అధ్యయన ఆర్టికల్ 50
పాట 48 ప్రతీరోజు యెహోవాతో నడుద్దాం
యెహోవాలా వినయం చూపించండి
“మీరు, దేవునికి ప్రియమైన పిల్లల్లా ఆయన్ని అనుకరించండి.”—ఎఫె. 5:1.
ముఖ్యాంశం
యెహోవాలా వినయం చూపించే నాలుగు విధానాలు చూస్తాం.
1. యెహోవా వినయం ఎందుకు చెప్పుకోదగినది?
అధికారంలో ఉన్న వ్యక్తిని చూస్తే వినయం అనే లక్షణం మీకు గుర్తొస్తుందా? రాదు కదా. కానీ యెహోవా సర్వశక్తిమంతుడే అయినా, ఆయన వినయస్థుడు. (కీర్త. 113:5-8) యెహోవాలో అణువణువు వినయం ఉంది. ఆయనలో గర్వం ఛాయలు అస్సలు కనిపించవు. ఈ ఆర్టికల్‌లో యెహోవా వినయం చూపించే నాలుగు విధానాలు చూస్తాం. అలాగే, యేసు తన తండ్రిలాగే వినయాన్ని ఎలా చూపించాడో చూస్తాం. వీటిని పరిశీలించడం వల్ల యెహోవాకు దగ్గరౌతాం, ఆయనలాగే ఇంకా ఎక్కువ వినయం చూపిస్తాం.
ప్రజలు ఫ్రీగా తన దగ్గరకు వచ్చేలా యెహోవా ఉన్నాడు
2. కీర్తన 62:8 యెహోవా గురించి ఏం చెప్తుంది? (చిత్రం కూడా చూడండి.)
2 సాధారణంగా గర్వంగా ఉన్నవాళ్లతో మాట్లాడడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే, వాళ్లు చూపించే అహం వల్ల వాళ్లతో మాట్లాడడానికి మనసు రాదు. కొన్నిసార్లయితే, వాళ్లతో మాట్లాడడమే మానేస్తాం. కానీ మన పరలోక తండ్రైన యెహోవా వాళ్లలా కాదు, ఆయన చాలా వినయస్థుడు. మనల్ని ఆయనకు దగ్గరవ్వమని, మన గుండెల్లో ఉన్న బాధనంతా ఆయనకు చెప్పుకోమని అంటున్నాడు. (కీర్తన 62:8 చదవండి.) ఒక ప్రేమగల తండ్రి తన పిల్లలు చెప్పేది వినడానికి ఎంత ఇష్టపడతాడో, యెహోవా కూడా తన ఆరాధకుల ప్రార్థన వినడానికి అంతే ఇష్టపడతాడు. నిజానికి, అలాంటి చాలా ప్రార్థనల్ని యెహోవా బైబిల్లో రాయించాడు. దీన్నిబట్టి, మనం ఫ్రీగా తన దగ్గరకు రావాలని ఆయన ఎంత కోరుకుంటున్నాడో అర్థమౌతుంది. (యెహో. 10:12-14; 1 సమూ. 1:10-18) అయితే, కొన్ని కారణాలవల్ల యెహోవాతో మాట్లాడే అర్హత మనకు లేదని అనిపించవచ్చు. మరి, అప్పుడేంటి?
తన కొడుకు ఆడుకుంటూ పూల కుండీని పగలగొట్టానని చెప్తుంటే యెహోవాలా వినయంగా వింటున్న నాన్న (2వ పేరా చూడండి)
3. మీరు తనకు తరచూ ప్రార్థన చేయాలని యెహోవా కోరుకుంటున్నాడని ఎలా చెప్పవచ్చు?
3 యెహోవా ప్రేమకు అర్హులం కాదని అనిపించినా, మనం ఆయనకు ప్రార్థన చేయాలి. అలాగని ఎందుకు చెప్పవచ్చు? తప్పిపోయిన కుమారుడి ఉదాహరణలో యేసు యెహోవాను ఒక కరుణగల తండ్రితో పోల్చాడు. కుమారుడు ఎన్నో తప్పులు చేసి, పశ్చాత్తాపపడి మళ్లీ తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి ఏం చేశాడు? యేసుక్రీస్తు ఆ తండ్రి ఏం చేశాడో చెప్తూ ఇలా అన్నాడు: “అతను ఇంకా దూరంగా ఉన్నప్పుడే, వాళ్ల నాన్న అతన్ని చూసి, పరుగెత్తుకుంటూ వచ్చి అతన్ని కౌగిలించుకొని, ఆప్యాయంగా ముద్దుపెట్టుకున్నాడు.” (లూకా 15:17-20) యెహోవా కూడా ఆ తండ్రిలాగే ఉన్నాడు. తప్పు చేశామనే బాధతో లేదా కష్టాల వల్ల విరిగి-నలిగిన హృదయంగలవాళ్లు ఆయనకు ప్రార్థన చేసినప్పుడు, తనకున్న వినయం వల్ల ఆయన శ్రద్ధగా వింటాడు. (విలా. 3:19, 20) యెహోవా కనికరంతో కదిలిపోయి, వాళ్ల దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లి, వాళ్లకు ఊరటను, వాళ్లమీద ప్రేమ-కరుణ ఉన్నాయనే భరోసాను ఇస్తాడు. (యెష. 57:15) అయితే, ఇప్పుడు యెహోవా ఎలా “పరుగెత్తుకుంటూ” వస్తున్నాడు? చాలావరకు సంఘపెద్దల ద్వారా, సాక్షులైన కుటుంబసభ్యుల ద్వారా, బ్రదర్స్‌సిస్టర్స్ ద్వారా ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. (యాకో. 5:14, 15) మనం తనకు దగ్గరవ్వాలనే ఆయన అలా చేస్తున్నాడు.
4. ప్రజలు ఫ్రీగా తన దగ్గరకు వచ్చేలా యేసు ఎలా ఉన్నాడు?
4 యేసు తన తండ్రిలా ఉన్నాడు. యేసు తన తండ్రిలా వినయస్థుడు. దానివల్ల ఆయన భూమ్మీద ఉన్నప్పుడు, ప్రజలు ఆయన దగ్గరకు ఫ్రీగా వచ్చేవాళ్లు. ఏ మొహమాటం లేకుండా ఆయన్ని ప్రశ్నలు కూడా అడిగేవాళ్లు. (మార్కు 4:10, 11) ఆయన ఏదైనా ఒక విషయం మీద వాళ్ల అభిప్రాయం అడిగినప్పుడు, వాళ్లు ఏ భయంలేకుండా మనసులో ఉన్నది చెప్పేవాళ్లు. (మత్త. 16:13-16) ఒకవేళ వాళ్లు తప్పు చేసినా గజగజ వణికిపోయేవాళ్లు కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు దయ, ఓర్పు, కరుణ ఉన్న వ్యక్తని వాళ్లందరికీ తెలుసు. (మత్త. 17:24-27) యేసుక్రీస్తు తన తండ్రిని అంతబాగా అనుకరించబట్టే, యెహోవా ఎలాంటి వ్యక్తో తన శిష్యులు అర్థంచేసుకోగలిగారు. (యోహా. 14:9) యెహోవా ఆనాటి మతనాయకుల్లా గర్వంగా, దురుసుగా లేడు గానీ ఆయన వినయంగా, ప్రజలు ఏ భయం లేకుండా తన దగ్గరకు వచ్చేలా ఉన్నాడని శిష్యులు తెలుసుకోగలిగారు.
5. వేరేవాళ్లు మనతో ఫ్రీగా మాట్లాడేలా వినయం ఎలా సహాయం చేస్తుంది?
5 మనం యెహోవాలా ఎలా ఉండొచ్చు? వినయంగా ఉండడం ద్వారా ఇతరులు మన దగ్గరకు ఫ్రీగా రాగలుగుతారు, మనసువిప్పి మాట్లాడగలుగుతారు. వినయం ఇతరులకు మనల్ని దూరంచేసే చెడు లక్షణాల్ని అంటే ఈర్ష్య, గర్వం, క్షమించలేకపోవడం లాంటివి తీసేసి, ఇతరులకు దగ్గర చేసే లక్షణాలు అంటే దయ, ఓర్పు, క్షమించే మనసును పెంచుతుంది. (కొలొ. 3:12-14) ముఖ్యంగా సంఘపెద్దలు, ఇతరులు వాళ్ల దగ్గరకు వచ్చి ఫ్రీగా మాట్లాడేలా ఉండడానికి కృషి చేయాలి. నిజమే వాళ్లతో మాట్లాడాలంటే ముందు వాళ్లు కనిపించాలి. కాబట్టి సంఘపెద్దలు నేరుగా మీటింగ్స్‌కు హాజరవ్వడానికి ప్రయత్నించాలి గానీ, అనవసరంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరవ్వడానికి చూడకూడదు. వీలైనప్పుడల్లా, సంఘంలోని బ్రదర్స్‌సిస్టర్స్ అందరితో పరిచర్య చేసేలా చూస్తారు. సంఘపెద్దలు ప్రచారకులకు బాగా పరిచయమైతే, వాళ్లు తమ సమస్యలు ఫ్రీగా చెప్పుకోగలుగుతారు.
యెహోవా అర్థం చేసుకుంటాడు
6-7. తన సేవకుల ప్రార్థనలు విని, యెహోవా తన అభిప్రాయాన్ని మార్చుకున్న కొన్ని ఉదాహరణలు చెప్పండి.
6 గర్వం ఉన్నవాళ్లు, తమకే అన్నీ తెలుసు అనుకుంటారు, వేరేవాళ్లు చెప్పేది వినరు. కానీ యెహోవా అలాకాదు, ఆయన వినయస్థుడు, వేరేవాళ్లను అర్థం చేసుకుంటాడు. ఆయన అన్ని విధాల్లో వేరేవాళ్ల కన్నా ఉన్నతుడైనా, ఇతరులు చెప్పేది వినడానికి ఇష్టపడతాడు. మోషే వాళ్ల అక్క మిర్యాముతో యెహోవా ఎలా ప్రవర్తించాడో ఒకసారి గమనించండి. ఆమె అహరోనుతో కలిసి యెహోవా ప్రతినిధిగా ఉన్న మోషేకు వ్యతిరేకంగా సణిగింది. అంటే ఒకరకంగా మిర్యాము యెహోవా మీద గౌరవం లేదని చూపించింది. అప్పుడు యెహోవాకు చాలా కోపం వచ్చి, మిర్యాముకు కుష్ఠు వ్యాధి వచ్చేలా చేశాడు. అయితే, మిర్యామును బాగుచేయమని మోషే, అహరోనులు బతిమాలినప్పుడు యెహోవా ఏం చేశాడు? ఆయన చాలా గర్వంగా, తన మాటే శాసనం అన్నట్టు ప్రవర్తించాడా? లేదు. యెహోవా వినయస్థుడు కాబట్టి మోషే, అహరోనుల మాట విని మిర్యామును బాగుచేశాడు.—సంఖ్యా. 12:1-15.
7 రాజైన హిజ్కియా విషయంలో కూడా యెహోవా వినయం చూపించాడు. హిజ్కియా రాజు చనిపోతాడని యెహోవా తన ప్రవక్తతో చెప్పించాడు. అప్పుడు హిజ్కియా ఏడుస్తూ తనను బాగుచేయమని యెహోవాను బతిమాలాడు. అప్పుడు యెహోవా కరుణతో ఆ రాజు ఆయుష్షును ఇంకో 15 సంవత్సరాలు పొడిగించాడు. (2 రాజు. 20:1, 5, 6) అవును, తనకున్న వినయం వల్ల యెహోవా కనికరాన్ని చూపిస్తాడు, వేరేవాళ్ల మాట వింటాడు.
8. యేసు అర్థంచేసుకునే వ్యక్తని ఏ ఉదాహరణల్ని బట్టి చెప్పవచ్చు? (మార్కు 3:1-6)
8 యేసు తన తండ్రిలా ఉన్నాడు. యేసు భూమ్మీద ఉన్నప్పుడు సాధ్యమైనంతవరకు అందరికీ మంచి చేశాడు. ఉదాహరణకు, సబ్బాతు రోజున ప్రజల్ని బాగుచేస్తే మతనాయకులు ఆయన్ని వ్యతిరేకిస్తారని తెలిసినా, యేసు ఆ రోజున ప్రజల్ని బాగుచేశాడు. (మార్కు 3:1-6 చదవండి.) అంతేకాదు, నేడు క్రైస్తవ సంఘానికి శిరస్సుగా ప్రజల్ని అర్థం చేసుకుంటూనే ఉన్నాడు. ఉదాహరణకు, సంఘంలో ఎవరైనా ఒక ఘోరమైన పాపం చేస్తే, యేసు అతనితో ఓర్పుగా ఉంటాడు. అలాగే తప్పును సరి చేసుకోవడానికి అతనికి బోలెడన్ని అవకాశాలు ఇస్తాడు.—ప్రక. 2:2-5.
9. మన ఆలోచనల్లో, పనుల్లో ఇతరుల్ని ఎలా అర్థంచేసుకోవచ్చు? (చిత్రాలు కూడా చూడండి.)
9 మనం యెహోవాలా ఎలా ఉండొచ్చు? మనం యెహోవాలా ఇతరుల్ని అర్థంచేసుకోవడానికి కృషి చేయాలి. అంటే, యెహోవా ఎలా ఆలోచిస్తున్నాడో, ప్రవర్తిస్తున్నాడో మనం కూడా అలానే ఉండడానికి వినయంగా కృషిచేయాలి. (యాకో. 3:17) ఉదాహరణకు, అర్థంచేసుకునే తల్లిదండ్రులు వాళ్ల పిల్లల నుండి వాళ్లు చేయగలిగే దానికన్నా ఎక్కువ ఆశించరు. ఈ విషయంలో మంచి ఉదాహరణ, పిల్లల్ని బాగా అర్థంచేసుకున్న యాకోబుది. ఆ విషయాన్ని మనం ఆదికాండం 33:12-14 లో చూస్తాం. వినయం, అర్థంచేసుకునే మనస్తత్వం ఉన్న తల్లిదండ్రులు వాళ్ల పిల్లల్ని ఒకరితో ఒకర్ని పోల్చరు. క్రైస్తవ పెద్దలు కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు, ఒక సంఘపెద్ద తన అభిప్రాయాన్నే పట్టుకుని వేలాడకుండా, బైబిలు సూత్రాలకు విరుద్ధంగా లేనంతవరకు ఎక్కువమంది పెద్దలు దేనికైతే మద్దతిస్తారో దానికే మద్దతివ్వాలి. (1 తిమో. 3:2, 3) ఏదైనా విషయంలో వేరేవాళ్ల ఆలోచన లేదా అభిప్రాయం మనకు వేరుగా ఉన్నప్పుడు, అసలు వాళ్లు ఎందుకలా ఆలోచిస్తున్నారో అర్థంచేసుకోవడానికి ప్రయత్నించాలి. (రోమా. 14:1) అవును, సంఘంలో ఉన్న ప్రతిఒక్కరూ అలా ఉండడానికి కృషి చేసినప్పుడు ‘మనం అర్థం చేసుకునేవాళ్లమని అందరికీ తెలుస్తుంది.’—ఫిలి. 4:5, అధస్సూచి.
ఒక తండ్రి తన పిల్లలు ప్రీచింగ్‌లో ఎంత చేయగలరో అంతే ఆశిస్తాడు (9వ పేరా చూడండి)
యెహోవాకు ఓపిక ఎక్కువ
10. యెహోవా ఏయే విధాలుగా ఓపిక చూపించాడు?
10 సాధారణంగా, పొగరుబోతులు దేనికోసమూ వేచి చూడడానికి ఇష్టపడరని మీరు గమనించే ఉంటారు. పొగరుబోతులకు రవ్వంత ఓపిక కూడా ఉండదు. కానీ యెహోవా అస్సలు అలా కాదు, ఆయన ఓర్పుకు మారుపేరు. ఉదాహరణకు, నోవహు రోజుల్లో చెడ్డవాళ్లందర్నీ నాశనం చేయడానికి 120 సంవత్సరాలు వేచి చూస్తానని యెహోవా చెప్పాడు. (ఆది. 6:3) ఈలోపు నోవహు తన పిల్లల్ని పెంచగలిగాడు, కుటుంబం సహాయంతో ఓడను కట్టగలిగాడు. ఆ తర్వాత యెహోవా ప్రతినిధిగా వచ్చిన దేవదూత కూడా సొదొమ, గొమొర్రాల నాశనం గురించి అబ్రాహాము అడిగే ప్రశ్నల్ని ఓపిగ్గా విన్నాడు. ఆ దేవదూత స్థానంలో ఒక పొగరుబోతు ఉండి ఉంటే, ‘నన్ను ప్రశ్నించడానికి నీకు ఎన్ని గుండెలు!’ అని అనుండేవాడు. కానీ ఆ దేవదూత యెహోవాలా అబ్రాహాముతో ఓపిగ్గా ఉన్నాడు.—ఆది. 18:20-33.
11. రెండో పేతురు 3:9 ప్రకారం యెహోవా మన కాలంలో ఎందుకు ఓపిక చూపిస్తున్నాడు?
11 యెహోవా మన కాలంలో కూడా ఓపిక పడుతున్నాడు. ఈ లోకాన్ని నాశనం చేయడానికి నిర్ణయించిన రోజు కోసం ఓపిక పడుతున్నాడు. ఎందుకు? “ఎందుకంటే ఎవ్వరూ నాశనమవ్వడం ఆయనకు ఇష్టంలేదు. ఆయన, అందరికీ పశ్చాత్తాపపడే అవకాశం దొరకాలని కోరుకుంటున్నాడు.” (2 పేతురు 3:9 చదవండి.) అయితే, యెహోవా ఓపిక బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందా? ఎంతమాత్రం కాదు! ఆయన ఓపిక పట్టడం వల్ల, లక్షలమంది ఆయన గురించి తెలుసుకుని, ఆయనకు దగ్గరయ్యారు. అలాగే ఇంకా ఎన్నో లక్షలమంది ఆయన గురించి తెలుసుకుంటారనే నమ్మకం మనకు ఉంది. అయితే, యెహోవా ఓపికకు హద్దులున్నాయి. ఆయన ప్రజల్ని ప్రేమిస్తాడు. యెహోవాకు ప్రజలంటే ఇష్టమే, కానీ ఆయన విషయాల్ని చూసీ చూడనట్టు వదిలేయడు. చెడుతనం రాజ్యమేలుతుంటే ఆయన చేతులు కట్టుకుని కూర్చోడు.—హబ. 2:3.
12. యేసు ఎలా యెహోవాలా ఓపిక చూపిస్తున్నాడు?
12 యేసు తన తండ్రిలా ఉన్నాడు. వేల సంవత్సరాలుగా యేసు యెహోవాలాగే ఓపిక చూపిస్తున్నాడు. సాతాను యేసు కళ్ల ముందే యెహోవా గురించి, నమ్మకమైన మనుషుల గురించి పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. (ఆది. 3:4, 5; యోబు 1:11; ప్రక. 12:10) అంతేకాదు, మనుషులు రకరకాల సమస్యల్లో మునిగిపోవడం యేసు చూస్తున్నాడు. “అపవాది పనుల్ని నాశనం చేయడానికి” యేసు ఎంత తపిస్తున్నాడో ఊహించుకోండి! (1 యోహా. 3:8) మరి, అపవాది పనుల్ని పూర్తిగా నాశనం చేయడానికి యెహోవా ఆమోదం ఇచ్చేంతవరకు, యేసు ఓపిక పట్టడానికి ఏది సహాయం చేస్తుంది? యేసుకున్న వినయం. అంతం ఎప్పుడు తీసుకురావాలన్నది యెహోవా చేతుల్లో ఉంది కాబట్టి, యేసు ఓపిక చూపిస్తున్నాడు.—అపొ. 1:7.
13. యేసు తన అపొస్తలులతో ఎందుకు, ఎలా ఓపిక చూపించాడు?
13 యేసు భూమ్మీద ఉన్నప్పుడు తన అపొస్తలులతో ఓపిగ్గా ఉన్నాడు. ఉదాహరణకు, తమలో ఎవరు గొప్ప అని అపొస్తలులు పద్దాక గొడవ పడుతుంటే, ఇక వీళ్లు మారరని యేసు వాళ్లమీద చిరాకు పడలేదు. దానికి బదులు ఆయన వాళ్లతో ఓపిగ్గానే ఉన్నాడు. (లూకా 9:46; 22:24-27) ఏదో ఒకరోజు వాళ్లు మారతారని ఆయన నమ్మాడు. మీరు కూడా ఎప్పుడైనా చేసిన తప్పునే మళ్లీమళ్లీ చేశారా? అలాగైతే వినయం, ఓపిక కలగలసిన రాజు మిమ్మల్ని పరిపాలిస్తున్నాడని తెలుసుకుని, ఊపిరి పీల్చుకోండి.
14. మనం ఓపికను ఎలా పెంచుకోవచ్చు?
14 మనం యెహోవాలా ఎలా ఉండొచ్చు? మనం యెహోవాలా ఆలోచించాలన్నా, పనులు చేయాలన్నా ‘క్రీస్తు లాంటి మనసును’ పెంచుకోవాలి. (1 కొరిం. 2:16) దాన్ని ఎలా చేయవచ్చు? దానికి ఒకటే దారి, సువార్త పుస్తకాల్ని చదవడం. ఆ సువార్త పుస్తకాల్ని చదువుతున్నప్పుడు యేసు ఏం చేశాడో, ఎందుకు చేశాడో సమయం తీసుకుని ఆలోచించండి. అంతేకాదు, క్రీస్తులా ఆలోచించడానికి సహాయం చేయమని యెహోవాను అడగండి. మనం క్రీస్తులాంటి మనసును పెంచుకునే కొద్ది, మన మీద మనం అలాగే బ్రదర్స్-సిస్టర్స్ మీద యెహోవాలా ఎక్కువ ఓపిక చూపించగలుగుతాం.—మత్త. 18:26-30, 35.
యెహోవా కిందిస్థాయి వాళ్లను పైకి ఎత్తుతాడు
15. కీర్తన 138:6 చెప్పినట్టు యెహోవా ఎలా ఉన్నాడు?
15 కీర్తన 138:6 చదవండి. సర్వోన్నతుని కళ్లల్లో పడడం వినయస్థులకు ఎంత గౌరవమో కదా! శతాబ్దాలుగా, యెహోవా కిందిస్థాయి వాళ్లను ఎలా గౌరవించాడో కొన్ని ఉదాహరణలను గమనించండి. వీళ్లలో కొంతమంది మీకు వెంటనే గుర్తుకు కూడా రాకపోవచ్చు. కానీ వాళ్ల గురించి బైబిల్లో ఉంది. ఇస్సాకు, యాకోబు ఇళ్లల్లో దాదాపు 125 సంవత్సరాలు నమ్మకంగా పనిచేసిన దెబోరా అనే దాది గురించి రాసేలా యెహోవా మోషేను ప్రేరేపించాడు. ఈ నమ్మకమైన స్త్రీ గురించి మనకు పెద్దగా తెలియదు. కానీ ఆమె గురించి బైబిల్లో రాయించాడంటే ఆమె యెహోవాకు ఎంత ఇష్టమో అర్థమౌతుంది. (ఆది. 24:59; 35:8, అధస్సూచి) వందల సంవత్సరాల తర్వాత, గొర్రెలు కాసే కుర్రాడైన దావీదును ఇశ్రాయేలు జనాంగానికి రాజుగా చేసి యెహోవా అతన్ని పైకెత్తాడు. (2 సమూ. 22:1, 36) యేసు పుట్టిన కాసేపటికే, ఆ విషయాన్ని అందరికన్నా ముందు బేత్లెహేములోని కాపరులకు చెప్పడం వల్ల యెహోవా వాళ్లను గౌరవించాడు. (లూకా 2:8-11) యోసేపు, మరియలు యేసును ఆలయానికి తీసుకెళ్లినప్పుడు వృద్ధులైన అన్నకు అలాగే సుమెయోనుకు తన కుమారుణ్ణి చూసే గొప్ప అవకాశాన్ని యెహోవా ఇచ్చాడు. (లూకా 2:25-30, 36-38) అవును, “యెహోవా ఉన్నతుడైనా, వినయస్థుల్ని గమనిస్తాడు.”
16. యేసు తన తండ్రిలానే వేరేవాళ్లను ఎలా చూశాడు?
16 యేసు తన తండ్రిలా ఉన్నాడు. తన తండ్రిలా యేసు కిందిస్థాయి వాళ్లను పైకెత్తాడు. ఆయన ‘చదువుకోని సామాన్యులకు’ దేవుని రాజ్యం గురించిన సత్యాన్ని నేర్పించాడు. (అపొ. 4:13; మత్త. 11:25) అంతేకాదు, ఆయన రోగుల్ని బాగుచేశాడు. అలా బాగుచేయడం వల్ల వాళ్ల ఆరోగ్యాన్నే కాదు వాళ్ల ఆత్మగౌరవాన్ని కూడా తిరిగిచ్చాడు. (లూకా 5:13) ఆయన చనిపోవడానికి ముందురోజు రాత్రి ఒక దాసునిలా మారి, తన అపొస్తలుల పాదాల్ని కడిగాడు. (యోహా. 13:5) అలాగే, యేసు పరలోకానికి వెళ్లబోయే ముందు, శాశ్వత జీవితం సంపాదించుకునేలా ఇతరులకు సహాయం చేసే ఒక ముఖ్యమైన పనిని తన అనుచరులకు అప్పగించాడు. అలా అప్పుడూ-ఇప్పుడూ ఉన్న అనుచరుల్ని యేసు గౌరవించాడు.—మత్త. 28:19, 20.
17. మనం వేరేవాళ్లను ఎలా గౌరవించవచ్చు? (చిత్రం కూడా చూడండి.)
17 మనం యెహోవాలా ఎలా ఉండొచ్చు? ఒకవ్యక్తి ప్రాంతం, రంగు, చదువుతో సంబంధం లేకుండా మంచివార్త వినడానికి ఇష్టపడే వాళ్లందరికీ ప్రకటించడం వల్ల మనం వాళ్లను గౌరవిస్తాం. అలాగే మనకు ఎన్ని నైపుణ్యాలు ఉన్నా లేదా బాధ్యతలు ఉన్నా మన బ్రదర్స్‌సిస్టర్స్‌ని మనకన్నా గొప్పవాళ్లుగా చూసినప్పుడు మనం వాళ్లను గౌరవిస్తాం. (ఫిలి. 2:3) ఈ విధంగా, అలాగే వేరే విధాలుగా ఒకరినొకరు ఘనపర్చుకునే విషయంలో ‘ముందుంటే’ యెహోవా మనల్ని ఇష్టపడతాడు.—రోమా. 12:10; జెఫ. 3:12.
అన్నిరకాల ప్రజలకు మంచివార్త ప్రకటించినప్పుడు మనం యెహోవాలా వినయం చూపిస్తాం (17వ పేరా చూడండి)a
18. మీరెందుకు యెహోవాలా వినయంగా ఉండాలనుకుంటున్నారు?
18 మన పరలోక తండ్రిలాగే మనం వినయంగా ఉండడానికి ప్రయత్నించినప్పుడు, వేరేవాళ్లు ఇంకా తేలిగ్గా మన దగ్గరకు రాగలుగుతారు, మనం ఇంకా ఎక్కువ అర్థం చేసుకునేవాళ్లుగా ఉంటాం, ఇంకా ఎక్కువ ఓపిక చూపిస్తాం. అలాగే యెహోవాలా మనం వేరేవాళ్లను గౌరవిస్తాం. వినయంగల మన దేవునికి దగ్గరవ్వడానికి మనం ప్రయత్నించినప్పుడు, ఆయన దృష్టిలో మనం ఇంకా ఎక్కువ విలువైనవాళ్లుగా అవుతాం!—యెష. 43:4.
పాట 159 యెహోవాను మహిమపర్చండి
a చిత్రం వివరణ: జైల్లో ఉన్నవాళ్లకు స్టడీ చేస్తూ మన సిస్టర్స్ యెహోవాలా వినయంగా ఉన్నారు.