ఆగస్టు 10-16, 2026
పాట 122 విశ్వాసంలో సుస్థిరం అవ్వండి
పరీక్షలు వచ్చినా విశ్వసనీయంగా ఉండండి
“ప్రభువా, మేము ఎవరి దగ్గరికి వెళ్లాలి? శాశ్వత జీవితాన్నిచ్చే మాటలు నీ దగ్గరే ఉన్నాయి.”—యోహాను 6:68.
ముఖ్యాంశం
ఎలాంటి పరీక్షలు వచ్చినా మనం యెహోవాకు విశ్వసనీయంగా ఉండగలం.
1-2. యేసు కపెర్నహూములో బోధిస్తున్నప్పుడు ఏం జరిగింది?
ఒకసారి యేసు కపెర్నహూములో ఉన్నప్పుడు ప్రజలకు బోధిస్తున్నాడు. ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు మానవ కుమారుని శరీరాన్ని తిని, ఆయన రక్తాన్ని తాగితే తప్ప జీవం పొందరు. నా శరీరాన్ని తిని, నా రక్తాన్ని తాగే ప్రతీ ఒక్కరు శాశ్వత జీవితం పొందుతారు, చివరి రోజున నేను వాళ్లను తిరిగి బ్రతికిస్తాను.” (యోహా. 6:53, 54) యేసు చెప్పిన మాటలు అర్థంకాక అక్కడున్న చాలామంది శిష్యులు అయోమయంలో పడ్డారు. అందుకే వాళ్లు ఇలా అన్నారు: “ఈయన ఏం మాట్లాడుతున్నాడు? ఈ మాటలు ఎవరైనా వినగలరా?”—యోహా. 6:60.
2 యేసు చెప్పిన మాటలకు వాళ్లు ఎంతగా అభ్యంతర పడ్డారంటే ఆయన్ని అనుసరించడం మానేశారు. అలాగని వాళ్లకు ఆయన మీద అసలు విశ్వాసమే లేదనా? కాదు. ఇది జరగడానికి కాస్త ముందు, వాళ్లు యేసు చేసిన వాటిని చూసి, చాలా ఆశ్చర్యపోయి ఇలా అన్నారు: “లోకంలోకి రావాల్సిన ప్రవక్త నిజంగా ఈయనే.” (యోహా. 6:14) కాబట్టి ఆ శిష్యులకు యేసు మీద ఎంతోకొంత విశ్వాసం ఉందని చెప్పొచ్చు, కానీ వాళ్ల విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు మాత్రం యేసుకు నమ్మకంగా ఉండలేకపోయారు.
3. యేసు మాటలు విన్నప్పుడు అపొస్తలులు ఏం చేశారు, ఎందుకు? (చిత్రం కూడా చూడండి.)
3 అయితే యేసు మాటలు విన్న అపొస్తలులు మాత్రం అలా చేయలేదు. వాళ్లు కూడా వెళ్లిపోవాలని అనుకుంటున్నారా అని యేసు అడిగినప్పుడు, పేతురు ఇలా జవాబు ఇచ్చాడు: “ప్రభువా, మేము ఎవరి దగ్గరికి వెళ్లాలి? శాశ్వత జీవితాన్నిచ్చే మాటలు నీ దగ్గరే ఉన్నాయి. నువ్వు దేవుని పవిత్రుడివని మేము నమ్మాం, తెలుసుకున్నాం.” (యోహా. 6:68, 69) అయితే తన శరీరాన్ని తిని, రక్తాన్ని తాగమని అన్నప్పుడు, యేసు ఏం చెప్పాలనుకున్నాడో పేతురుకు గానీ, మిగతా శిష్యులకు గానీ పూర్తిగా అర్థం కాలేదు. అయినా వాళ్లు యేసుకు నమ్మకంగా ఉండాలనుకున్నారు. ఎందుకు? వాళ్లు యేసే “దేవుని అభిషిక్తుడు” అని గట్టిగా నమ్మారు.—లూకా 9:20, 35.
చాలామంది శిష్యులు యేసును వదిలేసి వెళ్లిపోయినా, పేతురు-మిగతా అపొస్తలులు ఆయనతోనే ఉన్నారు (3వ పేరా చూడండి)
4. మనకు ఎలాంటి పరీక్షలు వస్తుంటాయి?
4 యెహోవాకు విశ్వసనీయంగా ఉండే విషయంలో మనకు కూడా ఎన్నో పరీక్షలు వస్తుంటాయి. ఉదాహరణకు, ఏదైనా లేఖన అవగాహనలో గానీ, పరిచర్య చేసే విధానంలో గానీ మార్పు వస్తే దానికి సర్దుకుపోవడం కష్టంగా అనిపించవచ్చు. ఏదైనా జరగరానిది జరిగితే, యెహోవా దాన్ని ఎందుకు అనుమతించాడో అర్థం కాకపోవచ్చు. సంఘంలో దగ్గరి స్నేహితులు మిమ్మల్ని బాధపెడితే లేదా మీరెంతో గౌరవించే ఒక బ్రదర్ గానీ, సిస్టర్ గానీ మీతో అన్యాయంగా ప్రవర్తిస్తే దాన్ని తట్టుకోవడం కష్టంగా అనిపించవచ్చు.
5. మన విశ్వాసానికి గట్టి పునాది ఉండడం ఎందుకు ముఖ్యమో ఒక ఉదాహరణతో చెప్పండి. (కొలొస్సయులు 1:23)
5 మన విశ్వాసానికి గట్టి పునాది ఉండడం చాలా ముఖ్యం. దాని గురించి ఒక ఉదాహరణ చూద్దాం. బాగా భూకంపాలు వచ్చే ప్రాంతంలో ఉన్న ఒక బిల్డింగ్ కూలిపోకుండా ఉండాలంటే దానికి గట్టి పునాది ఉండాలి. అదేవిధంగా, ముందు పేరాలో చెప్పిన లాంటి పరీక్షల్ని తట్టుకోవాలంటే మన విశ్వాసానికి గట్టి పునాది ఉండాలి. దాన్ని బలంగా ఉంచుకుంటేనే మనం కష్టాలు వచ్చినా స్థిరంగా ఉంటాం, యెహోవాకు విశ్వసనీయంగా ఉంటాం.—1 కొరిం. 15:58; కొలొస్సయులు 1:23 చదవండి.
6. అపొస్తలులు యేసుకు విశ్వసనీయంగా ఉండడానికి ఏం సహాయం చేసింది?
6 అందరూ యేసును వదిలేసి వెళ్లినా, అపొస్తలులు మాత్రం విశ్వసనీయంగా ఉండడానికి వాళ్లకు ఏం సహాయం చేసింది? వాళ్లు ఈ విషయాల్ని పూర్తిగా నమ్మారు: యెహోవాయే అన్నిటినీ చేశాడు కాబట్టి ఆయనే ఆరాధనకు అర్హుడు; యేసే దేవుని కుమారుడు, ఆయన దగ్గరే “శాశ్వత జీవితాన్నిచ్చే మాటలు” ఉన్నాయి; ఆయనకు యెహోవా తోడుగా ఉన్నాడు. అపొస్తలులకు వచ్చినట్టే మన విశ్వాసానికి కూడా ఎన్నో పరీక్షలు రావచ్చు. అయితే వాటి గురించి తెలుసుకునే బదులు, ఎలాంటి పరీక్షలు వచ్చినా తట్టుకుని నిలబడడానికి సహాయం చేసే మూడు సత్యాల గురించి తెలుసుకుందాం. (1) యెహోవాయే అన్నిటినీ చేసిన సృష్టికర్త. (2) యెహోవాయే బైబిల్ని రాయించాడు. (3) యెహోవాయే సంస్థను నడిపిస్తున్నాడు. ఈ మూడు సత్యాల్ని మనం బలంగా నమ్మితే, ఏ పరీక్ష వచ్చినా తట్టుకుని నిలబడగలుగుతాం.
యెహోవాయే సృష్టికర్త
7. ప్రకటన 4:11 ఏం చెప్తుంది? మన విశ్వాసానికి పరీక్షలు వచ్చినప్పుడు ఏం జరగవచ్చు?
7 ప్రకటన 4:11 చదవండి. యెహోవా అన్నిటినీ సృష్టించాడని ఈ లేఖనం చెప్తుంది. ఆయనే మన ఆరాధనకు అర్హుడని రుజువు చేయడానికి ఆ ఒక్క లేఖనం చాలు. యెహోవాకున్న అంతులేని శక్తి గురించి ధ్యానించినప్పుడు, ఎలాంటి కష్టాలు వచ్చినా ఆయన మనకు సహాయం చేయగలడనే ధైర్యం వస్తుంది. అయితే సాతాను, అసలు దేవుడు లేడనే అబద్ధంతో ఈ లోకాన్ని నింపేశాడు. కొంతమంది పెద్దపెద్ద సైంటిస్ట్‌లు కూడా జీవం దానికదే వచ్చిందని చెప్తుంటారు. ఒకవేళ యెహోవాయే సృష్టికర్త అని, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని మనం గట్టిగా నమ్మకపోతే, పరీక్షలు వచ్చినప్పుడు ‘ఆయన అసలు ఉన్నాడా?’ ‘సహాయం చేస్తాడా?’ అనే అనుమానాలు రావచ్చు.—హెబ్రీ. 11:6.
8-9. యెహోవాయే మన సృష్టికర్త అనే విషయంలో మీకు అనుమానం వస్తే ఏం చేయాలి? (చిత్రం కూడా చూడండి.)
8 యెహోవాయే సృష్టికర్త అనే విషయంలో మీకు ఏ చిన్న అనుమానం వచ్చినా, వెంటనే దాన్ని తీసేసుకోవడానికి ప్రయత్నించండి. యెహోవాయే అన్నిటినీ తయారు చేశాడని చెప్పడానికి రుజువులు కుప్పలుకుప్పలుగా ఉన్నాయి. వాటికి సంబంధించి మన ప్రచురణల్లో వెతికి బాగా పరిశోధన చేయండి. ఈ విషయం గురించి జీవం సృష్టించబడిందా? (ఇంగ్లీష్), జీవారంభం—అడగాల్సిన ఐదు ప్రశ్నలు (ఇంగ్లీష్) బ్రోషుర్లలో మన విశ్వాసాన్ని పెంచే సమాచారం చాలా ఉంది. అంతేకాదు, jw.org వెబ్‌సైట్‌లో “సృష్టిలో అద్భుతాలు” అనే సిరీస్‌లో అలాంటి ఇంకెన్నో రుజువుల్ని చూడవచ్చు. అమెరికాలో ఉంటున్న జెస్సికా అనే అమ్మాయి ఇలా చెప్తుంది: “నేను మన ప్రచురణల్లో పరిశోధన చేసినప్పుడు, ఒక తెలివైన వ్యక్తే మనందర్నీ సృష్టించాడని చెప్పడానికి ఎన్నో రుజువులు దొరికాయి. సృష్టికర్త ఉన్నాడని నాకు ముందే తెలుసు కానీ, అలా పరిశోధన చేయడం వల్ల ఈ విషయంలో నాకు ఇప్పుడు ఎలాంటి సందేహాలు లేవు.” అలాగే, మీపట్ల శ్రద్ధగల సృష్టికర్త ఉన్నాడా? (ఇంగ్లీష్) అనే పుస్తకం కూడా చాలామందికి సహాయం చేసింది. బహుశా మీరు ఇప్పటికే దాన్ని చదివి ఉంటారు, కానీ ఇంకొకసారి చదివి చూడండి.
9 ఈసారి వ్యక్తిగత అధ్యయనం చేసేటప్పుడు, దేవుడు ఉన్నాడని చెప్పడానికి రుజువులు ఏంటో తెలుసుకోండి. మీరు చేసే పరిశోధన వల్ల దేవుడు ఉన్నాడనే మీ నమ్మకం పెరగడమే కాదు, ఆయనకున్న లక్షణాల గురించి కూడా మీరు ఎన్నో విషయాల్ని తెలుసుకుంటారు. (రోమా. 1:20) అంతేకాదు, సందేహాలు ఉన్నవాళ్లకు కూడా సహాయం చేయగలుగుతారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి: యెహోవాయే మన సృష్టికర్త అని చెప్పడానికి ఆయన మనకు లెక్కలేనన్ని రుజువులు ఇచ్చాడు.
Nebula: IAC/RGO/David Malin Images; fish and car: Mercedes-Benz USA; plane: Kristen Bartlett/University of Florida
సృష్టికర్త ఉన్నాడని రుజువుచేసే మన ప్రచురణల్ని మీరు ఇప్పటికే చదివి ఉంటారు. వాటిని ఇంకోసారి చదివి చూడండి (8వ పేరా చూడండి)
యెహోవాయే బైబిల్ని రాయించాడు
10. మనకు బైబిలు ఎందుకంత విలువైనది? (2 తిమోతి 3:16, 17)
10 2 తిమోతి 3:16, 17 చదవండి. బైబిలు ఒక ఉత్తరం లాంటిది, దాన్ని యెహోవా మనుషుల కోసం రాయించాడు. మనకు జీవితంలో వచ్చే ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు అందులో ఉంటాయి. అలాగే మనం ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడో కూడా దానిలో తెలుస్తుంది. ప్రపంచంలో ఏ పుస్తకం కన్నా మనకు బైబిలు చాలా విలువైనది, ఎందుకంటే యెహోవాయే స్వయంగా దాన్ని రాయించాడు. అందులో ఉన్న ప్రతీమాటను అర్థం చేసుకోవడానికి, పాటించడానికి మనం చేయగలిగినదంతా చేస్తాం.
11. యెహోవాయే బైబిల్ని రాయించాడని మీరు ఎందుకు నమ్ముతున్నారు?
11 యెహోవాయే బైబిల్ని రాయించాడని మనం ఎందుకు గట్టిగా నమ్ముతున్నాం? చాలా కారణాలు ఉన్నాయి. బైబిలు చెప్పేది నిజమని చరిత్ర రుజువు చేస్తుంది. (లూకా 3:1, 2) అలాగే ప్రకృతికి, సైన్స్‌కి సంబంధించిన విషయాల్లో కూడా అది ఖచ్చితంగా ఉంది. (యోబు 26:7) సాతాను బైబిల్ని నాశనం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ బైబిలు ప్రింట్ అయిన కాపీల సంఖ్యను, అది అందుబాటులో ఉన్న భాషల సంఖ్యను చూస్తే సాతాను చిత్తుచిత్తుగా ఓడిపోయాడని చెప్పవచ్చు. బైబిల్ని రాయడానికి సుమారు 1,600 సంవత్సరాలు పట్టింది, దాదాపు 40 మంది దాన్ని రాశారు, అయినా అందులోని విషయాలు ఒకేలా ఉన్నాయి. దాన్ని ఎప్పుడో రాసినా, అందులోని సలహాలు మాత్రం ఇప్పటికీ పనికొస్తున్నాయి. (సామె. 13:20; 15:21; మత్త. 7:12) అలాగే బైబిల్లోని ఎన్నో ప్రవచనాలు కూడా నిజమయ్యాయి; బైబిల్ని నమ్మవచ్చు అనడానికి ఇది ఇంకో పెద్ద రుజువు. (యెహో. 23:14) నిజంగా, బైబిల్ని దేవుడే రాయించాడని మనం బల్లగుద్ది చెప్పొచ్చు!
12. బైబిల్ని నిజంగా దేవుడే రాయించాడా అనే అనుమానం మనకు వస్తే ఏం చేయాలి?
12 బైబిల్ని నిజంగా దేవుడే రాయించాడా అనే అనుమానం మనకు వస్తే ఏం చేయాలి? దాని గురించి ప్రార్థించాలి, ప్రార్థనకు తగ్గట్టు పనులు కూడా చేయాలి. యెహోవాసాక్షుల కుటుంబంలో పెరిగిన జార్డన్ అనే అబ్బాయి ఇలా అంటున్నాడు: “నేను ఏది పడితే అది గుడ్డిగా నమ్మను, అది నిజమని ఆధారాలు ఉంటేనే నాకు నమ్మకం కుదురుతుంది. చెప్పాలంటే, ఇప్పటికీ నాకు అనుమానాలు వస్తూ ఉంటాయి. కానీ అలా వచ్చినప్పుడల్లా, వాటిని తీర్చుకోవడానికి లేదా నా ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి మన ప్రచురణల్లో పరిశోధన చేస్తాను.” మనం కూడా యెహోవాయే బైబిల్ని రాయించాడు అనే నమ్మకాన్ని పెంచుకుంటూ ఉంటే, మన విశ్వాసానికి ఉన్న పునాదిని బలపర్చుకుంటూ ఉంటాం.—1 కొరిం. 3:12, 13.
యెహోవాయే సంస్థను నడిపిస్తున్నాడు
13. యెహోవాసాక్షుల్ని నిజంగా దేవుడే నడిపిస్తున్నాడా అనే సందేహం వస్తే ఏం చేయాలి?
13 యెహోవాసాక్షుల్ని నిజంగా దేవుడే నడిపిస్తున్నాడా అనే సందేహం మీకు వస్తే, వెంటనే దాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నించండి. ఏమాత్రం ఆలస్యం చేయకండి. మీరు ఈ ప్రశ్నలు వేసుకోవచ్చు: ‘బైబిలు ప్రమాణాలకు తగ్గట్టు జీవించడానికి చేయగలిగినదంతా చేస్తున్నది ఎవరు? నమ్మకాల విషయంలో బైబిలు మీద ఆధారపడుతున్న సంస్థ ఏది?’ (2 తిమో. 4:3, 4) ‘మన కాలంలో యెహోవా ఇష్టాన్ని చేస్తున్నది ఎవరు?’—మత్త. 7:20, 21.
14. మత్తయి 24:14 లో ఉన్న మాటల్ని యెహోవాసాక్షులు ఎలా నిజం చేస్తున్నారు?
14 దేవుని ఇష్టాన్ని చేయడం అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ప్రకటనా పని. ఒకసారి ఆలోచించండి: యేసు ముందే చెప్పినట్టు, ఈ చివరి రోజుల్లో ప్రకటనా పని చేస్తున్నది ఎవరు? (మత్త. 24:14) కేవలం యెహోవాసాక్షులే! ప్రకటనా పని చేయడానికి దేవుడు మనల్నే ఉపయోగించుకుంటున్నాడు. 240 కన్నా ఎక్కువ ప్రాంతాల్లో దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటిస్తున్నది మనం మాత్రమే. క్రీస్తు నాయకత్వంలో 100 కన్నా ఎక్కువ సంవత్సరాలుగా, మనం ప్రకటించే-బోధించే పనిని చేస్తూ వస్తున్నాం. మనకు దానికన్నా ముఖ్యమైన పని ఇంకోటి లేదు.—మత్త. 28:19, 20.
15. దేవుని పేరు పవిత్రపర్చడానికి యెహోవాసాక్షులు ఏం చేశారు? (మత్తయి 6:9; యెషయా 43:10)
15 మత్తయి 6:9; యెషయా 43:10 చదవండి. స్వయంగా యెహోవా పేరే మనకు గుర్తింపు. యెహోవాసాక్షులు అనే పేరు పెట్టుకున్నందుకు మనం ఎంతో గర్వపడుతున్నాం. ప్రపంచంలో చాలామందికి అసలు ఆ పేరే తెలియదు. కానీ మనం బైబిల్లో యెహోవా పేరు ఎక్కడెక్కడ ఉండాలో దాన్ని అక్కడక్కడ తిరిగి చేర్చడానికి ఎంతో కృషిచేశాం. అందుకే పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదంలో ఆయన పేరు 7,000 కన్నా ఎక్కువసార్లు కనిపిస్తుంది.
16. యోహాను 13:34, 35 లో ఉన్న ఆజ్ఞను యెహోవాసాక్షులు పాటిస్తున్నారని ఎలా చెప్పవచ్చు? (చిత్రం కూడా చూడండి.)
16 యోహాను 13:34, 35 చదవండి. ప్రపంచం విడిపోయి ముక్కలు-ముక్కలు అవుతుంటే, మన ప్రపంచవ్యాప్త కుటుంబం మాత్రం ఐక్యత-శాంతికి మారుపేరుగా ఉంది. ఈ కాలంలో నిజంగా అదొక అద్భుతం! మన బ్రదర్స్-సిస్టర్స్ ఉండే దేశాలు వేరు, పెరిగిన విధానం వేరు. అయినా ప్రేమ కురిపించడానికి, శాంతిగా ఉండడానికి వాళ్లు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. మీరు వేరే ఊరు వెళ్లినప్పుడు, అక్కడ ఉన్న సంఘానికి వెళ్లారా? మీరు ఖచ్చితంగా, బ్రదర్స్-సిస్టర్స్ మధ్య ఉన్న ప్రేమ-ఐక్యతల్ని రుచిచూసే ఉంటారు. దానిగురించి ఆలోచిస్తే, యెహోవా తన ఇష్టాన్ని చేయడానికి యెహోవాసాక్షుల్ని ఉపయోగించుకుంటున్నాడు అనే విషయం మీ మనసులో ముద్ర పడిపోతుంది. దాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటే, మన విశ్వాసానికి ఎలాంటి పరీక్షలు వచ్చినా యెహోవాకు నమ్మకంగా ఉంటాం.
మన ప్రపంచవ్యాప్త కుటుంబం ఐక్యత-శాంతికి మారుపేరుగా ఉండడం ఒక గొప్ప అద్భుతం (16వ పేరా చూడండి)a
యెహోవాను ఎప్పుడూ విడిచిపెట్టకండి
17-18. మనకు ఎలాంటి సమస్యలు రావచ్చు? కానీ మనం మాత్రం ఏమని అంటాం?
17 మనం ప్రమాదకరమైన, కష్టమైన కాలాల్లో జీవిస్తున్నాం, కాబట్టి ఈ చివరి రోజుల్లో నెట్టుకురావడం మనందరికీ పెద్ద సవాలే. (2 తిమోతి 3:1, 13) ముందుముందు, మనకు వేరే సమస్యలు కూడా రావచ్చు. దేవుని సంస్థ తీసుకునే నిర్ణయాలు మనకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు. మన బ్రదర్ గానీ, సిస్టర్ గానీ మనల్ని బాధపెట్టవచ్చు లేదా తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఏంటో, వాటినుండి ఎలా బయటపడాలో కూడా మనకు తెలియకపోవచ్చు.
18 ఈ పరిస్థితులు మనల్ని చాలా తికమక పెడతాయి. కానీ మనం యెహోవాయే సృష్టికర్త అని, బైబిల్ని రాయించింది ఆయనే అని, యెహోవాసాక్షులే ఆయన ప్రజలు అని గట్టిగా నమ్మితే ఆయనకు ఎప్పుడూ విశ్వసనీయంగా ఉంటాం. అప్పుడు పేతురు యేసుతో చెప్పినట్టే, మనం కూడా యెహోవాతో ఇలా అంటాం: “మేము ఎవరి దగ్గరికి వెళ్లాలి? శాశ్వత జీవితాన్నిచ్చే మాటలు నీ దగ్గరే ఉన్నాయి.”
పాట 123 దైవపరిపాలనా పద్ధతికి నమ్మకంగా లోబడదాం
a చిత్రాల వివరణ: ఒక తల్లి, ఆమె పాప బస్సులో వేరే ఊరికి ప్రయాణిస్తూ, దారిలో పరిచర్య చేస్తున్న ఒక జంటను చూసి సంతోషిస్తున్నారు.