జీవిత కథ
70 ఏళ్లుగా క్యూబాలో యెహోవా సేవ చేస్తున్నాను
నేను 1947లో క్యూబా అనే అందమైన కరీబియన్ ద్వీపంలో (ఐలాండ్‌లో) పుట్టాను. అది కరీబియన్ సముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం కలిసే చోట ఉంటుంది. నాకు ఇద్దరు చెల్లెళ్లు. మా అమ్మానాన్నలది ఎస్మెరాల్డా అనే పల్లెటూరు, మేమంతా అక్కడే నివసించేవాళ్లం.
ఆ చిన్న పల్లెటూర్లో జీవితం చాలా ప్రశాంతంగా ఉండేది. మా బంధువులు కూడా దగ్గర్లోనే ఉండేవాళ్లు. సరిపడా ఆహారం-డబ్బులు ఉండేవి, జీవితం చాలా సంతోషంగా ఉండేది.
నాకు దాదాపు ఐదేళ్లు ఉన్నప్పుడు మా అమ్మానాన్నలు వాల్టన్ జోన్స్ అనే బ్రదర్ దగ్గర బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టారు. అతను చాలా ఉత్సాహంగా మంచివార్త ప్రకటించేవాడు, దాదాపు పది గంటలపాటు నడిచి మా ఊరికి వచ్చేవాడు. అతను వచ్చిన ప్రతీసారి, మా బంధువులు చాలామంది మా తాతమామ్మల ఇంటికి వచ్చి గంటల తరబడి బైబిలు విషయాలు చర్చించేవాళ్లు. నేర్చుకుంటున్నవి నచ్చడంతో మా అమ్మానాన్నలు, మా చిన్నాన్న పేడ్రో, మా మేనత్త ఎల్లా బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షులు అయ్యారు. మా మేనత్త ఎల్లాకు ఇప్పుడు దాదాపు 100 ఏళ్లు, క్యూబాలో ఆమె ఇంకా పయినీరు సేవ చేస్తూనే ఉంది.
అప్పట్లో క్యూబాలో యెహోవాసాక్షులు స్వేచ్ఛగా ఆరాధించేవాళ్లు. మేము బ్యాగు నిండా ప్రచురణలతో ఇంటింటికి వెళ్లి ప్రకటిస్తామని క్యూబాలో ప్రజలకు బాగా తెలుసు. ప్రకటించడానికి మేము చాలా దూరాలు నడిచేవాళ్లం. ఆ “అనుకూలంగా ఉన్న సమయాల్లో” నా చిన్నప్పుడు చేసిన యెహోవా సేవ గురించి ఆలోచిస్తే మనసుకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. అయితే ముందుముందు “కష్టమైన సమయాలు” రాబోతున్నాయి.—2 తిమో. 4:2.
కష్టమైన సమయాలు
నాకు ఐదేళ్లు ఉన్నప్పుడు మా నాన్న, అంకుల్ సమావేశం కోసం మా ద్వీపంలోని ఇంకో చోటికి వెళ్లారు. ఆ ప్రయాణంలో కలుషిత నీళ్లు తాగడం వల్ల వాళ్లిద్దరికి టైఫాయిడ్ వచ్చింది. వాళ్లు తిరిగొచ్చాక, మా అంకుల్‌కి జుట్టు బాగా ఊడిపోయింది కానీ కోలుకున్నాడు. మా నాన్న మాత్రం చనిపోయాడు. అప్పటికి ఆయన వయసు 32 ఏళ్లే.
నాన్న చనిపోయాక, అమ్మ మమ్మల్ని తీసుకుని లాంబేయో గ్రామంలో ఉంటున్న మా మామయ్య దగ్గరికి వెళ్లిపోవాలని అనుకుంది. మేము ఎంతో ప్రేమించే మా బంధువుల్ని, తాతామామ్మల్ని వదిలివెళ్లడం కొంచెం కష్టంగా అనిపించింది. అయినాసరే, మా కుటుంబమంతా యెహోవా సేవలో సంతోషంగా కొనసాగాం.
నేను 1957 ఆగస్టు 26న లాంబేయోలో బాప్తిస్మం తీసుకున్నాను. అప్పుడు నాకు పదేళ్లు. కానీ రెండేళ్ల లోపే క్యూబాలో యెహోవాసాక్షుల జీవితం పూర్తిగా మారిపోతుందని నేను ఊహించలేదు. 1959లో ప్రభుత్వం కూలిపోయి, కమ్యూనిస్టు పరిపాలన మొదలైంది.
కొత్త ప్రభుత్వం సైనిక సేవకు చాలా ప్రాముఖ్యత ఇచ్చింది. దాంతో యెహోవాసాక్షులకు జీవితం చాలా కష్టంగా తయారైంది. ఎందుకంటే ఏ దేశంలో ఉన్నాసరే వాళ్లు సైన్యంలో చేరరు, రాజకీయాల్లో తలదూర్చరు. దానివల్ల మేము ముందులా స్వేచ్ఛగా ప్రీచింగ్ చేయలేకపోయాం, మీటింగ్స్‌కి వెళ్లలేకపోయాం. కొంతకాలానికి ప్రభుత్వం మా ఆరాధనను నిషేధించింది, వందలాది నమ్మకమైన బ్రదర్స్‌ని జైళ్లో వేశారు. కొంతమందిని గార్డులు తరచూ కొట్టేవాళ్లు, సరిపడా ఆహారం కూడా ఇచ్చేవాళ్లు కాదు. ఒక్కోసారి వాళ్లు పెట్టే ఆహారంలో రక్తం ఉండేది. కానీ బైబిలు, రక్తాన్ని తినకూడదని చెప్తుంది.
కష్టమైనా సరే, మేము యెహోవాను ఆరాధించడానికి కలుసుకుంటూనే ఉన్నాం. (హెబ్రీ. 10:25) దేశవ్యాప్తంగా తోటల్లో లేదా ఇతర చాటైన ప్రదేశాల్లో సమావేశాలు జరుపుకునేవాళ్లం. ఒకసారి ఒక బ్రదర్ తనకున్న పెద్ద గొర్రెల పాకలో మమ్మల్ని సమావేశం జరుపుకోనిచ్చాడు. దాన్ని ముందే శుభ్రం చేయడం, గొర్రెల్ని వేరే చోట పెట్టడం కుదర్లేదు. అయినాసరే సమావేశం జరుపుకున్నాం—ఒకవైపు యెహోవా గొర్రెలు, ఇంకోవైపు నిజమైన గొర్రెలు!—మీకా 2:12.
ఆ రోజుల్లో మేము ఆధ్యాత్మిక ఆహారం పొందేలా సహాయం చేసిన బ్రదర్స్ పట్ల ఎంతో కృతజ్ఞతతో ఉండేవాళ్లం. ఉదాహరణకు, బ్రదర్స్ సమావేశ ప్రసంగాల్ని రికార్డు చేసి క్యూబా అంతటా ఉన్న సాక్షులకు వాటిని పంపించేవాళ్లు. కొన్నిసార్లు, ఒక కార్యక్రమంలోని అన్ని ప్రసంగాలకు సిద్ధపడి, ప్రసంగించి, రికార్డు చేసే బాధ్యత కేవలం ఇద్దరు బ్రదర్స్‌కి అప్పగించేవాళ్లు. బ్రదర్స్ వాటిని రహస్యంగా ఉండే ప్రాంతాల్లో రికార్డ్ చేసేవాళ్లు కాబట్టి కొన్నిసార్లు కోడికూతలు, నవ్వు తెప్పించే ఇతర శబ్దాలు రికార్డింగ్‌లలో వినిపించేవి. ఒకవేళ సమావేశ స్థలం దగ్గర కరెంట్ లేకపోతే, ఒక బ్రదర్ సైకిల్‌కి స్టాండ్ వేసి, దానికి డైనమో బిగించి, సైకిల్ తొక్కుతూ కావాల్సిన కరెంట్ వచ్చేలా చేసేవాడు. ఆ కరెంటుతో రికార్డింగ్‌లు ప్లే చేసి ప్రసంగాలు వినిపించేవాళ్లు. మాకు ఆరాధించే స్వేచ్ఛ గానీ, ఇతర దేశాల్లోని బ్రదర్స్ దగ్గర ఉన్నన్ని ప్రచురణలు గానీ లేకపోయినా ఆధ్యాత్మిక ఆహారం మాత్రం ఎప్పుడూ సరిపడా ఉండేది. మేము కలిసిమెలిసి యెహోవా సేవ చేస్తూ ఎంతో సంతోషంగా ఉండేవాళ్లం.—నెహె. 8:10.
పయినీర్లుగా, అమ్మానాన్నలుగా
నాకు 18 ఏళ్లు వచ్చాక, ఫ్లోరీడ పట్టణంలో క్రమ పయినీరు సేవ మొదలుపెట్టాను. ఒక సంవత్సరం తర్వాత నన్ను కామాగ్వే నగరంలో ప్రత్యేక పయినీరుగా నియమించారు. అది క్యూబాలో ఆ ప్రాంతానికి ముఖ్య నగరం. అక్కడే నేను శాంటియాగో డి క్యూబా నుండి వచ్చిన ఎమీలియా అనే అందమైన సిస్టర్‌ని కలిశాను. మేము కోర్ట్‌షిప్ చేశాం, ఏడాది తిరిగే లోపే పెళ్లి చేసుకున్నాం.
(ఎడమ) పెద్దల కోసం రాజ్య పరిచర్య పాఠశాల—1966, క్యూబాలోని కామాగ్వే
(కుడి) 1967లో మా పెళ్లిరోజున
నేను ప్రభుత్వానికి చెందిన ఒక షుగర్ ఫ్యాక్టరీలో పనిచేయడం మొదలుపెట్టాను. నేను, ఎమీలియా ఇక పయినీరు సేవ చేయలేకపోయాం. అయినాసరే వీలైనంత ఎక్కువగా యెహోవా సేవ చేయాలని కోరుకున్నాం. నేను పనిచేసే చోట, రాత్రి 3 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు ఉండే షిఫ్ట్ ఒప్పుకున్నాను. అంత త్వరగా నిద్రలేవడం నాకు కష్టమే, అయినాసరే దానివల్ల నేను క్రమంగా ప్రీచింగ్ చేయగలిగాను, అన్ని మీటింగ్స్‌కి ఎమీలియాతో కలిసి వెళ్లగలిగాను.
1969లో మా మొదటి బాబు గుస్టావొ పుట్టాడు. దాదాపు అదే సమయంలో, నన్ను ప్రాంతీయ పర్యవేక్షకుడిగా పూర్తికాల సేవ తిరిగి మొదలుపెట్టమని అన్నారు. ఆ సమయంలో కుటుంబాన్ని చూసుకుంటూ ప్రాంతీయ పర్యవేక్షకుడిగా సేవచేయడం క్యూబాలో సర్వసాధారణం. అవి మా జీవితంలో ఎంతో సంతోషమైన, ఎంతో బిజీగా గడిచిన రోజులు. బ్రదర్స్‌సిస్టర్స్‌కి ఆ విధంగా సేవచేయడం మాకు దొరికిన గొప్ప గౌరవంగా చూశాం. అలా ప్రాంతీయ సేవ చేస్తుండగా మా అబ్బాయి ఓబెడ్, తర్వాత ఆబ్నెర్, కొన్నేళ్లకు మా అమ్మాయి మహెలీ పుట్టారు.
మేము ప్రాంతీయ సేవలో గడిపిన సంవత్సరాల్ని గుర్తుచేసుకుంటే, క్యూబాలోని తన ప్రజల్ని యెహోవా ఎలా దీవించాడో చూసి సంతోషంగా అనిపిస్తుంది. మా పిల్లల హృదయాల్లో తన పట్ల ప్రేమను నింపడానికి తల్లిదండ్రులుగా మేము చేసిన కృషిని కూడా యెహోవా ఖచ్చితంగా దీవించాడు. మేము ప్రాంతీయ సేవ చేస్తున్నప్పుడు నాకు, ఎమీలియాకు జీవితం ఎలా ఉండేదో చెప్తాను.
నిషేధం కింద ప్రాంతీయ సేవ
దాదాపు 1960 నుండి దాదాపు 1980 వరకు మన పనిపై నిషేధం తాలూకు ప్రభావం బాగా కనిపించింది. రాజ్యమందిరాలు మూసేశారు, మన మిషనరీలను దేశం నుండి బహిష్కరించారు. చాలామంది యౌవన బ్రదర్స్‌ని అరెస్టు చేసి జైలుకు పంపించారు. హవానాలో ఉన్న బ్రాంచి ఆఫీసును మూసేశారు.
1990లలో ప్రాంతీయ సేవ
నిషేధం వల్ల, వారాంతాల్లో మాత్రమే సంఘాల్ని సందర్శించడం వీలయ్యేది. ప్రతీ సంఘాన్ని రెండు వారాంతాలు సందర్శించేవాళ్లం. మేము తక్కువ లగేజీతో తరచూ సైకిల్ మీద ప్రయాణించేవాళ్లం; దానివల్ల పోలీసుల, ఇతరుల దృష్టి మాపై పడకుండా ఉండేది. మా సందర్శనాల గురించి బయటికి ప్రకటన చేసేవాళ్లు కాదు. మేము బంధువుల్ని చూసి రావడానికి వెళ్తున్నట్టు కనిపించాలి, అదంత కష్టమేం కాదు. నిజానికి మేము బ్రదర్స్‌సిస్టర్స్‌తో ఎంతగా కుటుంబంలా కలిసిపోయే వాళ్లమంటే, మేము ప్రాంతీయ సందర్శనం కోసం వచ్చామని ఒక్కోసారి గుర్తుచేసుకోవాల్సి వచ్చేది. (మార్కు 10:29, 30) అయినా కూడా మేము చాలా జాగ్రత్తగా ఉండేవాళ్లం. తరచూ పోలీసులు మమ్మల్ని ఫాలో అయ్యి, ప్రశ్నలు అడిగేవాళ్లు. మా విషయం తెలిస్తే, మాకు వసతి ఇచ్చిన బ్రదర్స్‌ని అరెస్టు చేస్తారు.—రోమా. 16:4.
ఆ సమయంలో, అంతగా డబ్బులేని బ్రదర్స్‌సిస్టర్స్ చాలామంది మా పట్ల ఎంతో ఉదారత చూపించారు. కొన్నిచోట్ల, దోమలు విపరీతంగా ఉండేవి. కానీ మేము ప్రశాంతంగా నిద్రపోవాలని బ్రదర్స్ వాళ్లకున్న ఒకేఒక్క దోమతెరను మాకు ఇచ్చేవాళ్లు. కొంతమంది, మాతో పంచుకోవడానికి సరిపడా ఆహారం లేకపోయినా, మమ్మల్ని వాళ్ల ఇంట్లో ఉంచుకునేవాళ్లు. నిజానికి, వాళ్లతో పంచుకోవడానికి మేమే కొన్నిసార్లు ఆహారం తీసుకెళ్లేవాళ్లం.
సంఘాల్ని సందర్శించేటప్పుడు మా పిల్లలందర్నీ మాతో తీసుకెళ్లడం వీలయ్యేది కాదు. ఒక్కర్ని మాత్రం మాతో తీసుకెళ్లేవాళ్లం, మిగతా పిల్లల్ని ఇంటి దగ్గర మా అమ్మ, చెల్లి చూసుకునేవాళ్లు. చిన్నబిడ్డతో ప్రయాణించడం ఒకరకంగా మమ్మల్ని కాపాడిందని చెప్పాలి. అప్పుడప్పుడు, పోలీసులు మమ్మల్ని సోదా చేసినప్పుడు, వాడేసిన డైపర్ బ్యాగులో మన ప్రచురణల్ని దాచేవాళ్లం. పోలీసులు దాన్ని వెతికేవాళ్లు కాదు.
ఒకవైపు పిల్లల్ని చూసుకుంటూ, పూర్తికాల సేవలో చెప్పలేనంత మద్దతు ఇచ్చిన ఎమీలియాను మెచ్చుకోకుండా ఉండలేను. నేను ఫ్యాక్టరీలో పనిచేస్తూనే ప్రాంతీయ పర్యవేక్షకుడిగా సేవ చేయగలిగాను. ఎలాగంటే, వారంలో ఒకట్రెండు సార్లు డబుల్ షిఫ్ట్ చేసి వారాంతంలో సెలవు తీసుకునేవాన్ని. కానీ కొంతకాలం తర్వాత నన్ను సూపర్‌వైజర్‌గా చేశారు, దాంతో వారంలో ఏడు రోజులూ పనిచేయాల్సి వచ్చేది. దాన్ని మార్చడం కుదరదు. అయితే, వారాంతంలో మా టీమ్ వాళ్లకు సరిపడా పని ఉండేలా చూసుకుంటే, నేను సంఘాల్ని సందర్శించడానికి వెళ్లినప్పుడు ఆ విషయం వాళ్లు ఎవ్వరికీ చెప్పరు. నాకు తెలిసినంత వరకు, నేను వారాంతాల్లో పనికి వెళ్లలేదని మా బాస్‌లు ఎప్పుడూ గమనించలేదు.
నియామకం మారినా సంతోషంగా
నిషేధం తర్వాత 1994లో మొదటి బహిరంగ సమావేశం
1994లో ఒకరోజు, క్యూబాలో ప్రయాణ పర్యవేక్షకులుగా సేవచేస్తున్న మొత్తం 80 మందిని హవానాలో జరిగే ప్రత్యేక మీటింగ్‌కి రమ్మని సంస్థ ఆహ్వానించింది. అన్ని సంవత్సరాల తర్వాత అందరం కలుసుకోవడం ఎంత సంతోషంగా అనిపించిందో మాటల్లో చెప్పలేను! ఆ మీటింగ్‌లో ముందుగా సంస్థలో చేసే మార్పుల గురించి చర్చించుకున్నాం. తర్వాత, షాక్ ఇచ్చే ఒక ప్రకటన చేశారు. అధికారులకు మా పేర్లు తెలియజేయాలి అనుకుంటున్నామని బ్రదర్స్ మాకు చెప్పారు! వాళ్లు ఎందుకలా చేస్తున్నారు?
ప్రభుత్వానికి, యెహోవాసాక్షులకు మధ్య సంబంధాలు మెరుగుపర్చాలనే లక్ష్యంతో కొంతకాలంగా ప్రభుత్వాధికారుల్ని కలిసి మాట్లాడుతున్నామని వాళ్లు వివరించారు. అధికారులు, ప్రాంతీయ పర్యవేక్షకులందరి పేర్లు ఉన్న ఒక లిస్టు కావాలని అడిగారు. దానికి మేమంతా ఒప్పుకున్నాం. అప్పటినుండి ప్రభుత్వంతో మన సంబంధాలు మెరుగయ్యాయి.
కొంతకాలానికి, బహిరంగంగా మీటింగ్స్-ప్రీచింగ్ చేసుకోగలిగాం. అయితే ఒక మతంగా ఇంకా చట్టబద్ధంగా రిజిస్టర్ అవ్వలేదు. ఆ తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, అధికారుల దగ్గర అప్పటికే కొంతమంది ప్రయాణ పర్యవేక్షకుల పేర్లు ఉన్నాయి, వాటిని నిర్ధారించుకోవడానికే అలా పేర్లు ఇవ్వమని అడిగారు.
1994 సెప్టెంబరులో బ్రాంచి కార్యాలయాన్ని తెరవడానికి అనుమతి ఇచ్చారు. 20 ఏళ్ల క్రితం ఏ భవనాన్నైతే మూసేశారో దాన్నే మళ్లీ ఉపయోగించగలిగాం.
తర్వాత 1996లో, నన్నూ ఎమీలియాను బెతల్‌లో సేవచేయడానికి ఆహ్వానిస్తూ కాల్ చేశారు. వినగానే షాక్ అయ్యాను. షాక్ నుండి తేరుకున్నాక, మాకు ఇంట్లో ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారని, వాళ్ల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఉందని బ్రదర్స్‌కి చెప్పాను. బ్రదర్స్ నా పరిస్థితిని దయతో అర్థంచేసుకున్నారు, అయినా కూడా మమ్మల్ని బెతెల్‌లో సేవ చేయమని అడిగారు. మేము సరే అన్నాం, కుటుంబమంతా హవానాకి తరలి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకోవడం మొదలుపెట్టాం.
(ఎడమ) 2000 తొలి సంవత్సరాల్లో క్యూబా బ్రాంచిలోని బట్టలు కుట్టడానికి సంబంధించిన డిపార్ట్‌మెంట్‌లో ఎమీలియా
(కుడి) అసెంబ్లీ హాల్ సమర్పణ, 2012లో
నిజం చెప్పాలంటే, మొదట్లో బెతెల్ సేవ నాకు నచ్చలేదు. ఎన్నో ఏళ్లు ప్రయాణ పనిలో గడిపాను కాబట్టి ఆ సేవ మీద మమకారం పెంచుకున్నాను. మనసంతా బ్రదర్స్‌సిస్టర్స్ చుట్టే తిరిగేది. ఆఫీసులో కూర్చుని పనిచేయడం నాకు కష్టంగా అనిపించేది. కానీ తోటి బెతెల్ సభ్యులు, ముఖ్యంగా నా భార్య ఎమీలియా నా ఆలోచనను సరిచేసుకోవడానికి సహాయం చేశారు. రానురాను నా పనిని ఇష్టపడడం మొదలుపెట్టాను, ఇప్పుడు సంతోషంగా బెతెల్ సేవ చేస్తున్నాను.
(ఎడమ) 2013లో, క్రైస్తవ దంపతుల కోసం బైబిలు పాఠశాల గ్రాడ్యుయేషన్
(కుడి) 2013లో, క్యూబాలోని బ్రాంచి కమిటీ
ప్రాంతీయ సమావేశమప్పుడు మేము, మా కూతురు, అల్లుడు
ఇప్పుడు నేను, ఎమీలియా వృద్ధులమయ్యాం. గడిచిన సంవత్సరాల్లో మాకు తెలిసిన, మేము కలిసి సేవచేసిన బ్రదర్స్‌సిస్టర్స్ అందర్నీ తలచుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా మా పిల్లలు, మనవళ్లు-మనవరాళ్లు యెహోవా సేవ చేస్తుంటే చూడడం చెప్పలేనంత సంతోషాన్నిస్తుంది. అపొస్తలుడైన యోహానుకు వృద్ధాప్యంలో అనిపించినట్టే అనిపిస్తుంది. ఆయన ఇలా అన్నాడు: “నా పిల్లలు సత్యంలో నడుస్తున్నారని వినడం కన్నా నాకు సంతోషకరమైన విషయం ఇంకొకటి లేదు.”—3 యోహాను 4.
నేను, ఎమీలియా దాదాపు 30 ఏళ్లుగా బెతెల్‌లో సేవచేస్తున్నాం. ఇప్పుడు మేము వృద్ధాప్యం, అనారోగ్యం వల్ల ఇబ్బంది పడుతున్నా, మాకు అప్పగించిన పని చేయడానికి శాయశక్తులా కృషిచేస్తున్నాం. మేము యెహోవా సేవ చేసిన కాలమంతటిలో కొన్ని సమస్యలు ఎదురైనా, క్యూబా ద్వీపంలో దాదాపు 70 ఏళ్లు ‘సంతోషంగల దేవునికి’ సేవ చేయగలిగినందుకు ఎంతో ఆనందంగా ఉంది!—1 తిమో. 1:11; కీర్త. 97:1.