ఎఫెసీయులు
2 అంతేకాదు మీ తప్పుల వల్ల, పాపాల వల్ల చనిపోయిన స్థితిలో ఉన్న మిమ్మల్ని దేవుడు బ్రతికించాడు. 2 అంతకుముందు మీరు ఈ లోక వ్యవస్థకు* అనుగుణంగా, ఈ లోక వైఖరిని పాలించేవాడి ఇష్టానుసారంగా నడుచుకున్నారు. ఆ వైఖరి గాలిలా అంతటా వ్యాపించి, అవిధేయుల మీద ప్రభావం చూపిస్తోంది. 3 నిజమే, ఒకప్పుడు వాళ్లలాగే మనం కూడా మన శరీరం కోరుకున్నవాటిని, మనసుకు నచ్చినవాటిని చేసేవాళ్లం. వాళ్లలాగే మనం కూడా పుట్టుకతోనే దేవుని ఆగ్రహానికి గురవ్వాల్సినవాళ్లం. 4 కానీ దేవుడు అత్యంత కరుణామయుడు, ఆయనకు మన మీద ఉన్న ప్రేమ ఎంతో గొప్పది. 5 అందుకే, పాపాల వల్ల చనిపోయిన స్థితిలో ఉన్న మనల్ని క్రీస్తుతోపాటు బ్రతికించాడు. దేవుని అపారదయ వల్లే మీరు రక్షణ పొందారు. 6 అంతేకాదు, క్రీస్తుయేసు శిష్యులమైన మనల్ని దేవుడు క్రీస్తుతోపాటు బ్రతికించి, క్రీస్తుతోపాటు పరలోకంలో కూర్చోబెట్టాడు. 7 అలా, క్రీస్తుయేసు శిష్యులమైన మనమీద రానున్న కొత్తలోకంలో* దేవుడు తన మంచితనంతో* అపారదయను చూపించాలనుకున్నాడు.
8 మీరు విశ్వాసం ద్వారా పొందిన రక్షణ ఆ అపారదయ వల్లే సాధ్యమైంది. అది మీ అంతట మీరు సాధించుకున్నది కాదు; అది దేవుడు ఇచ్చిన బహుమతి. 9 అది కష్టానికి దక్కే ఫలితం కాదు కాబట్టి దాని విషయంలో గొప్పలు చెప్పుకునే అవకాశం ఎవరికీ లేదు. 10 మనల్ని దేవుడు చేశాడు.* క్రీస్తుయేసు శిష్యులమైన మనల్ని మంచి పనులు చేయడానికి దేవుడు సృష్టించాడు. ఆ మంచి పనుల్ని దేవుడు మన కోసం ముందే ఏర్పాటుచేశాడు.
11 కాబట్టి పుట్టుకతో అన్యులైన మీరు ఒక విషయం గుర్తుంచుకోండి. ఒకప్పుడు, మనుషులచేత “సున్నతి చేయించుకున్నవాళ్లు” మిమ్మల్ని “సున్నతి చేయించుకోనివాళ్లు” అని అనేవాళ్లు. 12 అప్పుడు మీకు క్రీస్తు ఎవరో తెలియదు, మీరు ఇశ్రాయేలు ప్రజలకు దూరంగా ఉన్నారు, వాగ్దాన ఒప్పందాల్లో* మీకు వంతే లేదు. ఈ లోకంలో ఏ నిరీక్షణా లేకుండా, దేవుడు ఎవరో తెలియకుండా మీరు జీవించారు. 13 ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తుయేసు శిష్యులయ్యారు, ఆయన రక్తం వల్ల దేవునికి దగ్గరయ్యారు. 14 ఎందుకంటే ఆయనే మనకు శాంతిని తెచ్చాడు, రెండు గుంపుల ప్రజలను ఒకటి చేశాడు, వాళ్ల మధ్య ఉన్న అడ్డుగోడను పడగొట్టేశాడు. 15 ఆయన తన శరీరాన్ని అర్పించడం ద్వారా ఆ రెండు గుంపుల మధ్య ఉన్న శత్రుత్వాన్ని తీసేశాడు అంటే ఆజ్ఞలు, నియమాలు ఉన్న ధర్మశాస్త్రాన్ని రద్దు చేసేశాడు. ఆ రెండు గుంపుల్లో ఉన్న తన శిష్యుల్ని ఒక్క కొత్త గుంపుగా* చేయాలని, శాంతిని తేవాలని, 16 హింసాకొయ్య* ద్వారా ఆ రెండు గుంపుల ప్రజలకు, దేవునికి మధ్య శాంతియుత సంబంధాన్ని తిరిగి నెలకొల్పి వాళ్లను ఒక్క గుంపుగా* చేయాలని తన మరణం ద్వారా శత్రుత్వాన్ని తీసేశాడు. 17 ఆయన వచ్చి, దేవుడు ఎవరో తెలియని మీకు, దేవుడు ఎవరో తెలిసినవాళ్లకు శాంతికరమైన మంచివార్తను ప్రకటించాడు. 18 ఆయన ద్వారా రెండు గుంపుల వాళ్లం ఒకే ప్రవిత్రశక్తిని పొంది, ఏ ఆటంకం లేకుండా తండ్రికి ప్రార్థించగలుగుతున్నాం.
19 కాబట్టి మీరిక అపరిచితులు కాదు, పరాయి దేశస్థులు కాదు. మీరు పవిత్రుల తోటి పౌరులు, దేవుని కుటుంబ సభ్యులు. 20 అపొస్తలుల, ప్రవక్తల పునాది మీద మీరు నిర్మించబడ్డారు. ఆ పునాదికి ముఖ్యమైన మూలరాయి క్రీస్తుయేసే. 21 ఆ భవనపు రాళ్లన్నీ ఒకదానితో ఒకటి చక్కగా అమరుతున్నాయి, అలా భవనమంతా క్రీస్తుతో ఐక్యమై యెహోవాకు* ఓ పవిత్ర ఆలయంగా రూపొందుతోంది. 22 కాబట్టి, క్రీస్తుతో ఐక్యంగా ఉన్న మీరు దేవుని కోసం ఓ ఆలయంగా నిర్మించబడుతున్నారు. అది దేవుడు నివసించే ఆలయం, ఎందుకంటే ఆ ఆలయంలో దేవుని పవిత్రశక్తి ఉంటుంది.