కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w26 జూన్‌ పేజీలు 8-13
  • బ్రదర్స్‌-సిస్టర్స్‌తో స్నేహాన్ని ఎలా కాపాడుకోవచ్చు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బ్రదర్స్‌-సిస్టర్స్‌తో స్నేహాన్ని ఎలా కాపాడుకోవచ్చు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • స్నేహాల్ని కాపాడుకోవడానికి సహాయం చేసే లక్షణాలు
  • అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు
  • మన వ్యక్తిత్వాలు వేరైనప్పుడు
  • మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ బాధపడుతున్నప్పుడు
  • ప్రేమలేని లోకంలో స్నేహాలను ఎలా కాపాడుకోవాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • మన బ్రదర్స్‌సిస్టర్స్‌కి దగ్గరవ్వడం మనకు మంచిది!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
    2025-2026 ప్రాంతీయ సమావేశ కార్యక్రమం, ప్రాంతీయ పర్యవేక్షకునితో
  • యెహోవాలా వినయం చూపించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
w26 జూన్‌ పేజీలు 8-13

ఆగస్టు 17-23, 2026

పాట 90 ఒకరినొకరు ప్రోత్సహించుకోండి

బ్రదర్స్‌-సిస్టర్స్‌తో స్నేహాన్ని ఎలా కాపాడుకోవచ్చు?

“వాత్సల్యంతో కూడిన కనికరాన్ని, దయను, వినయాన్ని, సౌమ్యతను, ఓర్పును అలవర్చుకోండి.”—కొలొ. 3:12.

ముఖ్యాంశం

బ్రదర్స్‌-సిస్టర్స్‌తో మనకున్న స్నేహాన్ని పాడుచేసే పరిస్థితులు వస్తే ఏం చేయాలో తెలుసుకుంటాం.

1. నిజమైన స్నేహితుల్ని మనం ఎక్కడ సంపాదించుకోవచ్చు?

ఈ చివరి రోజుల్లో, జీవితమంతా కష్టాలు-కన్నీళ్లే. దానికితోడు, నిజమైన స్నేహితులు లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా తయారౌతుంది. ఈ విషయం యెహోవాకు కూడా తెలుసు. అందుకే, తన ప్రజల్లో నిజమైన స్నేహితుల్ని సంపాదించుకునే గొప్ప అవకాశం మనకు ఇచ్చాడు. (కీర్త. 119:63) మనందరం ఒక కుటుంబంలా ఒకరినొకరం ప్రేమించుకుంటాం, యెహోవాను కలిసి ఆరాధిస్తాం.

2. బ్రదర్స్‌-సిస్టర్స్‌తో మనం చేసే స్నేహాలు ఎలాంటివి?

2 మనం బ్రదర్స్‌-సిస్టర్స్‌తో చేసే స్నేహాలు ఏవో పైపైన చేసేవి కావు. మనం వాళ్లకు చాలా దగ్గరౌతాం, నమ్మకంగా ఉంటాం. యెహోవాను, యేసును ప్రేమించే కుటుంబంలో మనం ఉన్నాం. కాబట్టి, ఆ ప్రేమే మనల్ని ఐక్యం చేస్తుంది. (యోహా. 13:35) అయితే ఈ స్నేహాలు అనుకోకుండా, వాటికవే ఏర్పడేవి కావు. అవి నిలబడాలంటే, రెండువైపుల నుండి కృషి అవసరం. అంతేకాదు, మనందరం అపరిపూర్ణులం కాబట్టి మన స్నేహాల్ని పాడుచేసే పరిస్థితులు వస్తూనే ఉంటాయి.

3. స్నేహాల్ని కాపాడుకోవడం ఎందుకు అంత ఈజీ కాదు?

3 నిజం చెప్పాలంటే, మనం కొంతమందికి బాగా దగ్గరైపోతాం. ఎందుకంటే, మనలాంటి ఇష్టాలు, ఆలోచనలే వాళ్లకు కూడా ఉంటాయి. కానీ సంఘంలోని వేరేవాళ్లతో స్నేహం చేయడం, దాన్ని కాపాడుకోవడం అంత ఈజీ కాదని మనకు అనిపించవచ్చు. కొన్నిసార్లు అభిప్రాయభేదాల వల్ల మన మధ్యున్న స్నేహం బలహీనపడవచ్చు. కొంతమంది బ్రదర్స్‌-సిస్టర్స్‌ వ్యక్తిత్వాలకు, మన వ్యక్తిత్వానికి ఎంత తేడా ఉంటుందంటే, మనకు వాళ్లతో ఒక్క నిమిషం కూడా కలిసి ఉండాలని అనిపించకపోవచ్చు. అంతేకాదు, మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ ఆరోగ్యం బాలేనప్పుడు, తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయినప్పుడు మన స్నేహానికి కొన్ని పరీక్షలు ఎదురవ్వవచ్చు. అయితే ఈ ఆర్టికల్‌లో ఎలాంటి పరిస్థితులు వచ్చినా, మన స్నేహాల్ని బలంగా ఉంచుకోవడానికి యేసు ఆదర్శం ఎలా సహాయం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. దానికంటే ముందు, ఈ విషయంలో దేవుడు ఇష్టపడే లక్షణాల్ని పెంచుకోవడం ఎలా సహాయం చేస్తుందో తెలుసుకుందాం.

స్నేహాల్ని కాపాడుకోవడానికి సహాయం చేసే లక్షణాలు

4. మన స్నేహాల్ని ఎలా బలంగా ఉంచుకోవచ్చు?

4 మన స్నేహాల్ని బలంగా ఉంచుకోవాలంటే, ఇతరుల్లో మంచిని చూడాలి. అలా బ్రదర్స్‌-సిస్టర్స్‌లో ఉన్న మంచి లక్షణాల గురించి తెలుసుకోవాలంటే, వాళ్లతో సమయం గడపాలి. అపొస్తలుడైన పౌలు కూడా సహోదర-సహోదరీలను నేరుగా చూడాలని ఎంతో కోరుకున్నాడు, అందుకే థెస్సలొనీక సంఘానికి ఇలా రాశాడు: “మిమ్మల్ని కలవడానికి అన్నిరకాలుగా ప్రయత్నించాం.” (1 థెస్స. 2:17) స్నేహాల్ని బలంగా ఉంచుకోవడానికి నేరుగా కలుసుకోవడమే అన్నిటికన్నా మంచి పద్ధతి అని చాలామంది ఒప్పుకుంటారు. మనం నేరుగా కలుసుకోవడానికి పరిచర్య, మీటింగ్స్‌, సమావేశాలు మంచి అవకాశాలు. కానీ, అలా కలుసుకున్నంత మాత్రాన కలిసిమెలిసి ఉంటామని చెప్పలేం.

5. మన స్నేహాలు పాడవ్వకుండా ఉండాలంటే ఏ లక్షణాలు చూపించాలి? ఒక ఉదాహరణ చెప్పండి. (కొలొస్సయులు 3:12)

5 మన స్నేహాలు పాడవ్వకుండా ఉండాలంటే మనం కొన్ని లక్షణాలు చూపించాలి. (కొలొస్సయులు 3:12 చదవండి.) మనం వినయం, ఓపిక, దయ, కనికరం లాంటి లక్షణాలు చూపించినప్పుడు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా స్నేహాల్ని కాపాడుకోగలుగుతాం. ఉదాహరణకు, కొన్ని మెషీన్లు బాగా పనిచేయాలంటే ఆయిల్‌ వేయాలి. అదేవిధంగా, మన బంధాలు బాగుండాలంటే మనం మంచి లక్షణాలు చూపించాలి. అయితే, మన బ్రదర్స్‌-సిస్టర్స్‌తో ఉన్న స్నేహాల్ని దెబ్బతీసే మూడు పరిస్థితుల గురించి ఇప్పుడు చూద్దాం. అంతేకాదు, యేసు చూపించినట్టే మనం కూడా వినయం, ఓపిక, దయ, కనికరం చూపిస్తే మన స్నేహాలు ఎలా నిలబడతాయో తెలుసుకుంటాం.

అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు

6. అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు ఏం జరగవచ్చు?

6 ఏం జరగవచ్చు? అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు, ఎవరి అభిప్రాయం వాళ్లకు సరైనదిగా అనిపించవచ్చు. ఉదాహరణకు, ఒక క్షేత్ర సేవా గ్రూప్‌లో ఇద్దరు బ్రదర్స్‌ ఉన్నారని అనుకోండి. ఆ గ్రూప్‌లోని బ్రదర్స్‌-సిస్టర్స్‌ ప్రీచింగ్‌ ఎలా చేయాలనే విషయంలో వాళ్లిద్దరికీ వేరు-వేరు అభిప్రాయాలు ఉన్నాయి. ఎవరి అభిప్రాయం వాళ్లకు కరెక్ట్‌గా అనిపించవచ్చు. ఒకవేళ వాళ్లు అనుకున్నదే కరెక్ట్‌ అని గర్వంతో పట్టుబడితే, గోరంత సమస్య కొండంత అవుతుంది. దాన్ని వెంటనే పరిష్కరించుకోకపోతే వాళ్ల మీద ద్వేషం, కోపం పుట్టుకొస్తాయి. కాలం గడిచేకొద్దీ, వాళ్ల మధ్య దూరం బాగా పెరిగిపోయి, తమ స్నేహబంధం తెగిపోయేదాకా వెళ్తుంది.

7. అభిప్రాయభేదాల్ని పరిష్కరించుకోవడానికి వినయం సహాయం చేస్తుందని యేసు ఎలా నేర్పించాడు?

7 యేసు చూపించిన వినయం నుండి నేర్చుకోండి. అభిప్రాయభేదాల్ని పరిష్కరించుకోవడానికి సహాయం చేసే ఒక లక్షణం గురించి యేసు తన శిష్యులకు చెప్పాడు. అదే వినయం! శిష్యులు చాలాసార్లు ‘ఎవరు గొప్ప?’ అనే విషయం గురించి వాదించుకున్నారు. ఆ ఆలోచన వాళ్ల నరనరాల్లో ఇంకిపోయింది. దాన్ని తీసేసుకోవాలంటే, ఇతరుల్ని తమకంటే గొప్పవాళ్లుగా చూడాలని చెప్తూ, వినయంగా ఎలా ఉండాలో యేసు నేర్పించాడు. (మత్త. 20:25-28) ఆయన చనిపోవడానికి ముందురోజు రాత్రి తన శిష్యుల కాళ్లను కడిగాడు, ఒక సేవకుడి పనిని చేసి వాళ్లకు ‘ఆదర్శం ఉంచాడు.’ (యోహా. 13:3-5, 12-16) అలా చేయడం ద్వారా వాళ్ల మధ్యున్న స్నేహాన్ని ఎలా కాపాడుకోవాలో చూపించాడు. ఇతరుల్ని తమకంటే గొప్పవాళ్లుగా చూసినప్పుడు వాళ్ల అభిప్రాయాలు నచ్చకపోయినా సరే, వాటిని ఒప్పుకోవడం కాస్త తేలికౌతుంది. అప్పుడు అభిప్రాయభేదాలు ఉన్నా, దగ్గరి స్నేహితులుగా ఉండగలుగుతారు.

8. అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు మన స్నేహం పాడవ్వకుండా ఉండడానికి వినయం ఎలా సహాయం చేస్తుంది? (కొలొస్సయులు 3:13) (చిత్రాలు కూడా చూడండి.)

8 స్నేహాల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు? వినయం ఉంటే ఇతరులతో మనకు వచ్చే చిన్నచిన్న అభిప్రాయభేదాల్ని పట్టించుకోకుండా ఉంటాం, వాళ్లను మనస్ఫూర్తిగా క్షమిస్తాం. (కొలొస్సయులు 3:13 చదవండి.) అలాగే వినయం చూపిస్తే, అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు కోపంతో ఊగిపోం, దాంతో మన స్నేహం పాడవ్వకుండా ఉంటుంది. (కీర్త. 4:4) ఇతరులు కోపంతో మిమ్మల్ని ఒక మాట అన్నాసరే క్షమించండి, అందరం అప్పుడప్పుడు నోరు జారతామనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. (ప్రసం. 7:21, 22) ఇలా ప్రశ్నించుకోండి: “నేనే కరెక్ట్‌ అని నిరూపించుకోవడం ముఖ్యమా? మా మధ్యున్న స్నేహం ముఖ్యమా?” ఒక మెట్టు దిగి మీరే వాళ్ల అభిప్రాయాల్ని ఒప్పుకోవచ్చు కదా! జరిగినదాన్ని మళ్లీమళ్లీ ఎత్తకుండా ముందుకెళ్లండి, అలా చేస్తే మీరు ప్రశాంతంగా ఉంటారు.

చిత్రాలు: ఒక పెద్ద వయసు బ్రదర్‌ యేసులా వినయం చూపిస్తున్నాడు. 1. యేసు ఒక అపొస్తలుడి కాళ్లు కడుగుతున్నాడు. 2. సంఘానికి సంబంధించిన టెరిటరీ మ్యాప్‌ని చూపిస్తూ ఒక యౌవన బ్రదర్‌ మాట్లాడుతుంటే ఒక పెద్ద వయసు బ్రదర్‌ వింటున్నాడు కానీ దానికి ఒప్పుకోలేకపోతున్నాడు. 3. మళ్లీ వాళ్లిద్దరే కలిసి సంతోషంగా ప్రీచింగ్‌ చేస్తున్నారు.

వినయం ఉంటే చిన్నచిన్న అభిప్రాయభేదాల్ని పట్టించుకోం, మనస్ఫూర్తిగా క్షమిస్తాం (8వ పేరా చూడండి)a


9. అభిప్రాయభేదాల్ని పరిష్కరించుకోవడం కష్టంగా అనిపించినప్పుడు వినయం ఎలా సహాయం చేస్తుంది? (సామెతలు 17:9)

9 అభిప్రాయభేదాలు ఎంతకీ పరిష్కారం అవ్వనప్పుడు కూడా వినయం మనకు సహాయం చేస్తుంది. (సామెతలు 17:9 చదవండి; 1 కొరిం. 6:7) ఇతరులతో ఉన్న స్నేహాన్ని కాపాడుకోవడమే మీ లక్ష్యంగా పెట్టుకోండి. సమస్యలు వచ్చినప్పుడు ఎదుటివ్యక్తి దగ్గరికి నేరుగా వెళ్లి, దయగా మాట్లాడడం వల్ల చాలామందికి పరిష్కారం దొరికింది. (కీర్త. 34:14) అలాంటి పరిస్థితి మీకు కూడా వస్తే, వాళ్లని ఇలా అడిగి చూడండి: ‘ఇన్ని రోజులు మనం బానే ఉన్నాం. ఇప్పుడు ఎందుకు ఇలా అయింది. ఒకసారి కలిసి మాట్లాడుకుందామా, ప్లీజ్‌!’ జరిగిన దాంట్లో మీ తప్పు కూడా ఉందని ఒప్పుకోండి, వాళ్లను బాధపెట్టినందుకు క్షమించమని అడగండి. ఒకవేళ ఆ బ్రదర్‌ గానీ, సిస్టర్‌ గానీ మిమ్మల్ని క్షమించమని అడిగితే కఠినంగా ఉండకండి, వినయంగా క్షమించండి. (లూకా 17:3, 4) మన వాదనను గెలిపించుకోవడం మన లక్ష్యం కాదు. వాళ్ల మనసును గెలుచుకుని, స్నేహాన్ని కాపాడుకోవడమే మన లక్ష్యం.—సామె. 18:24.

మన వ్యక్తిత్వాలు వేరైనప్పుడు

10. మనం బ్రదర్స్‌-సిస్టర్స్‌కి దగ్గరవ్వడం ఎందుకు కష్టంగా అనిపించవచ్చు?

10 ఏం జరగవచ్చు? మన వ్యక్తిత్వం, మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ వ్యక్తిత్వం వేరుగా ఉన్నప్పుడు వాళ్లతో స్నేహం చేయడం, వాళ్లకు దగ్గరవ్వడం కష్టంగా అనిపించవచ్చు. కొంతమంది అలవాట్లు మనకు చిరాకు తెప్పించవచ్చు. ఇంకొంతమందికి నలుగురితో ఎలా ఉండాలో తెలియకపోవచ్చు. బహుశా వాళ్లు పెరిగిన విధానం వల్ల లేదా గతంలో ఎదురైన చేదు అనుభవాల వల్ల అలా ఉండవచ్చు. కొందరు, వాళ్ల సంస్కృతి వల్ల బాగా హడావిడి చేస్తుంటారు లేదా సిగ్గుపడుతూ ఉంటారు. కొన్నిసార్లు మన స్వభావం వల్ల కూడా దగ్గరవ్వలేకపోవచ్చు. అంటే, ఒకరేమో అందరితో చాలా కలివిడిగా ఉంటే, ఇంకోకరేమో మొహమాటంతో పొడిపొడిగా మాట్లాడుతుంటారు.

11. తనలాంటి వ్యక్తిత్వం లేని వాళ్లతో కూడా యేసు స్నేహంగా ఎలా ఉన్నాడు?

11 యేసు చూపించిన ఓర్పు నుండి నేర్చుకోండి. తనలాంటి వ్యక్తిత్వం లేని వాళ్లతో కూడా యేసు స్నేహంగా ఉండేవాడు. యాకోబు-యోహానుల ఉదాహరణే తీసుకోండి; తమకు పరలోకంలో ముఖ్యమైన స్థానాలు కావాలని వాళ్లు కోరుకున్నారు. (మార్కు 10:35-37) కానీ యేసు అలా కాదు, పరలోకంలో తనకున్న గొప్ప స్థానాన్ని వదిలేసి భూమ్మీదికి వచ్చాడు. (ఫిలి. 2:5-8) చెప్పాలంటే యేసు ఆలోచనకు, వాళ్ల ఆలోచనకు భూమికి-ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. అయినా యేసు యాకోబు-యోహానులతో, మిగతా వాళ్లతో ఓపిగ్గా ఉన్నాడు.

12. యేసు తన స్నేహితులతో ఎందుకు ఓపిగ్గా ఉన్నాడు?

12 యేసు తన స్నేహితుల నుండి మరీ ఎక్కువ ఆశించలేదు. అందరికన్నా ముఖ్యమైన స్థానాల్లో ఉండాలని యాకోబు-యోహానులే కాదు, వేరే శిష్యులు కూడా కోరుకుంటున్నారని, దానికోసం పోటిపడుతున్నారని యేసుకు తెలుసు. (మార్కు 9:34) యేసు కూడా అలాంటి సంస్కృతిలోనే పెరగడం వల్ల, తన శిష్యులు ఎందుకు అలా ఆలోచిస్తున్నారో అర్థంచేసుకోగలిగాడు. ఎప్పటినుండో వాళ్ల నరనరాల్లో ఇంకిపోయిన గర్వాన్ని, నలుగురిలో గొప్పగా ఉండాలనే ఆరాటాన్ని చిటికెలో తీసేసుకోలేరని, కొంత సమయం పడుతుందని ఆయన అర్థం చేసుకున్నాడు. అందుకే వాళ్లతో ఓపిగ్గా ఉన్నాడు.—మార్కు 10:42-45.

13. మన స్నేహాల్ని కాపాడుకోవడానికి ఓర్పు ఎలా సహాయం చేస్తుంది? (ఎఫెసీయులు 4:2)

13 స్నేహాల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు? మనలో ప్రతీఒక్కరం వేరు-వేరుగా ఉంటాం, అది తప్పేం కాదు. అయితే, కొంతమంది అలవాట్లు మనకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఇతరుల్లో మనకు నచ్చని అలవాట్లను భరించాలంటే ఓర్పు చూపిస్తూ ఉండాలి. (సామె. 14:29) అదేవిధంగా, వాళ్లు కూడా మన అలవాట్లను భరిస్తున్నారు కాబట్టి మనం కృతజ్ఞతతో ఉండాలి. (ఎఫెసీయులు 4:2 చదవండి.) ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే: అందరూ మనకు నచ్చినట్టు ఉండాలని ఆశించకూడదు, వాళ్లను వాళ్లలాగే ఉండనివ్వాలి. కొంతమంది సిగ్గు, భయం ఉన్నా నలుగురితో మాట్లాడడానికి, అందరితో కలిసిపోవడానికి ప్రయత్నిస్తుంటారు, వాళ్ల కృషిని గుర్తించండి. ఇంకొంతమంది అందరితో కలివిడిగా ఉంటూ గలగలా మాట్లాడుతూ ఉంటారు, వాళ్లతో కాస్త ఓపిగ్గా ఉండండి. నిజమే, అందరూ మన బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అవుతారని అనుకోలేం. కానీ వేరు-వేరు వ్యక్తిత్వాలు ఉన్నా కూడా అందరితో కలిసిమెలిసి ఉండడం సాధ్యమే అని గుర్తుంచుకోండి.

14. మనకు ఓర్పు ఉంటే ఏం చేస్తాం?

14 మనకు ఓర్పు ఉంటే, బ్రదర్స్‌-సిస్టర్స్‌లోని మంచిని చూస్తాం. అప్పుడు, మన వ్యక్తిత్వాలు వేరుగా ఉండడం వల్ల స్నేహం చేయలేకపోతున్నామని సాకులు చెప్పం. ఉదాహరణకు, యాకోబు-యోహానులు స్వార్థంగా గొప్ప స్థానాల్ని కోరుకున్నారు, కానీ అలా అడిగారంటే, వాళ్లు రాజ్యాన్ని నిజమైనదిగా చూశారని అర్థమవుతుంది. యేసు ఆ విషయాన్నే గమనించి, వాళ్లకున్న విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు. మనం కూడా మన స్నేహితుల్లో మంచిని చూసినప్పుడు యేసును, ఆయన తండ్రైన యెహోవాను అనుకరించినట్టు అవుతుంది.

15. వేరు-వేరు వ్యక్తిత్వాలు ఉన్నవాళ్లతో స్నేహాల్ని కాపాడుకోవడానికి మనకు ఎవరు సహాయం చేస్తారు?

15 అన్నిటికంటే ముఖ్యంగా యెహోవాకు ప్రార్థించండి. దానివల్ల, వేరు-వేరు వ్యక్తిత్వాలు ఉన్నాసరే, స్నేహాల్ని కాపాడుకోవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో మీకు బాగా చిరాకు వస్తుందో ఆలోచించండి, ఆ సమయంలో ప్రశాంతంగా ఉండేలా సహాయం చేయమని యెహోవాను ముందే అడగండి. యెహోవా మన సృష్టికర్త, కాబట్టి మనందరం ఒకేలా ఉండమని ఆయనకు తెలుసు. ఓపిగ్గా ఉండడానికి మనకు ఏం అవసరమో కూడా ఆయనకు తెలుసని గుర్తుంచుకోండి. అలాగే, ఇక భరించలేమని అనిపించినప్పుడు ఎదుటివాళ్ల మీద కోప్పడకుండా ఉండడానికి సహాయం చేయమని, పవిత్రశక్తిని ఇవ్వమని యెహోవాను అడగండి.—లూకా 11:13; గల. 5:22, 23.

మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ బాధపడుతున్నప్పుడు

16. మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ బాధపడుతున్నప్పుడు ఏం జరగవచ్చు?

16 ఏం జరగవచ్చు? మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ ఆరోగ్యం బాలేనప్పుడు లేదా వాళ్లు దుఃఖంలో మునిగిపోయినప్పుడు కొన్నిసార్లు వాళ్ల మాటలతో, పనులతో మనల్ని బాధపెట్టవచ్చు లేదా మనకు చిరాకు తెప్పించవచ్చు. ఉదాహరణకు, వాళ్లు నలుగురితో మాట్లాడడానికి, కలవడానికి ఇష్టపడకపోవచ్చు, చీటికిమాటికి కోప్పడవచ్చు లేదా ఒక్కోసారి ఒక్కోలా ఉండవచ్చు. (యోబు 6:2, 3) మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ ఏమేం కష్టాలు పడుతున్నారో మనకు పూర్తిగా తెలీదు కాబట్టి, వాళ్లు మనకు నచ్చినట్టు ఉండాలని ఆశించలేం.

17. చూపులేని బర్తిమయితో యేసు ప్రవర్తించిన విధానం నుండి ఏం నేర్చుకున్నారు?

17 యేసు చూపించిన దయ, కనికరం నుండి నేర్చుకోండి. బాధపడుతున్న వాళ్లమీద, దుఃఖంలో మునిగిపోయిన వాళ్లమీద యేసు దయ, కనికరం చూపించాడు. ముందెప్పుడూ వాళ్లను కలవకపోయినా సరే ఆయన అలా చేశాడు. ఉదాహరణకు, యేసు బర్తిమయి అనే ఒక చూపులేని వ్యక్తితో ఎలా ప్రవర్తించాడో గమనించండి. యేసు అటుగా వెళ్తున్నాడని అతనికి తెలిసినప్పుడు, యేసు ఎలాగైనా తనను చూడాలని బర్తిమయి గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టాడు. చుట్టూ ఉన్నవాళ్లు అతన్ని ఊరుకోమని చెప్పారు. కానీ యేసు తనను బాగుచేయాలని బర్తిమయి ఎంతో తపించాడు కాబట్టి ఇంకా గట్టిగా అరిచాడు. బహుశా, అతని అరుపులకు చుట్టూ ఉన్నవాళ్లు ఇబ్బందిపడి ఉంటారు. కానీ యేసు మాత్రం అతని మీద ‘జాలిపడ్డాడు.’ అంటే, అతనికి ఎలాగైనా సహాయం చేయాలని యేసు కోరుకుంటున్నట్టు తెలుస్తుంది. (మత్త. 20:34; మార్కు 10:46-52) అందుకే, ఆయన బర్తిమయితో దయగా మాట్లాడాడు, అతనికున్న విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు. తర్వాత, అద్భుతంగా అతనికి చూపు తెప్పించాడు.

18. బాధలో ఉన్న మీ స్నేహితులతో ఎలా ఉండవచ్చు? (1 థెస్సలొనీకయులు 5:14)

18 స్నేహాల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు? దయ, కనికరం చూపించండి. మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ ఆరోగ్యం బాలేనప్పుడు లేదా వాళ్లు దుఃఖంలో మునిగిపోయినప్పుడు “ఊరటనిచ్చేలా” మాట్లాడడానికి ఆ మంచి లక్షణాలు సహాయం చేస్తాయి. (1 థెస్సలొనీకయులు 5:14 చదవండి.) నిజమైన స్నేహితుడు ఎప్పుడూ తోడుంటాడు, ముఖ్యంగా “కష్టకాలంలో” మన వెన్నంటే ఉంటాడు. (సామె. 17:17) నిజమైన స్నేహితుడు కేవలం మన బాధని అర్థం చేసుకోవడమే కాదు దానినుండి బయటపడడానికి చేయగలిగినదంతా చేస్తాడు. తన మాటలతో మనల్ని నిలబెడతాడు, అవసరమైన సహాయం కూడా చేస్తాడు.

19. మనం దయ, కనికరం ఎలా చూపించవచ్చు? (చిత్రాలు కూడా చూడండి.)

19 మీరు దయ, కనికరం ఎలా చూపించవచ్చు? నిజమే, బ్రదర్స్‌-సిస్టర్స్‌ బాధని మీరు పూర్తిగా తీసేయలేరు. కానీ వాళ్ల వైపు నుండి ఆలోచించి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. (మత్త. 7:12; 1 పేతు. 3:8) వాళ్లకు ఎలా అనిపిస్తుందో చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినండి. ఒకవేళ, ఆ సమయంలో మాట్లాడడం సరైనదని మీకనిపిస్తే వాళ్లను ఓదార్చేలా మాట్లాడండి. (సామె. 12:25) వాళ్ల పరిస్థితి గురించి మీకు పూర్తిగా తెలుసని అనుకోకండి, లేకపోతే వాళ్లని తప్పుగా అర్థంచేసుకునే ప్రమాదం ఉంది. (సామె. 18:13) అలాగే వాళ్ల నుండి మరీ ఎక్కువ ఆశించకండి, ఓపిగ్గా ఉండండి.—ఎఫె. 4:32.

చిత్రాలు: ఒక సిస్టర్‌ ఇంకో సిస్టర్‌ని ఓదారుస్తుంది. 1. ఆమె ఫ్రెండ్‌ ఏడుస్తూ తనతో మాట్లాడుతుంటే ఆమె శ్రద్ధగా వింటుంది. 2. తర్వాత తన ఫ్రెండ్‌ కోసం ఆమె తయారుచేసిన బిస్కెట్స్‌ తీసుకోచ్చింది.

నిజమైన స్నేహితులు దయ, కనికరం చూపిస్తూ ఓదార్పును ఇస్తారు (19వ పేరా చూడండి)


20. మీరు ఎలాంటి ఫ్రెండ్‌గా ఉండాలనుకుంటున్నారు?

20 మన బ్రదర్స్‌-సిస్టర్స్‌తో ఉండే స్నేహాల్ని మనం చాలా విలువైనదిగా చూస్తాం. కొన్నిసార్లు మన మాటలతో, పనులతో వాళ్లను బాధపెడుతుంటాం. అలా కావాలని చేయం గానీ, మన అపరిపూర్ణత వల్ల లేదా గతంలో ఎదురైన చేదు అనుభవాల వల్ల అలా జరగవచ్చు. అయినాసరే, మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ మనతో స్నేహం చేస్తున్నారు. వినయం, ఓర్పు, దయ, కనికరం లాంటి లక్షణాలను మన విషయంలో చూపిస్తున్నారు. అందుకే వాళ్లను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. వాళ్లలాగే మనం కూడా మంచి ఫ్రెండ్స్‌ అని నిరూపించుకుందాం!

బ్రదర్స్‌-సిస్టర్స్‌తో స్నేహాల్ని ఎలా కాపాడుకోవచ్చు?

  • అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు

  • వ్యక్తిత్వాలు వేరైనప్పుడు

  • మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ బాధపడుతున్నప్పుడు

పాట 124 ఎల్లప్పుడూ యథార్థంగా ఉందాం

a చిత్రాల వివరణ: ఒక పెద్దవయసు బ్రదర్‌కి, చిన్నవయసు బ్రదర్‌కి టెరిటరీ విషయంలో అభిప్రాయభేదం వచ్చింది. తర్వాత వాళ్లు కలిసి సంతోషంగా ప్రీచింగ్‌ చేస్తున్నారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి