కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 ఆగస్టు పేజీలు 20-25
  • తప్పుడు కోరికలతో ఎలా పోరాడి గెలవచ్చు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తప్పుడు కోరికలతో ఎలా పోరాడి గెలవచ్చు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మనం ఎలా ఆలోచించాలని సాతాను కోరుకుంటున్నాడు?
  • పాపంలో పుట్టడం వల్ల మనం ఎలా ఆలోచిస్తాం?
  • మీరెలా విజయం సాధించవచ్చు?
  • “పరీక్షించుకుంటూ ఉండండి”
  • ప్రలోభంలో పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • బాప్తిస్మం తర్వాత కూడా యేసును “అనుసరిస్తూ ఉండండి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • పాపుల్ని కాపాడడానికి యెహోవా ఏం చేశాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • తప్పు చేయాలనే కోరికను తిప్పికొట్టండి
    తేజరిల్లు!—2015
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 ఆగస్టు పేజీలు 20-25

అధ్యయన ఆర్టికల్‌ 35

పాట 121 మనకు ఆత్మనిగ్రహం అవసరం

తప్పుడు కోరికలతో ఎలా పోరాడి గెలవచ్చు?

“నశించిపోయే మీ శరీరాల మీద పాపాన్ని రాజుగా ఏలనివ్వకండి, అప్పుడు మీరు శరీర కోరికలకు లొంగిపోరు.”—రోమా. 6:12.

ముఖ్యాంశం

తప్పు చేయాలనే కోరికలు వచ్చినప్పుడు డీలాపడిపోకుండా వాటిని ఎలా తిప్పికొట్టవచ్చో చూస్తాం.

1. అపరిపూర్ణ మనుషులందరి విషయంలో ఏది సర్వసాధారణం?

యెహోవాకు ఇష్టంలేని పని చేయాలనే బలమైన కోరిక మీకు ఎప్పుడైనా వచ్చిందా? అలాగైతే, ఈ ప్రపంచంలో ఎవ్వరికీ రానంత పెద్ద పరీక్ష మీకు వచ్చిందని అనుకోకండి. బైబిలు ఇలా చెప్తుంది: “మనుషులకు సాధారణంగా వచ్చే ప్రలోభాలు తప్ప కొత్తవేమీ మీకు రాలేదు.” (1 కొరిం. 10:13) అంటే మీరు ఎలాంటి తప్పుడు కోరికలతో పోరాడుతున్నారో, మిగతావాళ్లు కూడా అలాంటి వాటితోనే పోరాడుతున్నారు. అయితే, మీరు వాటితో ఒంటరి పోరాటం చేయాల్సిన అవసరంలేదు. ఆ కోరికలతో పోరాడి గెలవడానికి యెహోవా మీకు సహాయం చేస్తాడు.

2. కొంతమంది క్రైస్తవులు అలాగే బైబిలు విద్యార్థులు ఎలాంటి కోరికలతో పోరాడుతున్నారు? (చిత్రాలు కూడా చూడండి.)

2 బైబిలు ఇంకా ఇలా చెప్తుంది: “ఒక వ్యక్తి కోరికే అతన్ని లాక్కెళ్లి, వలలో పడేసి అతన్ని పరీక్షకు గురిచేస్తుంది.” (యాకో. 1:14) అయితే ఒక్కో వ్యక్తికి, ఒక్కో పరీక్ష ఎదురౌతుంది. ఉదాహరణకు కొంతమంది పురుషులకు, ఆడవాళ్లతో తప్పుచేయాలని అనిపించవచ్చు. ఇంకొంతమంది పురుషులకు, పురుషుల్ని చూసినా అలాగే అనిపించవచ్చు. మరికొంతమంది అశ్లీల చిత్రాలు చూసే అలవాటును మానుకున్నాసరే, వాళ్ల మనసు అటువైపు లాగేస్తూ ఉండవచ్చు. డ్రగ్స్‌ తీసుకోవడం, అతిగా మందు తాగడం మానేసిన చాలామందికి, మళ్లీ వాటివైపు మనసు లాగవచ్చు. ఇలాంటి కోరికలతో కొంతమంది క్రైస్తవులు అలాగే బైబిలు విద్యార్థులు, ప్రతీరోజు పోరాటం చేస్తున్నారు. అయితే, ఏదోక సందర్భంలో మనందరికి అపొస్తలుడైన పౌలుకు అనిపించినట్టే అనిపించి ఉండవచ్చు. “నేను సరైనది చేయాలనుకున్నప్పుడు, చెడు చేయడం వైపే మొగ్గుచూపుతున్నాను.”—రోమా. 7:21.

ప్రలోభం ఎప్పుడైనా, ఎక్కడైనా ఊహించకుండా రావచ్చు (2వ పేరా చూడండి)c


3. తప్పడు కోరిక ఒక మనిషి మనసులో తిష్ఠ వేసుకుని కూర్చుంటే ఎలా అనిపిస్తుంది?

3 ఏదైనా తప్పుడు కోరిక మీ మనసులో తిష్ఠ వేసుకుని కూర్చుంటే, ఇక దానితో పోరాడి సరైనది చేసే శక్తి లేదని అనిపించవచ్చు. అంతేకాదు, ఆ తప్పుడు కోరిక వల్ల యెహోవా మిమ్మల్ని ఎప్పటికీ అంగీకరించడు అనుకుని ఏ దిక్కుమొక్కు లేనట్టు అనిపించవచ్చు. అయితే ఆ ఆలోచనలు అన్నీ తప్పే. ఎందుకో వివరించడానికి ఈ ఆర్టికల్‌లో రెండు ప్రశ్నలకు జవాబులు చూస్తాం: (1) సరైనది చేసే శక్తి లేదని, ఏ దిక్కుమొక్కు లేదని అనిపించే ఆ ఆలోచనలు ఎక్కడ నుండి వస్తాయి? (2) తప్పుడు కోరికలతో ఎలా పోరాడి గెలవచ్చు?

మనం ఎలా ఆలోచించాలని సాతాను కోరుకుంటున్నాడు?

4. (ఎ) తప్పుడు కోరికలతో పోరాడే శక్తి మనకు లేదనుకోవాలని సాతాను ఎందుకు కోరుకుంటున్నాడు? (బి) కానీ మనం తప్పుడు కోరికలతో పోరాడగలమని ఎందుకు చెప్పవచ్చు?

4 మనకు ప్రలోభం ఎదురైతే, సరైనది చేసే శక్తి లేదని మనం అనుకోవాలని సాతాను కోరుకుంటున్నాడు. సాతాను ప్రలోభంలో పడేస్తాడని చెప్తూ, యేసు తన శిష్యుల్ని ఇలా ప్రార్థించమన్నాడు: “మమ్మల్ని ప్రలోభానికి లొంగిపోనివ్వకు, దుష్టుని నుండి మమ్మల్ని కాపాడు.” (మత్త. 6:13) ప్రలోభం ఎదురైతే మనుషులు దానికి లొంగిపోయి, యెహోవాకు లోబడరని సాతాను నిందించాడు. (యోబు 2:4, 5) అది ఎంత వెర్రితనమో కదా! అసలు సొంత కోరికలకు లొంగిపోయింది, సాతాను. యెహోవాకు నమ్మకంగా లేనిది, సాతాను. అందుకే, మనం కూడా తనలాగే ఉంటామని అతను అనుకుంటున్నాడు. మనకు కూడా ఏదైనా ప్రలోభం ఎదురైతే, యెహోవాను ఇట్టే వదిలేస్తామని అనుకుంటున్నాడు. ఆఖరికి పరిపూర్ణుడైన దేవుని కుమారుడు కూడా ప్రలోభం ఎదురైతే, తనలాగే పడిపోతాడని సాతాను అనుకున్నాడు. (మత్త. 4:8, 9) కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచించండి: నిజంగానే మనకు తప్పుడు కోరికలతో పోరాడే శక్తి లేదంటారా? ఖచ్చితంగా ఉంది! అపొస్తలుడైన పౌలు మాటలతో మనం కూడా ఒప్పుకుంటాం: “నాకు శక్తిని ఇచ్చే దేవుని ద్వారా నేను ఏదైనా చేయగలను.”—ఫిలి. 4:13.

5. మనం తప్పుడు కోరికలతో పోరాడి గెలుస్తామనే నమ్మకం యెహోవాకు ఉందని ఎలా చెప్పవచ్చు?

5 సాతానులా కాకుండా, యెహోవాకు మనమీద నమ్మకం ఉంది. తప్పుడు కోరికలతో పోరాడే శక్తి మనకు ఉందని ఆయన నమ్ముతున్నాడు. అది మనకు ఎలా తెలుసు? చివరివరకు నమ్మకంగా ఉండి, మహాశ్రమను తప్పించుకునే ఒక గొప్ప సమూహం ఉంటుందని యెహోవా ముందే చెప్పాడు. ఒకసారి దీనిగురించి ఆలోచించండి: అబద్ధమాడని యెహోవా కేవలం కొద్దిమంది కాదు, చాలామంది స్వచ్ఛమైన మనస్సాక్షితో కొత్తలోకంలోకి వెళ్తారని చెప్పాడు. “వీళ్లు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కొని వాటిని తెల్లగా చేసుకున్నారు.” (ప్రక. 7:9, 13, 14) కాబట్టి తప్పుడు కోరికలతో పోరాడే శక్తి మనకు ఖచ్చితంగా ఉందని యెహోవా నమ్ముతున్నాడు.

6-7. మనకు దిక్కుమొక్కు లేదనుకోవాలని సాతాను ఎందుకు కోరుకుంటున్నాడు?

6 తప్పుడు కోరికల్ని తిప్పికొట్టే శక్తి మనలో లేదనేకాదు, ఆ తప్పుడు కోరికలు ఉన్నందుకు యెహోవా మనకు శాశ్వత జీవితాన్ని ఇవ్వడని అనుకుంటూ, ఏ దిక్కుమొక్కు లేకుండా తిరగాలని సాతాను కోరుకుంటున్నాడు. అసలు వింతేంటంటే, శాశ్వత జీవితం పొందే అర్హత కోల్పోయి, ఏ దిక్కుమొక్కు లేకుండా తిరిగేది, సాతాను! (ఆది. 3:15; ప్రక. 20:10) తనకు దక్కని శాశ్వత జీవితం, మనకు కూడా దక్కకుండా చేయాలని సాతాను కోరుకోవడంలో ఆశ్చర్యమేలేదు. అయితే, మనకూ అతనికీ అసలు పోలికేలేదు. యెహోవా మనల్ని వదిలేయాలి అనుకోవట్లేదు గానీ మనం శాశ్వత జీవితం పొందేలా సహాయం చేయాలనుకుంటున్నాడని బైబిలు చెప్తుంది. “ఎందుకంటే ఎవ్వరూ నాశనమవ్వడం ఆయనకు ఇష్టంలేదు. ఆయన, అందరికీ పశ్చాత్తాపపడే అవకాశం దొరకాలని కోరుకుంటున్నాడు.”—2 పేతు. 3:9.

7 తప్పుడు కోరికలతో పోరాడే శక్తిలేదని లేదా మనకు ఏ దిక్కుమొక్కు లేదని ఒకవేళ అనుకుంటే, మనం సాతాను బుట్టలో పడినట్టే! ఎందుకంటే, మనం అలా అనుకోవాలనే అతను కోరుకుంటున్నాడు. ఈ విషయాన్ని మనం గుర్తిస్తే, స్థిరంగా ఉంటూ సాతాన్ని ఎదిరించాలనే మన నిర్ణయం బలపడుతుంది.—1 పేతు. 5:8, 9.

పాపంలో పుట్టడం వల్ల మనం ఎలా ఆలోచిస్తాం?

8. తప్పుడు పనులే కాకుండా పాపంలో ఇంకా ఏమేమి ఉన్నాయి? (కీర్తన 51:5) (“పదాల వివరణ” కూడా చూడండి.)

8 మనకు తప్పుడు కోరికలతో పోరాడే శక్తి లేదని లేదా మనకు ఏ దిక్కుమొక్కు లేదని అనిపించడానికి, సాతానే కాకుండా ఇంకో కారణం కూడా ఉంది. అదేంటంటే మనలో ఉన్న పాపం. మన మొదటి తల్లిదండ్రుల నుండి అది మనకు వంశపారంపర్యంగా వచ్చింది.a—యోబు 14:4; కీర్తన 51:5 చదవండి.

9-10. (ఎ) పాపం వల్ల ఆదాముహవ్వలకు ఎలా అనిపించింది? (చిత్రం కూడా చూడండి.) (బి) మనకు కూడా ఎలా అనిపిస్తుంది?

9 ఆదాముహవ్వలు పాపం చేయడం వల్ల, వాళ్లకు ఎలా అనిపించిందో గమనించండి. యెహోవాకు అవిధేయత చూపించిన తర్వాత వాళ్లు దాక్కున్నారు. వాళ్ల శరీరాల్ని కప్పుకోవడానికి ప్రయత్నించారు. వాళ్లు చేసిన పని గురించి లేఖనాలపై అంతర్దృష్టి (ఇంగ్లీష్‌) ఇలా చెప్తుంది: “వాళ్లు చేసిన పాపం వల్ల వాళ్లు అపరాధ భావంతో, ఆందోళనతో, అభద్రతా భావంతో, అవమానంతో ఉన్నారు.” ఒకరకంగా, ఆదాముహవ్వలు ఈ నాలుగు గదులున్న ఇంట్లో బందీలయ్యారు. వాళ్లు ఒక గది నుండి ఇంకో గదికి వెళ్లగలుగుతారు గానీ, ఆ ఇంటి నుండి బయటికి రాలేరు. అంటే వాళ్ల పాపపు స్థితి నుండి బయటపడలేరు.

10 అయితే ఆదాముహవ్వల పరిస్థితి, మన పరిస్థితి వేర్వేరుగా ఉంది. ఎందుకంటే, వాళ్లకు విమోచన క్రయధనం వర్తించదు, మనకు మాత్రం వర్తిస్తుంది. ఆ విమోచన క్రయధనం వల్ల మన పాపాలన్నీ కడగబడి, మంచి మనస్సాక్షితో ఉండగలుగుతాం. (1 కొరిం. 6:11) అయితే, వాళ్ల నుండి వచ్చిన పాపం మాత్రం మనలో అలాగే ఉంది. అందుకే మనం కూడా అపరాధ భావంతో, ఆందోళనతో, అభద్రతా భావంతో, అవమానంతో ఉంటాం. నిజానికి మనుషులందర్నీ పాపం పట్టిపీడిస్తుందని బైబిలు చెప్తుంది. అలాగే “ఆదాములా పాపం చేయనివాళ్లను” కూడా అది పట్టిపీడిస్తుంది. (రోమా. 5:14) ఈ వాస్తవం విన్నాక మన గుండె జారిపోయినట్టు అనిపించవచ్చు. కానీ అంతమాత్రాన, దాంతో పోరాడే శక్తి మనకు లేదని గానీ, ఏ దిక్కుమొక్కు లేదని గానీ మనం అనుకోవాల్సిన అవసరంలేదు. మనం అలాంటి భావాలతో ఎలా పోరాడవచ్చో ఇప్పుడు చూద్దాం.

ఆదాముహవ్వలు సిగ్గుపడి, జంతు చర్మాలతో చేసుకున్న బట్టలు వేసుకొని ఏదెను తోట నుండి బయటకు వస్తున్నారు.

పాపం వల్ల ఆదాముహవ్వలు అపరాధ భావంతో, ఆందోళనతో, అభద్రతా భావంతో, అవమానంతో నలిగిపోయారు (9వ పేరా చూడండి)


11. తప్పుడు కోరికలతో పోరాడే శక్తిలేదని మనకు అనిపిస్తే ఏం చేయాలి? ఎందుకు? (రోమీయులు 6:12)

11 తప్పుడు కోరికలతో పోరాడే శక్తి లేదని మీకు అనిపిస్తుందా? అలాగైతే, మీలో ఉన్న పాపమే మీకు అలా చెప్తుంది. దాని మాట అస్సలు వినకండి. ఎందుకంటే, మీమీద పాపాన్ని “రాజుగా ఏలనివ్వకండి” అని బైబిలు చెప్తుంది. (రోమీయులు 6:12 చదవండి.) దానర్థం తప్పుడు కోరికలు మనలో వచ్చినంత మాత్రాన, దాని ప్రకారం ప్రవర్తించాలని లేదు. (గల. 5:16) మనం తప్పుడు కోరికలతో పోరాడగలమని యెహోవా నమ్ముతున్నాడు. ఒకవేళ ఆయన నమ్మకపోతే, అలా చేయమని మనకు చెప్పడు కదా! (ద్వితీ. 30:11-14; రోమా. 6:6; 1 థెస్స. 4:3) కాబట్టి తప్పుడు కోరికలతో పోరాడే శక్తి లేదని మనం అస్సలు అనుకోకూడదు.

12. మనకు ఏ దిక్కుమొక్కు లేదని అనిపించినప్పుడు ఏం చేయాలి? ఎందుకు?

12 అదేవిధంగా కేవలం తప్పుడు కోరికలు వచ్చినందుకు యెహోవా మిమ్మల్ని అంగీకరించడని, ఇక ఏ దిక్కుమొక్కు లేదని అనిపిస్తుందా? అలాగైతే మీలో ఉన్న పాపమే మీకు అలా చెప్తుంది. దాని మాట అస్సలు వినకండి. ఎందుకంటే, మనలో అణువణువు పాపం ఉందని యెహోవా అర్థం చేసుకుంటున్నాడని బైబిలు చెప్తుంది. (కీర్త. 103:13, 14) ఆయనకు మన గురించి “అన్నీ తెలుసు.” ఆఖరికి ఆదాముహవ్వల నుండి వచ్చిన పాపం వల్లే మనలో తప్పుడు కోరికలు పుడుతున్నాయని కూడా ఆయనకు తెలుసు. (1 యోహా. 3:19, 20) తప్పుడు కోరికల ప్రకారం మనం ప్రవర్తించనంత వరకు, యెహోవా ముందు మంచి మనస్సాక్షితో ఉండగలుగుతాం. అలాగని ఎందుకు చెప్పవచ్చు?

13-14. మనలో చెడు కోరికలు ఉన్నంతమాత్రాన ఇక యెహోవా మనల్ని అంగీకరించడా? వివరించండి.

13 తప్పుడు కోరికకు, తప్పుడు పనికి మధ్య చాలా పెద్ద తేడా ఉందని బైబిలు చెప్తుంది. తప్పుడు కోరికలు రావడం-రాకపోవడం మన చేతుల్లో ఉండదు. కానీ దాని ప్రకారం ప్రవర్తించాలా-వద్దా అన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఉదాహరణకు, మొదటి శతాబ్దంలోని కొరింథు సంఘంలో కొంతమంది, ఒకప్పుడు పురుషులు-పురుషులతో, స్త్రీలు-స్త్రీలతో లైంగిక సంబంధాలు పెట్టుకునేవాళ్లు. పౌలు కొరింథీయులకు ఇలా రాశాడు: “మీలో కొందరు ఒకప్పుడు అలాంటివాళ్లే.” అయితే, వాళ్లు మారిన తర్వాత ఇక అలాంటి కోరికలు వాళ్లలో మళ్లీ ఎప్పుడూ పుట్టలేదా? అలాగని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే, చాలావరకు అలాంటి కోరికలు నరనరాల్లో ఇంకిపోయి ఉంటాయి. కానీ ఆత్మనిగ్రహం చూపించిన క్రైస్తవులు అలాంటి కోరికల ప్రకారం ప్రవర్తించకుండా ఉన్నారు కాబట్టి, యెహోవా వాళ్లను అంగీకరించాడు. ఆయన వాళ్లను ‘శుభ్రం చేయబడిన’ వాళ్లుగా చూశాడు. (1 కొరిం. 6:9-11) మన విషయంలో కూడా అంతే.

14 మీరు ఎలాంటి చెడు కోరికలతో పోరాడుతున్నా, మీరు వాటిని అధిగమించగలరు. బహుశా వాటిని మీలో నుండి పూర్తిగా తీసేసుకోలేకపోవచ్చు. కానీ ఆత్మనిగ్రహం చూపిస్తూ “శరీరం కోరుకున్నవాటిని, మనసుకు నచ్చినవాటిని” చేయకుండా ఉండగలరు. (ఎఫె. 2:3) మీరు అలా ఉంటూ చెడు కోరికలతో పోరాడి ఎలా విజయం సాధించవచ్చు?

మీరెలా విజయం సాధించవచ్చు?

15. తప్పుడు కోరికలతో పోరాడి గెలవాలని మనకు ఉంటే, మనతో మనం ఎందుకు నిజాయితీగా ఉండాలి?

15 తప్పుడు కోరికలతో పోరాడి విజయం సాధించాలంటే, మీ బలహీనతల విషయంలో మీతో మీరు నిజాయితీగా ఉండాలి. “తప్పుడు తర్కంతో” మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా జాగ్రత్తపడండి. (యాకో. 1:22) ఉదాహరణకు, కొంతమంది తమకు ఉన్న సమస్య పెద్ద సమస్యే కాదులే అని కొట్టిపారేయడానికి ఇలా ఆలోచిస్తారు: ఒక వ్యక్తికి బాగా తాగే అలవాటుంటే అతను, ‘నాకంటే ఎక్కువ తాగేవాళ్లు ఉన్నారులే’ అని తప్పుగా ఆలోచించవచ్చు. ఇంకొంతమంది వాళ్ల తప్పుకు వేరేవాళ్లను నిందిస్తుంటారు. అంటే ఒకవేళ ఒక వ్యక్తికి అశ్లీల చిత్రాలు చూసే అలవాటుంటే, అతను ఇలా అనుకోవచ్చు: ‘నా భార్య నాతో సరిగ్గా ఉంటే నేను వాటి జోలికి ఎందుకు వెళ్తాను?’ ఇలాంటి ఆలోచనలు మీలో ఏ మూలన ఉన్నా, ప్రలోభం వస్తే పడిపోవడానికి మీకు క్షణం పట్టదు. కాబట్టి మీరు చేసే తప్పుడు పనిని సమర్థించుకోవడానికి అస్సలు ప్రయత్నించకండి, ఆఖరికి మీ ఆలోచనలో కూడా అలా చేయకండి. ఎందుకంటే, మీ పనులకు మీరే బాధ్యులు!—గల. 6:7.

16. ప్రలోభానికి లొంగిపోవద్దనే మీ నిర్ణయాన్ని ఎలా బలపర్చుకోవచ్చు?

16 మీ బలహీనతల విషయంలో మీతో మీరూ నిజాయితీగా ఉంటూనే, వాటికి లొంగిపోకుండా ఉండాలనే మీ నిర్ణయాన్ని ఇంకా బలపర్చుకోండి. (1 కొరిం. 9:26, 27; 1 థెస్స. 4:4; 1 పేతు. 1:15, 16) మీరు దేనికి-ఎప్పుడు లొంగిపోతారో గమనించుకోండి. మీరు ఫలానా ప్రలోభానికి, లేదా రోజులో ఫలానా టైంకి ప్రలోభానికి లొంగిపోవచ్చు. ఉదాహరణకు, మీరు బాగా అలసిపోయినప్పుడు లేదా రాత్రి బాగా లేట్‌ అయినప్పుడు, మీరు త్వరగా ప్రలోభానికి లొంగిపోతారా? మీకు ఏ ప్రలోభం ఎదురౌతుందో పసిగట్టి, అది వస్తే ఏం చేయాలో మనసులో సిద్ధపడి ఉండండి. అయితే, ఇదంతా ప్రలోభం రాకముందే చేయాల్సిన పని.—సామె. 22:3.

17. యోసేపు ఉదాహరణ నుండి మనం ఏ నేర్చుకోవచ్చు? (ఆదికాండం 39:7-9) (చిత్రాలు కూడా చూడండి.)

17 పోతీఫరు భార్య తనను లొంగదీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు యోసేపు ఏం చేశాడో గమనించండి. ఆమె ప్రయత్నాల్ని యోసేపు వెంటనే తిప్పికొట్టాడు, ఆమెను వద్దనుకున్నాడు. (ఆదికాండం 39:7-9 చదవండి.) అదేం చూపిస్తుంది? వేరేవాళ్ల భార్యను ముట్టుకోవడం తప్పని, పోతీఫరు భార్య తనను ప్రలోభపెట్టడానికి ముందే యోసేపుకు తెలుసు. అలా ముట్టుకోకూడదని కూడా ఆయన నిర్ణయించుకున్నాడు. అదేవిధంగా, ప్రలోభం రాకముందే సరైంది చేయాలనే మీ నిర్ణయాన్ని బలపర్చుకోవాలి. అలా మీకు ప్రలోభం వస్తే, మీరు అప్పటికే తీసుకున్న నిర్ణయానికి తగ్గట్టు ప్రవర్తించడం మీకు తేలికౌతుంది.

చిత్రాలు: 1. యోసేపు పోతీఫరు భార్య నుండి పారిపోతున్నాడు, ఆమె చేతుల్లో ఆయన వస్త్రం ఉంది. 2. స్కూల్లో ఒకమ్మాయి సరసంగా మాట్లాడుతుంటే, ఒక టీనేజీ బ్రదర్‌ దానికి ఒప్పుకోవట్లేదు.

ప్రలోభాన్ని యోసేపులాగే వెంటనే తిప్పికొట్టండి! (17వ పేరా చూడండి)


“పరీక్షించుకుంటూ ఉండండి”

18. తప్పుడు కోరికలతో చేసే పోరాటంలో మీరు ఎలా విజయం సాధించవచ్చు? (2 కొరింథీయులు 13:5)

18 తప్పుడు కోరికలతో పోరాడి విజయం సాధించాలంటే, మిమ్మల్ని మీరు “పరీక్షించుకుంటూ ఉండాలి.” (2 కొరింథీయులు 13:5 చదవండి.) అంటే ప్రతీసారి మీరెలా ఉన్నారో ఆలోచించుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మీ ఆలోచనల్ని, పనుల్ని పరిశీలించుకుని, అవసరమైన మార్పులు చేసుకుంటూ ఉండాలి. ఉదాహరణకు, మీరు ఒక ప్రలోభాన్ని చక్కగా తిప్పికొట్టినా సరే, ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను ఆ ప్రలోభాన్ని తిరస్కరించడానికి నాకు ఎంత టైం పట్టింది?’ ఒకవేళ మీరు లేట్‌ చేశారని మీకు అనిపిస్తే, మిమ్మల్ని మీరు తిట్టుకోకండి. బదులుగా, ఈసారి ఎలా మెరుగవ్వవచ్చో ఆలోచించండి. దానికోసం మీరు ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘తప్పుడు కోరికను తిప్పికొట్టడానికి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఉండగలనా? నేను చూసే వినోదం వల్ల ప్రలోభాన్ని తిప్పికొట్టడం ఇంకా కష్టమౌతుందా? ఏదైనా అనైతిక సీన్లు వచ్చినప్పుడు నా కళ్లను వెంటనే తిప్పేసుకుంటున్నానా? యెహోవాకు లోబడుతూ ఉండేలా ఆత్మనిగ్రహం చూపించడానికి నేను కష్టపడాల్సి వచ్చినాసరే, అది నా మంచి కోసమే అని నేను గుర్తిస్తున్నానా?’—కీర్త. 101:3.

19. చిన్నచిన్న తెలివితక్కువ నిర్ణయాలు తప్పుడు కోరికలతో పోరాడడాన్ని ఇంకా కష్టం చేస్తాయని ఎలా చెప్పవచ్చు?

19 తప్పుడు ప్రవర్తనకు సాకులు వెదకకండి. బైబిలు ఇలా చెప్తుంది: “హృదయం అన్నిటికన్నా మోసకరమైంది, ప్రమాదకరమైంది.” (యిర్మీ. 17:9) ఆ హృదయం నుండే “దుష్ట ఆలోచనలు” వస్తాయని యేసు చెప్పాడు. (మత్త. 15:19) ఉదాహరణకు, అశ్లీల చిత్రాలు చూడడం మానేసిన ఒకవ్యక్తి కొంతకాలం తర్వాత, ‘నేను చూసేవి నగ్నంగా లేనంతవరకు లైంగిక కోరికలు రేకెత్తించే ఫోటోల్ని చూడడంలో తప్పేమీ లేదు’ అనుకోవచ్చు. అతను ఇంకా ఇలా కూడా అనుకోవచ్చు: ‘నేను తప్పు చేయనంతవరకు, తప్పుడు ఆలోచనల గురించి ఊహించుకోవడంలో ఏ తప్పులేదు.’ అలా ఆలోచిస్తే ఒకరకంగా, అతని మోసకరమైన హృదయం “శరీర కోరికలు తీర్చుకోవడం” కోసం ప్రణాళిక వేస్తుంది. (రోమా. 13:14) మీరు అలా చేయకుండా ఎలా ఉండవచ్చు? జాగ్రత్తగా ఉంటూ చిన్నచిన్న తెలివితక్కువ నిర్ణయాలు, పెద్దపెద్ద తెలివితక్కువ నిర్ణయాలకు దారితీస్తాయని గుర్తుంచుకుని, వాటికి దూరంగా ఉండండి. ఎందుకంటే అవి ఘోరమైన తప్పుకు దారితీయవచ్చు.b అలాగే తప్పుడు ప్రవర్తనకు సాకులు చెప్పేలాంటి “దుష్ట ఆలోచనలు” రానివ్వకండి.

20. భవిష్యత్తులో మనకు ఏది ఉపశమనాన్ని ఇస్తుంది? ప్రస్తుతం మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?

20 మనం నేర్చుకున్నట్టు, యెహోవా సహాయంతో ప్రలోభాల్ని ఎదిరించేంత శక్తి మనకు ఉంటుంది. అంతేకాదు, ఆయన కరుణ వల్ల మనందరం కొత్తలోకంలో శాశ్వతకాలం జీవించవచ్చు అనే ఆశ ఉంది. యెహోవాను స్వచ్ఛమైన మనసుతో, స్వచ్ఛమైన హృదయంతో సేవ చేస్తాము అనే ఆలోచన ఎంత ఉపశమనాన్ని ఇస్తుందో కదా! అయితే, అప్పటివరకు తప్పుడు కోరికల్ని తిప్పి కొట్టేంత శక్తి మనకు లేదని గానీ, ఏ దిక్కుమొక్కు లేదని గానీ మనం ఎప్పుడూ అనుకోకూడదు. యెహోవా దీవెనలతో మనం చేసే ప్రయత్నంలో విజయం సాధిస్తాం.

మీరెలా జవాబిస్తారు?

  • తప్పుడు కోరికలతో పోరాడే శక్తి లేదని, ఏ దిక్కుమొక్కు లేదనే ఆలోచనతో మనం ఎలా పోరాడవచ్చు?

  • పాపం మనమీద ‘రాజులా ఏలనివ్వకుండా’ మనం ఎలా చూసుకోవచ్చు?

  • మనల్ని మనం ఎలా “పరీక్షించుకుంటూ ఉండవచ్చు?”

పాట 122 విశ్వాసంలో సుస్థిరం అవ్వండి

a పదాల వివరణ: బైబిల్లో “పాపం” అనే పదం తరచుగా దొంగతనం, వ్యభిచారం, హత్యను సూచిస్తుంది. (నిర్గ. 20:13-15; 1 కొరిం. 6:18) అయితే, ఇంకొన్ని లేఖనాల్లో “పాపం” అనే పదం, మనం ఏ తప్పూ చేయకపోయినా, మనకు పుట్టుకతో వచ్చిన స్థితిని సూచిస్తుంది.

b సామెతలు 7:7-23లో ఉన్న యువకుడు, లైంగిక పాపం అనే పెద్ద తెలివితక్కువ నిర్ణయం తీసుకోవడానికి ముందు, చిన్నచిన్న తెలివితక్కువ నిర్ణయాలు తీసుకున్నాడు.

c చిత్రాల వివరణ: ఎడమ: కాఫీ షాపులో కూర్చున్న ఒక యౌవన సహోదరుడు, ఇద్దరు అబ్బాయిలు సరసాలాడుకోవడం గమనిస్తున్నాడు. కుడి: ఇద్దరు వ్యక్తులు సిగరెట్‌ తాగడం గమనిస్తున్న ఒక సిస్టర్‌.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి