మానవ పాలనను తూకం వేస్తే
భాగం 4: “ప్రజలమైన మేము”
ప్రజాస్వామ్యం: ప్రజలు పాలించే ప్రభుత్వం, వారే నేరుగా గానీ, ఎన్నుకొనబడిన ప్రతినిధుల ద్వారాగానీ పాలించునది.
“అమెరికా సంయుక్తరాష్ట్రముల ప్రజలమైన మేము . . . ఈ రాజ్యాంగ చట్టాన్ని ఆమోదించి ముద్రవేస్తున్నాం.” అమెరికా రాజ్యాంగము యొక్క ఈ తొలిపలుకులు యుక్తమైయున్నవి, ఎందుకంటే అమెరికా సంయుక్తరాష్ట్రాలు ప్రజాపాలన క్రిందనే వుండవలెనని దాని జాతిపితలు అభిలషించారు. గ్రీకు మూలం కల్గివున్న పదమైన ఈ “ప్రజాపాలన” అనగా “ప్రజలయొక్క పరిపాలన” లేక అమెరికా సంయుక్త రాష్ట్రాల 16వ దేశాధ్యక్షుడగు అబ్రహాం లింకన్ వర్ణించినట్లు అది “ప్రజలకొరకు ప్రజలచే పాలించబడు ప్రజా ప్రభుత్వము.”
ప్రజాస్వామ్యమునకు పుట్టినిల్లు అని తరచు పిలువబడుచున్న పురాతన గ్రీకు దేశం, సా.శ.పూ. ఐదవ శతాబ్దమునుండి స్వతంత్ర ప్రతిపత్తిగల పట్టణ పాలనను ముఖ్యంగా ఏథెన్సులో ప్రజాస్వామ్య పాలన అమలుపరచినట్లు అతిశయించింది. అయితే ఆనాటి ప్రజాస్వామ్యం ఈనాటివంటిది కాదు. ఒక కారణమేమంటే గ్రీకుపౌరులు పరిపాలనలోనే అధికంగా భాగం వహించేవారు. సభలో సభ్యులైన ప్రతి పురుష పౌరులు తాజాగా వచ్చు సమస్యలను చర్చించుటకై సంవత్సరం పొడవునా సమావేశమయ్యేవారు. సాధారణ మెజారిటీ ఓటుతో ఆ సభ స్వతంత్ర ప్రతిపత్తిగల పట్టణ లేక నగర ప్రభుత్వ రాజకీయాలను నిర్థారించేవారు.
అయిననూ, స్త్రీలు, దాసులు మరియు పరదేశులు రాజకీయ హక్కులు అనుభవించకుండ మినహాయించేవారు. ఆ విధంగా, ఏథెన్సు ప్రజాస్వామ్యం, కొద్దిమంది హక్కుగల వారికొరకు ప్రజాస్వామ్య రూపంలోవున్న సర్వశ్రేష్టుల పాలనయైయుండెను. జనాబాలో సగం నుండి ఐదింట నాలుగు వంతులమంది బహుశ రాజకీయ విషయాలలో అసలు నోరుమెదిపేవారు కాదు.
అయిననూ, ఈ ఏర్పాటు వాక్‌స్వాతంత్ర్యమును వృద్ధిపరచింది, ఎందుకంటే విధి నిర్ణయాలు తీసుకొనక ముందు పౌరులు వారి అభిప్రాయాలను వ్యక్తపరచే హక్కును పొందారు. రాజకీయ పదవి కొద్దిమంది ఉన్నతవర్గీయులకే పరిమితం చేయకుండా ప్రతి పురుషపౌరునికి అవకాశమియ్యబడింది. వ్యక్తులుగానీ గుంపులుగానీ రాజకీయ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండ హద్దుల పద్ధతినొకదానిని కల్పించారు.
“ఏథెనీయులు వారి ప్రజాస్వామ్యమంటే గర్వించేవారు, అది సంపూర్ణ నిండుజీవితానికి, ఏకచత్రాధిపత్యం లేక సర్వశ్రేష్టపాలనవంటి మారు ప్రభుత్వాలకంటే ఒక్కడుగు దగ్గరేనని వారు నమ్మినట్లు” చరిత్రకారుడైన డి.టి. హీటర్ తెల్పుచున్నాడు. ప్రజాస్వామ్యం నిజంగా శ్రేష్టమైన ఆరంభంతోనే ప్రారంభమైంది.
ప్రజాస్వామ్యం శైశవ దశనుండి ఉన్నతస్థాయికి పెరిగింది
యు.యస్.ఎ. లోని న్యూ ఇంగ్లాండు ప్రాంతంలోని కొద్దిపాటి పట్టణసభలు మరియు స్విట్జర్లాండ్‌లోని కొన్ని తాలుకాలలో కొంచెంవరకు జరిగిన పాలన తప్ప నేరుగా గానీ పూర్తిగాకానీ ఒక ప్రజాస్వామ్యమనేది ఉనికిలో లేదు. ఇప్పుడున్న ఆధునిక రాష్ట్రాల, విస్తీర్ణం, వాటి లక్షలాది పౌరులను పరిశీలిస్తే ఈ విధంగా పరిపాలించుట సాంకేతికంగా అసాధ్యమే. అంతేగాక, తీరికలేని ఈనాటి లోకప్రజలలో ఎంతమంది గంటల తరబడి రాజకీయ చర్చకు అవసరమైన సమయాన్ని వినియోగించగలరు?
ప్రజాస్వామ్యం ఒక విధమైన వివాదాంశముగా తయారయింది—అనేక ముఖములున్న దానిగా ఎదిగింది. ఇది టైమ్ పత్రిక వివరించినట్లుంది: “ప్రపంచాన్ని ప్రజాస్వామ్యం, అప్రజాస్వామ్యం అని విభాగించి స్పష్టంగా విడదీయడం అసాధ్యం. నియంతృత్వములలో వివిధరకాల అణగద్రొక్కే పద్ధతులున్నట్లే, ప్రజాస్వామ్యమని పిలువబడేవాటిలో వ్యక్తి స్వాతంత్ర్యం, బహుళత్వం మరియు మానవ హక్కుల విషయంలో హెచ్చుతగ్గులున్నవి.” అయిననూ, ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో వ్యక్తిగత స్వాతంత్ర్యం, సమానత్వం, మానవహక్కుల యెడల గౌరవం మరియు చట్టరీత్యా న్యాయం మొదలయిన కొన్ని సాధారణ అవసరములుండవలెనని అనేకమంది ప్రజలు కోరుకుంటారు.
నిన్నటి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, ఈనాటి ప్రతినిధుల ప్రజాస్వామ్యంగా మారింది. శాసనసభా సభ్యులు, అంటే ఒక సభను కల్గియుండి, లేక బహుసభ అంటే రెండు సభలను కల్గివుండి, ప్రజలచేత ఎన్నుకొనబడిన—లేదా పేర్కొనబడిన వ్యక్తులే—వీరు ప్రజల ప్రయోజనార్థమన్నట్లు వారికొరకు చట్టములను ఏర్పాటు చేస్తూ వారికి ప్రతినిధులై వుంటారు.
ఈ ప్రతినిధులు ప్రజాస్వామ్యమువైపు మొగ్గుచూపుట మధ్యయుగాలలో ప్రారంభమైంది. 17 మరియు 18 శతాబ్దములనాటికి, 13వ శతాబ్దములోని సంస్థలు, అంటే సమానత్వము, సహజహక్కులు, ప్రజల సర్వాధిపత్యము వంటి రాజకీయ సిద్ధాంతములలో మాగ్నా చార్టా మరియు ఇంగ్లాండు నందలి పార్లమెంటు మొదలయినవి అధిక అర్థము నిచ్చేవిగా తయారయినవి.
పద్దెనిమిదవ శతాబ్దపు రెండవ భాగానికల్ల “ప్రజాస్వామ్యము” అనుమాటను కొంతవరకు నాస్తికభావంతో చూచినను అది సాధారణ వాడుకగా తయారయింది. న్యూ ఎన్‌సైక్లోపిడియా బ్రిటానికా ఇలా అంటుంది: “1787 సంవత్సరములో అమెరికా సంయుక్తరాష్ట్రముల రాజ్యాంగ చట్ట నిర్మాతలు సహితం రాజకీయాలలో ఎక్కువమంది పాల్గొనే విషయంలో అయిష్టంగా ఉండిరి. వారిలో ఒకరైన ఎల్‌బ్రిడ్జి జెర్రి ప్రజాస్వామ్యమును ‘అన్ని చెడు రాజకీయాలకంటె నికృష్టమైనదని’ అన్నాడు”. అది అలాగుండగా, ఆంగ్లేయుడైన జాన్ లాకీవంటి పురుషులు వాదించినదేమంటే పవిత్రములైన సహజ హక్కులు కల్గియున్న ప్రజల ఇష్టం మీదనే ప్రభుత్వం ఆధారపడియున్నది.
రిపబ్లిక్స్
అనేక ప్రజాస్వామ్యములు రిపబ్లిక్సే అంటే ఏకచత్రాధిపతి కాకుండ, సాధారణంగా ఇప్పుడున్న ఒక అధ్యక్షుని దేశాధినేతగావున్న ప్రభుత్వములు. ప్రపంచములో మొట్టమొదటి రిపబ్లిక్ ప్రభుత్వము పురాతన రోజులలో ఉండేది, దాని ప్రజాస్వామ్యం చాలావరకు పరిమితమై యుండెననుకోండి. అయిననూ, కొంతవరకే ప్రజాస్వామ్యముగా వున్న ఆ రిపబ్లిక్ ప్రభుత్వము 400 సంవత్సరములు నిలిచిన తర్వాతనే అది ఏకఛత్రాధిపత్యమునకు, రోమా సామ్రాజ్య స్థాపనకు మార్గమేర్పరచింది.
రిపబ్లిక్ ప్రభుత్వాలు ఈనాడు అతి సాధారణంగా కనబడే ప్రభుత్వాలు. 1989 సంవత్సరంనాటి లెక్కల ప్రకారం ఉన్న 219 ప్రభుత్వములు మరియు అంతర్జాతీయ సంస్థలలో 127 రిపబ్లిక్స్‌గా పేర్కొనబడినవి, వీటిలో అన్నీ ప్రతినిధులుగల ప్రజాస్వామ్యం కాదు. నిజానికి ఈ రిపబ్లిక్స్ యొక్క ప్రభుత్వ స్వరూపాల క్రమం విశాలంగా ఉన్నది.
బలమైన కొన్ని రిపబ్లిక్స్ ఏకాధికార పద్ధతులు కల్గివున్నవి, అనగా బలమైన ఒకే కేంద్ర ప్రభుత్వము ద్వారా పాలించుట అని అర్థం. మరికొన్ని ఫెడరల్ పద్ధతులుగలవి అంటే ప్రభుత్వము రెండు స్థాయిలలో అధికారకేంద్రీకరణ కల్గివుంటుంది. ఆ పేరు తెలియజేయురీతిగా అమెరికా సంయుక్తరాష్ట్రములలో ఈ ఫెడరల్ పద్ధతిగల ప్రభుత్వము వున్నది. జాతీయ ప్రభుత్వము మొత్తంగా దేశ అవసరాలను చూస్తుంది. అటు రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక అవసరాలను చూస్తున్నవి. నిజమే ఈ విశాలభావమున్న పదజాలములో అనేక రకాల తేడాలున్నవి.
కొన్ని రిపబ్లిక్స్ స్వేచ్ఛాయుత ఎన్నికలను నిర్వహిస్తున్నవి. ఆ దేశపౌరులు తగిన వారిని ఎన్నుకొనునట్లు వివిధ రాజకీయ పార్టీలను, అభ్యర్థులను ఏర్పాటు చేస్తున్నవి. ఇతర రిపబ్లిక్స్ అయితే స్వేచ్ఛాయుత ఎన్నికలు అనవసరమని, ప్రజల ప్రజాస్వామ్య అభీష్టాన్ని ఇతర మార్గాలద్వారా అనగా ఉత్పత్తి యొక్క సమిష్టి యాజమాన్యమును అభివృద్ధి చేయుటవంటి క్రియలద్వారా తీర్చవచ్చునని వాదిస్తున్నవి. దీనికి నాంది పురాతన గ్రీకుదేశమే, ఎందుకంటే అక్కడకూడ స్వేచ్ఛాయుత ఎన్నికలు అంటే వారికి తెలియదు. పరిపాలకులను చీటి ద్వారా ఎన్నుకొనేవారు మరియు ఒకటి లేక రెండు సంవత్సరములపాటు మాత్రమే వారిని ఆస్థానములో ఉండనిచ్చేవారు. అరిస్టోటిల్ ఎన్నికలకు బద్ధవిరోధి, అది “ఉత్తములను” ఎన్నుకొనుటకు సర్వశ్రేష్టుల పద్ధతిని ప్రవేశపెట్టిందని అనేవాడు. అయిననూ, ప్రజాస్వామ్యం ప్రజలందరి ప్రభుత్వమే గానీ, “సర్వశ్రేష్టులది” మాత్రమేకాదు.
పోల్చితేనే ఉత్తమమైనదా?
పురాతన ఏథెన్సులో కూడా ప్రజాపాలన వివాదాంశమైంది. ప్లేటో సంశయవాది. ప్రజాపాలన బలహీనమైనదిగా పరిగణించబడేది ఎందుకంటే ప్రసిద్ధికెక్కిన ప్రజానాయకుల ఆవేశపూరిత మాటలను బట్టి ఊరకనే మోసపోయే అమాయకులైన వ్యక్తుల చేతిలో అధికారం ఉండెను. సోక్రటీస్, ప్రజాస్వామ్యమును పెద్దగుంపు పరిపాలన కంటె ఎక్కువేమీకాదు అని భావించాడు. మరి పురాతనగ్రీకు తత్వవేత్తలలోని ముగ్గురు ప్రముఖులలో మూడవవాడైన అరిస్టోటిల్ ఇలా వాదించాడని ఎ హిస్టరీ ఆఫ్ పొలిటికల్ థియొరీ అనే పుస్తకం తెల్పుచున్నది, “ఒక ప్రజాస్వామ్యం మరీ ప్రజాస్వామ్యంగా మారితే అదొక పెద్దగుంపు పరిపాలనవైపు మొగ్గి నిరంకుశ పరిపాలనకు దిగజారును[చున్నది].”
అటువంటి సందేహాన్ని ఇతరులును వ్యక్తపరిచారు. ఇండియా మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యం మంచిదే అన్నాడు గానీ తర్వాత ఆయన దానికి తగిన మాటలను జతచేశాడు: “నేనిలా ఎందుకంటున్నానంటే ఇతర పరిపాలనలు ఇంతకంటే హీనమైనవి.” ఆంగ్లేయుడు, క్రైస్తవమతాధిపతి, రచయిత అయిన విలియం రాల్ఫ్ ఇంజె ఒక సారి ఇలా వ్రాశారు: “ప్రజాస్వామ్యం, హేతుబద్ధంగా సమర్థించగలిగే ఒక విధమైన ప్రభుత్వమే, అది మంచిదని కాదుగానీ ఏ ఇతర ప్రభుత్వముకన్నా తక్కువ చెడునే కల్గివున్నదని చెప్పవచ్చును.”
ప్రజాస్వామ్యమునకు అనేక బలహీనతలున్నవి. మొదటిగా, అది విజయం సాధించాలంటే దాని సభ్యులు తమస్వంత ఇష్టంకంటె అనేకమంది క్షేమానికి ప్రధమస్థానమివ్వడానికి ఇష్టపడాలి. దీని అర్థమేమనగా వారు స్వయంగా అంగీకరించనివి కానీ మొత్తంమీద దేశప్రయోజనానికి అవసరమైన పనుల విషయంలోను లేక ఇతర శాసనముల విషయంలోను మద్దతునిస్తుండాలి. అటువంటి నిస్వార్థపరధోరణి ప్రజాస్వామ్య “క్రైస్తవ” రాజ్యాలలో సహితం కానరాదు.
మరో బలహీనతను ప్లేటో కనిపెట్టాడు. ఎ హిస్టరీ ఆఫ్ పొలిటికల్ థియొరీ ప్రకారం ఆయన “ప్రజాస్వామ్యముల యొక్క ప్రత్యేక శాపము అయిన రాజకీయనాయకుల అమాయకత్వము మరియు అసమర్థతను విమర్శించాడు. వృత్తిపరంగా రాజకీయ నాయకులైనవారు, ప్రభుత్వములో పరిపాలనాధ్యక్షతగల అర్హులైన వ్యక్తులను కనుగొనుటకు కష్టమౌతుందని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నుకోబడిన అధికారులు సహితం రాజకీయ రుచిగలవాని కంటె కొంచెం మెరుగై యుండవచ్చును. మరి ఈ దూరదర్శిని యుగంలో ఒక అభ్యర్థి మంచి అందం లేక ఆకర్షణ అతనికి ఓట్లను సంపాదించిపెట్ట వచ్చునేమోగానీ అతని పరిపాలనా సామర్థ్యములతనికి అలా సంపాదించలేవు.
ప్రజాస్వామ్యములకున్న మరొక స్పష్టమైన అననుకూలత ఏమంటే అవి మెల్లిగా నడిచేవి. ఒక నియంత మాట్లాడి పనులు జరిగేటట్లు చేస్తాడు! ప్రజాస్వామ్యములో అంతూపంతూ లేని చర్చలమూలంగా అభివృద్ధి కుంటుబడుతుంది. నిజమే, వివాదాంశములను క్షుణ్ణంగా చర్చించుటవలన నిర్ధిష్ట ప్రయోజనాలున్నవి. అయిననూ, బ్రిటన్ మాజీ ప్రధాని క్లెమెంట్ ఆట్లీ ఓసారి ఇలా అన్నాడు: “ప్రజాస్వామ్యం అంటే చర్చతో కూడిన ప్రభుత్వమేగానీ ప్రజలు మాట్లాడకుండ ఆపగలిగితేనే దానివలన ప్రయోజనం ఉంటుంది.”
మాటలను ఆపగలిగిన తర్వాత కూడ, చేసిన తీర్మానములను ఎంతవరకు నిజంగా “ప్రజలు” కోరినట్లు అమలుపరచుచున్నారనేది చర్చనీయాంశమే. ప్రజాప్రతినిధులు వారి నియోజకవర్గాలలోని అనేకుల అభీష్టాన్ని నెరవేర్చుచున్నారా లేదా తరచుగా వారి స్వంత కోరికలను తీర్చుకుంటున్నారా? లేక వారి అధికార పార్టీ యొక్క నియమావళిని ఊరకనే అచ్చుగుద్దుతున్నారా?
ప్రజాపాలనా నియమం ప్రకారం లంచగొండితనాన్ని కనిపెట్టి అదుపుచేయాలనే పద్ధతి కల్గియుండుట ఉత్తమమైన ఉద్దేశముగానే భావించబడుచున్నది, గానీ అది అరుదుగా సఫలమౌతుంది. 1989లో టైం పత్రిక “అన్ని రంగాల్లో ప్రభుత్వము క్షీణించిందని” అంటూ, ఒక ప్రసిద్ధిచెందిన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని “బలిసిన, అసమర్థమైన, నిస్సహాయమైన పెద్ద ఆకారమని” దుయ్యబట్టింది. మరో ప్రభుత్వములోని దుర్వయమును గూర్చి అన్వేషించుటకు 1980 దశాబ్దపు మధ్యకాలంలో నియమించబడిన పరిశోధకుల బృందం ఛైర్మన్ ఇలా విలపించాడు: “ప్రభుత్వము ఘోరంగా నడుస్తోంది.”
ఇవి మరి ఇతర అనేక కారణములను బట్టి ప్రజాస్వామ్యములను ఉత్తమ ప్రభుత్వములని పిలుచుట కష్టమే. అసలు సత్యమేమిటంటే, 17వ శతాబ్దపు ఇంగ్లీషు కవి జాన్ డ్రైడెన్ సూచించినట్లు “కొద్దిమంది చేసినట్లే అత్యధికమంది తప్పుచేయవచ్చు.” అమెరికా రచయిత హెన్రీ మిల్లర్, నిర్మొహమాటముగా అయినప్పటికి ఖచ్చితంగా ఇలా చురక వేశాడు: “గ్రుడ్డివాడు గుడ్డివాన్ని నడిపినట్లే వుంది. అదే ప్రజాస్వామ్య పద్ధతి.”
దాని సమాధిలోనికేనా?
ప్రజాపాలన ముందటికంటే ఈ శతాబ్దములోనే ఎక్కువ మద్దతు సంపాదించింది. ఇటీవలి తూర్పు ఐరోపాలో జరిగిన మార్పులు దీన్ని ధృవపరస్తున్నవి. అయిననూ, “ప్రపంచంలో స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం ఇప్పుడు తీవ్ర ప్రమాదానికి గురియౌతున్నదని” కొన్ని సంవత్సరాల క్రితం జేమ్స్ రెస్టన్ అనే విలేఖరి రాశాడు. “స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం ఒక అభ్యుదయ సిద్ధాంతం కాదు” మరియు “ప్రజాస్వామ్యములు అంతరించేటట్లు కనబడుచున్నవి” అని డానియల్ మోనిహాన్ హెచ్చరించాడు. బ్రిటిష్ చరిత్రకారుడైన అలెగ్జాండర్ టేలర్ చెప్పిన దేమంటే ప్రజాప్రభుత్వం చిరకాలం మనుగడ సాగించలేదు. ఎందుకంటే “అది పటుత్వంలేని సిద్ధాంతం మీద ఎప్పుడూ కూలిపోతూవుంటుంది.” అతని అభిప్రాయం వివాదాంశమేననుకోండి.
ఏమైననూ, ప్రజాస్వామ్యం అనేది మానవులు దేవుని పద్ధతి ప్రకారం కాకుండా తమస్వంత ఇష్టప్రకారమే చేయవలెనని తీర్మానించుకున్న ఏదెనులో ప్రారంభమైన పరిస్థితిలోని స్పష్టమైన భాగముగానే కొనసాగుతున్న పాలనయైయున్నది. మానవ పరిపాలనలో అది అత్యుత్తమ పాలన, ఎందుకంటే అది పరిపాలనా దృష్ట్యా, కనీసం సిద్ధాంత రీత్యానైనా అందరిని చేరుతుంది. అయితే లాటిన్ సామెత వోక్స్ పోపులి, వోక్స్ డై, “ప్రజలవాక్కే దేవుని వాక్కు” అనేది అసత్యం. అట్లు, ప్రజాస్వామ్య మానవ పాలనను సమర్థించే వారు దాని క్రియలకు బాధ్యత వహించుట కిష్టపడవలెను.—1 తిమోతి 5:22తో పోల్చుము.
ఈ వాస్తవం, 1914వ సంవత్సరమునుండి ఇంకా అధిక గంభీరతను సంతరించుకున్నది. ఆ ప్రాముఖ్యమైన సంవత్సరములో దైవపరిపాలన ఒక ప్రత్యేక పద్ధతిలో పాలించుటకు క్రియారూపం దాల్చింది. దేవుని మెస్సియా రాజ్యము ఇప్పుడు ప్రపంచ విషయాలను సంపూర్ణంగా స్వాధీనం చేసుకోనైయున్నది. అన్నిరకాల మానవ పాలనలు—ప్రజాస్వామ్య పరిపాలనాపద్ధతులతో సహా త్రాసులో తూకం వేయబడుచున్నవి. మనం వాటిని గూర్చి వ్యక్తిగతంగా ప్రకటించే దాన్నిబట్టి మనం వాటితో పాటు తూకం వేయబడుచున్నాము.—దానియేలు 2:44; ప్రకటన 19:11-21. (g90 9/22)
[22వ పేజీలోని బాక్సు]
“తమ మార్గము నేర్పరచుకొనుట నరుని వశములో లేదు.”—యిర్మీయా 10:23.
[25వ పేజీలోని బాక్సు]
“ఒక మనుష్యుని ఎదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు దారితీయును.”—సామెతలు 14:12 “న్యూ ఇంటర్నేషనల్ వర్షన్.”
[24వ పేజీలోని చిత్రం]
ప్రజాస్వామ్య మానవ పాలనను సమర్థించేవారు దాని క్రియలకు బాధ్యత వహించుట కిష్టపడవలెను.
[Picture Credit Line on page 22]
U.S. National Archives photo