లాటరీలకు—ఎందుకంత జనాదరణ
ప్రజలెందుకు లాటరీ ఆడుతారు? “అదొక వినోదం, అదొక తమాషా,” అని ఒక లాటరీ బోర్డు ప్రతినిధి అన్నది. అలా కావచ్చునేమో గానీ దాని ముఖ్యాకర్షణ మాత్రం నిశ్చయంగా దానివల్ల వచ్చే బహుమతి సొమ్మే. ప్రతి ఒక్కరు కొంచెం డబ్బెక్కువ ఖర్చుపెట్టాలనుకుంటారు. మరి లాటరీలు చాలా డబ్బు ఆశ చూపిస్తున్నవి. విపరీత ధరలతోను, విపణి-వీధి నష్టాలతోను, నిరుద్యోగ సమస్యలతోను సతమతమౌతున్న ఈ అనిశ్చయిత లోకంలో ఐశ్వర్యవంతులగుటకు లాటరీ బహుమతి సంపాదించుటే ఒక శ్రేష్టమైన మార్గమని అనేకమంది ప్రజలు నమ్ముతున్నారు.
ఈ ఆకర్షణకు తోడు లాటరీలు చిక్కులేమీ లేకుండ సులభంగా ఆడుకోగలిగినవి. వీటిలో అనేక రకాలున్నవి, అంటే లోట్టో, సంఖ్యలు మరియు దాగివున్న సంఖ్యలను కనుగొనటానికి నీవు పేపరును గీకవలసినటువంటి ఆటలున్నవి, గానీ వీటన్నిటికి రెండు అంశాలున్నవి. మొదటిది, కొన్న టికెట్టు డ్రావేసిన వారు ప్రకటించిన నంబరుతో సరిగ్గా సరిపోతే ఆడేవారు బహుమతిని గెలుచు కుంటారు. రెండవది, ఇతర జూదముల కవసరమైనట్లు దీనికి ఓ ప్రత్యేక జ్ఞానం, నిపుణత అవసరంలేదు. గెలుచుట లేక పోగొట్టుకొనుట కలిసిరావడం మూలాన జరుగుతుంది.
ప్రజలు లాటరీలు ఆడుతారు ఎందుకంటే సులభంగా టికెట్లు కొనవచ్చును, అమెరికాలో అనేకులు వాటిని కిరాణషాపుల్లో కొనగలరు. ఇతరచోట్లలో, లాటరీ అమ్మే స్థలాలు లేకపోతే, ఆటఆడేవారు పోస్టు, టెలిఫోన్, టెలెక్స్, ఫ్యాక్స్‌ద్వారా పందెం కాయవచ్చును.
లాటరీలలో ఉన్న క్రొత్తదనమేమిటి?
లాటరీలు ఏమైనా క్రొత్తవా? కానేకాదు. పురాతన రోమాలో పండుగలప్పుడు నీరో, అగస్టస్ చక్రవర్తులు దాసులను మరియు ఆస్తులను బహుమతులుగా ఇచ్చేసేవారు. బహుశా, 1530 సంవత్సరములో ఇటలీనందలి ఫ్లోరెన్స్‌లోని ఒక లాటరీ నగదు బహుమతిని చెల్లించినట్లు మొట్టమొదటిసారిగా రికార్డుకెక్కింది. ఆ తర్వాతి శతాబ్దములలో లాటరీలు ఐరోపాలో విస్తరించినవి. తొలిదశలో అమెరికాలో కూడ లాటరీలు విపరీతంగావుండేవి, ఇవి జేమ్స్‌టౌన్, కాంటినెంటల్ ఆర్మీ మరియు హార్‌వర్డ్, డార్ట్‌మౌత్, యేల్, కొలంబియావంటి సుప్రసిద్ధ విశ్వవిద్యాయాల నిర్మాణములకు ఆర్థిక సహాయము అందించినవి.
అయితే 19వ శతాబ్దంలో ఈ వ్యాపారం సంక్షోభంలో పడింది. వ్యతిరేకులు, సామూహిక జూదమును వ్యతిరేకించి, డ్రాలుతీయుట మోసపూరితమని నిందించారు. లాటరీలు లంచగొండితనం, అన్యాయం అక్రమాలతో నిండినవి. ప్రయివేటుగా నడిపించేవారు అధిక లాభార్జన చేస్తున్నారని ఆరోపించబడిరి. తత్ఫలితంగా అమెరికా, ఫ్రాన్స్ మరియు బ్రిటన్ దేశాలలో లాటరీలు నిషేధించబడినవి.
ఇక కథ ముగిసినట్టేనా? నిశ్చయంగా కాదు. లాటరీలు ఇతర ప్రాంతాలలో అభివృద్ధి చెందుతూనే వచ్చాయి—ఉదాహరణకు, ఇటలీ మరియు ఆస్ట్రేలియాలలో స్పెయిన్ రాజు కార్లోస్ III 1763 సంవత్సరములో లాటరీని రూపించాడు; దాని ఆధునిక భాగం 1812 సంవత్సరములో చట్టరీత్యా స్థాపించబడింది. దేశం వెంబడి దేశం ఈ లాటరీ బృందంలో చేరిపోయినవి. ఫ్రాన్స్ దేశం 1930 లో లాటరీపైనున్న నిషేధాన్ని ఎత్తివేసి లాటరీ నేషనల్ అని స్థాపించింది. మరియు 1930 వ శతాబ్దములో, ఐర్లాండ్‌దేశం దాని ప్రసిద్ధి చెందిన ఐరిష్ హాస్పిటల్ స్వీప్‌స్టేక్ అనేదాన్ని ఏర్పాటుచేసింది. జపానులోని టాకరాకుజి 1945 సంవత్సరములో ప్రారంభమైంది. బ్రిటన్‌లోని ఓకెడ్ పుట్‌బాల్ పూల్స్ మరియు ప్రీమియం బాండ్ డ్రాయింగ్స్ లాటరీలు అనేపేరుతో పిలువబడక పోయినను నిజానికి మాత్రం అవే. మరి 1964 సంవత్సరములో అమెరికా మరల ఆ వ్యాపారంలోకి దిగింది.
ఇక 1970 వ దశకంలో రెండు అభివృద్ధి కార్యక్రమాలు లాటరీ స్వరూపాన్నే మార్చి వేసినవి. మొదటిదేమనగా చిల్లర అమ్మకాలను లింక్ చేసే కంప్యూటర్ వ్యవస్థ ప్రవేశ పెట్టబడింది. అప్పుడు ఆడేవారు స్వయంగా వారికి కావలసిన నంబరును ఎన్నుకునే అవకాశం కల్పించే, అనేకరకములైన, అధిక సంఖ్యలో ఆటలాడుకునే ఏర్పాట్లు చేయుటకు సాధ్యమైంది. గెలుపొందామా లేదాయని వారాలు లేక నెలలతరబడి వేచియుండాల్సిన అవసరమిక లేకుండెను, లాటరీ ఆడేవారు కొన్ని రోజులలోనే, గంటల్లోనే, లేదా నిముషాల్లో ఫలితాలు కనుక్కోవచ్చును.
రెండవ అభివ్రద్ధి కార్యక్రమమేదనగా గెలుపొందే అవకాశాలు ఎక్కువ కష్టమైవున్న లోట్టో అనేదాన్ని ప్రవేశపెట్టారు. లోట్టో పద్ధతిలో లాటరీ తగలక పోతే, తర్వాతి ఆటలోనికి తీసికెళ్తారు. తద్వారా బహుమతి డబ్బు కొన్ని బిలియన్ డాలర్లుగా వృద్ధి చెందుతుంది. లోట్టోమూలాన అమ్మకాలు అధికమై, వ్యాపారం జోరుగా, మహాజోరుగా సాగుతోంది.
నిర్వాహకులకు ఆకర్షణ
ప్రభుత్వాలెందుకు ఈ జూదమును నిర్వహిస్తున్నవి? ఎందుకంటే అది పన్నులు పెంచకుండ డబ్బును తెచ్చుకునే సులభ పద్ధతి. నాణెము వేస్తే నంబర్‌ను గెల్చుకునే యంత్రములు, గిరగిరతిరిగే చక్రపు ఆటలు అవి సంపాదించే మొత్తంలో 95 శాతం తిరిగి గెలిచిన వారికి బహుమతిగా చెల్లిస్తున్నవి. గానీ లాటరీలు 50 శాతం కంటె తక్కువే తిరిగి బహుమతిగా చెల్లిస్తున్నవి. ఉదాహరణకు, 1988 సంవత్సరములో అమెరికాలో లాటరీలో, డాలరులోని 48 సెంట్లను బహుమతి రూపంలో తిరిగి చెల్లించినది, 15 సెంట్లు ప్రకటన, అమ్మకం, నిర్వాహణా ఖర్చులక్రింద చెల్లించింది. మిగిలిన 37 సెంట్లు సామాజిక వికాసములకొరకు, విద్యా ఆరోగ్యం, మరియు వృద్ధుల సహాయార్థం వినియోగించబడింది. దేశవ్యాప్తంగా ఆ మొత్తం 7.2 వేల మిలియన్ డాలర్లయింది.
అయితే డబ్బు సేకరించుటకొరకే ప్రభుత్వాలు లాటరీలు నిర్వహించుటలేదు. వ్యాపారం చేయకపోతే డబ్బు పోగొట్టుకోవచ్చును. ఆ దేశాల పౌరులు మరోచోట లాటరి ఆడవచ్చును. గనుకే ఒక దేశం లేక రాష్ట్రం ఒక లాటరీని ప్రారంభిస్తే పొరుగున వున్నవి అలాగే చేయడానికి వాటికి వత్తిడివస్తుంది. ఈ రెట్టింపు అభివ్రద్ధిప్రభావం అమెరికాలో స్పష్టంగా కనబడుతుంది. 1964 సంవత్సరంలో ఒకే ఒక లాటరీ ఉండేది; 1989 నాటికి 30 లాటరీలైనవి.
ఐశ్వర్యపు కలలు
నిజమే వినియోగదారుని డాలరు యొక్క చిన్న భాగమైనా సంపాదించాలని ప్రయత్నించే ప్రజలనేకులున్నారు. మరి ప్రజలు లాటరీ మీద డబ్బు ఖర్చు పెట్టడానికి నిర్వాహకులెట్లు వారిని నమ్మిస్తారు? ప్రకటనలద్వారా! వృత్తిపరంగా నమ్మించేవారిని వాడుట ద్వారా!
వీటి లాభాలలో ఓ భాగం (కొంచెమైనా సరే) విద్యకు లేదా వృద్ధుల సహాయార్థమై ఆర్థిక సహాయము చేయుటకు ఉపయోగపడునని ఈ ప్రకటనలు నొక్కితెల్పుచున్నవా? అలా చెప్పడమే లేదు! అది అరుదుగా అనేమాట. బదులుగా, మిలియన్ల డాలర్లు గెలుచుకొనుటలో ఎంత తమాషావుంటుందో దాన్ని గూర్చి ప్రకటనలు నొక్కి చెబుతున్నవి. ఇక్కడ మచ్చుకు కొన్ని ఉన్నవి:
▫ “ధనికులు, సుప్రసిద్ధుల వంటి విలాసవంతమైన జీవన విధానము తక్షణం మీదే అవుతుంది . . . కెనెడా నిర్వహించే మల్టిమిలియన్ డాలర్ లోట్టో 6/49 ఆటను నీవు ఆడితే.”
▫ “ది ఫ్లారిడా లాటరీ . . . అమెరికాయొక్క బ్రహ్మాండమైన లాటరీ ద్వారా ధనవంతులు అవ్వండి.”
▫ “జర్మనీలో డబ్బు సంపాదించవచ్చు.
▫ దాన్ని అధికంగా కొని రాత్రికిరాత్రే లక్షాధికారి అవ్వండి.
బలవంతపు అమ్మకములా? ఖచ్చితంగా అంతే! టికెట్లు అమ్ముడుపోకపోతే ప్రకటనలు తగ్గించే పద్ధతికి సాధారణంగా స్వస్తి చెప్పారు. వాస్తవానికి, నిర్వాహకులు క్రొత్తవారిని ఆకర్షించడానికి, పాతవారి ఆసక్తిని నిలబెట్టటానికి ముందటి కంటె మంచి మంచి పద్ధతులను ఆటలను నిర్వహిస్తూవుంటారు. నిర్వాహకులు ఒక క్రొత్తదనమును కనబరచే పద్ధతులను అవలంబిస్తూవుండాలి ఓరిగాన్స్ లాటరీ డైరెక్టరు జేమ్స్ డేవీ ఇలా అన్నాడు: “మాకు జూదమాడే అంశాలున్నవి. మేము ఒలంపిక్స్ ఆడుతాం. క్రిస్టమస్ సమయంలో మేం హాలిడే క్యాష్ నడిపిస్తాము. అదృష్టజాతకములో ప్రజల నక్షత్రరాసుల మీద ఆడుకుంటాము. మీరు ఒకే సారి రెండు లేక మూడు, నాలుగు లేక ఐదు ఆటలు ఆడితే మీరు ఎక్కువ టికెట్లను అమ్మవచ్చని మేము నమ్ముతాం”.
అయితే ఇప్పటివరకున్న అతిపెద్ద ఆకర్షణ ఏమంటే ఒక పెద్ద బహుమతి మొత్తమే. లోట్టోనందు బహుమతి డబ్బు పెరిగితే, అంటే 1989 సంవత్సరములో పెన్సిల్‌వేనియాలో బహుమతి మొత్తము 115 మిలియన్ డాలర్లకు చేరినట్లుగా చేరితే, అదొక సంచలన వార్త అవుతుంది. ఒక రచయిత అన్నట్లు “జూదగాడి పిచ్చిఆకలి” అనే విధంగా అప్పుడు ప్రజలు టికెట్లు కొనడానికి త్రొక్కిసలాడుతారు. ఈ మైకంలో సాధారణంగా ఎప్పుడు లాటరీ ఆడనివారు సహితం డబ్బు ఆశతో దాని వెంటబడతారు. (g91 5/8)
[6వ పేజీలోని బాక్సు]
జూదంపిచ్చి మరియు మతం
“కేథొలిక్ చర్చి నాకు జూదం నేర్పింది. బింగో మరియు రాఫిల్స్, నిజంగా లాటరీ కంటె భిన్నంగా లేవు. కేథొలిక్ చర్చ్ నాయకత్వము వహించే అన్ని రకముల జూదమును ఆపివేయగలిగితే, లాటరీ ఆడకుండ ఆపే విషయాన్ని నేను మరల ఆలోచిస్తాను. నేను దురాశాపరుడనైతే దానికి కారణం, చర్చీలో అట్టి క్రియ దాదాపు పవిత్రమైనదిగా ఎంచబడుట వల్లనే.”— రీడర్ టు ది యు.యస్. కేథొలిక్ మాగజైన్.
“నోట్రిడేమ్ యూనివర్సిటీ ద్వారా కేథొలిక్ సంస్థలు చేసిన సర్వేప్రకారం కెథొలిక్ చర్చి ఆదివారం మాస్ తర్వాత ఇక బింగో ఆటదగ్గరే ఎక్కువమంది హాజరవుతున్నారు.” అయిననూ, మతగురువుల లెక్క ప్రకారం బింగో ఆటలకు వేళ్లేవారు చాలామంది చర్చీకి వెళ్ళరు.—ది సన్‌డే స్టార్ లెడ్జర్, న్యూజెర్సీ, యు.యస్.ఎ.
“సెయింట్ పాంక్రాస్ మాడ్రిడ్‌కు అదృష్టాన్ని తెచ్చింది.” అని స్పానిష్ వార పత్రిక ఎబిసి అంతర్జాతీయ సంచికలో పెద్దక్షరాలతో వచ్చింది. ఆ శీర్షికలో ఇంకా ఇలా వ్రాసింది: “‘సెయింట్ పాంక్రాసే సహాయంచేసింది అని మాటిమాటికి ఆ లాటరీ షాపులో పనిచేసిన ఇద్దరు ఉద్యోగస్థులు అన్నారు . . . అక్కడనుండే వారు 21515 సీరీస్ నంబర్లను, మాడ్రిడ్ పట్టణములో పంచిపెట్టి ‘గోర్డో’ [పెద్దది] అనే 250 మిలియన్ల విలువ చేసే దానిని [పిసిటాస్, లేక ఈ రోజు అది 25,00,000 అమెరికా డాలర్ల విలువ] అమ్మిరి. వారు వారి షాపులోవున్న ఆసెయింట్ బొమ్మకు ప్రార్థించారని, దానిదగ్గర క్రిస్టమస్ ‘గోర్దో’ను అమ్మడానికి అదృష్టాన్ని ప్రసాదించవలెనని పార్‌స్లీ కొమ్మనొకదానినుంచారని [ఉద్యోగస్థులు] ఒప్పుకున్నారు.”
వారి అదృష్టాన్ని వివరించుటకు మార్గాలు వెదకుచూ ముందు గెలుపొందిన వారు, డబ్బును గెలుచుకోవడానికి వారికి దేవుడు, అదృష్టం సహాయం చేశారని నమ్ముచున్నారు . . . ‘ఆకస్మిక సంఘటన కాదుగానీ అదృష్టమో, దురదృష్టమో పనిచేస్తున్నట్లు మేము నమ్మవలెనని కోరుకుంటున్నామని’ మియిమీ యూనివర్శిటీలో సైకాలజీ ప్రొఫెసర్ డా. జాక్. ఎ. కాప్చన్ అన్నాడు. ‘మరి దేవునికి తప్ప మరెవరికి సంబంధమున్నది?’”—ది న్యూయార్క్ టైమ్స్.
అదృష్టాన్ని గూర్చి బైబిలు ఏమని చెబుతుంది? ఇశ్రాయేలీయులలో నమ్మకద్రోహులైన వారితో యెహోవా ఇట్లనెను: ‘యెహోవాను విసర్జించి నాపరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచువారలారా, అదృష్ట దేవికి పానీయార్పణ నర్పించువారలారా.”—యెషయా 65:11.
ఎన్ని లక్షలమంది పోగొట్టుకున్న దురదృష్టం కారణంగానే వారికా ఒక్క అదృష్టం కలిసొచ్చిందని, ఆ గెలుపొందిన కొద్దిమందిలో ఎంతమంది అనుకుంటున్నారు? ఇటువంటి జూదం ‘పొరుగువారి యెడల ప్రేమను’ లేశమాత్రమైనా చూపిస్తుందా? జూదం వంటి స్వార్థపర దుర్నీతి క్రియలలో విశ్వసార్వభౌముడు జోక్యం చేసుకుంటాడని తలంచుట సహేతుకమా లేక బైబిలు ప్రకారం న్యాయమా?—మత్తయి 22:39 (g91 5/8)