కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 జూలై పేజీలు 20-25
  • సంతృప్తిగా జీవించడం అనే రహస్యం మీకు తెలుసా

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సంతృప్తిగా జీవించడం అనే రహస్యం మీకు తెలుసా
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కృతజ్ఞతతో ఉండండి
  • వినయంగా ఉంటూ యెహోవా ఇష్టం మీద మనసుపెట్టండి
  • భవిష్యత్తు మీద మీకున్న ఆశ గురించి ఆలోచించండి
  • “ఆయనకు భయపడేవాళ్లకు ఏ లోటూ ఉండదు”
  • మనకు తెలియనివి తెలీదని ఒప్పుకోవాలంటే వినయం కావాలి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • యెహోవా “జీవంగల దేవుడు” అని గుర్తుంచుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
    2025-2026 ప్రాంతీయ సమావేశ కార్యక్రమం, ప్రాంతీయ పర్యవేక్షకునితో
  • మీరు సత్యాన్ని గుర్తిస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 జూలై పేజీలు 20-25

అధ్యయన ఆర్టికల్‌ 31

పాట 111 మన సంతోషానికి కారణాలు

సంతృప్తిగా జీవించడం అనే రహస్యం మీకు తెలుసా?

“నా పరిస్థితులు ఎలా ఉన్నా సంతృప్తిగా ఉండడం నేను నేర్చుకున్నాను.”—ఫిలి. 4:11.

ముఖ్యాంశం

సంతృప్తిగా జీవించడం నేర్చుకోవాలంటే కృతజ్ఞతను పెంచుకోవాలి, వినయంగా ఉంటూ యెహోవా ఇష్టం మీద మనసుపెట్టాలి, భవిష్యత్తు మీద మనకున్న ఆశ గురించి ఆలోచించాలి.

1. సంతృప్తిగా ఉండడం అంటే ఏంటి? ఏంకాదు?

మీరు సంతృప్తిగా ఉన్నారా? సంతృప్తిగా ఉండే వ్యక్తి యెహోవా ఇప్పుడు తమకు ఇచ్చినవాటి మీద మనసుపెడుతూ సంతోషంగా, మనశ్శాంతిగా ఉంటారు. లేనివాటి గురించి బాధపడరు, కోపం తెచ్చుకోరు. సంతృప్తిగా ఉండడం అంటే, ఉన్నది చాలు ఇక కష్టపడడం ఎందుకులే అని అనుకోవడం కాదు. ఉదాహరణకు, ఒక క్రైస్తవుడు సేవావకాశాల్ని కోరుకోవడంలో తప్పులేదు. (రోమా. 12:1; 1 తిమో. 3:1) కానీ సంతృప్తిగా ఉన్న క్రైస్తవుడైతే, తను కోరుకున్న సేవావకాశం లేటైనా లేదా రాకపోయినా బాధపడడు.

2. అసంతృప్తి ఎందుకు ప్రమాదకరం?

2 అసంతృప్తి, చెడు వైపుకు అడుగులు వేయిస్తుంది. ఉన్నవాటితో ఎప్పుడూ సంతృప్తి చెందని వ్యక్తి, అనవసరమైన వస్తువుల్ని కొనుక్కోవడానికి గంటల తరబడి కష్టపడతాడు. ఘోరమైన విషయం ఏంటంటే, కొంతమంది క్రైస్తవులు డబ్బును, కోరుకున్న వస్తువును దొంగతనం చేయడానికి కూడా వెనకాడలేదు. బహుశా వాళ్లు, ‘ఇది నాకు రావాల్సిందే!’ ‘ఇది నాకు ఇప్పుడే కావాలి!’ లేదా ‘నేను డబ్బులు ఇప్పుడు తీసుకుని, తర్వాత ఎక్కడ నుండి తీశానో అక్కడే పెట్టేస్తా’ అని తమకుతాము చెప్పుకుని ఉంటారు. ఎలాంటి దొంగతనాలైనా యెహోవాకు పరమ అసహ్యం. అవి ఆయనకు చెడ్డపేరు తీసుకొస్తాయి. (సామె. 30:9) ఇంకొంతమంది క్రైస్తవులు ఎంతగా అసంతృప్తి చెందారంటే, కోరుకున్న సేవావకాశం రాకపోతే, యెహోవాను ఆరాధించడమే ఆపేశారు. (గల. 6:9) ఒక యెహోవా సేవకుడు అలా చేసేంత దూరం వెళ్లాడంటే, అతనిలో అసంతృప్తి చాపకింద నీరులా పాకి ఉంటుంది.

3. ఫిలిప్పీయులు 4:11, 12 లో మనకు సంతృప్తికి సంబంధించి ఏ భరోసా ఉంది?

3 మనందరం సంతృప్తిగా ఉండడం సాధ్యమే. “నా పరిస్థితులు ఎలా ఉన్నా సంతృప్తిగా ఉండడం నేను నేర్చుకున్నాను” అని అపొస్తలుడైన పౌలు అన్నాడు. (ఫిలిప్పీయులు 4:11, 12 చదవండి.) ఆయన ఆ మాటల్ని ఖైదీగా ఉన్నప్పుడు రాశాడు. అంటే ఆయన అలాంటి పరిస్థితుల్లో కూడా తన సంతోషాన్ని చెక్కుచెదరనివ్వలేదు. సంతృప్తిగా జీవించడం అనే “రహస్యం” ఆయన తెలుసుకున్నాడు. ఒకవేళ మన జీవితంలో సంతృప్తి కరువైతే, దాన్ని పెంచుకోవడానికి పౌలు మాటలు, ఆయన అనుభవం మనకు కావాల్సిన భరోసా ఇస్తాయి. మన పరిస్థితుల్ని బట్టి సంతృప్తి దానంతట అదే వచ్చేస్తుంది అనుకోకూడదు. బదులుగా, సంతృప్తిగా ఉండడం మనం నేర్చుకోవాలి. ఎలా? సంతృప్తిగా జీవించడం అనే రహస్యాన్ని తెలుసుకోవడానికి మనకు పనికొచ్చే కొన్ని లక్షణాల్ని చూద్దాం.

కృతజ్ఞతతో ఉండండి

4. కృతజ్ఞత సంతృప్తిని ఎలా పెంచుతుంది? (1 థెస్సలొనీకయులు 5:18)

4 కృతజ్ఞత సంతృప్తిని పెంచుతుంది. (1 థెస్సలొనీకయులు 5:18 చదవండి.) ఉదాహరణకు, మనకు ఉన్నవాటి మీద నిజమైన కృతజ్ఞత ఉంటే, లేనివాటి గురించి అతిగా బాధపడం. ప్రస్తుతం మనకున్న సేవావకాశాల మీద కృతజ్ఞత ఉంటే, ఇంకా రాని సేవావకాశాల గురించి అతిగా బాధపడం. బదులుగా, మన చేతిలో ఉన్న నియామకాన్ని ఇంకా బాగా చేయడానికి చూస్తాం. అందుకే, యెహోవాకు మనం చేసే ప్రార్థనలో కృతజ్ఞతలు కూడా చెప్పాలని బైబిల్లో ఉంది. కృతజ్ఞత చూపిస్తే “మానవ అవగాహనకు మించిన దేవుని శాంతిని” మనం రుచి చూడగలుగుతాం.—ఫిలి. 4:6, 7.

5. ఇశ్రాయేలీయులు కృతజ్ఞత చూపించడానికి ఏ కారణాలున్నాయి? (చిత్రం కూడా చూడండి.)

5 ఇశ్రాయేలీయులకు ఏం జరిగిందో ఒకసారి ఆలోచించండి. ఐగుప్తులో వాళ్లు తిన్న రకరకాల ఆహారం ఇప్పుడు లేదని చాలాసార్లు సణిగారు. (సంఖ్యా. 11:4-6) నిజమే, ఎడారిలో జీవించడం అంత ఈజీ కాదు. కానీ సంతృప్తిగా ఉండడానికి వాళ్లు ఏం చేసుంటే బాగుండేది? యెహోవా వాళ్లకు అప్పటికే చేసిన వాటిమీద వాళ్లు కృతజ్ఞత చూపించుంటే బాగుండేది. ఇంతకీ యెహోవా వాళ్ల కోసం ఏమేం చేశాడు? వాళ్లు ఐగుప్తులో బానిసలుగా చిత్రహింసలు పడుతున్నప్పుడు, పది తెగుళ్లు రప్పించి వాళ్లను రక్షించాడు. ఐగుప్తును వదిలి వచ్చేటప్పుడు ఐగుప్తీయుల దగ్గరున్న చాలా వెండిని, బంగారాన్ని, బట్టల్ని యెహోవా వాళ్లకు ఇప్పించాడు. (నిర్గ. 12:35, 36) ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల్ని తరుముతున్నప్పుడు ఎర్రసముద్రాన్ని అద్భుతంగా రెండు పాయలు చేశాడు. ఎడారిలో ఉన్నప్పుడు, ప్రతీరోజు వాళ్లను మన్నాతో పోషించాడు. యెహోవా వాళ్లకోసం ఇంత చేసినా వాళ్లెందుకు సణిగారు? ఇశ్రాయేలీయుల దగ్గర ఆహారం లేకపోవడం వల్ల కాదుగానీ, యెహోవా వాళ్లకు అప్పటికే ఇచ్చిన వాటిమీద కృతజ్ఞత లేకపోవడం వల్ల అసంతృప్తి చెందారు.

కొంతమంది ఇశ్రాయేలీయులు మన్నా గురించి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పక్కన ఉన్న ఇంకొంతమంది మాత్రం దీన్ని గమనిస్తూ మన్నాను తీసుకుంటున్నారు.

ఇశ్రాయేలీయులు ఎందుకు అసంతృప్తి చెందారు? (5వ పేరా చూడండి)


6. కృతజ్ఞత పెంచుకోవడానికి కొన్ని మార్గాలు ఏంటి?

6 అయితే, మనం కృతజ్ఞతను ఎలా పెంచుకోవచ్చు? మొదటిది, ప్రతీరోజు మనం ఆస్వాదించే వాటిగురించి ఒక్క క్షణం ఆలోచించాలి. బహుశా మనం కృతజ్ఞత చూపించాలనుకుంటున్న రెండుమూడు విషయాలు రాసి పెట్టుకోవచ్చు. (విలా. 3:22, 23) రెండోది, మీకోసం ఎవరైనా ఏదైనా చేస్తే మీ కృతజ్ఞతను హృదయంలోనే దాచిపెట్టుకోకండి, మాటల్లో చెప్పండి. అన్నిటికన్నా ముఖ్యంగా, ప్రతీరోజు యెహోవాకు కృతజ్ఞతలు చెప్పండి. (కీర్త. 75:1) మూడోది, కృతజ్ఞత చూపించేవాళ్లను ఫ్రెండ్స్‌గా చేసుకోండి. ఎందుకంటే కృతజ్ఞత అనేది ఒకరి నుండి ఒకరికి పాకేది. అసంతృప్తి కూడా అంతే. (ద్వితీ. 1:26-28; 2 తిమో. 3:1, 2, 5) మన మనసు నిండా కృతజ్ఞతను నింపుకుంటే, అసంతృప్తికి చోటే ఉండదు!

7. అక్కి అనే సిస్టర్‌ కృతజ్ఞతను ఎలా పెంచుకుంది?

7 ఇండోనేషియాలో ఉంటున్న అక్కి అనే సిస్టర్‌కి ఏం జరిగిందో చూడండి. ఆమె ఇలా చెప్తుంది: “కోవిడ్‌ సమయంలో, నాకన్నా వేరే బ్రదర్స్‌సిస్టర్స్‌ పరిస్థితులే బాగున్నాయని పోల్చుకునేదాన్ని. దానివల్ల నాకు అసంతృప్తే మిగిలింది.” (గల. 6:4) మరి ఆమె ఆలోచన ఎలా మార్చుకోగలిగింది? అక్కి ఇలా చెప్తుంది: “ప్రతీరోజు యెహోవా నాకిచ్చే దీవెనల్ని లెక్క పెట్టుకోవడం మొదలుపెట్టాను. యెహోవా సంస్థలో ఉండడం వల్ల నాకు జరిగిన మంచి గురించి ఆలోచించాను. ఆ తర్వాత యెహోవాకు ప్రార్థనలో కృతజ్ఞతలు చెప్పాను. దానివల్ల నేను సంతృప్తిగా ఉండగలిగాను.” మీ పరిస్థితులే మీ అసంతృప్తికి కారణమౌతుంటే, కృతజ్ఞతను పెంచుకోవడానికి అక్కి చేసిందే చేయవచ్చు.

వినయంగా ఉంటూ యెహోవా ఇష్టం మీద మనసుపెట్టండి

8. బారూకుకు ఏం జరిగింది?

8 యిర్మీయా ప్రవక్తకు కార్యదర్శిగా పనిచేసిన బారూకు, ఒకానొక సమయంలో అసంతృప్తి చెందాడు. బారూకుకు చాలా కష్టమైన నియామకం ఉండేది. ఎందుకంటే, అవిధేయులైన ఇశ్రాయేలీయులకు యిర్మీయా హెచ్చరికా సందేశాన్ని ప్రకటిస్తున్నప్పుడు, బారూకు పక్కనే ఉండేవాడు. అయితే, ఒకానొక సమయంలో బారూకు పక్కదారిపట్టాడు. ఆయన యెహోవా ఇష్టం మీద కాకుండా తన గురించి, తనకేం కావాలి అనే దానిగురించి ఎక్కువగా ఆలోచించాడు. అప్పుడు యెహోవా యిర్మీయా ద్వారా బారూకుతో ఇలా అన్నాడు: “నువ్వు నీకోసం గొప్పవాటిని వెతుకుతున్నావు. అలాంటివి వెతకడం ఆపేయి.” (యిర్మీ. 45:3-5) ఇంకో మాటలో యెహోవా ఇలా అన్నాడు: “ఉన్నవాటితో తృప్తిపడు.” బారూకు ఆ దిద్దుబాటును తీసుకున్నాడు. అందుకే, యెహోవాతో ఉన్న స్నేహాన్ని ఎప్పటిలాగే ఆనందించాడు.

9. మొదటి కొరింథీయులు 4:6, 7 నుండి మనం ఏం నేర్చుకుంటాం? (చిత్రాలు కూడా చూడండి.)

9 కొన్నిసార్లు ఫలానా సేవావకాశం రావడం తన హక్కు అని ఒక క్రైస్తవుడు అనుకోవచ్చు. బహుశా అతనికి చాలా తెలివితేటలు ఉండవచ్చు. అతను చాలా కష్టపడుతుండవచ్చు లేదా చాలా అనుభవం ఉండి ఉండవచ్చు. కొన్నిసార్లయితే, ఆ మూడు అతనిలో ఉండొచ్చు. అయినా, అతను కోరుకుంటున్న నియామకం వేరేవాళ్లకు రావచ్చు. అప్పుడు ఆ క్రైస్తవుడు ఎలా ఆలోచించడం మంచిది? 1 కొరింథీయులు 4:6, 7 లో అపొస్తలుడైన పౌలు రాసిన మాటల గురించి అతను ఆలోచించాలి. (చదవండి.) మనకు వచ్చే ప్రతీ నియామకం, మనకున్న ప్రతీ నైపుణ్యం యెహోవా ఇచ్చిందే. అదేదో మన హక్కు కాదు, మనం సంపాదించుకున్నది కాదు. కేవలం యెహోవా అపారదయ వల్లే అవన్నీ వస్తున్నాయి.—రోమా. 12:3, 6; ఎఫె. 2:8, 9.

చిత్రాలు: వేర్వేరు సేవావకాశాలు పొందిన బ్రదర్స్‌-సిస్టర్స్‌. 1. మన సంస్థకు సంబంధించిన ఒక భవనంలో పైపుల్ని చెక్‌ చేస్తున్న ఒక బ్రదర్‌. 2. సంజ్ఞా భాషా ప్రాంతీయ సమావేశంలో ఒక బ్రదర్‌, ఒక సిస్టర్‌ని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. 3. మీటింగ్‌లో ఒక బ్రదర్‌ టాక్‌ ఇస్తున్నాడు.

మనకున్న ఏ నైపుణ్యమైనా, సామర్థ్యమైనా యెహోవా అపారదయతో ఇచ్చిందే (9వ పేరా చూడండి)b


10. మనం వినయాన్ని ఎలా పెంచుకోవచ్చు?

10 యేసు ఆదర్శం గురించి మనం లోతుగా ఆలోచిస్తే, వినయాన్ని పెంచుకోగలుగుతాం. యేసు తన శిష్యుల పాదాలు కడిగిన సందర్భాన్ని ఒకసారి గుర్తుతెచ్చుకోండి. అపొస్తలుడైన యోహాను ఇలా రాశాడు: “[1] తండ్రి అన్నిటినీ తన చేతుల్లో పెట్టాడని, [2] తాను దేవుని దగ్గర నుండి వచ్చానని, [3] తిరిగి దేవుని దగ్గరికి వెళ్తున్నానని యేసుకు తెలుసు.” అయినాసరే, ఆయన “శిష్యుల పాదాలు” కడగడం మొదలుపెట్టాడు. (యోహా. 13:3-5) కావాలనుకుంటే, శిష్యులతో తన పాదాలు కడిగించుకునే హక్కు తనకు ఉందని యేసు అనుకోవచ్చు. అలాగే, ఆయన దేవుని కుమారుడు కాబట్టి చాలా డబ్బులతో సుఖంగా జీవించే హక్కు తనకు ఉందని కూడా అనుకోవచ్చు. కానీ యేసు ఆ ఆలోచనను తన దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. (లూకా 9:58) ఆయన వినయం చూపించాడు, ఉన్నవాటితో సంతృప్తిపడ్డాడు. అలా మనకు తిరుగులేని ఆదర్శాన్ని ఉంచాడు.—యోహా. 13:15.

11. సంతృప్తిగా ఉండడానికి డెన్నిస్‌కి ఏం సహాయం చేసింది?

11 నెదర్లాండ్స్‌లో ఉంటున్న డెన్నిస్‌ అనే బ్రదర్‌ యేసులా వినయం చూపించడానికి బాగా ప్రయత్నించాడు. కానీ కొన్నిసార్లు ఆయనకు కష్టమయ్యేది. ఆయన ఇలా చెప్తున్నాడు: “కొన్నిసార్లు నేను ఆశపడ్డ సేవావకాశం వేరేవాళ్లకు వచ్చినప్పుడు బాధగా, అసంతృప్తిగా అనిపిస్తుంది. అప్పుడు నేను వినయం గురించి అధ్యయనం చేసేవాణ్ణి. నా JW లైబ్రరీ యాప్‌లో వినయానికి సంబంధించి ట్యాగ్‌ చేసుకున్న కొన్ని లేఖనాల్ని పదేపదే చదివేవాణ్ణి. అంతేకాదు, వినయానికి సంబంధించి నా ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న వీడియోలను కూడా అప్పుడప్పుడు చూస్తాను.a మనం చేసే పని మనల్ని గొప్ప చేసుకోవడానికి కాదుగానీ, యెహోవాని మహిమపర్చడానికే అని నేను నేర్చుకున్నాను. యెహోవా తన ఇష్టం నెరవేర్చుకోవడంలో మనందరికీ ఏదోక పాత్ర ఇస్తాడు.” మీ పరిస్థితినిబట్టి మీకు కూడా అసంతృప్తిగా అనిపిస్తే, వినయం పెంచుకోవడానికి ప్రయత్నించండి. అలాచేస్తే యెహోవాతో మీ స్నేహం, సంతృప్తి రెండూ పెరుగుతాయి.—యాకో. 4:6, 8.

భవిష్యత్తు మీద మీకున్న ఆశ గురించి ఆలోచించండి

12. భవిష్యత్తులో మనం పొందబోయే ఏ ఆశీర్వాదాల గురించి ఆలోచిస్తే సంతృప్తి పెరుగుతుంది? (యెషయా 65:21-25)

12 భవిష్యత్తు మీద మనకున్న ఆశ గురించి ఆలోచిస్తే, మన సంతృప్తి ఇంకా పెరుగుతుంది. మనకున్న చిరాకుల్ని అర్థం చేసుకుంటానని, మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటినీ భవిష్యత్తులో తీసేస్తానని యెహోవా యెషయా ప్రవక్త ద్వారా మాటిచ్చాడు. (యెషయా 65:21-25 చదవండి.) భవిష్యత్తులో మనం సురక్షితమైన, సౌకర్యవంతమైన ఇళ్లలో జీవిస్తాం. మనకు సంతృప్తికరమైన పని ఉంటుంది. మనం రుచికరమైన పౌష్టిక ఆహారాన్ని తింటాం. మన కుటుంబమంతా ఏ చీకూచింత లేకుండా బ్రతుకుతాం. (యెష. 32:17, 18; యెహె. 34:25) అద్భుతమైన, సురక్షితమైన భవిష్యత్తు మనకోసం వేచివుంది!

13. ఏ పరిస్థితుల్లో భవిష్యత్తు మీద మనకున్న ఆశ గురించి ఎక్కువగా ఆలోచించాలి?

13 భవిష్యత్తు మీద మనకున్న ఆశ గురించి ముందెప్పటికన్నా ఇప్పుడు ఎక్కువగా ఆలోచించాలి. ఎందుకంటే, మనం “చివరి రోజుల్లో” జీవిస్తున్నాం. ఎన్నో “కష్టమైన” పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాం. (2 తిమో. 3:1) అయినాసరే, ప్రతీరోజు మనకు వచ్చే కష్టాల్ని గట్టెక్కడానికి యెహోవా నిర్దేశాలు ఇస్తున్నాడు, బలాన్నిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. (కీర్త. 145:14) వీటికి తోడు, భవిష్యత్తు మీద మనకున్న ఆశ వల్ల మనం సమస్యలతో పోరాడగలుగుతున్నాం. బహుశా మీరు మీ రెక్కలు ముక్కలు చేసుకుని మీ కుటుంబ అవసరాల్ని తీరుస్తుండవచ్చు. మీరు కుటుంబాన్ని పోషించడానికి జీవితాంతం ఇలా తంటాలు పడాల్సిందేనా? కానేకాదు! యెహోవా మీ అవసరాల్ని తీరుస్తాడని, మీరు కోరుకున్నవాటినే కాదు మీరు ఊహించిన వాటికి మించి పరదైసులో ఇస్తానని మాటిస్తున్నాడు. (కీర్త. 9:18; 72:12-14) బహుశా మీరు ప్రతీరోజు నొప్పితో, మానసిక వేదనతో, ప్రాణాంతకమైన జబ్బుతో బాధపడుతుండవచ్చు. ఇక మీ జీవితం ఇంతేనా, చస్తూ బ్రతకాల్సిందేనా? అస్సలు కాదు! యెహోవా కొత్తలోకంలో జబ్బుల్ని, ఆఖరికి మరణాన్ని కూడా తీసేస్తానని మాటిస్తున్నాడు. (ప్రక. 21:3, 4) భవిష్యత్తు మీదున్న ఆ ఆశ వల్ల ఇప్పుడు మన పరిస్థితుల్ని చూసి మనకు వచ్చే కోపాన్ని, చిరాకును తీసేసుకుని, సంతృప్తిగా ఉండగలుగుతాం. ఆఖరికి అన్యాయం జరిగినా, నష్టం వచ్చినా, తీవ్రమైన జబ్బు ఉన్నా, ఇంకే కష్టం వచ్చినా, మనం సంతృప్తిగానే ఉండగలుగుతాం. ఎందుకంటే, మనం ఇప్పుడు అనుభవిస్తున్న ఎంతపెద్ద కష్టమైనా కేవలం “తాత్కాలికం” అని, కొత్తలోకంలో వాటన్నిటికీ ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుందని మనకు తెలుసు.—2 కొరిం. 4:17, 18.

14. మన ఆశను లేదా నిరీక్షణను ఎలా బలపర్చుకోవచ్చు?

14 మనం సంతృప్తిగా జీవించాలంటే భవిష్యత్తు మీద మనకున్న ఆశ ప్రాముఖ్యమైంది. కాబట్టి ఆ ఆశను లేదా నిరీక్షణను ఎలా బలపర్చుకోవచ్చు? ఒకవ్యక్తి దూరంలో ఉన్నవాటిని స్పష్టంగా చూడడానికి కళ్లద్దాలు పెట్టుకున్నట్టే, రానున్న పరదైసును స్పష్టంగా చూడడానికి మనం కొన్ని పనులు చేయాలి. ఉదాహరణకు, డబ్బు గురించి నానాహైరానా పడుతుంటే, అసలు డబ్బే అవసరంలేని, అప్పుతో పనిలేని, పేదరికం కనిపించని జీవితాన్ని ఊహించుకోండి. అలాగే, మీకు రాని నియామకం గురించి దిగులుపడుతుంటే, పరిపూర్ణతకు చేరుకొని, వేలకొద్దీ సంవత్సరాలు యెహోవాను ఆరాధించడంతో పోలిస్తే ఇప్పుడున్న దిగులు ఎంత చిన్నదో ఊహించుకోండి. (1 తిమో. 6:19) కళ్లముందున్న ప్రస్తుతాన్ని మర్చిపోయి, మనం కలలు కనే భవిష్యత్తును ఊహించుకోవడం మొదట్లో కష్టం అవ్వవచ్చు. కానీ యెహోవా మాటిచ్చిన అద్భుతమైన భవిష్యత్తు గురించి ఎంతెక్కువగా ఆలోచిస్తే, మనకున్న సమస్యలు అంత చిన్నవిగా కనిపిస్తాయి.

15. క్రిస్టీ మాటల నుండి ఏం నేర్చుకోవచ్చు?

15 పైన చెప్పుకున్న డెన్నిస్‌ వాళ్లావిడ క్రిస్టీ గురించి ఆలోచించండి. భవిష్యత్తు మీదున్న ఆశ ఆమెకు ఎలా సహాయం చేసిందో గమనించండి. ఆమె ఇలా చెప్తుంది: “నాకొక జబ్బుంది. దానివల్ల నా కండరాలు రోజురోజుకూ బలహీనమౌతాయి. అందుకే నేను ఎప్పుడూ వీల్‌ఛైర్‌ మీద గానీ, బెడ్‌ మీద గానీ ఉంటాను. నేను ప్రతీరోజు నొప్పితోనే నిద్రలేస్తాను. ఇక నా పరిస్థితి ఎప్పటికీ ఇంతే ఉంటుందని ఈమధ్యే డాక్టర్‌ చెప్పాడు. కానీ ఆ డాక్టర్‌కి నేను ఎదురుచూసే భవిష్యత్తు ఏంటో తెలీదు. నేను మాత్రం కొత్తలోకం మీదే మనసుపెట్టడం వల్ల మనశ్శాంతితో ఉండగలుగుతున్నాను. ప్రస్తుతం ఈ లోకంలో నేను నా జీవితాన్ని తప్పదన్నట్టు నెట్టుకొస్తున్నానేమో గానీ, కొత్తలోకంలో మాత్రం ప్రతీరోజు నా జీవితాన్ని ఆనందిస్తాను.”

“ఆయనకు భయపడేవాళ్లకు ఏ లోటూ ఉండదు”

16. యెహోవాకు భయపడేవాళ్లకు “ఏ లోటూ ఉండదు” అని దావీదు ఎందుకు చెప్పగలిగాడు?

16 యెహోవా సేవకులుగా మనం ఎంత సంతృప్తిగా ఉన్నాసరే, మనకు సమస్యలు మాత్రం తప్పవు. దావీదు రాజు గురించి ఆలోచించండి. ఆయన పిల్లల్లో ముగ్గురు చనిపోయారు. ఆయన మీద తప్పుగా నిందలు వేశారు, వెన్నుపోటు పొడిచారు. ఎన్నో సంవత్సరాలు ఆయన్ని చంపడానికి తరిమారు. ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నా సరే, ఆయన యెహోవా గురించి ఇలా చెప్పాడు: “ఆయనకు భయపడేవాళ్లకు ఏ లోటూ ఉండదు.” (కీర్త. 34:9, 10) దావీదు ఎందుకు ఆ మాటలు చెప్పగలిగాడు? ఎందుకంటే, యెహోవా ప్రజలకు కష్టాలే ఉండవని కాదుగానీ, ఎన్ని కష్టాలు ఉన్నాసరే వాళ్లకు అవసరమైనదేదీ కొదువ ఉండదని దాని అర్థం. (కీర్త. 145:16) మనకు ఏ కష్టం వచ్చినాసరే, సహాయం కోసం యెహోవావైపు చూడవచ్చు, సంతృప్తిగా జీవించవచ్చు.

17. మీరెందుకు సంతృప్తిగా ఉండాలనుకుంటున్నారు?

17 మీరు సంతృప్తిగా జీవించాలని యెహోవా కోరుకుంటున్నాడు. (కీర్త. 131:1, 2) అందుకే, సంతృప్తిగా జీవించడం అనే రహస్యం తెలుసుకోవడానికి చేయగలిగినదంతా చేయండి. మీరు కృతజ్ఞత చూపించడానికి, వినయంగా ఉంటూ యెహోవా సేవ మీద మనసుపెట్టడానికి, భవిష్యత్తు మీద ఆశను పెంచుకోవడానికి కష్టపడితే మీరూ ఇలా చెప్పగలుగుతారు: “అవును, నేను సంతృప్తిగా ఉన్నాను.”—కీర్త. 16:5, 6.

సంతృప్తిగా ఉండడానికి ఈ విషయాలు మీకెలా సహాయం చేస్తాయి?

  • కృతజ్ఞత పెంచుకోవడం

  • యెహోవా సేవ మీద మనసుపెడుతూ వినయంగా ఉండడం

  • భవిష్యత్తు మీదున్న ఆశ గురించి ఆలోచించడం

పాట 118 ‘బలమైన విశ్వాసం కలిగివుండేలా సాయం చేయి’

a ఉదాహరణకు, jw.orgలో వినయంగల వాళ్లా, గర్వంగల వాళ్లా? అలాగే వినయం చూపించండి అనే ఉదయకాల ఆరాధన వీడియోలు చూడండి.

b చిత్రాల వివరణ:: మన సంస్థకు సంబంధించిన ఒక భవనంలో రిపేర్‌ పనులు చేస్తున్న ఒక బ్రదర్‌, సంజ్ఞా భాష నేర్చుకున్న ఒక సిస్టర్‌ని ప్రాంతీయ సమావేశంలో ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఒక బ్రదర్‌ బహిరంగ ప్రసంగం ఇస్తున్నాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి