తీతు
3 ప్రభుత్వాలకు, అధికారాలకు లోబడి ఉండమని, విధేయులుగా ఉండమని, ఏ మంచి పనికైనా సిద్ధంగా ఉండమని వాళ్లకు గుర్తుచేస్తూ ఉండు. 2 ఎవరి గురించీ చెడుగా మాట్లాడొద్దని, గొడవలు పెట్టుకునేవాళ్లుగా ఉండొద్దని, తమ మాటే నెగ్గాలనే స్వభావం కలిగివుండొద్దని,* అందరిపట్ల సంపూర్ణ సౌమ్యతతో మెలగాలని కూడా గుర్తుచేస్తూ ఉండు. 3 ఎందుకంటే, ఒకప్పుడు మనం కూడా బుద్ధిలేనివాళ్లం, అవిధేయులం, దారితప్పినవాళ్లం, రకరకాల కోరికలకూ సుఖాలకూ బానిసలం. ఇంకా, చెడుపనులు చేసేవాళ్లం, అసూయపడేవాళ్లం, అసహ్యంగా ప్రవర్తించేవాళ్లం, ఒకరినొకరు ద్వేషించుకునేవాళ్లం.
4 అయినాసరే, మన రక్షణకర్తయిన దేవుని దయ, ప్రేమ మనుషుల పట్ల వెల్లడైనప్పుడు 5 ఆయన మనల్ని రక్షించాడు. మనం చేసిన ఏ నీతి పనుల వల్లో కాదుగానీ, తన కరుణ వల్లే మనం జీవం పొందేలా మనల్ని శుభ్రపర్చి,* పవిత్రశక్తితో నూతనం చేసి ఆయన మనల్ని రక్షించాడు. 6 ఆయన ఈ శక్తిని మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనమీద సమృద్ధిగా* కుమ్మరించాడు. 7 తన అపారదయ వల్ల మనం నీతిమంతులమని తీర్పు పొందిన తర్వాత మన నిరీక్షణకు అనుగుణంగా మనం శాశ్వత జీవితానికి వారసులమవ్వాలనే ఉద్దేశంతో ఆయన అలా చేశాడు.
8 ఈ మాటలు నమ్మదగినవి. వీటిని నొక్కిచెప్తూ ఉండు. అలాచేస్తే దేవుని మీద నమ్మకం ఉన్నవాళ్లు అన్నివేళలా మంచి పనులమీదే మనసు పెట్టగలుగుతారు. ఈ మాటలు మంచివి, మనుషులకు ఉపయోగకరమైనవి.
9 అయితే మూర్ఖమైన వాదనలు, వంశావళుల అన్వేషణ, గొడవలు, ధర్మశాస్త్ర సంబంధ వాగ్వివాదాల జోలికి వెళ్లకు. ఎందుకంటే వాటివల్ల ఏ లాభమూ ఉండదు, అవి వట్టి పనికిమాలినవి. 10 అబద్ధ బోధను వ్యాప్తిచేసే వ్యక్తికి ఒకట్రెండు సార్లు బుద్ధిచెప్పు,* అప్పటికీ వినకపోతే అతనితో సహవాసం మానేయి. 11 ఎందుకంటే అలాంటి వ్యక్తి సత్యమార్గాన్ని వదిలేశాడు, పాపం చేస్తూ తనకు తానే దోషినని చూపించుకున్నాడు.
12 నేను నీ దగ్గరకు అర్తెమానైనా తుకికునైనా పంపిస్తాను, అప్పుడు నికొపొలికి రావడానికి నువ్వు గట్టిగా ప్రయత్నించు. ఈ చలికాలం అక్కడే గడపాలని నిర్ణయించుకున్నాను. 13 ధర్మశాస్త్రంలో ఆరితేరిన జేనాకు, అపొల్లోకు ఏమీ తక్కువ కాకుండా వాళ్ల ప్రయాణానికి కావాల్సినవన్నీ శ్రద్ధగా ఏర్పాటుచేయి. 14 అయితే మనవాళ్లు కూడా ఎప్పుడూ మంచి పనులు చేయడం నేర్చుకోవాలి, అప్పుడే వాళ్లు అత్యవసర పరిస్థితుల్లో సాయపడగలుగుతారు. అలా, వాళ్ల సేవ వృథా* కాకుండా ఉంటుంది.
15 నాతో ఉన్నవాళ్లంతా నీకు శుభాకాంక్షలు చెప్తున్నారు. విశ్వాసాన్ని బట్టి మామీద అనురాగం ఉన్నవాళ్లందరికీ నా శుభాకాంక్షలు తెలియజేయి.
దేవుని అపారదయ మీ అందరికీ తోడుండాలి.