మానవ పాలనను తూకం వేస్తే
భాగం 5: అపరిమిత అధికారం ఆశీర్వాదమా, లేక శాపగ్రస్థమా?
నిరంకుశపాలన: అంతులేని అధికారంతో ఒకే వ్యక్తి పాలించే ప్రభుత్వము; అధికారతత్వం: పరిపాలించబడేవారి సమ్మతిలేకుండ పాలనాధికారాన్ని వినియోగించుట, ఇది గుత్తాధిపత్యము కంటె తక్కువ కఠినమైనది; నియంతృత్వపాలన: ఏ అధికార సభ క్రిందికి రాకుండ లేక చట్టం పరిధిలోనికి రాకుండ సర్వాధిపత్యం కల్గివున్న పరిపాలకుడు పాలించే ప్రభుత్వం; గుత్తాధిపత్యం: పౌరులను ప్రభుత్వ అధికారం క్రిందికి దాదాపు పూర్తిగా లొంగదీసుకునే నిరంకుశత్వముతో కూడిన సభ యొక్క కేంద్రీకృత పాలనాధికారం.
అధికారతత్వ ప్రభుత్వాలు, అధికారంలో పొడవుగాను, వ్యక్తిగత స్వాతంత్ర్యంలో పొట్టిగావుంటూ “క్రూరమైన” “కఠినమైన” “నిరంకుశ” అనే విశేషణములను వెంటనే జ్ఞాపకమునకు తెస్తున్నవి. అధిక జాతీయ దృక్పధం కల్గి ప్రభుత్వంలోని ప్రతి శాఖను వాటి ఆధీనమందుంచుకునే పరిపాలనలే, అవి వాటి పౌరులనందరిని జాగ్రత్తగా గమనిస్తూనే జాతి అభిరుచులను వృద్ధిచేయని, ఎటువంటి హాని కల్గించని కార్యకలాపములనైననూ నిషేధించును. నివేదించుటకు మానవ చరిత్రలో అధికారతత్వ ప్రభుత్వాలకేమి కొదవలేదని చెప్పుట విచారకరమే.
స్థానములో తేడాయే
ది వర్ల్డ్ బుక్ ఎన్సైక్లోపిడియా ఇలా చెబుతుంది: “జార్స్ (చక్రవర్తుల) క్రిందికివచ్చిన రష్యా ప్రభుత్వము పూర్తి నిరంకుశాధికారమువలె అయ్యింది.” గానీ అధికారతత్వ పరిపాలన అంతా సర్వాధిపత్యం కాదు; అంతా స్థానంలో తేడాయే. మరి అధికారతత్వ ప్రభుత్వాలన్నీ నిరంకుశాధికారములు కావు, అంటే ఒక పరిపాలకుడు, ఒక నియంత, ఒక జార్ పాలించే ప్రభుత్వాలు కావు. కొన్ని ఒక గుంపు చేత బహుశా సైన్యాధికారం లేక కులీన వర్గం లేక ధనికవర్గంచే పాలించబడవచ్చును.
ప్రజాస్వామ్యములు సహితం అధికారతత్వపాలన కావచ్చును. వాటికి రాజకీయ పార్టీలుండవచ్చును, ఎన్నికలు జరుగవచ్చును, న్యాయస్థానాలను నడుపవచ్చును మరియు పార్లమెంటు లేక శాసన సభలున్నాయని గర్వంగా చెప్పవచ్చును. అయిననూ, ఈ వివిధ సంస్థలను ప్రభుత్వం ఆధీనమందుంచుకొని ఎంత బలవంతముగా వాటి మీద తన ఆజమాయిషీని కలిగి వుంటుందో, దాని నిర్మాణమెలా వున్ననూ, అది అంత బలవంతంగా అధికారతత్వపాలన క్రిందికే వస్తుంది. అదేదో తెలివిగా తయారుచేయబడినది కాదు. యుద్ధసమయములో లేక దేశమెదుర్కొను క్లిష్టపరిస్థితులలో ప్రభుత్వానికి విశేషాధికారములు అనుమతించవలసిన అత్యవసర పరిస్థితి ఏర్పడవచ్చును. బహుశా అత్యవసర పరిస్థితి తగ్గిపోవచ్చును: అయితే అత్యవసర విశేషాధికారములు పోలేదు.
ఏకఛత్రాధిపత్యములు వివిధస్థానములలో వున్న అధికారతత్వ ప్రభుత్వాలే. అయితే సర్వాధిపత్యముగల ఏకఛత్రాధిపత్యముల స్థానంలో ఎక్కువ భాగం స్వల్పాధిపత్యమున్న ఏకఛత్రాధిపత్యములు వచ్చినవి. శాసన సభలు, బహుశా లిఖితపూర్వక రాజ్యాంగ చట్టాలు, అటువంటి ఏకఛత్రాధిపత్యములు చెలాయించే అధికారాన్ని పరిమితం చేసి, వాటి అధికారతత్వపాలనా సామర్థ్యమును తగ్గిస్తున్నవి. ఆవిధంగా, ఈనాటి స్వల్పాధిపత్యమున్న ఏకఛత్రాధిపత్యములలో అనుభవించే వ్యక్తి స్వాతంత్ర్యము గతంలో వున్న సర్వాధిపత్యముగల ఏకఛత్రాధిపత్యములలో వున్న స్వతంత్రంకంటె ఎంతో ఎక్కువగా వున్నది.
సర్వాధిపత్యమున్న ఏకఛత్రాధిపత్యములు విస్తారంగా వున్న కాలములలో కూడా వాటి అధికారం పరిమితమైవుండెను. చరిత్ర ప్రొఫెసరైన ఓరెస్ట్ రేనం వివరించునదేమనగా “అత్యధిక మంది రాజులకు వారి ప్రజలమీద పూర్తి ఆధిపత్యం చెలాయించే దక్షత, అసలు శక్తి ఈ రెండూ కొదువైయుండెను. లేదా ఓ హిట్లర్ లేక ఓ ముస్సోలినీ లేక ఓ స్టాలిన్ వలె ఒక జాతి సంస్కృతికి అతితక్కువ సంఖ్యప్రజలను పూర్తిగా తుడిచివేసే శక్తి లేకుండెను.” స్పష్టమైన విషయమేమంటే, రాజు యొక్క ఉన్నతనైతిక విలువలు శ్రేష్టమైన గుణగణాలు—లేదా ఇవి లేకుండా పోవుట—అసలు తీర్మానాత్మకములు. ఏమైనప్పటికీ, రేనం ఇలా చెబుతున్నాడు: “ఏ సర్వాధిపత్యమున్న ఏకఛత్రాధిపత్యము కూడా దాని సాంస్కృతిక, ఆర్థికపరమైన కేంద్రీకరణ విషయంలో ఆధునిక గుత్తాధిపత్య పాలనకు సమముకాలేదు.
పూర్ణ అధికారమును ఆశించుట
ఇటలీ, సోవియట్ యూనియన్, మరియు జర్మనీలలో 1920 మరియు 1930 దశాబ్దములలో ప్రపంచంలోనికి ఓ క్రొత్తరకమైన అధికారతత్వ ప్రభుత్వం పుట్టుకొచ్చింది, దాన్ని సరిగా వర్ణించడానికి ఓ క్రొత్తపదాన్ని వాడవలసిన అగత్యత ఏర్పడింది. ఈ దేశాలలో వార్తా సంస్థ ప్రభుత్వ ఆధీనము క్రిందికి వచ్చింది. పోలీస్వారు పాలనా పక్ష రాజకీయ పార్టీ సేవకులయ్యారేగాని ఇక ప్రజల సేవకులు కాలేదు. వ్యతిరేకపక్షము నెదిరించుటకు ప్రచారం, సెన్సార్షిప్, సైన్యము, రహస్య పోలీస్ కాపుదల, మరియు సాయుధ అధికారములను సహితం ఉపయోగించినవి. ప్రభుత్వం యొక్క అధికార రాజకీయ సాంఘిక తత్వమును తమ స్వంత తత్వముగా అలవర్చుకోవాలని పౌరులను నిర్బంధంచేసినవి. తిరస్కరించిన వారిని దేశద్రోహులుగా పరిగణించినవి. గుత్తాధిపత్యం అనే పదం యుక్తంగానే కనబడింది—తన స్వంత ఉద్దేశాలను వెంబడించే ప్రభుత్వం, దాని పౌరులందరినీ పూర్తిగా తన ఆధీనమందుంచుకున్న పాలన.
ఇన్ఫర్మేషనెన్ జుర్ పోలిటిషెన్ బిల్లింగ్ (రాజకీయ విద్యావిషయం) అనే జర్మన్ పత్రిక ఇలా వివరిస్తుంది: “అధికారతత్వపాలనాతో పోల్చితే, సంపూర్ణ నియంత్రణను ఆశించే ప్రభుత్వము, అధికారమునకు సంబంధించిన అధికార స్థానములను తీసికొనుటలో మాత్రమే సంతృప్తిపడదు. పౌరులకు పరిమిత స్వేచ్ఛను అనుమతించుటకది అయిష్టంగా వుంటుంది గానీ అన్నివేళల వారు దానికి సిద్ధాంతపరమైన మద్దతును రాజభక్తిని బలవంతంగా కోరుతుంది. ఇలా హద్దులేకుండా బలవంతముగా అడుగుటవల్లనే గుత్తాధిపత్య ప్రభుత్వం కుటుంబం, మతం మరియు తీరిక సమయం వంటి ప్రభుత్వమునకు సంబంధించని సాధారణ విషయాల్లో దాని ప్రభావమును చూపించవలసివస్తుంది. ఇటువంటి వాటిని బలవంతముగా చేయించుకొనుట కొరకు గుత్తాధిపత్య ప్రభుత్వం అన్నివేళలా వ్యక్తులను నిశితంగా పరిశీలించే సామర్థ్యంగల సంస్థను ఏర్పాటు చేయవలసివస్తుంది.”
నిజమే, రాష్ట్రము దాని ఆశయాల దృష్టితో చూస్తే, గుత్తాధిపత్యం అధిక సామర్థ్యం కల్గియున్నది. అయితే దాన్ని కాపాడుకొనుటకు కష్టమేనని విలేఖరి చార్లెన్ క్రౌతామెర్ అంటున్నాడు. అదుపులో పెట్టుటకు నిజంగా చాలా అధికంగావుంది. “స్వల్పకాలానికే నీవు ప్రజలను జైల్లో వేయవచ్చు, కాల్చవచ్చు” అని ఆయన చెపుతున్నాడు, “గానీ కొంచెం సేపు తర్వాత, బుల్లెట్లు, జైళ్లు, శక్తి, నేరస్థులు సహితం తరిగిపోవును . . . శాశ్వత తిరుగుబాటే గుత్తాధిపత్య సిద్ధాంతాన్ని పూర్తి చేయగలదు, మరి శాశ్వత తిరుగుబాటు అసాధ్యమే. నిరంకుశత్వం సహితం నిద్రపోవలసిందే.”
‘సామూహిక సమాజం’ వలన తయారైనదా?
అధికారతత్వపాలన విశేషంగా దాని అత్యంత విస్తారమైన జయప్రదమైన రూపములు అనగా గుత్తాధిపత్యపాలన 20 వ శతాబ్దంలో ఎలా అంత ప్రసిద్ధిచెందినదో వివరించుటకు వివిధ సిద్ధాంతములు వచ్చినవి. ది వర్ల్డ్ బుక్ ఎన్సైక్లోపిడియా ప్రకారం “1900 దశాబ్దపు తొలి రెండుభాగాల సమయం గొప్ప మార్పుల కాలం—చరిత్రయంతటిలోను బహుశా అతివేగంగా, విశాలంగా, జరిగిన మార్పు కాలమైయుండెను.” నిస్సంశయముగా, దీని కారణంగానే అధికారతత్వపాలన వైపు మొగ్గుటకు కారణమైంది.
జనాబా పెరుగుదల, పట్టణప్రవాసం, మరియు సాంకేతిక విజ్ఞాన పురోగతులు, సామూహిక సమాజమని పిలువబడుచున్న దానిని కల్పించుటకు సహాయపడిన ఆధునిక అసాధారణ సంఘటనలు. పెద్ద, కేంద్రీకృత, వర్గపాలనకు మరియు వ్యక్తికి సంబంధించని సంస్థల మూలంగా తయారైన పరిశ్రమల సమాజమును ఈ పదం సూచిస్తుంది. అది లోతులేని తాత్కాలికమైన మానవ సంబంధాలు గల సమాజం. అనేకమంది ప్రజలలో, ఒంటిరియైన వ్యక్తులు తమ మూలము కొరకు నిరంతరం వెదుకుచూ సమాజముతో కలిసి వుండాలనే తపనతో యున్న ఒక సమాజము.
సామూహిక సమాజము ఎంతవరకు గుత్తాధిపత్యము యొక్క అభివృద్ధిని ఆదరించినదనే విషయం వివాదాంశమై యున్నది. జర్మనీలో జన్మించిన రాజకీయ శాస్త్రవేత్త కీ. శే. హన్నా ఆరెన్ట్ ప్రకారం దాని ప్రభావం చాలా వుండెను. ఆమె పుస్తకం ది ఆరిజిన్ ఆఫ్ టోటలిటేరియనిజం తెలుపుచున్నదేమనగా, గుత్తాధిపత్యము వివిధ తరగతులమీద కాదు గానీ ప్రజల సమూహములమీద కట్టబడినది, వారిని “సాధారణ ఆసక్తిమీద ఆధారపడిన ఏదైనా ఒక సంస్థలోగానీ, రాజకీయ పార్టీకానీ, లేదా పురపాలక ప్రభుత్వంలోగానీ వ్యాపార సంస్థలోగానీ లేదా కార్మిక సంఘాలలో గానీ, వారికున్న సంఖ్యనుబట్టి లేదా నిర్లక్ష్యతనుబట్టి గాని చేర్చలేము.”
ఆరెన్ట్ గుత్తాధిపత్యం ఎదుగుటకు సహాయపడిన కొన్ని అంశములను పేర్కొన్నది: సార్వభౌమాధిపత్యం, యాంటి-సెమిటిసమ్ (యూదుల యెడల ద్వేషం) మరియు పారంపర్యంగా వచ్చే స్వదేశి ప్రభుత్వం విచ్ఛిన్నమగుట.
సామ్రాజ్యవాదమా?
ఆ శతాబ్దం ముగియుటకు కొంచెం ముందే, వలస ప్రాంతాలేర్పడటంవల్ల ఇదొక క్రొత్త మలుపు తిరిగింది. బ్రిటిష్ ఆర్థికశాస్త్రవేత్త జాన్ అట్కిన్సన్ హాబ్సన్ 1884 నుండి 1914 మధ్య కాలాన్ని, ఇప్పుడు దేనినైతే నూతన చక్రవర్తి పాలన అని పిలుస్తున్నారో దానిని ఆ కాలం క్రింది పాలనేయని పరిగణించాడు. ఇది వాటి సామ్రాజ్యములను విస్తరింప జేసుకొనే సంకల్పముతో ఏకఛత్రాధిపత్యములు లేక ప్రజా ప్రభుత్వముల ద్వారా వుపయోగించే అధికారతత్వపాలనా అధికారం తప్ప మరేమి కాదు. ఇతర ప్రాంతములను నేరుగా స్వాధీనం చేసుకొనుట వలన లేక వాటి రాజకీయ ఆర్థిక విషయాల్లో అనధికారంగా తలదూర్చుటవలన ఇతర దేశాలను స్వాధీన పరచుకొనుట జరిగేది. హాబ్సన్ సామ్రాజ్యవాదం ప్రాముఖ్యముగా ఆర్థికపరమైనదిగా వివరిస్తున్నాడు. వాస్తవానికి ఈ సరికొత్త వలసరాజ్య విధానంలో తరచు రాజకీయ అధికార ప్రమేయం తక్కువేగానీ స్వదేశి వస్తువుల విషయంలో క్రొత్త మార్కెట్లను సృజించుట, ఆర్థిక వ్యవస్థను విస్తరింపజేయుట అధికంగా వుండెను.
ఆఫ్రికా కొరకు పోరాట వ్యాజ్యం అని పిలువబడిన దాని కంటె మరెక్కడను ఇది అంత అధికంగా కనబడలేదు. అప్పటికే 1880 దశాబ్దంలో బ్రిటన్, ఫ్రాన్స్, మరియు పోర్చుగల్ దేశాలు ఆఫ్రికాలో అనేక వలస ప్రాంతాలు ఏర్పరచుకున్నవి. అయితే బెల్జియం మరియు జర్మనీ అటువైపు శీతకన్ను వేసినప్పుడు రద్దీ ఎక్కువైంది. ఇతియోపియా, లైబీరియా తప్ప ఆఫ్రికా అంతా ఐరోపా పరిపాలన క్రిందకు వచ్చేసింది. నల్లజాతి ఆఫ్రికన్లు వలస స్థావరాలేర్పరచుకున్న తెల్ల “క్రైస్తవులు” వారి భూబాగాన్ని లాగుకొంటూవుంటే చూడవలసి వచ్చింది.
అమెరికా సంయుక్త రాష్ట్రాలు కూడా సామ్రాజ్యవాదిగా తయారైనవి. అది 19వ శతాబ్దపు చివరి భాగంలో అలాస్కా, హవాయి, ఫిలిప్ఫీదీవులను, గామ్, సమోవా మరియు ఇతర పసిఫిక్ ద్వీపములను, ప్యూర్టోరికొ మరియు ఇతర కెరీబియన్ ద్వీపాలను స్వాధీనం చేసుకున్నది. కొలంబియా యూనివర్శిటీలో చరిత్ర ప్రొఫెసర్గా ఉన్న హెన్రీ యఫ్. గ్రాఫ్ చేసిన వ్యాఖ్యానం ప్రాముఖ్యతను సంతరించుకొన్నది, ఆయనిలా వ్రాస్తున్నాడు: “ఆధునిక సార్వభౌమాధిపత్యమును తయారు చేయుటలో క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు పౌరవ్యవహార నిపుణులవలె ప్రభావం కల్గివుండెను.” అయితే క్రైస్తవమతసామ్రాజ్య మిషనరీలు నిజమైన క్రైస్తవులై వున్నట్లయితే, యేసుక్రీస్తు మాటల ప్రకారం వారు ఆఫ్రికా కొరకు ఇతర వలస సామ్రాజ్యాల కొరకు సాగించిన పోరాటం విషయంలో రాజకీయంగా తటస్థంగా వుండేవారు: “నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు.”—యోహాను 17:16; యాకోబు 4:4.
సామ్రాజ్యవాదయుగం 1914 లోనే గతించి పోయిందనుకున్నారు. అయినను దాని అధికారతత్వ స్వభావం విషయంలో మాత్రం అది సత్యంకాదు. ఈ స్వభావాన్ని, 1890 దశాబ్దంలో ఇప్పుడు దక్షిణాఫ్రికాలోని ఓ ప్రాంతానికి ప్రధానమంత్రిగా పనిచేసిన సిసిల్రోడిస్ చక్కగా సంగ్రహించి ఇలా చెప్పాడు: “సమస్తం విస్తరణే.” బ్రిటిష్ సామ్రాజ్యాన్ని విస్తరించుటలో ఓ బలమైన శక్తిగా ఉండిన ఆయన ఒక సారి ఇలా ప్రగల్భం పలికాడు: “నాకు వీలైతే గ్రహాలను చేర్చుకుంటాను.” స్వప్రీతితో కూడిన ఈ స్వభావమే, వీలున్నంతవరకు వాటి స్వప్రయోజనము కొరకు ఇతర దేశాల రాజకీయ, ఆర్థిక సిద్ధాంతాలను స్వాధీనం చేసుకోవాలనే ప్రేరేపణను ఈ రాజ్యాలకు కలిగిస్తుంది. ఉదాహరణకు జపాను, సైన్యం ద్వారా ప్రపంచాన్ని గెలుపొందుటలో విఫలమై ఆర్థికరంగం ద్వారా లోకాన్ని గెలవాలని ప్రయత్నిస్తున్నట్లు కొన్నిసార్లు నిందింపబడుతుంది.
అధికారతత్వ పాలనను కూలద్రోయుటే పరిష్కారమా?
నీతి బాహ్యమైన దురాశపరులగు మానవుల అంతులేని అధికారం శాపమేగానీ ఆశీర్వాదం కాదు. పూర్వమున్న రాజైన సొలొమోను చెప్పిన మాటలు యుక్తమైనవి: “బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లువిడుచుదురు; వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించు వాడెవడును లేకపోయెను.”—ప్రసంగి 4:1.
అధికారతత్వపాలన క్రింద “బాధింపబడువారి కన్నీళ్లు” నిజముగా ఎన్నోవున్నవి. అయిననూ 1987 లో పెరిస్ట్రొయికా అనే తన పుస్తకంలో మిఖాయేల్ గొర్బచేవ్ ఇలా హెచ్చరించాడు: “అణగద్రొక్కుట, బలవంతపెట్టుట, లంచమిచ్చుట, పగులగొట్టుట లేక పేల్చుట సాధ్యమే, గానీ అది కొంత కాలం వరకే.” ఆ ప్రకారం, అధికారం “వారిని బాధపెట్టు వారి పక్షమున” వున్నప్పటికి ప్రజలు అధికారతత్వ ప్రభుత్వము యొక్క సంకెళ్లను విడిపించుకొనుటకు పలుమారులు తిరుగుబాటు చేసి యున్నారు. గత డిశంబరులో రుమేనియాలో నికోలి సెస్క్యూ, అతని సెక్యూరిటేట్ అనే భద్రతాదళాలను రక్తపాతంతో కూలద్రోయుట గమనించదగిన విషయం.
అధికారతత్వపాలనను పడద్రోయుటవలన నిజంగా విడుదల రావచ్చును. అయితే బర్మావారి సామెత చెప్పినట్లు “క్రొత్తపరిపాలకుని ద్వారా మాత్రమే పాతవాని విలువను నీవు గుర్తించెదవు” అనేది కూడ సత్యమే. చెడ్డదాని స్థానంలో అంత కంటె మరీచెడ్డది రాదని ఎవరైన అభయమివ్వ గలరా?
ఒకే ఒక ఉదాహరణ చెప్పాలంటే 1970 వ దశాబ్దంలో నికారాగువలో 43 సంవత్సరముల సుదీర్ఘ లాటిన్ అమెరికా అధికారతత్వ పాలన కూలద్రోయ బడింది. ప్రజానీకం ఇక మంచిరోజులు వస్తాయని నిండైన నిరీక్షణతో వుండెను, మరి వచ్చినవా? ఒక దశాబ్దం తర్వాత అక్కడి పరిస్థితిని గూర్చి ఒక వార్తా పత్రిక వ్యాఖ్యానిస్తూ, నియంతృత్వము క్రింద దుర్బర జీవితం అధికమై “ఇంకేమైనా మిగిలివుంటే అది మరీ చెడ్డదైపోయింది” అని తెల్పింది. ఆకాశమునంటే ద్రవ్యోల్బణమును గూర్చి మాట్లాడుచూ, జాతీయ డబ్బు “దేనికి పనికిరాదని” అంటూ, “ప్రజలకు ప్రయాణసౌకర్యం బొత్తిగా లేదని” తెల్పుచూ, దేశము యొక్క “కళంకముతో కూడిన చాలీచాలని ఆరోగ్యసంరక్షణ”ను గూర్చి వాపోతూ, “ఆహారలోపం మరణాలను పెంచుతుంది” అని గుర్తుచేసింది. ఆ తర్వాత, ఎన్నికలు అనుమతించబడినప్పుడు పాలనా అధికారములు అధికారం కోల్పోయినవి.
మానవ పాలన దాని ప్రతీ ఆకారంలోను కొదువగా ఉన్నట్లు చాలా స్పష్టముగా కనబడుటలేదా? అయిననూ ప్రజలు మంచి ప్రభుత్వం కొరకు వెదకుచునే వున్నారు. ఇది ఏ విధంగా అసంతృప్తికి నడిపించి ఏ “ఆదరణకర్త” లేకుండ దేశాలన్నింటిని నిరాశానిస్పృహలలో పడవేయగలదో రెండు ముఖ్యమైన ఉదాహరణలను గూర్చి మా వచ్చే సంచికలో చర్చిస్తాం. (g90 10/8)
[14వ పేజీలోని చిత్రం]
దాదాపు సంపూర్ణ నిరంకుశ పాలనకు ఒక ఉదాహరణ జార్స్ క్రిందనుండిన రష్యాయే
[క్రెడిట్ లైను]
Alexander II by Krüger, c. 1855