కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 ఆగస్టు పేజీలు 26-30
  • సిగ్గుతో మొదలైన నా ప్రయాణం మిషనరీ సేవతో ముగిసింది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సిగ్గుతో మొదలైన నా ప్రయాణం మిషనరీ సేవతో ముగిసింది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పూర్తికాల సేవలో అడుగుపెట్టాను
  • మిషనరీ సేవే లక్ష్యంగా
  • యుద్ధంలో మగ్గుతున్న దేశంలో సేవచేశాం
  • కొత్తకొత్త సవాళ్లు
  • అనారోగ్య సమస్యలతో పోరాటం
  • యెహోవా ఇచ్చిన సహాయానికి ఎప్పుడూ రుణపడి ఉంటాను
  • బల్గేరియాలో ప్రత్యేక ప్రచార కార్యక్రమం వల్ల మంచి ఫలితాలొచ్చాయి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • మీరు కేవలము బాహ్యరూపమును మాత్రమే చూచెదరా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • యెహోవా ‘నా దారుల్ని తిన్నగా చేశాడు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • యెహోవాను సేవించాలని తీర్మానించుకున్నాం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 ఆగస్టు పేజీలు 26-30
మారియన్‌ వెర్త్‌హోల్స్‌

జీవిత కథ

సిగ్గుతో మొదలైన నా ప్రయాణం మిషనరీ సేవతో ముగిసింది

మారియన్‌ వెర్త్‌హోల్స్‌ చెప్పినది

చిన్నప్పటి నుండి నాకు కొంచెం సిగ్గెక్కువ. అందుకే ఎవరితో పెద్దగా కలిసేదాన్ని కాదు. కానీ సమయం గడిచేకొద్దీ ప్రజల్ని ప్రేమించడం మొదలుపెట్టాను, నలుగురితో కలవగలిగాను. చివరికి మిషనరీని అయ్యాను. అదెలా సాధ్యమైంది? మా నాన్న ఆదర్శం, ఒక టీనేజీ సహోదరితో సహవాసం, ప్రేమ-ఓపిక కలగలసిన మా ఆయన మాటలు సహాయం చేశాయి. నా కథ చెప్తాను పదండి.

నేను 1951లో, ఆస్ట్రియాలోని వియన్నాలో పుట్టాను. మాది క్యాథలిక్‌ కుటుంబం. నాకు సిగ్గు, మొహమాటం ఎక్కువ ఉండడం వల్ల నలుగురితో మాట్లాడడానికి ఇబ్బందిపడేదాన్ని. విషయాల్ని నాలోనే దాచేసుకునేదాన్ని. కానీ నాకు దేవుని మీద భక్తి ఎక్కువ కాబట్టి, అప్పుడప్పుడు ఆయనకు చెప్పుకునేదాన్ని. నాకు తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు మా నాన్న యెహోవాసాక్షుల దగ్గర స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి మా అమ్మా కూడా స్టడీ తీసుకోవడం మొదలుపెట్టింది.

మా చెల్లి ఎలీసబెత్‌తో (ఎడమవైపు)

ఎంతోకాలం గడవకముందే మేము యెహోవాసాక్షులమై, వియన్నాలోని డోబ్లింగ్‌ సంఘంతో సహవసించడం మొదలుపెట్టాం. మేము కుటుంబంగా కలిసి బైబిలు చదివి, అధ్యయనం చేసేవాళ్లం, మీటింగ్స్‌కి హాజరయ్యేవాళ్లం. సమావేశాల్లో స్వచ్ఛందంగా పనిచేశాం. అప్పుడే, మెల్లమెల్లగా మా నాన్న యెహోవాను ప్రేమించడం నేర్పించాడు. నిజానికి నేను, మా చెల్లి పయినీర్లు అవ్వాలని మా నాన్న కోరుకునేవాడు. కానీ అప్పట్లో పయినీరు సేవ మీద నాకు పెద్దగా ఆసక్తి లేదు.

పూర్తికాల సేవలో అడుగుపెట్టాను

1965లో నాకు 14 ఏళ్లున్నప్పుడు బాప్తిస్మం తీసుకున్నాను. అయితే, ప్రీచింగ్‌లో కొత్తవాళ్ల దగ్గరికి వెళ్లి మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా అనిపించేది. అలాగే వేరేవాళ్లకన్నా నేను చాలా తక్కువ అని నాకు అనిపించేది. కానీ ఇంకో వైపు, నా తోటి వయసువాళ్లు నన్ను తమతో కలుపుకోవాలని నాకు బలంగా అనిపించేది. అందుకే, బాప్తిస్మం తీసుకున్న కొంతకాలానికే యెహోవాసాక్షులుకాని వాళ్లతో ఎక్కువ స్నేహం చేయడం మొదలుపెట్టాను. వాళ్లతో సమయం గడపడమంటే నాకు చాలా ఇష్టం. కానీ వాళ్లతోనే ఎక్కువ టైం గడుపుతున్నానని నా మనసులో ఏదో మూల బాధగా అనిపించేది. అయితే, వాళ్లతో స్నేహం తెంచుకోవడానికి నాకు ధైర్యం చాల్లేదు. మరి నాకు ఏది సహాయం చేసింది?

మారియన్‌ అలాగే డొరోతీ.

నేను డొరోతీ నుండి చాలా నేర్చుకున్నాను (ఎడమవైపు)

సరిగ్గా అప్పుడే, డొరోతీ అనే 16 ఏళ్ల అమ్మాయి మా సంఘానికి వచ్చింది. ఇంటింటి పరిచర్యలో ఆమెకు ఉన్న ఉత్సాహం చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను ఆమె కంటే కొంచెం పెద్దదాన్నే కానీ, ప్రీచింగ్‌లో అంత చురుగ్గా ఉండేదాన్ని కాదు. అప్పుడు నాకు నేను ఇలా అనుకున్నాను: ‘మా అమ్మానాన్నలు యెహోవాసాక్షులు కానీ డొరోతీ కుటుంబంలో ఆమె ఒక్కతే యెహోవాసాక్షి. పైగా అనారోగ్యం ఉన్న వాళ్ల అమ్మను చూసుకుంటూనే ఆమె ఎప్పుడూ ప్రీచింగ్‌లో కనిపించేది.’ యెహోవా సేవలో ఇంకా ఎక్కువ చేయాలని నేను ఆమెను చూసి నేర్చుకున్నాను. కొంతకాలానికే డొరోతీ, నేను కలిసి పయినీరు సేవ మొదలుపెట్టాం. మొదట్లో, మేమిద్దరం కలిసి సహాయ పయినీర్లుగా చేశాం, అప్పట్లో వాళ్లను వెకేషన్‌ పయినీర్లు అనేవాళ్లు. ఆ తర్వాత మేము కలిసి క్రమపయినీర్లుగా సేవచేయడం మొదలుపెట్టాం. ప్రీచింగ్‌లో డొరోతీకి ఉన్న ఉత్సాహం నాకూ అంటుకుంది. ఆమె సహాయంతోనే నేను నా మొట్టమొదటి బైబిలు స్టడీ చేశాను. ఆ తర్వాత కొంతకాలానికి, ప్రీచింగ్‌లో తెలియనివాళ్ల దగ్గరికి వెళ్లి మాట్లాడడం అలవాటైంది, నా ఇబ్బంది పోయింది.

నేను క్రమ పయినీరు సేవ మొదలుపెట్టిన మొదటి సంవత్సరంలోనే, మా సంఘానికి హింట్స్‌ అనే ఒక బ్రదర్‌ ఆస్ట్రియా నుండి వచ్చాడు. ఆయన కెనడాలో, యెహోవాసాక్షియైన వాళ్ల అన్నను కలవడానికి వెళ్లినప్పుడు సత్యం తెలుసుకున్నాడు. వియన్నాలో ఉన్న మా సంఘానికి హింట్స్‌ని ప్రత్యేక పయినీరుగా నియమించారు. ఆయన్ని చూసీ చూడంగానే నాకు నచ్చేశాడు! కానీ ఆయనకు మిషనరీ సేవ చేయాలని బాగా ఉండేది. నాకేమో మిషనరీ సేవ అనే ఆలోచనే లేదు! కాబట్టి మొదట్లో నాకు ఆయన మీదున్న ఇష్టాన్ని మనసులోనే దాచుకున్నాను. కానీ ఆ తర్వాత నేను, హింట్స్‌ డేటింగ్‌ చేసుకుని, పెళ్లి చేసుకున్నాం. ఇక ఆస్ట్రియాలో ఇద్దరం కలిసి పయినీరు సేవ చేశాం.

మిషనరీ సేవే లక్ష్యంగా

మిషనరీ అవ్వాలన్న తన కోరిక గురించి హింట్స్‌ ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన నన్ను ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. కానీ, నన్ను ఆలోచింపజేసే ఈ ప్రశ్న అడిగేవాడు: “మనకు పిల్లలు లేరు కదా, యెహోవా సేవ ఇంకా ఎక్కువ చేద్దామా?” నాకేమో సిగ్గెక్కువ కాబట్టి, మిషనరీ సేవ చేయాలంటే భయమేసేది. నిజమే నేను పయినీరు సేవ చేశాను. కానీ మిషనరీల నియామకం గురించి ఆలోచిస్తేనే నా గుండెల్లో గుబులు పుట్టేది. కానీ హింట్స్‌ మాత్రం తన లక్ష్యం మీద ఆశ వదులుకోలేదు. అలాగే నా గురించి, నా భయాల గురించి కాకుండా, ప్రజల గురించే ఎక్కువ ఆలోచించమని ప్రోత్సహిస్తూ ఉండేవాడు. అది నాకు చాలా సహాయం చేసింది.

1974లో ఆస్ట్రియాలోని సాల్స్‌బర్గ్‌లో ఉన్న యుగోస్లొవియన్‌ భాషా సంఘంలో హింట్స్‌ కావలికోట చేస్తున్నాడు

మెల్లిమెల్లిగా మిషనరీ సేవ మీద నా మనసు వాలింది. కాబట్టి మేము గిలియడ్‌ పాఠశాలకు అప్లై చేశాం. కానీ ముందుగా, ఇంగ్లీష్‌ బాగా నేర్చుకోమని బ్రాంచ్‌ సర్వెంట్‌ నాకు సలహా ఇచ్చాడు. ఆయన సలహా ప్రకారం ఇంగ్లీష్‌ బాగా నేర్చుకున్నాను. ఆ తర్వాత మూడేళ్లకు, మమ్మల్ని ఆస్ట్రియాలోని సాల్స్‌బర్గ్‌లో ఉన్న యుగోస్లొవియన్‌ భాషా సంఘానికి నియమించినప్పుడు మేము ఆశ్చర్యపోయాం. తర్వాతి ఏడేళ్లు ఆ ప్రాంతంలోనే సేవచేశాం. అందులో ఒక సంవత్సరం ప్రాంతీయ సేవ కూడా చేశాం. యుగోస్లొవియన్‌ భాషా చాలా కష్టంగా ఉన్నాసరే, మాకు చాలా బైబిలు స్టడీలు దొరికాయి.

ఆ తర్వాత, 1979లో కొన్నిరోజుల పాటు బల్గేరియాకు వెళ్లిరమ్మన్నారు. అక్కడ మన పని నిషేధించబడింది కాబట్టి, అక్కడ మమ్మల్ని ప్రీచింగ్‌ చేయొద్దన్నారు. కేవలం, “సరదాగా సమయం గడపడానికి” వెళ్లినట్టు కనిపించాలని చెప్పారు. మేము, మాతోపాటు మన ప్రచురణల్ని చిన్న సైజులోకి మార్చి రహస్యంగా, ఎవరికంటా పడకుండా తీసుకెళ్లాం. ఆ దేశ రాజధానియైన సోఫియాలో ఉన్న ఐదుగురు సిస్టర్స్‌కి వాటిని అందించాం. ఆ పనిచేస్తున్నప్పుడు నేను గజగజ వణికిపోయాను గానీ, యెహోవా సహాయంతో ఆ ఆసక్తికరమైన నియామకాన్ని పూర్తిచేశాను. దొరికితే జైల్లో పెడతారని తెలిసినా ఆ ఐదుగురు సిస్టర్స్‌ చాలా ధైర్యంగా, సంతోషంగా ఉన్నారు. అది చూసి యెహోవా సంస్థ, నాకు ఏ నియామకం ఇచ్చినా నా శక్తి లోపం లేకుండా చేయాలనే పట్టుదల వచ్చింది.

కొంతకాలం తర్వాత మేము మళ్లీ గిలియడ్‌ పాఠశాలకు అప్లై చేశాం. ఈసారి మాకు ఆహ్వానం వచ్చింది. అయితే, మేము అమెరికాలోని ఇంగ్లీష్‌ పాఠశాలకు హాజరౌతామని అనుకున్నాం. కానీ సంస్థ 1981, నవంబరులో జర్మనీలో కూడా ఈ పాఠశాలను మొదలుపెట్టింది. కాబట్టి మేము జర్మన్‌ భాషలో ఈ పాఠశాలకు హాజరయ్యాం. దానివల్ల విషయాలు నాకు తేలికగా అర్థమయ్యాయి. కానీ ఇప్పుడు ప్రశ్నేంటంటే, మేము ఎక్కడికి నియమించబడతాం?

యుద్ధంలో మగ్గుతున్న దేశంలో సేవచేశాం

మమ్మల్ని కెన్యాకు నియమించారు. అయితే, కెన్యా బ్రాంచేమో పక్క దేశమైన ఉగాండాకి వెళ్లి సేవ చేయగలరా అని అడిగారు. ఉగాండాలోనేమో పరిస్థితి అస్సలు బాలేదు. ఎందుకంటే పదేళ్లక్రితం మిలిటరీ ఆఫీసర్‌ ఈడి యామిన్‌ ఆ దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఆయన పరిపాలనలో వేలమంది ప్రాణాలు కోల్పోయారు, లక్షలమంది జీవితాలు తలకిందులయ్యాయి. 1979లో వ్యతిరేకులు అతన్ని అధికారం నుండి దించేశారు. యుద్ధంలో మగ్గుతున్న ఇలాంటి దేశానికి వెళ్లాలంటే నేను, ఒకటికి పదిసార్లు ఆలోచించాను. కానీ యెహోవాను నమ్మాలని మేము గిలియడ్‌లో నేర్చుకున్నాం. అందుకే వెళ్లడానికి ఒప్పుకున్నాం.

ఉగాండాలో పరిస్థితి గందరగోళంగా ఉండేది. అక్కడ ప్రభుత్వం మంచి నీళ్లను, కరెంట్‌ను, కనీస అవసరాల్ని కూడా ఇవ్వలేదు. ఫోన్లు పనిచేసేవి కూడా కాదు. ఎప్పుడూ కాల్పులు, దొంగతనాలు జరుగుతూ ఉండేవి, ముఖ్యంగా రాత్రులు ఇలాంటివి ఎక్కువ జరిగేవి. అందుకే చీకటి పడిందంటే చాలు, తలుపులు మూసుకుని అందరూ ఇంట్లోనే ఉండి, దొంగలు రాకూడదని ప్రార్థిస్తూ ఉండేవాళ్లు. జీవితం ఇంత కష్టంగా ఉన్నాసరే అక్కడున్న బ్రదర్స్‌సిస్టర్స్‌ మాత్రం బలమైన విశ్వాసాన్ని చూపించేవాళ్లు.

శామ్‌, క్రిస్టీనాల ఇంట్లో వంట చేస్తున్నాం

1982లో నేను, హింట్స్‌ ఉగాండా దేశ రాజధానియైన కంపాలకు వచ్చాం. అక్కడికి వచ్చిన మొదటి ఐదు నెలలు శామ్‌, క్రిస్టీనా వాళ్లింట్లోనే ఉన్నాం. అప్పటికే వాళ్లింట్లో ఐదుగురు పిల్లలు, నలుగురు బంధువులు ఉండేవాళ్లు. వాళ్ల కుటుంబమంతా చాలాసార్లు ఒక్కపూటే భోజనం చేసేవాళ్లు. కాబట్టి వాళ్లు చూపించిన ఆతిథ్య స్ఫూర్తిని మేము ఇప్పటికీ మరచిపోలేం. వాళ్లతో ఉన్నన్ని రోజులు మా మిషనరీ సేవకు ఉపయోగపడే ఎన్నో పాఠాల్ని నేర్చుకున్నాం. ఉదాహరణకు, తక్కువ నీళ్లతో ఎలా స్నానం చేయాలో నేర్చుకున్నాం. స్నానం చేసినప్పుడు వచ్చిన నీళ్లతో, బాత్రూమ్‌లు ఎలా కడగాలో నేర్చుకున్నాం. తర్వాత, 1983లో కంపాలాలోనే కాస్త సురక్షితంగా ఉన్న ఒక ప్రాంతంలో మేము ఒక ఇళ్లు తీసుకున్నాం.

కంపాలాలో ప్రీచింగ్‌ భలే జరిగేది. ఒకానొక నెలలోనైతే మేము 4,000ల కంటే ఎక్కువ పత్రికల్ని ఇచ్చాం. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే, అక్కడి ప్రజలకు దేవుడంటే చాలా భక్తి. అలాగే బైబిలు గురించి మాట్లాడడానికి ఇష్టపడేవాళ్లు. మా ఇద్దరికి, చెరో 10, 15 బైబిలు స్టడీలు ఉండేవి. మా బైబిలు విద్యార్థుల నుండి కూడా మేము చాలా నేర్చుకున్నాం. ఉదాహరణకు, వాళ్లు ప్రతీవారం కాలినడకన మీటింగ్స్‌కి వచ్చేవాళ్లు, నడుచుకుంటూ తిరిగి వెళ్లేవాళ్లు. అయినాసరే ఎప్పుడూ సణగలేదు, వాళ్ల చిరునవ్వును చెరగనివ్వలేదు. అది మాకు బాగా నచ్చింది.

1985లో అలాగే 1986లో ఉగాండాలో ఇంకో రెండు యుద్ధాలు జరిగాయి. తరచూ చిన్నచిన్న పిల్లలు, పెద్దపెద్ద గన్‌లు పట్టుకుని రోడ్లమీద అందర్నీ ఆపుతూ తనిఖీ చేసేవాళ్లు. ఆ సమయంలో ఆసక్తి ఉన్నవాళ్లను వెదుకుతున్నప్పుడు వివేచన కోసం, కంగారుపడకుండా ఉండడం కోసం ప్రార్థించాం. మేము చేసిన ఆ ప్రార్థనను యెహోవా విని, జవాబిచ్చాడు. ఆసక్తిగలవాళ్లు ఎవరైనా కనిపిస్తే చాలు, మాకున్న భయాలన్నిటినీ మర్చిపోయేవాళ్లం.

నాకు, హింట్స్‌కు మధ్యలో టట్‌జానా

మేము వేరే దేశం నుండి ఉగాండాకు వచ్చినవాళ్లకు కూడా ప్రకటించడం భలేగా అనిపించింది. ఉదాహరణకు, మేము మురాట్‌ అలాగే దిల్బార్‌ అనే దంపతుల్ని కలిశాం. వాళ్లు సెంట్రల్‌ రష్యా నుండి ఉగాండాకు వచ్చారు. వాళ్లతో బైబిలు స్టడీ మొదలుపెట్టాం. మురాట్‌ ఒక డాక్టర్‌. ఆ దంపతులు బాప్తిస్మం తీసుకుని, ఇప్పటికీ యెహోవాకు నమ్మకంగా సేవచేస్తున్నారు. ఆ తర్వాత మేము యుక్రెయిన్‌ నుండి వచ్చిన టట్‌జానా విలేస్కా అనే ఆవిడిని కలిశాం. ఆమె ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. కానీ మేము కలిసి బైబిలు స్టడీ మొదలుపెట్టాక ఆమె బాప్తిస్మం తీసుకుంది. ఆమె తిరిగి యుక్రెయిన్‌కు వెళ్లి, అక్కడ మన ప్రచురణలకు అనువాదకురాలిగా కూడా పనిచేసింది.

కొత్తకొత్త సవాళ్లు

1991లో నేను, హింట్స్‌ సెలవుల కోసం ఆస్ట్రియా వెళ్లినప్పుడు, అక్కడి బ్రాంచి కార్యాలయం నుండి మాకు ఒక ఉత్తరం వచ్చింది. మమ్మల్ని బల్గేరియాకు పంపిస్తున్నామని చెప్పారు. తూర్పు ఐరోపాలోని కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం పడిపోయిన తర్వాత బల్గేరియాలో యెహోవాసాక్షుల పని చట్టబద్ధమైంది. ముందు చెప్పినట్టు, ఇంతకుముందు ఆ దేశంలో మన పనిపై నిషేధం ఉన్నప్పుడు నేను, హింట్స్‌ రహస్యంగా కొన్ని ప్రచురణల్ని తీసుకెళ్లాం. అయితే, ఇప్పుడు మాత్రం అక్కడ ప్రకటించడానికి వెళ్తున్నాం.

ఇక ఉగాండాకు వెళ్లకుండా నేరుగా బల్గేరియాకు వెళ్లమని చెప్పారు. కాబట్టి ఉగాండాలోని మా మిషనరీ ఇంటికి వెళ్లి, సామాన్లు సర్దుకోవడానికి గానీ, అక్కడున్న స్నేహితులకు వీడ్కోలు చెప్పడానికి గానీ కుదరలేదు. మేము నేరుగా జర్మనీ బెతెల్‌కు వెళ్లాం. అక్కడ మాకు ఒక కారు ఇచ్చారు. దాంట్లోనే మేము బల్గేరియాకు ప్రయాణించాం. బల్గేరియాలోని సోఫీయాలో ఉన్న ఒక చిన్న గుంపుకు మమ్మల్ని నియమించారు. అక్కడ ఇంచుమించు 20 మంది ప్రచారకులు ఉన్నారు.

బల్గేరియాలో కొత్తకొత్త సవాళ్లు ఎదురయ్యాయి. ఒకటి, మాకు అక్కడి భాష రాదు. రెండు, బల్గేరియన్‌ భాషలో నిత్య జీవమునకు నడుపు సత్యము అలాగే నా బైబిలు కథల పుస్తకము అనే పుస్తకాలు మాత్రమే ఉండేవి. మూడు, అక్కడ మాకు బైబిలు స్టడీలు మొదలుపెట్టడం కష్టమైంది. ఇన్ని సవాళ్లలో కూడా ఉరకలేసే ఉత్సాహంతో ఉన్న మా చిన్ని గ్రూప్‌ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. అక్కడున్న ఆర్థోడాక్స్‌ చర్చివాళ్లు దాన్ని గమనించినప్పుడు, ఇక అసలు సమస్య మొదలైంది!

1994లో, ప్రభుత్వం యెహోవాసాక్షులకు ఉన్న గుర్తింపును రద్దుచేసింది. యెహోవాసాక్షుల్ని ఒక భయంకరమైన మత గుంపుగా చూసింది. దాంతో కొంతమంది బ్రదర్స్‌ అరెస్ట్‌ అయ్యారు. మీడియాలో కూడా మన గురించి లేనిపోని అబద్ధాలు ప్రచారం అవుతూ ఉన్నాయి. అంటే, యెహోవాసాక్షులు తమ పిల్లల్ని చంపుకుంటారని, వేరే సాక్షుల్ని ఆత్మహత్య చేసుకోవడానికి ఒప్పిస్తారని అబద్ధాలు వ్యాప్తిచేస్తూ వచ్చారు. నాకు, హింట్స్‌కి అక్కడ ప్రకటించడం చాలా కష్టంగా అనిపించింది. మేము తరచూ ప్రీచింగ్‌కి వెళ్లినప్పుడు ప్రజలు మామీద అరిచేవాళ్లు, పోలీసుల్ని పిలిచేవాళ్లు, వస్తువుల్ని మామీదికి విసిరేవాళ్లు. ఆ దేశంలోకి ప్రచురణలు రావడం అసాధ్యమైపోయింది. దాంతోపాటు మీటింగ్స్‌ జరుపుకోవడానికి మాకు హాళ్లు అద్దెకు దొరికేవి కాదు. ఒకసారైతే, సమావేశం జరుగుతున్నప్పుడు పోలీసులు చొరబడి సమావేశాన్ని ఆపేశారు. నేను, హింట్స్‌ ఇంత ద్వేషాన్ని ఎప్పుడూ చూడలేదు. ఉగాండాలోనైతే ప్రశాంతంగా, చాలా చక్కగా పరిచర్య చేసుకునేవాళ్లం. అక్కడికి, ఇక్కడికి చాలా తేడా ఉంది. మరి మేము ఈ పరిస్థితిని ఎలా తట్టుకున్నాం?

స్థానిక సహోదరసహోదరీలతో సమయం గడపడం మాకు ఎంతో సహాయం చేసింది. వాళ్లు సత్యాన్ని ఎంతో ప్రేమించారు. మేము వాళ్లతో ఉన్నందుకు కూడా సంతోషించారు. మేమంతా కలిసికట్టుగా ఉంటూ, ఒకరికొకరం చేదోడువాదోడుగా ఉండేవాళ్లం. మేము చూసిన వాటన్నిటిని బట్టి, మన సమస్యల గురించి కాకుండా, ప్రజల గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఏ నియామకంలోనైనా సంతోషంగా ఉంటామని తెలుసుకున్నాం.

మారియన్‌ అలాగే హింట్స్‌ వెర్త్‌హోల్స్‌.

2007లో బల్గేరియన్‌ బ్రాంచిలో

కొన్ని సంవత్సరాల తర్వాత పరిస్థితులు మెరుగై, పరిచర్య చేయడం తేలికైంది. 1998లో యెహోవాసాక్షుల్ని మళ్లీ ఒక మతంగా ప్రభుత్వం గుర్తించింది. అలాగే బల్గేరియన్‌ భాషలోకి చాలా ప్రచురణలు వచ్చాయి. 2004లో ఒక కొత్త బ్రాంచ్‌ భవనం కూడా నిర్మించబడింది. ప్రస్తుతం బల్గేరియాలో 57 సంఘాలు ఉన్నాయి. 2,953 ప్రచారకులు ఉన్నారు. గత సేవా సంవత్సరంలోనైతే 6,475 మంది జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యారు. ఒకప్పుడు సోఫియా ప్రాంతంలో ఐదుగురు సిస్టర్సే ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు అక్కడ 9 సంఘాలు ఉన్నాయి. “అల్పుడు వెయ్యిమంది అవ్వడం” మేము కళ్లారా చూశాం.—యెష. 60:22.

అనారోగ్య సమస్యలతో పోరాటం

నాకు చాలా అనారోగ్య సమస్యలు వచ్చాయి. నా శరీరంలో చాలా ట్యూమర్లు ఉన్నాయి. ఒకటైతే నా తలలో కూడా వచ్చింది. దాన్ని తీసేయడానికి రేడియేషన్‌ ఇచ్చి ట్రీట్‌మెంట్‌ చేశారు. అంతేకాదు, నా తలలో ఉన్న ట్యూమర్‌ తీసేయడానికి ఇండియాలోని డాక్టర్లు 12 గంటలపాటు సర్జరీ చేశారు. సర్జరీ తర్వాత మేము కొంతకాలం ఇండియా బ్రాంచిలో ఉండి, కోలుకున్న తర్వాత బల్గేరియాకు తిరిగొచ్చాం.

మెల్లిమెల్లిగా హింట్స్‌కి కూడా వంశపారంపర్యంగా వచ్చే ఒక అరుదైన వ్యాధి వచ్చింది. దానివల్ల మాట్లాడడానికి, నడవడానికి చాలా ఇబ్బంది పడేవాడు. అంతేకాదు తన ప్రమేయం లేకుండా కాళ్లుచేతులు ఆడుతూ ఉండేవి. ఈ జబ్బు ముదిరే కొద్దీ ఆయన్ని దగ్గరుండి చూసుకోవాల్సి వచ్చేది. కొన్నిసార్లు నేను బాగా అలసిపోయేదాన్ని. ఇక ఆయన్ని చూసుకోలేనేమో అని కంగారుగా అనిపించేది. కానీ బాబీ అనే ఒక యువ సహోదరుడు హింట్స్‌తో కలిసి ప్రతీరోజు ప్రీచింగ్‌ చేసేవాడు. హింట్స్‌ మాట్లాడినప్పుడు తడబడినా, తన ప్రమేయం లేకుండా కాళ్లుచేతులు ఆడించినా బాబీ ఇబ్బందిపడేవాడు కాదు. హింట్స్‌కి ఏ అవసరం వచ్చినా, బాబీ ఎప్పుడూ పక్కనే ఉండేవాడు. ఈ వ్యవస్థలో నాకు, హింట్స్‌కి కన్నబిడ్డలు లేరేమో గానీ, బాబీని యెహోవా మాకు ఒక కొడుకుగా ఇచ్చాడు.—మార్కు 10:29, 30.

హింట్స్‌కి క్యాన్సర్‌ కూడా వచ్చింది. బాధాకరంగా, నా భర్త 2015లో చనిపోయాడు. నాకు చాలా ఒంటరిగా అనిపించింది. ఆయన ఇక లేడనే విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. కానీ ఆయన నా జ్ఞాపకంలో ఇంకా బ్రతికే ఉన్నాడు. (లూకా 20:38) హింట్స్‌ ప్రోత్సహిస్తూ మాట్లాడిన మాటలు, ఇచ్చిన సలహాల్ని రోజూ గుర్తుచేసుకుంటాను. చాలా సంవత్సరాలు హింట్స్‌తో కలిసి యెహోవా సేవ చేసినందుకు నాకు ఎంతో సంతృప్తిగా ఉంది.

యెహోవా ఇచ్చిన సహాయానికి ఎప్పుడూ రుణపడి ఉంటాను

నాకు వచ్చిన ప్రతీ కష్టంలో, యెహోవా నా చెయ్యి పట్టుకుని నడిపించాడు. సిగ్గును అధిగమించి, ప్రజల గురించి ఆలోచించే ఒక మంచి మిషనరీ అయ్యేలా కూడా ఆయన సహాయం చేశాడు. (2 తిమో. 1:7) ఆయన వల్లే మా చెల్లి, నేను పూర్తికాల సేవలో ఉన్నాం. ప్రస్తుతం మా చెల్లి, ఆమె భర్త యూరప్‌లోని సెర్బియన్‌ సర్క్యూట్‌లో ప్రాంతీయ సేవ చేస్తున్నారు. మా చిన్నప్పుడు మా నాన్న చేసిన ప్రార్థనలకు యెహోవా జవాబిచ్చాడు.

బైబిలు చదివిన ప్రతీసారి నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. కష్టమైన సమయాల్లో యేసులాగే “తీవ్రంగా” ప్రార్థించాలని నేను నేర్చుకున్నాను. (లూకా 22:44) సోఫియాలోని నాడెజ్డాలో ఉన్న సంఘంలోని నా స్నేహితులు చూపించే ప్రేమ, దయ రూపంలో యెహోవా నా ప్రార్థనలకు జవాబిస్తున్నాడు. వాళ్లు నన్ను వాళ్లింటికి పిలుస్తారు, నాతో కలిసి సమయం గడుపుతారు, నన్ను మెచ్చుకుంటారు. అవన్నీ నాకు ఎంతో సంతోషాన్నిస్తున్నాయి.

నేను తరచూ పునరుత్థానం గురించి లోతుగా ఆలోచిస్తూ ఉంటాను. కొత్తలోకంలో మా అమ్మానాన్నలు, వాళ్ల పెళ్లయినప్పుడు ఎంత యౌవనంగా ఉన్నారో అంతే యౌవనంగా ఉండి మా ఇంటిముందు నిలబడినట్టు, ఓ పక్క మా చెల్లి మా అందరి కోసం భోజనం వండుతున్నట్టు, ఇంకోపక్క హింట్స్‌ తన గుర్రం పక్కన నిలబడినట్టు ఊహించుకుంటాను. ఇలా ఊహించుకోవడం వల్ల నా బాధను మర్చిపోయి, సంతోషంగా ఉండగలుగుతాను. యెహోవా మీద కృతజ్ఞత కూడా పెంచుకోగలుగుతున్నాను.

ఒకసారి నా జీవితాన్ని నెమరేసుకుంటూ, భవిష్యత్తు వైపు చూస్తుంటే కీర్తన 27:13, 14లో దావీదు అన్న ఈ మాటలతో మనస్ఫూర్తిగా ఏకీభవిస్తాను. “సజీవుల దేశంలో యెహోవా మంచితనాన్ని చూస్తాననే నమ్మకం నాకు లేకపోతే, నేను ఎక్కడ ఉండేవాణ్ణి? యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండండి; ధైర్యంగా, నిబ్బరంగా ఉండండి. అవును, యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండండి.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి