మతం నూనె, ఇసుక మీద నిర్మితమైన రాజ్యం
ఏ దేశం పశ్చిమ ఐరోపా అంత పెద్దది, 12 మిలియన్ల జనాబా మాత్రమే గలది, మరి దాదాపు దేశమంతా ఎడారిగావున్నది? ఏ రాజ్యం 1932 సంవత్సరములో కనిపెట్టబడింది, దేనిలో గొప్ప నూనె గనుల నిధులున్నవని 1938 లో కనిపెట్టారు, ఏది ముడినూనెను ఉత్పత్తి చేయుటలో ప్రపంచ దేశాల్లో మూడవ స్థానము నాక్రమిస్తున్నది? ఏ రాజ్యంలో, ఖురాను పవిత్ర గ్రంథాన్ని దాని రాజ్యాంగ చట్టంగా తీసుకుంటున్నది, ఇస్లాం మతస్థుల అత్యంత ఆత్మగౌరవాన్ని పొందిన వాటిలో ఏ రెండు పట్టణాలు, మసీదులు ఆ దేశంలోనున్నవి?
ఆ ప్రశ్నలకు సమాధానమేమంటే, అది ఫాద్ బిన్ అబ్దుల్ అజీజ్ అనే రాజు పాలించిన సౌది అరేబియా రాజ్యమే. ఆ రాజ్యం 8,65,000 చదరపు మైల్లు (22,40,000 చ. కిమీ.) విస్తీర్ణం కలిగి, పశ్చిమాన ఎర్ర సముద్రము, దక్షిణాన అరేబియా సముద్రము, తూర్పున అరేబియన్ సముద్ర భాగంతో చుట్టుకొని అరేబియా ద్వీపకల్పములో అధిక భాగాన్ని ఆక్రమించియున్నది.
ఈ అరేబియా దేశమంటే నాకెలా శ్రద్ధకలిగింది? సౌదీ అరేబియా ప్రభుత్వము న్యూయార్క్ పట్టణములో ఒక ప్రదర్శన ఏర్పాటు చేసి వార్తా పత్రికలో ప్రచురించిన ఆహ్వానాన్ని నేను చూశాను. మరోరకమైన సంస్క్రతి, జీవిత విధానమున్న ఈ రాజ్యాన్ని గూర్చి తెలుసుకోవలెననే కుతూహలం నాకు కల్గింది. నేనెలాగు ఎన్నటికి సౌదీ అరేబియా వెళ్లలేనేమో గనుక సౌదీ అరేబియాయే నాదగ్గరకు ఎందుకు రాకూడదు?
సౌదీ అరేబియా—ప్రాచీనమైనది మరియు క్రొత్తది
నేను ప్రదర్శనశాలలో అడుగుపెట్టిన వెంటనే, ఈ అరేబియా దేశాన్నిగూర్చి ప్రజల్లో మంచి అభిప్రాయాన్ని కలిగించేందుకొరకే అన్ని చక్కగా అమర్చారు. అన్నిచోట్ల అమెరికాలోవున్న సౌదీ అరేబియా విశ్వవిద్యాలయ విద్యార్థులు అన్నింటిని చూపించే గైడ్స్‌లాగా పనిచేస్తున్నారు. అందరూ కాళ్ల వరకు వ్రేలాడే నిలువుటంగీని పోలిన తెల్లని తోబి ని ధరించుకున్నారు. ప్రతి ఒక్కరు తలకు ఎరుపుతెలుపు రంగులున్న చారలున్న ఘూత్రా అంటే తలగుడ్డను గట్టిగా పేనిన నల్లని త్రాడుతో బిగించి కట్టుకున్నారు. అందరూ స్వచ్ఛమైన ఇంగ్లీషు మాట్లాడుతున్నారు, నేను గానీ మరెవరైనా అడిగే ప్రశ్నలకు ఎంతో వినయంతో సమాధానమిస్తున్నారు.
సౌదీ అరేబియా రాజ కుటుంబము మరియు సౌదీ అరేబియా యొక్క ఇతర విషయాలను గూర్చి తీసిన చాలా ఫోటోలను మసక వెలుగులో వున్న ఒక గదిలో చూచిన తర్వాత నేను అరబ్బు, బెడోయిన్ జీవిత సాంస్కృతి తెలిపే ప్రాంతానికి వెళ్లాను. బెడోయిన్ జాతివారి సంచారజీవితానికి సంబంధించిన వస్తుసామాగ్రితో అన్ని హంగులున్న ఒక నల్లని గుడారమును ప్రదర్శించారు. అయితే, ఆధునిక సాంకేతిక జ్ఞానాభివృద్ది కారణంగా పరదేశులకు ఆతిధ్యమిచ్చే దాని ఆచార వ్యవహారముతోవున్న బెడోయిన్ జీవిత విధానమిప్పుడు అంతరించిపోయింది.
తదుపరి చూచినదేమంటే సౌదీ అరేబియా ప్రజలను ఏకతాటి మీద నడిపి, తన ఆధీనమందుంచుకొనగల్గే మత శక్తిని—ఇస్లాం మతాన్ని జ్ఞాపకం చేసే విభాగమే.a
మక్కా, కాబా మరియు ఖురాన్
ఇస్లాం యొక్క పవిత్రగ్రంథం, ఖురాన్, “(సౌదీ అరేబియాకు) ఒక రాజ్యాంగ చట్టముగాను, నైతిక విలువలను, మార్గదర్శక సూత్రములను అందిస్తున్నట్లు పరిగణించబడుతుందని” అధికార కరపత్రము తెల్పుతుంది. ఒక చిన్న కరపత్రం ఇలా తెలియ జేస్తుంది: “ఆ రాజ్యం దాని సాంఘిక రాజకీయ, ఆర్థిక విధానాలను ఇస్లాం మత బోధల ఆధారంగా తయారు చేస్తుంది.” ఖురాన్ యొక్క చేవ్రాత ప్రతులు ప్రదర్శనశాలలో చాలా వున్నప్పటికి, ఈ విభాగపు ముఖ్యాంశము, యాత్రిక స్థలమైన మక్కా (అరబ్బీలో, మాక్కా), అందులోని పెద్ద మసీదు, దానిమధ్యలోని కాబాను గూర్చి వుండెను. ఇవన్నీ పెద్దపెద్ద ఆకారాల్లో ప్రదర్శించబడినవి.
కాబా, అనేది రాతితో చేయబడిన పెద్ద ఘన ఆకారములోనున్న భవనం, ఇది పెద్ద నల్లని గుడ్డతో కప్పబడినది, దీన్ని గూర్చి ఇస్లాం పుస్తకం తెలిపేదేమంటే “నాలుగు వేల సంవత్సరాలక్రితం దేవుడు అబ్రాహాము, ఇష్మాయేలుతో నిర్మించమని చెప్పిన ఆరాధనా స్థలమే ఇది.”b అలా ఇస్లాం మతమునకు (సా.శ. ఏడవ శతాబ్దంలో మహమ్మద్ ప్రవక్త ప్రారంభించినది) క్రైస్తవత్వానికి, యూదా వారికి పితరుడైన అబ్రాహాముతో సంబంధమున్నట్లు చెప్పుకుంటుంది. అందుచేత దేవుడొక్కడేయను సిద్ధాంతాన్ని నమ్మిన మూడు పెద్దమతాల్లో ఇదొకటి.
నిజానికి ఈ కాబా అనేది పెద్ద మక్కా మసీదులోని భాగమై చతురస్రాకారపు గొప్ప మైదానము మధ్యలో ఉన్నది. సంవత్సరానికొకసారి జరిగే యాత్రలో (హాజ్) పదిలక్షలకంటే ఎక్కువ మంది ముస్లింవారు అక్కడ ప్రార్థన చేసి, కాబా చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణ చేయుటకు గుంపులుగా కూడెదరు. మంచి ఆరోగ్యవంతులైన ముస్లింవారు తలంచేదేమంటే తన జీవిత కాలంలో ఒక్క సారైనా తప్పని సరిగా ఈ యాత్ర చేయాలి. ఆ ప్రదర్శనలో, మహమ్మద్ సమాధివున్న పెద్ద మదేనా (అరబ్బీలో మాదీనా) మసీదు నమూనాకూడావున్నది. ఎంతో బాగా అలంకరించబడిన కాబా ద్వారములు అత్యంత ఆకర్షణీయంగా వున్నవి. సాధారణంగా, ముస్లిములు మాత్రము వీటిని చూస్తారు, ఎందుకంటే మక్కా మసీదులోనికి వారు మాత్రమే అనుమతించబడుతున్నారు. అవి అసలు ద్వారములని నమ్ముటకు కష్టంగా వుంది, ఇవి పాతద్వారములని 1942 నుండి 1982 సంవత్సరముల వరకు వుపయోగించిన వాటికి బదులు క్రొత్తవి బిగించారని గైడ్ చెప్పేంతవరకు తెలియలేదు. అవి బంగారు వెండితో చేయబడినవి, అవి అరబ్బీ భాషలో చెక్కబడిన ఖురాన్‌లోని వాక్యాలుగల బంగారు పలకలతో అలంకరించబడినవి. దగ్గర్లోనున్న గోడమీద, కిస్వా లేక కాబా మీద వ్రేలాడే పెద్దనల్లని తెర, ఖురాన్‌లోని చాలా వాక్యాలున్న బంగారు అక్షరాలతో అల్లబడి వ్రేలాడదీయబడి యున్నది.
సౌదీ అరేబియాలోని ఆధునిక జీవన విధానం
ప్రదర్శనశాలలో ఇంకా, వీధి దృశ్యాలు కొట్టొచ్చినట్లు కనబడుచున్నవి, అందులో చాపలల్లేవారు, వంట పాత్రలు తయారుచేసేవారున్నారు. ఇతర పనివారు ప్రత్యేకమైన అరబ్బీ పాదరక్షలను తయారుచేస్తున్నారు. మరొకరు చెక్కతో సాధారణంగా వున్న పక్షుల గూళ్లు చేస్తున్నారు. ఇంకొకరు కాళ్లతో నడిపే కుమ్మరి వాని చక్రము మీద మట్టి కుండలను తయారుచేస్తున్నారు.
చివరిగా నేను ఆధునిక సౌదీ అరేబియా ఘన కార్యాలను విశదపరిచే విభాగానికి వచ్చాను. చమురు నిక్షేపాలు వెలికి తీయబడిన తోడనే సౌదీ ఆర్థికపరిస్థితి దాని జీవన ప్రమాణములు పెరిగినవనుట స్పష్టమైయున్నది. ఆరాంకో (అరబ్బు అమెరికా ఆయిల్ కంపెని) 1938 సంవత్సరములో అనేక చమురు నిక్షేపాలు కనిపెట్టింది. కంపెని ఒక యొక్క కరపత్రం ఇలా తెల్పుతుంది: “ఆరాంకో నందు 43,000 మంది ఉద్యోగులు, 550 చమురు బావులు, 20,500 కిలో మీటర్ల (12,733 మైల్డు) పొడవున్న చమురు పంపే గొట్టములున్నవి మరియు చమురు-వాయువు వేరు చేసే కార్మాగారాలు 60 కంటె అధికంగా ఉన్నవి.”
అంత గట్టి ఆర్థిక స్తోమతగల సౌదీ అరేబియాలో 20 లక్షల 50 వేల విద్యార్థులకు సేవలందిస్తున్న 15,000 పాఠశాలలకు, విద్యాకేంద్రాలకు ఆర్థిక సహాయము చేస్తుందని సమాచార పత్రములు చెప్పగలవనుటలో ఆశ్చర్యమేమీ లేదు. విశ్వ విద్యాలయాల వరకు విద్య అంతయు ఉచితమే. అక్కడ ఏడు విశ్వవిద్యాలయాలున్నవి.
సౌదీ అరేబియాలో అంతా నూనె మాత్రమే కాదు. పెద్దపెద్ద వ్యవసాయ ప్రాజెక్టులు పూర్తయినవి, వ్యవసాయోత్పత్తులెంతగా పెరిగినవంటే చేపలు, కోళ్లు, గోధుమలు, ఖర్జూరము, కూరగాయలు, పాలు పాలోత్పత్తి వస్తువులు ఎగుమతి చేస్తుంది.
ప్రతి నాణెమునకు రెండువైపులు ఉంటాయి
పోల్చిచూస్తే, చిన్న దేశమైన “సౌది అరేబియా” సాధించిన వాటినన్నిటిని మూడు గంటలపాటు చూచి చాలా ముగ్ధుడనయ్యాను. ప్రపంచ అవసరానికి తగినట్లు ప్రతి దేశంకూడ ఆ దేశంవలెనే చమురు నిక్షేపాలతోను, ఇతర విలువైన నిక్షేపాలతో ఆశీర్వదించబడితే ఎంత బాగుంటుందోనని నేనునుకుంటున్నాను.
ఆ ప్రదర్శన తిలకించుట చాలా వుపయోగకరమైనప్పటికీ మతము విషయం అక్కడ ప్రదర్శించక పోవుటను గమనించకుండా ఉండలేకపోయాను. మక్కాను సందర్శించు ముస్లిం యాత్రికులు పవిత్రమైనదిగా ఎంచు అసలు కాబాను గూర్చి, అనగా నల్లటి మిరుమిట్లుగొలుపు సాధనమును గూర్చి నేనేమి నేర్చుకోలేదు. ఇస్లాం మతం రాక ముందు ఆ బండను “ప్రాణరహిత వస్తువుగా ఆరాధించే వారు” అని ఫిలిఫ్. కె. హిత్తీ హిస్టరీ ఆఫ్ ఆరబ్స్ అను తన పుస్తకంలో తెల్పుచున్నాడు. ఇష్మాయేలు ఆ కాబాను పునర్నిర్మించే సమయంలో గబ్రియేలు దూత నల్లరాతిని ఆయన కిచ్చాడనే పారంపర్య నమ్మకమున్నది.
ఆ ప్రదర్శనలో నాకు కనబడని మరో విషయమేమంటే ఇస్లాం మతంలోని సున్ని, షియా అనే రెండు పెద్ద తెగలను గూర్చిన సమాచారం. ఈ చీలిక మహమ్మద్ తర్వాత వచ్చిన వారివరకు అంత వెనక్కి వెళ్తుంది, ఎవరు ఆయన నిజమైన ఆత్మీయ వారసులు— షియా ముస్లింలు అన్నట్లు మహమ్మదు రక్తసంబంధులైన వారసులా లేక అధిక సంఖ్యాకులైన సున్నీ తెగవారు నమ్మినట్లు ఎన్నుకోబడినవారా వారసులు? సౌదీ దేశీయులంతా, సున్నీ ముస్లింల నాలుగు మత వర్గాలలో ఒకటైన హాన్‌బాలి అనే మత వర్గానికి చెందిన గట్టి వాహాబి విభాగానికి చెందినవారే.
గమనించదగిన మరొకటి ఆ ప్రదర్శనలో అరేబియా స్త్రీలను గూర్చి ఏమియు కనబడలేదు. దీనికిగల కారణం బహుశా సౌదీ స్త్రీల బహిరంగ పాత్ర విషయంలో ఇస్లాం చట్టాలు గట్టి నిబంధనలనుబట్టి కనబడలేదని నేనూహించాను.
నేను ప్రదర్శనశాలను వదలి వచ్చేటప్పుడు నాకో సామెత ఖచ్చితంగా జ్ఞాపకం వచ్చింది, అదేమంటే ప్రతినాణెమునకు రెండువైపులు ఉంటాయి. బయట వీధిలో ఆరబ్ వ్యతిరేకులు కరపత్రాలను పంచుతూ, సౌదీ అరేబియాలో అన్యాయాలు అక్రమాలు జరుగుచున్నవని నిందిస్తూ, ఆదేశంలో ప్రజాస్వామ్య పద్ధతులు కొరవడినవని ఖండిస్తున్నారు. (అక్కడ ప్రజాపార్లమెంటు లేక రాజ్యాంగ చట్టాలులేవు) గనుక కొందరు ప్రజలకు ఇసుక, చమురు మరియు మతము అంతా వారి జీవితకథ మాత్రంకాదని నాకనిపించింది. అయితే సౌదీ అరేబియాలోని జీవనము ప్రజల మీద ఇస్లాం మతానికున్న ప్రభావమును గూర్చిన స్పష్టమైన వివరణ నాకు లభ్యమైంది.—ఉచితవ్యాసం. (g91 1/8)
[అధస్సూచీలు]
a ఇస్లాం మత వివరణ కొరకు 1990లో వాచ్‌టవర్ బైబిలు అండ్ ట్రాక్ట్ సొసైటి అఫ్ న్యూయార్క్, ప్రచురించిన మ్యాన్ కైండ్స్ సెర్చ్ ఫర్ గాడ్ అనే పుస్తకంలో ఇస్లాం—ది వే టు గాడ్ బై సబ్‌మిషన్ అనే 12 వ అధ్యాయం చూడండి.
b ఈ సంఘటనను గూర్చి బైబిలులో ఏ మాట వ్రాయబడలేదు లేక అబ్రాహాము పురాతన మక్కాలో వున్నట్లు చెప్పుటలేదు.—ఆదికాండం 12:8–13:18.
[28వ పేజీలోని చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
ఇరాక్
ఇరాన్
సూడన్
మక్కా
సౌదీ అరేబియా
ఎర్ర సముద్రము
అరేబియా సముద్రము
[29వ పేజీలోని చిత్రాలు]
(ఎడమ వైపునుండి) కాబాద్వారములు, అరబ్బీ కళాకారుడు, మరియు అరబ్బీ అక్షరాలను అల్లుట
[క్రెడిట్ లైను]
David Patterson