తీతు
1 దేవుని దాసుడు, యేసుక్రీస్తు అపొస్తలుడు అయిన పౌలు రాస్తున్న ఉత్తరం. నా విశ్వాసం, అపొస్తలుడిగా నేను చేస్తున్న సేవ దేవుడు ఎంచుకున్నవాళ్ల విశ్వాసానికి, సత్యం గురించిన సరైన జ్ఞానానికి అనుగుణంగా ఉన్నాయి; ఈ సత్యం దైవభక్తికి అనుగుణమైనది. 2 ఇది శాశ్వత జీవితమనే నిరీక్షణమీద ఆధారపడివుంది. ఆ జీవితాన్ని అబద్ధమాడలేని దేవుడు ఎంతోకాలం క్రితమే వాగ్దానం చేశాడు; 3 కానీ ఆయన అనుకున్న సమయంలో తన వాక్యాన్ని ప్రకటనా పని ద్వారా తెలియజేశాడు. మనల్ని రక్షించే మన దేవుని ఆజ్ఞమేరకు ప్రకటించే ఆ బాధ్యత నాకు అప్పగించబడింది. 4 తోటి విశ్వాసివైన తీతూ, నిజమైన కుమారుడా,
తండ్రైన దేవుడు, మన రక్షకుడైన క్రీస్తుయేసు నీకు అపారదయను, శాంతిని ప్రసాదించాలి.
5 నువ్వు లోపాలున్న* విషయాల్ని సరిచేయాలని, ఒక్కో నగరానికీ వెళ్తూ నేను ఇచ్చిన సూచనల ప్రకారం పెద్దలను నియమించాలని నిన్ను క్రేతులో ఉంచి వచ్చాను. 6 ఒక సోదరుణ్ణి పెద్దగా నియమించాలంటే అతనిమీద ఏ నిందా ఉండకూడదు. అతనికి ఒకే భార్య ఉండాలి. అతని పిల్లలు విశ్వాసులై ఉండాలి, ఆ పిల్లలకు చెడు తిరుగుళ్లు తిరుగుతారనే* లేదా తిరగబడేవాళ్లనే చెడ్డపేరు ఉండకూడదు. 7 పర్యవేక్షకుడు దేవుని సంఘాన్ని చూసుకునే వ్యక్తి కాబట్టి అతని మీద నిందలు ఉండకూడదు; అతను అహంకారి గానీ, కోపిష్ఠి గానీ, తాగుబోతు గానీ, ఇతరుల్ని కొట్టేవాడు గానీ, అక్రమ లాభాన్ని ఆశించేవాడు గానీ అయ్యుండకూడదు. 8 అయితే అతను ఆతిథ్యమిచ్చేవాడు, మంచితనాన్ని ప్రేమించేవాడు, మంచి వివేచనగలవాడు,* నీతిమంతుడు, దేవునికి నమ్మకంగా ఉండేవాడు, నిగ్రహంగలవాడు అయ్యుండాలి. 9 అంతేకాదు అతను బోధించేటప్పుడు* నమ్మదగిన వాక్యానికి* స్థిరంగా కట్టుబడి ఉండాలి. అలా అతను మంచి* బోధతో ఇతరుల్ని ప్రోత్సహించగలుగుతాడు,* ఆ బోధను వ్యతిరేకించేవాళ్లను మందలించగలుగుతాడు.
10 తిరుగుబాటు చేసేవాళ్లు, పనికిరాని మాటలు మాట్లాడేవాళ్లు, మోసగాళ్ళు, ముఖ్యంగా ఇప్పటికీ సున్నతి ఆచారాన్ని పట్టుకు వేలాడేవాళ్లు చాలామంది ఉన్నారు. 11 అక్రమలాభం కోసం వీళ్లు బోధించకూడని విషయాల్ని బోధిస్తూ కొన్ని కుటుంబాల్ని సర్వనాశనం చేస్తున్నారు, కాబట్టి వీళ్ల నోళ్లు మూయించాలి. 12 వాళ్లలో ఒకతను, అంటే వాళ్ల ప్రవక్తే ఇలా అన్నాడు: “క్రేతువాళ్లు ఎప్పుడూ అబద్ధాలాడతారు, వాళ్లు ప్రమాదకరమైన క్రూరమృగాలు, వట్టి తిండిపోతులు.”
13 అతని సాక్ష్యం నిజం. అందుకే, వాళ్లను గట్టిగా మందలిస్తూ ఉండు. అప్పుడే వాళ్లు విశ్వాసంలో దృఢంగా* ఉంటారు, 14 అంతేకాదు యూదుల కట్టుకథలను, సత్యాన్ని విడిచిపెట్టేవాళ్ల ఆదేశాల్ని లెక్కచేయకుండా ఉంటారు. 15 పవిత్రంగా ఉండేవాళ్లకు అన్నీ పవిత్రంగానే అనిపిస్తాయి; కానీ అపవిత్రులకు, అవిశ్వాసులకు ఏదీ పవిత్రంగా అనిపించదు. ఎందుకంటే వాళ్ల మనసు, మనస్సాక్షి కలుషితం అయిపోయాయి. 16 వాళ్లు అందరి ముందూ దేవుడు తమకు తెలుసని చెప్తారుగానీ, వాళ్లు చేసే పనులు మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టేసినట్టు ఉంటాయి. ఎందుకంటే వాళ్లు అసహ్యకరమైన మనుషులు, అవిధేయులు, ఏ మంచిపనికీ పనికిరానివాళ్లు.