అప్రమత్తంగా ఉండండి!
క్రైస్తవులంటే నిజంగా ఎలా ఉండాలి?—బైబిలు ఏం చెప్తుంది?
ఇప్పుడు ప్రపంచంలో ఎంతోమంది ‘మేము క్రైస్తవులం’ అని చాలా గర్వంగా చెప్పుకుంటారు, కానీ వాళ్ల పనులు మాత్రం ఇతరుల్ని బాధపెడతాయి. కొంతమంది స్వార్థంగా, నిజాయితీ లేకుండా, దయాదాక్షిణ్యాలు లేకుండా ప్రవర్తిస్తారు. ఇంకొంతమంది తమ భార్యకు లేదా భర్తకు నమ్మకద్రోహం చేస్తుంటారు. ఇదంతా చూసినప్పుడు కొందరికి, ‘క్రైస్తవులంటే నిజంగా ఇలానే ఉంటారా?’ అని అనిపిస్తుంది.
క్రైస్తవునిగా ఉండడం అంటే ఏంటి?
‘నేను క్రైస్తవుణ్ణి’ అని చెప్పుకోవడం ఈజీనే, కానీ అదొక్కటే సరిపోదు. బైబిలు ప్రకారం, యేసుక్రీస్తుకు శిష్యులుగా ఉన్నవాళ్లే క్రైస్తవులు. (అపొస్తలుల కార్యాలు 11:26) యేసే ఇలా అన్నాడు: “మీరు ఎప్పుడూ నా బోధలు పాటిస్తూ ఉంటే, మీరు నిజంగా నా శిష్యులు.” (యోహాను 8:31) నిజమే, ఏ తప్పూ చేయకుండా యేసు బోధల్ని పొల్లు పోకుండా ఎవ్వరూ పాటించలేరు. అయినాసరే క్రైస్తవులు యేసు బోధల్ని పాటించడానికి, ప్రతీరోజు ఆయన చెప్పిన దాని ప్రకారం జీవించడానికి చేయగలిగినదంతా చేస్తారు. దీని గురించి కొన్ని ఉదాహరణలు చూడండి.
క్రైస్తవులు స్వార్థంలేని ప్రేమ చూపిస్తారు
యేసు ఏం చెప్పాడు? “నేను మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మీ మధ్య ప్రేమ ఉంటే, మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది.”—యోహాను 13:34, 35.
యేసు ఏం చేశాడు? యేసు అందరి మీద స్వార్థం లేని ప్రేమ చూపించాడు. వాళ్లు పేదవాళ్లయినా, గొప్పవాళ్లయినా, ఏ జాతి-మతంవాళ్లయినా యేసు అందర్నీ ఒకేలా చూశాడు. రోగుల్ని బాగుచేశాడు, ఆకలితో ఉన్నవాళ్లకు ఆహారం పెట్టాడు, ఆఖరికి ఇతరుల కోసం తన ప్రాణం కూడా పెట్టాడు.—మత్తయి 14:14-21; 20:28.
క్రైస్తవులు ఎలా ఉంటారు? క్రైస్తవులు స్వార్థంలేని ప్రేమ చూపిస్తూ ఉదారంగా ఇస్తారు, వివక్ష చూపించరు, ఇతరుల్ని క్షమిస్తారు. అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేస్తారు, త్యాగాలు చేయడానికి ఇష్టంగా ముందుకొస్తారు.—1 యోహాను 3:16.
క్రైస్తవులు నిజాయితీగా ఉంటారు
యేసు ఏం చెప్పాడు? “నేనే . . . సత్యం.”—యోహాను 14:6.
యేసు ఏం చేశాడు? యేసు తన మాటల్లో, పనుల్లో ఎప్పుడూ నిజాయితీగా ఉన్నాడు. ఇతరులు ఆయనకు నచ్చింది చేసేలా కుయుక్తిగా మాట్లాడడం, మోసం చేయడం, అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి ప్రయత్నించడం లాంటివి ఎన్నడూ చేయలేదు. నిజం మాట్లాడితే సమస్యలు వస్తాయని తెలిసినా ఆయన మాత్రం నిజాయితీకి మారుపేరుగా ఉన్నాడు.—మత్తయి 22:16; 26:63-67.
క్రైస్తవులు ఎలా ఉంటారు? క్రైస్తవులు అబద్ధాలు ఆడరు. అంతేకాదు వాళ్లు పన్నులు కడతారు, దొంగతనం చేయరు, ఉద్యోగంలో సమయం వృథా చేయకుండా కష్టపడి పనిచేస్తారు. (రోమీయులు 13:5-7; ఎఫెసీయులు 4:28) ఇతరుల్ని మోసం చేయరు, పరీక్షల్లో కాపీ కొట్టరు, జాబ్ అప్లికేషన్లు పెట్టేటప్పుడు లేదా వేరే సందర్భాల్లో తప్పుడు సమాచారాన్ని గానీ, దొంగ డాక్యుమెంట్లను గానీ ఇవ్వరు.—హెబ్రీయులు 13:18.
క్రైస్తవులు దయ చూపిస్తారు
యేసు ఏం చెప్పాడు? “భారం మోస్తూ అలసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి, నేను మీకు సేదదీర్పును ఇస్తాను. నేను సౌమ్యుడిని, వినయస్థుడిని కాబట్టి నా కాడిని మీ మీద ఎత్తుకుని, నా దగ్గర నేర్చుకోండి; అప్పుడు మీరు సేదదీర్పు పొందుతారు. ఎందుకంటే నా కాడి మోయడానికి సులభంగా ఉంటుంది, నేను ఇచ్చే బరువు తేలిగ్గా ఉంటుంది.”—మత్తయి 11:28-30.
యేసు ఏం చేశాడు? యేసు దయగా ఉండేవాడు, ఏ భయం లేకుండా అందరూ ఆయన దగ్గరికి ధైర్యంగా వెళ్లేవాళ్లు. ఆయన పిల్లల్ని దగ్గరికి తీసుకునేవాడు, బాధలో ఉన్నవాళ్లను ఓదార్చేవాడు, అందర్నీ గౌరవించేవాడు.—మార్కు 10:13-15; లూకా 9:11.
క్రైస్తవులు ఎలా ఉంటారు? క్రైస్తవులు ఇతరులతో దయగా మాట్లాడతారు. ఇతరులతో అమర్యాదగా మాట్లాడడం గానీ, తిట్టడం గానీ చేయరు. (ఎఫెసీయులు 4:29, 31, 32) ఇతరుల్ని పట్టించుకుంటారు, సహాయం చేయడానికి అవకాశాల కోసం చూస్తారు.—గలతీయులు 6:10.
క్రైస్తవులు తమ భార్యకు లేదా భర్తకు నమ్మకద్రోహం చేయరు
యేసు ఏం చెప్పాడు? “దేవుడు ఒకటి చేసినవాళ్లను ఏ మనిషీ విడదీయకూడదు.”—మార్కు 10:9.
యేసు ఏం చేశాడు? యేసు పెళ్లి చేసుకోకపోయినా భార్యాభర్తలు ఒకరికొకరు నమ్మకంగా ఉండాలని ప్రోత్సహించాడు. (మత్తయి 19:9) భార్యాభర్తల బంధం తెగిపోయేలా చేసే పనుల గురించి ఆయన హెచ్చరించాడు.—మత్తయి 5:28.
క్రైస్తవులు ఎలా ఉంటారు? క్రైస్తవులు తమ భార్యకు లేదా భర్తకు నమ్మకద్రోహం చేయరు. (హెబ్రీయులు 13:4) భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకుంటారు, గౌరవించుకుంటారు.—ఎఫెసీయులు 5:28, 33.