“హోర్చాటా డి చూఫాస్ను త్రాగుదాము రండి!”
బహుశా ఈ ఆహ్వానం నీకు అసలే పరిచయం లేక పోవచ్చును. కానీ నీవు స్పెయిన్లో, ముఖ్యంగా తూర్పుసముద్ర తీర ప్రాంతంలో వున్నట్లయితే నిశ్చయంగా పరిచయముంటుంది. సంవత్సరం పొడవునా, అన్నిటికంటే వేసవి దినాల్లో జనసమూహములు సేదదీర్చే, మత్తులేని మధుర పానీయాన్ని సేవిస్తారు. అదే హోర్చాటా డి చూఫాస్!
స్పెయిన్ దేశస్థులు సహితం ఈ హోర్చాటా పానీయాన్ని బాదం, గుమ్మడి లేక పుచ్చకాయ విత్తనాలతోను, మరియు బియ్యం, జల్దరు పండ్లు, ఆపిల్ పండ్లు, చెర్రి పండ్లు, ఎండిన గింజ లేని ద్రాక్షా, నల్ల ద్రాక్షా, కంబలి పండ్లు, గంగి రేగిపండ్లు మరియు మధుర మాష్టిక దినుసులతో చేస్తారని తెలుసుకొనుటకు ఆశ్చర్యపడతారు. అయిననూ, స్పెయిన్ వారు ఆ పానీయము యొక్క ముఖ్య భాగం ఛూఫాస్ అని సాధారణంగా అనుకుంటారు.
అయితే చూఫాస్ ఏమైయున్నవి? అవి భూమిలో లేక నేలలో వుండే రెల్లు గడ్డివిత్తులు లేక బాదం గింజలు, మరి ఈ పదమైతే ప్రత్యేకంగా ఐరోపాలోని ఒక గడ్డి మొక్క (సైపరస్ ఎస్క్యులెంటస్) నుండి వచ్చే భూమిలోనున్న కాయవంటి గుండ్రని ప్రతి చిన్న కంద మూలములకు వర్తిస్తున్నది. అవి భూమి ఉపరితలానికి రెండు మూడు అంగుళాల (5-8 సెం. మీ.) లోతులోవుండును. ఈ గడ్డివంటి మొక్క జూలై నుండి అక్టోబర్ నెలల మధ్యలో స్పెయిన్లోనే గాక తూర్పుమధ్య దేశాల్లోను, ఉత్తరాఫ్రికాలోను పెంచబడుతుంది. అక్కడనుండి అరబ్బులు దీన్ని స్పెయిన్కు తెచ్చారు. మొదట దాన్ని దేశంలోని దక్షిణప్రాంతంలో పెంచినప్పటికీ, స్పెయిన్లోని మధ్యదరా సముద్రతీర ప్రాంతమైన వేలెన్సియా ప్రాంత పొలములలో సాగుచేయుటకున్నంత వాతావరణ అనుకూలత ఇతర ప్రాంతాల్లో లేదు, అక్కడదాన్ని అధికంగా పెంచుతారు.
మనం హోర్చాటాను ఎలా తయారు చేస్తాం? హోర్చాటా తయారు చేసేవ్యక్తి నిర్థిష్ట సమయాన్ని నిర్ణయించుకొని ఆ ప్రకారమే చూఫాస్లను అనేక గంటలసేపు నానబెట్టాలి. ఇందువల్ల చూఫాస్లు నీటిని అధికంగా పీల్చును గనుక బాగా ఉబ్బి పోతాయి. ఇంకా ఎక్కువ నీళ్లుపోసి వాటిని బాగా దంచాలి. దంచిన మీదట గుజ్జు ఒకపాత్రలోనికి తీసికొని బాగా కలపాలి, తర్వాత ఒక 15 నిమిషములు అలాగేవుండనిచ్చి దాని రసము, గుజ్జు వేరగునట్లు పిండేపాత్రలో వెయ్యాలి. ఆతర్వాత, రసాన్ని వడగట్టి ప్రతి పౌను (కిలో) ఎండిన చూఫాస్కు షుమారు ఒక (పౌను) కిలో పంచదార కలుపుకోవాలి.
కొందరు దాల్చినిపట్ట, నిమ్మచర్మపు ముక్కలు లేదా కమలా-పూల నీళ్లను సహితం కలుపుకుంటారు. ఒకసారి పానీయాన్ని తయారుచేసుకున్న తర్వాత వెంటనేదాన్ని రెఫ్రిజిరేటర్లో ఉంచాలి, గానీ 48 గంటలకు మించి వుంచకూడదు; లేక పోతే చూఫాస్లోని ఎంజైములు పనిచేయుట కారంభించి దాని రుచినే మార్చివేయును. నీవు దాన్ని పానీయముగా త్రాగవలెనంటే దాన్ని 37 నుండి 39 డిగ్రీల (ఫారన్హైట్) ఉష్ణోగ్రతలో (3-4°C) రెఫ్రిజిరేటర్నందుంచాలి, మరియు అతి శీతల పానీయంగా త్రాగాలంటే షుమారు 30 డిగ్రీల ఉష్ణోగ్రత (−1°C) లో ఉంచాలి.
హోర్చటా డి చూఫాస్ సేద దీర్చు శక్తివంతమగు, మధురపానీయము. గనుక నీకెప్పుడైనా స్పెయిన్ తూర్పుభాగాన సముద్రతీర ప్రాంతాన్ని దర్శించే అవకాశం వచ్చి వెళితే మాత్రం “హోర్చాటా డి చూఫాస్ ను త్రాగుదాం రండి!” అనే ఆహ్వానాన్ని అంగీకరించండి.—ఉచిత వ్యాసం. (g90 11/8)