కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 సెప్టెంబరు పేజీలు 14-19
  • ఇతరుల్ని గౌరవించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇతరుల్ని గౌరవించండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఇతరుల్ని గౌరవించడం అంటే ఏంటి?
  • కుటుంబ సభ్యుల్ని గౌరవించండి
  • బ్రదర్స్‌సిస్టర్స్‌ మీద గౌరవం చూపించండి
  • యెహోవాసాక్షులుకాని వాళ్లమీద గౌరవం చూపించండి
  • గౌరవం ఏమైపోయింది?
    తేజరిల్లు!—2024
  • ఇతరులను గౌరవించడంలో మీరు మాదిరిగా ఉన్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • అధికారాన్ని ఎందుకు గౌరవించాలి?
    దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి
  • అధికారంలో ఉన్నవారిని ఎందుకు గౌరవించాలి?
    ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 సెప్టెంబరు పేజీలు 14-19

అధ్యయన ఆర్టికల్‌ 38

పాట 120 క్రీస్తులా సౌమ్యంగా ఉండండి

ఇతరుల్ని గౌరవించండి

“వెండిబంగారాల కన్నా గౌరవాన్ని ఎంచుకోవడం మంచిది.”—సామె. 22:1, అధస్సూచి.

ముఖ్యాంశం

ఇతరుల్ని ఎందుకు గౌరవించాలో, అలా చేయడం కష్టమైనాసరే దాన్ని ఎలా చేయవచ్చో చూస్తాం.

1. ఎవరైనా గౌరవిస్తే మనకు ఎందుకు నచ్చుతుంది? (సామెతలు 22:1)

మిమ్మల్ని ఎవరైనా గౌరవిస్తే మీకు నచ్చుతుందా? ఖచ్చితంగా నచ్చుతుంది కదా. ఎందుకంటే, గౌరవాన్ని అందరూ కోరుకుంటారు. ఎవరైనా మనల్ని గౌరవిస్తే మనకు సంతోషంగా అనిపిస్తుంది. అందుకే బైబిలు ఇలా చెప్తుంది: “వెండిబంగారాల కన్నా గౌరవాన్ని ఎంచుకోవడం మంచిది.”—సామెతలు 22:1, అధస్సూచి కూడా చదవండి.

2-3. ఇతరుల్ని గౌరవించడానికి కొన్నిసార్లు మనకు ఎందుకు మనసు రాకపోవచ్చు? ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

2 అయితే ఇతరుల్ని గౌరవించడానికి కొన్నిసార్లు మనకు మనసు రాకపోవచ్చు. దానికొక కారణం ఏంటంటే, మన చుట్టూవున్న వాళ్లలో కొట్టొచ్చినట్టు కనిపించే కొన్ని లోపాలు. అలాగే మంచి-మర్యాదలు లేని ప్రజల మధ్య మనం బ్రతుకుతున్నాం. కానీ మనం వాళ్లలా ఉండొద్దు. ఎందుకంటే మనం “అన్నిరకాల ప్రజల్ని” ఘనపర్చాలని, గౌరవించాలని యెహోవా కోరుకుంటున్నాడు.—1 పేతు. 2:17.

3 ఈ ఆర్టికల్‌లో ఇతరుల్ని గౌరవించడం అంటే ఏంటో, ఇతరుల్ని ఎందుకు గౌరవించాలో చూస్తాం. (1) కుటుంబ సభ్యుల్ని, (2) తోటి బ్రదర్స్‌సిస్టర్స్‌ని, (3) యెహోవాసాక్షులు కానివాళ్లను మనం ఎలా గౌరవించవచ్చో చూస్తాం. ముఖ్యంగా కష్టమైన పరిస్థితుల్లో కూడా మనం గౌరవాన్ని ఎలా చూపించవచ్చో గమనిస్తాం.

ఇతరుల్ని గౌరవించడం అంటే ఏంటి?

4. ఇతరుల్ని గౌరవించడం అంటే ఏంటి?

4 మీ దృష్టిలో గౌరవం అంటే ఏంటి? కొన్ని భాషల్లో “గౌరవానికి,” “ఘనతకు” చాలా దగ్గరి సంబంధం ఉంది. ఎలా? గౌరవం అంటే ఒక వ్యక్తిని మనం ఎలా చూస్తాం అన్నదాన్ని సూచిస్తుంది. మనం ఇతరుల్ని గౌరవించినప్పుడు, బహుశా వాళ్ల లక్షణాల్ని బట్టి, వాళ్లు సాధించిన వాటిని బట్టి లేదా వాళ్ల హోదాను బట్టి వాళ్ల ఉనికిని గుర్తిస్తాం, వాళ్లను లెక్కలోకి తీసుకుంటాం. ఘనత అంటున్నప్పుడు, ఒకవ్యక్తితో మనం ఎలా ప్రవర్తిస్తాం అన్నదాన్ని సూచిస్తుంది. మనం ఇతరుల్ని ఘనపర్చినప్పుడు, వాళ్లు విలువైనవాళ్లని, వాళ్లంటే మనకు కృతజ్ఞత ఉందని, వాళ్లకు మర్యాద ఇస్తున్నామని చూపించేలా వాళ్లతో ప్రవర్తిస్తాం. ఒకవ్యక్తి మీద మనం చూపించే గౌరవంలో, ఘనతలో నిజాయితీ ఉండాలి, అది హృదయం నుండి రావాలి.—మత్త. 15:8.

5. మనం ఎదుటివ్యక్తిని ఎందుకు గౌరవిస్తాం?

5 మనం ఎదుటివ్యక్తిని గౌరవించాలని యెహోవా కోరుకుంటున్నాడు. ఉదాహరణకు, ‘పై అధికారాల్ని’ మనం గౌరవించాలని ఆయన కోరుకుంటున్నాడు. (రోమా. 13:1, 7) కానీ కొంతమంది ఇలా అనవచ్చు: “ఎదుటివ్యక్తి మంచోడైతేనే నేను గౌరవిస్తాను.” అలా అనుకోవడం సరైనదేనా? కాదు! యెహోవా సేవకులుగా మనం ఇతరుల పనుల్నిబట్టి వాళ్లను గౌరవించం గానీ యెహోవా మీదున్న ప్రేమ, ఆయన్ని సంతోషపెట్టాలనే కోరిక వల్లే మనం అలా గౌరవిస్తాం.—యెహో. 4:14; 1 పేతు. 3:15.

6. మిమ్మల్ని గౌరవించనివాళ్లను కూడా గౌరవించడం సాధ్యమేనా? వివరించండి. (చిత్రం కూడా చూడండి.)

6 కొంతమంది ఇలా అనుకోవచ్చు: ‘నన్ను గౌరవించని వ్యక్తిని కూడా నేను గౌరవించగలనా?’ అవును. దానికి సంబంధించిన కొన్ని ఉదాహరణల్ని చూడండి. సౌలు రాజు తన కొడుకైన యోనాతానును అందరిముందు నోటికొచ్చినట్లు తిట్టాడు. (1 సమూ. 20:30-34) అయినాసరే, సౌలు చనిపోయేవరకు యోనాతాను ఆయన్ని గౌరవించాడు, నమ్మకంగా ప్రతీ యుద్ధంలో ఆయన వెన్నంటే ఉన్నాడు. (నిర్గ. 20:12; 2 సమూ. 1:23) హన్నా తాగొచ్చిందని ప్రధాన యాజకుడైన ఏలీ కసురుకున్నాడు. (1 సమూ. 1:12-14) ఒక తండ్రిగా, ప్రధాన యాజకుడిగా ఓడిపోయాడన్న చెడ్డ పేరు ఏలీకి ఉన్నాసరే, హన్నా మాత్రం ఆయనతో గౌరవంగా మాట్లాడింది. (1 సమూ. 1:15-18; 2:22-24) ఏథెన్సు వాళ్లు అపొస్తలుడైన పౌలును “వదరుబోతు” అని అవమానించారు. (అపొ. 17:18) అయినాసరే, పౌలు వాళ్లతో గౌరవంగా మాట్లాడాడు. (అపొ. 17:22) మనకు యెహోవా మీద ప్రేమ, ఆయన్ని ఎక్కడ బాధపెడతామేమో అన్న భయం ఉంటే, మనకు కష్టంగా ఉన్నా ఎదుటివ్యక్తిని ఇష్టంగా గౌరవిస్తాం. అయితే, మన గౌరవానికి ఎవరు అర్హులో, ఎందుకు అర్హులో ఇప్పుడు చూద్దాం.

యోనాతాను, సౌలు, ఇశ్రాయేలు సైనికులు తమ కత్తులతో, ఈటెలతో, డాళ్లతో యుద్ధంలో పోరాడుతున్నారు.

తన తండ్రి అవమానించినా సరే, యోనాతాను మాత్రం తన తండ్రి రాజరికానికి మద్దతు ఇచ్చాడు, ఆయనకు తోడుగా ఉన్నాడు (6వ పేరా చూడండి)


కుటుంబ సభ్యుల్ని గౌరవించండి

7. కుటుంబ సభ్యులు ఒకర్నొకరు గౌరవించుకోవడం ఎందుకు కష్టమవ్వచ్చు?

7 సవాలు. మనం ఎక్కువ సమయం కుటుంబంతోనే గడుపుతాం కాబట్టి, ప్రతీ ఒక్కరిలో ఉన్న బలాలు, బలహీనతలు ఇట్టే తెలిసిపోతాయి. పైగా ఇంట్లో అనారోగ్యంతో ఉన్నవాళ్లను చూసుకోవాలన్నా, తీవ్రమైన ఆందోళనతో బాధపడుతున్నవాళ్లను చూసుకోవాలన్నా తల ప్రాణం తోకకు రావచ్చు. ఇంకొంతమంది వాళ్ల మాటలతో, పనులతో మనల్ని బాధపెట్టవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య గౌరవం లేకపోవడం వల్ల ఇల్లు శాంతికి, సంతోషానికి నిలయంగా ఉండే బదులు, రణరంగంలా మారుతుంది. దానివల్ల ఇంట్లోవాళ్లు ఎడమొఖం, పెడమొఖంగా ఉంటారు. ఉదాహరణకు, మనకు ఏదైనా జబ్బు చేస్తే మన అవయవాలు ఒకదానికొకటి సహకరించుకోలేవు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య గౌరవం లేకపోతే వాళ్లు కూడా కలిసికట్టుగా ఉండలేరు. అయితే, మన ఒంట్లో ఉన్న జబ్బులకు మందులు ఉన్నట్టే, ఇంట్లో ఉన్న బంధాన్ని బాగుచేసుకోవడానికి కూడా గౌరవమే మందు.

8. కుటుంబ సభ్యుల్ని గౌరవించడానికి గల ముఖ్య కారణం ఏంటి? (1 తిమోతి 5:4, 8)

8 ఎందుకు గౌరవం చూపించాలి? (1 తిమోతి 5:4, 8 చదవండి.) పౌలు తిమోతికి రాసిన మొదటి ఉత్తరంలో, కుటుంబ సభ్యులు ఒకరి అవసరాల్ని ఒకరు ఎలా చూసుకోవాలో చెప్పాడు. అలాగే కుటుంబ సభ్యుల్ని గౌరవించడం అంటే, ఏదో తప్పదన్నట్లు చేయడం కాదుగానీ, అది “దైవభక్తితో” రావాలి అని చెప్పాడు. ఇక్కడ దైవభక్తి అన్నప్పుడు, దేవున్ని నమ్మకంగా ఆరాధించడాన్ని, సేవచేయడాన్ని సూచిస్తుంది. కుటుంబాన్ని ఏర్పాటు చేసింది యెహోవాయే. (ఎఫె. 3:14, 15) కాబట్టి మనం తోటి కుటుంబ సభ్యుల్ని గౌరవిస్తే, ఒక రకంగా కుటుంబాన్ని ఏర్పాటు చేసిన యెహోవాను ఘనపర్చినట్టే. (1 తిమో. 5:4.) కుటుంబ సభ్యుల్ని గౌరవించడానికి ఇంతకన్నా గొప్ప కారణం ఉంటుందా!

9. భార్యాభర్తలు ఒకర్నొకరు ఎలా గౌరవించుకోవచ్చు? (చిత్రాలు కూడా చూడండి.)

9 ఎలా గౌరవం చూపించాలి? భార్యను గౌరవించే భర్త ఆమెను ఇంటా-బయటా గాజు బొమ్మలా చూసుకుంటాడు. (సామె. 31:28; 1 పేతు. 3:7) ఆమెను కొట్టడు, తిట్టడు, ఎందుకూ పనికిరాదన్నట్టు చూడడు. అర్జెంటీనాలో ఉంటున్న ఆండ్రూa అనే బ్రదర్‌ ఇలా చెప్తున్నాడు: “నా భార్యకు ఉన్న అనారోగ్యం వల్ల ఆమె కొన్నిసార్లు నా మనసు విరిగిపోయేలా మాట్లాడుతుంది. ఆమెకున్న సమస్య వల్లే అలా మాట్లాడుతుంది గానీ, నిజంగా ఆమె అలాంటిది కాదని నేను గుర్తుచేసుకుంటాను. కొన్నిసార్లు ఇక ఆమె మాటల్ని నేను తట్టుకోలేను అనిపించినప్పుడు, 1 కొరింథీయులు 13:5 లో ఉన్న మాటల్ని గుర్తుచేసుకుంటాను. దానివల్ల ఆమెను తిట్టకుండా ఆమెతో గౌరవంగా మాట్లాడగలుగుతాను.” (సామె. 19:11) భర్తను గౌరవించే భార్య, ఇతరులతో ఆయన గురించి మంచిగా మాట్లాడుతుంది. (ఎఫె. 5:33) ఆయనతో వెటకారంగా మాట్లాడదు, వెక్కిరించదు, ఆయన మీద పిచ్చిపిచ్చి జోకులు వేయదు. అలాంటి మాటలు వాళ్ల పెళ్లి బంధాన్ని బీటలువారేలా చేస్తుందని ఆమె గుర్తిస్తుంది. (సామె. 14:1) ఇటలీలో ఉన్న ఒక సిస్టర్‌ అనుభవం చూడండి. ఆమె భర్త ఆందోళనతో బాధపడుతున్నాడు. ఆమె ఇలా చెప్తుంది: “కొన్నిసార్లు నా భర్త చాలా చిన్నచిన్న విషయాలకే బాగా గాభరాపడతాడు. గతంలోనైతే నా మాటల్లో, నా ముఖంలో ఆయన మీద ఏమాత్రం గౌరవంలేనట్టు కనిపించేది. కానీ ఇతరుల్ని గౌరవించేవాళ్లతో నేను ఎక్కువ స్నేహం చేయడం వల్ల, నా భర్తను గౌరవించడం నేర్చుకున్నాను.”

చిత్రాలు: ఒక జంట ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు. 1. కలిసి వంట చేసుకుంటున్నప్పుడు భర్త తన భార్యతో దయగా మాట్లాడుతున్నాడు.

మన కుటుంబసభ్యుల మీద గౌరవం చూపిస్తే, మన కుటుంబ పెద్దయిన యెహోవా మీద గౌరవం చూపించినట్టు అవుతుంది (9వ పేరా చూడండి)


10. పిల్లలు అమ్మానాన్నల్ని గౌరవిస్తున్నారని ఎలా చూపించవచ్చు?

10 పిల్లలారా, మీ అమ్మానాన్న పెట్టే రూల్స్‌ని పాటించండి. (ఎఫె. 6:1-3) వాళ్లతో మర్యాదగా మాట్లాడండి. (నిర్గ. 21:17) వాళ్ల వయసు పైబడుతున్నప్పుడు వాళ్లకు మీ సహాయం ఇంకా ఎక్కువ అవసరం అవుతుంది. వాళ్లను పట్టించుకోవడానికి మీరు చేయగలిగినదంతా చేయండి. మరియ అనే సిస్టర్‌ అనుభవం గమనించండి. ఆమె నాన్న యెహోవాసాక్షి కాదు. ఆయనకు జబ్బు చేసినప్పుడు మరియ ఆయన్ని ఎంతబాగా చూసుకున్నాసరే, ఆయన ఈమెను నానామాటలు అనేవాడు. దానివల్ల ఆయన్ని గౌరవించడం మరియకు కష్టమైంది. ఆమె ఇలా గుర్తుచేసుకుంటుంది: “మా నాన్న మీద గౌరవం కేవలం మనసులో ఉండడమే కాదు, దాన్ని బయటికి చూపించేలా చేయమని యెహోవాకు ప్రార్థన చేశాను. ఎందుకంటే అమ్మానాన్నల్ని గౌరవించమని యెహోవా అడుగుతున్నాడంటే, అలా గౌరవించడానికి కావాల్సిన శక్తిని కూడా ఆయనే ఇస్తాడు కదా అని నేను ఆలోచించేదాన్ని. కొంతకాలం తర్వాత, నేను మా నాన్నను గౌరవించాలంటే ఆయన మారాల్సిన పనిలేదని నాకు అర్థమైంది.” మన కుటుంబ సభ్యులు ఎలా ఉన్నాసరే, వాళ్లను గౌరవించినప్పుడు యెహోవా చేసిన కుటుంబ ఏర్పాటుకు విలువిస్తున్నామని చూపిస్తాం.

బ్రదర్స్‌సిస్టర్స్‌ మీద గౌరవం చూపించండి

11. తోటి బ్రదర్స్‌సిస్టర్స్‌ని గౌరవించడం మనకు ఎందుకు కష్టంగా అనిపించవచ్చు?

11 సవాలు. బ్రదర్స్‌-సిస్టర్స్‌ అందరూ బైబిలు ప్రమాణాల ప్రకారమే బ్రతుకుతారు. అయినాసరే, కొన్నిసార్లు వాళ్లు మనల్ని బాధపెట్టేలా మాట్లాడవచ్చు, తప్పుగా అర్థం చేసుకోవచ్చు, మనకు చిరాకు పెట్టవచ్చు. ఇలా మన బ్రదర్స్‌సిస్టర్స్‌ “మీద ఫిర్యాదు చేయడానికి కారణం” కనిపించినప్పుడు వాళ్లను గౌరవించడం మనకు కష్టంగా ఉండవచ్చు. (కొలొ. 3:13) మరి వాళ్లను గౌరవిస్తూ ఉండడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?

12. మన బ్రదర్స్‌సిస్టర్స్‌ని గౌరవించడం ఎందుకు ప్రాముఖ్యం? (2 పేతురు 2:9-12)

12 ఎందుకు గౌరవం చూపించాలి? (2 పేతురు 2:9-12 చదవండి.) మొదటి శతాబ్దంలో ఉన్న కొంతమంది క్రైస్తవులు, “గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవాళ్ల” గురించి అంటే సంఘపెద్దల గురించి అమర్యాదగా మాట్లాడారని పేతురు తన రెండో ఉత్తరంలో చెప్పాడు. మరి, అది చూస్తున్న నమ్మకమైన దేవదూతలు దానికి ఎలా స్పందించారు? ఆసక్తికరంగా, అలా మాట్లాడిన వాళ్లను దేవదూతలు “యెహోవా మీద గౌరవంవల్ల” పల్లెత్తు మాట కూడా అనలేదు. బదులుగా, గర్వంతో ఆ పని చేసినవాళ్లకు తీర్పుతీర్చి, గద్దించే పనిని యెహోవాకే వదిలేశారు. (రోమా. 14:10-12; యూదా 9తో పోల్చండి) ఆ దేవదూతల నుండి మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు. మన వ్యతిరేకులతోనే అమర్యాదగా ప్రవర్తించొద్దంటే, ఇక మన బ్రదర్స్‌సిస్టర్స్‌ విషయంలో ఆ ఆలోచన కూడా రానివ్వొద్దు! దానికి బదులు మనం మన బ్రదర్స్‌సిస్టర్స్‌ని గౌరవించే విషయంలో ‘ముందుండాలి.’ (రోమా. 12:10) అలా చేసినప్పుడు మనం యెహోవా మీద కూడా గౌరవం చూపించినట్టు అవుతుంది.

13-14. సంఘంలో వాళ్లమీద మనం ఎలా గౌరవం చూపించవచ్చో ఉదాహరణతో చెప్పండి. (చిత్రాలు కూడా చూడండి.)

13 ఎలా గౌరవం చూపించాలి? సంఘపెద్దలారా ఇతరుల్ని ప్రేమగా నడిపించండి. (ఫిలే. 8, 9) ఒకవేళ మీరు ఎవరికైనా సలహా ఇవ్వాలని అనుకుంటే, దయగా ఇవ్వండి. మీరు చిరాకులో ఉన్నప్పుడు ఇవ్వకండి. సహోదరీలారా, ఇతరుల గురించి తప్పుగా మాట్లాడకుండా లేదా లేనిపోనివి కల్పించకుండా ఉంటే, ఒకర్నొకరు గౌరవించుకునే వాతావరణాన్ని మీరు కల్పించిన వాళ్లౌతారు, కాపాడిన వాళ్లౌతారు. (తీతు 2:3-5) మనందరం కూడా సంఘపెద్దల మీద గౌరవం చూపించవచ్చు. ఎందుకంటే, వాళ్లు మీటింగ్స్‌ చేయడానికి, ప్రీచింగ్‌ని నడిపించడానికి, “తప్పటడుగు” వేసినవాళ్లకు సహాయం చేయడానికి చాలా కష్టపడతారు. వాటన్నిటికి మనం కృతజ్ఞత చూపిస్తూ, వాళ్లకు సహకరిస్తూ ఉంటే వాళ్లను గౌరవించినట్టు అవుతుంది.—గల. 6:1; 1 తిమో. 5:17.

14 తనకు సలహా ఇచ్చిన సంఘపెద్దల మీద గౌరవం చూపించడం రోసీ అనే సిస్టర్‌కి కష్టంగా అనిపించింది. ఆమె ఇలా చెప్తుంది: “ఆ సహోదరుడు నాతో కఠినంగా మాట్లాడాడు. అది నాకు నచ్చలేదు. ఇంటికి వచ్చాక నేను ఆయన గురించి తప్పుగా మాట్లాడాను. నేను బయటికి చూపించకపోయినా, ఆయన ఉద్దేశాలు సరైనవి కావని ఆయన ఇచ్చిన సలహాను నేను కొట్టిపారేశాను.” మరి రోసీకి ఏది సహాయం చేసింది? ఆమె ఇలా చెప్తుంది: “నేను బైబిలు చదువుతున్నప్పుడు 1 థెస్సలొనీకయులు 5:12, 13 వచనాల దగ్గర ఆగాను. ఆ సహోదరుని మీద నేను గౌరవం చూపించట్లేదని నాకు అర్థమైంది. దాంతో నా మనస్సాక్షి నన్ను బాధించింది. యెహోవాకు ప్రార్థన చేసుకుని, నా ఆలోచనను మార్చుకోవడానికి సరిగ్గా సరిపోయే ప్రచురణ కోసం వెదికాను. మెల్లిమెల్లిగా సమస్య ఆ బ్రదర్‌లో లేదుగానీ నాలో ఉన్న గర్వం వల్లే అని అర్థమైంది. మనకు వినయం లేకపోతే, ఇతరుల్ని గౌరవించడం కష్టంగా ఉంటుందని ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ విషయంలో నేను ఇంకా మెరుగవ్వాలి. కానీ గౌరవం చూపించడానికి నేను చేసే ప్రతీ ప్రయత్నాన్ని చూసి యెహోవా సంతోషిస్తున్నాడు అని నాకు తెలుసు.”

చిత్రాలు: ఒక పెద్ద వయసు సిస్టర్‌ బైబిలు చదువుతూ సంఘపెద్దలు ఏయే పనుల్లో కష్టపడతారో ఆలోచిస్తుంది. 1. ఒక సంఘపెద్ద మీటింగ్‌లో ప్రసంగం ఇస్తున్నాడు. 2. వీల్‌ఛైర్‌లో ఉన్న బ్రదర్‌కి సహాయం చేస్తున్నాడు. 3. రాజ్యమందిరం బయట కురిసిన మంచును శుభ్రం చేస్తున్నాడు.

పెద్దలకు సహకరించడం ద్వారా, వాళ్ల కష్టానికి కృతజ్ఞతలు చెప్పడం ద్వారా వాళ్లను గౌరవిస్తున్నామని చూపించవచ్చు (13-14 పేరాలు చూడండి)


యెహోవాసాక్షులుకాని వాళ్లమీద గౌరవం చూపించండి

15. యెహోవాసాక్షులుకాని వాళ్లమీద గౌరవం చూపించడం మనకు ఎందుకు కష్టంగా ఉండవచ్చు?

15 సవాలు. ప్రీచింగ్‌లో దేవుడన్నా, బైబిలన్నా పట్టించుకోని ప్రజల్ని మనం కలుస్తుంటాం. (ఎఫె. 4:18) వాళ్లలో కొంతమంది పుట్టిపెరిగిన పరిస్థితుల్ని బట్టి అలా ఉంటారు. అలాగే మనం ఎంత కష్టపడి పనిచేసినా మెచ్చుకోని బాసుల్ని లేదా స్కూలు టీచర్లని మనం చూస్తాం. అలాగే మనతోపాటు పనిచేసేవాళ్లతో, చదువుకునేవాళ్లతో మనం ఎంత మంచిగా ఉన్నాసరే, వాళ్లు మనతో దురుసుగా ప్రవర్తిస్తూ ఉండవచ్చు. వీటన్నిటినిబట్టి మెల్లిమెల్లిగా వాళ్లమీద మనకున్న గౌరవం తగ్గుతూ ఉండవచ్చు.

16. యెహోవాసాక్షులుకాని వాళ్లమీద కూడా గౌరవం చూపించడం ఎందుకు ప్రాముఖ్యం? (1 పేతురు 2:12; 3:15)

16 ఎందుకు గౌరవం చూపించాలి? యెహోవాసాక్షులుకాని వాళ్లతో మనం ఎలా ఉంటున్నామో యెహోవా గమనిస్తాడని గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుల మంచి ప్రవర్తన చూసి కొంతమందైనా దేవున్ని ‘మహిమపరుస్తారని’ అపొస్తలుడైన పేతురు చెప్పాడు. వాళ్లు తమ విశ్వాసం గురించి వేరేవాళ్లకు చెప్తున్నప్పుడు “సౌమ్యంగా, ప్రగాఢ గౌరవంతో” చెప్పాలని సలహా ఇచ్చాడు. (1 పేతురు 2:12; 3:15 చదవండి.) క్రైస్తవులు తమ నమ్మకాల గురించి అధికారులతో, పొరుగువాళ్లతో మాట్లాడుతున్నప్పుడు, యెహోవా వాళ్ల పక్కనుంటే వాళ్లు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడాలి. ఎందుకంటే వాళ్లు ఏం మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో యెహోవా చూస్తున్నాడు, వింటున్నాడు. యెహోవాసాక్షులుకాని వాళ్లమీద మనం గౌరవం చూపించడానికి ఎంత గొప్ప కారణం ఉందో కదా!

17. యెహోవాసాక్షులుకాని వాళ్లను గౌరవిస్తున్నామని ఎలా చూపించవచ్చు?

17 ఎలా గౌరవం చూపించాలి? ప్రీచింగ్‌లో బైబిలు గురించి అంతగా తెలియనివాళ్లను చిన్నచూపు చూసేలా మాట్లాడం, ప్రవర్తించం. బదులుగా, యెహోవాకు వాళ్లు కూడా విలువైనవాళ్లని, మనకన్నా గొప్పవాళ్లని ఎంచుతాం. (హగ్గ. 2:7; ఫిలి. 2:3) ఒకవేళ మన నమ్మకాల్ని బట్టి ఎవరైనా మనల్ని అవమానిస్తే, మనం తిరిగి వాళ్లను ఏదోకటి అనకుండా ఉంటాం. ఉదాహరణకు, మనమేదో తెలివైనవాళ్లమని, వాళ్లేదో తెలివితక్కువవాళ్లని చూపించేలా వెటకారంగా మాట్లాడం. (1 పేతు. 2:23) ఒకవేళ మనం తప్పుగా ఏదైనా మాట్లాడితే వెంటనే క్షమాపణ అడగాలి. మనం పనిచేసే చోట గౌరవాన్ని ఎలా చూపించవచ్చు? కష్టపడి పనిచేసేవాళ్లుగా ఉండండి. మీ తోటి పనివాళ్లలో అలాగే మీ పైఅధికారుల్లో మంచినే చూస్తూ ఉండండి. (తీతు 2:9, 10) మీరు నిజాయితీగా మనసుపెట్టి కష్టపడి పనిచేస్తే మనుషులు సంతోషిస్తారో లేదోగానీ, యెహోవా మాత్రం ఖచ్చితంగా సంతోషిస్తాడు.—కొలొ. 3:22, 23.

18. ఇతరుల మీద గౌరవాన్ని పెంచుకోవడం, దాన్ని చేతల్లో చూపించడం ఎందుకు మంచిది?

18 ఇతరులమీద గౌరవాన్ని పెంచుకోవడానికి, దాన్ని చేతల్లో చూపించడానికి మనకు చాలా మంచి కారణాలు ఉన్నాయి కదా. మనం ఈ ఆర్టికల్‌లో చూసినట్టు మన కుటుంబ సభ్యుల్ని గౌరవిస్తే, మన కుటుంబ పెద్దయిన యెహోవాను గౌరవించినట్టే. మనతోటి బ్రదర్స్‌సిస్టర్స్‌ని గౌరవిస్తే మన పరలోక తండ్రైన యెహోవాను గౌరవించినట్టే. యెహోవాసాక్షులుకాని వాళ్లను గౌరవించినప్పుడు వాళ్లు ఏదోకరోజు మన గొప్ప దేవున్ని మహిమపర్చి, ఘనపర్చే సువర్ణ అవకాశాన్ని కల్పించిన వాళ్లమౌతాం. ఒకవేళ ఇతరులు మనల్ని తిరిగి గౌరవించకపోయినాసరే, మనం మాత్రం వాళ్లను గౌరవిస్తూ ఉండడం ప్రాముఖ్యం. అలాచేస్తే యెహోవా మనల్ని దీవిస్తాడు. ఆయనిలా మాటిచ్చాడు: “నన్ను ఘనపర్చేవాళ్లను నేను ఘనపరుస్తాను.”—1 సమూ. 2:30.

మీరెలా జవాబిస్తారు?

  • కుటుంబ సభ్యుల్ని గౌరవిస్తున్నామని మనం ఎలా చూపించవచ్చు?

  • తోటి బ్రదర్స్‌సిస్టర్స్‌ని గౌరవిస్తున్నామని మనం ఎలా చూపించవచ్చు?

  • యెహోవాసాక్షులుకాని వాళ్లను గౌరవిస్తున్నామని మనం ఎలా చూపించవచ్చు?

పాట 129 సహనం చూపిస్తూ ఉందాం

a కొన్ని పేర్లను మార్చాం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి