కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w26 మే పేజీలు 26-31
  • ఇతరుల నిర్ణయాల్ని గౌరవించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇతరుల నిర్ణయాల్ని గౌరవించండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎలాంటి వ్యక్తిగత నిర్ణయాల్ని మనం తప్పుబట్టే అవకాశం ఉంది?
  • ఇతరుల వ్యక్తిగత నిర్ణయాల్ని ఎందుకు గౌరవించాలి?
  • ఇతరుల నిర్ణయాల్ని ఎలా గౌరవించాలి?
  • మంచి నిర్ణయాలు తీసుకోండి, యెహోవాను సంతోషపెట్టండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • యెహోవా మీద ఆధారపడుతున్నామని చూపించే నిర్ణయాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • విశ్వాసం చూపిస్తూ తెలివైన నిర్ణయాలు తీసుకోండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • దేవుణ్ణి ఘనపర్చే నిర్ణయాలు తీసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
w26 మే పేజీలు 26-31

ఆగస్టు 3-9, 2026

పాట 113 మనకు అనుగ్రహించబడిన శాంతి

ఇతరుల నిర్ణయాల్ని గౌరవించండి

‘వ్యక్తిగత అభిప్రాయాల్ని బట్టి తీర్పు తీర్చకండి.’—రోమా. 14:1.

ముఖ్యాంశం

మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ తీసుకున్న నిర్ణయాలు మనకు నచ్చకపోయినా వాటిని ఎలా గౌరవించవచ్చో తెలుసుకుంటాం.

1-2. బ్రదర్స్‌-సిస్టర్స్‌ తీసుకున్న నిర్ణయాలు, మన నిర్ణయాలు ఎందుకు వేరుగా ఉంటాయి?

మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఎవరైనా కారణం లేకుండా తప్పుబట్టారా? లేదా ఒక బ్రదర్‌ గానీ, సిస్టర్‌ గానీ తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎప్పుడైనా తప్పుబట్టారా? మనలో చాలామంది ఈ రెండు ప్రశ్నలకు “అవును” అనే జవాబిస్తారు.

2 సంఘంలో బ్రదర్స్‌-సిస్టర్స్‌ తీసుకున్న నిర్ణయాలు, మన నిర్ణయాలు కొన్నిసార్లు వేరుగా ఉంటాయి. దానికి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనలో ప్రతీ ఒక్కరం ఒక్కోలా ఉంటాం, ఒక్కోలా ఆలోచిస్తాం. మనం పెరిగిన విధానం, సంస్కృతి, జీవితంలో చూసినవాటిని బట్టి మన ఆలోచన విధానం ఉంటుంది. దానివల్ల మన అభిప్రాయాలు వేరు-వేరుగా ఉండొచ్చు. అయినా, మనం సంఘంలో ఉన్న ఐక్యత-శాంతి పాడవ్వకుండా చూసుకోవాలి.—ఎఫె. 4:3.

3. ఒక బ్రదర్‌ గానీ, సిస్టర్‌ గానీ తీసుకున్న నిర్ణయం మనకు నచ్చకపోతే ఏం చేయాలనిపిస్తుంది?

3 ఒక బ్రదర్‌ గానీ, సిస్టర్‌ గానీ మనకు నచ్చని నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ల నిర్ణయాన్ని మార్చుకునేలా ఒప్పించాలని అనిపిస్తుంది, లేదా వాళ్లు మంచి నిర్ణయం తీసుకోలేదని నలుగురికి చెప్పాలనిపిస్తుంది. నిజమే మన ఉద్దేశాలు మంచివే, మనం బ్రదర్స్‌-సిస్టర్స్‌ని ప్రేమిస్తాం, వాళ్ల మంచిని కోరుకుంటాం. (సామె. 17:17) కాబట్టి వాళ్లు తీసుకున్న నిర్ణయం వల్ల తర్వాత బాధపడకూడదని లేదా యెహోవాకు దూరం అయిపోకూడదని మనం కోరుకుంటాం.

4-5. బ్రదర్స్‌-సిస్టర్స్‌ తీసుకున్న నిర్ణయాలు మనకు నచ్చకపోతే ఏం చేయాలి?

4 ఒక బ్రదర్‌a మనకు నచ్చని నిర్ణయం తీసుకుంటే, మనం వెళ్లి ఆయనతో మాట్లాడాలా? కొన్నిసార్లు మాట్లాడాలి, కొన్నిసార్లు మాట్లాడకూడదు. ఉదాహరణకు, ఆయన దేవునికి ఇష్టంలేని పని చేస్తున్నాడని తెలిస్తే, ఆయన ఆలోచనను మార్చుకునేలా ప్రేమతో సహాయం చేస్తాం. (సామె. 27:5, 6) అయితే, ఆయన బైబిలుకు విరుద్ధమైన పని ఏం చేయట్లేదు కానీ, ఆయన తీసుకున్న నిర్ణయం మనకు ఎందుకో నచ్చలేదు. అప్పుడేంటి? ఈ ఆర్టికల్‌ ముఖ్య లేఖనం దానికి జవాబు ఇస్తుంది: ‘వ్యక్తిగత అభిప్రాయాల్ని బట్టి తీర్పు తీర్చకండి.’—రోమా. 14:1.

5 అయినాసరే, ఆయన తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించడం మనకు కష్టంగా అనిపిస్తుందా? అయితే ఈ ఆర్టికల్‌లో, ఇతరుల నిర్ణయాల్ని ఎందుకు గౌరవించాలో, ఎలా గౌరవించాలో చూస్తాం. ముందు, ఇతరుల నిర్ణయాల్ని మనం తప్పుబట్టే అవకాశం ఉన్న కొన్ని సందర్భాలు ఏంటో చూద్దాం.

ఎలాంటి వ్యక్తిగత నిర్ణయాల్ని మనం తప్పుబట్టే అవకాశం ఉంది?

6-7. ఇతరుల నిర్ణయాల్ని తప్పుబట్టే అవకాశం ఉన్న కొన్ని సందర్భాల గురించి చెప్పండి.

6 మనం పెరిగిన విధానం బట్టి, జీవితంలో చూసినవాటిని బట్టి మన ఆలోచనా విధానం ఉంటుందని ఇంతకుముందే చూశాం. కాబట్టి కొన్ని విషయాల్లో ఫలానా నిర్ణయమే కరెక్ట్‌ అని మనకు గట్టిగా అనిపించవచ్చు. ఇతరులు కూడా మనలాగే ఆలోచిస్తారని మనం అనుకోవచ్చు, కానీ అన్నిసార్లు అలా జరగదు. అలాంటి కొన్ని సందర్భాల్ని ఇప్పుడు చూద్దాం. సందర్భం 1: ఒక బ్రదర్‌ చిన్నప్పటి నుండి వాళ్ల నాన్న బాగా తాగడాన్ని చూశాడు. తర్వాత ఆయన సత్యం తెలుసుకున్నాడు. ఇప్పుడు ఆ బ్రదర్‌ని ఒకరు భోజనానికి పిలిచారు. అక్కడ కొంతమంది బ్రదర్స్‌-సిస్టర్స్‌ మందు తాగడాన్ని ఆయన చూశాడు. అది నచ్చక, వాళ్లు చేస్తుంది తప్పు అని వాళ్లతో చెప్పాడు. సందర్భం 2: ఒక సిస్టర్‌కి పెద్ద జబ్బు చేసింది, అయితే ఆమె దాని నుండి తర్వాత బయటపడింది. కొన్నాళ్లకు, సంఘంలో ఉన్న ఇంకో సిస్టర్‌కి కూడా అదే జబ్బు చేసిందని తెలిసింది. అయితే, ఆ సిస్టర్‌కి సహాయం చేయాలనే ఉద్దేశంతో తను తీసుకున్న వైద్యాన్నే తీసుకోమని ఆమె బలవంతం చేసింది. అంటే తనలాగే ఆహారం తీసుకోమని, మందులు వేసుకోమని ఒత్తిడి చేసింది. సందర్భం 3: ఒక బ్రదర్‌ ఇంతకుముందు చర్చికి వెళ్లేవాడు. కానీ సత్యం తెలుసుకున్నాక దాంతో పూర్తిగా తెగతెంపులు చేసుకొని, మళ్లీ దాని జోలికి వెళ్లకూడదని అనుకున్నాడు. అయితే సంఘంలోని ఇంకో బ్రదర్‌, చర్చిలో జరిగే అంత్యక్రియలకు వెళ్లాడని తెలిసింది. అది ఆయనకు అస్సలు నచ్చలేదు.b

7 సందర్భం 4: ఒక బ్రదర్‌ చాలా కాలంగా సత్యంలో ఉన్నాడు. అప్పట్లో బ్రదర్స్‌ గడ్డం పెంచుకోకూడదని, సిస్టర్స్‌ ప్యాంట్స్‌ లాంటివి వేసుకోకూడదని నిర్దేశం ఉండేది. ఈ విషయంలో మార్పు వచ్చినా, ఆ బ్రదర్‌ మాత్రం పాత నిర్దేశాన్నే పాటించాలని పట్టుబడుతున్నాడు. సందర్భం 5: ఒక సంఘపెద్దకు తన సంఘంలో ఉన్న ఒక టీనేజ్‌ బ్రదర్‌ అదనంగా చదవాలని అనుకుంటున్నాడని తెలిసింది. ఆయనకు అదనంగా చదివి సత్యానికి దూరమైపోయిన ఇంకో బ్రదర్‌ గురించి తెలుసు. ఈ అబ్బాయి కూడా అలాగే అవుతాడేమో అని భయపడి ఆ సంఘపెద్ద అతనితో, అతని తల్లిదండ్రులతో మాట్లాడి, వాళ్ల మనసు మార్చడానికి ప్రయత్నిస్తాడు.

8. (ఎ) వేరే తల్లిదండ్రుల్ని ఎప్పుడు తప్పుబట్టాలి అనిపిస్తుంది? (బి) ఇతరుల్ని అలా తప్పుబడుతూ ఉంటే సంఘంలో ఏం జరగవచ్చు?

8 తల్లిదండ్రులకు సాధారణంగా ఎదురయ్యే ఒక సందర్భం చూద్దాం. సందర్భం 6: మీరు మీ పిల్లల్ని “యెహోవా నిర్దేశాల ప్రకారం క్రమశిక్షణను, ఉపదేశాన్ని ఇస్తూ” పెంచడానికి కష్టపడుతున్నారు. (ఎఫె. 6:4) దానికోసం మీరు కొన్ని రూల్స్‌ కూడా పెట్టి ఉంటారు. కానీ వేరే తల్లిదండ్రులు అలా చేయడం లేదు. ఉదాహరణకు పిల్లలు ఇంటికి కాస్త లేటుగా వచ్చినా ఏమీ అనకపోవడం, చిన్నప్పుడే ఫోన్‌ ఇవ్వడం లాంటివి చేయవచ్చు. అది చూసి, మీరు చాలా కఠినంగా ఉన్నారని మీ పిల్లలకు అనిపించవచ్చు. “మీరు వాళ్లలా ఉండొచ్చు కదా?” అని మీతో అనొచ్చు. అప్పుడు, మీరు ఆ తల్లిదండ్రుల్లో ఉన్న తప్పులు వెతకడం మొదలుపెట్టవచ్చు. నిజమే, ఇతరులు మనలాంటి నిర్ణయాలు తీసుకోనప్పుడు మనకు కొన్నిసార్లు కోపం వస్తుంది లేదా మనం వాళ్ల నిర్ణయాల్ని ప్రశ్నించడం మొదలుపెడతాం. అంటే, వాళ్లు వేటికి ఎంత ఖర్చుపెడుతున్నారు, ఎన్నిసార్లు ట్రిప్‌లకు వెళ్తున్నారు, ఎలాంటి వినోదం ఎంచుకుంటున్నారు అని ప్రతీదానిలో తప్పులు వెతుకుతాం. కానీ, మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి: మనకు ఎలా అనిపిస్తుంది అనే దానికన్నా సంఘంలో బ్రదర్స్‌-సిస్టర్స్‌ మధ్య ఉన్న ఐక్యతే మనకు ముఖ్యం.

9. మనందరి లక్ష్యం ఏంటి, మనం ఏం చేయకుండా జాగ్రత్తపడాలి? (చిత్రం కూడా చూడండి.)

9 మనం తీసుకున్న నిర్ణయాలు, బ్రదర్స్‌-సిస్టర్స్‌ తీసుకున్న నిర్ణయాలు వేరు-వేరుగా ఉండొచ్చు. అంతమాత్రాన ఒకరి నిర్ణయం సరైందని, ఇంకొకరిది తప్పని చెప్పలేం. (రోమా. 14:5) నిజమే, యెహోవా ప్రమాణాల విషయంలో, మనందరం ‘ఒకేలా ఆలోచించాలని’ బైబిలు చెప్తుంది. కానీ, దానర్థం వ్యక్తిగత విషయాల్లో కూడా మనందరం ఒకేలా ఆలోచించాలని కాదు. (2 కొరిం. 13:11) ఒక ఉదాహరణ చూద్దాం. మీరు ఫలానా చోటుకు వెళ్లాలని అనుకుంటున్నారు. అక్కడికి వెళ్లడానికి వేరు-వేరు దారులు ఉన్నాయి. అందులో మీకు నచ్చిన దారినే, మీకు అనుకూలమైన దారినే మీరు ఎంచుకుంటారు. అదేవిధంగా, వ్యక్తిగత విషయాల్లో క్రైస్తవులకు వేరు-వేరు ఇష్టాలు ఉండొచ్చు. కానీ మనందరి లక్ష్యం మాత్రం ఒక్కటే, అది యెహోవాను సంతోషపెట్టడం. కాబట్టి, ఇతరుల వ్యక్తిగత నిర్ణయాల్ని మనం తప్పుబట్టకూడదు.—మత్త. 7:1; 1 థెస్స. 4:11.

ఫోన్లో ఉన్న జిపిఎస్‌ (GPS) యాప్‌ మన గమ్యాన్ని చేరుకోవడానికి ఏయే దారులు ఉన్నాయో, ఏయే వాహనాల్లో వెళ్లవచ్చో చూపిస్తుంది.

ఒక చోటుకు వెళ్లడానికి ఒకొక్కరు ఒక్కో దారిని ఎంచుకోవచ్చు, అదేవిధంగా వ్యక్తిగత విషయాల్లో క్రైస్తవులు వేరు-వేరు నిర్ణయాలు తీసుకోవచ్చు (9వ పేరా చూడండి)


ఇతరుల వ్యక్తిగత నిర్ణయాల్ని ఎందుకు గౌరవించాలి?

10. యాకోబు 4:12 ప్రకారం మనకు ఏ హక్కు లేదు, ఎందుకు?

10 ఇతరులు తీసుకునే వ్యక్తిగత నిర్ణయాల్ని మనం ఎందుకు గౌరవించాలో చెప్పే కారణాలు బైబిల్లో చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని ఏంటో చూద్దాం. వ్యక్తిగత విషయాల్లో ఇతరులకు తీర్పుతీర్చే అధికారం మనకు లేదు. (యాకోబు 4:12 చదవండి.) యెహోవాకు మాత్రమే నియమాలు ఇచ్చే, తీర్పుతీర్చే అధికారం ఉంది. తప్పొప్పుల విషయంలో నియమాలు పెట్టే హక్కు కూడా ఆయనకు మాత్రమే ఉంది. కాబట్టి బ్రదర్స్‌-సిస్టర్స్‌ లెక్క అప్పజెప్పాల్సింది యెహోవాకే గానీ, మనకు కాదు. (రోమా. 14:10) మన సొంత అభిప్రాయాలు, ఇష్టాయిష్టాల ఆధారంగా ఇతరుల నిర్ణయాల్ని తప్పుబట్టే హక్కు మనకు అస్సలు లేదు.c

11. సంఘంలో అందరూ ఐక్యంగా ఉండేలా మనమేం చేయవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

11 యెహోవా తన సేవకులందరూ ఒకటిగా ఉండాలని అనుకుంటున్నాడు గానీ, ఒకేలా ఉండాలనుకోవడం లేదు. చెప్పాలంటే, మనందరం వేరు-వేరుగా ఉంటేనే దేవునికి ఇష్టం! అది ఆయన చేసిన సృష్టిలో కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు, ఒక చెట్టుకున్న ఏ రెండు ఆకులూ ఒకేలా ఉండవు. అలాగే మనుషుల గురించి ఆలోచించండి, ప్రస్తుతం భూమ్మీద 800 కోట్ల కన్నా ఎక్కువమంది ఉన్నారు. కానీ ఏ ఇద్దరూ ఒకేలా ఉండరు, వాళ్ల వ్యక్తిత్వాలు కూడా ఒకేలా ఉండవు. ఏదోక చిన్న తేడా ఉంటుంది. యెహోవా దేవుడు మనల్ని వేరు-వేరుగా సృష్టించాడు. మనందరం జిరాక్స్‌ కాపీల్లా ఉండాలని ఆయన కోరుకోవట్లేదు కానీ, ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి, మన మధ్య ఉన్న తేడాలు మనల్ని కలపాలే గానీ, విడదీయకూడదు; శాంతిని ఇంకా పెంచడానికి మనం ప్రయత్నించాలి. అప్పుడు మన సొంత అభిప్రాయాలు, ఇష్టాయిష్టాల కన్నా సంఘంలో ఉన్న ఐక్యతే ముఖ్యమని చూపిస్తాం.—రోమా. 14:19.

మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ కలిసి భోజనం చేస్తున్నారు, అందులో రకరకాల జాతుల వాళ్లు, వయసుల వాళ్లు ఉన్నారు. కొందరు మందు తాగుతున్నారు, కొందరు తాగట్లేదు. అలాగే కొంతమందికి గడ్డాలు ఉన్నాయి, కొంతమందికి లేవు.

యెహోవా మనల్ని సృష్టించినప్పుడు, మనందరం ఒకటిగా ఉండాలని కోరుకున్నాడే గానీ ఒకేలా ఉండాలని కాదు (11వ పేరా చూడండి)


ఇతరుల నిర్ణయాల్ని ఎలా గౌరవించాలి?

12-13. ఎవరైనా “తప్పటడుగు” వేస్తున్నారు అని మీకు అనిపిస్తే, మీరు ఏ విషయాల్ని మనసులో ఉంచుకోవాలి? (గలతీయులు 6:1; “ఇతరుల నిర్ణయాలు నచ్చకపోతే?” బాక్సు కూడా చూడండి)

12 ఇతరుల వ్యక్తిగత నిర్ణయాల్ని ఎలా గౌరవించాలి? ‘ఫలానా బ్రదర్‌ “తప్పటడుగు” వేస్తున్నాడా లేదా కేవలం వేరే దారిలో అడుగు వేస్తున్నాడా?’ అని ఆలోచించుకోండి. ఆయన తప్పటడుగు వేస్తుంటే, అంటే బైబిలుకు విరుద్ధమైన ఏదైనా పని చేస్తుంటే ఇలా ప్రశ్నించుకోండి: ‘దానిగురించి ఆయనతో మాట్లాడేంత పరిణతి నాకు ఉందా? లేదంటే ఒక సంఘపెద్ద గానీ, ఇంకెవరైనా గానీ మాట్లాడితే బాగుంటుందా?’ మీరే సహాయం చేయాలనుకుంటే, సౌమ్యంగా ఆయన్ని సరైన దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నించండి. (గలతీయులు 6:1 చదవండి.) అయితే చాలా సందర్భాల్లో, ఎదుటివ్యక్తి తప్పటడుగు వేయకపోవచ్చు కానీ, కేవలం వేరే దారిలో అడుగు వేస్తూ ఉండవచ్చు. అదే నిజమైతే, ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించకండి, దాని గురించి నలుగురితో తప్పుగా మాట్లాడకండి. సొంతగా నిర్ణయించుకునే హక్కు ఆయనకు ఉంది కాబట్టి దాన్ని గౌరవించండి, ఆయన్ని తప్పుబట్టకండి.—రోమా. 14:2-4.

13 ఈ ఉదాహరణ గురించి ఆలోచించండి: మీ ఫ్రెండ్‌తో కలిసి మీరు హోటల్‌కి వెళ్లారు. మీరిద్దరూ ఎవరికి నచ్చినవి వాళ్లు తింటారు కదా! అలా కాకుండా మీరు గానీ, మీ ఫ్రెండ్‌ గానీ ‘నాకు నచ్చినవే నువ్వు కూడా తినాలి’ అని బలవంతపెడితే ఎలా ఉంటుంది? బాగోదు కదా! ఎవరికి నచ్చినవి వాళ్లు తినే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుంది. వ్యక్తిగత నిర్ణయాల విషయంలో కూడా అంతే. ఇతరుల మీద గౌరవం ఉంటే మన అభిప్రాయాల్ని వాళ్ల మీద రుద్దము.

ఇతరుల నిర్ణయాలు నచ్చకపోతే?

ఒక బ్రదర్‌గానీ, సిస్టర్‌గానీ తీసుకున్న నిర్ణయం నచ్చకపోతే, అనవసరమైన ఆలోచనలతో మీ మనసు పాడుచేసుకోకుండా ఉండడానికి ఈ ప్రశ్నలు వేసుకోండి.—గల. 6:5.

  • ఆయన బైబిలుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకుంటున్నాడా?

  • బహుశా ఆయన పెరిగిన విధానాన్ని బట్టి అలాంటి నిర్ణయం తీసుకున్నాడా?

  • ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల నిజంగానే నష్టం జరుగుతుందా లేదా నేనే ఎక్కువగా ఊహించుకుంటున్నానా?

  • ఆయన నిర్ణయం వల్ల ఏ మంచి ఫలితాలు రావచ్చు?

  • ఆయన “తప్పటడుగు” వేస్తున్నాడా? కేవలం వేరే దారిలో అడుగు వేస్తున్నాడా?

  • ఆయన తప్పటడుగు వేస్తుంటే, ఆయనతో మాట్లాడేంత పరిణతి నాకు ఉందా?

14. వ్యక్తిగత విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంఘమంతా ఐక్యంగా ఉండడానికి మీరేం చేయవచ్చు? (1 కొరింథీయులు 8:12, 13)

14 మనం వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల్ని ఎలా గౌరవించాలి? ఇతరుల్ని నొప్పించకుండా, వాళ్లకు కోపం తెప్పించకుండా మనం చేయగలిగినదంతా చేస్తే, సంఘమంతా ఐక్యంగా ఉండడానికి సహాయం చేసినవాళ్లమౌతాం. (1 కొరింథీయులు 8:12, 13 చదవండి.) కొన్నిసార్లు మీరు తీసుకున్న నిర్ణయాలు న్యాయమైనవి, “సరైనవి” అయ్యుండొచ్చు. కానీ అవి మీ సహోదరుడిని నొప్పిస్తే, నిజంగా ‘ప్రయోజనకరంగా’ ఉంటుందా?d (1 కొరిం. 10:23, 24) ‘నాకు నచ్చింది చేసే హక్కు నాకు ఉంది’ అని పట్టుబట్టే బదులు, మీ ఇష్టాయిష్టాల్ని పక్కన పెట్టగలరేమో ఆలోచించండి. (రోమా. 15:1) వ్యక్తిగత విషయాల్లో ఎవరి నిర్ణయాలు వాళ్లవే అని, వాటిని గౌరవించాలని మనం ఇంతకుముందే చూశాం కదా. నిజమే, మనం ఇతరుల నిర్ణయాల్ని గౌరవించినట్టే ఇతరులు కూడా మన నిర్ణయాల్ని గౌరవించాలి. కానీ, రోమీయులు 12:18 లో బైబిలు ఇచ్చే సలహాను కూడా పాటించాలి. అక్కడ ఇలా ఉంది: “మీకు చేతనైనంత వరకు మనుషులందరితో శాంతిగా మెలగండి.” కాబట్టి ఇతరులతో శాంతిగా ఉండడానికి, వాళ్లను అనవసరంగా నొప్పించకుండా ఉండడానికి మనం చేయగలిగినదంతా చేయాలి.

15. సంఘం ఐక్యంగా ఉండడానికి సంఘపెద్దలు ఎలా సహాయం చేస్తారు? (1 కొరింథీయులు 4:6)

15 ఇతరులు తీసుకున్న నిర్ణయాల్ని సంఘపెద్దలు ఎలా గౌరవిస్తారు? సంఘపెద్దలు వ్యక్తిగత విషయాల్లో లేనిపోని రూల్స్‌ పెట్టకుండా, “లేఖనాల్లో రాసివున్న వాటిని మీరకుండా” ఉండడం ద్వారా సంఘంలోని ఐక్యతను పెంచుతారు. (1 కొరింథీయులు 4:6 చదవండి.) అంతేకాదు, వాళ్లు మన ప్రచురణల్లో ఉన్న వాటి ప్రకారంగానే సలహా ఇస్తారు, దానికి విరుద్ధంగా ఏమీ చెప్పరు. ఒక బ్రదర్‌ గానీ, సిస్టర్‌ గానీ సహాయం కోసం సంఘపెద్దల దగ్గరకు వస్తే, బైబిలు ఆధారంగానే సలహా ఇస్తారు గానీ, వాళ్ల సొంత అనుభవాన్ని బట్టి కాదు.—యెష. 48:17, 18.

16. పెద్దలసభ తీసుకున్న నిర్ణయాల్ని ప్రతీ సంఘపెద్ద ఎలా గౌరవించవచ్చు?

16 పెద్దలసభ కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయాల్ని కూడా ప్రతీ సంఘపెద్ద గౌరవిస్తాడు. పెద్దలసభ నిర్ణయం తీసుకునే ముందు పవిత్రశక్తి కోసం ప్రార్థిస్తుంది, లేఖనాల్లో ఉన్న నిర్దేశాల్ని పరిశీలిస్తుంది, దానికి తగ్గట్టు ఒక నిర్ణయానికి వస్తుంది. అయితే ఒక సంఘపెద్దకు ఆ నిర్ణయం నచ్చకపోయినా, ఎక్కువమంది దానికే మద్దతిచ్చారు కాబట్టి ఆయన కూడా దానికి మద్దతివ్వాలి. (ఎఫె. 5:17) అలాగే సంఘపెద్దలు బైబిల్లో, మన ప్రచురణల్లో ఉన్న నిర్దేశాల్ని పాటించడానికే ప్రయత్నిస్తారు. అంతేగానీ వాళ్ల అభిప్రాయాన్ని నెగ్గించుకోవడానికి, ఆ నిర్దేశాల్ని వాళ్లకు అనుకూలంగా మార్చి చెప్పరు. ఉదాహరణకు, ఒక సంఘపెద్ద తన మాటే సరైనది అని నిరూపించుకోవడానికి, ప్రచురణల్లో ఉన్న సందర్భాన్ని పట్టించుకోకుండా, అందులోని ఒక్కమాటను పట్టుకొని వేలాడడు.

17. ఇతరుల నిర్ణయాల్ని గౌరవించినప్పుడు మన సంఘం ఎలా ఉంటుంది?

17 మనందరం ఒక్కోలా ఉంటాం; ప్రతీ ఒక్కరికి వేర్వేరు అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు ఉంటాయి. అదే సంఘానికి అందం! సంఘంలో రకరకాల మనుషులు, రకరకాల ప్రాంతాలవాళ్లు కలిసి ఉంటారు. అది చూసినప్పుడు, కొత్తవాళ్లకు కూడా మనలో ఒకరు అవ్వాలని అనిపిస్తుంది. కాబట్టి మన మధ్యున్న తేడాలు మనల్ని విడదీయకుండా చూసుకుందాం, శాంతిని పెంచుకుందాం. ఇతరుల్ని నొప్పించకుండా, కోపం తెప్పించకుండా జాగ్రత్తపడదాం. వ్యక్తిగత విషయాల్లో ఇతరుల నిర్ణయాల్ని గౌరవిద్దాం. అలా చేసినప్పుడు మన కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతాం. అప్పుడు సంఘం సంతోషంగా, ఐక్యంగా, కుటుంబంలా ఉంటుంది!—కీర్త. 133:1; మత్త. 5:9.

ఇతరుల నిర్ణయాల్ని, అభిప్రాయాల్ని గౌరవించడానికి ఈ లేఖనాలు మనకెలా సహాయం చేస్తాయి?

  • యాకోబు 4:12

  • గలతీయులు 6:1

  • 1 కొరింథీయులు 4:6; 8:12, 13

పాట 89 వినండి, లోబడండి, దీవెనలు పొందండి

a ఈ సమాచారం సిస్టర్స్‌కు కూడా వర్తిస్తుంది.

b చర్చీల్లో లేదా వేరే ఆరాధనా స్థలాల్లో జరిగే అంత్యక్రియలకు గానీ, పెళ్లికి గానీ ఒక క్రైస్తవుడు వెళ్లాలా వద్దా అని నిర్ణయించుకునే ముందు చాలా విషయాల గురించి ఆలోచించాలి. కావలికోట, మే 15, 2002 లో వచ్చిన “పాఠకుల ప్రశ్నలు” అనే ఆర్టికల్‌ చూడండి.

c బైబిలు నియమాల్ని మీరినవాళ్లకు సంఘపెద్దలు తీర్పు తీర్చాల్సి రావచ్చు. అయితే వాళ్లు ఆ పనిని యెహోవా తరఫున చేస్తున్నారు కాబట్టి తమ సొంత ప్రమాణాల ప్రకారం కాకుండా, ఆయన ఇచ్చిన నీతి ప్రమాణాల ప్రకారమే తీర్పు తీర్చాలని గుర్తుపెట్టుకోవాలి.—2 దినవృత్తాంతాలు 19:6 పోల్చండి.

d ఉదాహరణల కోసం, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! అనే పుస్తకంలో, 35వ పాఠంలోని 5వ పాయింట్‌ చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి