ఎఫెసీయులు
3 నేను క్రీస్తుయేసు మనిషిని అయినందుకు, అన్యులైన మీకు సహాయం చేసినందుకు ఇప్పుడు చెరసాలలో ఉన్నాను. 2 మీరు తన అపారదయ నుండి ప్రయోజనం పొందేలా మీకు సహాయం చేసే బాధ్యతను దేవుడు నాకు అప్పగించాడనే విషయం మీరు విన్నారు. 3 పవిత్ర రహస్యాన్ని వెల్లడి చేయడం ద్వారా దేవుడు నాకు ఆ బాధ్యతను అప్పగించాడు. దీనిగురించి ఇంతకుముందే మీకు క్లుప్తంగా రాశాను. 4 కాబట్టి మీరు ఇది చదివితే, క్రీస్తు గురించిన పవిత్ర రహస్యం మీద నాకెంత అవగాహన ఉందో మీకు తెలుస్తుంది. 5 ఈ రహస్యాన్ని దేవుడు తన పవిత్ర అపొస్తలులకు, ప్రవక్తలకు తన పవిత్రశక్తి ద్వారా ఇప్పుడు స్పష్టంగా వెల్లడి చేశాడు. అయితే వెనుకటి తరాల వాళ్లకు ఇంత స్పష్టంగా వెల్లడి చేయలేదు. 6 ఆ రహస్యం ఏమిటంటే, మంచివార్త ద్వారా క్రీస్తుయేసు శిష్యులైన అన్యులు క్రీస్తు తోటి వారసులౌతారు, మాతోపాటు ఒకే శరీరంలో సభ్యులౌతారు, దేవుడు వాగ్దానం చేసిన వాటిని మాతోపాటు వాళ్లూ అందుకుంటారు. 7 దేవుని అపారదయ వల్ల నేను ఈ రహస్యానికి పరిచారకుణ్ణి అయ్యాను. ఆయన తన శక్తిని ఉపయోగించి నాకు ఈ ఉచిత బహుమానం ఇచ్చాడు.
8 పవిత్రులందరిలో అల్పుడైనవాని కన్నా నేను తక్కువవాణ్ణి. అలాంటి నాకు దేవుడు ఈ అపారదయను ప్రసాదించాడు. లెక్కకు అందని క్రీస్తు సంపదల గురించిన మంచివార్తను నేను అన్యులకు ప్రకటించాలని, 9 పవిత్ర రహస్యం ఎలా అమలులోకి తీసుకురాబడిందో గుర్తించేలా నేను ప్రతీ ఒక్కరికి సహాయం చేయాలని దేవుడు నాకు ఈ అపారదయను ప్రసాదించాడు. అన్నిటినీ సృష్టించిన దేవుడు ఆ రహస్యాన్ని ఎంతోకాలం దాచివుంచాడు. 10 ఎన్నో విధాల్లో కనిపించే దేవుని తెలివి ఇప్పుడు సంఘం ద్వారా పరలోకంలో ఉన్న ప్రభుత్వాలకు, అధికారాలకు తెలియడానికే అలా చేశాడు. 11 ఇది మన ప్రభువైన క్రీస్తుయేసుకు సంబంధించిన దేవుని నిత్య సంకల్పానికి అనుగుణంగా ఉంది. 12 యేసు వల్లే మనం ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం, యేసు మీద ఉన్న విశ్వాసం వల్లే నమ్మకంతో దేవునికి ప్రార్థించగలుగుతున్నాం. 13 కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఏమిటంటే, మీ కోసం నేను ఎదుర్కొన్న శ్రమలను చూసి నిరుత్సాహపడకండి. ఎందుకంటే అవన్నీ మీకు కీర్తిని తెస్తాయి.
14 అందుకే నేను మోకరించి తండ్రికి ప్రార్థిస్తున్నాను. 15 అటు పరలోకంలో, ఇటు భూమ్మీద ఉన్న ప్రతీ కుటుంబం ఆ తండ్రి వల్లే వచ్చింది. 16 ఎంతో మహిమగల దేవుడు తన పవిత్రశక్తి ద్వారా మీకు శక్తినిచ్చి మీ హృదయాల్ని బలపర్చాలని నేను ప్రార్థిస్తున్నాను. 17 అంతేకాదు మీ విశ్వాసం ద్వారా మీ హృదయాల్లో ప్రేమతోపాటు క్రీస్తు నివసించాలని వేడుకుంటున్నాను. వేళ్లూనుకున్న చెట్టులా మీరు పునాది మీద స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాను. 18 అప్పుడు పవిత్రులందరిలాగే మీరు కూడా దేవుని విషయాల వెడల్పు, పొడవు, ఎత్తు, లోతు ఎంత అనేది పూర్తిగా గ్రహించగలుగుతారు, 19 జ్ఞానాన్ని మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోగలుగుతారు. అలా, దేవుడు ఇచ్చే లక్షణాలన్నిటినీ మీరు అలవర్చుకోగలుగుతారు.
20 మనలో పనిచేస్తున్న తన శక్తిని బట్టి, దేవుడు మనం అడిగే వాటన్నిటికన్నా, ఊహించగలిగే వాటన్నిటికన్నా ఎంతో గొప్పవాటిని చేయగలడు. 21 కాబట్టి సంఘం ద్వారా, క్రీస్తుయేసు ద్వారా తరతరాలు-యుగయుగాలు దేవునికి మహిమ కలగాలి. ఆమేన్.