జెకర్యా
10 “కడవరి వాన* కోసం యెహోవాను వేడుకోండి.
కారుమబ్బులు కమ్ముకునేలా చేసేది యెహోవాయే,
ప్రజల కోసం వర్షాలు కురిపించేది ఆయనే,+
ప్రతీ ఒక్కరి కోసం పొలాల్లో పంట పండేలా చేసేది ఆయనే.
2 గృహదేవతలు మోసపూరితంగా* మాట్లాడాయి;
సోదె చెప్పేవాళ్లు బూటకపు దర్శనాలు చూశారు.
వాళ్లు వ్యర్థమైన కలల గురించి మాట్లాడతారు,
ఓదార్చడానికి వాళ్లు చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థమే.
అందుకే ప్రజలు గొర్రెల్లా అటూఇటూ తిరుగుతారు.
కాపరి లేకపోవడం వల్ల బాధపడతారు.
3 కాపరుల మీద నా కోపం రగులుకుంటుంది,
అణచివేసే నాయకుల్ని* నేను లెక్క అడుగుతాను;
ఎందుకంటే, సైన్యాలకు అధిపతైన యెహోవా తన మంద అయిన యూదా ఇంటివాళ్ల మీద దృష్టి పెట్టాడు,+
ఆయన వాళ్లను యుద్ధంలోని తన రాచగుర్రంలా చేశాడు.
4 అతని* నుండి ప్రధానుడు* వస్తాడు,
అతని నుండి మద్దతిచ్చే పరిపాలకుడు* వస్తాడు,
అతని నుండి యుద్ధపు విల్లు వస్తుంది;
ప్రతీ పర్యవేక్షకుడు అతని నుండే వస్తాడు, వాళ్లంతా కలిసి బయల్దేరతారు.
5 వాళ్లు యోధుల్లా అవుతారు,
యుద్ధంలో వీధుల బురద తొక్కుకుంటూ వెళ్తారు.
6 నేను యూదా ఇంటివాళ్లను బలశాలుల్ని చేస్తాను,
యోసేపు ఇంటివాళ్లను కాపాడతాను.+
వాళ్లను ఒకప్పటి స్థితికి తీసుకొస్తాను,
ఎందుకంటే నేను వాళ్లమీద కరుణ చూపిస్తాను;+
వాళ్లు, నేను అసలెన్నడూ వెళ్లగొట్టని ప్రజల్లా తయారౌతారు.+
నేను వాళ్ల దేవుడైన యెహోవాను, నేను వాళ్ల ప్రార్థనలకు జవాబిస్తాను.
7 ఎఫ్రాయిము వాళ్లు బలమైన యోధుల్లా అవుతారు,
ద్రాక్షారసం తాగినట్టు వాళ్ల హృదయం సంతోషిస్తుంది.+
వాళ్ల కుమారులు దీన్ని చూసి సంతోషిస్తారు;
యెహోవాను బట్టి వాళ్ల హృదయాలు సంతోషిస్తాయి.+
8 ‘నేను ఈల వేసి వాళ్లందర్నీ ఒక్కచోటికి తెస్తాను;
నేను వాళ్లను విడిపిస్తాను,+ వాళ్లు ఎక్కువమంది అవుతారు,
వాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది.
9 నేను వాళ్లను ప్రజల మధ్య విత్తనాల్లా వెదజల్లినా,
సుదూర దేశాల్లో వాళ్లు నన్ను గుర్తుచేసుకుంటారు;
వాళ్లు, వాళ్ల కుమారులు బలం పుంజుకుని తిరిగొస్తారు.
10 నేను వాళ్లను ఐగుప్తు* దేశం నుండి వెనక్కి తీసుకొస్తాను,
అష్షూరు నుండి పోగుచేస్తాను;+
వాళ్లందరికీ సరిపడా స్థలం ఉండకపోవడం వల్ల+
నేను వాళ్లను గిలాదు దేశానికి, లెబానోను దేశానికి తీసుకొస్తాను.+
11 సముద్రం వాళ్ల దారిని అడ్డగించినప్పుడు,
నేను దాని గుండా వెళ్లి దాని అలల్ని చెదరగొడతాను;+
నైలు నది వాళ్లకు అడ్డు వచ్చినప్పుడు, నేను దాని నీళ్లన్నిటినీ ఆరిపోజేస్తాను.
అష్షూరు పొగరు అణచివేయబడుతుంది,
ఐగుప్తు రాజదండం తీసేయబడుతుంది.+