కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 సెప్టెంబరు పేజీలు 20-25
  • “సరైన హృదయ స్థితి ఉన్నవాళ్లకు” సహాయం చేయండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “సరైన హృదయ స్థితి ఉన్నవాళ్లకు” సహాయం చేయండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మంచివార్త మీద ఆసక్తి చూపించేవాళ్లకు ఎలా సహాయం చేయవచ్చు?
  • బైబిలు స్టడీ మొదలైనప్పుడు
  • కొత్తవాళ్లు మీటింగ్‌కి వచ్చినప్పుడు
  • ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
    2025-2026 ప్రాంతీయ సమావేశ కార్యక్రమం, ప్రాంతీయ పర్యవేక్షకునితో
  • పరిచర్యలో మీ ‘బోధనా కళను’ సానబెట్టుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • ప్రీచింగ్‌లో బోలెడంత సంతోషాన్ని సొంతం చేసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • యెహోవా మీద ఆధారపడుతున్నామని చూపించే నిర్ణయాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 సెప్టెంబరు పేజీలు 20-25

అధ్యయన ఆర్టికల్‌ 39

పాట 54 ఇదే త్రోవ

“సరైన హృదయ స్థితి ఉన్నవాళ్లకు” సహాయం చేయండి

“శాశ్వత జీవితం పొందడానికి సరైన హృదయ స్థితి ఉన్నవాళ్లందరూ విశ్వాసులయ్యారు.”—అపొ. 13:48, అధస్సూచి.

ముఖ్యాంశం

ప్రజలకు బైబిలు స్టడీ గురించి చెప్పడం, వాళ్లను మీటింగ్స్‌కి ఆహ్వానించడం చాలా ప్రాముఖ్యం.

1. ప్రీచింగ్‌ చేస్తున్నప్పుడు ప్రజలు మంచివార్తకు ఎలా స్పందిస్తారు? (అపొస్తలుల కార్యాలు 13:47, 48; 16:14, 15)

మొదటి శతాబ్దంలో చాలామంది ప్రజలు మంచివార్త గురించి వినీవినగానే సత్యంలోకి వచ్చారు. (అపొస్తలుల కార్యాలు 13:47, 48; 16:14, 15 చదవండి.) మన కాలంలో కూడా మంచివార్తను మొదటిసారి వినగానే కొంతమంది చాలా సంతోషిస్తారు. ఇంకొంతమందేమో, మొదట్లో అంత ఆసక్తి చూపించకపోయినా తర్వాత్తర్వాత ఆసక్తి చూపిస్తారు. మరి ప్రీచింగ్‌ చేస్తున్నప్పుడు, “సరైన హృదయ స్థితి” గలవాళ్లు కలిస్తే మనం ఏం చేయాలి?

2. శిష్యుల్ని చేసే పనిని, ఒక తోటమాలి చేసే పనితో ఎందుకు పోల్చవచ్చు?

2 శిష్యుల్ని చేసే పనిని ఒక తోటమాలి చేసే పనితో పోల్చవచ్చు. ఒక తోటలో పండిన పండ్లను తోటమాలి తెంపుతూనే, ఇంకోవైపు మిగతా చెట్లను చూసుకుంటూ వాటికి నీళ్లు పోస్తూ ఉంటాడు. అదేవిధంగా, మంచివార్తకు వెంటనే స్పందించినవాళ్లను వీలైనంత త్వరగా యేసు శిష్యులు అవ్వడానికి మనం సహాయం చేస్తూ ఉంటాం. దాంతోపాటు, మిగతావాళ్లలో ఆసక్తిని పెంచడానికి కూడా మనం ప్రయత్నిస్తూ ఉంటాం. (యోహా. 4:35, 36) ప్రజలు మంచివార్తకు స్పందించడానికి సిద్ధంగా ఉన్నారో లేదో మనకు తెలిస్తే, వాళ్లకు ఎలా సహాయం చేయాలో మనకు అర్థమౌతుంది. ఈ ఆర్టికల్‌లో, మంచివార్త విషయంలో బాగా ఆసక్తి చూపించేవాళ్లను మొదటిసారి కలిసినప్పుడే వాళ్లకు సహాయం చేయడానికి మనం ఏం చేయవచ్చో, వాళ్లింకా ప్రగతి సాధించడానికి వాళ్లకు ఎలా సహాయం చేయవచ్చో చూస్తాం.

మంచివార్త మీద ఆసక్తి చూపించేవాళ్లకు ఎలా సహాయం చేయవచ్చు?

3. ప్రీచింగ్‌లో ఆసక్తిగలవాళ్లు కలిస్తే మనం ఏం చేయాలి? (1 కొరింథీయులు 9:26)

3 ప్రీచింగ్‌లో ఆసక్తిగలవాళ్లు కలిసినప్పుడు వాళ్లు వెంటనే జీవానికి నడిపించే దారిలో ప్రయాణం మొదలుపెట్టేలా మనం సహాయం చేయాలని అనుకుంటాం. అలాంటప్పుడు, మొదటిసారి కలిసినప్పుడే వాళ్లకు బైబిలు స్టడీ గురించి చెప్పడానికి, వాళ్లను మీటింగ్‌కి ఆహ్వానించడానికి మనం వెనకాడకూడదు.—1 కొరింథీయులు 9:26 చదవండి.

4. కలిసిన వెంటనే బైబిలు స్టడీ తీసుకోవడానికి ఆసక్తి చూపించిన ఒక అనుభవం చెప్పండి.

4 బైబిలు స్టడీ గురించి చెప్పండి. మనం కలిసే కొంతమంది వెంటనే బైబిలు స్టడీ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఉదాహరణకు, కెనడాలోని ఒక యువతి గురువారం రోజు కార్ట్‌ దగ్గరికి వచ్చి, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషూర్‌ని తీసుకుంది. కార్ట్‌ దగ్గరున్న మన సిస్టర్‌ ఆ బ్రోషుర్‌తో పాటు మేము ఉచిత బైబిలు అధ్యయనం చేస్తామని వివరించింది. అప్పుడు ఆ యువతి వెంటనే ఆసక్తి చూపించి తన ఫోన్‌ నంబరు ఇచ్చింది. అదే రోజు సాయంత్రం, స్టడీ కోసం ఆ యువతి మన సిస్టర్‌కి మెసేజ్‌ చేసింది. అప్పుడు మన సిస్టర్‌, ‘నేను శనివారం స్టడీకి రావచ్చా’ అని అడిగింది. దానికి ఆ యువతి: “నేను రేపు ఖాళీగానే ఉంటాను రేపే రావచ్చుగా” అని అడిగింది. అలా శుక్రవారమే బైబిలు స్టడీ మొదలైంది. ఆ తర్వాత, ఆ యువతి ఆదివారం రోజు మొట్టమొదటిసారి మీటింగ్‌కి వచ్చింది. ఇక ఆ తర్వాత నుండి చక్కగా ప్రగతి సాధిస్తూ ఉంది.

5. కొంతమందికి బైబిలు స్టడీ గురించి చెప్పేముందు మనం ఏం చేయాలి? (చిత్రాలు కూడా చూడండి.)

5 నిజమే, మనం కలిసే ప్రతీఒక్కరు ఆ యువతిలా ఉండరు. వెంటనే బైబిలు స్టడీకి ఒప్పుకోరు. కొంతమందిలో మనం సమయం తీసుకుని ఆసక్తిని పెంచాల్సి రావచ్చు. అలాంటివాళ్లను మనం వదిలేయకుండా, మొదట్లో వాళ్లకు ఆసక్తిగా అనిపించే అంశాల గురించి మాట్లాడుతూ వాళ్లను నిజంగా పట్టించుకుంటున్నాం అని చూపిస్తే, తర్వాత్తర్వాత వాళ్లు స్టడీకి ఒప్పుకోవచ్చు. అయితే, బైబిలు స్టడీ మొదలుపెట్టడానికి వాళ్లకు ఏం చెప్పవచ్చు? బైబిలు స్టడీలను మొదలుపెట్టడంలో ఆరితేరిన కొంతమంది బ్రదర్స్‌సిస్టర్స్‌ దీనిగురించి ఏం చెప్తున్నారో చూద్దాం.

చిత్రాలు: 1. ఇంటి వరండాలో కూర్చున్న ఓ పెద్దాయనతో ఇద్దరు బ్రదర్స్‌ మాట్లాడుతున్నారు. 2. “ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!” బ్రోషుర్‌ ఇచ్చి, ఒకావిడతో గుమ్మం ముందే మాట్లాడుతున్న ఇద్దరు సిస్టర్స్‌. ఆవిడ ఒక కొడుకుని ఎత్తుకొని ఉంది, ఇంకో కొడుకు పక్కన నిలబడి చూస్తున్నాడు.

వీళ్లకు బైబిలు స్టడీ మీద ఆసక్తి పెరిగేలా ఏం చేయవచ్చు? (5వ పేరా చూడండి)a


6. ఆసక్తి ఉన్నవాళ్లకు బైబిలు స్టడీని ఎలా పరిచయం చేస్తే బాగుంటుంది?

6 బైబిలు స్టడీలు మొదలుపెట్టడం గురించి ఆ బ్రదర్స్‌సిస్టర్స్‌ ఏమంటున్నారంటే, కొన్ని ప్రాంతాల్లో “స్టడీ,” “బైబిలు కోర్సు,” లేదా “మీకు చెప్పడానికి వచ్చాం” లాంటి పదాల్ని వాడకపోవడమే మంచిది. దానికి బదులు “మాట్లాడుకుందాం,” “చర్చించుకుందాం,” “బైబిలు గురించి ఎక్కువ తెలుసుకుందాం” లాంటి పదాలు వాడితే బాగుంటుందని చెప్పారు. మీరు కూడా బైబిలు అధ్యయనాన్ని పరిచయం చేసేటప్పుడు బహుశా ఇలా అనవచ్చు: “జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నలకు బైబిల్లో జవాబులు ఉన్నాయని తెలుసుకోవడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది,” లేదా “బైబిలు కేవలం ఒక మత గ్రంథమే కాదు. దానిలో ఉపయోగపడే చాలా విషయాలు ఉన్నాయి.” అంతేకాదు, “ప్రతీవారం ఒక గంటసేపు మాట్లాడుకుందాం” లాంటి పదాలు వాడకుండా జాగ్రత్తపడవచ్చు. ఎందుకంటే, అలాంటి పదాలు వాడితే వాళ్ల టైమంతా తినేస్తామేమో అని వాళ్లు కంగారుపడతారు. దానికి బదులు, “చర్చించుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. 10-15 నిమిషాల్లో కూడా చాలా మంచిమంచి విషయాలు నేర్చుకోవచ్చు” అని మనం చెప్పొచ్చు.

7. కొంతమంది సత్యాన్ని ఎప్పుడు గుర్తించారు? (1 కొరింథీయులు 14:23-25)

7 మీటింగ్‌కి ఆహ్వానించండి. అపొస్తలుడైన పౌలు కాలంలో కొంతమంది, మీటింగ్‌కి వచ్చినప్పుడు వాళ్లు నేర్చుకుంటున్నది సత్యమని గుర్తించారు. (1 కొరింథీయులు 14:23-25 చదవండి.) ఈరోజుల్లో కూడా అదే నిజమవ్వచ్చు. చాలామంది కొత్తవాళ్లు మీటింగ్‌ రావడం మొదలుపెట్టిన తర్వాతే చాలా త్వరగా ప్రగతి సాధించారు. అయితే, మీరు వాళ్లను మీటింగ్‌కి ఎప్పుడు పిలవాలి? ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలోని 10వ పాఠంలో మీటింగ్‌కి ఆహ్వానించడం గురించి ఉంది. అయితే, ఆ పాఠం అయ్యేవరకు మీరు ఆగాల్సిన పనిలేదు. మీరు మొదటిసారి వాళ్లతో మాట్లాడుతున్నప్పటి నుండే ఆదివారం జరిగే మీటింగ్‌కి వాళ్లను ఆహ్వానించవచ్చు. బహుశా మీరు బహిరంగ ప్రసంగ అంశం చెప్పి లేదా, ఆ రోజు జరిగే కావలికోట అధ్యయనంలోని ఆసక్తికరమైన ఒక పాయింట్‌ చెప్పి వాళ్లను ఆహ్వానించవచ్చు.

8. ఆసక్తిగలవాళ్లను మీటింగ్‌కి పిలుస్తున్నప్పుడు మనం ఏం చెప్పవచ్చు? (యెషయా 54:13)

8 ఆసక్తి చూపించిన వాళ్లను మీటింగ్స్‌కి పిలిచినప్పుడు వాళ్లు అప్పటికే వెళ్తున్న ఆరాధన స్థలానికి, మన మీటింగ్స్‌కి మధ్యవున్న తేడాను వాళ్లకు వివరించండి. మొదటిసారి కావలికోట అధ్యయనానికి వచ్చిన బైబిలు విద్యార్థి, తనకు బైబిలు స్టడీ చేస్తున్న సిస్టర్‌ని ఇలా అడిగింది: “కావలికోట చేస్తున్న వ్యక్తికి అందరి పేర్లు తెలుసా?” అప్పుడు ఆ సిస్టర్‌, మన ఇంట్లోవాళ్ల పేర్లు మనకు ఎలా తెలుసో మా సంఘంలో ఉన్నవాళ్లందరి పేర్లు మాకు అలానే తెలుసు అని చెప్పింది. అప్పుడు ఆ బైబిలు విద్యార్థి మా చర్చిలోనైతే ఎవరి పేర్లు ఏంటో కూడా మాకు అస్సలు తెలీదు అని అంది. ఇదేకాదు, మన మీటింగ్స్‌ ఇంకా ఎలా వేరుగా ఉంటాయో మన బైబిలు విద్యార్థులకు వివరించవచ్చు. (యెషయా 54:13 చదవండి.) మనం యెహోవాను ఆరాధించడానికి, ఆయన నుండి నేర్చుకోవడానికి, ఒకరినొకరం ప్రోత్సహించుకోవడానికి మనం మీటింగ్స్‌కి వస్తాం. (హెబ్రీ. 2:12; 10:24, 25) అందుకే మన మీటింగ్స్‌ పద్ధతిగా, పనికొచ్చేదిగా ఉంటాయి. అక్కడ ఎలాంటి ఆచారాలూ జరగవు. (1 కొరిం. 14:40) వీటితోపాటు మన రాజ్యమందిరాలు శుభ్రంగా, మంచి గాలి, వెలుతురు వస్తూ ప్రశాంతంగా ఉంటాయి. అలాగే మనం ఎలాంటి రాజకీయ పార్టీలతో పొత్తుపెట్టుకోం, వాటిగురించి ప్రచారం చేయం, డిబేట్లు పెట్టుకోం కాబట్టి రాజ్యమందిరంలో వాటిగురించిన ప్రస్తావన కూడా రాదు. అయితే, మన బైబిలు విద్యార్థులకు మన రాజ్యమందిరం ఎలా ఉంటుందో బాగా అర్థం అవ్వడానికి రాజ్యమందిరం అంటే ఏంటి? వీడియోను చూపించవచ్చు.

9-10. ఆసక్తిగలవాళ్లను మీటింగ్స్‌కి పిలుస్తున్నప్పుడు వాళ్ల భయాన్ని పోగొట్టడానికి మనం ఏం చెప్పవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

9 మన మీటింగ్స్‌కి వస్తే ఇక యెహోవాసాక్షులుగా “మారాల్సిందేనేమో” అని భయపడి కొంతమంది వెనకాడవచ్చు. కాబట్టి మన మీటింగ్స్‌కి వచ్చి కేవలం విని, ఆనందిస్తే అదే మనకు చాలా సంతోషమని ఆసక్తిగలవాళ్లకు ధైర్యం చెప్పండి. పిల్లలతో సహా కుటుంబమంతా కలిసి రావచ్చు అని చెప్పండి. మన మీటింగ్స్‌లో పిల్లల్ని వేరుగా కూర్చోబెట్టి నేర్పించేది ఏమీ ఉండదు. బదులుగా తల్లిదండ్రులు, పిల్లలు కలిసి కూర్చొని, కలిసి నేర్చుకుంటారు. ఇలా పిల్లలు ఏం వింటున్నారో, ఏం నేర్చుకుంటున్నారో తల్లిదండ్రులు చూసుకోగలుగుతారు. (ద్వితీ. 31:12) మనం చందాలు వసూలు చేయమని కూడా చెప్పండి. దానికి బదులు మనం యేసు ఇచ్చిన ఈ ఆజ్ఞను పాటిస్తాం: “మీరు ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి.” (మత్త. 10:8) అంతేకాదు, మన మీటింగ్స్‌కి రావాలంటే బాగా ఖరీదైన బట్టలు వేసుకోవాల్సిన అవసరంలేదని ఆసక్తిగలవాళ్లకు చెప్పండి. ఎందుకంటే, దేవుడు హృదయాన్ని చూస్తాడు గానీ బట్టల్ని కాదు.—1 సమూ. 16:7.

10 ఒక వ్యక్తి మీటింగ్స్‌కి వచ్చినప్పుడు అతన్ని దగ్గరుండి పట్టించుకోండి. అతన్ని సంఘపెద్దలకు, బ్రదర్స్‌సిస్టర్స్‌కి పరిచయం చేయండి. తనను పట్టించుకుంటున్నాం అని అతనికి అనిపిస్తే మళ్లీ మీటింగ్‌కి రావడానికి ఇష్టపడతాడు. మీటింగ్‌ జరుగుతున్నప్పుడు ఒకవేళ అతని దగ్గర బైబిలు లేకపోతే, మీ బైబిల్ని చూపించండి. అప్పుడతను మీటింగ్స్‌ని చక్కగా అర్థం చేసుకోగలుగుతాడు.

పైన చిత్రంలో ఉన్న ఆవిడ రాజ్యమందిరానికి వచ్చినప్పుడు బ్రదర్స్‌-సిస్టర్స్‌ చక్కగా పలకరిస్తున్నారు. ఒక కొడుకుని ఆమె ఎత్తుకుంది, ఇంకో కొడుకు రాజ్యమందిరంలో ఉన్న వేరే అబ్బాయితో మాట్లాడుతున్నాడు.

మీటింగ్స్‌కి రావడం ఎంత త్వరగా మొదలుపెడితే, అతను లేదా ఆమె అంత త్వరగా ప్రయోజనం పొందుతారు (9-10 పేరాలు చూడండి)


బైబిలు స్టడీ మొదలైనప్పుడు

11. ఇంటివ్యక్తి సమయాన్ని మనం గౌరవిస్తున్నామని ఎలా చూపించవచ్చు?

11 బైబిలు స్టడీ గురించి మనం ఏ విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి? ఇంటివ్యక్తి చాలా బిజీగా ఉంటాడని, అతని సమయం చాలా విలువైనదని గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు, మీరు ఫలానా టైంకి వస్తానని చెప్తే, ఖచ్చితంగా ఆ టైంకి వెళ్లండి. మీ ప్రాంతంలో జనాలు టైంని ఎలా చూస్తున్నాసరే, మీరు మాత్రం టైం అంటే టైం అన్నట్టుగా ఉండండి. దాంతోపాటు, బైబిలు స్టడీ మొదలైన కొత్తలో స్టడీని తక్కువ సమయంలో ముగించడం మంచిది. కొంతమంది అనుభవమున్న ప్రచారకులు ఏం చెప్తున్నారంటే, ఇంటివ్యక్తి ఇంకా వినడానికి ఇష్టపడుతున్నాసరే స్టడీని కాస్త త్వరగా ముగించడం మంచిది. అలాగే మీరే ఎక్కువ మాట్లాడకండి. ఇంటివ్యక్తి హృదయంలో ఉన్నదంతా చెప్పనివ్వండి.—సామె. 10:19.

12. బైబిలు స్టడీ మొదలైన క్షణం నుండే మన లక్ష్యం ఏమై ఉండాలి?

12 బైబిలు స్టడీ మొదలైన క్షణం నుండే యెహోవా గురించి, యేసు గురించి తెలుసుకుని, వాళ్లమీద ప్రేమ పెంచుకునేలా మీ విద్యార్థులకు సహాయం చేయండి. దానికోసం వాళ్ల దృష్టిని దేవుని వాక్యం వైపు మళ్లించాలి గానీ మీవైపుకు గానీ, మీకున్న బైబిలు జ్ఞానం వైపుకు గానీ మళ్లించొద్దు. (అపొ. 10:25, 26) ఈ విషయంలో అపొస్తలుడైన పౌలు మంచి ఆదర్శం ఉంచాడు. తను బోధిస్తున్నప్పుడు ప్రజల దృష్టి తనమీదకు కాకుండా, యెహోవా పంపిన యేసు మీదకు మళ్లించాడు. ఎందుకంటే, యెహోవా గురించి తెలుసుకుని, ఆయన్ని ప్రేమించేలా యేసు సహాయం చేశాడు. (1 కొరిం. 2:1, 2) అలాగే కొత్తగా శిష్యులైనవాళ్లు మంచి లక్షణాల్ని పెంచుకోవడం ఎంత ప్రాముఖ్యమో కూడా పౌలు చెప్పాడు. ఆయన వాటిని బంగారం, వెండి, విలువైన రాళ్లతో పోల్చాడు. (1 కొరిం. 3:11-15) ఆ విలువైన లక్షణాల్లో విశ్వాసం, తెలివి, వివేచన, యెహోవా మీదున్న భయం ఉన్నాయి. (కీర్త. 19:9, 10; సామె. 3:13-15; 1 పేతు. 1:7) మనం పౌలు బోధించిన విధానాన్నే పాటిస్తూ, మన బైబిలు విద్యార్థులు బలమైన విశ్వాసం పెంచుకునేలా, వాళ్ల పరలోక తండ్రితో వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన బంధాన్ని ఏర్పర్చుకునేలా సహాయం చేయాలి.—2 కొరిం. 1:24.

13. ఆసక్తి ఉన్నవాళ్లకు సహాయం చేస్తున్నప్పుడు ఎలా అర్థం చేసుకుంటూ, ఓర్పు చూపించాలి? (2 కొరింథీయులు 10:4, 5) (చిత్రం కూడా చూడండి.)

13 మనం యేసులా అర్థం చేసుకుంటూ, ఓర్పు చూపిస్తూ బోధించాలి. మన బైబిలు విద్యార్థులు ఇబ్బంది పడేలాంటి ప్రశ్నలు అడగకూడదు. ఒకవేళ మన బైబిలు విద్యార్థి ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంటే, ప్రస్తుతానికి ఆ అంశాన్ని దాటేసి స్టడీ ముందుకు కొనసాగించాలి. ఆ తర్వాత మళ్లీ వాటిగురించి ఎప్పుడైనా చర్చించవచ్చు. అతను ఏదైనా బైబిలు బోధను ఒప్పుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు, దాన్ని ఒప్పుకోమని మనం బలవంతం చేయకూడదు. అతని హృదయంలో ఆ సత్యం నాటుకుని, వేళ్లూనుకునే వరకు సమయం ఇవ్వాలి. (యోహా. 16:12; కొలొ. 2:6, 7) తప్పుడు బోధల్ని తిప్పికొట్టడం, “బలమైన కోటల్ని” కూలగొట్టడంతో సమానమని బైబిలు చెప్తుంది. (2 కొరింథీయులు 10:4, 5 చదవండి.) అయితే, మన బైబిలు విద్యార్థిలో ఎప్పటినుండో నాటుకుపోయిన తప్పుడు బోధలు అనే కోటను కూలగొట్టే ముందు, యెహోవాను ఓ కొత్త కోటగా చేసుకోవడానికి మనం సహాయం చేయాలి. ఆ తర్వాత, ఆయన తన పాత కోటను కూలగొట్టడం తేలికౌతుంది.—కీర్త. 91:9.

పైన చిత్రంలో ఉన్న పెద్దాయనతో ఇద్దరు బ్రదర్స్‌, “ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!” పుస్తకం నుండి స్టడీ చేస్తున్నారు. వాళ్ల వెనక ఆ పెద్దాయన మిలిటరీలో సాధించిన మెడల్స్‌ ఉన్నాయి.

మీ విద్యార్థి హృదయంలో సత్యం నాటుకుని, వేళ్లూనుకునే వరకు సమయం ఇవ్వండి (13వ పేరా చూడండి)


కొత్తవాళ్లు మీటింగ్‌కి వచ్చినప్పుడు

14. మీటింగ్‌కి వచ్చే కొత్తవాళ్లను మనం ఎలా చూడాలి?

14 కొత్తవాళ్లు ఏ ప్రాంతం నుండి వచ్చారు? వాళ్ల సంస్కృతి ఏంటి? వాళ్లకు ఎంత డబ్బుంది? అనే వాటిని పట్టించుకోకుండా మనం అందరితో దయగా, ప్రేమగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. (యాకో. 2:1-4, 9) కాబట్టి, మన మీటింగ్స్‌కి ఎవరైనా కొత్తగా వస్తే వాళ్లమీద ఎలా ప్రేమ చూపించవచ్చు?

15-16. మన మీటింగ్‌కి కొత్తగా వచ్చినవాళ్ల ఇబ్బందిని పోగొట్టడానికి మనం ఏం చేయవచ్చు?

15 కొంతమంది మీటింగ్స్‌లో ఏం జరుగుతుందో చూద్దామనే కుతూహలంతో వస్తారు. లేదా వేరే ప్రాంతంలో ఉంటున్న మన బ్రదర్స్‌సిస్టర్స్‌ చెప్పడం వల్ల మన రాజ్యమందిరానికి రావచ్చు. కాబట్టి మన మీటింగ్స్‌కి ఎవరైనా కొత్తవాళ్లు వస్తే, వెళ్లి పలకరించడానికి ముందుండండి. వాళ్లతో స్నేహంగా ఉండండి గానీ, మీ అత్యుత్సాహంతో వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేయకండి. వాళ్లను మీతోపాటు కూర్చోబెట్టుకోండి, మీ బైబిల్ని చూపించండి. ఆరోజు జరిగే ప్రచురణల్ని వాళ్లకు చూపించండి లేదా ఒక కాపీ ఇవ్వండి. దాంతోపాటు, వాళ్లు ఎక్కడైనా ఇబ్బందిపడుతున్నారేమో గమనించుకుంటూ ఉండండి. ఒక వ్యక్తి మన రాజ్యమందిరానికి మొదటిసారి వచ్చినప్పుడు తనను పలకరించిన బ్రదర్‌తో ఇలా అన్నాడు: “ఇక్కడున్న వాళ్లలా నేను పద్ధతిగా బట్టలు వేసుకోనందుకు నాకు సిగ్గుగా ఉంది.” అప్పుడు ఆ బ్రదర్‌ అతని ఇబ్బందిని పోగొట్టేలా మాట్లాడుతూ, “యెహోవాసాక్షులు అందరిలాంటి మామూలు ప్రజలే” అని చెప్పాడు. తర్వాత్తర్వాత, ఆ వ్యక్తి బాప్తిస్మం వైపు ప్రగతి సాధించి ఆ బ్రదర్‌ చెప్పిన మాటను ఎప్పుడూ మర్చిపోలేదు. అయితే ఒక జాగ్రత్త: మన మీటింగ్స్‌కు ముందు-తర్వాత కొత్తవాళ్లతో మాట్లాడుతున్నప్పుడు వాళ్లమీద వ్యక్తిగత శ్రద్ధ చూపించండి గానీ వాళ్ల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చకండి.—1 పేతు. 4:15.

16 కొత్తవాళ్లు మన మీటింగ్‌కి వచ్చినప్పుడు, వాళ్ల ఇబ్బందిని పోగొట్టడానికి మనం ఇంకో పని కూడా చేయవచ్చు. అదేంటంటే, మీటింగ్స్‌లో మనం భాగాలు చేస్తున్నప్పుడు లేదా కామెంట్స్‌ చెప్తున్నప్పుడు లేదా వేరేవాళ్లతో మాట్లాడుతున్నప్పుడు, యెహోవాసాక్షికాని వాళ్ల గురించి లేదా వాళ్ల నమ్మకాల గురించి చెప్పాల్సి వస్తే, గౌరవపూర్వకంగా మాట్లాడతాం. వాళ్లను ఇబ్బందిపెట్టే లేదా వాళ్లను చిన్నచూపు చూసేలాంటి పదాల్ని మనం ఉపయోగించం. (తీతు 2:8; 3:2) ఉదాహరణకు, వాళ్ల నమ్మకాల్ని బట్టి మనం ఎప్పుడూ వాళ్లను కించపర్చేలా మాట్లాడం. (2 కొరిం. 6:3) ఈ విషయంలో బహిరంగ ప్రసంగాలు ఇచ్చే బ్రదర్‌ ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ప్రేక్షకుల్లో యెహోవాసాక్షులుకాని వాళ్లు కూడా ఉంటారు కాబట్టి వాళ్లకు అర్థంకాని పదాలు, అంశాలు ఏమైనా ఉంటే కాస్త సమయం తీసుకుని వివరించాల్సి రావచ్చు.

17. “శాశ్వత జీవితం పొందడానికి సరైన హృదయ స్థితి ఉన్నవాళ్లు” దొరికినప్పుడు మన లక్ష్యం ఏంటి?

17 ఒక్కోరోజు గడిచేకొద్దీ శిష్యుల్ని చేయాల్సిన పని చాలా అత్యవసరంగా మారుతుంది కాబట్టి, “శాశ్వత జీవితం పొందడానికి సరైన హృదయ స్థితి ఉన్నవాళ్ల” కోసం మనం వెదుకుతూనే ఉంటాం. (అపొ. 13:48) కాబట్టి, ఆసక్తి చూపించినవాళ్లకు బైబిలు స్టడీ గురించి చెప్పడానికి లేదా మన మీటింగ్స్‌కి పిలవడానికి మనం అస్సలు వెనకాడకూడదు. ఇవన్నీ చేస్తే, “జీవానికి నడిపించే” దారిలో మనం వాళ్లతో తొలి అడుగు వేయించిన వాళ్లమౌతాం.—మత్త. 7:14.

మీరెలా జవాబిస్తారు?

  • “సరైన హృదయ స్థితి” గలవాళ్లను మొదటిసారి కలిసినప్పుడే మనం వాళ్లకు ఎలా సహాయం చేయవచ్చు?

  • బైబిలు స్టడీ మొదలైనప్పుడు మనం ఏ సలహాల్ని పాటించవచ్చు?

  • కొత్తవాళ్లు మీటింగ్‌కి వచ్చినప్పుడు వాళ్ల ఇబ్బంది పోగొట్టడానికి మనం ఏం చేయవచ్చు?

పాట 64 సంతోషంగా కోతపని చేద్దాం

a చిత్రాల వివరణ: మిలిటరీలో పనిచేసి రిటైర్‌ అయిన ఓ పెద్దాయన తన వరండాలో హాయిగా సిగరెట్‌ తాగుతున్నప్పుడు, ఇద్దరు బ్రదర్స్‌ వచ్చి మాట్లాడుతున్నారు; పిల్లలతో తలమునకలు అవుతున్న ఒకావిడకు ఇద్దరు సిస్టర్స్‌ సాక్ష్యం ఇస్తున్నారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి