లాటరీలను—గెలిచేదెవరు? ఓడేదెవరు?
పన్నులు పెంచుట వలన తప్ప బహుశా మరో మార్గములో వచ్చేఅవకాశం లేని డబ్బును ప్రభుత్వానికి ఇవే మిలియన్ల డాలర్లు తెచ్చిపెడుతున్నాయని ప్రభుత్వలాటరీలకు అనుకూలంగా చేసే ఒక ముఖ్యవాదన ఉన్నది. ‘అదెంతసులభం’ అని దాని మద్దతుదారులంటున్నారు. అది తిరిగి చెల్లించనక్కరలేని పన్ను వంటిది; అది స్వచ్చంధంగా ఇచ్చేది. నిజానికి ప్రజలు చెల్లించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. చెల్లించడానికి వారు బారులుతీరి వుంటున్నారు!
అయితే లాటరీల మీద ఉన్న ఫిర్యాదులేమిటి?
ఒకటేమంటే లాటరీ ప్రకటనలు తరచు అసలు సమాచారమునందివ్వవు లేదా శుద్ధంగా తప్పుదారి మళ్లిస్తున్నవి. దీనికొక మంచి ఉదాహరణ కెనడా లాటరీ చేసిన ఈ ప్రకటన: “గెలుచుకొనుట కొరకే . . . మేము దాన్ని సులభతరం చేస్తున్నాం!”
అయితే గెలుచుట అంత సులభమా? ఏలీ అనే వ్యక్తి పశ్చిమ జర్మనీ లాటరీ ఆడేవాడు. ప్రకటనేమో ఇలా తొందరపెడుతుంది: “మీరు గెలిచే అవకాశాలు అనన్యసామాన్యములు.” అయినను ఏలీ ఇలా విలపిస్తున్నాడు: “నేను 10 సంవత్సరములనుండి లాటరీ ఆడుతున్నాను మరి ఒక్క సారికూడ దాన్ని గెలుచుకోలేదు. మరెవరైనా దేనినైనా గెలుచుకున్నారేమో నాకు తెలియదు.”
పెద్ద బహుమతి పొందిన ప్రతి ఒక్కరికీ, పైసా తిరిగి పొందకుండ ప్రతివారం, ప్రతి సంవత్సరం వారి డబ్బును దీనికొరకు ధారపోసిన ఏలీ వంటి లక్షలాదిమంది ఓడిపోయినవారున్నారు. అమెరికాలో 1 మిలియన్ డాలర్లు గెలిచేవారు, లాటరీ ఆడే 97 మిలియను ప్రజలలో 0.000008 శాతం మంది మాత్రమేవున్నారు.
అతిపెద్ద బహుమతి పొందే అవకాశం ఒకమిలియన్‌కు ఒక్కరు కాదు (షుమారు, మెరుపు దెబ్బ తగిలినంత మంది మాదిరి) గానీ అనేక మిలియన్లలో ఏ ఒక్కరికో అట్టి అవకాశం కలుగుతుంది. ఉదాహరణకు, బహుమతి మొత్తం ఎంత ఎక్కువైతే అంత ఎక్కువగా టికెట్లు అమ్ముడు పోతాయి అనేది స్పష్టం, న్యూయార్క్ లోట్టోఆటను గెలుచుకునే అవకాశం 6 మిలియన్ల్‌కు ఒకరికి బదులు 12.9 మిలియన్లకు ఒకరికి అయింది.
లాటరీలు వారు పొందే అవకాశములు తక్కువ అనే విషయాన్ని మరుగు చేసి అమాయకులను దోచుకుంటున్నవని ప్రజలు ఫిర్యాదులు చేయుటలో ఆశ్చర్యంలేదు. యు. యుస్. సెంటర్ ఫార్ పెథోలాజికల్ గాంబ్లింగ్ డైరెక్టర్ డాక్టర్. వలిరీ లోరెంజ్ సాధారణ రీతిలో ఇలా అంటున్నాడు: “లాటరీలా? అదొక పెద్ద రక్తపిపాసి, గెలిచే అవకాశాలు నీకు చాలా తక్కువ.”
మరి ఒకవేళ నీవు ఒక మిలియన్ డాలర్లు గెలుచుకున్నావనుకో అప్పుడేమిటి? అదంతా నీకు రాదు. పన్ను వసూలు దారుడు తనవంతు పన్ను తీసుకున్న తరువాత, అమెరికాలో గెలుచుకున్నవారు ప్రతి సంవత్సరము 35,000 డాలర్ల చొప్పున 20 సంవత్సరాల వరకు తీసుకుంటూ ఉంటారు. అంటే 20 సంవత్సరాల కాలానికి ద్రవ్యోల్భణం మూలంగా అందులోనుండి 7,00,000 డాలర్లు ఇంకా తగ్గిపోతుంది.
పేదలపై ప్రభావం
మరొక విమర్శ ఏమంటే, స్తోమతలేని పేదప్రజలే వీటిని కొంటున్నారు. లాటరీ నిర్వాహకులు మాత్రం ఇది అసత్యం, మధ్యతరగతి ప్రజలలో ఇది ఎక్కువ ప్రజాదరణ పొందుచున్నట్లు పరిశోధనలు తెలుపుచున్నవని వాదిస్తున్నారు. లాటరీలు స్వచ్చంధమైనవి, వారనేదేమంటే, ఆడమని ఎవరు బలవంతం చేయడంలేదు.
అయినను ప్రకటనలు, కావాలనే ఆడేవారి కోరికలను ఉసికొల్పుతున్నవి, అందులో పేదవారు బలైపోతున్నారు. ఫ్లారిడాలోని ఒక షాపులోనున్న క్యాషియర్ ఇలా అంటున్నాడు: “ప్రతివారం మాదగ్గరకు వచ్చే ఖచ్చితమైన గుంపు ఒకటున్నది. కొంత మంది రోజుకు 10 టికెట్లు కొంటారు. కొందరైతే వారానికి 100 కొంటారు. తిండికి డబ్బు లేదుగాని ‘లోట్టో” మాత్రం ఆడుతారు.”
స్వల్ప అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలో పరిస్థితి తరచూ మరీ హీనంగా దిగజారుతుంది. ఒక గ్రామం గ్రామమే “పోర్కాస్‌మీద పిచ్చి” పట్టినట్లు వెళ్తుందని వార్తాపత్రికలలో వార్తలొచ్చినందువలన, ఇటీవల ఇండోనీషియా ప్రభుత్వము దాని పోర్కాస్ ఫుట్ బాల్ లాటరీ విషయంలో పునరాలోచన చేసింది. ఏషియావీక్ పత్రిక ఇలా తెల్పింది: “[ఇండోనీషియా] వార్తాపత్రికలు భయంకరమైన వార్తలతోనిండినవి: మగవారు భార్యలను లేక పిల్లలను కొట్టడము; పిల్లలు తలిదండ్రులనుండి డబ్బు దొంగతనంగా తీసుకోవడము; స్కూలు ఫీజు కొరకు దాచిపెట్టిన డబ్బును తీసికెళ్లి పిల్లలు ఖర్చు పెట్టడము—ఇదంతా ఆ పోర్కాస్ కొరకే.
ప్రపంచ వ్యాప్తంగా లాటరీలు శీఘ్రగతిన వృద్ధిచెందుచున్నందువల్ల ఇంకా చాలా మంది ప్రజలు ఈ జూదమునకు పరిచయస్థులౌతున్నారు. కొందరైతే, పేదవారేకాదు, తప్పనిసరిగా ఆజూదం ఆడుతారు—లాటరీ మత్తులో పడుతున్నారు. ఆర్నీ వెక్స్‌లర్ అమెరికాలోని నూజెర్సి పట్టణంలో తప్పనిసరిజూదం అనే ఒక కమిటీకి నాయకత్వం వహిస్తున్నాడు. ఆయన ఇలా అంటున్నాడు: “డబ్బు సంపాదనకు సులభమైన, కష్టంలేని పద్ధతిని కనుగొన్నామని సెనేటర్లు అనుకుంటారు, అయితే నిజానికి వారు అనేక కుటుంబాలను, అనేక వ్యాపారాలను, అనేక మంది మనుష్యులను, ప్రాణాలను నాశనం చేస్తున్నారు.”
నైతిక విలువలను గూర్చిన ప్రశ్న
మరో గంభీరమైన విషయమేమంటే ప్రభుత్వ లాటరీలు జూదమాడే విషయం మీద ప్రజల అభిప్రాయాన్ని మార్చేస్తున్నారు. ఈనాడు రాష్ట్రం నిర్వహించే “ఆట” లేక “లక్కినంబర్స్” గల లాటరీలు వెయ్యిన్నొక్క అవకాశములను అందిస్తున్నవి గానీ 50 శాతం మాత్రమే బహుమతి రూపంలో డబ్బును చెల్లిస్తున్నవి. ప్రభుత్వం ఆ వ్యాపారంలోనికి తలదూర్చకముందు ఆ ఆట “మోసకర”మైంది, అక్రమమైనది, దుర్నీతితో కూడిన క్రియే. గానీ ఇప్పుడది వినోదం, తమాషా, సామాజిక బాధ్యతగా పిలువబడుతుంది.
నిజమే, అక్రమ పద్ధతిలోనడిచే నంబర్ల ఆటకును ప్రభుత్వలాటరీలకును మధ్య వ్యత్యాసమే ఉంటే ఇక్కడ లాభాలు నేరస్థుల జోబుల్లోనికి వేళ్లేబదులు, అవి ప్రభుత్వ పథకాలకు సహాయపడుతున్నవి. అయినప్పటికీ, ప్రయోజనకరంగా వుండవలసిన సమాజము యొక్క నైతిక విలువలను లాటరీలు దెబ్బతీస్తున్నవని పరిశీలకులు విచారపడుతున్నారు.
దీనికి గల కారణం ఏకష్టం లేకుండనే ధనవంతులు కావచ్చుననే తలంపును ఆశను కల్గిస్తున్నవి ఈ లాటరీలు. గేమింగ్ అండ్ వేజరింగ్ బిజినెస్ ఎడిటర్ పాల్ డోరిన్ ఇలా అన్నాడు: “గతంలో ప్రభుత్వం మీరు కష్టించి పనిచెయ్యండి మీరు సుఖంగా ఉంటారు అని, ఇప్పుడైతే ‘టికెట్టు కొనండి మీరు లక్షాధికారులౌతారు’ అని చెపుతుంది. ప్రభుత్వం పంపే సందేశం వింతగా ఉంది.” న్యూస్‌వీక్ లో జార్జి విల్ ఇలా వ్రాశాడు: “ప్రజలు అదృష్టం, కలిసొచ్చుట, గుడ్టిగా ఒనకూడుట, తలవ్రాత మొదలగువాటి ప్రాముఖ్యతయందు ఎంత ఎక్కువగా నమ్మకముంచితే వారు పరిశ్రమించుట, పొదుపు చేయుట, వృధా చేయకుండుట, శ్రమించుట, శ్రద్ధతో పనిచేయుట అనే ఉత్కృష్టమైన విలువలను అంత తక్కువగా నమ్మెదరు.”
మానవజాతికి ముఖ్యమైన మరొక అభిప్రాయమిక్కడున్నది: ఇతరుల దురదృష్టాలనుండి లాభం, సుఖం పొందుట సరియైనదేనని లాటరీలు నడిపేవారు ప్రోత్సహిస్తున్నారు. అటువంటి ఆలోచన స్వార్థంతోకూడినది; అది బైబిలు యొక్క ఈ సలహాను త్రోసిపుచ్చుతుంది: “నిన్నువలె నీ పొరుగు వారిని ప్రేమించుము”—మత్తయి 22:39.
ఎన్ని వ్యతిరేక నినాదాలిచ్చినప్పటికీ, లాటరీలు లోకమందంతటను విపరీతంగా పెరిగి పోతున్నవి. రాష్ట్ర లాటరీ భవనాన్ని వందలాది ప్రజలు చుట్టిముట్టి ఉన్నారని పశ్చిమాఫ్రికాను సందర్శించిన ఒక సందర్శకుడు గమనించాడు: “వారంతా పేద ప్రజలేగదా, ఎందుకు వాళ్ల డబ్బంతా లాటరీకి తగలేస్తున్నారు?” అని ఆయన అక్కడి నివాసిని అడిగాడు.
అప్పుడా నివాసి ఆయనతో “మిత్రుడా, వారికది ఆశ కల్గిస్తుంది కాబట్టి వారు లాటరీ ఆడుతున్నారు” అని సమాధానమిచ్చాడు. “వారిలో అనేకులకు వారి జీవితంలో వున్న ఒకే ఒక నిరీక్షణ.”
అయితే లాటరీ గెలవడం ఒక నిజమైన నిరీక్షణేనా? అదొక ఊహ, ఎండమావి, అసాధ్యమైన స్వప్నం కన్న పెద్దదే. నిశ్చయంగా వివేకమున్న క్రైస్తవుడు తన సమయాన్ని, సంపదను ఐశ్వర్యముకొరకు వృధాగా జూదమాడడు. “అస్థిరమైన ధనమందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవునియందే నమ్మికయుంచుడి” అని అపొస్తలుడైన పౌలు వివేకులైన ప్రజలకిచ్చిన సలహా పాటించుట ఎంత శ్రేష్టం.—1 తిమోతి 6:17. (g91 5/8)
[8వ పేజీలోని చిత్రం]
“డబ్బు సంపాదనకు సులభమైన కష్టంలేని పద్ధతిని కనుగొన్నామని సెనేటర్లు అనుకుంటున్నారు, అయితే నిజానికి వారు అనేక కుటుంబాలను అనేక వ్యాపారములను, అనేకమంది మనుష్యులను, ప్రాణాలను నాశనం చేస్తున్నారు.”
[9వ పేజీలోని బాక్సు]
జూదగాళ్లకు మంచి అంశాలు
“పందెంవేసేవాడు గెలిచినవాన్ని పలుకరించునపుడు కనబరిచే నిరాప్యాయమైన చిరునవ్వుకు మించింది మరొకటిలేదు . . . పందెం వేసేవాడు పందెంకాసేవాడు అధికంగా నష్టపోతున్నాడని అరుదుగా అడ్డుకుంటాడు . . . ఇంకా జ్ఞాపకముంచుకొనండి, పేదలైన పందెగాళ్లు ఎంత అరుదుగావుంటారో పందెం కాసి గెలిచినవారు కూడా అంత అరుదుగానే వుంటారు.”—గ్రెహం రాక్, The Times, లండన్.
“ఈ రోజు లోట్టో డ్రాలో ఖచ్చితంగా వస్తుందనే 45 మిలియన్ డాలర్ల బ్రహ్మాండమైన బహుమతి న్యూయార్క్ స్టేట్ లాటరీ చరిత్రలోనే అతి పెద్దది. గానీ దానిని డాలర్ పందెముతో గెలిచేవారు 1,29,13,582 మందికి ఒక్కరే.—The New York Times.
“బుద్ధిహీనుడు, అతని డబ్బు, త్వరలోనే విడిపోతున్నారు.” ఈ సామెత 16వ శతాబ్దమునుండి వాడుకలో ఉంది. Familiar quotations, by John Bartlett.
“ఓ జూదగాడా మురిసిపోవద్దు; ఈ రోజు గెలిచిన వాడు రేపు పోగొట్టుకుంటాడు.”— ఒక స్పానిష్ సామెత.