జూన్ 29-జూలై 5, 2026
పాట 131 “దేవుడు ఒకటి చేసినవాళ్లు”
భార్యాభర్తలారా, బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉండండి
“సహోదరుడి కన్నా ఎక్కువగా ప్రేమించే స్నేహితుడు కూడా ఉన్నాడు.”—సామె. 18:24.
ముఖ్యాంశం
భార్యాభర్తలు మంచి నేస్తాలుగా ఉన్నప్పుడు, ఇద్దరూ యెహోవాను ప్రేమించినప్పుడు వాళ్ల బంధం బలంగా ఉంటుందని చూస్తాం.
1. మంచి స్నేహితులు యెహోవా ఇచ్చే బహుమతులు అని ఎందుకు చెప్పవచ్చు?
మంచి స్నేహితులు యెహోవా ఇచ్చే బహుమతులు. (యాకో. 1:17) వాళ్లకు యెహోవా అన్నా, మనం అన్నా చాలా ప్రేమ. వాళ్లు మనకు సంతోషంలో తోడుంటారు, కృంగిపోయినప్పుడు భుజం తడతారు, అవసరమైనప్పుడు నిజాయితీగా సలహాలు ఇస్తారు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా వాళ్లు మనకు వెన్నుపోటు పొడవరు, కాబట్టి మనం వాళ్లను నమ్మవచ్చు. అలాంటి స్నేహితులు నిజంగా మన ‘హృదయాన్ని సంతోషపెడతారు’!—సామె. 27:9.
2. దంపతులు తమ మధ్య ఉన్న స్నేహాన్ని ఎందుకు పెంచుకుంటూ ఉండాలి? (మత్తయి 19:6)
2 భర్త భార్యకు, భార్య భర్తకు బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉండాలి. వాళ్లు తమ స్నేహాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. బదులుగా దాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఒకవేళ వాళ్లు దాన్ని పట్టించుకోకపోతే వాళ్లకు ఒంటరిగా, చిరాకుగా, కోపంగా అనిపించవచ్చు. ఒకవేళ వాళ్లు తమ స్నేహానికి నీళ్లు పోస్తూ ఉంటే, ఈ ప్రపంచంలో ఉన్న బంధాలన్నిటి కంటే గొప్ప బంధం వాళ్ల మధ్య విరబూస్తుంది. (మత్తయి 19:6 చదవండి.) ఈ ఆర్టికల్‌లో, దంపతులు తమ స్నేహాన్ని ఎలా పెంచుకుంటూ ఉండవచ్చో చూస్తాం. అయితే దానికన్నా ముందు, పెళ్లికాని క్రైస్తవులు తమకు జీవితాంతం బెస్ట్ ఫ్రెండ్‌గా ఉండే జోడీని ఎలా ఎంచుకోవచ్చో చూస్తాం.
జీవితాంతం ఉండే ఫ్రెండ్‌ని ఎలా ఎంచుకోవాలి?
3-4. సరైన జోడీని ఎంచుకోవడానికి ఏది సహాయం చేస్తుంది? (సామెతలు 18:22)
3 మనం ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు దానిలో ఉన్న ప్లెస్‌లు-మైనస్‌లు ఏంటి, దీనివల్ల ఏం జరగవచ్చు అని ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. ఎందుకంటే, దానివల్ల మన జీవితమే మారిపోవచ్చు. కాబట్టి, మనం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
4 జీవితాంతం మీ పక్కనే ఉండే నేస్తం మీ వివాహ జతే. కాబట్టి, వాళ్లను ఎంచుకోవడం అనేది మీరు తీసుకునే ప్రాముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి. వివాహాన్ని ఏర్పాటు చేసింది యెహోవాయే కాబట్టి, వివాహ జతను ఎంచుకునే విషయంలో సహాయం కోసం ఆయనవైపు చూడడమే తెలివైన పని. అబ్బాయికైతే మంచి భార్య రావాలని, అమ్మాయికైతే మంచి భర్త రావాలని యెహోవా కోరుకుంటున్నాడు. మనకు ఏది బెస్ట్ అనేది యెహోవాకు బాగా తెలుసు. (సామెతలు 18:22 చదవండి; యెష. 48:17, 18) కాబట్టి, పెళ్లికాని క్రైస్తవులు తమకు తగిన జోడీని ఎంచుకోవడానికి బైబిల్లో ఉన్న సూత్రాలు సహాయం చేస్తాయి.
5. బాప్తిస్మం తీసుకున్నవాళ్లను పెళ్లి చేసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
5 మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు యెహోవాకు స్నేహితులం అవుతాం. (కీర్త. 25:14) కాబట్టి, మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే, మీకు కాబోయేవాళ్లు కూడా యెహోవా స్నేహితుల్లో ఒకరై ఉండాలి. (1 కొరిం. 7:39) మీరు అలా చేసినప్పుడు, యెహోవా ప్రమాణాలు అంటే గౌరవం ఉందని చూపిస్తారు, మీకు వచ్చే భర్తను లేదా భార్యను యెహోవా ఇచ్చిన బహుమతిలా చూడగలుగుతారు. (సామె. 19:14) అంతేకాదు, ‘అవిశ్వాసితో జతకట్టడం’ వల్ల వచ్చే సమస్యల్ని మీరు తప్పించుకుంటారు. (2 కొరిం. 6:14) యెహోవాసాక్షుల్లో సరైన సంబంధాలు దొరకట్లేదనో, బయటివాళ్లను ప్రేమిస్తే వాళ్లు కూడా సత్యంలోకి వచ్చే అవకాశం ఉంది కదా అనో ఒక క్రైస్తవుడు అనుకోవచ్చు. కానీ అది తెలివితక్కువ ఆలోచన!
6-7. మీకు ఎవరైనా నచ్చితే మీరు ఏ ప్రశ్నలు వేసుకోవాలి?
6 నిజమే, బాప్తిస్మం తీసుకున్న ప్రతీఒక్కరూ మీకు సరైన జోడీ అయిపోరు. మీకు ఎవరైనా నచ్చితే, ఈ ప్రశ్నలు వేసుకోండి:a ‘ఆయన తన ఇంట్లోవాళ్లతో ఎలా ఉంటాడు? మంచి-మర్యాద తెలిసినవాడేనా? ఆయన స్నేహితులు ఎలాంటివాళ్లు? ఎవరితోనైనా మనస్పర్థలు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? తన మాటే నెగ్గాలని పట్టుబడతాడా లేదా బైబిలు సూత్రాలకు వ్యతిరేకంగా లేనంతవరకు ఓ మెట్టు తగ్గడానికి ఇష్టపడతాడా? డబ్బు విషయంలో ఆయన ఆలోచన ఏంటి?’
7 మీరు ఇంకా ఈ ప్రశ్నలు కూడా వేసుకోవచ్చు: ‘ఆయనకు యెహోవా అంటే చాలా ప్రేమ ఉందా? ఆయన “కొత్త వ్యక్తిత్వాన్ని” ధరించుకుంటున్నాడా, అంటే యెహోవాకున్న లాంటి లక్షణాల్ని చూపిస్తున్నాడా? నేను యెహోవా సేవను ఇంకా ఎక్కువ చేయడానికి తను నాకు సహాయం చేయగలడా? మా ఇద్దరికీ ఒకేలాంటి ఆధ్యాత్మిక లక్ష్యాలు ఉన్నాయా? మేమిద్దరం కేవలం మంచి ఫ్రెండ్స్‌గా కాదు, బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉండగలమా?’ (కొలొ. 3:9, 10) మీరు ఒక సిస్టర్ అయితే, మీరు ఇష్టపడుతున్న బ్రదర్ మీకు మంచి ఫ్రెండ్‌గా అలాగే మంచి కుటుంబ శిరస్సుగా ఉండగలడా? (1 కొరిం. 11:3) మీరు ఒక బ్రదర్ అయితే, మీరు ఇష్టపడుతున్న సిస్టర్ మీలో ఉన్న అపరిపూర్ణతల్ని చూసి కూడా మీ శిరస్సత్వానికి లోబడడానికి ఇష్టపడుతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కావాలంటే, టైమ్ పడుతుంది. కాబట్టి, మీరు చేసుకోబోయేవాళ్ల గురించి బాగా తెలుసుకోవడానికి టైమ్ తీసుకోండి.
8-9. పెళ్లి గురించి ఆలోచిస్తున్నవాళ్లు తెలివైన నిర్ణయం ఎలా తీసుకోవచ్చు? (చిత్రం కూడా చూడండి.)
8 అలా టైమ్ పెడుతున్నప్పుడు, అతను లేదా ఆమె నిజంగా ఎలాంటివాళ్లో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు, మీరు తెలివైన నిర్ణయం తీసుకోగలుగుతారు. వాళ్ల గురించి వేరేవాళ్లు ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకోండి. వాళ్లకు ఎలాంటి పేరు ఉందో, ఎలాంటి లక్షణాలు ఉన్నాయో మీరు కనుక్కోవచ్చు. ఉదాహరణకు వినయంగా, దయగా, అర్థం చేసుకునేవాళ్లుగా ఉంటారు అనే పేరు వాళ్లకు ఉందా అని అడగవచ్చు. ఫ్రెంచ్ గయానాలో ఉంటున్న శారా అనే సిస్టర్, డానియేల్ అనే బ్రదర్‌ని పెళ్లి చేసుకుంది. ఆమె ఇలా అంటుంది: “పెళ్లికి ముందు డానియేల్ గురించి, తన రూమ్‌మేట్ అలాగే అతనితో కలిసి పయినీరింగ్ చేసిన బ్రదర్‌ని అడిగి తెలుసుకున్నాను. అలాగే వాళ్ల సంఘపెద్దల్ని, తనకు-నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్‌ని, అతని సంఘంలో ఉన్న సిస్టర్స్‌ని అడిగాను.” కొన్ని విషయాల్ని మీరే నేరుగా ఆ వ్యక్తిని కూడా అడగవచ్చు. గతంలో గానీ, ఇప్పుడు గానీ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అని మీరు దయగా అడగవచ్చు. ఎందుకంటే, కొన్ని విషయాలు లేదా అలవాట్ల గురించి తెలుసుకోకపోతే, రేపు పెళ్లయ్యాక గొడవలు అవ్వవచ్చు.
9 ఆ వ్యక్తి నాకు సరైన జోడీయేనా అని పదేపదే మీకు సందేహం వచ్చినా, లేక పరిణతిగల సహోదరసహోదరీలు ఆ వ్యక్తి గురించి నిజాయితీగా ఏవైనా విషయాలు చెప్పినా వాటిని కొట్టిపారేయకండి. అలా చేసినప్పుడు, ఆ వ్యక్తితో మీ ప్రయాణం కొనసాగించాలో లేదో మీకే అర్థమౌతుంది.b మిగతా ఆర్టికల్‌లో, ఇప్పటికే పెళ్లి చేసుకున్నవాళ్ల గురించి చూద్దాం.
ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం గడుపుతున్నప్పుడు, అవతలివాళ్లు నిజంగా ఎలాంటివాళ్లో తెలుసుకోవడానికి ప్రయత్నించండి (8-9 పేరాలు చూడండి)
సమయం గడుపుతూ మీ స్నేహాన్ని పెంచుకోండి
10. భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు సమయం పెట్టడం ఎందుకు మంచిది?
10 భార్యాభర్తలు ఎంత బిజీగా ఉన్నా, ఒకరి కోసం ఒకరు సమయం పెట్టడం వల్ల వాళ్ల మధ్య ఉన్న స్నేహబంధం, వివాహ బంధం రెండూ బలపడతాయి. రోజంతా ఎలా గడిచిందో చెప్పుకుంటూ కబుర్లాడుకోవడానికి, వాళ్ల మనసు లోతుల్లో ఉన్న ఆలోచనల్ని-ఫీలింగ్స్‌ని పంచుకోవడానికి, ఒకరికొకరు ప్రేమానురాగాలు చూపించుకోవడానికి, ఊరికే సరదాగా సమయం గడపడానికి అదొక మంచి అవకాశం.
11. భార్యాభర్తల మధ్య ఉన్న స్నేహానికి ఎప్పుడు పగుళ్లు వస్తాయి?
11 బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉండే భార్యాభర్తలు దూరంగా కాదుగానీ, ఎప్పుడూ దగ్గరగా ఉండాలనుకుంటారు. నిజమే, కొన్నిసార్లు పరిస్థితుల వల్ల కొన్ని రోజులపాటు వాళ్లు ఒకరికొకరు దూరంగా ఉండాల్సి రావచ్చు. కానీ రోజులు కాస్తా వారాలు, నెలలు అయిపోతే మాత్రం అది చాలా ప్రమాదం. ఉదాహరణకు, కొంతమంది ఉద్యోగం వచ్చిందని వేరే దేశానికి వెళ్లిపోయి, ఇంట్లోవాళ్లకు చాలాకాలం పాటు దూరంగా ఉంటున్నారు. వాళ్లు అలా ఎక్కువకాలం దూరంగా ఉండడం వల్ల డబ్బులు గలగలలాడతాయేమో గానీ, కుటుంబం మాత్రం విలవిలలాడుతుంది.
12-13. (ఎ) భర్తతో లేదా భార్యతో సమయం గడపడానికి కొంతమంది ఏం చేశారు? (చిత్రం కూడా చూడండి.) (బి) మన జీవితంలో భర్తకు లేదా భార్యకు ఉన్న స్థానం ఏంటి? (“మీ జీవితంలో మీ భర్తకు లేదా భార్యకు ఉన్న చోటు” అనే బాక్సు కూడా చూడండి.)
12 ఖచ్చితంగా ప్రతీరోజు కలిసి సమయం గడపడం కోసం కొంతమంది దంపతులు ఏం చేస్తారో చూడండి. గ్వామ్‌లో ఉంటున్న లేయా ఇలా అంటుంది: “నేను, మావారు చాలా పనుల్ని కలిసే చేస్తాం. నేను విడిగా, ఆయన విడిగా బయటికి వెళ్లడం గానీ, పార్టీకి వెళ్లడం గానీ అరుదుగా జరుగుతుంది.” అమెరికాలో ఉంటున్న రాక్సాన్ ఇలా అంటుంది: “మేము ఇప్పుడు చాలా బిజీ అయిపోయాం. కాబట్టి, వేరే ముఖ్యమైన పనులకు మేము ఎలాగైతే షెడ్యూల్ వేసుకుంటామో, అలాగే మేమిద్దరం కలిసి సమయం గడపడానికి కూడా షెడ్యూల్ వేసుకోవాలని నిర్ణయించుకున్నాం.” (ఆమోసు 3:3 పోల్చండి.) ఫ్రాన్స్‌లో ఉంటున్న డామియన్ ఇలా అంటున్నాడు: “మేము ఒకరికొకరం ఏది ఇష్టమో తెలుసుకుని, వాటిని మా ఇష్టాలుగా చేసుకోవడం మొదలుపెట్టాం.” (మత్త. 7:12) అమెరికాలో ఉంటున్న క్యాతి ఇలా అంటుంది: “మాకు అడ్డు రావద్దని కొన్నిసార్లు మా ఫోన్లు కూడా పక్కన పెట్టేస్తుంటాం.”
13 అన్నిటికీ మించి, ఆధ్యాత్మిక పనుల్లో సమయం గడపండి. ఫ్రాన్స్‌లో ఉంటున్న మిరియామ్ ఇలా అంటుంది: “పొద్దున్నే ఎవరికి వాళ్లం బైబిలు చదువుకొని, ఆ తర్వాత అందులో మాకు నచ్చిన విషయాలేంటో, వాటిని మా జీవితంలో ఎలా పాటించవచ్చో ఒకరితో ఒకరం మాట్లాడుకుంటాం. అలా మాట్లాడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం.” ఆమె ఇంకా ఇలా అంటుంది: “మేము కలిసి ప్రార్థించడం, అందులోనూ యెహోవా అంటే మా ఆయనకు ఎంత ప్రేమ ఉందో ఆయన ప్రార్థనలో వినడం నాకు బాగా నచ్చుతుంది.” ముందు చెప్పిన క్యాతి ఇలా అంటుంది: “మేమిద్దరం కలిసి ప్రీచింగ్ చేయడాన్ని చాలా ఎంజాయ్ చేస్తాం. మా విశ్వాసాన్ని మాటల్లో చెప్పడం, అలాగే ఒకరి నుంచి ఒకరం కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండడం భలే అనిపిస్తుంది.”—సామె. 27:17.
బెస్ట్ ఫ్రెండ్స్‌లా ప్రతీరోజు సమయం గడుపుతూ మీ వివాహ బంధాన్ని బలపర్చుకోండి (12-13 పేరాలు చూడండి)
మనస్పర్థలు వచ్చినా చేయి వదలకండి
14-15. వివాహ జీవితంలో సమస్యలు వస్తే, దంపతులు దాన్ని బాగు చేసుకోవడానికి ఎందుకు కృషి చేయాలి? ఒక ఉదాహరణ చెప్పండి.
14 భార్యాభర్తలు కూడా అపరిపూర్ణులే, కాబట్టి వాళ్ల మధ్య సమస్యలు రావడం ఖాయం. అందుకే, బైబిలు కూడా నిజాయితీగా ఇలా చెప్తుంది: “పెళ్లి చేసుకునేవాళ్లకు శరీర సంబంధమైన శ్రమలు వస్తాయి.” (1 కొరిం. 7:28) ఇక్కడ “శరీర సంబంధమైన శ్రమలు” అంటున్నప్పుడు, “సహజంగా ఏ భార్యాభర్తల మధ్య అయినా వచ్చే సమస్యలు లేదా కష్టాలు” అని అర్థం. అలాంటివి వచ్చినప్పుడు, భార్యాభర్తలు ఒకరి చేయి ఒకరు వదలకుండా, ఆ సమస్యను ఎదిరించడానికి చేయగలిగినదంతా చేయాలి. ఎందుకు?
15 ఒకసారి దీని గురించి ఆలోచించండి. మీరు ఎంతో అపురూపంగా కట్టుకున్న ఇల్లు లేదా ఇష్టంగా కొనుక్కున్న హారం పాడైతే దాన్ని అలాగే వదిలేస్తారా? లేదు కదా. ఎంత టైమ్ పట్టినా, ఎంత ఖర్చు అయినా దాన్ని బాగు చేసుకోవడానికే చూస్తారు. ఎందుకు? ఎందుకంటే, ఆ ఇల్లు లేదా హారం మీకు చాలా విలువైనది. అదేవిధంగా పెళ్లి కూడా చాలా విలువైనది. ఎంత మంచి భార్యాభర్తల మధ్య అయినా గొడవలు రావడం సహజం. మీరు ఎలాగైతే పాడైన ఆ ఇంటిని, హారాన్ని బాగు చేసుకుంటారో అలాగే వివాహ బంధంలో సమస్యలు వచ్చినా దాన్ని బాగు చేసుకోవాలి. అలా చేయాలంటే కొంచెం టైమ్ పట్టవచ్చు, కృషి కూడా అవసరం. కానీ మీ వివాహ బంధాన్ని బాగు చేసుకోవడానికి, కలిసి ఉండడానికి మీ ఇద్దరూ చేస్తున్న కృషిని చూసి యెహోవా చాలా సంతోషిస్తాడు. (మలా. 2:16) మీరు అలా కృషి చేసినప్పుడు, మీ వివాహ జత మీద అలాగే వివాహాన్ని ఏర్పాటు చేసిన యెహోవా మీద ప్రేమ, గౌరవం చూపిస్తారు.
16. మొదటి కొరింథీయులు 13:4-8ఎ ప్రకారం, వివాహ బంధం తెగిపోయేలా ఉంటే దంపతులు ఏం చేయాలి? (చిత్రాన్ని, అలాగే “మీ స్నేహాన్ని పెంచుకోవడానికి సహాయం” అనే బాక్సుని చూడండి.)
16 మీ వివాహ బంధంలో సమస్యలు వస్తే, తొందరపడి విడిపోకండి. (1 కొరిం. 7:10, 11) బదులుగా, ‘మా స్నేహాన్ని పెంచుకోవడానికి నేను ఇంకా ఏం చేయవచ్చు?’ అని ఆలోచించండి. అలాగే, బైబిలు ప్రేమ గురించి ఏం చెప్తుందో చదివి, 1 కొరింథీయులు 13:4-8ఎలో ఉన్న ఏవైనా లక్షణాల్ని మీరు ఇంకా బాగా చూపించాలేమో ప్రశ్నించుకోండి. (చదవండి.) మీరు ఒకరికొకరు ఎలా దూరమవ్వాలి అని కాకుండా, ఎలా దగ్గరవ్వాలి అని ఆలోచించి, దానికోసం చేయగలిగినదంతా చేయండి. మీ బంధాన్ని బాగు చేసుకోవడానికి మీరు ఏం చేయవచ్చు అనేదాని మీద మనసుపెట్టండి. సహాయం కోసం యెహోవాకు ప్రార్థించండి. మన ప్రచురణల్ని చదవండి, వీడియోల్ని చూడండి, పెద్దల సలహా తీసుకోండి, పరిణతిగల ఇతర క్రైస్తవులతో మాట్లాడండి. ‘మూడు పేటల తాడులో’ యెహోవా మూడో పేట, బలమైన పేట. కాబట్టి, ఆయన మీద ఆధారపడితే మీ వివాహ బంధం “త్వరగా తెగిపోదు.”—ప్రసం. 4:12.
మనస్పర్థలు వచ్చినా చేయి వదలకండి (16వ పేరా చూడండి)
17. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నవాళ్లు అలాగే పెళ్లి చేసుకున్నవాళ్లు ఎలా సంతోషంగా ఉండవచ్చు?
17 తన సేవకులందరూ, అంటే పెళ్లికాని వాళ్లయినా లేదా పెళ్లయిన వాళ్లయినా సంతోషంగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. మీరు త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటే, జీవితాంతం ఉండే ఫ్రెండ్‌ని జాగ్రత్తగా ఎంచుకోండి. ఒకవేళ మీకు ఇప్పటికే పెళ్లయ్యి ఉంటే, మీ వివాహ జతతో స్నేహాన్ని పెంచుకుంటూ ఉండండి. వివాహ బంధంలో సమస్యలు వచ్చినప్పుడు, యెహోవా సహాయంతో వాటిని ఎదిరించండి. మీరు అలా చేసినప్పుడు, మీ ప్రియాతి ప్రియమైన నేస్తంతో మీ జీవితాన్ని ‘సంతోషంగా గడుపుతారు’!—ప్రసం. 9:9.
పాట 132 మనమిప్పుడు ఒక్కరం
a ఇప్పుడు వచ్చే ప్రశ్నలు అమ్మాయికి, అబ్బాయికి ఇద్దరికీ వర్తిస్తాయి.
b ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి సహాయం చేసే మరిన్ని సలహాల కోసం, కావలికోట మే 2024 సంచికలోని “ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలా వద్దా అనే నిర్ణయానికి ముందు వేసే అడుగులు” ఆర్టికల్‌లో, “ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకోండి” అనే ఉపశీర్షిక కింద చూడండి.