మానవ పాలనను తూకం వేస్తే
భాగం 3: ‘ఉత్తమ పాలకుల ప్రభుత్వము’ నిజంగా ఉత్తమమైనదేనా?
సర్వశ్రేష్టులపాలన: అంటే ఉన్నతవంశీయుల, ఆధిక్యతగల కొందరు, లేక పరిపాలించే హక్కుగల ఉత్తమ వర్గీయులచే పాలించబడు ప్రభుత్వము; కులీనుల ప్రభుత్వము: కొద్దిమంది వ్యక్తులు లేక కుటుంబముల వారు, చెడు, స్వార్థ పరత్వముతో చేయు ప్రభుత్వము.
ఉత్తమ ప్రజల సభ్యత్వమున్న ప్రభుత్వము సర్వశ్రేష్టమైన పాలననందించుననుట భావ్యమే. ఉత్తములంటే, ఉన్నత విద్యాపరులు, అధిక అర్హతలు గలవారు, అధిక సమర్థులు—అనే వాదన వాడుకలో ఉంది—గనుక వారు ఇతరులను బాగుగా పాలించ సమర్థులు. అట్టి ఉన్నత వర్గీయులచే పాలించబడు సర్వశ్రేష్టుల ప్రభుత్వము వివిధ రకములలో ఒకటైయుండవచ్చును, ఉదాహరణకు, ధనవంతుల పాలనను ధనిక వర్గ ప్రభుత్వమని; మత గురువుల పాలన మతాధిపతుల ప్రభుత్వమని, అధికారుల పాలన, ఉద్యోగుల ప్రభుత్వములు అని పిలువవచ్చును.
అనేక అనాగరిక సమాజములలో, ఆయాతెగల పెద్దలు లేక ముఖ్యుల చేతిక్రింద పాలనే సర్వశ్రేష్టుల ప్రభుత్వాలుగా వుండేవి. చెప్పవలెనంటే, రోము, ఇంగ్లాండు, జపాను, ఈ మూడు దేశాలను ఎన్నడో ఒక నాడు సర్వశ్రేష్టుల ప్రభుత్వాలే పాలించినవి. ప్రాచీన గ్రీకుదేశంలో “ఆరిస్టోక్రసీ” అనే పదము, కొద్దిమంది మాత్రమే పాలించే పట్టణ-పాలన లేక పోలైస్ లను సూచించుటకు వుపయోగింపబడిన మాటే. ప్రముఖ కుటుంబాలు అనేకములు అధికారాన్ని పంచుకునేవి, అయిననూ కొన్ని సందర్భాలలో ఒకే కుటుంబం వారు అనధికారంగా అధికారాన్ని గుంజుకొని భయానక పరిపాలన చేసెడివారు.
గ్రీకు దేశంలోని ఇతర పట్టణ-పాలనల వలెనే ఏథెన్స్లో తొలుత సర్వశ్రేష్టుల పాలనే వుండేది. తర్వాతి కాలంలో సామాజిక మార్పులవల్ల సంఘ విభేధాలు పుట్టుకొచ్చి దాని ఐక్యత విచ్ఛిన్నమైనప్పుడు పట్టణము ప్రజాపాలన పద్ధతికి మారింది. స్పార్టా అనే పట్టణం, సా.శ.పూ తొమ్మిదవ శతాబ్దంలో ప్రతిష్టాకరంగా కనిపెట్టబడినదై, కొందరు సైన్యాధికారుల చేత పాలించబడింది. ఈ పట్టణం త్వరిత గతిని పెరిగి ప్రాచీన ఏథెన్స్కు ప్రతిద్వంధియై వాటి కాలములోనున్న గ్రీకు ప్రజలమీద ఆధిపత్యము వహించుటకు ఈ రెండు పట్టణములు పోరాడినవి. ఆవిధంగా ఏథెన్స్లోవున్న అనేకుల పాలన, స్పార్టాలోని కొద్దిమంది పాలనతో పోటీపడింది. వారి జగడం జటిలమైందే అనుకోండి, ప్రభుత్వము విషయంలో అనంగీకారము కంటె ఇంకా వేరే విషయాలు కూడా అందులో ఇమిడియుండెను.
శ్రేష్టమైన సంకల్పము పాడైంది
రాజకీయవిభేదాలు, గ్రీకు తత్వశాస్త్రజ్ఞులలో తరచూ తత్వజ్ఞాన వివాదాలకు దారితీసినవి. ప్లాటో పాత శిష్యుడైన అరిస్టోటిల్ సర్వశ్రేష్టుల పాలనకు కులీనుల పాలనకుగల వ్యత్యాసాన్ని ఎత్తి చూపించాడు. పరిపూర్ణ సర్వశ్రేష్టుల పాలన ఒక శ్రేష్టమైన ప్రభుత్వమని, ఉన్నత నైతిక లక్షణాలు, విశేష సామర్థ్యములున్న వారు ఇతరుల ప్రయోజనార్థమై ప్రజాసేవకు అంకితమగుట ఆదర్శానుసరణమని ఆయన అన్నాడు. గానీ క్రూరుడు, స్వార్థప్రియుడైన కులీనుడు పాలిస్తే పరిపూర్ణ సర్వశ్రేష్టుల పాలన అధర్మ కులీన పాలనక్రిందికి దిగజారుతుంది. దీన్నే అతడు తప్పుదారి పట్టిన ప్రభుత్వమన్నాడు.
‘ఉత్తముల’ పాలనను సమర్థిస్తూనే, అరిస్టోటిల్ సర్వశ్రేష్టుల పాలనతో ప్రజాపాలనను జోడిస్తే బహుశా ఆశించిన ఫలితాలు సాధించవచ్చునని ఒప్పుకున్నారు, ఇప్పటికి కొందరు రాజకీయ ఆలోచనా పరులకు ఈ అభిప్రాయం ఉత్తమమైనదిగా కనబడుతోంది. నిజానికి, ప్రాచీన రోమీయులు కొద్దిపాటి విజయంతో ఈ రెండు విధములైన ప్రభుత్వాలను కలిపేశారు. “రాజకీయాలు ప్రతివాని పనేనని” ది కోలిన్స్ అట్లాస్ ఆఫ్ ది పిస్టిరీ తెల్పుతుంది. అయినను ఆ కాలములోనే, “ధనసంపన్నులు, ఉన్నతకుటుంబములో జన్మించినవారు కలిసి న్యాయాధికారి, సైనికాధికారి, యాజకుడు మొదలగు పదవులను పంచుకొని ఒక కులీన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
మధ్యయుగపు చివరి దశలోను, ఆధునిక కాలాంరంభంలోనూ ఐరోపా పట్టణాభివృద్ది కేంద్రాలు వారి ప్రభుత్వములో ప్రజాపాలనను సర్వశ్రేష్టుల పాలనను మిశ్రమం చేసి పాలించారు. కోలియర్స్ ఎన్సైక్లోపీడియా ఇలా అంటుంది: “చివరకు నెపోలియనును కూలద్రోసిన అత్యంత సాంప్రదాయవాద రాజకీయ విభాగముగా విరాజిల్లిన వెనేషియన్ రిపబ్లిక్ అట్టి కులీనప్రభుత్వ పద్ధతికి శ్రేష్టమైన మాదిరిని చూపిస్తుంది గానీ పవిత్ర రోమా సామ్రాజ్యములోని స్వతంత్ర పట్టణాలు అనగా హాన్సియాటిక్ లీగ్ (జర్మనీ వాణిజ్యసంస్థలు) యొక్క పట్టణాలను మరియు ఇంగ్లాండు, పశ్చిమ ఐరోపా అధికార పట్టణాలను పరిశీలిస్తే, ఉన్నత సంస్క్రతిగల, అహంకారుల సభ్యత్వంతో అతికొద్దిమంది స్వాధీనమందున్న గట్టి కులీన పాలన వైపే మొగ్గు చూపుచున్న అవే సాధారణ లక్షణాలు గోచరిస్తున్నవి.
అన్ని ప్రభుత్వాలు సర్వశ్రేష్టుల పాలనవంటి పాలనవలెనే వున్నవని, కొంతవరకు న్యాయముగా నమ్ముచున్నారు, ఎందుకంటే ఉత్తమ అర్హతలుగల వారే అధికారులైవుండాలని ఆ ప్రభుత్వాలన్ని ప్రయత్నించును. పరిపాలనా తరగతికి చెందిన వారి తలంపే ఇట్టి అభిప్రాయానికి బలమిచ్చింది. ఒక పరిశోధన ఇలా ముగింపుకొచ్చింది: “ప్లాటో, అరిస్టోటిల్ దేనిని ఆదర్శానుసరణయని వాదించారో అదే వాస్తవమును వర్ణించుటకు పాలనా తరగతి, ఉత్తమ వర్గీయులు అనే పదాలు పర్యాయ పదాలుగా మారుచున్నవి.”
‘ఉత్తముల’ అన్వేషణలో
ఈ గ్రీకు తత్వవేత్తలు రాకమునుపే, ఎన్నో శతాబ్దముల ముందే చౌ అనే రాజ కుటుంబ పాలనలో ప్రాచీన చైనా దేశానికి కౌలుదారి పరిపాలనా పద్ధతి ద్వారా కొంతమట్టుకు శాంతి సుస్థిరతలను తెచ్చేది. అయితే సా.శ.పూ. 722 సం. తర్వాత, చూన్ చై పాలనా కాలమని పిలువబడు పరిపాలనలో కౌలుదారి విధానం క్రమేణ క్షీణించింది. ఈ పాలనా కాల చివరి భాగంలో కౌలుదారి కుటుంబములో పాలించిన వారితోను ప్రాచీన ఉన్నత వంశముల వంశీయులు, మాజీ “శ్రేష్టుల” తో కూడి క్రొత్త ఉత్తమ వర్గమొకటి వచ్చింది. ఈ నూతన ఉత్తమ వర్గసభ్యులు ప్రభుత్వములోని కీలక స్థానాల నాక్రమించుకున్నారు. కన్ప్యూజియస్ అను చైనా దేశ సన్యాసి “నాయకత్వానికి ఒకడు తన జన్మమును బట్టిగాక అతని సామర్థ్యమును నైతిక విలువను బట్టిచేపట్టే అర్హుడని నొక్కిచెప్పినట్లు ది న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా తెల్పుతుంది.
రెండువేల సంవత్సరాల అనంతరం ఐరోపాలో, ఉత్తమ వర్గీయులను, పరిపాలన దక్షులను ఎంపిక చేసుకొనుటలో “సామర్థ్యము నైతిక విలువలను” పరిగణించుట అతి స్వల్ప విషయమైంది. హార్వార్డ్ ప్రొఫెసర్ కార్ల్ జె. ఫెడరిక్ గమనించినదేమంటే “పద్దెనిమిదవ శతాబ్దములోని ఇంగ్లాండు సర్వశ్రేష్టుల పాలనలో ముఖ్యంగా సంపన్నులకు, వంశానుక్రమమునకే ప్రాధాన్యత ఇవ్వబడింది, వెనిస్లో కూడా ఇదే వాస్తవం.” ఆయనింకా ఇలా అన్నాడు: “పద్దెనిమిదవ శతాబ్దపు ప్రష్యా దేశంవంటి కొన్ని దేశాలలో సైనిక శౌర్యమునుబట్టి, ఉన్నతవర్గము ఏర్పడేది.”
‘ఉత్తముల’ సద్గుణాలు వారి సంతానానికి సంప్రాప్తమగుననే భావన వుండబట్టే ఆ దినాలలో రాజులు రాజవంశీయులనే వివాహమాడే అలవాటు వాడుకలోనికి వచ్చింది. మధ్యయుగాల్లో వ్యక్తి వంశాధిక్యతే ప్రాధాన్యమనే భావన వుండేది. సామాన్యుని వివాహమాడుట ఉన్నత వంశపు దొరతనాన్ని వన్నె మార్చినట్లును దైవశాసనాన్ని ఉల్లంఘించిన దానితో సమానముగా పరిగణించబడెను. రాజులు అటువంటి ఉన్నత కుటుంబములో జన్మించిన వారినే తప్పక వివాహమాడు ఆనవాయితీ గలదు. ఈ వంశాధిక్యత అనే భావన ఆ తర్వాతి కాలంలో మరెక్కువైన హేతువాదపరమైన న్యాయానికే మార్గమేర్పరచింది—అంటే వారి అవకాశములు, విద్య, ప్రజ్ఞపాటవాలు లేక సాధించిన ఘన కార్యముల ఆధారంగానే వారు ఉత్తములు.
ప్రభువర్గపు ఉపకారబద్ధత అనే సూత్రం సర్వశ్రేష్టుల పాలనలను నిశ్చయపరచుటకే తేబడింది. అంటే అక్షరార్థంగా దాని భావమేమనగా “ఉన్నత వర్గం బాధ్యతనిస్తుంది,” అనగా ఉత్తమ జన్మ లేక స్థానం మూలంగావచ్చు గౌరవప్రదమైన, ఔదార్యంగల, బాధ్యతను” సూచిస్తుంది. వారి “ఉన్నతాధికారాన్నిబట్టి” ఉత్తమ జన్మగలవారు బాధ్యతాయుతంగా ఇతరుల అవసరాలను తప్పక తీర్చవలసి యుండిరి. ఈ నియమము పూర్వం స్పార్టాలో వలె సర్వశ్రేష్టుల ప్రభుత్వాలలో వుండెను, వారి సైనికులు తమ ఇష్టాన్ని కాకుండ ముందుగా ఇతరుల ఇష్టాన్ని నెరవేర్చారు, అలాగే జపానులోని సమురై అనే సైనికుల తెగలోను చేసేవారు.
సర్వశ్రేష్టుల పాలన లోపాలు
సర్వశ్రేష్టుల పాలనలోని అసంపూర్ణతలను సులభముగా వివరించవచ్చును. రోమా తొలిదశలో పేట్రిషియన్లు అని పిలువబడిన వారు, ఉత్తమ జన్మంగలవారు మాత్రమే రోమా పాలక సభ్యత్వానికి అర్హులైయుండిరి. ప్లిబియన్స్ అని పిలువబడిన సాధారణ ప్రజలు అందరు అనర్హులు. కన్ప్యూజియస్ పరిపాలకులనుండి కోరినట్లు ఈ పాలకులు “సామర్థ్యము నైతిక విలువలు” లేనివారై పాలకసభ్యులు కఠినులు, విపరీతమైన లంచగొండులుగా తయారైరి. తత్ఫలితంగా ప్రజాపోరాటం ప్రారంభమైంది.
రాజకీయ సంస్కరణలెన్నో వచ్చినప్పటికిని, సా.శ.పూ 44 వ సం.లో తన హత్యకు కొన్ని సంవత్సరాల ముందు జూలియస్ సీజర్ నియంత పాలన స్థాపించేంతవరకు కులీన పాలన కొనసాగింది. అతని మరణాంతరం, సర్వశ్రేష్టుల పాలన మరల పునరుద్ధరింపబడింది. గానీ సా.శ.పూ. 29 సంవత్సరమునాటికి మరల అది పతనమైంది. కోలియర్స్ ఎన్సైక్లోపీడియా ఇలా వివరిస్తున్నది: “రోమా భౌగోళిక, అర్థబలం అంగ బలంలో విస్తరించుట వల్ల సర్వశ్రేష్టుల పాలన లంచగొండి కులీనపాలన అయ్యింది, ప్రజలగౌరవాన్ని పోగొట్టుటలోనే దాని పౌరశక్తిని కోల్పోయినట్లు ప్రస్ఫుటమౌతుంది. అది కూలిపోవుట వల్ల సంపూర్ణ ఏకచత్రాధిపత్యమునకు దారి తీసింది.
ఆతర్వాత షుమారు 1200 సంవత్సరముల వరకు, పేరుకు ఏక చత్రాధిపత్యములైనప్పటికి సర్వశ్రేష్టుల పాలనే, ఐరోపాలో ఉండెను. సకాలములో, రాజకీయ, ఆర్థిక, సామాజిక మార్పులుక్రమేణ ఈ విధానాన్ని మార్చినవి. అయితే ఆ కాలమంతటిలోనూ ఐరోపాలోని సర్వశ్రేష్టుల పాలన శక్తివంతంగా వుండి, భూస్వామ్యాధికారులను, సైనికాధికారముల మీద పట్టును కలిగియుండెను, మరోవైపు ఇంకా పరాన్నజీవిగా, అమిత దుబార ఖర్చుచేస్తూ, అహంభావంతో తుచ్ఛమైన పనులను చేస్తూవుండేది.
సర్వశ్రేష్టుల పాలన 1780 సంవత్సరములో తీవ్రంగా దెబ్బతిన్నది. ఫ్రాన్స్ పాలకుడు లూయిస్ XVI, ఆర్థిక సంక్షోభంలో పడి ఫ్రెంచి ప్రభుత్వసభ్యులు ఆర్థిక ఆధిక్యతలను త్యాగము చేయాలని విన్నవించాడు. అయితే ఆయనను బలపరచే బదులు వారు ఆయన కష్టాలను ఆసరాగాతీసుకొని, ఏక చత్రాధిపత్యాన్ని బలహీనపరచి, వారు పోగొట్టుకున్న కొన్ని పదవులను తిరిగి పొందాలని ఆశించారు. “సర్వశ్రేష్టుల పాలన కొరకు రాజు పాలించే ప్రజల ప్రభుత్వము విషయంలో అసంతృప్తి చెంది, వారు సర్వశ్రేష్టులపాలన కొరకు సర్వశ్రేష్టులపాలనే ప్రజల ప్రభుత్వముగా పరిగణించారు,” అని కొలంబియా విశ్వవిద్యాలయ చరిత్ర ప్రొఫెసర్ హెర్మాన్ అనుబెల్ వివరిస్తున్నాడు. ఈ అభిప్రాయమే 1789 ఫ్రెంచ్ తిరుగుబాటుకు నాంది పలికింది.
ఫ్రాన్స్‌లో జరిగిన ఈ సంఘటనలు అనంత ఆశలను రేకెత్తించి, స్వల్పకాల మార్పులను తెచ్చెను. సర్వశ్రేష్టులపాలన ప్రత్యేకాధిక్యతలను పోగొట్టుకుంది, కౌలుదారీ పద్ధతికి కాలం చెల్లిపోయింది, రాజ్యాంగ చట్టముతో సహా, మానవ హక్కుల పత్రమొకటి ఆమోదం పొందింది. అంతేగాక మతాధిపతుల అధికారాలు చట్ట పరిధిలోనికి తేబడినవి.
చివరకు ఉత్తమమైన దానిని కనుగొనుట
‘ఉత్తములు’ వారి పేరుకుతగినట్లు ఎప్పుడూ ప్రవర్తించరనే నగ్నసత్యం ‘ఉత్తములు పాలించే ప్రభుత్వము’ యొక్క గంభీరమైన బలహీనతలను బహిర్గతం చేస్తుంది, అంటే నిజానికి ‘ఆ ఉత్తము’ లెవరు అని నిర్ణయించుటలోనే కష్టం. పాలనార్హతగల ఉత్తములైయుండు అర్హతలను పొందుటకు కేవలం సంపన్నులు, ఉత్తమ వంశావళికి చెందిన వారు, లేక సైనిక వీరత్వము కలవారైయున్నంత మాత్రాన సరిపోదు గాని అంతకంటె అధికం అవసరమైయున్నది.
ఉత్తమ వైద్యులు, వంటవారు, లేక చర్మకారులెవరో గుర్తించుట కష్టమేమి కాదు. మనం సాధారణంగా వారి పనిని లేదా ఉత్పత్తులను గమనిస్తాం. అయితే “ప్రభుత్వము విషయంలో అదిసులభమేమి కాదు,” అని ప్రొఫెసర్ ఫెడరిక్ అంటున్నాడు. ప్రభుత్వమెలా వుండాలి, ఏం చేయాలి అనే విషయంలో ప్రజల అసమ్మతియే అసలు కష్టంగా ఉంది. అంతేగాక ప్రభుత్వ నిర్ణయాలు సదా మారుతూనే వున్నవి. అట్లు, ఫెడరిక్ గారు చెప్పునట్లు, “ఉత్తముడెవరో అనేది అనిశ్చయంగానే వున్నది.”
‘ఉత్తముల పాలన’ నిజంగా ఉత్తమమైనదై వుండాలంటే, మానవాతీత జ్ఞానము గలవాడు, ఎన్నికలో ఏ తప్పు చేయని వ్యక్తి ఆ ఉత్తములను ఎన్నుకోవలసి వుంటుంది. ఎన్నుకొనబడినవారు, అవిచ్ఛిన్న నైతిక యథార్థతను గలవారై, మారని ప్రభుత్వ నిర్ణయాలకు పూర్తిగా వారు అంకితమైన వ్యక్తులై వుండాలి. తమకంటె ఇతరుల క్షేమమే పరమావిధియని నిస్సంకోచముగా భావించువారై వుండాలి.
అటువంటి తరగతినే యెహోవా దేవుడు ఎన్నుకున్నాడని బైబిలు తెలియజేస్తుంది— వారు తన కుమారుడైన యేసుక్రీస్తు మరియు ఆయన నమ్మకమైన అనుచరులలో కొద్దిమంది—ఈ భూమిని వెయ్యేండ్లు పాలించుటకు వారిని నియమించాడు. (లూకా 9:35; 1 థెస్సలొనీకయులకు 2:13, 14; ప్రకటన 20:6) తప్పులు చేసే మానవులవలె గాక, ఏ తప్పుచేయని అమర్థ్య ఆత్మగల ప్రాణులుగా క్రీస్తు మరియు ఆయన తోటి పరిపాలకులు, భూమిని శాంతి సమాధాన భద్రలతో నింపి దీవించి, మానవ జాతిని పరిపూర్ణ దశకు పునరుద్ధరించెదరు. ఏ మానవ ప్రభుత్వమైనా—‘ఉత్తముల ప్రభుత్వముతో సహా—అట్టి దానిని అందించగలదా? (g90 9/8)
[26వ పేజీలోని బాక్సు]
ఆధునిక కులీన ప్రభుత్వము
“కులీన పాలనా స్వభావములు . . . పరిణతిచెందిన ఈ రాజకీయ విధానముల యొక్క గొప్ప అంతర్విభాగ రాజతంత్రములన్నింటిలోను కనుగొనబడియున్నవి. ఆధునిక సమాజము, దాని ప్రభుత్వము యొక్క పెరుగుతున్న సంకీర్ణతయనునది దాని బరువు బాధ్యతలన్నింటిని ప్రజ్ఞావంతులైన అధికారులు, కమిటీల చేతికి గొప్ప అధికార శక్తినని అప్పగిస్తుంది. ఈ అంతర్విభాగ పాలనా నిర్ణయకారులను ఎలా ఉత్తరవాదులుగా చేయాలి, నియమనిబంధనా పద్దతిని తయారు చేయువారి ప్రజ్ఞాశీలత, జ్ఞానవిశిష్టతగల వారికి ముప్పు కలుగకుండ అమోఘంగా వారి శక్తులనెలా పరిమితం చేయాలి అనే ప్రశ్నకు సాంప్రదాయ ప్రభుత్వాలు సహితం పూర్తిగా సంతృప్తికరమైన జవాబునివ్వలేక పోతున్నవి.”—ది న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా.
[25వ పేజీలోని చిత్రం]
అరిస్టోటిల్ నమ్మినదేమనగా సర్వశ్రేష్టుల పాలన మరియు ప్రజాపాలన కలిసి ఉత్తమ ప్రభుత్వమును తయారు చేయును.
[క్రెడిట్ లైను]
National Archaeological Museum, Athens