ఊపిరితిత్తులు—ఒక అద్భుత నిర్మాణం
కొన్ని వారాలవరకు ఆహారం లేకుండ నీవు జీవించగలవు. కొన్ని రోజులు నీళ్లు త్రాగకుండ నీవు జీవించగలవు. అయితే నీవు ఊపిరి బిగబట్టుకుంటే కొద్ది సెకండ్లలోనే విపరీతమైన అసౌకర్యం కలుగుతుంది. ఇక నాలుగు నిమిషాలపాటు ప్రాణవాయువు లభించకపోతే మెదడు పాడై మరణానికి దారితీస్తుంది. అవును, ప్రాణవాయువు మానవ శరీరానికి ముఖ్యావసరం.
నీవు పీల్చేగాలి యొక్క గుణం బహుశా నీ స్వాధీనమందుండక పోవచ్చును. అయిననూ నీకు గాలి అవసరమే, అది నీకు ఇప్పుడే అవసరం! గాలి అతిచల్లగా లేక అతివేడిగా లేక అతిపొడిగా లేక ఎంతో చెడిపోయి వుంటే నీవెలా జీవించగలవు? అటువంటి గాలినుండి ప్రాణాన్ని కాపాడే ప్రాణ వాయువునెలా పొందగలవు మరియు ప్రాణవాయువు ఎలా నీ శరీరములోని ప్రతి భాగానికి చేరుతుంది? ఓ గ్యాస్ అయిన బొగ్గు పులుసువాయువు నెలా నీ శరీరమునుండి బయటికి తీసివేయగలవు? అద్భుతంగా నిర్మించబడిన నీ ఊపిరితిత్తుల వల్లనే ఇదంతా సవ్యంగా జరుగుతుంది.
ఓ క్షణం ఊపిరితిత్తులను చూద్దాం
నీ ఊపిరి తిత్తులు రెండు ముఖ్యమైన శ్వాసనిశ్వాసల అవయవాలు. నీ ప్రక్కటెముకల మధ్యలో భద్రంగా వుంచబడి, అవి గుండెకు ఇరువైపులా వుండును. నీ కుడివైపు ఊపిరితిత్తికి మూడు భాగాలు లేక తమ్మెలున్నవి, నీ ఎడమవైపు ఊపిరితిత్తికి రెండు తమ్మెలున్నవి. ప్రతి తమ్మె ఇతర తమ్మెలకంటె కొంచెం ప్రత్యేకంగా వుంటుంది. ఈ కారణం చేతనే శస్త్రచికిత్స వైద్యులు ప్రయోజనకరమైన ఇతర తమ్మెల జోలికి పోకుండా, రోగగ్రస్తమైన తమ్మెనే తొలగించ గలుగుచున్నారు. మొదటిసారి చూస్తే ఊపిరితిత్తియొక్క ధాతు నిర్మాణం ఒక స్పాంజి వంటిదా అన్నట్లు కనబడవచ్చును.
ఊపిరితిత్తులు ఉదరవితానమువైపు క్రిందివరకు వుండును, ఈ ఉదరవితానము అనబడేది రొమ్ము యొక్క గుల్లప్రాంతమును జీర్ణకోశము యొక్క గుల్ల ప్రాంతాన్ని వేరు చేసే బలమైన కండర భాగమే. ఉదరవితానము శ్వాసనిశ్వాసల యొక్క అతి ప్రాముఖ్యమైన కండరము, ఇది ఊపిరి తిత్తులు నిరంతరము గాలి పీల్చుటకు సహాయపడుతుంది. నీ ఊపిరితిత్తులు ఆ ఉదరవితానమునుండి నీ మెడ అడుగు భాగం వరకు సాగి ఉండును. ప్రతి ఊపిరితిత్తి చుట్టు పల్చని పొర ఉంటుంది. ఈ పల్చని పొర లేక చర్మభాగం గుండె ఆవరణ యొక్క లోపలి భాగాన్ని కూడ చుట్టుకొని వుంటుంది. ఈ చర్మభాగపు పల్చని పొరల మధ్యనున్న ఖాళీస్థలం కందెనవంటి జిగురు ద్రవపదార్థముతో నిండి వుంటుంది. ఈ ద్రవ పదార్థము, ఊపిరితిత్తులు మరియు ప్రక్కటెముకలు శ్వాసనిశ్వాసలప్పుడు ఒకదానితో నొకటి రాచుకోకుండా సులభంగా కదులునట్లు చేస్తుంది.
ఇప్పుడు విజ్ఞానశాస్త్రజ్ఞులు ఊపిరితిత్తులలో షుమారు 25 నుండి 30 వరకు వివిధరకములైన కణజాలములను కనిపెట్టియున్నారు. వివిధ కండరాలు, నరములు, ఎముకలు మరియు తరుణాస్థి, రక్తనాళములు, ద్రవములు, హార్మోనులు మరియు రసాయనాలు అన్నియు కలిసి ఊపిరితిత్తులు పనిచేయుటకు ప్రముఖ పాత్ర వహిస్తున్నవి. ఊపిరితిత్తులకు సంబంధించిన కొన్ని విషయాలు విజ్ఞానశాస్త్రజ్ఞులకు ఇంకా పూర్తిగా అర్థం కాకపోయినప్పటికిని, అర్థమైన అనేకమైన వాటిలో కొన్నింటితో మనకు మనం పరిచయం చేసుకుందాం.
శ్వాసవాహికల వృక్షం
నీ శ్వాసనిశ్వాసల నాళము, అంతర్గతముగా అనుసంధానము చేయబడిన గాలి పయనించు గొట్టములను మరియు మార్గములను కలిగియున్నది. గాలి ఊపిరితిత్తులకు చేరే ముందు అది చాలా దూరం ప్రయాణం చేయవలసివుంది. మొదట గాలి నీ నాసికారంధ్రము లేక నోటిద్వారా స్వరపేటికను లేక గొంతును చేరుతుంది. స్వరపేటిక ఆహారం మింగుటకును ఉచ్ఛ్వాసనిశ్వాసలకును రెండింటికిని వుపయోగపడుతుంది. ఆహారం, నీరు, గాలి పయనించే మార్గములలోనికి ప్రవేశించకుండ ఆపుటకుగాను, నీవు మ్రింగునపుడు కంఠమూలము అనే ఒక చిన్న కదిలే మూత అడ్డుపడుతుంది.
అప్పుడు గాలి, నీ నాద తంత్రులున్న స్థలం అంటే స్వరపేటిక గుండా ప్రయాణం చేయును. తర్వాత వుండేది దాదాపు 11.5 సెంటిమీటర్లు పొడవున్న వాయునాళం లేక గాలిగొట్టం, ఇది దాని నిలువునా సి-ఆకారపు షుమారు 20 దాకా వున్న తరుణాస్థి పట్టీలతో బలపరచబడి వుంటుంది. ఈ గాలిగొట్టం మరల 2.5 సెంటిమీటర్ల పొడవున్న రెండు గొట్టములుగా శాఖలై వుంటుంది. ఇవే ప్రధాన శ్వాసనాళములని పిలువబడుచున్నవి. ఒక నాళము ఎడమ ఊపిరితిత్తిలోనికి, రెండవది కుడి ఊపిరితిత్తులోనికి ప్రవేశించి వుండును. ఊపిరితిత్తుల లోపలి భాగాన ఈ నాళములు ఇంకా ఉపశాఖలుగా విభాగించబడును.
ఊపిరితిత్తుల లోపలి భాగం, కాండము, కొమ్మలు మరియు ఆకులున్న ఓ వృక్షాన్ని పోలిన ఆకారం తయారయ్యేంతవరకు ఈ శాఖోపశాఖలు మాటిమాటికి తయారగుచునే వుండును. అయితే ప్రతి కొమ్మ దగ్గర శ్వాసవాహికలు సన్నవిగా అయిపోవును. తదుపరి, గాలి ఈ చిన్న కొమ్మలలోనికి, ప్రతిదీ, షుమారు 1 మిల్లీ మీటరు వ్యాసమున్న అతిచిన్న శ్వాసనాళముల యొక్క వలాకారములో నున్న అల్లికలోనికి ప్రవేశించును. ఈ శ్వాసనాళములు ఇంకా చిన్న గ్రంధులుగా విడిపోయి, కుహరం అని పిలువబడే షుమారు 300 మిలియన్ల చిన్న గాలి కోశములలోనికి గాలిని పంపును. ఈ గాలి కోశములు గెలలవలె ఏర్పరచబడి వ్రేలాడదీయబడిన ద్రాక్షా గుత్తులుగా లేక చిన్న గాలి బుడగలవలె కనబడును. ఇక్కడే వృక్షంవంటి శ్వాసవాహికల చివరి భాగాలు ఆగిపోవును మరియు గాలి తన గమ్యం చేరుతుంది.
చివరి గడప
అది చివరి గడప చేరగానే నీవు పీల్చేగాలి కుహరం యొక్క అతిపల్చని గోడలలోనేవుండి పోతుంది. అవి అడ్డంగా కొలిస్తే 0.5 మైక్రోన్ మాత్రమే. ఈ పత్రికలో వుపయోగించే కాగితం, ఆ కుహరపు గోడల మందంకంటె షుమారు 150 రెట్లు మందంగా వున్నది.
ఈ చిన్న కుహరం యొక్క ప్రతి భాగం, ధమనుల కేశనాళములని పిలువబడు రక్తనాళముల అల్లికతో కప్పబడి వుంటుంది. ఈ కేశనాళములెంత ఇరుకుగా వుండుననగా ఒకసారి ఒక రక్తకణమే అందులో ప్రవేశించి దాటిపోగలదు. వాటి గోడలు ఎంత పల్చగా వుండునంటే రక్తంలోని బొగ్గుపులుసు వాయువు, కుహరంలోనికి నెమ్మదిగా స్రవించగలదు. అయితే ప్రాణవాయువు దానికి వ్యతిరేక మార్గంగుండా పయనించును. అది ఎర్రనిరక్త కణములను నింపుటకు కుహరాన్ని విడిచిపోతుంది.
ఈ ఎర్రని రక్తకణములలోని ప్రతిదీ, లేక జీవకణములు ఒకే ధారగా పయనించి ధమన కేశనాళములలో కేవలం సెకండులో మూడోవంతు సమయం మాత్రముండును. బొగ్గుపులుసు వాయువు, ప్రాణవాయువులు వాటివాటి స్థానములను మార్చుకొనుటకు ఇది చాలినంత సమయం. పరివ్యాప్త ప్రసరణ అని పిలువబడే పద్ధతి ద్వారా వాయువుల ఈ కదలిక జరుగుతుంది. ప్రాణవాయువుతో నిండిన రక్తం పిదప ఊపిరితిత్తులలోని పెద్ద సిరలలోనికి ప్రవహించి, తుదకు గుండె ఎడమ భాగమునకు చేరును, అక్కడనుండియే రక్తం, ప్రాణ పోషణగా శరీరమంతటికి ప్రవహిస్తుంది. పైవివరణ అంతా అనగా, నీ శరీరములో వున్న రక్తమంతా ఈ సంక్లిష్టమైన నిర్మాణక్రమముగుండా ప్రసరించుటకు షుమారు ఒక నిమిషమే పట్టును!
ఇపుడు గాలి తన గమ్యం చేరి, మరి బొగ్గుపులుసు వాయువును ఊపిరితిత్తులనుండి ఎలా బయటికి పంపిస్తుంది? శ్వాస విడుచుటకు శ్వాసవాహికలలో రెండవ జత యొక్క అవసరముంటుందా? నిర్మాణంలో అద్భుతమైన, నీ ఊపిరితిత్తులలోని గాలి గ్రంథులతో నిండిన ఈ “వృక్షము” లోపలికి వచ్చే గాలికి బయటికి వెళ్లే గాలికిని రెండింటింకీ వుపయోగపడుతుంది. ఆసక్తి కలిగించే విషయమేమనగా, శ్వాస విడుచుట ద్వారా నీవు నీ ఊపిరి తిత్తులలోని బొగ్గుపులుసు వాయువును బయటికి పంపిస్తూనే, నీవు నీ నాదతంత్రులను కదలించగలవు, ఆలాగున మాటలకవసరమైన శబ్దాన్ని సృష్టించగలవు.
నాణ్యతా నియంత్రణ
నీవు పీల్చే గాలి నీ ముక్కు మరియు నోటిగుండా వెళ్లేటప్పుడు అది ఒక నాణ్యతానియంత్రణ స్థానంవలన క్రమబద్ధం చేయబడుతుంది. గాలి అతి శీతలంగా వుంటే తగినంత ఉష్ణం వచ్చునట్లు త్వరగా వేడెక్కుతుంది. గాలి అతి వేడిగా వుంటే అది చల్లగా అవుతుంది. గాలి ఎక్కువ పొడిగా వుంటే ఎలామరి? నీ ముక్కు, నాసికారంధ్ర కోటరములు, గొంతుక ఇతరమార్గముల గోడలు శ్లేష్మము అనే జిగురుపదార్థముతో అంటుకొని వుండును. నీవు పొడిగాలిని పీల్చినపుడు శ్లేషములోని తడి, గాలిలోనికి ఆవిరైపోతుంది. గాలి, దూరంలోనున్న ఊపిరితిత్తులలోనికి చేరే లోగా దానిలో షుమారు 100 శాతం తేమ వుంటుంది. ఆసక్తికరమైన విషయమేమంటే, నీవుగాలిని వదలినపుడు గాలి తనలోని సగం తేమను మరల శ్లేషంలోనికి వదులుతుంది.
ఈ నాణ్యతా నియంత్రణ పద్ధతిలో ఓ చిక్కయిన గాలి జల్లెడ కూడా ఇమిడివుంది. ఒక రోజుకు 9,500 లీటర్ల గాలి ఊపిరితిత్తుల ద్వారా వెళ్తుంది. గాలి తరచూ అంటురోగ క్రిములు, విషపూరిత రేణువులు, హానికరమగు ఆవిరితోను, లేక ఇతర మలినములతో నిండివుంటుంది. అయిననూ ఈ కలుషిత పదార్థములను తీసివేయురీతిగానే శ్వాసనిశ్వాసల పద్ధతి నిర్మించబడింది.
తొలుత, నీ ముక్కులోనున్న రోమములు, శ్లేష్మము మురికిలోని పెద్దపెద్ద రేణువులను పట్టుకొనుటలో వాటి వంతును అవి చేయును. మరి నీ శ్వాసనాళికల గోడ అంచుల మీద లక్షలాదిగా సూక్ష్మ దర్శినితో చూడగలిగే రోమమువలె పొడుచుకొని పైకి వచ్చేటటువంటివి నీకున్నవి. అవి ప్రకంపనావయములు అని పిలువబడుచున్నవి. వాలు తెడ్డువలె అవి ఒక నిమిషానికి 16 సార్లు వెనక్కి ముందుకు ఊగుతూ ఊపిరితిత్తులనుండి మురికితో కూడిన శ్లేష్మమును బయటికి నెట్టివేయును. సూక్ష్మక్రిములను చంపి, అపాయకరమైన పదార్థములను పట్టుకొనుటకు నిర్మించబడిన రోగనివారణ కుహరములు అనబడే ప్రత్యేక కణముల సహాయములను కూడ నీ ఊపిరితిత్తులు కలిగియున్నవి.
గనుక నీవు పీల్చే గాలి నీ ఊపిరితిత్తుల యొక్క అతి సున్నితమైన ధాతువులను చేరకముందు అది ఒక మంచి పరిస్థితికి తేబడి వడగట్ట బడుతుంది. నిజంగా అది ఒక అద్భుత నిర్మాణము.
ఒక స్వయంచాలక పద్ధతి
ఆహారం నీళ్లవలె కాకుండా, నీవు ఎటువంటి ప్రయత్నం చేయకుండానే వాతావరణము నుండి ప్రాణవాయువును పొంద వచ్చును. నిముషానికి షుమారు 14 మారులు శ్వాసిస్తూ ఆరోగ్యవంతంగా ఉన్న ఊపిరితిత్తులు వాటంతటవే గాలినుండి ప్రాణవాయువును తీసికొనును. నీవు నిద్రిస్తున్నపుడు కూడా నీ ప్రమేయంలేకుండానే నీ ఊపిరితిత్తులు పనిచేస్తూనేవుండును.
ఈ అనైచ్ఛికపద్ధతికి తాత్కాలికంగా స్వస్తిచెప్పే అవకాశం కూడవున్నది. గనుక నీవు కావాలనుకుంటే కొంతవరకు శ్వాసనిశ్వాసలను బుద్ధిపూర్వకంగా అదుపులో పెట్టవచ్చును. నీళ్లలో నీవు ఈదునపుడు ఈ శ్వాసనిశ్వాసలు యాంత్రికంగా పనిచేయాలని నీవు కోరుకుంటావా? నిమిషానికి 14 శ్వాసల చొప్పున పీల్చుతూ నీవు నీ శ్వాసనిశ్వాసలను స్వాధీనమందుంచు కొనలేకపోతే అగ్నికి ఆహుతియై పొగలతో నిండినగది నుండి తప్పించుకొనుటకు నీకు సమయం సరిపోతుందా? నిజమే, ఈ అనైచ్ఛిక పద్ధతి దీర్ఘకాలం కొనసాగదనుకోండి. కనీసం కొన్ని నిమిషాల తర్వాత నీ ఊపిరితిత్తులు తప్పనిసరిగా యథావిధిగా పనిచేయనారంభించును.
మరైతే ఈ అనైచ్ఛిక చర్యకాలంలో నీ ఊపిరితిత్తులు శ్వాసనిశ్వాసలు చేయుటకు దాని కండరాలను ఉత్తేజపరచున దేమిటి? మెదడు మొదలు భాగంనందు నియంత్రణా కేంద్రమున్నది. ఇక్కడున్న ప్రత్యేక గ్రహణశక్తులు, శరీరంలో బొగ్గుపులుసు వాయువు ఎంతమేరకు వున్నదో తెలియ జేస్తూవుండును. బొగ్గుపులుసు వాయువు అధికంగా వున్నట్లయితే, నాడీ మండల వ్యవస్థ ద్వారా సంకేతములు పంపును అవి మరల శ్వాసనిశ్వాసలకు సంబంధించిన కండరాలను ఉత్తేజపరచును.
ఇది నీ శ్వాసనిశ్వాసల వ్యవస్థకు చక్కని బహుముఖ ప్రతిభనిస్తుంది. నీ క్రియలో అనుకోని మార్పులేవైనా జరిగితే సర్దుకొని వాటికి తగినట్లు నీ ఊపిరితిత్తులు పనిచేయగలవు. ఉదాహరణకు, కఠినమైన వ్యాయామ సమయంలో నీ శరీరం విశ్రాంతి తీసుకునే సమయములోకన్నా 25 సార్లు ఎక్కువ ప్రాణవాయువును తీసుకోవచ్చును, 25 సార్లు ఎక్కువ బొగ్గుపులుసు వాయువును వదలవచ్చును. అయిననూ, ఆ సమయంలో ఎడతెరపి లేకుండ మారుతూవున్న ప్రాణవాయువు అవసరతలకు తగినట్లు ఎంత వేగంగా ఎంత తరచుగా నీవు శ్వాసనిశ్వాసలను చేయవలెనో అందుకు తగినట్లు తక్షణమే నీ ఊపిరితిత్తులు సరిదిద్దుకోగలవు.
ఊపిరితిత్తులు సరిగ్గా పని చేయగలుగుటకు దోహదపడే ఇతర అధునాతన కేంద్రాలున్నవి. ఉదాహరణకు శ్వాసనిశ్వాసలకు ఉపయోగపడే కండరాలు మ్రింగుటకు, మాట్లాడుటకు కూడ వుపయోగపడుచున్నవి. ఈ పనులు సమతుల్యంగా ఉన్నవి అలా అవి నీ శ్వాసనిశ్వాసలతో జోక్యం చేసికొనవు. ఇదంతా నీ ప్రయత్నములేకుండానే జరుగుతుంది. అవును, అంతా అనైచ్ఛికంగానే!
నిజమే, ఊపిరితిత్తుల విషయంలో ముఖ్యంగా నీలో రోగ నిరోధకశక్తి క్షీణించినపుడు, అనేక రుగ్మతలు రావచ్చును. కొన్ని రుగ్మతలు, ఉదాహరణకు చెప్పవలెనంటే ఉబ్బసం, రొమ్ముపడిశము, వాయుగోళమువాపు, శ్వాసకోశ క్యాన్స్‌ర్, శ్వాసకోశ రక్తహీనరోగం, ప్రక్కటెముకలనొప్పి, నిమోనియా, క్షయరోగం మరియు అనేకములైన సూక్ష్మక్రిముల, అంటువ్యాధి, చర్మరోగసంబంధమైన అంటురోగములే.
అయితే ఈ రోగాలు ఊపిరితిత్తులు సరిగ్గా నిర్మించబడనందువలన లేక తప్పుగా నిర్మించబడినందున కలిగినవికావు. మానవుడు వాతావరణములోనికి విడిచిన ఆవిరి, ధూళి, కలుషిత పదార్థముల మూలంగా ఈ ఊపిరితిత్తులలో అనేక రోగాలు వస్తున్నవి. లక్షలాది మంది ఈనాడు పొగత్రాగుటవలన మరియు శ్వాసనిశ్వాసలను స్వయంగా హానికల్గించే వాటి మూలంగా చాలమంది శ్వాసకోశ క్యాన్సర్, రొమ్ము పడిశము, వాయుగోళవాపు మొదలగు రోగాలకు గురవుతున్నారు.
సాధారణ పరిస్థితులలోనైతే నీ ఊపిరితిత్తులు అద్భుత నిర్మాణానికి తార్కాణమై, మహాగొప్ప నిర్మాణకుడైన యెహోవా దేవుని సజీవ జ్ఞాపక చిహ్నముగా వున్నవి! కీర్తనల రచయిత తెల్పినట్లు మనం నిశ్చయంగా, ‘భయము ఆశ్చర్యము కల్గించు రీతిలో నిర్మించబడితిమి.’—కీర్తన 139:14. (g91 6/8)
[19వ పేజీలోని బాక్సు]
అలా ఎందుకు జరుగుతుంది?
తుమ్ము: నోటినుండి ముక్కులోనుండి దానంతటదే బలంగా వేగంగా బయటికి వచ్చేగాలి. నీ ముక్కులో దురదపెట్టే ధూళిని తీసివేయుటకే ముక్కులోని నాడీమండల చివరిబాగాలు నీవు తుమ్మునట్లు చేయును. ఒక తుమ్ము గంటకు 166 కిలోమీటర్ల వేగంతో గాలిని వదులుతుంది, మరియు 1,00,000 శ్లేష్మపు తుప్పర్లను, సూక్ష్మజీవులను విసర్జిస్తుంది. ఈ కారణము చేత, తుమ్మునప్పుడు నీ నోటిని, ముక్కును సరిగ్గా మూసుకొనకపోతే ఇతరులకు అది హాని కల్గించవచ్చును.
దగ్గు: శ్వాసనిశ్వాసల వాహికయొక్క పల్చని పొరవంటి భాగంలో దురద లేచినప్పుడు ఊపిరితిత్తులలోని మలినమును నెట్టివేయుటకు మధ్యలో వచ్చే గాలి వత్తిడే ఇది. శ్వాసనాళమును లేదా గొంతును శుభ్రపరచుటకు చేసే బుద్ధిపూర్వక ప్రయత్నమే ఈ దగ్గు ఉద్దేశమై యుండవచ్చు కూడా. తుమ్ములవలె దగ్గు, రోగ వ్యాప్తిచెందించే క్రిములను వ్యాపింప జేయగలదు.
వెక్కిళ్లు: ఉదరవితానము ఆగి ఆగి ముడుచుకుపోవుట మూలంగా అకస్మాత్తుగా అనుకోకుండా లోపలికి పీల్చుకునే గాలివల్లనే వెక్కిళ్లు వస్తాయి. ఉదరవితానమునకు సమీపంగా వున్న అవయవాలలో దురద కలుగుటవలన అనుకోని విధంగా ఈ ముడుచుకొనుట సంభవించవచ్చును. ఆయాసం అనేది స్వరపేటిక ద్వారా గాలిని ఊపిరితిత్తులలోనికి పీల్చుతుంది. గాలి స్వరపేటికను చేరుతూవుండగా, అది ఘటికను తాకుతుంది, అందుమూలంగా స్వరతంత్రులు అటుఇటు కదులును. ఇదే వెక్కిళ్ల శబ్దాన్ని పుట్టిస్తుంది.
గురక: నిద్ర సమయంలో ఒక వ్యక్తి సాధారణంగా నోటిద్వారా గాలిపీల్చుకుంటూ వున్నందువలన వచ్చే శబ్దమే ఇది. గొంతుకు దగ్గరి భాగంలో వున్న నోటిలోని సున్నిత ధాతువు గాలివెళ్లేటప్పుడు అటుఇటు కదలాడుతూ వుంటుంది. పెదవులు చెక్కిళ్లు, నాసికారంధ్రములు కూడ కదలవచ్చును. నీవు బోర్లాపడుకుంటే నీ నోరులోపలి భాగం తెరచుకుంటుంది గనుక నాలుక గాలిని రాకుండ అడ్డుకుంటుంది. ఓ ప్రక్కగా తిరిగి పడుకుంటే ఈ గురక ఆగిపోవచ్చును.
ఆవులింత: ఊపిరితిత్తులలోని బొగ్గుపులుసు వాయువు నిండిన కారణంగా దాని పిలుపుకు స్పందించుటకై అనాలోచనగా గట్టిగా పీల్చే గాలియని విశ్వసించబడుతుంది. మరొకరు ఆవులించగా నీవుచూచి లేక వినినప్పుడు నీవు ఆవులించుటకు ప్రేరేపించబడతావు, గనుక ఆవలింపు సాంఘిక అంటురోగంవంటి అలవాటుగా పరిగణించబడుతుంది. ఈ ప్రక్రియను విజ్ఞానశాస్త్రవేత్తలు వివరించలేకపోతున్నారు.
[20వ పేజీలోని చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
సప్తపధ
వాయునాళం
ముఖ్యశ్వాసనాళము
కుడి ఊపిరితిత్తి
నాసికా నాడీవ్రణములు
ఘటిక
స్వరపేటిక
స్వరతంత్రులు
ఎడమ ఊపిరితిత్తి
ఊపిరితిత్తుల వివరణ
శ్వాసకోశ రక్తనాళికలు
కుహరము.