మార్చి 9-15, 2026
పాట 45 నా హృదయ ధ్యానం
బాధగా అనిపించినప్పుడు యెహోవా మీకు సహాయం చేస్తాడు
“అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి!”—రోమా. 7:24.
ముఖ్యాంశం
బాధపెట్టే ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఏం చేయవచ్చో చూస్తాం.
1-2. అపొస్తలుడైన పౌలుకు కొన్నిసార్లు ఎలా అనిపించింది? పౌలు ఉదాహరణ మనకెలా సహాయం చేస్తుంది? (రోమీయులు 7:21-24)
అపొస్తలుడైన పౌలు పేరు వినగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఆయన ఒక ధైర్యంగల మిషనరీ అనా? నైపుణ్యంగల బోధకుడు అనా? బైబిల్లో చాలా ఉత్తరాలు రాసిన వ్యక్తి అనా? అవన్నీ కరెక్టే. వాటితోపాటు పౌలుకు బాధ, ఆందోళన, నిరుత్సాహం లాంటి ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. మనలో చాలామందిలాగే కొన్నిసార్లు ఆయన కూడా అలాంటి ఫీలింగ్స్‌తో నలిగిపోయాడు.
2 రోమీయులు 7:21-24 చదవండి. రోమీయులకు రాసిన ఉత్తరంలో, పౌలు తనకు కొన్నిసార్లు ఎలా అనిపించిందో రాశాడు. అప్పుడప్పుడు మనలో చాలామందికి అలాగే అనిపిస్తుంది. ఆయన దేవునికి నమ్మకంగా ఉన్నాడు, దేవునికి నచ్చింది చేయాలని బలంగా కోరుకున్నాడు. కానీ తనలో ఉన్న పాపం వల్ల కొన్నిసార్లు సరైనది చేయలేకపోయాడు. లోలోపల జరిగే ఈ పోరాటంతో పాటు, గతంలో చేసిన తప్పుల తాలూకు చేదు జ్ఞాపకాలు, అలాగే తనకున్న ఒక సమస్య పౌలును వెంటాడుతూ ఉన్నాయి. వాటివల్ల ఆయన నలిగిపోయాడు.
3. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?
3 పౌలుకు జరుగుతున్న లోలోపలి పోరాటం వల్ల బాధa కలిగినా, దాంట్లో కూరుకుపోకుండా ఉండడానికి తీవ్రంగా కృషిచేశాడు. ఈ ఆర్టికల్‌లో మనం ఈ ప్రశ్నల గురించి చూస్తాం: “దౌర్భాగ్యుణ్ణి!” అనేంతగా పౌలును బాధపెట్టింది ఏంటి? అప్పుడు పౌలు ఏం చేశాడు? మనకు కూడా బాధగా అనిపిస్తే ఏం చేయవచ్చు?
పౌలును బాధపెట్టింది ఏంటి?
4. పౌలును బాధపెట్టింది ఏంటి?
4 గతంలో చేసిన తప్పులు. క్రైస్తవుడు అవ్వకముందు పౌలును సౌలు అని పిలిచేవాళ్లు, అప్పట్లో ఆయన కొన్ని తప్పులు చేశాడు, వాటిని గుర్తుచేసుకొని తర్వాత బాధపడ్డాడు. ఉదాహరణకు, స్తెఫను అనే నమ్మకమైన సేవకుణ్ణి రాళ్లతో కొడుతుంటే, అతనికి అలా అవ్వాల్సిందే అన్నట్టు సౌలు చూస్తూ నిలబడ్డాడు. (అపొ. 7:58; 8:1) అంతేకాదు, క్రైస్తవుల్ని హింసిస్తూ వాళ్ల అంతు చూడడమే పనిగా పెట్టుకున్నాడు.—అపొ. 8:3; 26:9-11.
5. గతంలో చేసినవాటి గురించి పౌలుకు ఎలా అనిపించింది?
5 అపొస్తలుడైన పౌలు క్రైస్తవునిగా మారిన తర్వాత, గతంలో చేసిన తప్పులు గుర్తొచ్చి కొన్నిసార్లు కుమిలిపోయాడు. సంవత్సరాలు గడుస్తుండగా, ఒకప్పుడు క్రైస్తవుల్ని అదేపనిగా హింసించాడన్న విషయం ఆయన్ని ఇంకా ఎక్కువగా వేధించి ఉంటుంది. అందుకేనేమో, దాదాపు క్రీ.శ. 55 లో కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరంలో ఇలా అన్నాడు: “నేను దేవుని సంఘాన్ని హింసించాను, కాబట్టి అపొస్తలుణ్ణని పిలవబడే అర్హత కూడా నాకు లేదు.” (1 కొరిం. 15:9) దాదాపు ఐదేళ్ల తర్వాత, ఎఫెసీయులకు ఉత్తరం రాసినప్పుడు, “పవిత్రులందరిలో అల్పుడైనవాని కన్నా తక్కువవాడిని” అన్నాడు. (ఎఫె. 3:8) తిమోతికి ఉత్తరం రాసినప్పుడు, “నేను దైవదూషణ చేసేవాణ్ణి, హింసించేవాణ్ణి, తలబిరుసుగా ప్రవర్తించేవాణ్ణి” అని అన్నాడు. (1 తిమో. 1:13) పౌలు ఏదైనా సంఘానికి వెళ్లినప్పుడు, గతంలో తాను హింసించినవాళ్లు లేదా వాళ్ల కుటుంబ సభ్యులు కనిపిస్తే, ఆయనకు ఎలా అనిపించి ఉంటుందో ఊహించుకోగలరా?
6. పౌలును చాలా బాధపెట్టిన ఇంకో విషయం ఏంటి? (అధస్సూచి కూడా చూడండి.)
6 శరీరంలో ఒక ముల్లు. తనను ఎంతో వేధించిన ఒక సమస్యను పౌలు తన “శరీరంలో ఒక ముల్లు” అన్నాడు. (2 కొరిం. 12:7) అదేంటో పౌలు చెప్పలేదు కానీ, ఆయన ఉపయోగించిన పదచిత్రం చూస్తే, అదేదో అనారోగ్య సమస్య లేదా ఆందోళనకు గురిచేసిన ఇంకేదైనా సమస్య కావచ్చని అర్థమౌతుంది.b
7. తనలో ఉన్న లోపాల వల్ల పౌలు ఎలా బాధపడ్డాడు? (రోమీయులు 7:18, 19)
7 తనలో ఉన్న లోపాలు. పౌలు తనలో ఉన్న లోపాలతో కూడా పోరాడాడు. (రోమీయులు 7:18, 19 చదవండి.) ఆయన సరైనది చేయాలని కోరుకున్నా, ఆయనలో ఉన్న పాపం ఆయన్ని వెనక్కి లాగింది. తన శరీర కోరికలకు, సరైనది చేయాలనే తపనకు మధ్య అలుపెరగని యుద్ధం జరుగుతోందని పౌలు అన్నాడు. అయినా, సరైనది చేయడానికి పౌలు గట్టిగా కృషిచేశాడు. (1 కొరిం. 9:27) అయితే, అప్పుడప్పుడు తనలో ఉన్న లోపాలు మళ్లీ బయటికి వచ్చినప్పుడు, ఆయనకు ఎంత చిరాకేసి ఉంటుందో కదా!
బాధగా అనిపించినప్పుడు పౌలు ఏం చేశాడు?
8. పౌలు రాసిన ఉత్తరాలు చదివితే, తన లోపాలతో పోరాడడానికి ఆయన ఏం చేశాడని అర్థమౌతుంది?
8 పౌలు రాసిన ఉత్తరాలు చదివితే ఒక విషయం అర్థమౌతుంది. అదేంటంటే, క్రైస్తవులు తప్పుడు కోరికలతో పోరాడి గెలవడానికి పవిత్రశక్తి ఎలా సహాయం చేస్తుందో ఆయన లోతుగా ఆలోచించాడు. (రోమా. 8:13; గల. 5:16, 17) యెహోవాను సంతోషపెట్టాలంటే క్రైస్తవులు ఎలాంటి చెడ్డ లక్షణాలకు, కోరికలకు దూరంగా ఉండాలో పౌలు తరచూ చెప్పాడు. (గల. 5:19-21, 26) అంటే, పౌలు కూడా తాను ఏ విషయాల్లో మెరుగవ్వాలో బాగా ఆలోచించి ఉంటాడు. బహుశా ఆయన ఏమేం మార్పులు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అని తెలుసుకోవడానికి లేఖనాల్ని పరిశీలించి ఉంటాడు. పౌలు వేరేవాళ్లకు ఏ సలహాలైతే ఇచ్చాడో, వాటిని ఆయన కూడా పాటించివుంటాడు.
9-10. పౌలుకు నిరుత్సాహంగా అనిపించినప్పుడు ఏ విషయాలు ఆయనకు సహాయం చేశాయి? (ఎఫెసీయులు 1:7) (చిత్రం కూడా చూడండి.)
9 పౌలుకు కొన్నిసార్లు నిరుత్సాహంగా అనిపించినా, సంతోషంగా ఉండడానికి ఆయనకు చాలా విషయాలు సహాయం చేశాయి. ఉదాహరణకు, ఆయనతో కలిసి ప్రయాణించిన తోటి క్రైస్తవులు తెచ్చిన మంచి కబురు విని ఆయన చాలా సంతోషించేవాడు. (2 కొరిం. 7:6, 7) తోటి విశ్వాసులతో ఉన్న మంచి స్నేహం వల్ల ఆనందించేవాడు. (2 తిమో. 1:4) అంతేకాదు, తనకు యెహోవా ఆమోదం ఉందని ఆయనకు తెలుసు. అందుకే, “స్వచ్ఛమైన మనస్సాక్షితో” దేవుని సేవ చేయగలుగుతున్నందుకు పౌలు సంతోషంగా ఉండేవాడు. (2 తిమో. 1:3) ఆయన రోములో బందీగా ఉన్నప్పుడు కూడా, “ప్రభువును బట్టి ఆనందించండి” అని తోటి విశ్వాసుల్ని ప్రోత్సహించాడు. (ఫిలి. 4:4) పౌలు మాటలు చూస్తే, ఆయన తన సమస్యలు-తప్పుల గురించే ఆలోచిస్తూ కూర్చోలేదని అర్థమౌతుంది. బదులుగా, బాధపెట్టే ఆలోచనలు వచ్చినప్పుడు పౌలు వాటిని పక్కకు నెట్టేసి, సంతోషం కలిగించే విషయాల మీద మనసుపెట్టేవాడు.
10 పౌలుకు సంతోషంగా ఉండడానికి సహాయం చేసిన ఇంకొక విషయం, విమోచన క్రయధనం. పౌలు దాన్ని యెహోవా ప్రేమతో తన కోసం ఇచ్చిన బహుమతిగా చూశాడు. (గల. 2:20; ఎఫెసీయులు 1:7 చదవండి.) యేసుక్రీస్తు బలి ఆధారంగా యెహోవా తన పాపాలు క్షమించాడని, ముందుముందు కూడా క్షమిస్తాడని పౌలు బలంగా నమ్మాడు. (రోమా. 7:24, 25) అందుకే తనలో లోపాలు ఉన్నా, గతంలో తప్పులు చేసినా పౌలు సంతోషంగా దేవునికి “పవిత్రసేవ” చేశాడు.—హెబ్రీ. 9:12-14.
పౌలు గతంలో చేసిన తప్పులు గుర్తొచ్చి ఒక్కోసారి బాధపడినా, విమోచన క్రయధనం గురించి ఆలోచించడం వల్ల సంతోషంగా సేవ చేయగలిగాడు (9-10 పేరాలు చూడండి)
11. పౌలు ఉదాహరణ మనకు ఎందుకు ప్రోత్సాహాన్నిస్తుంది?
11 పౌలులాగే మనకు కూడా, ప్రతీక్షణం లోలోపల పోరాటం జరుగుతున్నట్టు అనిపించవచ్చు. దేవునికి నచ్చని ఆలోచనలకు, మాటలకు, పనులకు దూరంగా ఉండడం చాలా కష్టంగా ఉండవచ్చు. యెహోవాను ఎప్పటికీ పూర్తిగా సంతోషపెట్టలేమని అనుకుంటూ మనం నిరుత్సాహపడవచ్చు. 26 ఏళ్ల ఎలీజాc అనే సిస్టర్, తనకు ఎలా అనిపించేదో చెప్తూ ఇలా అంది: “పౌలు పరిస్థితి గురించి ఆలోచించినప్పుడు నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఈ సమస్య ఎదుర్కొంటున్నది నేను ఒక్కదాన్నే కాదని తెలుసుకుని హమ్మయ్య అనిపించింది. తన ప్రజలు ఎలాంటి సమస్యలతో నలిగిపోతున్నారో యెహోవాకు తెలుసని ఇది గుర్తుచేస్తుంది.” కొన్నిసార్లు మనకు నిరుత్సాహంగా అనిపించినా, మంచి మనస్సాక్షితో సేవచేయడానికి, సంతోషంగా ఉండడానికి పౌలులాగే మనం ఏం చేయవచ్చు?
బాధగా అనిపించినప్పుడు మనం ఏం చేయవచ్చు?
12. బాధగా అనిపించినప్పుడు మంచి ఆధ్యాత్మిక అలవాట్లు ఎలా సహాయం చేస్తాయి?
12 మంచి ఆధ్యాత్మిక అలవాట్లు. మంచి ఆధ్యాత్మిక అలవాట్లు ఉంటే, మనం సంతోషాన్నిచ్చే విషయాల మీద మనసు పెట్టగలుగుతాం. ఉదాహరణకు, మంచి అలవాట్లే మంచి ఆరోగ్యానికి పునాది. అంటే మనం మంచి ఆహారం తింటూ, క్రమంగా ఎక్సర్సైజ్ చేస్తూ, కంటినిండా నిద్రపోతూ ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. అలాగే మనం రోజూ బైబిలు చదువుతూ, మీటింగ్స్‌కి సిద్ధపడి వెళ్లి కామెంట్స్ చెప్తూ, క్రమంగా ప్రీచింగ్ చేస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది. ఆ ఆనందాన్ని మనందరం రుచి చూసే ఉంటాం. మనం అలాంటి మంచి విషయాల మీద దృష్టిపెట్టడం వల్ల, బాధపెట్టే ఆలోచనలతో పోరాడగలుగుతాం.—రోమా. 12:11, 12.
13-14. మంచి ఆధ్యాత్మిక అలవాట్లు కొంతమంది నమ్మకమైన క్రైస్తవులకు ఎలా సహాయం చేశాయి?
13 జాన్ ఉదాహరణ పరిశీలించండి. ఆయనకు 39 ఏళ్లు ఉన్నప్పుడు, ఒక అరుదైన కాన్సర్ ఉందని తేలింది. మొదట్లో ఆయన చాలా నలిగిపోయాడు. ‘ఇంత చిన్న వయసులో జబ్బు రావడం ఏంటి?’ అని అనుకున్నాడు. అప్పటికి వాళ్ల బాబుకి మూడేళ్లు మాత్రమే. మరి నిరుత్సాహంలో కూరుకుపోకుండా జాన్‌కి ఏది సహాయం చేసింది? ఆయన ఇలా చెప్తున్నాడు: “నాకు నీరసంగా ఉన్నా సరే, మేము అన్ని మీటింగ్స్‌కి వెళ్లేలా, ప్రీచింగ్ చేసేలా, ప్రతీవారం కుటుంబ ఆరాధన జరుపుకునేలా చూసుకున్నాను. చాలా కష్టంగా ఉన్నప్పుడు కూడా వాటిని మానలేదు.” గతాన్ని గుర్తుచేసుకుంటూ జాన్ ఇలా అంటున్నాడు: “ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు, మొదట్లో ప్రపంచం తలకిందులైనట్టు అనిపించవచ్చు. కానీ త్వరలోనే, యెహోవా మనకు ఎలా బలాన్నిస్తున్నాడో, ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో అర్థంచేసుకుంటాం. యెహోవా నాకు సహాయం చేసినట్టే మీకు కూడా సహాయం చేస్తాడు.”
14 ముందు పేరాల్లో చూసిన ఎలీజా ఇలా అంటుంది: “యెహోవా నా ప్రార్థనలు వింటున్నాడని, నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడని మీటింగ్స్‌కి వెళ్లిన ప్రతీసారి, వ్యక్తిగత అధ్యయనం చేసిన ప్రతీసారి గుర్తొస్తుంది. దానివల్ల చాలా సంతోషంగా ఉంటుంది.” ఆఫ్రికాలో ప్రాంతీయ పర్యవేక్షకుడిగా ఉన్న నోలన్ తన గురించి, తన భార్య డీయెన్ గురించి ఇలా అంటున్నాడు: “మాకు నిరుత్సాహంగా అనిపించినప్పుడు కూడా ఆధ్యాత్మిక పనులు మానేయం. అప్పుడు మేము సంతోషంగా ఉండేలా యెహోవా మాకు సహాయం చేస్తాడు. అంతేకాదు నిరుత్సాహంగా అనిపించినప్పుడు, యెహోవా మాకు తోడుగా ఉంటాడని, మమ్మల్ని దీవిస్తాడని గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తాం; అది ఆయన ఎలా చేస్తాడో తెలీదు కానీ, తప్పకుండా చేస్తాడని మాత్రం మాకు తెలుసు.”
15. బాధపెట్టే ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఇంకా ఏం చేయవచ్చు? ఉదాహరణతో చెప్పండి.
15 బాధపెట్టే ఆలోచనల్ని తీసేసుకోవడం కష్టంగా ఉంటే, ఎప్పుడూ చేసే పనులతో పాటు ఇంకొన్ని పనులు కూడా చేయాల్సి రావచ్చు. ఉదాహరణకు, మీకు నడుంనొప్పి వచ్చిందని అనుకోండి. ప్రతీరోజు నడవడం వల్ల కాస్త ఉపశమనం కలిగినా, దానివల్లే నొప్పి పూర్తిగా తగ్గకపోవచ్చు. కాబట్టి, అసలు నొప్పి దేనివల్ల వస్తుందో తెలుసుకోవాలి, దానికోసం పరిశోధన చేయాలి, డాక్టర్ని కూడా కలవాలి. అలాగే, మనకు తరచూ బాధగా అనిపిస్తుంటే, దానికి కారణం ఏంటో, దాన్ని ఎలా తీసేసుకోవాలో తెలుసుకోవాలి; దానికోసం బైబిల్లో-మన ప్రచురణల్లో పరిశోధన చేయాలి, అవసరమైతే పరిణతిగల ఒక బ్రదర్‌తో లేదా సిస్టర్‌తో మాట్లాడాలి. ఈ విషయంలో ఉపయోగపడే ఇంకొన్ని సలహాలు చూద్దాం.
16. మనకు ఎందుకు ఆందోళనగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఏది సహాయం చేస్తుంది? (కీర్తన 139:1-4, 23, 24)
16 మీ అవసరాలేంటో తెలుసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థించండి. యెహోవాకు తన గురించి బాగా తెలుసని దావీదు గుర్తుపెట్టుకున్నాడు. అందుకే, తనలో “కలవరపెడుతున్న ఆలోచనలు” ఎందుకు వస్తున్నాయో గుర్తించడానికి సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించాడు. (కీర్తన 139:1-4, 23, 24 చదవండి.) అలాగే మనం కూడా మనకు ఎందుకు ఆందోళనగా అనిపిస్తుందో, దాన్ని తీసేసుకోవడానికి ఏం చేయాలో అర్థంచేసుకోవడానికి సహాయం చేయమని యెహోవాను అడగవచ్చు. ఇలాంటి ప్రశ్నల గురించి ఆలోచించవచ్చు: ‘అసలు నేను దేని గురించి ఆందోళన పడుతున్నాను? దేనివల్ల ఆ ఆందోళన మొదలౌతోంది? అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే పక్కకు నెట్టేయకుండా, వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుంటున్నానా?’
17. ప్రోత్సాహాన్నిచ్చే ఆలోచనల మీదే దృష్టిపెట్టాలంటే, ఎలాంటి అంశాల గురించి అధ్యయనం చేయాలి? (చిత్రం కూడా చూడండి.)
17 మీ పరిస్థితికి సరిపోయే అంశం గురించి అధ్యయనం చేయండి. యెహోవా లక్షణాల గురించి అధ్యయనం చేస్తే ప్రోత్సాహంగా ఉంటుంది, కాబట్టి అప్పుడప్పుడు అలా చేయడం మంచిది. ఉదాహరణకు, పౌలు విమోచన క్రయధనం గురించి, యెహోవా క్షమాగుణం గురించి ధ్యానించడం వల్ల ఎంతో ప్రయోజనం పొందాడు. మీరు కూడా అలా చేయవచ్చు. యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకం, మంచి క్రైస్తవులుగా ఉండడానికి ఉపయోగపడే లేఖనాలు, లేదా మీ భాషలో ఉన్న వేరే అధ్యయన పనిముట్లు ఉపయోగించి దేవుని కరుణ, క్షమాగుణం, విశ్వసనీయ ప్రేమ గురించి పరిశోధన చేయవచ్చు. మీకు సహాయం చేసే ఆర్టికల్స్ దొరికినప్పుడు, వాటితో ఒక లిస్టు తయారుచేసుకోండి. దాన్ని మీకు కనిపించే చోట పెట్టుకొని, మీకు ఆందోళనగా అనిపించినప్పుడు ఆ లిస్టులోని ఆర్టికల్స్ చదవండి. అలాగే అందులోని విషయాల్ని పాటించడానికి ప్రయత్నించండి.—ఫిలి. 4:8.
అధ్యయనం చేయడానికి, మీకు ప్రోత్సాహాన్నిచ్చే అంశాలు ఎంచుకోండి (17వ పేరా చూడండి)
18. కొంతమంది బ్రదర్స్‌సిస్టర్స్ ఏ అంశాల గురించి అధ్యయనం చేశారు?
18 మనం ముందు పేరాల్లో చూసిన ఎలీజా, యోబు గురించి పరిశోధన చేసింది. ఆమె ఇలా చెప్తుంది: “నేను యోబు పరిస్థితిని బాగా అర్థం చేసుకోగలను. ఎందుకంటే, యోబుకు ఒకదాని తర్వాత ఒకటి చాలా కష్టాలు వచ్చాయి, చెప్పలేనంత నిరుత్సాహం కలిగింది. తనకు ఎందుకు కష్టాలు వస్తున్నాయో తెలీకపోయినా సరే, యోబు సహాయం కోసం యెహోవా మీదే ఆధారపడ్డాడు.” (యోబు 42:1-6) అలాగే ముందు పేరాల్లో చూసిన డీయెన్ ఇలా అంటుంది: “నేను, నా భర్త యెహోవాకు దగ్గరవ్వండి పుస్తకాన్ని అధ్యయనం చేస్తున్నాం. కుమ్మరి మట్టిని మలిచినట్టు, యెహోవా మమ్మల్ని మలుస్తున్నాడని మేము అర్థం చేసుకున్నాం. ఏదైనా తప్పు చేశామని నిరుత్సాహంగా అనిపించినప్పుడు, యెహోవా మమ్మల్ని మలుస్తూ మెరుగైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్నాడని గుర్తుచేసుకుంటాం. దానివల్ల ఆయనకు ఇంకా దగ్గరౌతున్నాం.”—యెష. 64:8.
భవిష్యత్తు వైపు నమ్మకంతో చూడండి
19. కొన్నిసార్లు మనకెలా అనిపించవచ్చు? కానీ మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?
19 మనకు మంచి ఆధ్యాత్మిక అలవాట్లు ఉన్నా, మన పరిస్థితులకు సరిపోయేలా అధ్యయనం చేస్తున్నా, బాధపెట్టే ఆలోచనలు మనల్ని వేధిస్తూనే ఉండవచ్చు. ఒక్కోసారి బాగా నిరుత్సాహంగా అనిపించవచ్చు. అయితే, యెహోవా సహాయంతో అలాంటి ఆలోచనల నుండి మనసు పక్కకు తిప్పేసుకుని, కాస్త మనశ్శాంతితో ఉండవచ్చు. కొన్నిసార్లు బాధగా, నిరుత్సాహంగా అనిపించినా, మిగతా సమయాల్లో మనం మంచి మనస్సాక్షితో జీవితాన్ని ఆనందిస్తూ యెహోవా సేవలో సంతోషంగా ఉంటామనే నమ్మకంతో ఉండవచ్చు.
20. మీరు ఏం చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు?
20 గతంలో చేసిన తప్పులు, ఇప్పుడున్న సమస్యలు, లేదా మనలోని లోపాల వల్ల సంతోషాన్ని కోల్పోకూడదు అని గట్టిగా నిర్ణయించుకుందాం. యెహోవా సహాయంతో మనం బాధను, నిరుత్సాహాన్ని తీసేసుకొని మనశ్శాంతితో ఉండవచ్చు. (కీర్త. 143:10) కొత్తలోకంలో మనకు వచ్చే ప్రతీ ఆలోచన మనలో సంతోషాన్ని మాత్రమే నింపుతుంది, దానికోసం మనం ఆశతో ఎదురుచూడవచ్చు. అప్పుడిక ఏ విషయం మనల్ని ఆందోళనపెట్టదు. బదులుగా, ప్రతీరోజు మన ప్రేమగల దేవుడైన యెహోవాను సేవించాలనే ఆలోచనతో సంతోషంగా నిద్రలేస్తాం!
పాట 34 యథార్థంగా జీవించడం
a ఈ ఆర్టికల్ అప్పుడప్పుడూ కలిగే నిరుత్సాహం, ఉన్నట్టుండి మూడ్ మారిపోవడం గురించి చర్చిస్తుంది. అంతేగానీ దీర్ఘకాల కృంగుదల (డిప్రెషన్) గురించి ఇది మాట్లాడట్లేదు, అలాంటి సమస్య ఉన్నవాళ్లకు డాక్టర్ సహాయం అవసరం.
b బహుశా పౌలుకు కంటిచూపు సరిగ్గా ఉండేది కాదు. దానివల్ల ఉత్తరాలు రాయడం, పరిచర్య కోసం ప్రయాణాలు చేయడం ఇబ్బందిగా ఉండివుంటుంది. (గల. 4:15; 6:11) లేదా అబద్ధ బోధకులు తన గురించి చెప్పిన మాటలు పౌలును ఆందోళనపెట్టి ఉండవచ్చు. (2 కొరిం. 10:10; 11:5, 13) కారణం ఏదైనాసరే, ఆ సమస్య పౌలుకు ఎంతో బాధ కలిగించింది.
c కొన్ని పేర్లను మార్చాం.