కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w26 జనవరి పేజీలు 2-7
  • “దేవుని నిర్దేశం” తీసుకుంటూ ఉండండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “దేవుని నిర్దేశం” తీసుకుంటూ ఉండండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మనకు చాలా అవసరమైన మూడు లక్షణాలు
  • పేతురులా ఆధ్యాత్మిక ఆహారాన్ని పుష్టిగా తీసుకోండి
  • పౌలులా ఆధ్యాత్మికంగా మంచి బట్టలు వేసుకోండి
  • దావీదులా ఆధ్యాత్మిక ఇంట్లోనే ఉండండి
  • మీ ఆధ్యాత్మిక అవసరాలు తీర్చుకుంటూ ఉండండి
  • మనకు తెలియనివి తెలీదని ఒప్పుకోవాలంటే వినయం కావాలి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • యెహోవాలా, యేసులా ఆలోచించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • యెహోవా మీద ఆధారపడుతున్నామని చూపించే నిర్ణయాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
    2025-2026 ప్రాంతీయ సమావేశ కార్యక్రమం, ప్రాంతీయ పర్యవేక్షకునితో
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
w26 జనవరి పేజీలు 2-7

మార్చి 2-8, 2026

పాట 97 దేవుని మాట వల్లే జీవిస్తాం

“దేవుని నిర్దేశం” తీసుకుంటూ ఉండండి

2026 వార్షిక వచనం: “దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు సంతోషంగా ఉంటారు.”—మత్త. 5:3.

ముఖ్యాంశం

యెహోవా ఇచ్చే ఆధ్యాత్మిక ఆహారం, బట్టలు అలాగే ఇల్లు వల్ల మనం ఎలా ప్రయోజనం పొందుతూ ఉండవచ్చో చూస్తాం.

1. మనుషులకు ఉండే కొన్ని కనీస అవసరాలు ఏంటి? (మత్తయి 5:3)

మనుషులకు కొన్ని కనీస అవసరాలు ఉంటాయని యెహోవాకు తెలుసు. ఉదాహరణకు, మనం బ్రతకడానికి ఆహారం, బట్టలు, ఇల్లు అవసరం. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా, అది కొంతకాలం వరకైనా సరే, మనం బ్రతకడం కష్టంగా ఉంటుంది. యెహోవా మనలో భౌతిక అవసరాలతో పాటు ఆధ్యాత్మిక అవసరాల్ని కూడా పెట్టాడు. (మత్తయి 5:3 చదవండి.) మనం నిజంగా సంతోషంగా ఉండాలంటే ఆ అవసరాలు ఏంటో గుర్తించి, వాటిని తీర్చుకుంటూ ఉండాలి.

2. ‘దేవుని నిర్దేశం అవసరమని గుర్తించడం’ అంటే ఏంటో ఉదాహరణతో చెప్పండి.

2 ‘దేవుని నిర్దేశం అవసరమని గుర్తించడం’ అంటే ఏంటి? గ్రీకు భాషలో ఈ మాట, పవిత్రశక్తి కోసం ఒక బిచ్చగాడిలా అడుక్కోవడం అనే అర్థాన్నిస్తుంది. దీన్ని అర్థంచేసుకోవడానికి, వీధి చివర చిరిగిపోయిన బట్టలతో, తిండీతిప్పలు లేక, ఎండకు మాడిపోయి, చలికి వణికిపోతున్న ఒక బిచ్చగాడిని ఊహించుకోండి. చనిపోకుండా ఉండాలన్నా, కాస్త బలం కావాలన్నా వేరేవాళ్ల సహాయం అవసరమని ఆ బిచ్చగాడికి తెలుసు. అదేవిధంగా, “దేవుని నిర్దేశం” తమకు అవసరమని గుర్తించేవాళ్ల పరిస్థితి మారాలంటే, వాళ్లకు సహాయం అవసరం. అందుకే, యెహోవాను ప్రేమించేవాళ్లు ఆయనిచ్చే నిర్దేశాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండాలి.

3. ఈ ఆర్టికల్‌లో మనం దేని గురించి చూస్తాం?

3 ఈ ఆర్టికల్‌లో ముందుగా, సహాయం కోసం యేసును బ్రతిమిలాడిన ఫేనీకే స్త్రీ ఉదాహరణ చూస్తాం. దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు పెంచుకోవాల్సిన మూడు లక్షణాల గురించి ఆ ఉదాహరణ చూపిస్తుంది. దాంతోపాటు, దేవుని నిర్దేశాన్ని పాటించిన అపొస్తలులైన పేతురు, పౌలు అలాగే రాజైన దావీదు ఆదర్శాన్ని కూడా చూస్తాం.

మనకు చాలా అవసరమైన మూడు లక్షణాలు

4. యేసు ఏం చేయాలని ఫేనీకే స్త్రీ కోరుకుంది?

4 ఒక సందర్భంలో యేసు దగ్గరికి ఒక ఫేనీకే స్త్రీ వచ్చింది. ఆమె కూతురు, ‘చెడ్డదూత పట్టడం వల్ల విపరీతంగా బాధపడుతోంది.’ (మత్త. 15:21-28) కాబట్టి, ఆ ఫేనీకే స్త్రీ మోకాళ్ల మీద పడి, సహాయం చేయమని యేసును బ్రతిమిలాడింది. ఈమె యేసు దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని ఆసక్తికరమైన లక్షణాల్ని చూపించింది. ఇప్పుడు వాటిలో కొన్నిటిని చూద్దాం.

5. ఫేనీకే స్త్రీ ఏ లక్షణాలు చూపించింది? దానికి యేసు ఏం చేశాడు? (చిత్రం కూడా చూడండి.)

5 ఫేనీకే స్త్రీ నిజమైన వినయం చూపించింది. అలాగని ఎందుకు చెప్పవచ్చు? సాధారణంగా అన్యుల ఇళ్లలో పెంచుకునే ఒక కుక్కపిల్లతో యేసు ఫేనీకే స్త్రీని పోల్చాడు. అయినా ఆమె బాధపడలేదు. యేసు మిమ్మల్నే కుక్కపిల్లతో పోలిస్తే మీకెలా అనిపిస్తుంది? మిమ్మల్ని అవమానించాడు అనుకుని, అక్కడి నుండి వెళ్లిపోతారా? ఫేనీకే స్త్రీ మాత్రం అలా చేయలేదు. ఆమె వినయమే కాదు, పట్టుదల కూడా చూపించింది. ఆమె పదేపదే యేసును సహాయం అడిగిన విధానంలో ఆమె పట్టుదల కనిపిస్తుంది. ఆమె ఎందుకు అలా చేసింది? ఆమెకు యేసు మీదున్న విశ్వాసమే దానికి కారణం. నిజానికి, “ఇశ్రాయేలు ప్రజల్లో తప్పిపోయిన గొర్రెల్లాంటి వాళ్ల దగ్గరికి మాత్రమే దేవుడు నన్ను పంపించాడు” అని యేసు చెప్పినా, ఆమె విశ్వాసాన్ని చూసి ఆయన ముందెప్పుడూ చేయని ఒక పని చేశాడు. అదేంటంటే, అన్యురాలైన ఆ స్త్రీ కూతురికి పట్టిన చెడ్డదూతను వెళ్లగొట్టి, ఆమెను బాగుచేశాడు.

ఒక ఫేనీకే స్త్రీ మోకాళ్ల మీద పడి సహాయం చేయమని యేసును బ్రతిమిలాడుతుంది. యేసు అలాగే ఆయన శిష్యుల్లో ముగ్గురు భోజన బల్ల దగ్గర కూర్చుని ఆమె మాటల్ని వింటున్నారు.

ఫేనీకే స్త్రీకి వినయం, పట్టుదల, విశ్వాసం ఉన్నాయి కాబట్టి యేసు సహాయం చేశాడు (5వ పేరా చూడండి)


6. ఫేనీకే స్త్రీ ఉదాహరణ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

6 మన ఆధ్యాత్మిక అవసరాలు తీరాలంటే, మనం కూడా వినయం, పట్టుదల, బలమైన విశ్వాసం చూపించాలి. కేవలం వినయం ఉన్న వ్యక్తే, పట్టుదలగా దేవుని సహాయం కోసం అడుగుతాడు. మనం యేసుక్రీస్తు మీద బలమైన విశ్వాసం చూపించాలి. అలాగే తన శిష్యులకు నిర్దేశాలు ఇవ్వడానికి ఉపయోగించుకుంటున్న వాళ్లమీద పూర్తి నమ్మకం ఉంచాలి. (మత్త. 24:45-47) ఆ లక్షణాలు చూపించేవాళ్ల ఆధ్యాత్మిక అవసరాల్ని యెహోవా, ఆయన కుమారుడు చూసుకుంటారు. (యాకోబు 1:5-7 పోల్చండి.) అయితే, ఇప్పుడు యెహోవా మనకు ఆధ్యాత్మిక ఆహారాన్ని, బట్టల్ని, ఇంటిని ఎలా ఇస్తున్నాడో చూద్దాం. వాటిని మనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలో అపొస్తలులైన పేతురు, పౌలు అలాగే రాజైన దావీదు ఉదాహరణల నుండి నేర్చుకుంటాం.

పేతురులా ఆధ్యాత్మిక ఆహారాన్ని పుష్టిగా తీసుకోండి

7. యేసు పేతురుకు ఏ పని అప్పగించాడు? దానికోసం పేతురు ఏం కూడా చేయాలి? వివరించండి. (హెబ్రీయులు 5:14–6:1)

7 అపొస్తలుడైన పేతురు ఉదాహరణ గమనించండి. తన ప్రజల్ని, ‘శాశ్వత జీవితాన్నిచ్చే మాటలతో’ పోషించడానికి యెహోవా పంపించిన మెస్సీయ యేసే అని గుర్తించిన మొదటి యూదుల్లో ఈయన ఒకరు. (యోహా. 6:66-68) యేసు పునరుత్థానమై పరలోకానికి వెళ్లే ముందు, “నా చిన్న గొర్రెల్ని మేపు” అని పేతురుకు చెప్పాడు. (యోహా. 21:17) పేతురు ఆ బాధ్యతను నమ్మకంగా చేశాడు. అలాగే బైబిల్లో రెండు ఉత్తరాల్ని రాసే అవకాశం కూడా యెహోవా ఆయనకు ఇచ్చాడు. అయితే, పేతురు కూడా ఆధ్యాత్మిక ఆహారంతో తనను తాను పోషించుకున్నాడు. ఉదాహరణకు, పవిత్రశక్తి సహాయంతో అపొస్తలుడైన పౌలు రాసిన ఉత్తరాల్ని పేతురు శ్రద్ధగా చదివాడు. పౌలు రాసిన “కొన్ని విషయాలు అర్థంచేసుకోవడానికి కష్టంగా” ఉన్నాయని పేతురు ఒప్పుకున్నాడు. (2 పేతు. 3:15, 16) కానీ పౌలు తన ఉత్తరాల్లో వడ్డించిన ‘గట్టి ఆహారాన్ని’ జీర్ణించుకోవడానికి లేదా అర్థంచేసుకోవడానికి, పాటించడానికి పేతురు పట్టుదలగా ప్రయత్నించాడు. తనకు యెహోవా సహాయం చేస్తాడనే నమ్మకంతో ఉన్నాడు.—హెబ్రీయులు 5:14–6:1 చదవండి.

8. యెహోవా ఒక కొత్త నిర్దేశం ఇచ్చినప్పుడు పేతురు ఏం చేశాడు?

8 యెహోవా ఇచ్చే నిర్దేశాలకు లోబడడం ద్వారా పేతురుకు విశ్వాసం ఉందని నిరూపించుకున్నాడు. ఉదాహరణకు, పేతురు యొప్పే నగరంలో ఉన్నప్పుడు ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఒక దేవదూత, మోషే ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రమైన జంతువుల్ని చూపించి వాటిని చంపి, తినమని చెప్పాడు. అది విన్న ఏ యూదుడైనా ఖంగుతింటాడు. అందుకే, పేతురు ఆ మాట వినగానే ఇలా అన్నాడు: “లేదు ప్రభువా, నేను అలా చేయలేను. ధర్మశాస్త్రం ప్రకారం నిషిద్ధమైనదేదీ, అపవిత్రమైనదేదీ నేను ఎప్పుడూ తినలేదు.” అప్పుడు ఆ దేవదూత, “దేవుడు పవిత్రపర్చిన వాటిని నిషిద్ధమైనవని అనొద్దు” అని చెప్పాడు. (అపొ. 10:9-15) అప్పుడు పేతురుకు విషయం అర్థమైంది. అది మనకెలా తెలుసు? ఆ దర్శనం అయిపోయిన తర్వాత, అన్యుడైన కొర్నేలి పంపించిన ముగ్గురు వ్యక్తులు పేతురు దగ్గరికి వచ్చి, వాళ్ల యజమాని తనను చూడాలనుకుంటున్నాడని చెప్పారు. సాధారణంగా, పేతురు అన్యుల గుమ్మంలో అడుగుపెట్టడు. ఎందుకంటే, యూదులు అన్యుల్ని అపవిత్రమైనవాళ్లుగా చూసేవాళ్లు. (అపొ. 10:28, 29) కానీ యెహోవా కొత్త నిర్దేశం ఇచ్చినప్పుడు, పేతురు ఇక ఏ మాత్రం ఆలోచించకుండా దానికి లోబడి, తన ఆలోచనను మార్చుకున్నాడు. (సామె. 4:18) పేతురు కొర్నేలికీ, ఆయన ఇంటివాళ్లందరికీ ప్రకటించాడు. అప్పుడు, వాళ్లు సత్యాన్ని అంగీకరించడం, వాళ్లమీద పవిత్రశక్తి రావడం, వాళ్లందరూ బాప్తిస్మం తీసుకోవడం చూసి పేతురు చాలా సంతోషించాడు.—అపొ. 10:44-48.

9. గట్టి ఆధ్యాత్మిక ఆహారం మీద ఆకలిని పెంచుకోవడానికి రెండు కారణాలు ఏంటి?

9 మనం కూడా పేతురులాగే దేవుని వాక్యాన్ని చదువుతూ, అందులో ఉన్న పాల లాంటి సత్యాల్ని నేర్చుకుంటూ ఉండాలి. దాంతోపాటు, అర్థంచేసుకోవడానికి కష్టంగా ఉండే గట్టి ఆహారం మీద కూడా మన ఆకలిని పెంచుకుంటూ ఉండాలి. మనం ప్రతీరోజు కాస్త సమయాన్ని పక్కన పెట్టి, దేవుని వాక్యం గురించి లోతుగా ఆలోచించడానికి కృషిచేయాలి, అది మనకు చాలా ఉపయోగం. ఎందుకు? దానికి రెండు కారణాలు ఉన్నాయి: ఒకటి, మనం నేర్చుకున్న విషయాల్నిబట్టి యెహోవా మీద ఉన్న ప్రేమ, ఆయనపై గౌరవం పెరుగుతూ ఉంటాయి. రెండు, యెహోవా చేసిన అద్భుతమైన కార్యాల గురించి వేరేవాళ్లకు చెప్పాలనే తపన మనలో పెరుగుతుంది. (రోమా. 11:33; ప్రక. 4:11) పేతురు ఉదాహరణ మనకు ఇంకో పాఠం కూడా నేర్పిస్తుంది. అదేంటంటే, ఏదైనా లేఖన అవగాహనలో మార్పు వచ్చినప్పుడు, మన ఆలోచనల్ని-పనుల్ని ఆ మార్పుకు తగ్గట్టు మార్చుకోవడానికి రెడీగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఆధ్యాత్మికంగా పుష్టిగా ఉంటాం, యెహోవా చేతిలో ఉపయోగపడే ఒక పనిముట్టుగా తయారౌతాం.

పౌలులా ఆధ్యాత్మికంగా మంచి బట్టలు వేసుకోండి

10. ఆధ్యాత్మికంగా మంచి బట్టలు వేసుకోవడం అంటే ఏంటి? (కొలొస్సయులు 3:8-10)

10 యెహోవా మనకు ఇచ్చేవాటిలో ఇంకొకటి ఏంటంటే, ఆధ్యాత్మిక బట్టలు. అంటే ఏంటి? పౌలు దీనిగురించి ఏమన్నాడంటే, ‘పాత వ్యక్తిత్వాన్ని తీసిపారేయండి, కొత్త వ్యక్తిత్వాన్ని ధరించండి.’ (కొలొస్సయులు 3:8-10 చదవండి.) కొత్త వ్యక్తిత్వాన్ని ధరించడం అనేది ఒక్కసారితో అయిపోయే పని కాదు. దాన్ని మనం ధరించుకుంటూ ఉండాలి. పౌలు ఉదాహరణనే గమనించండి. ఆయన చిన్న వయసులోనే దేవుణ్ణి సంతోషపెట్టాలని చాలా కష్టపడ్డాడు. (గల. 1:14; ఫిలి. 3:4, 5) కానీ దేవుని ఇష్టానికి సంబంధించిన సరైన జ్ఞానం లేకపోవడం వల్ల ఆయన ఆధ్యాత్మికంగా పేదవాడిగా ఉన్నాడు. ఆయనకు యేసుక్రీస్తు బోధలు తెలియకపోవడం వల్ల, గర్వం వల్ల “తలబిరుసుగా” తయారయ్యాడు, చెడ్డ వ్యక్తిత్వాన్ని ధరించుకున్నాడు.—1 తిమో. 1:13.

11. ఏ లోపాన్ని తీసేసుకోవడానికి పౌలు కృషి చేయాల్సి వచ్చింది? వివరించండి.

11 క్రైస్తవునిగా మారకముందు పౌలుకు కోపం ముక్కు మీదే ఉండేది. పౌలుకు ప్రభువు శిష్యుల మీద ఎంత కోపం ఉండేదంటే, వాళ్లను “బెదిరిస్తూ ఉన్నాడు. వాళ్లను చంపేయాలని గట్టిగా కోరుకున్నాడు” అని అపొస్తలుల కార్యాలు పుస్తకం చెప్తుంది. (అపొ. 9:1) ఆయన ఒక క్రైస్తవునిగా మారిన తర్వాత, తన పాత వ్యక్తిత్వాన్ని తీసేసుకోవడానికి చాలా కష్టపడ్డాడు. (ఎఫె. 4:22, 31) అయినప్పటికీ పౌలు, బర్నబాల మధ్య ఒక చిన్న వివాదం వచ్చినప్పుడు, ‘వాళ్లు కోపంతో గొడవపడ్డారు.’ (అపొ. 15:37-39) తనకున్న లోపం ఇక ఎప్పటికీ పోదు అని పౌలు బాధపడ్డాడా? లేదు, ఆయన పట్టువదల్లేదు. యెహోవాను సంతోషపెట్టడం కోసం తన “శరీరాన్ని నలగ్గొట్టుకుంటూ,” తనకున్న అపరిపూర్ణతలతో పోరాడుతూ ఉన్నాడు.—1 కొరిం. 9:27, అధస్సూచి.

12. చెడ్డ వ్యక్తిత్వాన్ని తీసేసుకోవడానికి పౌలుకు ఏది సహాయం చేసింది?

12 పౌలు ప్రయత్నాలు వృథాగా పోలేదు. మొత్తానికి ఆయన తన చెడ్డ వ్యక్తిత్వాన్ని తీసేసుకుని, కొత్త వ్యక్తిత్వాన్ని ధరించుకున్నాడు. అది ఆయన తన సొంత శక్తితో మాత్రం చేయలేదు. (ఫిలి. 4:13) పేతురులా పౌలు కూడా, “దేవుడిచ్చే బలం మీద” ఆధారపడ్డాడు. (1 పేతు. 4:11) అయినా కొన్నిసార్లు, పౌలు తనవల్ల కావట్లేదు అని చేతులెత్తేశాడు. కానీ ఆయన అలా డీలాపడిన ప్రతీసారి, యెహోవా తనకోసం చేసిన మంచివాటిని తలచుకున్నాడు. దానివల్ల ఎన్నిసార్లు పడిపోయినా, మళ్లీ తిరిగి లేవాలనే తపన ఆయనలో పెరిగింది.—రోమా. 7:21-25.

13. మనం పౌలులా ఎలా ఉండొచ్చు?

13 మనం ఎంతకాలం నుండి సత్యంలో ఉన్నాసరే, పౌలులా మన పాత వ్యక్తిత్వాన్ని తీసేసుకుని దేవుడు ఇచ్చే ఆధ్యాత్మిక బట్టల్ని, అంటే కొత్త వ్యక్తిత్వాన్ని ధరించుకుంటూ ఉండాలి. అయితే, కొన్నిసార్లు మనకు కోపం వచ్చినా లేదా ఎవరినైనా బాధపెట్టేలా మాట్లాడినా, మనం ఇక మారము అనుకోకూడదు. మార్పులు చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. మన ఆలోచనలు, పనులు మార్చుకోవాలనే మన లక్ష్యం వైపు అడుగులు వేస్తూనే ఉండాలి. (రోమా. 12:1, 2; ఎఫె. 4:24) అలా చేస్తున్నప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, సాధారణంగా మనం వేసుకునే బట్టలు మనకు తగ్గట్టు కుట్టించుకుంటాం. కానీ యెహోవా ఇచ్చే ఆధ్యాత్మిక బట్టల విషయంలో మాత్రం, వాటికి తగ్గట్టు మనం మారాలి. మన వ్యక్తిత్వాన్ని మార్చుకుంటూ ఉండాలంటే, యెహోవా మన నుండి ఏం కోరుతున్నాడో తెలుసుకుంటూ ఉండాలి.

దావీదులా ఆధ్యాత్మిక ఇంట్లోనే ఉండండి

14-15. యెహోవా తన ప్రజలకు ఎలా ఆధ్యాత్మిక ఆశ్రయం లేదా ఇల్లు ఇస్తాడు? (కీర్తన 27:5) (కవర్‌ పేజీ చిత్రం కూడా చూడండి.)

14 మనం నిజంగా సంతోషంగా ఉండాలంటే ఆధ్యాత్మిక ఆహారం, ఆధ్యాత్మిక బట్టలు మాత్రమే సరిపోవు. మనకు ఆధ్యాత్మిక ఇల్లు కూడా అవసరం. ఇంతకీ ఆధ్యాత్మిక ఇల్లు అంటే ఏంటి? అది ఇచ్చే కాపుదల నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు?

15 రాజైన దావీదు యెహోవా ఇచ్చే ఆధ్యాత్మిక ఆశ్రయం లేదా ఇల్లు గురించి మాట్లాడాడు. (కీర్తన 27:5 చదవండి.) తన మీదున్న విశ్వాసాన్ని శాశ్వతంగా పాడుచేసే దేని నుండైనా, ఎవరి నుండైనా యెహోవా మనల్ని కాపాడతాడు. ఆ కాపుదలే ఆధ్యాత్మిక ఆశ్రయం లేదా ఇల్లు. అయితే, యెహోవా మనల్ని బయటి నుండి వచ్చే ఆపదల నుండి ఎలా కాపాడతాడు? మనకు వ్యతిరేకంగా తయారైన ఏ ఆయుధం కూడా విజయం సాధించదని ఆయన మాటిస్తున్నాడు. (కీర్త. 34:7; యెష. 54:17) సాతాను, చెడ్డదూతలు, వ్యతిరేకులు ఎంత బలవంతులైనా, యెహోవా వాళ్లందరికన్నా చాలా శక్తిమంతుడు. కాబట్టి వాళ్లు మనల్ని కోలుకోలేనంతగా దెబ్బ తీయలేరు. ఒకవేళ వాళ్లు మన ప్రాణం తీసినా, యెహోవా మళ్లీ ప్రాణం పోసి పునరుత్థానం చేయగలడు. (1 కొరిం. 15:55-57; ప్రక. 21:3, 4) అయితే, యెహోవా మన లోపల నుండి వచ్చే ఆందోళనల్ని తట్టుకునేలా కూడా సహాయం చేస్తాడు. వాటివల్ల మనకు శాశ్వత హాని జరగకుండా చూస్తాడు. (సామె. 12:25; మత్త. 6:27-29) మన ప్రేమగల పరలోక తండ్రి, కష్టాల్లో మనల్ని ప్రోత్సహించడానికి బ్రదర్స్‌సిస్టర్స్‌ని ఇచ్చాడు, మనల్ని సంరక్షించే సంఘపెద్దల్ని ఇచ్చాడు. (యెష. 32:1, 2) మనం మీటింగ్స్‌కి వెళ్లినప్పుడు, యెహోవా ఇచ్చే కాపుదల నుండి మనం ఏయే విధాలుగా ప్రయోజనం పొందవచ్చో తెలుసుకుంటాం.—హెబ్రీ. 10:24, 25.

“కావలికోట” అధ్యయనం జరుగుతున్నప్పుడు కామెంట్‌ చెప్పడానికి చేయి పైకెత్తుతున్న సిస్టర్‌. వేరే బ్రదర్స్‌-సిస్టర్స్‌ కూడా చేతులు ఎత్తుతున్నారు.

బ్రదర్స్‌సిస్టర్స్‌తో కలిసి సంఘ కూటాలకు వెళ్తూ ఆధ్యాత్మిక సహాయం తీసుకుంటున్న ఒక సిస్టర్‌ (14-15 పేరాలు చూడండి)


16. యెహోవా దావీదును ఏయే విధాలుగా కాపాడాడు?

16 దావీదు తనకు లోబడినప్పుడు మంచి నిర్ణయాలు తీసుకునేలా యెహోవా సహాయం చేశాడు. దావీదు కూడా సంతోషంగా ఉన్నాడు. అలా యెహోవా ఒక రకంగా ఆయన్ని సంరక్షించాడు. (సామెతలు 5:1, 2 పోల్చండి.) కానీ దావీదు దేవుని ప్రమాణాల్ని పట్టించుకోనప్పుడు వచ్చిన చెడు పర్యవసానాల నుండి యెహోవా ఆయన్ని కాపాడలేదు. (2 సమూ. 12:9, 10) అయితే, కొన్నిసార్లు దావీదు ఏ తప్పూ చేయకపోయినా బాధలు పడ్డాడు. మరి వాటి సంగతేంటి? అలాంటి సమయంలో, దావీదు తన గుండెల్లో ఉన్న బాధనంతా యెహోవాకు చెప్పుకున్నాడు. యెహోవా ఆ ప్రార్థనల్ని విని, ఆయన్ని ఎంతో ప్రేమిస్తున్నాడని, పట్టించుకుంటున్నాడని అభయమిచ్చి ఆయన భయాల్ని పోగొట్టాడు.—కీర్త. 23:1-6.

17. మనం దావీదులా ఎలా ఉండొచ్చు?

17 మనం కూడా దావీదులా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు దేవుని సలహా కోసం చూడాలి. కొన్నిసార్లు మనకు కొన్ని కష్టాలు రావచ్చు. దాని అర్థం, యెహోవా మనల్ని పట్టించుకోవట్లేదని కాదుగానీ, బహుశా మనం తీసుకున్న చెడు నిర్ణయం వల్లే మనకు ఆ కష్టాలు వచ్చి ఉండొచ్చు. (గల. 6:7, 8) అయితే, కొన్నిసార్లు మనం ఏ తప్పూ చేయకపోయినా కష్టాలు పడుతూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో యెహోవా మన హృదయాలకు, మనసులకు కాపలా ఉంటాడని నమ్మి, మన గుండెల్లో ఉన్న బాధనంతా ప్రార్థనలో ఆయనకు చెప్పుకోవాలి.—ఫిలి. 4:6, 7.

మీ ఆధ్యాత్మిక అవసరాలు తీర్చుకుంటూ ఉండండి

18. దేవుని నిర్దేశం గురించి చాలామంది ఏమనుకుంటున్నారు? దేవుని నిర్దేశం తీసుకుంటూ ఉండాలంటే మనం ఏం చేయాలి? (చిత్రాలు కూడా చూడండి.)

18 2026 వార్షిక వచనం ఇలా చెప్తుంది: “దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు సంతోషంగా ఉంటారు.” ఈ మాటలు ఇంతకుముందుకన్నా ఇప్పుడు చాలా నిజం. ఎందుకంటే, నేడు చాలామంది జీవితాల్లో సంతోషం కరువైంది. దానికి కారణం ఏంటంటే, వాళ్లకు దేవుడు గానీ, దేవుని నిర్దేశం గానీ అక్కర్లేదు అనుకుంటున్నారు. ఇంకా చాలామంది దేవుణ్ణి నమ్మినా, వాళ్లకు నచ్చినట్టు ఆరాధిస్తున్నారు. ఇంకొంతమందేమో, వాళ్లకు కావాల్సిన నిర్దేశం కోసం మనుషుల వైపు చూస్తున్నారు. కానీ మనం వాళ్లలా ఉండకూడదు. బదులుగా, యెహోవా ఇచ్చే ఆధ్యాత్మిక ఆహారం తీసుకుంటూ, కొత్త వ్యక్తిత్వం అనే బట్టలు వేసుకుంటూ, యెహోవా ఇచ్చే ఇంట్లో తలదాచుకుంటూ ఉండాలి.

చిత్రాలు: ముందు చిత్రంలో ఉన్న ఆ సిస్టర్‌ తన ఆధ్యాత్మిక అవసరాన్ని తీర్చుకుంటుంది. 1. ఆమె ఒక “కావలికోట” ఆర్టికల్‌ని చదువుతుంది. 2. ఆమె ఒక జంటకి ఆహారం తీసుకెళ్లి ఇస్తుంది. ఆ ఇంటావిడ భర్త ఛైర్‌లో కూర్చున్నాడు, ఆయన తలకు కట్టుకట్టి ఉంది, చేతికి సెలైన్‌ కూడా పెట్టుంది. 3. ఇద్దరు బ్రదర్స్‌ తనకు కాపరి సందర్శనం చేస్తున్నందుకు ఆమె సంతోషిస్తుంది.

యెహోవా ఇచ్చే ఆహారంతో, బట్టలతో, ఇల్లుతో మీ ఆధ్యాత్మిక అవసరాల్ని తీర్చుకుంటూ ఉండండి (18వ పేరా చూడండి)a

వీటి నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు?

  • ఆధ్యాత్మిక ఆహారం

  • ఆధ్యాత్మిక బట్టలు

  • ఆధ్యాత్మిక ఇల్లు

పాట 162 మాకు అన్నీ నువ్వే యెహోవా

a చిత్రాల వివరణ: ముందు చిత్రంలో ఉన్న సిస్టర్‌ తన ఆధ్యాత్మిక అవసరాల్ని తీర్చుకుంటూ ఉంది. ఆమె కావలికోట చదువుతుంది, కొత్త వ్యక్తిత్వంలో భాగంగా ఇతరులపై దయ చూపిస్తుంది, ప్రేమగల కాపరుల సహాయం తీసుకుంటుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి