మొదటి చూపులోని ప్రేమ అటుతర్వాత నిరంతరం నిలుచును!
“శిశువులు పుట్టినవెంటనే నీవు వారిని గమనిస్తే వారు బహు మెలకువగా వుంటారు, వారి పరిసర ప్రాంతములో జరిగే దాన్ని గమనిస్తుంటారు,” అని న్యూయార్క్‌లోని ఆల్బర్ట్ ఎయిన్స్టయిన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌లోని డా. సిసిలియ మెకార్టన్ చెప్పింది. “వారు వారి తల్లుల మాట వింటారు. వారు శబ్దాలవైపు తిరుగుతారు. వారు వారి తల్లుల ముఖం మీద మనస్సుంచుతారు.” ఇకపోతే తల్లులు తమ బిడ్డల కండ్లమీద తమ దృష్టిని కేంద్రీకరిస్తారు. వారిద్దరి మధ్య మొదటి చూపులోనే ప్రేమానురాగం మొదలవుతుంది.
శిశువు సహజరీతిలో జన్మిస్తే, తల్లీ పిల్లను మానసిక మాంద్యంలో పడవేసే మత్తుపదార్ధముల ప్రభావమేమి లేకపోతే, తల్లీ పిల్లల మధ్య యీ బాంధవ్య క్షణం సహజంగా జరిగిపోతుంది. శిశువు ఏడ్పులు తల్లి స్తన్యపాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. శిశువు శరీరం తల్లి శరీరంతో తాకినపుడు, ఆమె ప్రసవానంతర రక్త స్రావాన్ని తగ్గించే ఒక హార్మోను విడుదలౌతుంది. అనురాగ బంధాన్ని ఖాయపరచే మానసిక కార్యక్రమముతోనే శిశువు జన్మిస్తుంది—ఏడ్చుట, పాలు పీల్చుట, గలగల, జలజలమని శబ్దములు చేయుట, చిరునవ్వులు చిందించుట, కేరింతలు కొట్టుట ఇవన్నియు తల్లి అవధానాన్ని తనవైపు మళ్లించుటకు చేసే పనులే. తల్లితోటి బంధం శిశువు ప్రేమను, పెంపకమును, నమ్మకపు భావాన్ని వృద్ధిచేసికొనుటకు వీలు కల్గిస్తుంది. తండ్రి త్వరలో యీ బంధంలో ప్రముఖ పాత్ర వహిస్తాడు. ఆయన శిశువుతో ఏర్పరచుకునే సంబంధం, తల్లి సన్నిహితత్వం కంటె తక్కువైనప్పటికీ అది ప్రాముఖ్యమైన రీతుల్లో శిశువుకు తోడవుతుంది: గిలిగింతలు పెట్టి, లాలించి, మృదువుగా నిమురుట, మొదలగునవి చేసినపుడు ఆ శిశువు ఆనందంతో కేరింతలు కొడుతూ, కాళ్లు చేతులు వూపుతూ, ప్రతిస్పందిస్తుంది.
క్రొత్తగా పుట్టిన శిశువును ఎత్తుకొని హత్తుకొనుట ఒక పోషకాహారం వంటిదని డాక్టరు రిచర్డ్ రెస్టాక్ అంటున్నాడు. “సాధారణ శిశువు పెరగటానికి ఆహారం ప్రాణ వాయువు ఎంత అవసరమో మన “స్పర్శ” అంతే అవసరం. తల్లి తన బాహువులు చాచి శిశువును దగ్గరికి తీసికొని కౌగలించుకొనును, అపుడు అనంత మానసిక శారీరక ధాతువులలో అనుగుణ్యతా క్రమీకరణలు సంభవించునని” అతడంటున్నాడు. ఈ ఆలింగనమువల్ల మెదడు కూడ “ఒక రకమైన ఎగుడు దిగుడు, బీటలువారిన దేహ నిర్మాణ విలక్షణా శాస్త్రాన్ని” వృద్ధిచేస్తుంది.
ఎడబాటు విషయంలో జాగ్రత్త
పుట్టినపుడు తల్లిబిడ్డలకు యీ బాంధవ్యం లేకపోతే అపాయం పొంచి వున్నదని కొందరు సూచించియున్నారు. అలా కాదనుకోండి. ప్రేమతో లాలించే పెంపకము వలన రానైయున్న వారాలలో వారి బాంధవ్యము భద్రంగా వుంటుందని అనుకొనే ఎన్నో మధుర క్షణాలున్నవి. అయిననూ, వారిద్దరి మధ్య అటువంటి సన్నిహిత సంబంధాలు దీర్ఘకాలంగా కొరవడితే మాత్రం అది దుష్ఫలితాలకు దారితీయగలదు. “మనం జీవితాంతం ఒకరినొకరము కావలెనని అనుకున్నప్పటికిని, అట్టి అవసరత మొదటి సంవత్సరంలో అత్యంత అవసరం. శిశువుకు వెలుతురు చూపించక, మానవ ముఖాన్ని చూడకుండ మరుగుచేయుట, ఎత్తుకొనకుండ, కౌగలించక, ఊకొట్టక, గిలిగింతలు పెట్టక, స్పర్శించకుంటే అటువంటి కొరతలను శిశువు తట్టుకోలేడు” అని డాక్టర్ రెస్టాక్ మనకు చెప్తున్నాడు.
పసివారు, అనేక కారణములను బట్టి ఏడుస్తారు. వారు సర్వసాధారణంగా మన అవధానం కోరుకుంటారు. కొంత సేపు వారి ఏడ్పులకు స్పందించకపోతే వారు ఏడ్పు మానుకోవచ్చును. వారిని పరామర్శించే వ్యక్తి ప్రతిస్పందించడం లేదని వారనుకుంటారు. మరల ఏడుస్తారు. ఇంకా సమాధానం రాకపోతే తమను అలక్ష్యంచేశారని, భద్రత లేదని భావిస్తారు. గట్టి ప్రయత్నం చేస్తారు. ఇలా దీర్ఘకాలంగా జరిగితే, అలా మాటిమాటికి జరుగుతూవుంటే, శిశువు తనను విడనాడిరని భావిస్తుంది. అదే శిశువు మొదిటి కోపం, ఆగ్రహమే కావచ్చును, చివరకు తన ప్రయత్నం విరమించుకుంటుంది. ఎడబాటు ఏర్పడుతుంది. ప్రేమను పొందనందుకు తాను ప్రేమించుట నేర్చుకొనడు. మనస్సాక్షి పెరగదు. ఎవ్వరినీ నమ్మడు, ఎవ్వరినీ లెక్కచేయడు. అతడొక సమస్యగా తయారైన బాలుడు అవుతాడు. ఇక మితిమీరితే, అదే క్రూరమైన క్రియలకు పరితాపము నొందే శక్తిలేని మానసిక దుర్భలతగల వ్యక్తిత్వము వృద్ధియవుతుంది.
మొదటి చూపులో ప్రేమ ఇక అంతటితో అంతం కాదు. అటుతర్వాత అది నిరంతరం నిలవాలి. మాటల్లోనేగాక క్రియలలో కూడ వుండాలి. “మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము.” (1 యోహాను 3:18) లెక్కలేనంతగా ముద్దు మురిపాలు వొలుక బోయాలి. తొలి దశలోనే, ఆలస్యం కాకమునుపే దేవుని వాక్యమగు బైబిలు నందున్న నిజమైన విలువలనుగూర్చి వారికి ఉపదేశించుము, బోధించుము. అప్పుడది తిమోతివలె మీ పిల్లలకును జరుగును: “జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యమునుండి నీ వెరుగుదువు.” (2 తిమోతి 3:15) పసితనములోను యౌవన దశవరకు ప్రతిదినము వారితో సమయము గడుపుము. “నేడు నేను నీ కాజ్ఞాపించు యీ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీకుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను.”—ద్వితీయోపదేశకాండము 6:6, 7.
‘మేము ఏడ్వవచ్చు గానీ అది మా మంచికే’
చాలామందికి క్రమ శిక్షణ సున్నిత అంశమై యున్నది. అయితే దాన్ని సరిగ్గా అమలు చేస్తే, అది మాతృమూర్తుల ప్రేమలో ప్రముఖ భాగమై వుంటుంది. ఓ చిన్నారి దీన్ని గుర్తించింది. ఆమె వాళ్లమ్మకి ఒక కార్డు తయారుచేసి దాని మీద “నా ప్రియమైన అమ్మకు” అని వ్రాసింది. దానిపై సువర్ణ సూర్యున్ని, ఎగిరే పక్షుల్ని, ఎర్రని పుష్పాలను రంగు పెన్సిళ్లతో అందంగా చిత్రీకరించింది. అందులో ఇలా వున్నది: “ఇది నీ కొరకే. ఎందుకంటే నీవంటే మాకెంతో ప్రేమ. ఈ కార్డు తయారు చేసి నీకు పంపిస్తూ నీ యెడల మాకున్న అభిమానాన్ని తెలియజేస్తున్నాం. మాకు తక్కువ మార్కులు వచ్చినప్పుడు, మా పేపరు మీద సంతకం చేశావు. మేం తప్పుచేస్తే బెత్తంతో కొట్టేదానివి. మేము ఏడ్వవచ్చుగానీ అది మా మంచికే నని మాకు తెలుసు. . . . నేను చెప్పదలచుకున్నదంతా నేను నిన్ను ఎంతో ఎంతో ప్రేమిస్తున్నాను. నాకు నీవు చేసే దానికంతటికి నీకు వందనాలు. ప్రేమలు ముద్దులు. ఇట్లు [సంతకం] మిషెల్.”
మిషెల్ సామెతలు 13:24 తో ఏకీభవిస్తుంది: “బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును.” అధికారాన్ని సూచించే బెత్తం వాడుటలో దానితో కొట్టుట యిమిడియుండ వచ్చును గానీ అనేకసార్లు అలా చేయాలని కాదు. వేర్వేరు పిల్లలకు, వేర్వేరు తప్పులకు వేర్వేరుగా క్రమశిక్షణ నివ్వాలి. కనికరంతో గద్దిస్తే సరిపోవచ్చు; మొండివానికి గట్టిమందే ఇవ్వవలసి వస్తుంది: “బుద్ధిహీనునికి నూరు దెబ్బలు నాటునంత కంటె బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును.” (సామెతలు 17:10) ఇది కూడ వర్తిస్తుంది: “దాసుడు [లేదా, ఒక పిల్లవాడు] వాగ్దండనచేత గుణపడడు. తాత్పర్యము తెలిసి కొన్నను వాడు లోబడడు.”—సామెతలు 29:19.
బైబిలులో “శిక్షించుట” అనే మాటకు ఉపదేశము, తర్ఫీదు, క్రమశిక్షణ నిచ్చుట—నడవడిని సరిదిద్దుటకు అవసరమైతే బెత్తముతో కొట్టుట కూడ ఇమిడియున్నదని అర్థం. హెబ్రీయులు 12:11 దాని ఉద్దేశమును గూర్చి యిలా తెల్పుతుంది: “ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.” తల్లిదండ్రులు క్రమ శిక్షణ యిచ్చుటలో అంత కఠినంగా వుండకూడదు: “తండ్రులారా మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి.” (కొలొస్సయులు 3:21) లేదా వారిని అదుపు లేనివారిగా వదలి పెట్టకూడదు: “బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగజేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును.” (సామెతలు 29:15) ‘నీ ఇష్టమొచ్చింది చెయ్యి, నన్ను విసిగించక’ అని అంటుంది అదుపులేనితనం. ‘సరియైన దాన్నే చెయ్యి, నేను నిన్ను లక్ష్యపెడతాను’ అని అంటుంది క్రమశిక్షణ.
ఆగష్టు 7, 1989, యు. యస్. న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్టు యుక్తంగా యిలా చెప్పింది: “కఠినంగా దండించక, కచ్చితమైన హద్దులుంచి వాటిని అమలు పరచునట్లు చూసే తలిదండ్రులు బహుశా, మంచి కార్యసాధకులైన పిల్లలను, ఇతరులతో బాగా కలిసిపోయేవారిని తయారుచేయగలిగే స్థితిలో వున్నారు.” ఆ పత్రిక శీర్షిక ముగింపు భాగంలో అది ఇలా తెల్పింది: “సమస్త విజ్ఞానపర పరిశీలన నుండి ఉద్భవించిన, బహుశా అతి ముఖ్యమైన సారాంశ మేదనగా, ప్రతి కుటుంబములోను ప్రేమ, నమ్మకము, సమ్మతింపదగిన హద్దుల పద్ధతిని ఏర్పరచుటయే నిజానికి ప్రాముఖ్యమైనది, గానీ ఎన్నో సాంకేతిక వివరములు కావు. . . . యీ శిక్షణ యొక్క అసలు ఉద్దేశమేమనగా అల్లరిపిల్లలను శిక్షించుట కాదుగానీ వారికి ఉపదేశించి నడిపించి, అంతర్గత హద్దులను వారిలో కలుగజేసికొనుటకు వారికి సహాయపడుటే.”
మీరు చెప్పేది వారు వింటారు మీరు చేసేది వారు అనుకరిస్తారు
క్రమశిక్షణ మీద ది అట్లాంటిక్ మంత్లీ లో వ్యాసమును యీ మాటలతో ప్రారంభించారు: “తలిదండ్రులు వారుపదేశించే వాటి ప్రకారం జీవిస్తేనే ఒక పిల్లవాడు సరిగ్గా ప్రవర్తించగలడని నిరీక్షించగలం.” అంతర్గత హద్దులయొక్క విలువను గూర్చి యింకను ఆ శీర్షిక యిలా తెలియజేసింది: “తలిదండ్రులు బాధ్యులై యథార్థవంతులై, స్వయం-శిక్షణ పొందిన వారిగా వుండి వారికున్నవని చెప్పుకుంటున్న నైతిక విలువ ప్రకారం పిల్లలు వారిననుసరించవలెనని ప్రోత్సహించు వారి పిల్లలు ఎక్కువగా మంచి ప్రవర్తన చూపిస్తుంటారు. పరిశోధనలో భాగంగా, మంచి యౌవనస్థులను సమస్యగా తయారైన యౌవనస్థులతో కలిపినపుడు వారి ప్రవర్తన శాశ్వతంగా దెబ్బతినలేదు. వారు వారి తలిదండ్రుల నైతిక విలువలను ఎంతో భద్రంగా అంతర్లీనం చేసికొనియుండిరి.” అది సామెతలు చెప్పినట్లే రుజువైంది: “బాలుడు నడువ వలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు.”—సామెతలు 22:6.
తమ పిల్లలలో నిజమైన విలువలను నాటుటకు ప్రయత్నించి తాము మాత్రం అనుసరించని తలిదండ్రులు విజయం సాధించలేదు. వారి పిల్లలు “ఆ విలువలను అంతర్లీనం చేసికొనలేదు.” అట్టి అధ్యయనం రుజువుచేసిందేమనగా “వారి పిల్లలకు ఉపదేశించిన విలువలను తలిదండ్రులే ఎంత కచ్చితంగా పాటించారు అనే దానిలోనే తేడా వచ్చింది.”
జేమ్స్ బాల్డ్విన్ అనే రచయిత చెప్పినట్లే అయింది: “పిల్లలెప్పుడు పెద్దలు చెప్పే మాటలు ఎన్నడూ సరిగ్గా వినలేదు గానీ వారిని అనుకరించుటలో మాత్రం తప్పిపోలేదు.” మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తూ, నిజమైన విలువలను వారికి ఉపదేశించాలని కోరుకుంటే, అన్నింటికంటె శ్రేష్ఠమైన పద్ధతి నుపయోగించండి. మీ ఉపదేశాలకు మీరే మంచి మాదిరి చూపండి. యేసు, వేషధారులని ఖండించిన శాస్త్రులు పరిసయ్యులవలె వుండకుడి: “గనుక, వారు మీతో చెప్పువాటి నన్నిటిని అనుసరించి గైకొనుడి; అయినను వారి క్రియల చొప్పున చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు.” (మత్తయి 23:3) లేక పౌలు వేలెత్తి చూపిన వారిని పోలి వుండకుడి: “ఎదుటి వానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించు నీవే దొంగిలెదవా?”—రోమీయులు 2:21.
ఈనాడు బైబిలు పాతబడి పోయిందని, దాని మార్గదర్శక సూత్రాలు అమలు పరచ నసాధ్యమని చాలామంది దాన్ని త్రోసి పుచ్చుచున్నారు. యేసు అటువంటి అభిప్రాయాన్ని యీ మాటల ద్వారా సవాలు చేయుచున్నాడు: “జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులనుబట్టి తీర్పుపొందును.” (లూకా 7:35) అనేక దేశాలనుండి వచ్చిన కుటుంబ వృత్తాంతములు ఆయన మాటలు సత్యమేనని రుజువు చేస్తున్నవి. (g91 9/22)
[7వ పేజీలోని చిత్రం]
తన తల్లితోవున్న సన్నిహిత బాంధవ్యము, పసిపాప భావోద్రేకముగా వృద్ధిచెందుటకు సహాయపడుతుంది
[8వ పేజీలోని చిత్రం]
తండ్రి శిశువుతో కాలం వ్యయపరచుట కూడ ప్రాముఖ్యమే