తీతు
2 నువ్వైతే మంచి* బోధకు అనుగుణంగా ఉన్నవాటినే బోధిస్తూ ఉండు. 2 వృద్ధ పురుషులు తమ అలవాట్ల విషయంలో మితంగా ఉండాలి; పరిణతి, మంచి వివేచన కలిగి ఉండాలి; విశ్వాసం, ప్రేమ, సహనం విషయంలో దృఢంగా ఉండాలి. 3 అలాగే వృద్ధ మహిళలు భయభక్తులతో నడుచుకోవాలి, లేనిపోనివి కల్పించి చెప్పే స్వభావం వాళ్లకు ఉండకూడదు, వాళ్లు మద్యానికి బానిసలు కాకూడదు, వాళ్లు మంచి విషయాలు బోధించాలి. 4 వాళ్లు అలా ఉంటే భర్తల్ని, పిల్లల్ని ప్రేమించమని తమకన్నా చిన్నవయసు స్త్రీలకు సలహా ఇవ్వగలుగుతారు.* 5 అంతేకాదు మంచి వివేచనతో మెలగాలని, పవిత్రంగా ఉండాలని, చక్కగా ఇంట్లో పనులు చేసుకోవాలని,* మంచి ప్రవర్తన కలిగి ఉండాలని, భర్తలకు లోబడివుండాలని కూడా సలహా ఇవ్వగలుగుతారు. అప్పుడు దేవుని వాక్యం గురించి చెడుగా మాట్లాడే అవకాశం ఎవ్వరికీ ఉండదు.
6 అలాగే, మంచి వివేచన కలిగివుండమని యువకులను గట్టిగా ప్రోత్సహిస్తూ ఉండు. 7 నువ్వు అన్ని విషయాల్లో మంచి పనులకు ఆదర్శంగా ఉంటూ అలా చెయ్యి. పట్టుదలతో స్వచ్ఛమైన విషయాల్ని బోధించు.* 8 బోధించేటప్పుడు విమర్శించే అవకాశం ఎవ్వరికీ ఇవ్వకుండా మంచి మాటలు ఉపయోగించు. అప్పుడు మన గురించి చెడుగా* మాట్లాడే అవకాశం దొరకక వ్యతిరేకులు సిగ్గుపడతారు. 9 దాసులు అన్ని విషయాల్లో తమ యజమానులకు లోబడివుండాలి, వాళ్లను సంతోషపెట్టడానికి ప్రయత్నించాలి; వాళ్ల గురించి వాళ్ల వెనకాల మాట్లాడకూడదు, 10 వాళ్లవేవీ దొంగిలించకూడదు; మంచి నమ్మకస్థులుగా ఉండాలి. అలా దాసులు, అన్నివిధాలా మనల్ని రక్షించే మన దేవుని బోధకు వన్నె తెస్తారు.
11 ఎందుకంటే అన్నిరకాల ప్రజల రక్షణకు కారణమైన దేవుని అపారదయ వెల్లడైంది. 12 మనం ప్రస్తుత వ్యవస్థలో* భక్తిలేని ప్రవర్తనకు దూరంగా ఉండేలా, లోకంలోని చెడు కోరికలను తిరస్కరించేలా, మంచి వివేచనతో, నీతితో, దేవుని మీద భక్తితో జీవించేలా ఆ అపారదయ మనకు శిక్షణ ఇస్తుంది. 13 మన అద్భుత నిరీక్షణ నిజమవ్వాలని, మహాదేవుని మహిమను, మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమను చూడాలని మనం ఎదురుచూస్తుండగా దేవుని అపారదయ మనకు ఆ శిక్షణ ఇస్తుంది. 14 మనం తనకు ప్రత్యేక సొత్తు అయ్యేలా, మంచి పనులంటే ఉత్సాహం చూపించే ప్రజలుగా ఉండేలా మనల్ని అన్నిరకాల చెడుతనం నుండి విడిపించడానికి,* శుద్ధి చేయడానికి యేసుక్రీస్తు తనను తాను అర్పించుకున్నాడు.
15 నువ్వు పూర్తి అధికారంతో ఈ విషయాలు మాట్లాడుతూ, ఉపదేశిస్తూ,* మందలిస్తూ ఉండు. నిన్ను చిన్నచూపు చూసే అవకాశం ఎవ్వరికీ ఇవ్వకు.