వృధాప్రసంగం—నీకును ఇతరులకును హాని కలుగకుండ తప్పించుకునేదెలా
ప్రజలు ఉన్నంతకాలం వృధాప్రసంగం ఉంటుంది. బైబిలునందు ప్రవచింపబడిన పరిపూర్ణ నూతన లోకం కూడ వృధాప్రసంగం లేకుండా వుండదు.a (2 పేతురు 3:13) సర్వసాధారణంగా, మామూలుగా పరిచయస్థులను గూర్చి మనం మాట్లాడుకోవడం మన పరస్పర సంభాషణలో ఒక భాగమై వున్నది, మరియు మంచి సంబంధములు నెలకొల్పుతూవున్నది.
అయినను, హానికరమైన విషపూరితమైన వృధాప్రసంగానికి లేక కొండెమునకు ఎన్నటికి క్షమాపణ లేదు! ఆ రకమైన సంభాషణ గాయపరచి అంగవైకల్యం కలిగించును; అట్టిది పేరు ప్రతిష్టలను, సంబంధబాంధవ్యాలను, జీవితాలను సహితం నాశనం చేయవచ్చును. గనుక మర్యాద హద్దులు దాటి హానికరమైన వృధాప్రసంగంలోనికి దిగజార కుండా నీవెలా తప్పించుకోగలవు? నీవుదాని నుండి నిన్ను నీవే ఎలా రక్షించుకోగలవు? ఈ వ్యాసము మీద ఇవ్వబడిన కొంత శ్రేష్టమైన సలహా బైబిలునందు వ్రాయబడియున్నది. ఈ సలహాలోని కొద్దిభాగాన్ని మనం పరిశీలిస్తాం.
నీ నాలుకను కొరుక్కొనుము: “సంభాషణ మనస్సుకు వ్యాయాయమైతే వృధాప్రసంగం నాలుకకుమాత్రమే వ్యాయాయం” అనే ఒక మాట ఉన్నది. వాస్తవానికి, అత్యంత హానికరమగు సంభాషణ అసూయను గాక మాట్లాడుటకు ముందు ఆలోచనా విఫలతను ప్రతిబింబిస్తుంది. కొందరు ఇతరుల గుట్టు రట్టు చేస్తారు; ఫలితాలను గూర్చి తలంచకుండ స్వల్ప ఆలోచనతో వారు దానికి మసాల కలిపి, గోరంతలు కొండంతలు చేసి, వక్రీకరిస్తారు. వారు కలిగించబోయే హానిని వివేచింపకుండానే ఇతరులతో వారి మిత్రుల, జీవితభాగస్వాముల తప్పులను బట్టబయలు చేస్తారు.
అందుకే బైబిలిట్లు సలహానిస్తుంది: “విస్తారమైన మాటలలో దోషముండక మానదు. తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.” (సామెతలు 10:19) అంటే మాట్లాడుటకు ముందు ఆలోచించండి. ఎవరో ఒకరిని గూర్చి చెప్పక ముందే నీవు ఆలోచించుము. నీవిలా అడుగుకొనుము: ‘ఆ వ్యక్తి ఎదుట ఈ విషయాన్ని మరల చెప్పగలనా? నన్ను గూర్చే అలా అంటే నేనెలా భావిస్తాను?’ (మత్తయి 7:12) కీర్తన 39:1 ఇట్లనుచున్నది: “నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగత్తగా చూచుకొందును . . . నానోటికి చిక్కము ఉంచుకొందునను కొంటిని.”
ఒప్పుకుందాం, నీ నాలుకను కొరుక్కొనుటకు అసలు అసాధ్యమగు పరిస్థితులుండవచ్చును. ఉదాహరణకు నీ యెడలగానీ నీకుటుంబం విషయంలోగానీ తీవ్రమైన తప్పు జరిగిందనే బలమైన అనుమానము నీకుండవచ్చును. నీకేరుజువు లేక పోవచ్చును గానీ ఆ విషయంలో ఏదొకటి చేయవలసిన అవసరమున్నదని నీవనుకోవచ్చును. ఒక నమ్మకమైన మిత్రునితో గానీ అధికారంలోనున్న మరొకరితో గానీ ఆ విషయం మాట్లాడుట కొండెము చెప్పినట్లవుతుందా? సలహా కొరకు నేవెవరినైనా సమీపిస్తే నిన్ను విషపూరిత వృధాప్రసంగియని అనవచ్చా? నిశ్చయంగా కాదు. రహస్యంగా మాట్లాడుటలోని జ్ఞానాన్ని బైబిలు అంగీకరిస్తుంది. నిజంగా అటువంటి సున్నిత పరిస్థితులతో వ్యవహరించేటప్పుడు మంచి విచక్షణా, తారతమ్యాన్ని గమనించుట ప్రాముఖ్యము.—సామెతలు 15:22.
హానికరమైన వృధాప్రసంగాన్ని వినవద్దు: ‘బడాయి చెవు’లు లేకపోతే ‘బడాయి నోరు’ కేమౌతుంది? బుద్ధిలేని మాటలెప్పుడు మాట్లాడే వారు ఆ సమస్యలోని భాగస్థులే; వినుటలో సంతోషించువారు కూడా దోషులే. ఊరక వింటేకూడా నీ మౌన అంగీకారాన్ని తెలిపి, హానికరమగు వృధాప్రసంగాన్ని చాటించుటకే దోహదం చేస్తుంది. సామెతలు 17:4 ఇలా చెబుతుంది: “చెడు నడవడిగలవాడు దోషపు మాటలు వినును. నాలుక హానికరమగు మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును.”
కాబట్టి, ఒకరిని గూర్చి సంభాషణ చెయ్యిదాటి పోతుంటే, నీవు ధైర్యం చేసి ఇట్లనవలసి వుంటుంది, ‘వేరే విషయం మాట్లాడుకుందాం.’ నీకిప్పుడున్న మిత్ర బృందం సరిదిద్దుకోలేనంతగా వృధాప్రసంగంలో పాల్గొంటూ వుంటే, ఇక నీవు క్రొత్తగా మిత్రులను చూసుకునే ఆలోచన చేయవలసి వుంటుందేమో. బైబిలిట్లు చెప్తుంది: “కొండెగాడై తిరుగులాడు వాడు పరుల గుట్టు బయట పెట్టును. కావున వదరుబోతుల జోలికి పోకుము.” (సామెతలు 20:19) బహుశా నీవు చర్చనీయాంశముగా మారుటకు కొంచెం సమయమే పట్టవచ్చును.
వృధాప్రసంగానికి అతిగా ప్రతిస్పందించవద్దు: వారిని గూర్చి మాట్లాడనంత సేపు అనేకమంది ప్రజలు వృధాప్రసంగాన్ని విని ఆనందిస్తారు. బదులుగా, నీవొక పిచ్చి పుకారుకు లేదా కట్టు కథకి బలైనావనుకో. ఆ కథకు మూలాన్ని కనుక్కొని నెమ్మదిగా విషయాలను చక్కబెట్టుటకు సాధ్యం కావచ్చును. కానీ నీవలా చేయలేక పోతే అప్పుడేమిటి?
నీవు కోపపడితే సాధించేది శూన్యం. నిజానికి, “త్వరగా కోపపడువాడు మూఢత్వమును చూపును,” అని బైబిలు అంటుంది. (సామెతలు 14:17) అట్లు సొలొమోను ఈ సలహా ఇస్తున్నాడు: “చెప్పుడు మాటలు లక్ష్యపెట్టకుము . . . నీవును అనేకమారులు ఇతరులను శపించితివని నీకే తెలిసియున్నది గదా.” (ప్రసంగి 7:21, 22) వృధాప్రసంగం జీవిత వాస్తవం, మరి ఎప్పుడో ఒకసారి బహుశా నీవును అందులో స్వయంగా, చురుకుగా భాగం వహించియుందువు. ఈ విషయంలో నిజంగా గాబరా చెందవలసివుందా? “నవ్వుటకు సమయమున్నది,” బహుశా హాస్యభావన నీకున్నదని చూపిస్తూ నవ్వితే, పుకారును ఆర్పివేయుటకదే ఉత్తమమైన మార్గం.—ప్రసంగి 3:4.
అగ్నికి ఆజ్యం పోయొద్దు: ఆ కథ అంత సులభంగా అంతం కాకపోతే, నిన్ను నీవిలా ప్రశ్నించుకో: ‘ఇతరులు వృధాప్రసంగం చేయుటకు నేను కారణాన్ని కల్పిస్తున్నానా? బహుశా నేను ప్రశ్నార్థక పద్ధతిలో ప్రవర్తిస్తూ, తప్పుకు తావిస్తున్నానా?’ ఈ క్రింది పరిస్థితులను పరిశీలించండి:
* ఒకావిడ తన పనులను సంతృప్తికరంగా నిర్వహిస్తూవున్నప్పటికీ తోటి మహిళలు ఆమెను సోమరిదని, నమ్ముకొనదగినదికాదని చాటుమాటుగా అంటారు. ఎందుకా అపకీర్తి వస్తుందామెకు? ఒక కారణమేమంటే, ఆమె పట్టిపట్టనట్లు, యథాలాపనగా ఉంటుంది గనుక. దాన్ని సులభముగా సోమరి తనమని భావిస్తున్నారు. తన ఉద్యోగ స్థలానికి తగినట్లు ఆమె తన తలను దువ్వుకొనుటలేదు. చివరికి, తాను ఫోను చేసేటప్పుడు పెద్దగా ఆఫీసులో వున్న వారందరి అవధానాన్ని మళ్లించే విధంగా అవివేకంగా మాట్లాడుతుంది. అందుకే ఆమెను గూర్చి వృధాప్రసంగం వినవస్తుంది.
* ఒక స్థానిక దుకాణదారుని గూర్చి అతని వీధిలో గుసగుసలాడుకుంటున్నారు. అతడు తన భార్యను మోసం చేస్తున్నాడని పుకారు పుట్టింది. అతడు మాత్రం ఆ అపనిందను అబద్ధమని గట్టిగా కొట్టి పారేస్తున్నాడు. మరి పుకారుకు కారణం? అతడు మహిళా వినియోగదారులతో విచ్చలవిడిగా పరిచయం కల్గివుండుటయే.
* ఒక యవ్వనస్థురాలు పోకిరి పిల్లయని పేరుపొందినది. ఆమెకెంతో మంది ప్రియులున్నారని, కోకైన్ అనే మత్తుపదార్థానికి అలవాటుపడిందని కొందరంటున్నారు. ఈ కథలన్నీ అబద్ధాలే. అయితే ఆమె మత్తుపదార్థాలు సేవించేవారితో వ్యక్తిగత స్నేహం కల్గివుంది. ఆమె తల, దుస్తులు అన్నింటిలోను అతిగా శృంగారించుకుంటుంది.
నీవు విషపూరితమైన వృధాప్రసంగానికి బలైపోతే, నీ ప్రవర్తన, ఇతరులతో నీ వ్యవహారాల పద్ధతి, నీదుస్తులు, తల దువ్వుకునే విధానములన్నింటిలోను అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లున్నవేమో పరిశీలించి చూచుకొనుట సహాయకరంగా వుండవచ్చును. బహుశా నీ జీవిత విధానములో కొన్ని మార్పులు చేసుకుంటే పుకార్లను పారద్రోలగలవు. “కట్టెలు లేని యెడల అగ్ని ఆరిపోవును,” అని బైబిలు అంటుంది. (సామెతలు 26:20) అంతేకాక, నీ క్రియలు అమర్యాద అంచుల్లో వుంటే, నిజంగా తప్పులోనికి జారిపోయి, ఒక నాటి పుకారును వాస్తవమైనదిగా చేసే ప్రమాదం పొంచివున్నది.—గలతీయులకు 6:7, 8; 1 కొరింథీయులు 10:12 పోల్చుము.
“నీ పని నువ్వు చూచుకో”
వృధాప్రసంగం నిలిచివుంటుంది. అయినను దానికున్న వినాశకర శక్తినిగుర్తించాలి. ఈ వివేకముగల మాటలను అనుసరించుట ద్వారా నీకును ఇతరులకును కలిగే హృదయ వేదన, దుఃఖాన్ని తొలిగించుకోగలవు: “ఏ యోగ్యతయైనను మెప్పైనను ఉండిన యెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యానముంచుకొనుడి . . . అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును.”—ఫిలిప్పీయులకు 4:8, 9.
అవును, ఇతరులను గూర్చి మనం మాట్లాడే విషయంలో దేవుడు స్వయంగా శ్రద్ధ కల్గియున్నాడు. యేసుక్రీస్తు ఇలా హెచ్చరించాడు: “మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుబట్టి నీతిమంతుడని తీర్పునొందుదువు, నీ మాటను బట్టియే అపరాధివనియు తీర్పునొందుదువు.”—మత్తయి 12:36, 37; కీర్తన 52:2-5 పోల్చుము.
ఇతరులతో మంచి సంబంధం, మనశ్శాంతి, మరి అన్నిటికంటే ముఖ్యంగా దేవునితో ఒక మంచి పేరు నీకు కావలెనని కోరుకుంటున్నావా? అలాగైతే దేవుని వాక్యమందలి ప్రేరేపిత సలహాను పాటించండి: “మీరు పరుల జోలికి పోక, మీ సొంత కార్యములను జరుపుకొనుడి.” (1 థెస్సలొనీకయులు 4:11) ఇతరుల యెడల శ్రద్ధ కనబరచండి, అయితే, గౌరవప్రదంగా, దయారసంతో అలా చేయండి. అప్పుడు నీవు విషపూరిత, హానికరమైన వృధాప్రసంగాన్ని శుభ్రంగా తప్పించుకొందువు. (g91 6/8)
[అధస్సూచీలు]
a వివరాల కొరకు వాచ్‌టవర్ బైబిల్ అండ్ట్రాక్ట్ సొసైటీ అఫ్ న్యూయార్క్, ఇంక్., ప్రచురించిన యు కెన్ లివ్ ఫరెవర్ ఇన్ ప్యారడైజ్ ఆన్ అర్త్ అను పుస్తకములో 19 అధ్యాయము చూడుము.
[9వ పేజీలోని చిత్రం]
హానికరమగు వృధాప్రసంగమునుండి దూరముగా వెళ్లిపొండి
[10వ పేజీలోని చిత్రం]
మీ అవివేకమైన ప్రవర్తన ఇతరులు మిమ్మును గూర్చి వృధాప్రసంగము చేయుటకు కారణమును ఇచ్చుచున్నదా?