Imagination World/stock.adobe.com
బ్రతుకు చితికి, గూడు చెదిరిన వాళ్లలో దేవుడు నింపుతున్న ఆశ
కట్టు బట్టలతో, ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని తమ ఇళ్లను వదిలి పారిపోవాల్సిన పరిస్థితిని ప్రతీ సంవత్సరం లక్షలమంది ఎదుర్కొంటున్నారు. మీకు అలాంటి గడ్డు పరిస్థితి వచ్చిందా? అలాగైతే, ఈ లోకంలో మీకు ఎవ్వరూ లేరని అనుకోకండి. మీకు అండగా ఒకరు ఉన్నారు. ఆయన ఎవరో కాదు దేవుడే! మీకు బంగారు భవిష్యత్తు ఇస్తానని ఆయన మాటిస్తున్నాడు. దాని గురించి ఆయన రాయించిన పుస్తకం చదివి తెలుసుకోండి.
“శరణార్థులకు, అలాగే రకరకాల కారణాల వల్ల ఇళ్లను వదిలేసి పారిపోయిన వాళ్లకుa అత్యవసర సహాయం మాత్రమే అందిస్తే సరిపోదు … భవిష్యత్తు విషయంలో ఒక ఆశ కూడా ఇవ్వాలి,” అని యూరోపియన్ యూనియన్ కమీషనర్b క్రీస్టాస్ స్టిలీయానీడాస్ చెప్తున్నారు. అలాంటి ఆశను మనసులో నింపుకున్న వాళ్లు ముందుముందు అంతా బాగుంటుందని పాజిటివ్‌గా ఆలోచించగలుగుతారు. అయితే ఆశతో పాటు శరణార్థులకు ఊరట కూడా అవసరం. అప్పుడే వాళ్ల మనసుకు అయిన గాయాలు కాస్త మానతాయి.
“పుట్టిన ఊరు, పెరిగిన ఇల్లు వదిలి పారిపోవాల్సి వచ్చినప్పుడు, ఒంటరితనం అనే చీకటి నన్ను కమ్ముకుంది. మనసంతా భయం, బాధ, ఆందోళనతో నిండిపోయింది.”—హయిటీని వదిలేసి వచ్చిన ఇమాన్యుయెల్.
ఇమాన్యుయెల్లానే మీకు కూడా అనిపిస్తుందా? పరిస్థితుల వల్ల మీరు వలస బాట పట్టారా? అలాగైతే మీకు ఒక ధైర్యం, ఒక ఆశ చాలా అవసరం. ఈ విషయంలో దేవుని మాటలు ఉన్న బైబిలు మీకు సహాయం చేస్తుంది.
దేవుడు ఇస్తున్న ధైర్యం
బైబిలు ఇలా చెప్తుంది: ‘యెహోవాc పరదేశులను ప్రేమిస్తాడు.’—ద్వితీయోపదేశకాండం 10:17, 18.
అంటే, మీరు ఒంటరివాళ్లు కాదు. బైబిల్ని రాయించిన యెహోవా దేవుడు మీ పరిస్థితిని అర్థం చేసుకుంటాడు, మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ బాగోగుల్ని పట్టించుకుంటాడు.
బైబిలు ఇలా చెప్తుంది: “తనకు మొరపెట్టే వాళ్లందరికీ … యెహోవా దగ్గరగా ఉన్నాడు.”—కీర్తన 145:18.
అంటే, మీరు ప్రార్థించినప్పుడు యెహోవా వింటాడు. మీరు మనశ్శాంతితో ఉండేలా ఆయన సహాయం చేస్తాడు. మీ పరిస్థితి నుండి గట్టెక్కడానికి అవసరమైన తెలివిని కూడా బైబిలు ద్వారా ఇస్తాడు.
బైబిలు ఇలా చెప్తుంది: ‘సత్యదేవుడు చెడుగా ప్రవర్తించడం అసాధ్యం! సర్వశక్తిమంతుడు న్యాయాన్ని వక్రీకరించడు.’—యోబు 34:10, 12.
అంటే, మీ బాధలకు కారణం దేవుడు కాదు. ఆయన మిమ్మల్ని శిక్షించడం లేదు, అంతేకాదు మీకు కష్టాల్ని ఇచ్చి మిమ్మల్ని పరీక్షించడం లేదు.
దేవుడు ఇస్తున్న ఆశ
రాబోయే రోజుల్లో దేవుడు మన కోసం ఏం చేస్తాడో బైబిలు చెప్తుంది. తమ ఇళ్లను వదిలి పారిపోయిన వాళ్లకు ఈ ఆశ ఎలా సహాయం చేస్తుందో చూడండి.
బైబిలు ఇలా చెప్తుంది: “వాళ్ల కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును [దేవుడు] తుడిచేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు.”—ప్రకటన 21:4.
అంటే, మన బాధలకు ఒక ఫుల్స్టాప్ రాబోతుంది. మన ఆశల్ని నిరాశగా మార్చే సమస్యలన్నిటినీ దేవుడు పూర్తిగా తీసేస్తాడు.
“మన చుట్టూ జరుగుతున్న అన్యాయాన్ని, చెడుతనాన్ని దేవుడు త్వరలో తుడిచిపెట్టేస్తాడు. బాధలన్నీ మటుమాయమయ్యే రోజు మీద మనసు పెట్టడానికి ఈ ఆశ నాకు సహాయం చేస్తుంది.”—ఎల్ సాల్వడార్ని వదిలేసి వచ్చిన కార్లా.
బైబిలు ఇలా చెప్తుంది: “పాత సంగతులు గుర్తుకురావు, అవి హృదయంలో కూడా ఉండవు.”—యెషయా 65:17.
అంటే, మనం చేదు జ్ఞాపకాల పంజరం నుండి విడుదలౌతాం. గతం తాలూకు గాయాల గురించి మీరు ఇంకెప్పుడూ ఆలోచించకుండా, ఆ జ్ఞాపకాల గాలివాన మీకు మళ్లీ తగలకుండా దేవుడు చూసుకుంటాడు.
“నా అనుకున్నవన్నీ కోల్పోయినప్పుడు వచ్చిన నొప్పి, బాధ అస్సలు గుర్తుకు రాదని బైబిలు మాటిస్తుంది. త్వరలో అంతా మంచే జరుగుతుందని నాకు తెలుసు, కాబట్టి మా గడ్డు పరిస్థితిని తట్టుకోవడానికి ఈ ఆశ నాకు సహాయం చేస్తుంది.”—యుక్రెయిన్‌ని వదిలేసి వచ్చిన నటాలియా.
బైబిలు ఇలా చెప్తుంది: “పరలోకంలో ఉన్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు … అది ఆ రాజ్యాలన్నిటినీ నలగ్గొట్టి నాశనం చేస్తుంది.”—దానియేలు 2:44.
అంటే, ఏ లోపంలేని ఒక మంచి ప్రభుత్వం పరలోకంలో నుండి భూమిని పరిపాలిస్తుంది. దేవుడు త్వరలో భూమ్మీద ఉన్న ప్రభుత్వాలన్నిటినీ తీసేసి, పరలోక ప్రభుత్వాన్ని తీసుకొస్తాడు. అది నిజమైన శాంతి-భద్రతల్ని తెస్తుంది. అందులో ఎవ్వరికీ ఏ లోటు ఉండదు, అందరికీ న్యాయం జరుగుతుంది.—మీకా 4:3, 4.
“హింస, అన్యాయం, అనుమానం, జాతి-కులం లాంటివి ఇంకొన్ని రోజులే ఉంటాయి అని తెలుసుకోవడం నాకు బలాన్నిస్తుంది. దేవుని రాజ్యం ఈ సమస్యలన్నిటికీ త్వరలోనే చెక్ పెడుతుంది.”—మిడిల్ ఈస్ట్‌ని వదిలేసి వచ్చిన ముస్తఫా.
ఆశను నింపే దేవుని మాటల నుండి ఊరట పొందండి
దేవుడు ఇచ్చే తెలివి
గతాన్ని మరిచి ముందుకు వెళ్లడానికి బైబిలు ఇచ్చే తెలివైన సలహాలు మీకు బాగా సహాయం చేస్తాయి. మారిన మీ పరిస్థితుల్ని తట్టుకోవడానికి, జరిగిన నష్టం నుండి తేరుకోవడానికి కూడా పనికొస్తాయి. ఇక్కడ ఇచ్చిన సలహాలు శరణార్థులకు ఎలా ఉపయోగపడుతున్నాయో చూడండి:
బైబిలు ఇలా చెప్తుంది: “ఒక వ్యక్తికి చాలా ఆస్తిపాస్తులు ఉన్నా, అవి అతనికి జీవాన్ని ఇవ్వవు.”—లూకా 12:15.
ఈ తెలివైన మాటలు మీ పరిస్థితిని తట్టుకోవడానికి ఎలా సహాయం చేస్తాయి? జరిగినదాన్ని బట్టి మీరు షాక్‌లో ఉన్నారా? మీరు కోల్పోయిన వాటిని బట్టి మీ గుండె బద్దలైపోయిందా? అలాగైతే మీరు ఒక్క క్షణం ఆగి, వస్తువుల కన్నా ప్రాణాలతో ఉండడం ఎంత గొప్ప విషయమో ఆలోచిస్తే, మీరు పోగొట్టుకున్న వాటి గురించి ఎక్కువ బాధపడకుండా ఉంటారు.
“జీవం లేని వస్తువులు చేతిలో ఉండడం కన్నా, ప్రాణాలతో ఉండడమే ముఖ్యం. కొన్ని సందర్భాల్లో మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా అవి ఎందుకూ పనికి రావు.”—యుక్రెయిన్‌ని వదిలేసి వచ్చిన నటాలియా.
బైబిలు ఇలా చెప్తుంది: “‘ఇప్పటికన్నా పాత రోజులే బావున్నాయి’ అని అనకు.”—ప్రసంగి 7:10.
ఈ తెలివైన మాటలు మీ పరిస్థితిని తట్టుకోవడానికి ఎలా సహాయం చేస్తాయి? ప్రస్తుతం మీకు చాలా కష్టంగానే ఉండవచ్చు. కానీ పాత రోజులే బాగున్నాయి అని అనుకుంటూ కూర్చుంటే మీ మనసంతా కోపం, బాధతోనే నిండిపోతుంది.
“నా పరిస్థితి ఒకప్పటిలా లేదు అనే చేదు నిజాన్ని జీర్ణించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. దానివల్ల ఉన్నంతలోనే సంతోషాన్ని-మంచిని వెతుక్కోగలుగుతున్నాను.”—రువాండాని వదిలేసి వచ్చిన ఈలై.
బైబిలు ఇలా చెప్తుంది: “మనకు ఆహారం, బట్టలు ఉంటే చాలు, వాటితో తృప్తిపడదాం.”—1 తిమోతి 6:8.
ఈ తెలివైన మాటలు మీ పరిస్థితిని తట్టుకోవడానికి ఎలా సహాయం చేస్తాయి? కనీస అవసరాలు ఉంటే చాలు అని గుర్తుంచుకోండి. వాటితో తృప్తిగా ఉంటే, మీ ఒత్తిడి కాస్త తగ్గొచ్చు, మనశ్శాంతిగా కూడా ఉంటుంది.
“మా పరిస్థితుల గురించి వేరుగా ఆలోచించడానికి, వదిలేసి వచ్చిన వాటిని వెనక్కి తిరిగి చూడకుండా ఉండడానికి బైబిలు నాకు సహాయం చేస్తుంది. ఇప్పుడు ప్రాణాలతో ఉన్నందుకు, ఒక సురక్షితమైన చోట ఉన్నందుకు నేను, నా భార్య సంతోషిస్తున్నాం.”—యుక్రెయిన్‌ని వదిలేసి వచ్చిన ఇవాన్.
బైబిలు ఇలా చెప్తుంది: “ఇతరులు మీతో ఎలా వ్యవహరించాలని మీరు కోరుకుంటారో మీరూ వాళ్లతో అలాగే వ్యవహరించండి.”—మత్తయి 7:12.
ఈ తెలివైన మాటలు మీ పరిస్థితిని తట్టుకోవడానికి ఎలా సహాయం చేస్తాయి? కష్టమైనా మీరు ఓపిగ్గా, దయగా ఉండడానికి ప్రయత్నిస్తే నలుగురిలో ఈజీగా కలిసిపోతారు. అలా చేస్తూ ఉంటే మీరు ఏ ప్రాంతానికైతే వెళ్లారో, అక్కడి ప్రజల మనసులో ఉన్న వివక్షను తీసేయగలుగుతారు. మీరు కూడా వాళ్లకు అలవాటు అవుతారు.
“ఇతరుల మీద గౌరవం, ప్రేమ, దయ చూపించినప్పుడు ఎవ్వరికైనా నచ్చుతుంది. ఈ లక్షణాల వల్ల మీకు, స్థానికులకు మధ్య స్నేహం చిగురిస్తుంది.”—శ్రీలంకని వదిలేసి వచ్చిన ఆంజెలో.
బైబిలు ఇలా చెప్తుంది: ‘మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి, అప్పుడు దేవుని శాంతి మీ హృదయాలకు, మీ మనసులకు కాపలా ఉంటుంది.’—ఫిలిప్పీయులు 4:6, 7.
ఈ తెలివైన మాటలు మీ పరిస్థితిని తట్టుకోవడానికి ఎలా సహాయం చేస్తాయి? దేవునికి ప్రార్థిస్తూ మీకు ఎలా అనిపిస్తుందో, మీ అవసరాలేంటో, మీ భయాలు-ఆందోళనలేంటో చెప్పుకోండి. అలా చెప్పుకున్నప్పుడు కొత్త పరిస్థితుల వల్ల ఉక్కిరిబిక్కిరి అవ్వకుండా, మీ గుండెలో ఉన్న భారం కాస్త తేలికైనట్టు అనిపిస్తుంది.
“ఏ సమస్య వచ్చినా నేను దేవునికి ప్రార్థిస్తాను, ఆయన నాకు జవాబిస్తాడు. బైబిలు నుండి నేర్చుకున్న వాటివల్ల నేను నిజంగా మనశ్శాంతి పొందాను.”—దక్షిణ సూడాన్ని వదిలేసి వచ్చిన యాల్.
“మనసులో ఉన్న తుఫాను నిమ్మళించి, కష్టమైన పరిస్థితులు ఉన్నా ముందుకెళ్లడానికి బైబిల్లోని సలహాలు నాకు సహాయం చేశాయి.”—యుక్రెయిన్‌ని వదిలేసి వచ్చిన వాలెంటీనా.
“ఇప్పుడున్న దాని కంటే చాలా మంచి జీవితాన్ని ఇస్తానని యెహోవా దేవుడు మాటిస్తున్నాడు. ఆ విషయం నాకు చాలా ధైర్యాన్నిస్తుంది.”—హయిటీని వదిలేసి వచ్చిన ఇమాన్యుయెల్
మీలో ఊరటను, ఆశను నింపడానికి ఏం చేస్తానని దేవుడు మాటిస్తున్నాడో, ఆయన మాటల్ని ఎందుకు నమ్మవచ్చో తెలుసుకోవాలని ఉందా? యెహోవాసాక్షులు మీకు సంతోషంగా సహాయం చేస్తారు. కాబట్టి మిమ్మల్ని కలవమని వాళ్లను ఒకసారి అడగండి. అలా కలవడానికి వాళ్లు డబ్బులు అడగరు.
a UN రెఫ్యూజీ ఏజెన్సీ ప్రకారం శరణార్థులంటే తమ దేశంలోనే వేరే ప్రాంతానికి పారిపోయిన వాళ్లు, లేదా వేరే దేశానికి పారిపోయిన వాళ్లు. అయితే ఇలాంటివాళ్లు చట్టపరంగా శరణార్థులు కావచ్చు, కాకపోవచ్చు.
b యూరోపియన్ యూనియన్ కమీషనర్ ఫర్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ ఆండ్ క్రైసిస్ మానేజ్మెంట్.
c యెహోవా అనేది దేవుని పేరు. (కీర్తన 83:18) “యెహోవా ఎవరు?” ఆర్టికల్ చూడండి.