పాఠకుల ప్రశ్నలు
గలతీయులు 4:24 లో అపొస్తలుడైన పౌలు ఏ రెండు ఒప్పందాల గురించి చెప్తున్నాడు?
శారాకు, హాగరుకు అబ్రాహాముతో ఉన్న సంబంధం గురించి చెప్పాక, అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “ఈ విషయాలకు వేరే అర్థం ఉంది. ఆ ఇద్దరు స్త్రీలు రెండు ఒప్పందాల్ని సూచిస్తున్నారు.” (గల. 4:22-24) ఈ రెండు ఒప్పందాల్లో ఒకటి ధర్మశాస్త్ర ఒప్పందం అని, ఇంకోటి కొత్త ఒప్పందం అని ఇదివరకు మనం అనుకునేవాళ్లం. అయితే, దీన్ని ఇంకాస్త పరిశీలించాక మన అవగాహనలో మార్పు అవసరమని గుర్తించాం. పౌలు ఇక్కడ కొత్త ఒప్పందం గురించి కాదుగానీ, అబ్రాహాము ఒప్పందం గురించి మాట్లాడుతున్నాడని చెప్పవచ్చు. ఎందుకో ఇప్పుడు చూద్దాం.a
సేవకురాలైన హాగరు సీనాయి పర్వతాన్ని, అలాగే క్రీస్తు పూర్వం 1513లో అక్కడ జరిగిన ధర్మశాస్త్ర ఒప్పందాన్ని సూచిస్తుందని పౌలు అన్నాడు. (గల. 4:25; నిర్గ. 19:5, 6) ధర్మశాస్త్రాన్ని ఏ అపరిపూర్ణ మనిషి పూర్తిగా పాటించలేడు కాబట్టి, యూదులు పాపానికి బానిసలని అది వాళ్లకు గుర్తు చేసింది. అయితే, ధర్మశాస్త్రాన్ని పొల్లు పోకుండా పాటించగలిగే ఏకైక మనిషిని, అంటే మెస్సీయను గుర్తించడానికి ఆ ఒప్పందం వాళ్లకు సహాయం చేస్తుంది. మెస్సీయ తన పరిపూర్ణ జీవాన్ని త్యాగం చేయడం ద్వారా, అపరిపూర్ణ మనుషులు పాపమరణాల నుండి విడుదల పొందే మార్గం తెరిచాడు. (గల. 3:19, 24, 25) దేవుని ఉద్దేశాన్ని యేసు నెరవేర్చడంతో ధర్మశాస్త్రం కూడా నెరవేరిపోయింది, కాబట్టి అది ఇంక అవసరం లేదు.—రోమా. 10:4.
‘స్వతంత్రురాలైన’ శారా సేవకురాలైన హాగరుకు పూర్తి భిన్నంగా ఉందని పౌలు అన్నాడు. శారా కుమారుడు “వాగ్దానం ద్వారా పుట్టాడు” అని కూడా ఆయన చెప్పాడు. (గల. 4:23) ఆ వాగ్దానమే అబ్రాహాము ఒప్పందం. (గల. 3:29; 4:28, 30) దాని గురించి ఆదికాండం 22:18 లో ఇలా ఉంది: “నువ్వు నా మాట విన్నావు కాబట్టి నీ సంతానం ద్వారా భూమ్మీదున్న అన్నిదేశాల ప్రజలు దీవెన సంపాదించుకుంటారు.”
యెహోవా ఏదెనులో ఇచ్చిన మాటకు సంబంధించిన అదనపు వివరాల్ని ఆ ఒప్పందం తెలియజేసింది. (ఆది. 3:15) రాబోయే “సంతానం” అబ్రాహాము వంశం నుండి వస్తాడని ఆ ఒప్పందం స్పష్టం చేసింది. ఆ సంతానం ముఖ్యంగా యేసుక్రీస్తును సూచిస్తుంది. ఆ సూచనార్థకమైన సంతానంలో “క్రీస్తుకు చెందినవాళ్లు” అంటే, దేవుని రాజ్యంలో యేసుతో పరిపాలించే 1,44,000 మంది కూడా వస్తారు. (గల. 3:16, 29; ప్రక. 14:1-3) అబ్రాహాముకు దేవుడు ఇచ్చిన మాట నిజమైనప్పుడు, యేసును అంగీకరించి, ఆయనకు లోబడే వాళ్లు ఎన్నో దీవెనల్ని పొందుతారు.
ఇంతకీ పౌలు ఏం చెప్పాలనుకున్నాడు? ఒకవేళ తన కాలంలోని యూదులు ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిందే అని పట్టుబడితే, హాగరులాగే బానిసత్వంలో ఉండిపోతారని చెప్పాలనుకున్నాడు. అయితే వాళ్లు అబ్రాహాము సంతానాన్ని అంటే, యేసుక్రీస్తును అంగీకరిస్తే శారాలా స్వతంత్రంగా ఉంటారు, పాపమరణాల నుండి నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందుతారని కూడా చెప్పాలనుకున్నాడు. (యోహా. 8:32-34) ఒకవేళ యేసును అంగీకరించకపోతే, వాళ్లు ధర్మశాస్త్ర ఒప్పందానికి ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని పట్టించుకోనట్టే. ఎందుకంటే, ప్రజల్ని క్రీస్తు వైపుకు నడిపించడమే దాని ముఖ్య ఉద్దేశం.
పౌలు ఈ మాటల్ని గలతీయులకు రాశాడు. వాళ్లలో చాలామంది యూదులుకాదు, ధర్మశాస్త్రం కింద ఎప్పుడూ లేరు. అలాంటివాళ్లు ధర్మశాస్త్రాన్ని పాటించాలని, సున్నతి చేయించుకోవాలని సంఘంలో ఉన్న కొంతమంది యూదులు పట్టుబట్టారు. అలా చేయడం తెలివితక్కువ పని అని పౌలు చెప్పాడు. ఎందుకంటే, వాళ్లు అప్పటికే ధర్మశాస్త్రం వల్ల వచ్చే “దాస్యం” నుండి బయటపడి, క్రీస్తు వల్ల వచ్చే “స్వేచ్ఛను” ఆనందిస్తున్నారు.—గల. 5:1, 10-14.
a ఇది కావలికోట, 2006, మార్చి 15, పేజీలు 10-12లో ఉన్న అవగాహనకు వచ్చిన మార్పు.