మానవ పరిపాలన తూకంవేస్తే
భాగం 6: ఇటలీ ఫాసిస్ట్ పార్టీ సభ్యులు మరియు స్వస్తికను ధరించిన సైన్యం
ఫాసిజం: నిరంకుశపాలన, ఆర్థికరంగం రాష్ట్ర అధీనమందుండేది, సామాజిక నియంత్రణ కలది, యుద్ధోన్మాద జాతీయతా ధోరణిగలది; నాసిజం: హిట్లర్ ఆధ్వర్యాన నేషనల్ సోషలిస్ట్ జర్మన్ కార్మికుల పార్టీ పాలించే ఫాసిజం.
“ఫాసిజం” అనే పదం సాధారణంగా నల్లని చొక్కాలు ధరించిన ఇటలీ సైనిక దళములు మరియు స్వస్తిక్ గోధుమ వర్ణ-దుస్తులు ధరించిన జర్మన్ నాజీ సైనిక దళ సభ్యుల చిత్రాలను గుర్తు చేస్తుంది. అయితే ఇతరదేశాలు కూడ ఫాసిజంను రుచిచూచిన అనుభవములు కల్గియున్నవి.
ఫాసిజం 1930వ దశాబ్ద కాలంలో హంగేరీ, రుమేనియా, మరియు జపాను దేశాల్లో ప్రాధాన్యత వహించింది. స్పానిష్ అంతర్యుద్ధంలో ఫాసిజం మద్దతు, స్పెయిన్‌ను ఫ్రాన్సిస్కో ఫ్రాన్కొ స్వాధీనం చేసికొనుటకు సహాయపడింది, అయిననూ ఫ్రాన్కొ నియంతృత్వము (1939-75) నిజమైన ఫాసిజం పాలన కాదు అని చాలమంది చరిత్రకారులు అతని పాలనను ఒప్పుకొనుటలేదు. అయితే మరొకవైపున, జాన్ డి. పెరాన్ (1943-55) స్థాపించిన అర్జెంటీనా నియంతృత్వము ఫాసిజం వంటిదే.
ప్రభుత్వమును ఆరాధించుట
“ఫాసిజం” అనేది ఫాసియో అనే ఇటాలియన్ పదం నుండి వచ్చింది, మరియు ప్రాచీన రోమా అధికార గుర్తును సూచించే దానిని ఇది తెలుపుతుంది. లాటిన్లో ఫాసెస్ అనే మాటతో పిలువబడుతూ, అది అనేక ఇనుప చువ్వలతో కట్టిన కట్టలోనుండి ఒక కత్తిపైకి వచ్చినట్లు కనబడుచున్నగుర్తు, సర్వోన్నత ప్రభుత్వాధికారం క్రిందనున్న ప్రజల ఐక్యతకు సరియైన సూచన.
ఫాసిజం, నికొలొ మాచీయవెల్లి కాలం నాటిదన్నట్లు కొన్ని ఆధారాలున్నప్పటికిని 1919 సంవత్సరమువరకు లేదా ఆయన జననం తర్వాత 450 సం.ల వరకు ఆ పదాన్ని వుపయోగించలేదు. బెనిటొ ముస్సోలిని మొట్టమొదటి సారిగా ఆ పదాన్ని ఉపయోగించారు. మాచియావెల్లి అన్నట్లు అతని కాలములోని రాజకీయ చెడుతనమును ఒక్క నిరంకుశ పాలకుడే, కర్కశ పాలనాధికారాన్ని నెరపుచూ తెలివిగా అధికారాన్ని చెలాయించే వాడే అధికమించగలడు.
ఒక ఫాసిస్ట్ ప్రభుత్వానికి, అది సమర్థవంతంగా వుండాలంటే, అటువంటి బలమైన అవకాశవాది, ఆకర్షణగల నాయకుడవసరం. యుక్తంగా, ముస్సోలినీ మరియు హిట్లర్ వీరిద్దరూ, ఇల్ డ్యూస్ మరియు డెర్ ఫ్యూరర్ అంటే కేవలం నాయకులని తెలుసు.
ఫాసిజం ప్రభుత్వాన్ని ఇతర అన్ని అధికారములకన్న మతపరమైన మరియు సామాజికమైన వాటికంటె మిన్నగా చేస్తుంది. 16వ శతాబ్దపు ఫ్రెంచి న్యాయశాస్త్రప్రవీణుడైన జీన్ బోడిన్, 17వ శతాబ్దపు ఇంగ్లీష్ తత్వశాస్త్రవేత్త థామస్ హాబ్స్ మరియు 18, 19వ శతాబ్దములలోని జర్మనీ తత్వశాస్త్ర వేత్తలైన జోహాన్ గోటిబ్ పిచ్టె, జార్జివిలియెం ఫ్రెడరిక్ హెగెల్ మరియు హెన్రిక్ వోన్ ట్రెశ్చికె అనువారందరు కూడ ప్రభుత్వాన్ని మహిమపరచిరి. హెజెల్, ప్రభుత్వము సర్వాధిపత్యాన్ని వహిస్తుందనియు, వ్యక్తియొక్క అత్యున్నత విధియేమనగా దానికి రాజభక్తిని చూపే మద్దతు దారుడైయుండవలెనని ఉపదేశించాడు.
వాటి సహజత్వమునుబట్టి ప్రభుత్వాలన్ని అధికారాన్ని తప్పక చెలాయించాలి. అయితే ఫాసిస్ట్ ప్రభుత్వాలు, ప్రజలు గుడ్డిగా విధేయులైయుండాలని బలవంత పెడుతూ, సంపూర్ణాధికారాన్ని చెలాయించేవి. మానవులను ప్రభుత్వానికి దాసులవలె పరిగణిస్తూ ట్రెశ్చికే ఇలా అన్నాడు: “నీవు విధేయుడైనంతవరకు నీవేమి తలంచినా ఫర్వాలేదు.” ఫ్రెంచ్ తిరుగుబాటు కాలములో వినబడిన “స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం” అను ప్రజావాణిని ఫాసిజం “నమ్ముటకు, విధేయతచూపుటకు, పోరాడుటకు” అనే ఇటాలియన్ నినాదముతో మార్చివేసింది.
ఫాసిజం యుద్ధాన్ని మహిమపరస్తుంది
యుద్ధానికా? అవును! “యుద్ధంలో తలపడుటకు ధైర్యమున్న ప్రజలపై ఉన్నతులనే ముద్రవేసి, మానవుల సమస్త శక్తులన్నిటిని అత్యున్నత స్థితికి తెచ్చేది యుద్ధమొక్కటే” నని ముస్సోలిని ఒకసారి అంటూ ఇంకను ఇలా చెప్పాడు: “స్త్రీకి మాతృత్వమెంతో పురుషునికి యుద్ధం అంతే.” “శాశ్వత శాంతిని నిరాశాజనకమనియు మానవుని ప్రాథమిక విలువలన్నింటికి వ్యతిరేకం” అని ఆయన పిలిచాడు. ఈ మాటలు పలుకుటలో ముస్సోలినీ ట్రెశ్చెకెయొక్క అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నాడు. అతడు యుద్ధం అవసరమనియు ప్రపంచమునుండి దాన్ని బహిష్కరిస్తే, అది గొప్ప అవినీతి క్రియయేగాక “మానవాత్మయొక్క అత్యవసరమైన ఉన్నతశక్తులను కృశించునట్లు చేయును” అని ఆయన అభిప్రాయపడ్డాడు.
యుద్ధం నియంతృత్వము అను వీటి ఆధారంగా మనం ఆధునిక ఫాసిజం ఫ్రాన్స్ దేశపు నెపోలియన్ కాలంలోనే ప్రారంభమైందని అనేకమంది చరిత్రకారులు వ్రాస్తున్నారని తెలుసుకొనుటలో ఆశ్చర్యపడవేమో. 18వ శతాబ్దపు తొలిభాగంలో నియంతయైన అతడు తాను స్వయంగా ఫాసిస్ట్ కాదు. అయినను అతని అనేక సిద్ధాంతములను రహస్య పోలిస్ వ్యవస్థ, ప్రచారాన్ని నేర్పుతో వినియోగించుట, పత్రికా స్వాతంత్ర్యాన్ని అదుపులో పెట్టు సెన్సార్ వ్యవస్థలను స్థాపించు పద్ధతులవంటివాటిని ఆ తర్వాత ఫాసిస్టులు స్వీకరించారు. మరి ఫ్రాన్స్ కీర్తిని మరలా సంపాదించి పెట్టవలెననే అతని అంకుటిత దీక్ష నిశ్చయంగా జాతి మహోన్నతకు పాటుపడుటలో ప్రసిద్ధిచెందిన ఫాసిస్టు నాయకుల భావానికి ప్రతిరూపమే.
ఇటలీలోని ఫాసిస్టులు 1922 నాటికి ముస్సోలినిని ప్రధానమంత్రిగా నియమించేంత అధికారాన్ని చెలాయించారు, ఆయన ఆ స్థానాన్ని తాను నియంత కావడానికి ఒక ప్రథమమెట్టుగా వుపయోగించుకున్నాడు. జీతభత్యాలు పనిగంటలు ఉత్పత్తిగమ్యముల విషయములోనైతే, ప్రయివేటు వ్యక్తుల అధీనమందున్న పరిశ్రమ ప్రభుత్వముయొక్క గట్టి అదుపులోనికి వచ్చింది. నిజానికి, ప్రయివేటు రంగం ప్రభుత్వ ఆశయాలను నెరవేర్చునంత వరకు మాత్రమే ప్రోత్సహింపబడింది. ఫాసిస్టు తప్పమిగతా రాజకీయపార్టీలు బహిష్కరించబడినవి; కార్మిక సంఘాలు నిషేధించబడినవి, ప్రభుత్వము నైపుణ్యంతో పత్రికలను అదుపులో పెట్టుకున్నది, సెన్సార్షిప్ ద్వారా వ్యతిరేకుల నోళ్లు మూయించినది. యౌవనస్థులకు సిద్ధాంత బోధన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొనబడింది, వ్యక్తి స్వాతంత్ర్యం చాలావరకు తగ్గించబడింది.
జర్మనీ పద్ధతి ఫాసిజం
“అధికారాన్ని హస్తగతం చేసుకొనుటలో వాటి మార్గములు సమకాలికమైనప్పటికిని ఇటాలియన్ ఫాసిజమునకు జర్మనీ నాసిజమునకు స్వభావ ప్రవృత్తిలోను, భవిషత్ దృష్టిలోను గుర్తింపదగిన తేడాలుండెను” అని ఎ. కాసెల్స్ వ్రాసిన ఫాసిజం అను పుస్తకం తెలుపుతుంది.
ఫాసిస్టు ధోరణికి ముంగుర్తుగా పనిచేసిన, ఇంతకుముందే తెలుపబడిన జర్మనీ తత్వశాస్త్రవేత్తలతో పాటు, 19వ శతాబ్దపు జర్మన్ తత్వశాస్త్రవేత్త అయిన ఫ్రెడరిక్ నీట్స్కె వంటి ఇతరులు కూడ విశేషంగా జర్మనీ ఫాసిజంను సృష్టించుటలో సహాయపడిరి. నీట్సికె ఫాసిస్ట్ అని కాదుగాని అతడు ఒక ఉన్నత వర్గపాలకులు, సర్వశ్రేష్టులైన మనుష్యజాతియొక్క పరిపాలకులను నిశ్చయంగా కోరెను. అయిననూ, అలా కోరుటలో ప్రత్యేకంగా ఏజాతి లేక ఏ దేశము ఆయన మనస్సులో లేకుండెను, జర్మనులంటె ఆయనకు విశేషమైన ఇష్టమేమిలేకుండెను కావున ఆయన వారిని సూచించలేదు. అయితే ఆయన అభిప్రాయములలో కొన్ని నిజంగా జర్మన్ సిద్ధాంతములుగా పరిగణించబడే నేషనల్ సోషలిస్టు సిద్ధాంతములకు దగ్గరగా వుండెను. గనుక యీ అభిప్రాయములను వాడుకున్నారు. అయితే నాజీ సిద్ధాంతమును వ్యతిరేకించే వాటిని త్రోసిపుచ్చారు.
హిట్లర్కూడ జర్మన్ స్వరకర్త రిచర్డ్ వాగ్నర్ ద్వారా గట్టిగా ప్రభావితుడయ్యాడు. అతి దేశభక్తి, జాతిభక్తిగల వాగ్నర్, ప్రపంచంలో జర్మనీ ఒక గొప్ప పాత్ర నిర్వహించనైయున్నదని తలంచాడు. “హిట్లర్ మరియు నాజీ సిద్ధాంతములకు వాగ్నర్ పరిపూర్ణ కథానాయకుడైవుండెను” అని ఎన్సైక్లోపిడియా ఆఫ్ ది తర్డ్ రీక్ అంటుంది. అది ఇలా వివరిస్తుంది: “ఆ రచయిత జర్మనీ గొప్పతనాన్ని సంగ్రహించాడు. హిట్లర్ దృష్టిలో వాగ్నర్ యొక్క సంగీతం జర్మనీ దేశీయతను సమర్థించింది.”
విలియం యల్ షైరర్ అను రచయిత ఇంకా అదనంగా తెల్పుచున్నాడు: “అయినను అతని రాజకీయ [వాగ్నరు యొక్క] రచనలు కాదుగానీ అతని ఉన్నత నృత్యనాటికలు ప్రాచీన జర్మనీ యొక్క శౌర్యవంతమైన పురాతన కథలును, దాని అన్యదేవతలు మరియు వీరులు, దాని దయ్యములు ఘటసర్పములు, దాని రక్తసిక్త ప్రతీకారజ్వాలలు మరియు అనాగరికమైన వర్గ వ్యవస్థ నియమాలు, దాని అదృష్టము, ప్రేమ యొక్క తేజస్సు, మరణము యొక్క గొప్పతనము మొదలగునవి ఆధునిక జర్మనీ కల్పితకథలకు జీవంపోసి, జర్మనీ సంబంధమైన లోకదృష్టిని ఇచ్చినవి, దానిని హిట్లర్ మరియు నాజీలు కొంత సమర్థనతో తమ స్వంతం చేసికున్నారు.”
నీట్స్కె మరియు వాగ్నర్ అనువారి ఆలోచనను మలిచిన వ్యక్తి కోమ్టి జోజఫ్ ఆర్తర్ డిగోబినౌ, యితడు ఫ్రెంచ్ దౌత్యవేత్త, మానవ వర్గశాస్త్రజ్ఞుడు, ఆయన 1853 నుండి 1855 మధ్యలో ఎస్యె సర్ లె ఇన్గలిటె డెస్ రేసెస్ హ్యుమెయిన్స్ (మానవ జాతుల అసమానతలపై వ్యాఖ్యానం) వ్రాశాడు. జాతుల రచన భవితవ్యాన్ని నిర్ణయిస్తుందని అతడు వాదించాడు. ఆర్య సమాజముల జాతి లక్షణాన్ని పలుచపరచినచో చివరకు అది వారి అధోగతికి దారితీయవచ్చునని అతడు హెచ్చరించాడు.
ఈ ఉద్దేశ్యములనుండి ఉద్భవించిన జాతివైరుధ్యం, షేము జాతివ్యతిరేక భావమే (యాంటి సెమెటిసమ్) జర్మన్ పద్ధతి ఫాసిజం లక్షణమైంది. ఈ రెండు సిద్ధాంతములు ఇటలీలో తక్కువ ప్రాచుర్యమును సంతరించుకున్నవి. నిజానికి, ఇటలీలో షేము జాతి వ్యతిరేకతా ఆధారములను, ఫాసిజం బలమైన శక్తిగా రూపొందుటకై ముస్సోలిని స్థానాన్ని హిట్లర్ తీసుకుంటున్నాడనే దానికి సూచన యిదేనని అనేకమంది ఇటలీ దేశస్థులు అనుకున్నారు. నిజానికి కాలం గడిచేకొలది ఇటలీ దేశపు ఫాసిజం యొక్క సిద్ధాంతములమీద హిట్లర్ ప్రభావం పెరిగిపోయింది.
జాతిమహోన్నతను సాధించే ప్రయత్నంలో ఇటలీ ఫాసిజం, జర్మన్ ఫాసిజం విభిన్న మార్గాలను వెదకినవి. ఎ. కాసెల్స్ అను రచయిత వివరించినదేమనగా, “ప్రాచీన రోమీయుల క్రియలను ఆదర్శంగా తీసుకొనుడని ముస్సోలిని ఉపదేశించుచుండగా, నాజీ విప్లవం అయితే పూర్వమున్న ట్యూటన్ జాతి బలాఢ్యులు చేసినట్లే చేయుడని ఉసికొల్పుటయేగాక ఇరవయో శతాబ్దంలో తిరిగి పునర్జన్మించిన అదే వర్గముల కథానాయకులవలె ఉండవలెనని జర్మనీయులకు ఉద్బోధించింది.” మరోమాటలో చెప్పాలంటే ఇటలీ దేశాన్ని పారిశ్రామికంగా అట్టడుగు స్థానంనుండి 20 శతాబ్దమునకు లాక్కొని వచ్చి గత వైభవాన్ని తిరిగి సంపాదించి పెట్టాలని ఇటాలియన్ ఫాసిజం ప్రయత్నించింది. అయితే జర్మనీ మాత్రం పూర్వపు పౌరాణికములోనికి వెనక్కివెళ్లి గత వైభవాన్ని మరల పొందాలని ప్రయత్నించింది.
దాన్ని సాధ్యపరచిన దేమిటి
అనేక దేశాలలో విపత్తు సంభవించిన తర్వాత, ఆర్థిక వ్యవస్థ కూలినపుడు లేదా సైనిక ఓటమి తర్వాతనే ఫాసిస్టులు అధికారానికి వచ్చిరి. ఇటలీ, జర్మనీ యీ రెండు దేశాలలో ఇది వాస్తవంగా జరిగింది. మొదటి ప్రపంచయుద్ధ కాలములో వ్యతిరేక పక్షముల వైపున్ననూ, అవి రెండు యుద్ధానంతరం ఎంతో బలహీనపడినవి. జాతీయ అసంతృప్తి, ఆర్థిక అస్థిరత, వర్గపోరాట ఉధృతము రెండుదేశాలను పీడించినవి. జర్మనీలో ద్రవ్యోల్భణం చెయ్యి దాటింది, నిరుద్యోగసమస్య నింగినంటింది. ప్రష్యాదేశపు నిరంకుశత్వ పరంపర ద్వారా ప్రభావితమై ప్రజాస్వామ్య సిద్ధాంతం కూడ చాలా బలహీనపడింది. మరి ఎక్కడ చూచినను రష్యా బోల్షివిజం వస్తుందేమోనన్న భయం పీడించింది.
చార్లెన్డార్విన్ పరిణామ సిద్ధాంతం మరియు ప్రకృతి ఎంపిక సిద్ధాంతం యొక్క తలంపు ఫాసిజం వృద్ధియగుటకు మరొక ప్రాముఖ్యమైన కీలకమైంది. ది కొలంబియా హాస్టరీ ఆఫ్‌ది వర్ల్డ్ అను పుస్తకం, “ముస్సోలిని, హిట్లర్ వీరిద్దరూ వ్యక్తపరచిన ఫాసిస్టుల సిద్ధాంతములలో సాంఘిక డార్వినిజమును తిరిగి మేల్కొలుపుట”ను గూర్చి ప్రస్తావించింది.
ఎన్సైక్లోపీడియా ఆఫ్ ది తర్డ్ రీక్ సాంఘిక డార్వినిజము అనునది “జాతి నిర్మూలనయనే హిట్లర్ రాజవిజేత వెనుకనున్న సిద్ధాంతము” అని వివరిస్తూ యీ అధికారిక అంచనాను అంగీకరిస్తుంది. డార్విన్ పరిణామ సిద్ధాంతబోధలకు అనుగుణంగా, “ఆధునిక దేశం బలహీనులను పరిరక్షించుటకు దాని శక్తిని ధారపోసే బదులు, బలమైన ఆరోగ్యకరమైన వాటికి అనుకూలంగా తక్కువస్థానమందున్న జనాన్ని తిరస్కరించాలని జర్మన్ సిద్ధాంత శాస్త్రవేత్తలు వాదించారు.” యోగ్యులైనవారు తప్పించుకొనుటకు చేసే పోరాటములో యుద్ధం సర్వసాధారణమేనని, “జయం బలవంతులను వరిస్తుంది, బలహీనులను నిర్మూలించవలెను” అని వారు వాదించారు.
గుణపాఠం నేర్చుకున్నారా?
నల్లని చొక్కాలు ధరించిన ఇటలీ సైనిక దళములు మరియు స్వస్తిక్ గోధుమ వర్ణ దుస్తులు ధరించిన జర్మన్ నాజీ సైనిక దళ సభ్యులు ఇక లేరు. అయినను 1990లొ కూడ ఫాసిజంయొక్క గుర్తులున్నవి. రెండు సంవత్సరాల క్రింతం న్యూస్‌వీక్ పత్రిక హెచ్చరించినదేమనగా పశ్చిమ ఐరోపాలోని ప్రతి దేశంలోను “పూర్తిగా రూపుమారని జాతి వైరుధ్యము మరియు జాతీయభావన, నిరంకుశ పాలనా విలువలయెడల అభ్యర్థన ఇంకను ఆశ్చర్యకరమగు మద్దతును పొందగలదని మితవాద శక్తులు మరొకసారి రుజువు చేసుకుంటున్నవి.” నిశ్చయంగా ఈ ఉద్యమాలలో బలీయమైనది ఫ్రాన్స్‌లోని జీన్-మేరి లీపెన్స్ నేషనల్ ఫ్రంట్ ఒకటి, మరి దాని సిద్ధాంతం ముఖ్యంగా నేషనల్ సోషలిజం వంటిదే.”
నూతన ఫాసిజం ఉద్యమాలను నమ్ముట తెలివైనదేనా? ఫాసిజంయొక్క మూలమైన—డార్విన్ పరిణామ సిద్ధాంత జాతివైర్యం, సైనికోద్యమం మరియు జాతీయత అనునవి ప్రభుత్వానికి మంచి పునాది కాగలవా? లేక ఇతర అన్నిరకాల మానవ ప్రభుత్వాలమాదిరే ఫాసిజం త్రాసులో తూచగా తక్కువగా కనబడినదని నీ వంగీకరించవా? (g91 10/22)
[26వ పేజీలోని బాక్సు]
ఫాసిజం—దానిపునాది గట్టిదేనా?
డార్విన్ పరిణామము: “అనేకమంది విజ్ఞాన శాస్త్రజ్ఞులు, మరి ముఖ్యంగా పరిణామ వేత్తలు. . . డార్విన్ పరిణామ సిద్ధాంతం నిజమైన విజ్ఞాన సిద్ధాంతం కానేకాదని వాదిస్తున్నారు.”—న్యూ సైన్టిస్ట్, జూన్ 25, 1981, మైకెల్ రూస్.
జాతి వైరుధ్యం: మానవజాతులు మరియు ప్రజల మధ్యనున్న అగాధం ఎక్కడవుంటుందో అక్కడ అది మానసికమైనది మరియు సాంఘిక సంబంధమైనదేగానీ జన్యుసంబంధమైనది కాదు”—జీన్స్ అండ్ ది మ్యాన్, ప్రొఫెసర్ బెన్ట్లేగ్లాస్.
“అన్నిజాతుల మనుష్యులు . . . ఒకే మొదటి మానవుని నుండి వచ్చియున్నారు.” హెరిడిటరీ అండ్హ్యుమన్, విజ్ఞాన రచయిత అమ్రామ్ షేన్ఫీల్డ్.
యుద్ధోన్మాదము: దీనిమీద, ఈ పిచ్చిమీద వ్యయపరచే నైపుణ్యం, శ్రమ, ధనం నిజంగా మనస్సును మూర్ఛిల్లచేస్తుంది. రాజ్యములు ఇక యుద్ధం నేర్చుకొనుట మానివేస్తే, మానవుడు సాధించలేని దేదీవుండదు.”—అమెరికాదేశపు రచయిత మరియు పులిజర్ బహుమతి గ్రహీత పెర్మెన్ వోక్.
జాతీయవాదం: జాతీయవాదం,మానవజాతిని ఒకరినొకరు సహించలేని ముక్కలుగా చీల్చుతుంది. అందుచేతనే ప్రజలు అమెరికా, రష్యా, చైనా, ఐగుప్తు లేక పెరూ దేశస్థులమని మొదలుపెట్టి, ఆ తరవాతే మానవులమని ఆలోచిస్తారు.”—కాన్ఫ్లిక్ట్ అండ్ ఆపరేషన్స్, ఐఓడూచసెక్.
“ఈనాడు మన మెదుర్కొనే అనేక సమస్యలు తప్పుడు అభిప్రాయముల కారణమే. లేదా ఫలితమే.—వాటిలో కొన్నింటిని దాదాపు అనుకోకుండగనే అలవర్చుకున్నాము. వీటిలో ఒకటేమనగా సంకుచిత ధోరణివున్న జాతీయవాదం, ‘మంచిది గానీ చెడ్డదిగానీ నా దేశం’ అనేభావం”—ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి యుథాంట్.
[25వ పేజీలోని చిత్రాలు]
పురాతన మత సూచకములైన స్వస్తిక, మరియు దేవుడు మాతోవున్నాడు” అనువారి ధ్యేయం హిట్లర్ పరిపాలనను రక్షించలేదు
ముస్సోలినియొక్క పార్టీ గుర్తు అయిన గొడ్డలి కర్రల మోపు కొన్ని అమెరికా నాణెములమీద కనబడుతుంది