
“మీరలా చేయుటకు క్లిష్టమైన ఆ యౌవనదశ రాకముందు మీకు 12 సంవత్సరాల వ్యవధివున్నది. బైబిలు సూత్రాలను అన్వర్తింపజేయుటకు మీరు శ్రమపడివుంటే, వారు హృదయపూర్వకంగా యెహోవాను సేవించుటకు నిర్ణయించుకున్నపుడు మీకు సమాధానం ఉల్లాసం కలుగుతుంది.”—ఎడ్వర్డ్ మరియు కారొల్ ఓవెన్స్.
జింబాబ్వే నుండి
“పిల్లలు ‘యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము.’ కీర్తన 127:3 నందు బైబిలు అలా చెబుతుంది. దీన్ని మనస్సు నందుంచుకొనుటవలన మేము మాకిచ్చిన ఆ స్వాస్థ్యమును పెంచి పోషించుటకు మేము చేయగలిగినదంతా చేయుటకు అది సహాయపడింది. మా కుటుంబంలో ఒక ముఖ్య ప్రయత్నమేమనగా మేమంతా కలిసి పనులు చెయ్యాలని—కలిసి ప్రార్థించుట, కలిసి బైబిలు పఠించుట, కలిసి ఆరాధించుట, కలిసి పనిచేయుట, కలిసి స్నేహితులను సందర్శించుట, కలిసి ఆడుకొనుట.
“అప్పుడప్పుడు క్రమ శిక్షణ యివ్వవలసిన అవసరమేర్పడేది. తన యౌవన తొలిదశలో మా కుమారుడు ఒకనాడు ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. మేము బెంగపెట్టుకున్నాం. అడిగితే సూటిగా సమాధానం చెప్పలేదు. ఏదో తప్పు వుందని మేము గ్రహించాం, గాని ఆ రోజు ఉదయం వరకు మేము మౌనంగా వుండదలచాము. మధ్యరాత్రికల్లా మా తలుపు నెవరో తట్టారు. మా కొడుకే, కళ్లనిండా నీళ్లు పెట్టుకొని వచ్చాడు.
“‘అమ్మా, నాన్నా, నాలుగు గంటలయ్యింది నాకు నిద్ర పట్టక. ఎందుకంటె చెడు సహవాసమును గూర్చి బైబిలునుండి మీరిచ్చిన సలహాను నేను వినలేదు. ఈ రోజు స్కూల్ అయిపోయిన తర్వాత కొంతమంది కుర్రాళ్లు ఈత కొడదాం రమ్మని నన్ను బలవంతంగా లాక్కెళ్లారు. వాళ్లలో ఒకడు నన్ను నీళ్లలోకి త్రోశాడు. మరొకడు నాకు సహాయం చెయ్యకపోతే నేను నీళ్లలో మునిగి పోయేవాన్నే. వారు నన్ను చూచి నవ్వి పిరికిపంద అన్నారు. నేను నేరుగా ఇంటికే వచ్చేశాను గాని బయటనే వున్నా ఎందుకంటే నేను తప్పుచేశాననుకున్నాను. నన్ను మన్నించండి, బైబిల్లో చెప్పినట్లు చెడు సాంగత్యము మంచిదికాదని మీరిచ్చిన హెచ్చరికను నేను లక్ష్యపెట్టలేదు.’—1 కొరింథీయులు 15:33.
“అతడు ఏడ్చాడు, మేమును ఏడ్చాం. అతడు ఒక గుణపాఠం నేర్చుకున్నాడని మేము సంతోషించాం, అయితే యింకా లోతైన భావన కల్గివుండాలని మేము అతనికి క్రమ శిక్షణ యిచ్చాము. నిర్గమకాండం 34:6, 7 తెల్పునదేమనగా: యెహోవా కనికరము గలవాడు, తప్పులు క్షమిస్తాడుగానీ ‘శిక్షించకుండ ఎన్నటికి మానుకోడు?’”—డేవిడ్ మరియు బెట్టి ముప్ ప్యూరెరిర్వా.
బ్రెజిల్ నుండి
“నేను విధవరాలిని నా కుమారున్ని నేనే పెంచాలి. టీచర్‌గా కూడ పనిచేస్తున్నాను. పిల్లలకుపదేశించి వారిని క్రమశిక్షణలో పెట్టడం అంత సులభమేమీ కాదు. తలిదండ్రుల పక్షంగా అవసరమైన దేమంటే, సందర్భశుద్ధిగల ఉపదేశం, సమతుల్యమైన క్రమశిక్షణ, మంచి మాదిరి చూపుట. దృఢము ఉండి అదే సమయములో సానుభూతి చూపడం నాకు కష్టంగా ఉండేది. వినే స్వభావాన్ని, ముఖ్యంగా మనస్ఫూర్తిగా వినే లక్షణాన్ని నేను అలవరచుకోవలసి వచ్చింది. ఊరక మాట్లాడటమే కాదు సంభాషించుట ముఖ్యం పిల్లవాడు విని ప్రతిస్పందించేటట్లు చేయాలి. కుటుంబంలో ఓ భాగస్థుడై యున్నాడనే భావన కల్గించుటకు, నేను ప్రయత్నించాను. కరెంటు బిల్లు లేదా నీటి బిల్లు వచ్చినపుడు లేక దుస్తులు, చెప్పుల ధరలు పెరిగినపుడు మేమిద్దరం కలిసి చర్చించుకునేవారము.
“బాగుగా చేసిన పనులను నిజంగా అభినందించుట ముఖ్యం, అవకాశము దొరికినపుడెల్ల దేవుని నియమ నిబంధనలు పాటించుటలోగల విలువను గూర్చి అతనికి చూపించేదాన్ని. ఓ సందర్భములో అనేకమారులు గద్దించిన తర్వాత నేను నిజంగా బెత్తంతో కొట్టవలసి వచ్చింది. నాకెంతో బాధ అనిపించింది గానీ అది చాలా సత్ఫలితమిచ్చింది. అతడు పెరిగి పెద్దవాడయ్యే కొలది మేము కష్టసుఖాలెదుర్కొన్నాము. అయినా ఉపదేశం క్రమశిక్షణ యొక్క విలువేమిటో గ్రహించగలిగాము. అతడు తన వ్యక్తిగత సమస్యలనుగూర్చి నాతో చెప్పి తన భావాలేమిటో వెలిబుచ్చేవాడు.
“మంచి అన్యోన్య సంబంధం కల్గియుండునట్లు నేను జాగ్రత్తపడేదాన్ని. కాబట్టి నేను నా ఉద్యోగంలో అధికంగా నిమగ్నమై పోకుండ నా కుమారుని కొరకు సమయాన్ని కలిగియుండేదాన్ని. సమస్య లొచ్చినపుడు నేనెంతో శ్రద్ధగా విని యెహోవా సహాయం వల్ల వాటిని మేము తీర్చుకోగలిగాము. నేను తప్పులు చేస్తానని అతనికి చెప్పేదాన్ని. ఓసారి నాకు పిచ్చి కోపంవచ్చి, అతన్ని ‘నోరు ముయ్’ అన్నాను. ఎవరినైనా అలా ‘నోరు ముయ్’ అని అనడం ప్రేమలేని తనమే కదాయని అన్నాడు. అతడన్నది వాస్తవమే. ఆ మధ్యాహ్నం మేమిద్దరం చాలాసేపు చర్చించుకున్నాము.”—యొలాండ మోరీస్.
కొరియా రిపబ్లిక్ నుండి
“నా కుటుంబ జీవితంలో బైబిలు సూత్రాలను మనస్ఫూర్తిగా అన్వయించాను. ముఖ్యంగా ద్వితీయోపదేశకాండము 6:6-9 నా హృదయాంతరంగములో నుండెను. గనుకనే నేను వారికి దగ్గరై, వారి మనస్సుల్లోను హృదయాల్లోను దేవుని వాక్యమందలి సూత్రాలను నాటుటకు వీలైనంతవరకు వారితోనే గడుపుటకు ప్రయత్నించాను. పూర్తికాల సేవ అంటే ఏమిటో వారు గ్రహించేందుకు పూర్తికాల సేవకులైన మిషనరీలను, బేతేలు కుటుంబ సభ్యులను కూడ మా యింటికి ఆహ్వానించేవాన్ని.
“పిల్లలు సమస్య తెచ్చి పెట్టినప్పుడు తలిదండ్రులు చేయవలసిన మొదటి పని ఏమంటే ఆత్మ ఫలాలను ఫలించుటే. పిల్లలను కసురుకొని కోపగించుకొనుట సులభమే. అయిననూ తలిదండ్రులమైన మనము సహనము కల్గివుంటూ, మాదిరికరమగు ప్రవర్తనను చూపాలి. పిల్లలను గౌరవిస్తు, వారి పరిస్థితేమిటో వివరించే అవకాశాన్ని వారికిచ్చుట ప్రాముఖ్యం. తప్పిదమునకెట్టి స్పష్టమైన ఆధారం లేకపోతే వారిని నమ్మి, ఎల్లప్పుడు వారిని ప్రోత్సహించాలి. మీరు పిల్లవానికి క్రమశిక్షణ ఇవ్వాలనుకుంటే, మొదట అతనితో ఆ విషయాన్ని గూర్చి చర్చించండి, తప్పేమిటో అతనికి చూపించండి, అది యెహోవాకు, తలిదండ్రులకు ఎంత అయిష్టమైనదో సూచించండి. నా పిల్లలైతే వారికి క్రమశిక్షణ యిచ్చిన తర్వాత వారు నాతో తరచూ యిలా అనేవారు: ‘నాన్నా, నేనెందుకు ఎదురు తిరిగానో నేను అర్థంచేసుకో లేకపోతున్నా, నేనెంతో బుద్ధిహీనంగా ప్రవర్తించాను.’ వారిని క్రమ శిక్షణలో పెట్టుటకు జాగ్రత్త వహించే తలిదండ్రులను వారు అభినందిస్తారు.
“తలిదండ్రులు చెడునడతను ఆదిలోనే కనిపెట్టి మెలకువగా వుండవలెను. నా కుమారుడు 9 వ తరగతిలో వున్నపుడు అతని గదిలోనుండి రాక్ సంగీతం పెద్దగా వినబడేది. అతడు ఒక విద్యార్థి క్రమశిక్షణా టీంలో చేరాడని కనుక్కున్నాను, అతడు లౌకిక ప్రభావం క్రిందికి వచ్చాడు. ఆ టీం సభ్యుల వత్తిడి మూలంగాను, కుతూహలంతో తాను పొగత్రాగాడని నేను తెలుసుకున్నాను. పొగత్రాగుటలోని అపాయములనుగూర్చి మేము యోచించాము, ఆ టీం సభ్యత్వమునకు రాజీనామా చేయవలెనని తానుగా నిర్ణయించుకున్నాడు, అలాగే చేశాడు. అభ్యంతరకరమగు పాఠశాల కార్యకలాపములలో పాల్గొనకుండ ఉన్నందుకై ఏర్పడిన ఖాళీని భర్తీచేయుటకై మేము కుటుంబముతోను సంఘ సభ్యులతోను మంచి వినోద ఏర్పాట్లు చేశాము.
“చివరిగా నేను చెప్పదలచుకున్నదేమంటే, తలిదండ్రులు మంచి మాదిరికరంగా వుండుట ఎంతో ప్రాముఖ్యం. నేను సువార్త సేవలో పూర్తికాలం దేవునికి సేవచేయాలని కోరుకుంటున్నానని ఎప్పుడూ నా ఇద్దరు పిల్లలతో చెప్పేవాడిని. నా రెండవ కుమారుడు స్కూలు పూర్తి చేసేలోగా నేను ఒక సిల్కు ఫ్యాక్టరీ ఉద్యోగమునుండి రిటైర్ అయిపోయాను, పూర్తికాల సేవకుడనయ్యాను. నా ఇద్దరు కుమారులు నా నిర్ణయాన్ని చూచి నా మాదిరిననుసరించారు. తటస్థత విషయంలో జైలుకెళ్లి వచ్చిన తర్వాత ఇద్దరూ పూర్తికాల సేవను చేపట్టి యీనాటి వరకు యింకను అదే సేవలోనే కొనసాగుచున్నారు.”—షిం యూకి.
స్వీడెన్ నుండి
“మేము ఐదుగురు మగపిల్లలను ఇద్దరు ఆడపిల్లలను మొత్తం ఏడుగురిని కని పెంచాము. ఇప్పుడు వారంతా పెద్దవారై, దేవుని రాజ్యసువార్తను ప్రకటించుటలో చాలా చురుకుగా వున్నారు. చిన్నతనం నుండి పిల్లలు సంఘకూటములకు హాజరౌతూ మాతోపాటు ప్రాంతీయ సేవకువచ్చేవారు. వారు క్రమంగా సువార్తపని—తలుపు తట్టడం, నమస్కారమని చెప్పడం, వారి పేర్లు చెప్పడం, తర్వాత కరపత్రములు లేక పత్రిక లందించడం నేర్చుకున్నారు. ఇంకా ఆ చిన్నవయస్సులోనే వారు దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో విద్యార్థి ప్రసంగాలిచ్చేవారు.
“కొన్నిసార్లు, తీవ్ర సమస్యలకు ప్రత్యేక శ్రద్ధవహించవలసి వచ్చేది. అలాంటప్పుడు కేకలు వేయకుండ కొట్లాడకుండ—సహనం, ప్రేమ చూపుటే ముఖ్యం. విషయాలను సహేతుకంగా పరిశీలించి యెహోవా ఉపదేశములను నొక్కి చూపిస్తు వుండుట వలన సమస్యలు పరిష్కరించబడినవి. మేము వారికి డబ్బు విషయాల్లో తర్ఫీదునిచ్చాము. పెద్దవారైనపుడు వారు దినపత్రికలు పంచి పెట్టే పని, కోతపని, తోటను పెంచే పనులు చేసేవారు. దూరంలోవున్న వాళ్ల అవ్వ తాతలను చూడడానికి వెళ్లడం ద్వారా వారు వృద్ధుల సాధకబాధకా లేమిటో తెలిసికొని వారి ఎడల దయచూపు అవసరతను అర్థం చేసుకున్నారు.
“‘మా 30 వ వివాహ వార్షికోత్సవం నాడు ఈ ఉత్తరం వచ్చింది:
“‘ప్రియమైన తలిదండ్రులకు:
“‘సమస్త మేలులకై మీకు వందనాలు! మీరు చూపిన అమిత ప్రేమానురాగానికి, మాలో మీరు నింపిన నిజమైన విశ్వాసానికి, మీరు మాకందించిన అద్భుతకరమైన నిరీక్షణకు—మాటలతో లేక డబ్బుతో విలువ కట్టలేము. అయిననూ, యీ చిన్న ఉత్తరం ద్వారా మా అమ్మనాన్నలుగా మిమ్మల్ని మేమెంత ప్రేమిస్తున్నామో మీరు గ్రహిస్తారని నిశ్చయంగా మేమనుకుంటున్నాం. [సంతకం] ఇట్లు మీ పిల్లలు.’
“ఈ ‘20 సంవత్సరాల ప్రాజెక్టులను’ అన్నింటిని వెనక్కి తిరిగి చూస్తే మా ఎడల కరుణ చూపిస్తున్న మా పరలోక తండ్రియైన యెహోవాకు మేమెంతో కృతజ్ఞులం.”—బెర్టిల్ మరియు బ్రెటాఓస్ట్బెరి.
తల్లిదండ్రులనుండి చిన్న చిన్న రసఖండాలు
“పాలిచ్చే తల్లి, శిశువును తల్లిదగ్గరకు చేర్చుటకు యెహోవా చేసిన ఏర్పాటు, అయితే తండ్రి ఊగే కుర్చీతో ఆమెకు సహాయపడగలడు. నేను నా పిల్లలను చేతులమీద ఎత్తుకొని ఊయల వలె ఊపి ప్రతిరోజు రాత్రి వారిని నిద్ర బుచ్చుతూ ఆనందించేవాన్ని.”
“వారికి తండ్రిగా నేను మా పిల్లలకు పాలిచ్చిపెంచే వీల్లేక పోయినప్పటికీ వారికి నేను ప్రతిరాత్రి స్నానం చేపిస్తూ, నేను వారికి దగ్గరయ్యాను. అలా చేయడం వారికి నాకు సరదాగా వుండేది!”
“అప్పుడప్పుడు మా పిల్లలను ఒక్కొక్కరిని ఒంటరిగా తీసికొని వెళ్లి బయట భోజనం చేసేవాడ్ని. నాన్నతో పాటు ఒక్కొక్కరుగా రావడం వారెంతో ఇష్టపడేవారు.”
“సంవత్సరాలు గడిచేకొలది, కొంచెం కొంచెం వారికి స్వేచ్ఛా స్వాతంత్రాలనిచ్చేవారం. చేతిలో నొక్కి పట్టివున్న స్ప్రింగ్‌ను ఒక్కసారిగా వదిలితే ఎగిరి గంతేస్తుంది గనుక దాన్ని నిదానంగా వదలి పెట్టాలి.”
“ఎంతో అనురాగం చూపించండి. ఏ పిల్లలూ కౌగలించుకొని ముద్దులాడినందువల్ల ఎన్నడూ చనిపోలేదుగానీ అలా చేయకుంటెనే వారి భావనలు చనిపోగలవు.”
“సహనం కల్గివుండండి, వారి ఉత్తేజాన్ని నలిపేయవద్దు. అన్నివేళల విసిగించవద్దు. వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకొననివ్వండి. నీవు చేసే ప్రతి విమర్శతోపాటు నాలుగు అభినందలివ్వండి!”
“వారు ఉత్తములగుటకు మీ శాయశక్తులా ప్రయత్నించండి.” (g91 9/22)
[0వ పేజీలోని చిత్రం]
రిబేకా వంటి పసిపిల్లలకు నిజమైన ఆప్యాయత అవసరం
[21వ పేజీలోని చిత్రం]
కలిసి పనులు చేయుటకు సమయము తీసుకొనుట వలన బలమైన కుటుంబ బంధమేర్పడుతుంది