కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 మార్చి పేజీలు 8-13
  • యెహోవాలా, యేసులా ఆలోచించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాలా, యేసులా ఆలోచించండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాలా ఆలోచించండి
  • వినయంగా ఉండండి
  • “మంచి వివేచన” చూపించండి
  • “నేను పాపిని”
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • పేరుకు తగ్గట్టు జీవించాడు
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • ఆయన తన బోధకుని దగ్గర క్షమించడం నేర్చుకున్నాడు
    వాళ్లలా విశ్వాసం చూపించండి
  • యెహోవాలా వినయం చూపించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 మార్చి పేజీలు 8-13

అధ్యయన ఆర్టికల్‌ 10

పాట 31 దేవునితో నడవండి!

యెహోవాలా, యేసులా ఆలోచించండి

“క్రీస్తు మనిషిగా ఉన్నప్పుడు బాధలు అనుభవించాడు, కాబట్టి మీరు కూడా క్రీస్తులా ఆలోచించడానికి సిద్ధమవ్వండి.” —1 పేతు. 4:1.

ముఖ్యాంశం

యేసు ఆలోచించిన తీరు నుండి అపొస్తలుడైన పేతురు ఏం నేర్చుకున్నాడు? మనం కూడా ఏం నేర్చుకోవచ్చు?

1-2. యెహోవాను ప్రేమించడం అంటే ఏంటి? దాన్ని యేసు ఎలా చూపించాడు?

ధర్మశాస్త్రంలో అన్నిటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ ఏంటో యేసు ఇలా వివరించాడు: “నువ్వు నీ దేవుడైన యెహోవాను నీ నిండు హృదయంతో, నీ నిండు ప్రాణంతో, నీ పూర్తి బలంతో, నీ నిండు మనసుతో ప్రేమించాలి.” (లూకా 10:27) కాబట్టి మనలో ఉన్నవాటన్నిటితో, మన దగ్గర ఉన్నవాటన్నిటితో మనం యెహోవాను ప్రేమిస్తాం. వాటిలో మన కోరికలు, ఫీలింగ్స్‌, మన బలం, శక్తి, మన ఆలోచనా తీరు అన్నీ ఉన్నాయి. నిజం చెప్పాలంటే, యెహోవా ఆలోచనను పూర్తిగా అర్థం చేసుకోవడం మన తరం కాదు. కానీ ‘క్రీస్తు మనసును’ మనం ఎంతబాగా అధ్యయనం చేస్తే యెహోవాలా అంతబాగా ఆలోచించగలుగుతాం. ఎందుకంటే, యేసు అచ్చుగుద్దినట్టు తన తండ్రిలా ఆలోచించాడు.—1 కొరిం. 2:16.

2 యేసు నిండుమనసుతో యెహోవాను ప్రేమించాడు. తను ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడో యేసుకు బాగా తెలుసు. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పని చేసి తీరాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నాడు. తన తండ్రి ఇష్టం చేయడం మీదే ఆయన మనసుపెట్టాడు కాబట్టి తన ధ్యాస పక్కకు మళ్లేలా దేన్ని అనుమతించలేదు.

3. అపొస్తలుడైన పేతురు యేసు నుండి ఏం నేర్చుకున్నాడు? పేతురు క్రైస్తవుల్ని ఏం చేయమని ప్రోత్సహించాడు? (1 పేతురు 4:1)

3 పేతురు అలాగే మిగతా అపొస్తలులు యేసు పక్కనే ఉంటూ, ఆయన ఎలా ఆలోచిస్తాడో దగ్గరుండి చూడగలిగారు. పేతురు తన మొదటి ఉత్తరాన్ని రాస్తున్నప్పుడు క్రీస్తు ఆలోచనను ‘ఆయుధంలా ధరించమని’ క్రైస్తవుల్ని ప్రోత్సహించాడు.a (1 పేతురు 4:1 అలాగే అధస్సూచి చదవండి.) “ఆయుధంగా ధరించండి” అనే మిలిటరీకి సంబంధించిన ఒక పదాన్ని పేతురు రాశాడు. కాబట్టి క్రైస్తవులు క్రీస్తులా ఆలోచించడం నేర్చుకుంటే తమ పాపపు కోరికలతో, సాతాను లోకంతో పోరాడేందుకు వాళ్ల దగ్గర ఒక శక్తివంతమైన ఆయుధం ఉన్నట్టే!—2 కొరిం. 10:3-5; ఎఫె. 6:12.

4. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

4 యేసు ఎలా ఆలోచించాడో, ఆయనలా మనం ఎలా ఆలోచించాలో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అంతేకాదు, ఈ మూడు విషయాల్ని పరిశీలిస్తాం: (1) యెహోవాలా ఆలోచించడం నేర్చుకుని, అందరం ఒకే ఆలోచన తీరుతో ఎలా ఉండవచ్చు? (2) వినయంగా ఎలా ఉండవచ్చు? (3) ప్రార్థనలో ఆయనపై ఆధారపడుతూ మంచి వివేచన ఎలా చూపించవచ్చు?

యెహోవాలా ఆలోచించండి

5. పేతురు ఒక సందర్భంలో యెహోవాలా ఎలా ఆలోచించలేకపోయాడు?

5 ఒకసారి పేతురు యెహోవాలా ఆలోచించలేకపోయాడు. యేసు యెరూషలేముకు వెళ్లాలని, అక్కడ మత నాయకులు ఆయన్ని బంధిస్తారని, ఎన్నో హింసలు పెట్టి, చంపేస్తారని తన అపొస్తలులకు చెప్పాడు. (మత్త. 16:21) ఇశ్రాయేలీయులకు ఆశాకిరణం, వాగ్దానం చేయబడిన మెస్సీయ చనిపోయేలా యెహోవా అనుమతిస్తాడనే విషయం పేతురు జీర్ణించుకోలేకపోయాడు. (మత్త. 16:16) అందుకే పేతురు యేసును పక్కకు తీసుకెళ్లి: “ప్రభువా, అలా మాట్లాడొద్దు. నీకు అలా జరగనే జరగదు” అని అన్నాడు. (మత్త. 16:22) ఈ విషయంలో పేతురు యెహోవాలా ఆలోచించలేదు కాబట్టి యేసు ఆలోచనను కూడా అందుకోలేకపోయాడు.

6. యేసు యెహోవాలాగే ఆలోచిస్తున్నాడని ఎలా చూపించాడు?

6 యేసు అచ్చం తన పరలోక తండ్రిలాగే ఆలోచించాడు. అందుకే ఆయన పేతురుతో ఇలా అన్నాడు: “సాతానా! నా వెనక్కి వెళ్లు. నువ్వు నా దారికి అడ్డుగా ఉన్నావు. నువ్వు దేవుని ఆలోచనల మీద కాకుండా మనుషుల ఆలోచనల మీద మనసు పెడుతున్నావు.” (మత్త. 16:23) పేతురు ఉద్దేశాలు మంచివే అయ్యుండవచ్చు. కానీ పేతురు ఇచ్చిన సలహాను యేసు తీసుకోలేదు. ఎందుకంటే తన విషయంలో యెహోవా ఇష్టమేంటో యేసుకు బాగా తెలుసు. అందుకే ఈ సందర్భంలో పేతురు యెహోవా ఆలోచనను తన ఆలోచనగా చేసుకోవాలనే ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నాడు. మనకు కూడా ఇందులో ఒక పాఠం ఉంది.

7. యెహోవా ఆలోచనల్ని తన ఆలోచనగా చేసుకోవాలని అనుకుంటున్నాడని పేతురు ఎలా చూపించాడు? (చిత్రం కూడా చూడండి.)

7 కానీ తర్వాత, యెహోవా ఆలోచనను తన ఆలోచనగా చేసుకోవాలని అనుకుంటున్నాడని పేతురు చూపించాడు. సున్నతి పొందని అన్యులు కూడా దేవుని ప్రజల్లో భాగమయ్యే ఒక సమయం వచ్చింది. అలా మారిన మొట్టమొదటి వ్యక్తి అన్యుడైన కొర్నేలి. ఆయనకు ప్రకటించే నియామకం పేతురుకు వచ్చింది. మామూలుగా, యూదులు అన్యుల్ని దగ్గరికి కూడా రానివ్వరు. కాబట్టి ఈ నియామకం కోసం సిద్ధపడుతున్నప్పుడు పేతురుకు సహాయం అవసరమైంది. ఈ విషయంలో దేవుని ఇష్టమేంటో పేతురు అర్థం చేసుకున్న తర్వాత, తన ఆలోచనను మార్చుకున్నాడు. దానివల్ల ఆయన “ఎలాంటి అభ్యంతరం” లేకుండా, ఇచ్చిన పనిని చేశాడు. (అపొ. 10:28, 29) ఆయన కొర్నేలికి, తన ఇంటివాళ్లకు ప్రకటించాడు. వాళ్లు బాప్తిస్మం కూడా తీసుకున్నారు.—అపొ. 10:21-23, 34, 35, 44-48.

పేతురును, ఆయనతోపాటు ఉన్నవాళ్లను కొర్నేలి మెట్ల మీద నుండి తన ఇంట్లోకి తీసుకెళ్తున్నాడు.

కొర్నేలి ఇంట్లోకి వెళ్తున్న పేతురు (7వ పేరా చూడండి)


8. యెహోవా ఆలోచనను మన ఆలోచనగా చేసుకున్నామని ఎలా చూపించవచ్చు? (1 పేతురు 3:8 అలాగే అధస్సూచి)

8 కొన్ని సంవత్సరాల తర్వాత, “ఒకేలా ఆలోచించండి” అని పేతురు తోటి క్రైస్తవుల్ని ప్రోత్సహించాడు. (1 పేతురు 3:8 అలాగే అధస్సూచి చదవండి.) మనం బైబిలు నుండి తెలుసుకున్న దాన్నిబట్టి యెహోవాలా ఆలోచించడం నేర్చుకుంటే, ఆయన ప్రజలంగా మనందరం ఒకేలా ఆలోచించగలుగుతాం. ఉదాహరణకు, దేవుని రాజ్యానికి మొదటి స్థానం ఇవ్వమని యేసు తన అనుచరుల్ని ప్రోత్సహించాడు. (మత్త. 6:33) ఆ విషయాన్ని పాటిస్తూ మీ సంఘంలో ఎవరైనా పూర్తికాల సేవ చేయాలని ముందుకొస్తే, మీరేం చేయవచ్చు? అంత కష్టమైన జీవితాన్ని ఎంచుకోవడం ఎందుకని చెప్పే బదులు, వాళ్లు పెట్టుకున్న లక్ష్యం గురించి మంచిగా మాట్లాడి, వాళ్ల భుజం తట్టండి.

వినయంగా ఉండండి

9-10. ఏ మనిషీ చూపించలేనంత వినయాన్ని యేసు ఎలా చూపించాడు?

9 చనిపోయే ముందురోజు రాత్రి యేసు పేతురుకు, మిగతా అపొస్తలులకు వినయం గురించి మర్చిపోలేని ఒక పాఠాన్ని నేర్పించాడు. తాను చేయబోయే చివరి భోజనం కోసం ఏర్పాట్లు చేయమని యేసు పేతురు, యోహానులను పంపించాడు. ఆ ఏర్పాట్లలో భాగంగా, అతిథుల కాళ్లు కడగడానికి ఖచ్చితంగా గిన్నె, టవల్‌ ఉండేలా చూసుకోవాలి. అయితే తమనుతాము తగ్గించుకుని, అంత చిన్న పనిచేయడానికి ఎవరు ముందుకొస్తారు?

10 యేసు ఏమాత్రం సిగ్గుపడకుండా, ఏ మనిషీ చూపించలేనంత వినయాన్ని చూపించాడు. సాధారణంగా, ఒక సేవకుడు చేసే పనిని చేసి అపొస్తలుల మతిపోగొట్టాడు. యేసు తన పైవస్త్రాన్ని తీసి పక్కనపెట్టి, నడుముకు టవల్‌ కట్టుకుని, గిన్నెలో నీళ్లు పోసుకుని శిష్యుల కాళ్లు కడగడం మొదలుపెట్టాడు. (యోహా. 13:4, 5) 12 మంది పాదాలు కడగడానికి ఎంత టైం పట్టివుంటుందో ఆలోచించండి. ఆఖరికి, తనకు వెన్నుపోటు పొడిచే యూదా కాళ్లు కూడా కడిగాడు. యేసు ఎంత వినయం చూపించాడో కదా! ఆ తర్వాత యేసు ఓపిగ్గా ఇలా వివరించాడు: “నేను మీకు చేసింది మీకు అర్థమైందా? మీరు నన్ను ‘బోధకుడు’ అని, ‘ప్రభువు’ అని పిలుస్తున్నారు. మీరు నన్ను అలా పిలవడం సరైనదే. ప్రభువునూ బోధకుణ్ణీ అయిన నేను మీ పాదాలు కడిగానంటే, మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగాలి.”—యోహా. 13:12-14.

నిజమైన వినయంలో . . . మన లోలోపల ఉన్న ఆలోచనలు కూడా ఉన్నాయి

11. పేతురు యేసు నుండి వినయంగా ఉండడం నేర్చుకున్నాడని ఎలా చెప్పవచ్చు? (1 పేతురు 5:5) (చిత్రం కూడా చూడండి.)

11 పేతురు యేసు చూపించిన వినయం నుండి ఎంతో నేర్చుకున్నాడు. యేసు పరలోకానికి వెళ్లిపోయిన తర్వాత, పుట్టినప్పటి నుండి కుంటివాడైన ఒక వ్యక్తిని పేతురు అద్భుతంగా బాగుచేశాడు. (అపొ. 1:8, 9; 3:2, 6-8) సహజంగానే, అది చూసి ప్రజలందరి కళ్లు పేతురు మీద పడ్డాయి. (అపొ. 3:11) మరి పదవులు-పలుకుబడే ప్రాణంగా చూసే ప్రాంతంలో పుట్టిపెరిగిన పేతురు గాల్లో తేలిపోయాడా? లేదు! పేతురు వినయంగా ఘనతంతా తనవైపు కాకుండా యెహోవాకు, యేసుకు ఇచ్చాడు. ఆయన ఇలా అన్నాడు: “ఆయన [యేసు] పేరు ద్వారా, అంటే ఆయన పేరులో మాకున్న విశ్వాసాన్ని బట్టి మీరు చూస్తున్న, మీకు తెలిసిన ఈ వ్యక్తి బలపర్చబడ్డాడు.” (అపొ. 3:12-16) క్రైస్తవులు ఒకరితో ఒకరు వినయంగా ఉండాలని పేతురు తన ఉత్తరంలో రాసిన మాటలు చదివినప్పుడు, యేసు నడుముకు టవల్‌ కట్టుకుని, తన అపొస్తలుల పాదాలు కడిగిన సందర్భం మనకు గుర్తుకొస్తుంది.—1 పేతురు 5:5 చదవండి.

పేతురు, యోహాను ఆలయంలో నిలబడి ఉన్నారు. పుట్టుకతో కుంటివాడిగా ఉన్న అతను ఇప్పుడు బాగై వాళ్ల పక్కన నిలబడ్డాడు. పేతురేమో తన చెయ్యిని ఆకాశం వైపు చూపిస్తున్నాడు.

పేతురు వినయంగా ఘనత అంతా యెహోవాకు, యేసుకు ఇచ్చాడు. వినయం ఉంటే మనం కూడా ఒకరి మెప్పుదల గానీ ప్రతిఫలం గానీ ఆశించి పని చేయం (11-12 పేరాలు చూడండి)


12. పేతురులాగే మనం ఎలా వినయం చూపిస్తూ ఉండవచ్చు?

12 వినయం గురించి పేతురు నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. నిజమైన వినయం అంటే సరైన పదాలతో కేవలం మెత్తగా మాట్లాడడం మాత్రమే కాదని గుర్తుంచుకోండి. పేతురు ఉపయోగించిన వినయం లేదా “దీనమనస్సు” అనే పదంలో, మన లోలోపల ఉన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. కాబట్టి నలుగురు మనల్ని మెచ్చుకోవాలని కాదుగానీ యెహోవా మీద, ప్రజల మీద ఉన్న ప్రేమతోనే మనం ఇతరుల కోసం మంచి పనులు చేస్తాం. నలుగురు మనల్ని చూడకపోయినా, యెహోవాకు అలాగే మన బ్రదర్స్‌సిస్టర్స్‌కి మనం సంతోషంగా సేవ చేసినప్పుడు మనలో నిజంగా వినయం ఉందని చూపిస్తాం.—మత్త. 6:1-4.

“మంచి వివేచన” చూపించండి

13. “మంచి వివేచన” కలిగి ఉండడం అంటే ఏంటో వివరించండి.

13 “మంచి వివేచన” కలిగి ఉండడం అంటే ఏంటి? (1 పేతు. 4:7) మంచి వివేచన చూపించే ఒక క్రైస్తవుడు యెహోవా ఆలోచనలకు అద్దంపడుతూ మంచి నిర్ణయాలు తీసుకోవడానికి చూస్తాడు. అలాంటి వ్యక్తి యెహోవాతో తనకున్న సంబంధానికే అన్నిటికంటే ముఖ్యమైన స్థానం ఇస్తాడు. తనకు తాను సర్వ జ్ఞాని అనుకోడు. తన గురించి తాను మరీ ఎక్కువగా ఊహించుకోడు, అలాగని మరీ తక్కువగా కూడా ఊహించుకోడు. ప్రతీసారి వినయంగా యెహోవాకు ప్రార్థన చేస్తూ తనమీద ఆధారపడుతున్నానని చూపిస్తాడు.b

14. పేతురు ఒక సందర్భంలో యెహోవా మీద ఆధారపడలేదని ఎలా చెప్పవచ్చు?

14 యేసు చనిపోవడానికి ముందురోజు రాత్రి, తన శిష్యులకు ఈ హెచ్చరిక ఇచ్చాడు: “ఈ రాత్రి మీరంతా నన్ను వదిలేసి వెళ్లిపోతారు.” అప్పుడు పేతురు చాలా నమ్మకంతో “అందరూ నిన్ను వదిలి వెళ్లిపోయినా నేను మాత్రం నిన్ను ఎన్నడూ వదిలి వెళ్లను” అన్నాడు. ఆరోజు రాత్రే యేసు కొంతమంది శిష్యులకు ఇలా చెప్పాడు: “మెలకువగా ఉంటూ, ప్రార్థన చేస్తూ ఉండండి.” (మత్త. 26:31, 33, 41) ఒకవేళ పేతురు ఈ సలహాను పాటించి ఉంటే, యేసు ఎవరో తనకు తెలుసని ధైర్యంగా చెప్పుండేవాడు. కానీ పేతురు అలా చెప్పలేదు. ఆ తర్వాత బాధతో గుక్కపెట్టి ఏడ్వాల్సి వచ్చింది.—మత్త. 26:69-75.

15. యేసుకు మంచి వివేచన ఉందని ఈ భూమ్మీద తన చివరి రోజు రాత్రి ఎలా చూపించాడు?

15 యేసు యెహోవా మీద పూర్తిగా ఆధారపడ్డాడు. నిజానికి ఆయన పరిపూర్ణుడైనా, చనిపోయే ముందురోజు రాత్రి పదేపదే యెహోవాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకే దేవుని ఇష్టం చేయడానికి కావాల్సిన ధైర్యం యేసుకు వచ్చింది. (మత్త. 26:39, 42, 44; యోహా. 18:4, 5) యేసు ప్రతీ సందర్భంలో యెహోవా మీద ఆధారపడడం పేతురు మీద చెరగని ముద్రవేసి ఉంటుంది.

16. పేతురు మంచి వివేచన పెంచుకున్నాడని ఎలా చూపించాడు? (1 పేతు. 4:7)

16 కొంతకాలానికి పేతురు ప్రార్థనలో యెహోవా మీద ఎక్కువ ఆధారపడడం నేర్చుకున్నాడు. ప్రకటించడానికి కావాల్సిన పవిత్రశక్తిని పేతురు అలాగే మిగతా అపొస్తలులు పొందుతారని పునరుత్థానమైన యేసు ధైర్యం చెప్పాడు. కానీ ఆ పవిత్రశక్తి వచ్చేవరకు వాళ్లను యెరూషలేములోనే ఉండమని యేసు చెప్పాడు. (లూకా 24:49; అపొ. 1:4, 5) మరి అలా వెయిట్‌ చేస్తున్నప్పుడు పేతురు ఏం చేశాడు? పేతురు అలాగే తోటి క్రైస్తవులు “పట్టుదలగా ప్రార్థన చేస్తూ ఉన్నారు.” (అపొ. 1:13, 14) ఆ తర్వాత, తన మొదటి ఉత్తరంలో మంచి వివేచనను కలిగి ఉండమని, ప్రార్థనలో యెహోవా మీద ఆధారపడుతూ ఉండమని పేతురు తన తోటి క్రైస్తవుల్ని ప్రోత్సహించాడు. (1 పేతురు 4:7 చదవండి.) పేతురు యెహోవా మీద ఆధారపడడం నేర్చుకున్నాడు, సంఘానికి ఒక స్తంభంలా మారాడు.—గల. 2:9.

17. పుట్టుకతో మనకు ఎన్ని సామర్థ్యాలు వచ్చినా మనం ఏం చేస్తూ ఉండాలి? (చిత్రం కూడా చూడండి.)

17 మంచి వివేచన చూపించాలంటే పదేపదే యెహోవాకు ప్రార్థన చేస్తూ ఉండాలి. బహుశా మనకు పుట్టుకతో కొన్ని మంచి సామర్థ్యాలు వచ్చి ఉండవచ్చు. అయినాసరే, మనం ప్రార్థనలో యెహోవా మీద ఆధారపడుతూ ఉండాలని గుర్తించాలి. కాబట్టి మన జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మనకు ఏది మంచిదో యెహోవాకు బాగా తెలుసని, నిర్దేశం కోసం ఆయనకు ప్రార్థన చేయాలి.

పేతురు ప్రార్థనలో యెహోవా మీద ఆధారపడ్డాడు. మనం కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు యెహోవాకు ప్రార్థన చేస్తే మంచి వివేచన చూపిస్తాం (17వ పేరా చూడండి)c


18. యెహోవా ఆలోచనల్ని మన ఆలోచనల్లా మార్చుకోగలమా?

18 మనం యెహోవా లక్షణాల్ని చూపించగలిగే సామర్థ్యంతో తయారు చేయబడినందుకు ఎంత కృతజ్ఞులమో కదా! (ఆది. 1:26) నిజమే, మనం యెహోవాలా ఆ లక్షణాల్ని వంద శాతం చూపించలేకపోవచ్చు. (యెష. 55:9) కానీ పేతురులా, మన ఆలోచనల్ని యెహోవా ఆలోచనలకు తగ్గట్టుగా మార్చుకోగలం. కాబట్టి యెహోవాలా ఆలోచిస్తూ, వినయంగా ఉంటూ, మంచి వివేచన చూపిస్తూ ఉందాం!

మీరెలా జవాబిస్తారు?

  • మనం యెహోవాలా ఎలా ఆలోచిస్తూ ఉండవచ్చు?

  • మనం వినయంగా ఎలా ఉండవచ్చు?

  • మనం “మంచి వివేచన” ఎలా చూపించవచ్చు?

పాట 30 నా తండ్రి, నా దేవుడు, నా స్నేహితుడు

a 1 పేతురు 4:1 అధస్సూచిలో ఉన్న “మనోవైఖరి,” అనే పదాన్ని, “ఆలోచనా తీరు; వైఖరి; ఆలోచన” అని కూడా అనువదించవచ్చు.

b మంచి వివేచన అంటే ఏంటో లేదా, యెహోవాతో మంచి సంబంధం ఉండడం అంటే ఏంటో మరింత తెలుసుకోవడానికి jw.orgలో లేదా JW లైబ్రరీ యాప్‌లో “బైబిలు వచనాల వివరణ”లోని “2 తిమోతి 1:7—‘దేవుడు మనకు . . . పిరికితనముగల ఆత్మ నియ్యలేదు’” అనే ఆర్టికల్‌లో “మంచి వివేచన” కిందున్న సమాచారాన్ని చూడండి.

c చిత్రాల వివరణ:: ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుంటున్న ఒక సిస్టర్‌.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి