సెప్టెంబరు 28–అక్టోబరు 4, 2026
పాట 79 వాళ్లు స్థిరంగా ఉండేలా సాయం చేయి
యెహోవాను తెలుసుకునేలా ఇతరులకు సహాయం చేయండి
‘ఒకేఒక్క సత్యదేవుడివైన నిన్ను తెలుసుకోవడమే శాశ్వత జీవితం.’—యోహా. 17:3.
ముఖ్యాంశం
యెహోవాను, ఆయన లక్షణాల్ని, ఆయన ఇష్టాయిష్టాల్ని మన బైబిలు విద్యార్థులు బాగా తెలుసుకునేలా ఎలా సహాయం చేయవచ్చో చూస్తాం.
1. ఒక బైబిలు విద్యార్థి ప్రగతి సాధించడం చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది?
ఒక బైబిలు విద్యార్థి మొదటిసారి మీటింగ్స్‌కి వచ్చినప్పుడు, కామెంట్స్ చెప్పినప్పుడు, ప్రీచింగ్ చేసినప్పుడు, చివరికి బాప్తిస్మం తీసుకున్నప్పుడు మీకెలా అనిపిస్తుంది? మన సంతోషం ఆకాశాన్ని అంటుతుంది కదా! అయితే, ఆ బైబిలు విద్యార్థి అంత ప్రగతి సాధించడానికి యెహోవాయే కారణం కాబట్టి ఘనతంతా ఆయనకే ఇస్తాం, ఆయన మాత్రమే దానికి అర్హుడు.—1 కొరిం. 3:5-9; 3 యోహా. 3, 4.
2. బైబిలు విద్యార్థులు ఏం సంపాదించుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు? (1 తిమోతి 2:3, 4)
2 యెహోవా “అన్నిరకాల ప్రజలు సత్యం గురించిన సరైన జ్ఞానాన్ని సంపాదించుకొని రక్షించబడాలని కోరుకుంటున్నాడు.” (1 తిమోతి 2:3, 4 చదవండి.) తన గురించి, తన ఉద్దేశాల గురించి ప్రజలందరూ పూర్తిగా తెలుసుకోవాలనేదే ఆయన కోరిక. (యిర్మీ. 9:24) అంటే, వాళ్లు ఆయన గురించి సరైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దాన్ని వివరిస్తూ ఒక బైబిలు పండితుడు ఇలా అంటున్నాడు: ‘ఒక వ్యక్తి దేవుని గురించి పైపైన తెలుసుకుంటే సరిపోదు, తెలుసుకున్న విషయాల్ని బట్టి అతని జీవితం పూర్తిగా మారాలి.’ ఒక బైబిలు విద్యార్థి యెహోవా గురించి తెలుసుకుంటే, ఆయన తన జీవితంలో మార్పులు చేసుకుంటాడు. అలా ఆయనకు ‘శాశ్వత జీవితాన్ని’ సంపాదించుకునే అవకాశం దొరుకుతుంది.—యోహా. 17:3.
3. ఈ ఆర్టికల్‌లో మనం ఏం చూస్తాం?
3 యెహోవా గురించి ఇతరులకు చెప్పే గొప్ప అవకాశాన్ని ఆయన మనకు ఇచ్చాడు. ఈ ఆర్టికల్‌లో మనం ఈ ప్రశ్నల గురించి చూస్తాం: బైబిలు విద్యార్థులు యెహోవా గురించి ఎందుకు బాగా తెలుసుకోవాలి? యెహోవా ఎలాంటివాడో తెలుసుకునేలా మనం వాళ్లకు ఏయే విధాలుగా సహాయం చేయవచ్చు? వాళ్లు నేర్చుకునేవి పాటించేలా ఎలా సహాయం చేయవచ్చు?
బైబిలు విద్యార్థులు యెహోవా గురించి బాగా తెలుసుకునేలా సహాయం చేయండి
4. మార్కు 12:30 ప్రకారం, బైబిలు స్టడీ చేసేటప్పుడు మన ముఖ్య ఉద్దేశం ఏంటి?
4 బైబిల్లో అన్నిటికన్నా ప్రాముఖ్యమైన ఆజ్ఞ, యెహోవాను నిండు హృదయంతో, నిండు ప్రాణంతో, నిండు మనసుతో, పూర్తి బలంతో ప్రేమించడమే అని యేసు చెప్పాడు. (మార్కు 12:30 చదవండి.) అలా ఒక బైబిలు విద్యార్థి యెహోవాను ప్రేమించాలంటే, అతనికి దేవుని గురించి బాగా తెలిసుండాలి. వాళ్లు సమర్పించుకోవాల్సింది యెహోవాకే గానీ మనకో, బైబిలు బోధలకో, సంస్థకో కాదు! కాబట్టి బైబిలు స్టడీ చేసేటప్పుడు విద్యార్థి యెహోవా గురించి నేర్చుకునేలా, ఆయనను ప్రేమించేలా చేయడమే మన ముఖ్య ఉద్దేశం.
5. యెహోవా మీద ప్రేమ ఉంటే బైబిలు విద్యార్థికి ఏం చేయాలనిపిస్తుంది?
5 ప్రేమకు, మాట వినడానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. బైబిలు విద్యార్థి యెహోవాను తెలుసుకుని, ఆయన్ని ప్రేమించడం మొదలుపెడితే అతనికి దేవుని మాట వినాలనిపిస్తుంది. యేసు ఇలా అన్నాడు: “నేను తండ్రిని ప్రేమిస్తున్నానని లోకానికి తెలియాలని, తండ్రి నాకు ఆజ్ఞాపించినట్టే చేస్తున్నాను.” (యోహా. 14:31) ఏమున్నా లేకపోయినా యెహోవా మీద ప్రేమ ఉంటే చాలు, బైబిలు విద్యార్థి ఆయనకు నమ్మకంగా ఉంటాడు, ఆయన మాట వింటాడు.—1 యోహా. 5:3.
6. యెహోవా గురించి బాగా తెలుసుకుంటే బైబిలు విద్యార్థి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు? ఉదాహరణతో చెప్పండి.
6 బైబిలు విద్యార్థి యెహోవా గురించి బాగా తెలుసుకున్నప్పుడు తెలివైన నిర్ణయాలు తీసుకుంటాడు. ఉదాహరణకు, ఒక వ్యక్తి కారు నడపాలని అనుకుంటే, ఆయన దానికి సంబంధించిన పుస్తకాల్ని-వీడియోల్ని చూస్తే సరిపోదు, చాలా టైం పెట్టి ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే పరిస్థితులకు తగ్గట్టు బాగా ఎలా నడపాలో తెలుస్తుంది. అదేవిధంగా, బైబిలు విద్యార్థి యెహోవా గురించి కేవలం స్టడీలో తెలుసుకుంటే సరిపోదు. నేర్చుకున్న వాటి ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలి, వాటి ఫలితాల్ని చూడాలి. అలాచేస్తే, అతను యెహోవా గురించి ఇంకా బాగా తెలుసుకుంటాడు, తనకు ఎలా సహాయం చేస్తాడో అర్థం చేసుకుంటాడు. దాంతో ఎలాంటి పరిస్థితుల్లోనైనా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాడు.
7. యెహోవా గురించి బాగా తెలుసుకోవడం వల్ల యోసేపు ఎలా మంచి నిర్ణయం తీసుకోగలిగాడు?
7 యోసేపుకు యెహోవా గురించి బాగా తెలుసు, అందుకే పోతీఫరు భార్య తప్పు చేయమని బలవంతం చేసినా ఆయన అస్సలు లొంగిపోలేదు. చిన్నప్పటి నుండే యోసేపు ఆదాము-హవ్వ గురించి, అబ్రాహాము-శారా గురించి వినుంటాడు. (ఆది. 2:24; 20:3, 6) దాన్నిబట్టి యెహోవా పెళ్లిని, లైంగిక సంబంధాల్ని ఎలా చూస్తున్నాడో యోసేపు అర్థం చేసుకున్నాడు. అందుకే పోతీఫరు భార్య ఆయన్ని బలవంతం చేసినప్పుడు ఇలా అన్నాడు: “నేను ఇంత చెడ్డపని చేసి దేవునికి వ్యతిరేకంగా ఎలా పాపం చేయగలను?” (ఆది. 39:7-9) యెహోవా దృష్టిలో ఏది మంచో, ఏది చెడో యోసేపుకు బాగా తెలుసు. కాబట్టి యెహోవాకు నచ్చని ఏ పనీ చేయాలనుకోలేదు. మనం కూడా బైబిలు విద్యార్థులకు యెహోవా ఎలాంటివాడో, ఆయనకు ఏది నచ్చుతుందో-ఏది నచ్చదో తెలుసుకునేలా సహాయం చేస్తే, వాళ్లు ఆయన్ని సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
యెహోవా ఎలాంటివాడో తెలుసుకునేలా సహాయం చేయండి
8. బైబిలు విద్యార్థి యెహోవా గురించి తెలుసుకునేలా ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకం ఎలా సహాయం చేస్తుంది?
8 యెహోవా ఎలాంటివాడో బైబిలు విద్యార్థి అర్థం చేసుకునేలా మనం ఎలా సహాయం చేయవచ్చు? ప్రశ్నలు అడగడం ద్వారా. యెహోవా తన గురించి తెలుసుకునేలా యోబుకు సహాయం చేయడానికి ప్రశ్నలు అడిగాడు. అది కూడా ఒకట్రెండు కాదు, 50 కంటే ఎక్కువే అడిగాడు. (యోబు 38:1–41:34) మనం కూడా అలా చేయవచ్చు. విద్యార్థి యెహోవా గురించి ఇంకాఇంకా తెలుసుకునేలా ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలోని ప్రశ్నల్ని తయారుచేశారు. (“బోధించడానికి సహాయం చేసే ప్రశ్నలు” అనే బాక్సు చూడండి.) కాబట్టి ఆ ప్రశ్నలు అడుగుతూ, మీ విద్యార్థి యెహోవా గురించి ఇంకా బాగా తెలుసుకునేలా సహాయం చేయండి.
9-10. (ఎ) బైబిలు నుండి పూర్తి ప్రయోజనం పొందాలంటే విద్యార్థులు ఏం చేయాలి? (యాకోబు 5:11) (బి) దానియేలు కథ చదువుతున్నప్పుడు, యెహోవా ఇష్టాయిష్టాలు ఏంటో తెలుసుకోవడానికి ఏ ప్రశ్నలు వేసుకోవచ్చు?
9 స్టడీ మొదలుపెట్టిన వెంటనే, విద్యార్థిని ప్రతీరోజు బైబిలు చదవమని ప్రోత్సహించాలి.a చదువుతున్న దాన్నుండి వాళ్లు పూర్తి ప్రయోజనం పొందేలా మనం ఇంకా ఎలా సహాయం చేయవచ్చు? బైబిల్లో ఏదైనా భాగాన్ని చదువుతున్నప్పుడు, దీన్ని యెహోవా ఎందుకు రాయించాడో, ఆయనకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమని చెప్పండి. శిష్యుడైన యాకోబు కూడా యోబు కథ రాస్తున్నప్పుడు అదే చేశాడు. యోబు సహనం చూపించాడని చెప్తూనే, యెహోవా లక్షణాల్ని అంటే ఆయన వాత్సల్యం, కరుణ గురించి కూడా చెప్పాడు.—యాకోబు 5:11 చదవండి.
10 మన విద్యార్థులు బైబిలు చదువుతున్న ప్రతీసారి యెహోవా ఇష్టాయిష్టాలు ఏంటో తెలుసుకోవాలని కోరుకుంటాం. ఉదాహరణకు, మీ విద్యార్థి ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలోని “బైబిలు చదవడం మొదలుపెట్టండి” అనే చార్ట్‌ను ఉపయోగిస్తున్నాడని అనుకోండి. అలా అతను దానియేలును సింహాల గుహలో పడేసిన కథ చదివాడు. చదివాక, ఈ ప్రశ్నల గురించి ఆలోచించమని చెప్పవచ్చు: దానియేలును యెహోవా ఎందుకు కాపాడాడు? ఏం చేస్తే యెహోవాకు నచ్చుతుందని నాకు అర్థమైంది? (దాని. 6:10, 22) దానియేలు మీద నిందవేసిన వాళ్లకు ఏం జరిగింది? దీన్నిబట్టి యెహోవాకు ఏం నచ్చదని నాకు అర్థమైంది? (దాని. 6:4, 5, 24) యెహోవాకున్న వేరే ఏ లక్షణాలు ఈ కథలో నాకు కనిపించాయి?—దాని. 6:26, 27.
11. బైబిలు స్టడీ ద్వారా యెహోవాయే బోధిస్తున్నాడని గుర్తించేలా మనం విద్యార్థులకు ఎలా సహాయం చేయవచ్చు?
11 స్టడీ తీసుకోవడం తమకు చాలా సహాయం చేసిందని మన బైబిలు విద్యార్థులు చెప్పినప్పుడు మనకు సంతోషంగా అనిపిస్తుంది. అయితే, దానికి కారణం మహాగొప్ప ఉపదేశకుడైన యెహోవాయే అని అర్థంచేసుకునేలా మనం వాళ్లకు సహాయం చేయాలి. (యెష. 30:20, 21) వాళ్లు నేర్చుకునే విషయాల్ని బట్టి మనకు థాంక్స్ చెప్పవచ్చు, మన బోధించే విధానం నచ్చి మనల్ని బాగా మెచ్చుకోవచ్చు. అది తప్పేం కాదుగానీ ఘనతంతా యెహోవాకే చెందాలని మనం వాళ్లకు గుర్తుచేయాలి.
నేర్చుకునేవి పాటించేలా సహాయం చేయండి
12-13. బైబిలు చదువుతున్నప్పుడు దేన్నైనా అర్థం చేసుకోవడం మీ విద్యార్థికి కష్టంగా అనిపిస్తే ఏం చేయాలి? (చిత్రం కూడా చూడండి.)
12 మన బైబిలు విద్యార్థి యెహోవా గురించిన సరైన జ్ఞానం నుండి పూర్తి ప్రయోజనం పొందాలంటే ఏం చేయాలి? వాళ్లు అప్పటికే ఆయన గురించి తెలుసుకున్న వాటికి తగ్గట్టు తమ ఆలోచనల్ని, పనుల్ని మార్చుకోవాలి. అలా చేసేలా మనం మన విద్యార్థికి సహాయం చేయాలి. అలాంటి ఒక సందర్భాన్ని చూద్దాం. బైబిలు చదువుతున్నప్పుడు దేన్నైనా అర్థం చేసుకోవడం కష్టంగా అనిపిస్తే, యెహోవా గురించి వాళ్లకు అప్పటికే ఏం తెలుసో ఆలోచించమని చెప్పండి. ఉదాహరణకు, మీ విద్యార్థి యెహోవా ఇచ్చిన తీర్పుల గురించి చదువుతున్నాడని అనుకోండి. దేవుడు కొంతమందిని ఎందుకు నాశనం చేశాడు? ఇంకొంతమందిని ఎందుకు ప్రాణాలతో వదిలేశాడు? అనే ప్రశ్నలు అతనికి రావచ్చు. అయితే, ఈ విషయంలో మన విద్యార్థి సరైన విధంగా ఆలోచించేలా మనం ఎలా సహాయం చేయవచ్చు?
13 బైబిలు విద్యార్థికి అప్పటికే యెహోవా గురించి ఏం తెలుసో ఆలోచించమని ప్రోత్సహించండి. బహుశా, వాళ్లు ఈ ప్రశ్నలు వేసుకోవచ్చు: యెహోవా దృష్టిలో జీవం ఎంత విలువైనది? (2 పేతు. 3:9) మనం పాపులుగా ఉన్నాసరే మనల్ని కాపాడడానికి ఆయన ఎంత గొప్ప త్యాగం చేశాడు? (ఎఫె. 2:4, 5) ఏ తప్పూ చేయనివాళ్లను యెహోవా నిజంగా శిక్షిస్తాడా? తప్పు చేసినవాళ్లను యెహోవా శిక్షించకుండా వదిలేస్తాడా? (నిర్గ. 34:6, 7) యెహోవా ఫలానా నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో చెప్పే వివరాలు బైబిల్లో ప్రతీసారి ఉండవు. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడం మనకు కష్టంగా అనిపించవచ్చు. నిజం చెప్పాలంటే మనకు ఆ వివరాలు అవసరం లేదు. మనకు మన దేవుడు ఎలాంటివాడో తెలుసు, ఆయన ఎప్పుడూ సరైనదే చేస్తాడనే నమ్మకం కూడా మనకు ఉంది.
ఏదైనా బైబిలు కథను అర్థం చేసుకోవడం కష్టంగా అనిపించినప్పుడు, యెహోవా గురించి ఇప్పటికే తెలిసిన వాటిని గుర్తుచేసుకోవడం ఎలా సహాయం చేస్తుందో మీ విద్యార్థికి చెప్పండి (12-13 పేరాలు చూడండి)
14. మీ విద్యార్థి సంఘంలో ఎవరితోనైనా సరిగ్గా ఉండలేకపోతుంటే, మీరు వాళ్లకు ఎలా సహాయం చేయవచ్చు?
14 బైబిలు విద్యార్థి యెహోవా గురించి తెలుసుకున్న వాటికి తగ్గట్టుగా మార్పులు చేసుకోవాల్సిన ఇంకొక సందర్భాన్ని చూద్దాం. మీ విద్యార్థి క్రమంగా మీటింగ్స్‌కి వస్తున్నాడు అనుకోండి. అయితే ఒక బ్రదర్ లేదా సిస్టర్ వల్ల ఆయన బాధపడ్డాడు (అభ్యంతరపడ్డాడు), వాళ్లతో సరిగ్గా ఉండలేకపోతున్నాడు. అప్పుడు బ్రదర్స్-సిస్టర్స్‌ని యెహోవా చూసినట్టే చూడమని మీ విద్యార్థిని ప్రోత్సహించండి. ఇలాంటి ప్రశ్నల గురించి ఆలోచించమని చెప్పండి: మన బ్రదర్స్-సిస్టర్స్ అంటే ఇష్టమని చూపించడానికి యెహోవా ఎలాంటి త్యాగం చేశాడు? (యోహా. 3:16) మనం ఐక్యంగా ఉండడం ఆయనకు ఎంత ముఖ్యం? (కీర్త. 133:1) ఐక్యంగా ఉండడానికి మనం బాగా ప్రయత్నించినప్పుడు యెహోవాకు ఎలా అనిపిస్తుంది? (2 కొరిం. 13:11) అలా ఆలోచిస్తూ, బ్రదర్స్-సిస్టర్స్‌లో ఉన్న లోపాల్ని కాకుండా మంచిని చూస్తే, యెహోవా చాలా సంతోషిస్తాడని మీ విద్యార్థికి చెప్పండి.
15-16. (ఎ) ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు బైబిలు విద్యార్థులు యేసులా ఎలా ఉండవచ్చు? (యోహాను 8:29) (బి) తన బైబిలు విద్యార్థి మంచి నిర్ణయం తీసుకునేలా మారియాన్ ఎలా సహాయం చేసింది? (చిత్రం కూడా చూడండి.)
15 ఇంకో సందర్భాన్ని చూద్దాం. ఏదైనా ఒక విషయంలో మీ బైబిలు విద్యార్థి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అనుకోండి. ఆయన యెహోవా గురించి అప్పటికే తెలుసుకున్న వాటికి తగ్గట్టు నిర్ణయం తీసుకునేలా మనం ఎలా సహాయం చేయవచ్చు? మీరు ఆయనకు ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలోని “మనం మంచి నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చు?” అనే 35వ పాఠాన్ని చూపించవచ్చు. అయితే మీ విద్యార్థి అప్పటికే ప్రార్థన చేశాడు, పరిశోధన చేశాడు, కానీ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాడు. బహుశా ఏ బైబిలు సూత్రాల్ని పాటించాలో ఆయనకు తెలియట్లేదు. అప్పుడు ఏం చేయవచ్చు? యేసు ఎలా నిర్ణయాలు తీసుకున్నాడో గుర్తుచేయండి. యేసు ఇలా అన్నాడు: “నేను ఎప్పుడూ [నా తండ్రికి] ఇష్టమైన పనులే చేస్తాను.” (యోహాను 8:29 చదవండి.) మీ విద్యార్థి కూడా, తను చేసిన పరిశోధన బట్టి, దేవుని గురించి నేర్చుకున్న వాటిని బట్టి ఏ నిర్ణయం తీసుకుంటే యెహోవాకు నచ్చుతుందో ఆలోచించమని చెప్పండి. యెహోవాకు నచ్చే ఏ నిర్ణయమైనా మంచి నిర్ణయమే!
16 చిలీలో ఉంటున్న బైబిలు విద్యార్థి ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆమెకు మంచి జీతం వచ్చే ఒక ఉద్యోగం దొరికింది, ఆ ఉద్యోగం చేయమని తన ఇంట్లోవాళ్లు ఆమెను ఒత్తిడి చేశారు. కానీ సమస్య ఏంటంటే, దానివల్ల ఆమె మీటింగ్స్‌కి క్రమంగా వెళ్లడం కుదరదు. తనకు స్టడీ ఇస్తున్న మారియాన్ అనే సిస్టర్ ఇలా చెప్పింది: “తను తీసుకునే నిర్ణయం యెహోవాను సంతోషపెడుతుందా, బాధపెడుతుందా ఆలోచించమని చెప్పాను. అలాగే, అసలు తన పరిస్థితి ఏంటో యెహోవాకు చెప్పమని, తన ప్రార్థనకు ఆయన ఎలా జవాబిస్తాడో చూడమని కూడా చెప్పాను. చివరికి ఆమె ఆ ఉద్యోగాన్ని వద్దనుకుంది, కొంతకాలానికి మీటింగ్స్‌కి అడ్డురాని ఇంకో ఉద్యోగాన్ని వెతుక్కుంది.” గమనించారా, మారియాన్ తన బైబిలు విద్యార్థికి ఏం చేయాలో చెప్పే బదులు, తనకు యెహోవా గురించి అప్పటికే తెలిసిన విషయాల గురించి ఆలోచించేలా సహాయం చేసింది. దానివల్ల ఆ విద్యార్థి మారియాన్‌కే కాదు యెహోవాకు కూడా దగ్గరైంది. మారియాన్ తన విద్యార్థి గురించి ఇలా చెప్తుంది: “యెహోవా ఆరాధనకు మొదటిస్థానం ఇస్తే, ఆయన మన అవసరాల్ని పట్టించుకుంటాడని ఆమె నేర్చుకుంది.”
యెహోవాకు నచ్చే నిర్ణయాల్ని ఎలా తీసుకోవాలో మీ విద్యార్థికి నేర్పించండి (15-16 పేరాలు చూడండి)b
యెహోవాను బాగా తెలుసుకునేవాళ్లు దీవెనలు పొందుతారు
17. మన బైబిలు విద్యార్థులు ఏం తెలుసుకోవడం అన్నిటికన్నా ముఖ్యం?
17 బైబిలు స్టడీలో విద్యార్థులకు చాలా ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. చనిపోయినవాళ్ల పరిస్థితి, విమోచన క్రయధనం, దేవుని రాజ్యం లాంటి ముఖ్యమైన బైబిలు బోధల గురించి తెలుసుకుంటారు. అలాగే సంస్థ గురించి అంటే మీటింగ్స్, సంఘపెద్దల ఏర్పాటు, పరిపాలక సభ చేసే పనుల గురించి కూడా నేర్చుకుంటారు. అయితే, మన విద్యార్థులు ఈ విషయాల్ని తెలుసుకోవడం ముఖ్యమే. కానీ యెహోవాను తెలుసుకోవడమే అన్నిటికన్నా ముఖ్యం.
18. యెహోవాను తెలుసుకునేవాళ్లు ఎలాంటి దీవెనల్ని పొందుతారు?
18 యెహోవాను తెలుసుకునేలా ఇతరులకు సహాయం చేయడం కన్నా గొప్ప పని ఇంకేదీ లేదు. భవిష్యత్తులో ‘సత్యదేవుడైన యెహోవా గురించిన జ్ఞానాన్ని సంపాదించుకునే’ వాళ్లందరూ శాశ్వత జీవితాన్ని పొందుతారు. (1 యోహా. 5:20) ఇప్పుడు కూడా యెహోవా గురించి తెలుసుకుని, ఆయన్ని ఆరాధించేవాళ్లు సంతోషంగా ఉండవచ్చు. (కీర్త. 25:12-15) అయితే అదొక్కటే కాదు, మనం ఇంకో దీవెనను కూడా పొందుతాం. యెహోవా గురించి తెలుసుకుని, ఆయన్ని ప్రేమించడానికి ప్రయత్నించేవాళ్లు “దేవునికి తెలుసు” అని బైబిలు చెప్తుంది. (1 కొరిం. 8:3) ఒకసారి ఊహించండి, సర్వశక్తిమంతుడైన దేవునికి మనం తెలుసు! ఆయన మనల్ని పట్టించుకుంటున్నాడు, తన ఫ్రెండ్‌గా చూస్తున్నాడు. నిజమైన దేవున్ని తెలుసుకుంటే ఎన్ని దీవెనలో కదా!
పాట 84 అవసరం ఉన్నచోట ఇష్టంగా సేవచేద్దాం
a ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలోని 5వ పాఠంలో “ఇలా చేసి చూడండి” కిందున్న ఈ సలహాను మీ విద్యార్థికి చెప్పండి: “‘బైబిలు చదవడం మొదలుపెట్టండి’ అనే చార్టు ఉపయోగించి, రోజూ బైబిలు చదవండి.”
b చిత్రాల వివరణ: పునర్నటన. మారియాన్ దగ్గర స్టడీ తీసుకున్న విద్యార్థి తనకొచ్చిన ఉద్యోగాన్ని వద్దనుకుంటుంది.