కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w26 ఫిబ్రవరి పేజీలు 14-19
  • బాప్తిస్మం వైపు అడుగులు వేస్తూ ఉండండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బాప్తిస్మం వైపు అడుగులు వేస్తూ ఉండండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కొంతమంది ఎందుకు వెనకడుగు వేస్తారు?
  • అంతం దగ్గరపడుతుంది అని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి?
  • ఇప్పుడే బాప్తిస్మం వైపు అడుగులు వేయండి
  • బాప్తిస్మానికి ఉన్న అర్థం తెలుసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • మీరు యెహోవాకు సమర్పించుకోవడానికి రెడీనా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • బాప్తిస్మం తర్వాత కూడా యేసును “అనుసరిస్తూ ఉండండి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • బాప్తిస్మానికి ఆలస్యం చేయవద్దు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
w26 ఫిబ్రవరి పేజీలు 14-19

ఏప్రిల్‌ 20-26, 2026

పాట 49 యెహోవా హృదయాన్ని సంతోషపెడదాం

బాప్తిస్మం వైపు అడుగులు వేస్తూ ఉండండి

“ఇదే చాలా అనుకూలమైన సమయం.”—2 కొరిం. 6:2.

ముఖ్యాంశం

యెహోవాతో దగ్గరి స్నేహాన్ని పెంచుకోవడానికి, బాప్తిస్మం తీసుకోవడానికి ఇదే సరైన సమయం అని చూస్తాం.

1. (ఎ) బాప్తిస్మం తీసుకోవడం వల్ల మనం ఏం పొందుతాం? (బి) ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

మీరు యెహోవాకు సమర్పించుకుని, దానికి గుర్తుగా నీళ్లల్లో బాప్తిస్మం తీసుకున్నారా? అలాగైతే, మంచి మనస్సాక్షి కోసం మీరు దేవునికి విన్నపం చేసుకున్నట్టే. (1 పేతు. 3:21) మీరు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా యౌవనులకు, ఇప్పుడిప్పుడే సంఘానికి వస్తున్న కొత్తవాళ్లకు మంచి ఆదర్శం ఉంచారు. శభాష్‌! మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మీరు ఇంకా బాప్తిస్మం తీసుకోకపోతే అప్పుడేంటి? మీకు యెహోవా మీద ప్రేమ, ఆయన ఇష్టం చేయాలనే కోరిక తప్పకుండా ఉండే ఉంటాయి. అంతేకాదు, బాప్తిస్మం తీసుకోవడం వల్ల మీ పాపాలు క్షమించబడతాయని, మీరు దేవుని ఆమోదం పొందుతారని కూడా మీకు తెలిసే ఉంటుంది. (అపొ. 2:38-40) కానీ ఎందుకో మీరు దానికి వెనకడుగు వేస్తుండవచ్చు. మరి మీకు ఏది సహాయం చేస్తుంది? ఈ ఆర్టికల్‌లో మనం వీటి గురించి చూస్తాం: (1) కొంతమంది బాప్తిస్మం తీసుకోవడానికి ఎందుకు వెనకడుగు వేస్తారు? (2) అంతం దగ్గరపడుతుంది అని గుర్తుపెట్టుకోవడం ఎందుకు తెలివైన పని? (3) ఇప్పుడే బాప్తిస్మం వైపు అడుగులు వేయడం ఎందుకు మంచిది?

కొంతమంది ఎందుకు వెనకడుగు వేస్తారు?

2. కొంతమంది ఎందుకు బాప్తిస్మం తీసుకోవడానికి వెనకడుగు వేస్తారు?

2 కొంతమంది భయం వల్ల బాప్తిస్మం తీసుకోవడానికి వెనకడుగు వేస్తారు. ఉదాహరణకు, వాళ్లకు యెహోవా సేవ చేయాలని ఉన్నా ‘నేను అంత మంచిగా ఉండలేనేమో, నేను దేవుణ్ణి సంతోషపెట్టలేనేమో’ అని భయపడుతుంటారు. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అలాగైతే, యెహోవా మన నుండి పరిపూర్ణతను ఆశించడని, మనం చేయగలిగినదంతా చేస్తే ఆయన సంతోషిస్తాడని చెప్పే బైబిలు వచనాల్ని చదవండి. (కీర్త. 103:13, 14; కొలొ. 3:23) ఒకవేళ వ్యతిరేకత వస్తుందని మీరు భయపడుతుంటే గనుక, ఈ మాటల్ని రాసిన కీర్తనకర్త లాంటి ధైర్యాన్నే ఇవ్వమని యెహోవాను అడగండి: “యెహోవా నా పక్షాన ఉన్నాడు; నేను భయపడను. మనుషులు నన్నేమి చేయగలరు?”—కీర్త. 118:6.

3. ఎలాంటి ఆలోచన వల్ల కొంతమంది బాప్తిస్మం తీసుకోవడానికి వెనకడుగు వేస్తారు? (చిత్రం కూడా చూడండి.)

3 కొంతమందికి యెహోవా అంటే ప్రేమ ఉన్నా, తమకు సరిపడేంత జ్ఞానం లేదని వెనకడుగు వేస్తారు. మరి మనం బాప్తిస్మం తీసుకోవాలంటే మనకు ఎంత జ్ఞానం ఉండాలి? ఈ బైబిలు ఉదాహరణ గమనించండి. పౌలు, సీల చెరసాలలో ఉన్నప్పుడు ఒక భూకంపం వచ్చింది. అప్పుడు వాళ్లు చెరసాల అధికారికి, అతని ఇంటి వాళ్లందరికీ సాక్ష్యమిచ్చారు. బహుశా అక్కడ జరిగింది ఒక అద్భుతం అని ఆ అధికారికి, అతని ఇంటివాళ్లకు అర్థమై ఉంటుంది. దానికి తోడు, ఆ రోజు రాత్రి పౌలు, సీల వాళ్లకు కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్పించారు. దాంతో వాళ్లు ‘ఆలస్యం చేయకుండా బాప్తిస్మం తీసుకున్నారు.’ (అపొ. 16:25-33) మీరు యెహోవా గురించి తెలుసుకుని, ఆయన్ని నిండు హృదయంతో ప్రేమించి, ప్రాథమిక బైబిలు బోధల్ని నేర్చుకుని, మీ పాపాల విషయంలో పశ్చాత్తాపపడి, ఆయన ప్రమాణాలకు తగ్గట్టు జీవించాలని నిర్ణయించుకుని ఉంటే, మీరు బాప్తిస్మం తీసుకోవడానికి రెడీయే.—మార్కు 12:30.

పౌలు, సీల రాత్రిపూట చెరసాల అధికారికి, అతని ఇంటివాళ్లకు సాక్ష్యమిస్తున్నారు. వాళ్లంతా శ్రద్ధగా వింటున్నారు.

పౌలు, సీల చెరసాల అధికారికి, అతని ఇంటివాళ్లకు సాక్ష్యమిచ్చారు, దాంతో వాళ్లు ‘ఆలస్యం చేయకుండా బాప్తిస్మం తీసుకున్నారు’ (3వ పేరా చూడండి)


4. కొంతమంది దేని గురించి ఆలోచిస్తూ బాప్తిస్మాన్ని వాయిదా వేస్తారు? (చిత్రం కూడా చూడండి.)

4 కొంతమందికి దేవుణ్ణి సంతోషపెట్టాలనే ఆశ ఉన్నా, దానికోసం ఏమేం వదులుకోవాల్సి వస్తుందో అని వెనకడుగు వేస్తారు. నిజమే, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దాని కోసం ఏమేం చేయాల్సి వస్తుందో ఆలోచించడం మంచిదే. (లూకా 14:27-30) కానీ ఎక్కువగా ఆలోచించేసి కొంతమంది కంగారుపడుతూ ఉంటారు. కాండెస్‌ అనే ఆమెకు కూడా అలానే అనిపించింది. ఆమె ఇలా అంటుంది: “యెహోవా కోసం నేను ఏమేం చేయాలో నాకు చిన్నప్పటి నుంచే తెలిసినా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఎందుకంటే ఒక్కసారి బాప్తిస్మం తీసుకుంటే, ఈ లోకంలో నేను ఎంజాయ్‌ చేసేవాటిని వదులుకోవాల్సి వస్తుందని నేను భయపడ్డాను. ఆ సరదాల్ని వదులుకోవడం అంత ఈజీ కాదు.” ఇంకొంతమందేమో, బాప్తిస్మం తీసుకుంటే చాలా పవిత్రంగా ఉండాలని కంగారుపడుతూ ఉంటారు. ‘అమ్మో, బాప్తిస్మం తీసుకున్నాక ఏదైనా ఘోరమైన పాపం చేస్తే సంఘం నుండి తొలగిస్తారు, దాని కన్నా బాప్తిస్మం తీసుకోకపోవడమే నయం’ అని అనుకుంటారు. ఒకవేళ మీకూ అలాగే అనిపిస్తుంటే, మీరు ఏం చేయవచ్చు?

ఒక సిస్టర్‌ ఒకామెకి బైబిలు స్టడీ చేస్తోంది. ఆ సిస్టర్‌ మాట్లాడుతుంటే ఆమె క్లబ్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి మందు తాగుతున్నట్టు, డ్యాన్స్‌ చేస్తున్నట్టు ఊహించుకుంటుంది.

కొంతమందికి దేవుణ్ణి సంతోషపెట్టాలనే ఆశ ఉన్నా, దానికోసం ఏమేం వదులుకోవాల్సి వస్తుందో అని కంగారుపడతారు (4వ పేరా చూడండి)


5. మనం బాప్తిస్మం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఏ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి? (మత్తయి 13:44-46)

5 మనం ఏదైనా వస్తువు కొంటున్నప్పుడు దానికి ఎంత ఖర్చుపెడుతున్నామో అని మాత్రమే కాదు, ఆ వస్తువు ఎంత విలువైనదో కూడా ఆలోచిస్తాం. ఒకవేళ మనం ఖర్చుపెడుతున్న దానికన్నా ఆ వస్తువు ఇంకా విలువైనదైతే, మనం దాన్ని వెంటనే కొంటాం. అదేవిధంగా మనం బాప్తిస్మం తీసుకోవడం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఏం వదులుకోవాల్సి వస్తుందో అని మాత్రమే కాదు, ఏం పొందుతాం అని కూడా ఆలోచించాలి. అంటే మార్పులు చేసుకోవాల్సి వస్తుందని కంగారుపడే బదులు, దేవుని స్నేహాన్ని పొందుతామని సంతోషించాలి. ఈ విషయాన్ని చెప్పడానికి యేసు రెండు ఉదాహరణల్ని ఉపయోగించాడు. (మత్తయి 13:44-46 చదవండి.) ఆ రెండు ఉదాహరణల్లోని వ్యక్తులు తమకు దొరికిన విలువైన వస్తువును కొనడానికి తమకు ఉన్నదంతా సంతోషంగా అమ్మేశారు. మీకు కూడా ఎంతో విలువైన రాజ్య సత్యం దొరికింది! ఆ సత్యానికి తగ్గట్టు జీవించడం అంత అవసరమా అని మీకు అనిపిస్తే, యేసు చెప్పిన ఉదాహరణల గురించి జాగ్రత్తగా ఆలోచించండి. మిమ్మల్ని మీరు ఈ ప్రశ్నలు వేసుకోవచ్చు: ‘నాకు దొరికింది చాలా విలువైనది అని నేను నమ్ముతున్నానా? దేవునితో నాకున్న స్నేహాన్ని, ఆయన నా కోసం దాచి ఉంచిన అందమైన భవిష్యత్తును, నన్ను ఎంతో ప్రేమించే సహోదర బృందాన్ని నేను విలువైనవిగా చూస్తున్నానా?’ ఆ ప్రశ్నలు వేసుకుని సత్యం మీద మీకున్న ప్రేమను ఇంకా పెంచుకోవచ్చు, లేదా మిమ్మల్ని ఏది ఆపుతుందో గమనించుకోవచ్చు.

6. మంచి హృదయస్థితిని మనమెలా సంపాదించుకోవచ్చు?

6 విత్తనాలు చల్లేవాడి ఉదాహరణలో యేసు ఫలించని నేలల గురించి చెప్పాడు. అలాంటి నేలలు లేదా హృదయస్థితి ఉన్నవాళ్లు ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించకపోవచ్చు. అయితే, కొంతమంది “ఎంతో మంచి మనసుతో” రాజ్య సత్యాన్ని విని స్పందిస్తారని కూడా యేసు చెప్పాడు. (లూకా 8:5-15) ఒకవేళ మీరు నేర్చుకున్నవి పాటించడానికి మీ హృదయం రెడీగా లేదని మీకు అనిపిస్తే, ఆశ వదులుకోకండి. యెహోవా సహాయంతో, ఆయన నిర్దేశాలకు లోబడే “కొత్త హృదయాన్ని” మీరు సంపాదించుకోవచ్చు. రాజ్య సత్యం మీలో మొలకెత్తేలా మీ హృదయాన్ని మెత్తబర్చమని యెహోవాకు ప్రార్థించండి.—యెహె. 18:31; 36:26.

7-8. కొంతమంది యౌవనస్థులు ఎందుకు బాప్తిస్మం తీసుకోవడానికి వెనకాడతారు? (చిత్రం కూడా చూడండి.)

7 కొంతమంది యౌవనస్థులకు యెహోవా మీద ప్రేమ ఉన్నా, వేరేవాళ్ల ఒత్తిడి వల్ల బాప్తిస్మం తీసుకోవడానికి వెనకడుగు వేస్తారు. ఉదాహరణకు, స్కూల్లో కొంతమంది టీచర్లు, బైబిలు తప్పు అని చెప్పే లైఫ్‌స్టైల్స్‌ విషయంలో ఓపెన్‌ మైండ్‌తో ఉండాలని, ఈరోజుల్లో అవేమీ తప్పు కాదని పిల్లలకు సలహా ఇస్తుంటారు. కానీ ఆ సలహా ప్రమాదంలోకి నెట్టేస్తుంది. (కీర్త. 1:1, 2; సామె. 7:1-5) అలా జరగకూడదంటే, ఈ మాటలు రాసిన కీర్తనకర్త ఆదర్శాన్ని పాటించాలి: “నీ జ్ఞాపికల్ని నేను ధ్యానిస్తున్నాను, అందుకే నా బోధకులందరి కన్నా నాకు ఎక్కువ అవగాహన ఉంది.”—కీర్త. 119:99.

8 యెహోవాసాక్షుల్లో కొంతమంది తల్లిదండ్రులే వాళ్ల పిల్లల్ని బాప్తిస్మం తీసుకోకుండా వెనక్కి లాగుతారని నివేదికలు చూపిస్తున్నాయి. అదెలా? కొంతమంది తల్లిదండ్రులు ఎక్కువగా పిల్లల చదువులు, ఉద్యోగాల గురించే పట్టించుకుంటారు. లేదా పిల్లలకు ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టరు. మీరు ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించడానికి మీ తల్లిదండ్రులు ఇంకాస్త సహాయం చేస్తే బాగుండు అని మీకు అనిపిస్తుందా? అలాగైతే, దాని గురించి మీ అమ్మానాన్నలతో మాట్లాడండి. యెహోవాతో స్నేహం చేయడానికి మీ వయసు అడ్డుకాదని గుర్తుంచుకోండి.—సామె. 20:11.

ఒక టీనేజీ అబ్బాయి “ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!” పుస్తకంలోని 23వ పాఠాన్ని చూపిస్తూ తన అమ్మానాన్నలతో మాట్లాడుతున్నాడు.

బాప్తిస్మం గురించి మీ అమ్మానాన్నలతో మాట్లాడి చూడండి (8వ పేరా చూడండి)


9. కొంతమంది ఎందుకు బాప్తిస్మాన్ని వాయిదా వేయవచ్చు?

9 కొంతమంది బాప్తిస్మం తీసుకోవడానికి రెడీగా ఉన్నా, ఫలానా వ్యక్తితో కలిసి తీసుకోవాలని ఆగుతారు. ఉదాహరణకు, ఫ్రెండ్‌తోనో లేదా వాళ్లకు ఇష్టమైనవాళ్లతోనో కలిసి ఒకేరోజు బాప్తిస్మం తీసుకోవాలని వాళ్లు అనుకోవచ్చు. నిజమే, ఇష్టమైనవాళ్లతో కలిసి బాప్తిస్మం తీసుకోవడంలో తప్పులేదు. కానీ, ఆ ఒక్క కారణాన్ని బట్టి మీ బాప్తిస్మాన్ని వాయిదా వేయడం మంచిదంటారా? గుర్తుపెట్టుకోండి, సమర్పణ అనేది మీ ప్రార్థనలో దేవునికి వ్యక్తిగతంగా ఇచ్చే మాట. కాబట్టి వేరేవాళ్ల నిర్ణయం మీద మీ బాప్తిస్మం ఆధారపడి ఉండకూడదు.—రోమా. 14:12.

అంతం దగ్గరపడుతుంది అని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి?

10. కొంతమంది ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించడానికి ఎందుకు వెనకాడతారు?

10 మనం పైన చూసిన కారణాలే కాకుండా, అంతం రావడానికి ఇంకా బోలెడు టైం ఉందనే కారణంతో కూడా కొంతమంది ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించడానికి వెనకడుగు వేస్తారు. కానీ అలా ఆలోచించడం కరెక్టే అంటారా? యేసు తన శిష్యుల్ని ఇలా హెచ్చరించాడు: “ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. ఎందుకంటే, మీరు అనుకోని సమయంలో మానవ కుమారుడు వస్తున్నాడు.”—లూకా 12:40.

11. కీర్తన 119:60 ప్రకారం, యెహోవా గురించి ఎక్కువగా నేర్చుకునే కొద్దీ ఆయన ఆజ్ఞల విషయంలో మనకు ఏమనిపిస్తుంది?

11 యెహోవా మీద ప్రేమతోనే మనం ఆయనకు సమర్పించుకోవాలి. మన ప్రేమగల తండ్రైన యెహోవా గురించి ఎక్కువ తెలుసుకునే కొద్దీ ఆయన ఆజ్ఞల్ని ప్రేమించాలని, వాటిని వెంటనే పాటించాలని అనిపిస్తుంది. (కీర్తన 119:60 చదవండి.) యెహోవా ఇచ్చే ఆజ్ఞల్ని వెంటనే పాటించడానికి ఇంకో కారణాన్ని శిష్యుడైన యాకోబు చెప్పాడు. అదేంటంటే, రేపన్న రోజు ఎలా ఉంటుందో మనకు తెలీదు. సరైనది చేయడానికి అసలు రేపన్న రోజు ఉంటుందో లేదో కూడా మనకు తెలీదు. కాబట్టి మనకు తెలిసినదాన్ని బట్టి ఇప్పుడే చర్య తీసుకోవాలి.—యాకో. 4:13-17.

12. యేసు చెప్పిన ద్రాక్షతోట ఉదాహరణ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

12 యేసు చెప్పిన ద్రాక్షతోట ఉదాహరణ గురించి ఆలోచించండి. ఉదయం నుండి పనిచేసిన వాళ్లకు ఎంత జీతం వచ్చిందో, చివర్లో ఒక గంట పనిచేసిన వాళ్లకు కూడా అంతే జీతం వచ్చిందని యేసు చెప్పాడు. మరి వాళ్లు ఉదయం నుండి పని చేయకపోవడానికి కారణం ఏంటో గమనించండి. ఆ కారణాన్ని వాళ్లే చెప్తున్నారు: “మమ్మల్ని ఎవరూ పనిలో పెట్టుకోలేదు.” వాళ్లు బద్ధకస్థులో, పని దొంగలో కాదుగానీ వాళ్లను ఎవరూ పనిలో పెట్టుకోనందుకే ఉదయం నుండి ఖాళీగా ఉన్నారు. కానీ, పని దొరికిన వెంటనే మాత్రం పనిలో చేరిపోయారు. (మత్త. 20:1-16) అదేవిధంగా ఇప్పుడు యేసు తనకు శిష్యులు అవ్వమని, రాజ్య పనిలో చేరమని మనల్ని పిలుస్తున్నాడు. మనం కూడా ఆలస్యం చేయకుండా, దాన్ని విన్న వెంటనే చర్య తీసుకోవాలి.

13. లోతు భార్య నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

13 అంతం దగ్గరైనప్పుడు మార్పులు చేసుకుందాంలే అని కొంతమంది బాప్తిస్మం తీసుకోవడానికి ఆలస్యం చేస్తారు. నిజానికి మీరు ఎంత ఆలస్యం చేస్తే, మార్పులు చేసుకోవడం మీకు అంత కష్టమౌతుంది. యేసుకు ఆ విషయం తెలుసు, అందుకే తన శిష్యుల్ని ఇలా హెచ్చరించాడు: “లోతు భార్యను గుర్తుచేసుకోండి.” (లూకా 17:31-35) సొదొమ, గొమొర్రాల మీదికి నాశనం తప్పకుండా వస్తుందని ఆమెకు బాగా తెలుసు; అయినా, బహుశా ఆమె తనకున్న వాటి మీద ప్రేమను తెంచుకోలేకపోయింది. (ఆది. 19:23-26) ఆమె ఉదాహరణ మనకు ఇంకో విషయాన్ని కూడా చెప్తుంది. అదేంటంటే, రక్షణ పొందడానికి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని మనం అనుకోకూడదు. దేవుడు తాను అనుకున్న సమయంలో తలుపులు మూసేసి, శాశ్వతంగా తాళం వేస్తాడు.—లూకా 13:24, 25.

14. అంతానికి సంబంధించిన ప్రవచనాల్ని మనం ఎందుకు జాగ్రత్తగా గమనించాలి?

14 ఒక్కోరోజు గడిచే కొద్దీ, ఈ వ్యవస్థ ముగింపుకు సంబంధించిన బైబిలు ప్రవచనాలు నెరవేరడం మనం చూస్తున్నాం. అయితే వాటిలో కొన్ని మన ప్రాంతంలో జరగకపోయినా, ప్రపంచంలో వేరే చోట్ల జరగడం చూసినప్పుడు త్వరత్వరగా బాప్తిస్మం తీసుకోవాలని మనకు అనిపించవచ్చు. మొదటి శతాబ్దంలోని ఉదాహరణ గమనించండి. అపొస్తలుడైన పేతురు, ‘అన్నిటి అంతం దగ్గరపడింది కాబట్టి ఎప్పుడూ సిద్ధంగా లేదా అప్రమత్తంగా ఉండండి’ అని క్రైస్తవుల్ని ప్రోత్సహించాడు. (1 పేతు. 4:7; అధస్సూచి) ఇక్కడ “అంతం” అంటున్నప్పుడు, బహుశా యెరూషలేము అలాగే దాని ఆలయం నాశనమవ్వడం గురించి పేతురు మాట్లాడుతున్నాడు. అయితే, ఈ ఉత్తరం పేతురు ఎవరికైతే రాశాడో వాళ్లు యెరూషలేముకు చాలా దూరంలో ఉంటున్నారు. కాబట్టి యెరూషలేము నాశనం వల్ల వాళ్ల జీవితంలో పెద్ద మార్పు ఏమీ ఉండదు. (1 పేతు. 1:1) అయినప్పటికీ, ఈ ప్రవచనం నెరవేరడం వాళ్లు కళ్లారా చూసినప్పుడు యెహోవా చెప్పిన మిగతా విషయాలు కూడా ఖచ్చితంగా నెరవేరతాయనే నమ్మకం వాళ్లలో పెరుగుతుంది. అదేవిధంగా, అంతానికి సంబంధించిన ప్రవచనాలు నెరవేరడం చూసినప్పుడు, మనం కూడా అప్రమత్తంగా ఉండి బాప్తిస్మం వైపు త్వరత్వరగా అడుగులు వేస్తాం.

15. మనం యెహోవా రోజు కోసం ఎలా సిద్ధంగా ఉండవచ్చు? (2 పేతురు 3:10-13)

15 పేతురు తన రెండో ఉత్తరంలో, యెహోవా రోజు కోసం ఎలా సిద్ధంగా ఉండవచ్చో వివరించాడు. మొదటి శతాబ్దపు క్రైస్తవులకు యెహోవా రోజు చాలా దూరంలో ఉంది. అయినా పేతురు వాళ్లకు, ‘దాన్ని ఎప్పుడూ మనసులో ఉంచుకుంటూ’ లేదా “బాగా కోరుకుంటూ” జీవించమని చెప్పాడు. (2 పేతురు 3:10-13, అధస్సూచి చదవండి.) ఆ రోజు కోసం ఎదురుచూస్తూ, దానికి సిద్ధంగా ఉండడం ద్వారా దాన్ని ఎప్పుడూ మనసులో ఉంచుకుని జీవిస్తున్నామని చూపిస్తాం. అలాగే మనం “పవిత్రంగా నడుచుకుంటూ, దైవభక్తిగల పనులు చేస్తూ” ఉండడం ద్వారా మనం దాన్ని బాగా కోరుకుంటున్నామని చూపిస్తాం. మీరు “దైవభక్తిగల పనులు చేస్తూ” ఉంటే, దాన్ని చూసి యెహోవా ఎంత మురిసిపోతాడో కదా! అదే మీరు ఆయనకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకుంటే, ఇక ఆయన సంతోషానికి అవధులు ఉండవు.

ఇప్పుడే బాప్తిస్మం వైపు అడుగులు వేయండి

16. బాప్తిస్మం వైపు అడుగులు వేయడానికి ఏది మంచి సమయం? (2 కొరింథీయులు 6:1, 2) (చిత్రాలు కూడా చూడండి.)

16 బాప్తిస్మం వైపు అడుగులు వేయడానికి ఇదే మంచి సమయం. (2 కొరింథీయులు 6:1, 2 చదవండి.) ఫిలిప్పు కలిసిన ఇతియోపీయుడైన అధికారి దాన్ని గుర్తించాడు. ఆయనకు మంచివార్త అర్థమైన తర్వాత, బాప్తిస్మం తీసుకోవడానికి చోటు కనిపించిన తర్వాత ఆయన ఇలా అనుకోలేదు: ‘నాకు మంచివార్త గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉంది. ఈ దారిన వెళ్తూ ఉంటే ఇంకో నీటి మడుగు వస్తుందిగా, అప్పుడు బాప్తిస్మం తీసుకుందాంలే.’ బదులుగా ఆయన ఫిలిప్పును, “నేను బాప్తిస్మం తీసుకోవడానికి ఆటంకం ఏంటి?” అని అడిగాడు. (అపొ. 8:26, 27, 35-39) ఎంత మంచి ఉదాహరణో కదా! బాప్తిస్మం తీసుకున్న తర్వాత, ఆ అధికారి “సంతోషంగా తన దారిన వెళ్లిపోయాడు.”

చిత్రాలు: 1. బాప్తిస్మం తీసుకోమని ఫిలిప్పు పిలుస్తుండగా ఇతియోపీయుడైన అధికారి నీళ్లల్లోకి దిగుతున్నాడు. 2. ముందు చిత్రంలో చూసిన బైబిలు విద్యార్థి అలాగే సిస్టర్‌, రాజ్యమందిరంలో ఇద్దరు పెద్దలతో సంతోషంగా మాట్లాడుతున్నారు.

ఇతియోపీయుడైన అధికారి నుండి విలువైన పాఠం నేర్చుకోండి: బాప్తిస్మం వైపు అడుగులు వేయడానికి ఇదే మంచి సమయం (16వ పేరా చూడండి)a


17. మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?

17 ఒకవేళ మీరు బాప్తిస్మం తీసుకోవడానికి వెనకడుగు వేస్తూ ఉంటే, మీరు తనకు దగ్గరవ్వడానికి యెహోవాయే మీకు చేయి అందించి తనవైపు నడిపిస్తాడనే నమ్మకంతో ఉండండి. (రోమా. 2:4) ఒకవేళ మీరు భయాల వల్ల, ఆందోళనల వల్ల, వేరేవాళ్ల ఒత్తిడి వల్ల బాప్తిస్మాన్ని వాయిదా వేస్తుంటే, వాటన్నిటినీ దాటడానికి ఆయన మీకు సహాయం చేస్తాడు. మీరు బాప్తిస్మం తీసుకుని దేవుని ముందు మంచి మనస్సాక్షి పొందిన తర్వాత, “వెనక ఉన్నవాటిని” తిరిగి చూడరు గానీ, “ముందున్న వాటి కోసం” ఎదురుచూస్తారు. (ఫిలి. 3:8, 13) అంటే తనకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్న వాళ్లకు యెహోవా ఏమైతే మాటిచ్చాడో, అవి నెరవేరడం మీరు చూడగలుగుతారు.—అపొ. 3:19.

మీరెలా జవాబిస్తారు?

  • బాప్తిస్మం తీసుకోవడానికి కొంతమంది ఎందుకు వెనకడుగు వేస్తారు?

  • బాప్తిస్మాన్ని వాయిదా వేయడం ఎందుకు తెలివైన పనికాదు?

  • బాప్తిస్మం వైపు అడుగులు వేయడానికి ఏది మంచి సమయం?

పాట 38 ఆయనే నిన్ను బలపరుస్తాడు

a చిత్రాల వివరణ: బాప్తిస్మం తీసుకుంటానని ఇతియోపీయుడైన అధికారి ఫిలిప్పును అడిగినట్టే, ఒక బైబిలు విద్యార్థి బాప్తిస్మం తీసుకుంటానని సంఘపెద్దల్ని అడుగుతుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి