కుటుంబములారా ఆలస్యం కాకముందే సన్నిహితులుకండి
“కుటుంబం అతి ప్రాచీన మానవ సంస్థాపనం. అనేక విషయాల్లో అది అత్యంత ప్రాముఖ్యమై యున్నది. అది సమాజమునకు అత్యంత అవసరమైన భాగం. కుటుంబ జీవితం బలమైనదా లేక బలహీనమైనదా అనే దానిమీద ఆధారపడి నాగరికతలన్నీ బ్రతికి బయటపడినవి లేదా అదృశ్యమైనవి.”—ది వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా (1973 సంచిక)
కుటుంబం, పిల్లలకు రక్షణనిచ్చే గొడుగు. ఈనాడు అనేక ప్రాంతాల్లో ఆ గొడుగు రంధ్రాలతో నిండివుంది; యింకా పలుచోట్ల దాన్ని ముడిచి మూలన వేశారు. పారంపర్యంగా వచ్చే కుటుంబాన్ని తరచూ పాతబడిన దానిలాగా ప్రక్కదారి పట్టిస్తున్నారు. దూరదర్శిని నందలి వినోదవల్లరి, తండ్రులను అమాయకులుగాను తల్లులను తెలివిగలవారిగాను, పిల్లలనైతే అతి తెలివిగలవారిగా చిత్రీకరిస్తున్నది.
దంపతులలో వివాహ సంబంధమైన అపనమ్మకము పరిపాటియైంది. కొన్ని పారిశ్రామిక దేశాల్లో ప్రతి రెండు తొలి వివాహాల్లో ఒకటి విడాకులతో అంతమౌతుంది. విడాకులు విచ్చలివిడిగా పెరిగిపోతున్నందున ఒంటరి కుటుంబాలు విస్తారమైపోతున్నవి. అనేకులు పెండ్లి కాకుండనే ఇద్దరు కలిసి జీవిస్తున్నారు. సలింగ సంయోగులు, వివాహ వాగ్దానములతో వారి సంబంధాలను ఘనపరచుకోవాలని తాపత్రయపడుచున్నారు. సినిమాల్లోను, వీడియోలలోను, కామాభిలాష అది సహజమైనా, అసహజమైనా ముఖ్యాకర్షణ అయింది. పాఠశాలల్లో, సచ్చీలత పనిచేయదని, నిరపాయంగా వ్యభిచరించడానికి గర్భనిరోధక సాధనములను అందిస్తున్నారు—అవి పనిచేయడం లేదు. సుఖరోగాలు, యువతులు గర్భం దాల్చుట విపరీతంగా పెరిగిపోతున్నవి. అటువంటి సందర్భాల్లో గర్భస్రావం చేయకుండా పుట్టనిస్తే—పుట్టబోయే శిశువులే బలిపశువు లౌతున్నారు. ఇలా పారంపర్య కుటుంబ వ్యవస్థ కూలి పోవుచుండగా, పిల్లలే ముఖ్యంగా అభాగ్యులౌతున్నారు.
చాలా సంవత్సరాల క్రితం నోబెల్ బహుమతి గ్రహీత అలెక్సి కారెల్, మ్యాన్ ది అన్నోన్ అనే తన పుస్తకంలో యీ హెచ్చరికనిచ్చాడు: “కుటుంబ తర్ఫీదుకు బదులుగా పాఠశాలకే పూర్తి బాధ్యతనప్పగించి ఆధునిక సమాజం గొప్ప పొరపాటుచేసింది. తల్లులు పిల్లలను కిండర్ గార్డన్ స్కూల్లోవేసి, వారి పనులు వారు చేసుకుంటున్నారు. అనగా సమాజంలో సరదాగా తిరగడానికి, కామాభిలాషల కొరకు, సాహిత్య లేదా చిత్రకళా వినోదాలకు లేక ఊరకనే పేకాట ఆడుకొనుటకు, సినిమాకెళ్లడానికి, కాలం వృధాచేయడానికి వెళ్తువుంటారు. ఆ విధంగా వారు కుటుంబ వలయం అదృశ్యమగుటకు కారకులౌతున్నారు, అసలు పిల్లవాడు అక్కడే పెద్దలతో సంబంధ బాంధ్యవ్యాలు పెంచుకొని వారినుండి ఎంతో నేర్చుకుంటాడు. తాను ఎదగవలెనంటే అతడు కొద్దిపాటి దూరంలోనే వుండాలి, కుటుంబంలోని ఆ కొద్దిమంది సభ్యుల అవధానం అతనిపై వుండాలి.”—పుట 176.
ఈ మధ్యే, స్టీవ్ ఆలెన్ అనే హాస్య నటుడు, దూరదర్శిని దుర్భాష, లైంగిక అవినీతి కార్యక్రమాలు ప్రసారం చేస్తూ కుటుంబం మీద విరుచుకు పడుటనుగూర్చి వ్యాఖ్యానించాడు. ఆయనిట్లన్నాడు: “అటువంటి కార్యక్రమాలు మనలను నైతిక అథోస్థానానికి నెట్టివేస్తున్నవి. తల్లిదండ్రులు ఎటువంటి భాషను తమ పిల్లలు ఉపయోగించకూడదని నిషేధిస్తున్నారో ఆ భాషనే కేబుల్ టివి పరిశ్రమలు, దూరదర్శిని సంస్థలు వుపయోగిస్తున్నవి. అయితే ఒకనాడు ఆ సంస్థలే ఉన్నత సూత్రాలు కల్గివుండేవి. పిల్లలు, ఇతరులు వుపయోగించే దుర్భాషను చూపించే కార్యక్రమాలు అమెరికా కుటుంబ వ్యవస్థ కూలిపోయిందని నొక్కి తెల్పుతున్నవి.”
ఈ సమాజం పిల్లలకు సంక్రమింపజేసేదేమిటి? వార్తాపత్రికలు చదవండి, దూరదర్శిని తిలకించండి, వీడియోలు చూడండి, సాయంకాలం వార్తలు వినండి, రాగాలాపనా సంగీతాన్ని వినండి, నీ చుట్టు అన్ని చోట్లవున్న పెద్దవారి మాదిరిని గమనించండి. పిల్లలకు మానసిక భావోద్రేకమైన చెత్తాచెదారమే అందించబడుతుంది. “నీవొక దేశాన్ని నాశనం చేయాలంటే చలామణిలోవున్న దాని ద్రవ్యవిధానాన్ని పాడుచెయ్యాలి” అని బ్రిటిష్ మాజీ విద్యా సెక్రెటరీ కేత్ జోసఫ్ అన్నారు. ఇంకను ఆయన ఇట్లన్నాడు: “సమాజాన్ని నాశనం చెయ్యాలంటే పిల్లలను పాడుచేయాలి.” “పాడుచేయుట” అనగా డిక్షనరీ ప్రకారం “సర్వశ్రేష్టత, పవిత్రతనుండి దూరం చేయుట” అని అర్థం. అలా యీనాడు తీవ్రంగా చేయబడుతోంది. బాల్యనేరాన్ని గూర్చి ఎంతో చెప్పబడుతుంది; వయోజన నేరాన్ని గూర్చి అంతకంటె ఎక్కువగానే చెప్పవలసివుంటుంది మరి.
ఆ చెడు క్రియల ప్రభావాలు మన వెన్నంటి వేధించును
జెనీవ బి. జాన్సన్, అమెరికా ఫ్యామిలీ సర్వీస్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యీ సంవత్సర తొలి భాగంలో తానిచ్చిన ప్రసంగము నందిట్లన్నది: “కుటుంబం బహుగా, బహుశా ప్రాణాంతక మగునంతగా జబ్బున పడింది.” అది “మన పిల్లలలో అనేకమందికి అస్పష్టమైన భవితవ్యానిస్తుందని” అంటూ ఆమె రానున్న కీడును సూచిస్తు ఇట్లన్నది: “ఇంటికి, ఒంటికి, తిండికి, మందుకు, విద్యకు నోచుకోని నిరుపేదలైన అనేకమంది పిల్లలను ధనిక సమాజములో అంటరాని వారి స్థితికి త్రోసివేయుటకై దేశం చూపే సంసిద్ధత మనలను పీడించుటకు మరల రానైయున్నది.” మనలను వెంబడించుటకు అది ఇప్పటికే వచ్చియున్నది. నీవు దాన్ని గూర్చి వార్తా పత్రికలలో చదవ వచ్చు, వార్తలలో వినవచ్చు, నీ దూరదర్శినిలో చూడవచ్చును. మాదిరి కొరకు ఇక్కడ ఓ చిన్న మచ్చుతునక ఉన్నది:
జూడన్ తుపాకి తీసి జెర్మాన్ గుండెకు గురిపెట్టి మూడుసార్లు పేల్చాడు. జెర్మాన్ చచ్చిపోయాడు; అతడు 15 సం. కుర్రాడు. జూడన్ 14 సం. పిల్లవాడు. వారిద్దరూ మంచి మిత్రులే. ఒక అమ్మాయి విషయంలో గొడవపడ్డారు.
ఓ వందమంది జనం 16 సం.ల మైకెల్ హిలార్డ్ అంత్యక్రియలకు పోగయ్యారు. అతడు బాస్కెట్ బాల్ ఆట దగ్గర వాదనను విడిచి వచ్చేటప్పుడు అతని తల వెనుక కాల్చారు.
న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ ప్రాంతములో ముగ్గురు యువకులు నిరాశ్రయులైన దంపతులకు నిప్పుపెట్టారు. మర్ధనచేయు ఆల్కహాలు మండనందున పెట్రోల్ పోసి వారిని కాల్చారు.
ఫ్లోరిడాలో ఐదేండ్ల పిల్లవాడు తప్పటడుగులు వేసే పసివాన్ని ఐదో అంతస్తు మెట్లమీద నుండి త్రోస్తే, పడి చచ్చిపోయాడు.
టెక్సాస్‌లో పదేండ్లవాడు ఓ తుపాకి తీసుకొని తనతో ఆడుకునే వాన్ని కాల్చి వాని మృత దేహాన్ని గదిలో దాచాడు, జార్జియాలో 15 సం.ల కుర్రాడు తనను క్రమ శిక్షణలో పెట్టే ప్రిన్సిపాల్‌ను కత్తితో పొడిచాడు.
న్యూయార్క్ నగరంలో 20 సం.లోపున్న కుర్రవాళ్లంతా బ్యాట్లు, పైపులు, గొడ్డళ్లు, కత్తులు, మాంసం నరికే మడ్డు కత్తులను పట్టుకొని “పిచ్చివాళ్లలాగా” నిరాశ్రయులు పడుకునే స్థలానికి వెళ్లి అనేకమందిని గాయపరచి ఒకని గొంతు కోసి వదిలారు. దానికి ప్రేరణ ఏమిటి? ఒక పరిశోధకుడు ఇలా వివరించాడు: “నిరాశ్రయుల మీద దాడిచేసి వారు వెర్రి వేళాకోళం చేసుకుంటున్నారు.”
మిచిగన్‌లోని డెట్రాయిట్లో 11 సం.ల కుర్రాడు 15 సం.ల కుర్రాడితో కలిసి 2 స.ల బాలికను మానభంగం చేశాడు. తర్వాత వారా పసిపాపను చెత్త కుండీలో వదిలి వెళ్లారు.
ఒహాయోలోని క్లీవ్‌ల్యాండ్ నందు ఆరునుండి తొమ్మిది సం.రాల మధ్య వయస్సుగల కుర్రవాళ్లు నలుగురు కలిసి ఒక ప్రాథమిక పాఠశాలలో తొమ్మిదేండ్ల బాలిక మీద అత్యాచారం చేశారు. ఈ విషయంపై వ్యాఖ్యానిస్తు, బ్రెంట్ లార్కిన్ అనే విలేఖరి క్లీవ్‌ల్యాండ్ యొక్క ప్లెయిన్ డీలర్ అనే పత్రికకు శీర్షిక వ్రాస్తూ ఇలా అన్నాడు: “ఈ దేశంలో జరిగేవాటిని, మన విలువల విధానములను పరిశీలిస్తే, అవెంత నీచస్థితికి దిగజారినవో యీ సంఘటనే కొండంత సాక్ష్యమిస్తూ చెబుతుంది.”
క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్శిటీ మనస్తత్వ శాస్త్ర ఫ్రొఫెసర్ డాక్టరు లెస్లి ఫిష్సర్ దూరదర్శినిని నిందించాడు. ఆయన దాన్ని “ఒక పెద్ద కామ యంత్రం” అన్నాడు. మరియు 8, 9 సం.ల వయస్సున్న పిల్లలే వీటిని చూస్తున్నారు.” అమెరికా కుటుంబముల నైతిక అథోస్థితికి తలిదండ్రులే కారకులని ఆయన నిందించాడు. “అమ్మానాన్నలు వారి సమస్యలను తీర్చుకొనుటలోనే మునిగిపోయి ఉన్నారు ఇక వారి పిల్లల సంగతి పట్టించుకోవడానికి వారికి తీరికే లేదు.”
లోపలికి ప్రవేశించేది చెత్తే, బయటికి వెళ్లేది చెత్తే
సమాజంలోని వివిధ కారకములు, ముఖ్యంగా వార్తా వాహిని, వినోదం నందించేవారు, వినోద పరిశ్రమ—మానవుల్లోని అవినీతిని ప్రబలింపజేసి లాభార్జన చేయాలనే మూలములున్నవి.—ఇవి కామం, హింస, అవినీతిని విచ్చలవిడిగా అందిస్తూ యౌవనులు, కుటుంబములు, నైతిక అథోస్థితికి దిగజారుటకు ముఖ్యకారణములై యున్నవి. గనుక ఇక యీ సూత్రం వర్తిస్తుంది: చెడును విత్తితే, చెడునే కోస్తావు. లోపలికి వచ్చేది చెత్తే, బయటకి వెళ్లేది చెత్తే. కుళ్లి, కుళ్లి కాయనష్టి, కాలికాలి కట్టె నష్టి అన్న సామెతవలె వున్నది యీనాటి సమాజ పరిస్థితి.
ఈ సమాజం మనస్సాక్షి లేని పిల్లల తరాన్ని ఉత్పత్తి చేస్తుందా? న్యూయార్క్ సెంట్రల్ పార్క్‌లో కుర్రవాళ్ల ముఠా 28 సం.ల స్త్రీని మూకుమ్మడిగా కొట్టి, అత్యాచారం చేసి ఆమె చనిపోయిందనుకొని విడిచి వెళ్లిన “క్రూరాతి క్రూరమైన” దుస్సంఘటన తర్వాతనే యీ ప్రశ్న వచ్చింది. వారు “సిగ్గూ ఎగ్గూ లేని” వారని అరెస్టయినపుడు వాళ్లంతా “పరిహాసమాడుతూ, శబ్దంచేస్తూ, పాడుతూ వున్నారు” అని పోలీస్ వారన్నారు. ఆ స్త్రీని అలా చేయడానికి గల కారణాన్ని వారిలా చెప్పారు. “అలాచేయడం మాకు సరదాగావుంది, మాకేం పాలుపోలేదు, ఏదో ఒకటి చెయ్యాలనే చేశాం.” టైం పత్రిక వారిని “మానసిక వికలాంగులని, మనము మనస్సాక్షి అని పిలిచే ఆ మానసిక భాగాన్ని పోగొట్టుకొన్నారు లేక దానిని పెంపొందించుకొన లేదు” అని అన్నది.
యు. యస్. న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ ఇలా నొక్కి తెల్పింది: “మనస్సాక్షిలేని మరో తరం పిల్లలు రాకుండ యీ దేశం అడ్డుకోవాలి.” పేరుగాంచిన మనస్తత్వ శాస్త్రజ్ఞుడు డాక్టర్ కెన్ మెగిడ్ మరియు కారెల్ మెకిల్వి వ్రాసిన వారి హై రిస్క్: చిల్డ్రన్ వితౌట్ ఎ కాన్షన్స్ అను పుస్తకములో అటువంటి పిల్లల ప్రవృత్తి చాలా అపాయకరమైనదని నొక్కి తెలిపారు. మనస్తత్వ శాస్త్రవేత్తలు, మానసిక నిపుణులు అనేకమంది ఇచ్చిన సాక్ష్యము, అటువంటి పిల్లల చరిత్రలు, మాగిడ్ అభిప్రాయాన్ని చాలా ఎక్కువగా బలపరస్తున్నవి: శిశువు పుట్టినప్పటినుండి ఆ తర్వాత పెరిగే సంవత్సరాలలో తలిదండ్రులకు పిల్లలకు మధ్య ఉండవలసిన బంధం లోపించడమే దీనికి అసలైన కారణము.
గనుక ఆలస్యం కాకమునుపే ఆ పెరిగే సంవత్సరాలలో కుటుంబమంతా సన్నిహితులు కావాలి! (g91 9/22)