లాటరీ పిచ్చి—లోకపు జూదం
“నీకు కావలసిదంతా ఒక డాలరు ఒక కల.” ఆ కల ఏమిటంటే 45 మిలియన్ డాలర్ల న్యూయార్క్ లాటరీ మొత్తం సొమ్మును గెలుచుకొనుటే. ఒక్క డాలర్ గెలిచే ఒక అవకాశమిచ్చింది. అలా లక్షలాదిగా చేరిపోయారు. వారి వారి టికెట్లు కొనడానికి బారులుతీరి వారు ఒకవేళ బహుమతి డబ్బువస్తే విలాసపు ఓడలను, మందంగా బొచ్చుతో తయారయిన కోటులను, భవంతులను కొనాలని ఒకరికొకరు చెప్పుకున్నారు. రాష్ట్రం మొత్తంలో ఒక సమయమందు నిముషానికి 28,000 టికెట్లను కొన్నారు. డ్రా తీసే ముందు చివరి మూడు రోజులలో వారు 374 లక్షల టికెట్లను కొన్నారు.
సంవత్సరాంతమున జరిగే జెబో టకరాకూజి (లాటరీ) టికెట్లను ప్రజలు ఎగబడి కొంటున్నారు గనుక జపానులో 10,000 అధికార లాటరీ స్థలాల్లో ఆ వ్యాపారం జోరుగా సాగుతోంది. టోక్యోనందున్న లాటరీ టికెట్లమ్మే ఒక స్థలంలో అనగా గత సంవత్సరములో ఐదు మొదటి బహుమతి వచ్చిన టికెట్లు అమ్మిన స్థలం, ఆ బూత్ తెరువకముందే 300 మంది ప్రజలు అప్పటికే బారులు తీరినిల్చున్నారు. మొదటి వ్యక్తికే అదృష్టం కలిసొస్తుందని నమ్మిన ఓ యవ్వనస్థురాలు అర్థరాత్రి ఒంటిగంట నుండి వేచివుండెను. గత సంవత్సరపు పెద్ద బహుమతి మొత్తం: అత్యధికంగా 100 మిలియన్ యెన్ (714,285 అమెరికా డాలర్లు).
పశ్చిమాఫ్రికా దేశపు రాజధాని నగరంలో, లోట్టోకాలేజి అని స్థానికులు పిలిచే ప్రాంతం ఎప్పుడూ ఈటికెట్లు కొని నంబర్ ఎప్పుడొస్తుందాయని భవిషత్ కొరకు నిరీక్షించేవారితో కిటకిటలాడుతుంది. బహుమతి గెలిచిన వారి పేర్లతో వున్న పెద్దపెద్ద లిస్టులు ఇప్పుడు తమ భవిషత్ అదృష్టాన్ని పరీక్షించుకొనుట కుపయోగపడతాయని తలంచేవారికి అమ్ముతున్నారు. మానవాతీతజ్ఞానమందు నమ్మకమున్న వారికి ప్రవచనము చెప్పడానికి లోట్టో ప్రవక్తలు సిద్ధంగా వున్నారు, ఫీజు తీసుకొని అంకెల గారడీ చేస్తుంటారు.
ఇవన్నీ ఎక్కడో ఒక చోట జరిగేవా? కానే కాదు. లాటరీపిచ్చి సర్వవ్యాప్తం. అది ప్రతి ఖండాన్ని మండిస్తూ. ధనిక, పేదదేశాలలోను చిచ్చురేపుతుంది. సంఘములోని ప్రతి ఆర్థిక, సామాజిక, విద్యాసంబంధమైన స్థాయిలోని పిన్నలను పెద్దలను పురికొల్పుతుంది.
అవును, లాటరీలు పెద్దవ్యాపారములే, మరి ఆ వ్యాపారం జోరుగా నడుస్తోంది. ఒక్క అమెరికా దేశంలోనే, 1989వ సంవత్సరములో రాష్ట్రలాటరీలు 18.5 వేల మిలియన్ డాలర్లను సేకరించినవి. గత 27 సంవత్సరాల క్రితం ఆ సంఖ్య సున్నా. అయితే ఇప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రములలో లాటరీలు జూదంలో రెండవ స్థానాన్ని ఆక్రమిస్తున్నవి, మరి ఆ వ్యాపారం, కంప్యూటర్ వ్యాపారమంత వేగంగా, ప్రతి సంవత్సరం 17.5 శాతం అభివృద్ధి సాధిస్తుంది.
గేమింగ్ అండ్ వేజరింగ్ బిజినెస్ అనే పత్రిక అందించిన ఇటీవలి గణాంకముల ప్రకారం 1988 సంవత్సరములో ప్రపంచమంతట లాటరీ అమ్మకాలమొత్తం 56.38 వేల మిలియన్ డాలర్లు అని తేలింది, ఎంత గొప్ప సంఖ్య. అంటే భూమిమీదనున్న ప్రతి స్త్రీ, పురుషుడు, బిడ్డకి పది డాలర్లకంటె ఎక్కువయని అర్థం. అదీ ఒక సంవత్సరములోనే!
లాటరీలు పెచ్చు పెరిగి పోతున్నవనే విషయాన్నెవరూ కాదనలేరు గానీ అనేకులు వాటికి వ్యతిరేకముగా వాదిస్తున్నారు. తర్వాతి రెండు శీర్షికలు, లాటరీల మీదపెరిగే మోజు, వాటివెనుకనున్న వివాదాంశములను గూర్చి పరిశీలించును. వాస్తవాలను నీవు పరిశీలించిన మీదట నీకు లాటరీలు అవసరమా లేదాయని నిర్ణయించుకోగలవు. ఈ ఆట ఆడుట తెలివైన పనియేనా? బహుమతి గెలుచుకొనుట ఎంత సులభం? డబ్బుకంటె యింకా ఎక్కువ పోగొట్టుకోగలవా? (g91 5/8)