కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 సెప్టెంబరు పేజీలు 8-13
  • అన్యాయం జరిగితే ఏం చేయాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అన్యాయం జరిగితే ఏం చేయాలి?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాకు, యేసుకు అన్యాయం అంటే పరమ అసహ్యం
  • అన్యాయం చూసినప్పుడు యేసు ఏం చేశాడు?
  • అన్యాయం జరిగితే యేసులా ఉండండి
  • దేవుని రాజ్యం న్యాయం తీర్చేవరకు మనం ఏం చేయవచ్చు?
  • అన్యాయాన్ని సహించడం ఎలా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • అన్యాయాన్ని మీరు సహించగలరు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • దేవుడు అన్యాయమును గూర్చి ఎప్పుడైన ఏమైన చేస్తాడా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 సెప్టెంబరు పేజీలు 8-13

అధ్యయన ఆర్టికల్‌ 37

పాట 114 ఓర్పు చూపించండి

అన్యాయం జరిగితే ఏం చేయాలి?

“ఆయన న్యాయం కోసం చూస్తూ వచ్చాడు, కానీ అన్యాయమే కనిపించింది!”—యెష. 5:7.

ముఖ్యాంశం

అన్యాయం జరిగినప్పుడు యేసు ఏం చేశాడో తెలుసుకుంటాం. మనం ఆయన్ని అనుకరిస్తూ యెహోవాను ఎలా సంతోషపెట్టవచ్చో చూస్తాం.

1-2. అన్యాయం గురించి చాలామందికి ఎలా అనిపిస్తుంది? మనకు ఏ ప్రశ్న రావచ్చు?

అన్యాయం పేట్రేగిపోతున్న లోకంలో మనం జీవిస్తున్నాం. ప్రజలకు చాలా కారణాలవల్ల అన్యాయం జరుగుతుంది. ఆస్తి-అంతస్తూ, రంగు-రూపం, జాతి-ప్రాంతం ఇలా చాలా కారణాలవల్ల ప్రజలు అన్యాయానికి గురౌతున్నారు. అంతేకాకుండా, అత్యాశాపరులైన వ్యాపారస్థుల వల్ల, అవినీతిపరులైన అధికారుల వల్ల కూడా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి అన్యాయాల వల్ల మనలో ప్రతీఒక్కరికి నష్టం జరుగుతూనే ఉంది.

2 చుట్టూ జరుగుతున్న అన్యాయం చూసి చాలామంది కోపంతో రగిలిపోతున్నారు. తనా-మనా అనే తేడా లేని ప్రపంచం కావాలని అందరం కోరుకుంటాం. అయితే, దానికోసం కొంతమంది ధర్నాలు-ఉద్యమాలు చేస్తారు, న్యాయం చేస్తామని మాటిచ్చే నాయకుల్ని నమ్ముకుంటారు. కానీ క్రైస్తవులుగా మనం ఈ “లోకసంబంధులం” కాదు. అన్యాయాన్నంతటినీ తీసేసే దేవుని రాజ్యం కోసం మనం ఎదురుచూస్తున్నాం. (యోహా. 17:16) అయినాసరే, మన కళ్లముందు అన్యాయం జరిగితే మన రక్తం మరిగిపోతుంది. అయితే, మనకు ఇలా అనిపించవచ్చు: ‘అన్యాయం జరిగితే నేనేం చేయాలి? అన్యాయాన్ని ఎదిరించడానికి ఇప్పుడే నేనేమైనా చేయగలనా?’ ఈ ప్రశ్నలకు జవాబులు తెలియాలంటే ముందు అన్యాయాన్ని యెహోవా, యేసు ఎలా చూస్తున్నారో గమనిద్దాం.

యెహోవాకు, యేసుకు అన్యాయం అంటే పరమ అసహ్యం

3. అన్యాయం అనగానే మనకు ఎందుకు కోపం రావచ్చు? (యెషయా 5:7)

3 అన్యాయం అనగానే మనకు ఎందుకు కోపం వస్తుందో బైబిలు ఒక కారణం చెప్తుంది. మనం ‘నీతిన్యాయాల్ని ప్రేమించే’ యెహోవా స్వరూపంలో చేయబడ్డామని బైబిలు చెప్తుంది. (కీర్త. 33:5; ఆది. 1:26) యెహోవా ఎప్పుడూ అన్యాయం చేయడు. ఎవరైనా అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోడు. (ద్వితీ. 32:3, 4; మీకా 6:8; జెక. 7:9) ఉదాహరణకు, యెషయా ప్రవక్త కాలంలో చాలామంది ఇశ్రాయేలీయులు తోటి ఇశ్రాయేలీయులకు అన్యాయం చేశారు. అలా అన్యాయానికి గురైనవాళ్ల ‘రోదనను’ యెహోవా విన్నాడు. (యెషయా 5:7 చదవండి.) అదేపనిగా తన నియమాల్ని మీరి, వేరేవాళ్లకు అన్యాయం చేసేవాళ్లను శిక్షించకుండా ఆయన వదిలిపెట్టలేదు.—యెష. 5:5, 13.

4. ఏ సంఘటన బట్టి యేసుకు అన్యాయం అంటే అసహ్యం అని చెప్పవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

4 యెహోవాలాగే యేసుకు న్యాయం అంటే ఇష్టం, అన్యాయం అంటే అసహ్యం. ఆయన భూమ్మీదున్నప్పుడు ఒక సందర్భంలో, చచ్చుబడిన చేయి ఉన్న ఒక వ్యక్తిని చూశాడు. అతన్ని చూశాక ఏదోక సహాయం చేయాలనిపించి యేసు అతన్ని బాగుచేశాడు. దయాదాక్షిణ్యాలు లేని మతనాయకులు మాత్రం అది చూసి ఓర్వలేకపోయారు. వాళ్లు సబ్బాతు నియమాన్ని పట్టుకు వేలాడారే గానీ, ఆ వ్యక్తి బాగయ్యాడనే విషయాన్ని మాత్రం పట్టించుకోలేదు. ఆ మతనాయకుల్ని చూసి యేసుకు ఎలా అనిపించింది? “వాళ్ల హృదయాలు ఎంత కఠినంగా ఉన్నాయో చూసి ఆయన చాలా బాధపడ్డాడు.”—మార్కు 3:1-6.

యేసు సమాజమందిరంలో ఉన్నాడు. చచ్చుబడిన చేయి ఉన్న వ్యక్తిని బాగుచేసే ముందు, అతని గురించి యూదా మతనాయకులతో యేసు మాట్లాడాడు. ఆ మతనాయకులు యేసును హీనంగా చూస్తున్నారు.

అవసరంలో ఉన్నవాళ్లను యేసు అర్థంచేసుకున్నాడు కానీ మతనాయకులు అర్థం చేసుకోలేదు (4వ పేరా చూడండి)


5. అన్యాయం చూసినప్పుడు మనకు కోపం వచ్చినా మనం ఏ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి?

5 అన్యాయం చూస్తే యెహోవాకు, యేసుకు కోపం వచ్చిందంటే మనకు కూడా రావడంలో తప్పులేదు. (ఎఫె. 4:26) కానీ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, మన కోపంలో న్యాయం ఉన్నాసరే, అది అన్యాయానికి పరిష్కారం మాత్రంకాదు. నిజానికి, మనం కోపాన్ని ఎక్కువకాలం ఉంచుకుంటే అది మన కొంపే ముంచుతుంది! అది మన ఆరోగ్యాన్ని పాడుచేసి, లేనిపోని రోగాల్ని తెచ్చిపెడుతుంది. (కీర్త. 37:1, 8; యాకో. 1:20) మరి, అన్యాయం జరిగితే మనం ఏం చేయాలి? ఏం చేయాలో యేసు నుండి నేర్చుకుందాం.

అన్యాయం చూసినప్పుడు యేసు ఏం చేశాడు?

6. యేసు భూమ్మీద ఉన్నప్పుడు ఎలాంటి అన్యాయాల్ని చూశాడు? (చిత్రం కూడా చూడండి.)

6 యేసు భూమ్మీదున్నప్పుడు పెద్దపెద్ద అన్యాయాల్నే చూశాడు. మతనాయకులు లేనిపోని నియమాలు పెట్టి ప్రజల్ని, వాళ్ల జీవితాల్ని నలగ్గొట్టడం ఆయన చూశాడు. (మత్త. 23:2-4) రోమా అధికారులు ప్రజలతో ఎంత కఠినంగా వ్యవహరించేవాళ్లో కూడా ఆయనకు తెలుసు. చాలామంది యూదులు రోమన్ల నుండి స్వతంత్రం కోరుకున్నారు. మతపిచ్చి పట్టిన కొంతమంది యూదులైతే ఆ స్వతంత్రం కోసం పోరాడారు కూడా. కానీ యేసు మాత్రం సమాజంలో అలాంటి మార్పు తేవాలని గానీ, అలా తేవాలనుకున్నవాళ్లకు మద్దతివ్వడం గానీ చేయలేదు. ఒకసారైతే ప్రజలు తనను రాజుగా చేయాలని చూసినప్పుడు యేసు వాళ్లనుండి పారిపోయాడు.—యోహా. 6:15.

యేసు ఒక్కడే ఎత్తైన కొండ పైకి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ కొండ అడుగున చాలామంది ప్రజలు గుమికూడారు.

అప్పట్లో ప్రజలు తనను రాజుగా చేయాలని చూసినప్పుడు యేసు పారిపోయాడు (6వ పేరా చూడండి)


7-8. భూమ్మీద ఉన్నప్పుడు యేసు అన్యాయాన్ని ఎందుకు పూర్తిగా తీసేయలేదు? (యోహా. 18:36)

7 యేసు భూమ్మీద ఉన్నప్పుడు అన్యాయాన్ని తీసేయడానికి రాజకీయాల్లోకి వెళ్లలేదు. ఎందుకు? తమనుతాము పరిపాలించుకునే హక్కు గానీ, సామర్థ్యం గానీ మనుషులకు లేదని ఆయనకు తెలుసు. (కీర్త. 146:3; యిర్మీ. 10:23) అంతేకాదు, అన్యాయానికి మూలకారణాలైన సాతానును, అపరిపూర్ణతను తీసేయడం మనుషుల తరం కాదు. ఈ లోకం సాతాను చేతుల్లో ఉంది, అతను చాలా క్రూరుడు. అతని చెప్పుచేతల్లో ఉన్న మనుషుల్ని ఉపయోగించుకుని ఈ లోకాన్ని అన్యాయంతో నింపేస్తున్నాడు. (యోహా. 8:44; ఎఫె. 2:2) దానికితోడు మనుషుల్లో కొంతమంది ఎంత మంచివాళ్లయినా సరే, అపరిపూర్ణత కారణంగా అందరికీ, అన్నిసార్లు న్యాయం చేయడం సాధ్యంకాదు.—ప్రసం. 7:20.

8 దేవుని రాజ్యం అన్యాయాన్ని కూకటివేళ్లతోసహా తీసేస్తుందని యేసుకు తెలుసు. అందుకే ఆయన తన సమయాన్ని, శక్తిని “దేవుని రాజ్యం గురించిన మంచివార్త” ప్రకటించడానికే ధారపోశాడు. (లూకా 8:1) అంతేకాదు, “నీతి కోసం ఆకలిదప్పులు గలవాళ్లు” అవినీతి, అన్యాయం కనిపించని కాలాన్ని చూస్తారని యేసు మాటిచ్చాడు. (మత్త. 5:6; లూకా 18:7, 8) అయితే, ఇది మనుషులందరూ తలా ఓ చెయ్యి వేస్తే జరిగే పనికాదు. లోకంతో సంబంధంలేని దేవుని పరలోక ప్రభుత్వం వల్లే సాధ్యం!—యోహాను 18:36 చదవండి.

అన్యాయం జరిగితే యేసులా ఉండండి

9. దేవుని రాజ్యం మాత్రమే అన్యాయాన్నంతటినీ తీసేస్తుందని మీరెందుకు నమ్ముతున్నారు?

9 యేసు భూమ్మీద ఉన్నప్పుడు చూసిన అన్యాయం కంటే, ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ అన్యాయాన్ని చూస్తున్నాం. అయితే, అప్పుడూ-ఇప్పుడూ అన్యాయానికి మూలం మాత్రం మారలేదు. సాతాను అతని చెప్పుచేతల్లో ఉన్న అపరిపూర్ణ మనుషులే అన్యాయానికి కారణం. (2 తిమో. 3:1-5, 13; ప్రక. 12:12) అయితే, దేవుని రాజ్యం మాత్రమే అన్యాయానికి చరమగీతం పాడుతుందని యేసులాగే మనకూ తెలుసు. మనం దేవుని రాజ్యానికి పూర్తిగా మద్దతిస్తాం. కాబట్టి ఈ లోకం చేసే పోరాటాల్లో గళం కలపం, ధర్నాల్లో చేతులు కలపం, ఉద్యమాల్లో అడుగులు వేయం. శాంతిa అనే సిస్టర్‌ అనుభవం గమనించండి. ఆమె సత్యం తెలుసుకోవడానికి ముందు న్యాయం కోసం ఉద్యమ పోరాటాలు చేస్తూ ఉండేది. కానీ ఆమె చేసేది సరైనదో కాదో అనే అనుమానం ఆమెకు వచ్చింది. ఆమె ఇలా చెప్తుంది: “మేము ఉద్యమాలు చేస్తున్నప్పుడు నేను సరైన వైపే ఉన్నానా అనిపించేది. కానీ ఇప్పుడు దేవుని రాజ్యానికి మద్దతిస్తున్నాను కాబట్టి నేను సరైన వైపే ఉన్నాను అని నాకు తెలుసు. అన్యాయానికి గురైన బాధితులకు యెహోవా నాకన్నా ఎక్కువ న్యాయం చేయగలుగుతాడని నాకు తెలుసు.”—కీర్త. 72:1, 4.

10. ఈరోజుల్లో జరిగే ధర్నాలు, ఉద్యమాలు మత్తయి 5:43-48 లో యేసు చెప్పిన సలహాకు విరుద్ధంగా ఎలా ఉన్నాయి? (చిత్రం కూడా చూడండి.)

10 ఈరోజుల్లో చాలామంది, ప్రభుత్వాల్ని కూలగొట్టడానికి ప్రయత్నించే గుంపుల్లో చేరి ధర్నాలు, ఉద్యమాలు చేస్తున్నారు. వాటి ముసుగులో కోపం, ద్వేషం, చట్టవిరుద్ధమైన పనులు ఉంటాయి. అలాగే వాటివల్ల వేరేవాళ్లకు కూడా హాని కలుగుతుంది. కానీ యేసు నేర్పించింది అదికాదు కదా! (ఎఫె. 4:31) జెఫ్రీ అనే బ్రదర్‌ ఇలా చెప్తున్నాడు: “నేను గమనించినంతవరకు, చాలా ప్రశాంతంగా మొదలైన ఉద్యమాలు కూడా రెప్పపాటున కొట్లాటలకు, దోపిడీలకు దారితీశాయి.” కానీ ప్రజలందర్నీ, ఆఖరికి మనల్ని హింసించే శత్రువుల్ని కూడా ప్రేమించాలని యేసు నేర్పించాడు. (మత్తయి 5:43-48 చదవండి.) కాబట్టి క్రైస్తవులుగా మనం యేసు చూపించిన దారి నుండి పక్కదారి పట్టకుండా చూసుకోవాలి.

రోడ్డు మీద ఒక గుంపు ధర్నా చేస్తుంటే, ఒక సిస్టర్‌ అటువైపు చూడకుండా ప్రశాంతంగా ముందుకు నడుస్తుంది.

మనకాలంలో లోకానికి వేరుగా ఉండాలంటే చాలా ధైర్యం అలాగే తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలనే పట్టుదల ఉండాలి (10వ పేరా చూడండి)


11. కొన్నిసార్లు యేసులా ఉండడం మనకు ఎందుకు కష్టంగా ఉండవచ్చు?

11 ఇప్పుడున్న అన్యాయమంతటికీ దేవుని రాజ్యమే శాశ్వత పరిష్కారమని మనకు తెలిసినా, మనకు అన్యాయం జరిగినప్పుడు యేసులా ఉండడం కష్టంగా ఉండవచ్చు. జాను అనే సిస్టర్‌కి ఏం జరిగిందో ఆలోచించండి. ఆమె రంగు, రూపాన్నిబట్టి ఆమెను చిన్నచూపు చూసేవాళ్లు. ఆమె ఇలా ఒప్పుకుంటుంది: “నాకు చాలా బాధేసింది. అలాగే విపరీతమైన కోపం వచ్చి వాళ్లను ఏదోకటి చేసేవరకు నా కోపం చల్లారదు అనిపించింది. అప్పుడే జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో చేరాలనే ఆలోచన వచ్చింది. నా కోపాన్ని చూపించడానికి ఇదే మంచి పద్ధతి అనుకున్నాను.” కానీ కొంతకాలానికి జాను తన ఆలోచనలో మార్పులు చేసుకోవాలని అనుకుంది. ఆమె ఇలా చెప్తుంది: “నన్నూ, నా ఆలోచనల్ని ఎవరో కంట్రోల్‌ చేస్తున్నట్టు నాకు అనిపించింది. నేను యెహోవాను కాకుండా మనుషుల్ని నమ్ముతున్నానని అనిపించింది. దాంతో ఇక ఆ గుంపుతో తెగతెంపులు చేసుకున్నాను.” బహుశా మన కోపంలో కూడా న్యాయం ఉండవచ్చేమో గానీ, ఆ కోపం వల్ల ఈ లోక రాజకీయాల్లో లేదా సమాజంలో జరుగుతున్న ఏదోక పోరాటంలో ఎవ్వరి పక్షం ఉండకుండా జాగ్రత్తపడాలి.—యోహా. 15:19.

12. మనం ఏం చదువుతున్నామో, ఏం చూస్తున్నామో, ఏం వింటున్నామో ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలి?

12 మనకు అన్యాయం జరిగినా లేదా మన కళ్లముందు అన్యాయం జరిగినా మన కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి ఏం చేయవచ్చు? మనం చేయాల్సిన ఒక పని ఏంటంటే, మనం ఏం చదువుతున్నామో, ఏం చూస్తున్నామో, ఏం వింటున్నామో జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. సమాజంలో జరిగే అన్యాయాల్ని సోషల్‌ మీడియా కొన్నిసార్లు వైరల్‌ చేయవచ్చు. దానివల్ల, వాటికి వ్యతిరేకంగా నినాదాలు మొదలవ్వవచ్చు. కొంతవరకు వార్తల్లో కూడా గోరంత అన్యాయాన్ని కొండంత చేసి చూపించవచ్చు. కొన్నిసార్లు నిజంగానే అన్యాయం జరిగినా, దానిగురించే ఆలోచిస్తూ కూర్చుంటే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? పొద్దునలేస్తే వాటిగురించే చదువుతూ, చూస్తూ, వింటూ కూర్చుంటే అనవసరమైన చిరాకు, నిరుత్సాహం తప్ప ఒరిగేదేమీ లేదు. (సామె. 24:10) అంతకన్నా ఘోరమైన విషయం ఏంటంటే, అలాంటి సమాచారం దేవుని రాజ్యమే అన్యాయమంతటికీ పరిష్కారం అనే సత్యాన్ని మసకబారేలా చేస్తుంది.

13. అన్యాయాన్ని తట్టుకోవడానికి ప్రతీరోజు బైబిలు చదవడం ఎలా సహాయం చేస్తుంది?

13 ప్రతీరోజు బైబిలు చదివి, చదివిన దానిగురించి లోతుగా ఆలోచించే అలవాటు మనకు ఉంటే అన్యాయాన్ని తట్టుకోగలుగుతాం. ఆలియా అనే సిస్టర్‌ అనుభవం చూడండి. తన ఇంటిదగ్గర ఉన్నవాళ్లందర్నీ, వేరేవాళ్లు తక్కువగా చూసి, దురుసుగా ప్రవర్తించేవాళ్లు. అలాంటివాళ్లకు శిక్షపడట్లేదని ఆలియాకు చాలా కోపం వచ్చేది. ఆమె ఇలా చెప్తుంది: “నాకు కోపం వచ్చినప్పుడు ఇలా ఆలోచించాను, ‘ఈ సమస్యలన్నిటినీ యెహోవా పరిష్కరిస్తాడని నేను నిజంగా నమ్ముతున్నానా?’ సరిగ్గా అప్పుడే, నేను యోబు 34:22-29 వచనాలు చదివాను. యెహోవా నుండి ఎవ్వరూ దాక్కోలేరని ఆ వచనాలు నాకు గుర్తు చేశాయి. యెహోవా మాత్రమే పూర్తి న్యాయం చేస్తాడని, విషయాలన్నిటినీ ఆయనే సరిచేస్తాడని నేను అర్థం చేసుకున్నాను.” అవును, దేవుని రాజ్యం నిజమైన న్యాయం తీసుకొచ్చేంత వరకు మనం ఈ అన్యాయాలతో నెట్టుకురావాల్సిందే. మరి దాన్నెలా చేయవచ్చు?

దేవుని రాజ్యం న్యాయం తీర్చేవరకు మనం ఏం చేయవచ్చు?

14. అన్యాయాన్ని ఎదుర్కోడానికి మనం చేయాల్సిన పనేంటి? (కొలొస్సయులు 3:10, 11)

14 మనం ప్రజల్ని మార్చడం, వాళ్లు చేసే అన్యాయాల్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ ఆ అన్యాయానికి ఎలా స్పందించాలనేది మాత్రం మన చేతుల్లోనే ఉంది. ఈ ఆర్టికల్‌లో మనం ముందే మాట్లాడుకున్నట్లు మనం యేసులా ప్రేమ చూపించాలి. మనకు ప్రజలమీద ప్రేమ ఉంటే అందరితో దయగా ఉంటాం. మనకు అన్యాయం చేసేవాళ్లకు కూడా చెడు జరగాలని కోరుకోం. (మత్త. 7:12; రోమా. 12:17) మనం తనా-మనా అనే తేడా లేకుండా అందర్నీ సమానంగా చూస్తే యెహోవాకు నచ్చుతుంది.—కొలొస్సయులు 3:10, 11 చదవండి.

15. బైబిల్లోని సత్యం ప్రజల్లో ఏ మార్పు తెస్తుంది?

15 అన్యాయాన్ని తట్టుకోవడానికి మనం చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే, ఇతరులకు బైబిల్లోని సత్యాలు నేర్పించడం. ఎందుకంటే, “యెహోవా గురించిన జ్ఞానం” ఒకప్పుడు క్రూరంగా, కోపంగా ఉన్న మనిషిని కూడా ప్రేమకు నిలువెత్తు రూపంలా మారుస్తుంది. (యెష. 11:6, 7, 9) సత్యం తెలుసుకోవడానికి ముందు జేమ్స్‌ అనే బ్రదర్‌, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసే గుంపులో చేరాడు. ఎందుకంటే ప్రభుత్వం ప్రజల్ని అణచివేస్తుందని ఆయన అనుకున్నాడు. ఆయనిలా చెప్పాడు: “పోరాటంతో మనుషుల్లో మార్పు తేవడం అసాధ్యం. కానీ బైబిలు సత్యం ఒక వ్యక్తిని మారుస్తుంది. దానికి నేనే తిరుగులేని రుజువు.” జేమ్స్‌ నేర్చుకున్నదాన్నిబట్టి పోరాటాలు చేయడం ఆపేశాడు. అవును, బైబిలు సత్యం నేర్చుకునేవాళ్లు ఎంత ఎక్కువైతే, అన్యాయం చేసేవాళ్లు అంత తక్కువ అవుతారు.

16. దేవుని రాజ్యం గురించి మీరు ఎందుకు వేరేవాళ్లకు చెప్పాలని అనుకుంటున్నారు?

16 యేసులాగే మనం కూడా అన్యాయానికి, దేవుని రాజ్యం మాత్రమే ఏకైక పరిష్కారం అనే విషయం ప్రజలకు చెప్పడానికి ముందుంటాం. ఆ మాటలు, అన్యాయానికి బలైనవాళ్లకు ఒక కొత్త ఆశను పుట్టిస్తాయి. (యిర్మీ. 29:11) పైన మాట్లాడుకున్న శాంతి అనే సిస్టర్‌ ఇలా చెప్తుంది: “నేను చూసిన అన్యాయాల్ని, నాకు జరిగిన అన్యాయాల్ని తట్టుకోవడానికి బైబిలు సత్యం సహాయం చేసింది. యెహోవా బైబిలు ఉపయోగించి మనకు ఓదార్పునిస్తాడు.” బైబిల్లో అన్యాయానికి ఉన్న పరిష్కారం గురించి చెప్పి ఇతరుల్ని ఓదార్చండి. ఈ ఆర్టికల్‌లో మనం చూసిన లేఖనాల్లో సత్యం ఉందని మనం ఎంతగట్టిగా నమ్మితే, వాటిగురించి వేరేవాళ్లకు చెప్పడానికి మనం అంత సిద్ధంగా ఉంటాం. అది స్కూల్లో కావచ్చు, మన పని స్థలంలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు.b

17. ఇప్పుడున్న అన్యాయాల్ని తట్టుకోవడానికి యెహోవా ఏం చేస్తున్నాడు?

17 సాతాను ఈ ‘లోక పరిపాలకునిగా’ ఉన్నంతకాలం, మనకు అన్యాయం జరుగుతూనే ఉంటుందని మనకు తెలుసు. అంతమాత్రాన, సాతాను ‘బయటికి తోసేయబడే’ వరకు మనకు ఏ సహాయం గానీ, ఏ ఆశా గానీ లేదని కాదు. (యోహా. 12:31) ఇంత అన్యాయం ఎందుకుందో, అన్యాయం వల్ల మనకు కలిగే బాధను చూసి యెహోవా ఎంత నలిగిపోతున్నాడో లేఖనాల్ని ఉపయోగించి ఆయన మనకు చెప్తున్నాడు. (కీర్త. 34:17-19) ఇప్పుడు మనకు జరిగే అన్యాయాల్ని ఎలా తట్టుకోవాలో, త్వరలోనే తన రాజ్యం ద్వారా ఈ అన్యాయాలన్నిటినీ కంటికి కనిపించకుండా తన కుమారున్ని ఉపయోగించుకొని ఎలా తీసేస్తాడో యెహోవా చెప్పాడు. (2 పేతు. 3:13) కాబట్టి, రాజ్యం గురించిన మంచివార్తను ఉత్సాహంగా ప్రకటిస్తూ ఉందాం. “నీతిన్యాయాలు” నిండిపోయే లోకం కోసం వేయికళ్లతో ఎదురుచూద్దాం!—యెష. 9:7.

మీరెలా జవాబిస్తారు?

  • అన్యాయం జరిగినప్పుడు మనకు ఎందుకు కోపం వస్తుంది?

  • అన్యాయానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో మనం ఎందుకు చెయ్యి కలపం?

  • మనకు అన్యాయం జరిగినప్పుడు లేదా మన కళ్లముందు అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేయవచ్చు?

పాట 158 ఆలస్యంకాని రాజ్యం కోసం ఓర్పుగా ఎదురుచూడండి!

a కొన్ని పేర్లను మార్చాం.

b ప్రజల్ని ప్రేమిద్దాం​—శిష్యుల్ని చేద్దాం అనే బ్రోషుర్‌లోని అనుబంధం Aలో 24-27 పాయింట్స్‌ని కూడా చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి