అధ్యయన ఆర్టికల్ 29
పాట 87 రండి, సేదదీర్పు పొందండి!
మనం మంచి సలహా ఎలా ఇవ్వొచ్చు?
“నీ మీద దృష్టి ఉంచి నీకు సలహా చెప్తాను.”—కీర్త. 32:8.
ముఖ్యాంశం
ఇతరులకు ఉపయోగపడే సలహాలు ఎలా ఇవ్వవచ్చు?
1. ఎవరెవరు సలహా ఇవ్వాలి? ఎందుకు?
ఎవరికైనా సలహా ఇవ్వాలంటే మీకు ఎలా అనిపిస్తుంది? కొంతమందికి సలహా ఇవ్వడమంటే చాలా ఇష్టం. ఇంకొంతమందికి ఇష్టం ఉండదు. ఒకవేళ ఇవ్వాలన్నా మొహమాటపడతారు. కానీ ఏదోక సమయంలో, మనందరం ఇతరులకు సలహా ఇవ్వాల్సి రావచ్చు. ఎందుకంటే, మన మధ్య ఉన్న ప్రేమను బట్టే మనం యేసు నిజమైన అనుచరులమని ప్రజలు గుర్తుపడతారు. (యోహా. 13:35) మన బ్రదర్స్‌సిస్టర్స్ మీద మనకు ప్రేమ ఉందని చూపించే ఒక విధానం, వాళ్లకు అవసరమైనప్పుడు సలహా ఇవ్వడం! “నిజాయితీతో ఇచ్చే” సలహా వల్ల ‘తియ్యని స్నేహాలు’ చిగురిస్తాయని బైబిలు చెప్తుంది.—సామె. 27:9.
2. సంఘపెద్దలు ఏం చేయాలి? ఎందుకు? (“వారం మధ్యలో జరిగే మీటింగ్‌లో ఇచ్చే సలహాలు.”)
2 అందరికన్నా ముఖ్యంగా, సంఘపెద్దలు ఇతరులకు ఉపయోగపడే సలహాలు ఇస్తారు. సంఘాన్ని కాయడానికి యెహోవా యేసును ద్వారా ఈ సంఘపెద్దల్ని నియమించాడు. (1 పేతు. 5:2, 3) కాయడంలో భాగంగా వాళ్లు చేసే ఒక పని ఏంటంటే, తమ ప్రసంగాల్లో బైబిలు ఆధారంగా సలహాలు ఇవ్వడం. అంతేకాదు, అవసరమైన వాళ్లందరికీ వ్యక్తిగతంగా సలహా ఇస్తారు. దాంతోపాటు, ఎవరైతే తప్పటడుగు వేస్తారో వాళ్లకు కూడా సలహాలు ఇస్తారు. అలా వాళ్లు సంఘాన్ని చక్కగా చూసుకుంటారు. అయితే, సంఘపెద్దలతో సహా మనందరం వేరేవాళ్లకు ఉపయోగపడే సలహాలు ఎలా ఇవ్వొచ్చు?
3. (ఎ) మనం మంచి సలహా ఇచ్చే వ్యక్తిగా ఎలా అవ్వవచ్చు? (యెషయా 9:6; “యేసులా సలహా ఇవ్వండి” అనే బాక్స్ కూడా చూడండి.) (బి) ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?
3 మనం మంచి సలహా ఇచ్చే వ్యక్తిగా తయారవ్వాలంటే, మంచి సలహాదారుల గురించి బైబిల్లో చదవాలి. యేసుకు మించిన సలహాదారుడు ఎవరైనా ఉంటారా! ఆయన్ని “అద్భుతమైన సలహాదారుడు” అని బైబిలు పిలుస్తుంది. (యెషయా 9:6 చదవండి.) అయితే, ఎవరైనా మనల్ని సలహా అడిగినప్పుడు ఏం చేయవచ్చు? ఒకవేళ అడగకపోయినా మనం ఎప్పుడు సలహా ఇవ్వాల్సి రావచ్చు? వీటి గురించి ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అంతేకాదు సరైన సమయంలో, సరైన విధంగా సలహా ఇవ్వడం ఎందుకు ప్రాముఖ్యమో చూస్తాం.
మనల్ని సలహా అడిగినప్పుడు
4-5. ఎవరైనా వచ్చి సలహా అడిగినప్పుడు మనం ఏమని ప్రశ్నించుకోవాలి? ఎందుకలా ప్రశ్నించుకోవాలో ఒక ఉదాహరణ చెప్పండి.
4 ఎవరైనా మనల్ని వచ్చి సలహా అడిగినప్పుడు మనకు ఏం అనిపించవచ్చు? బహుశా మనం పొంగిపోయి వెంటనే ఏదోకటి చెప్పాలని అనిపించవచ్చు. కానీ దానికన్నా ముందు ఇలా ప్రశ్నించుకోవాలి: ‘ఈ విషయంలో నేను సలహా ఇవ్వగలనా?’ కొన్నిసార్లు మనం సలహా ఇచ్చే బదులు, ఆ విషయం గురించి బాగా తెలిసినవాళ్ల దగ్గరికి వెళ్లమని చెప్పడం తెలివైనపని.
5 ఈ ఉదాహరణ ఆలోచించండి. మీ ఫ్రెండ్ ఒకరికి జబ్బు చేసింది. అయితే, దానికి సంబంధించిన ట్రీట్‌మెంట్ గురించి ఆయన బాగా పరిశోధన చేసి, ఏ ట్రీట్‌మెంట్ అయితే బాగుంటుందని మీ అభిప్రాయం అడిగాడు. అప్పుడు ఫలానా ట్రీట్‌మెంట్ బాగుంటుందని మీకు గట్టిగా అనిపించవచ్చు. కానీ మీరు ఒక డాక్టర్ కాకపోతే, ఆ జబ్బును నయం చేసే డాక్టర్ దగ్గరికి మీ ఫ్రెండ్‌ని నడిపించడం తెలివైనపని.
6. సలహా ఇచ్చేముందు కాస్త సమయం తీసుకోవడం ఎందుకు మంచిది?
6 అయితే, ఫలానా విషయం గురించి మనం సలహా ఇవ్వగలం అని అనిపించినా సరే, జవాబిచ్చే ముందు కాస్త సమయం తీసుకోవడం మంచిది. ఎందుకు? సామెతలు 15:28 ఇలా చెప్తుంది: “నీతిమంతుడి హృదయం జవాబిచ్చే ముందు ధ్యానిస్తుంది.” అయితే, మనకు జవాబు తెలిసినా సరే పరిశోధన చేయడానికి, ప్రార్థన చేయడానికి, ధ్యానించడానికి కాస్త సమయం తీసుకోవాలి. అప్పుడు మనం ఇచ్చే సలహా, యెహోవా చెప్పాలనుకుంటున్న దానికి సరిగ్గా సరిపోతుంది. నాతాను ప్రవక్త ఉదాహరణ గమనించండి.
7. నాతాను ప్రవక్త నుండి మీరేం నేర్చుకున్నారు?
7 దావీదు రాజు యెహోవా కోసం ఒక ఆలయం కట్టాలనుకుంటున్నానని నాతాను ప్రవక్తకు చెప్పాడు. అప్పుడు, నాతాను ప్రవక్త ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కట్టేయమన్నాడు. కానీ నాతాను ప్రవక్త జవాబిచ్చే ముందు, ఒక మాట యెహోవాను అడగాల్సింది. ఎందుకంటే, దావీదు ఒక ఆలయం కట్టాలని యెహోవా అనుకోలేదు. (1 దిన. 17:1-4) ఈ సంఘటన బట్టి, మనల్ని ఎవరైనా సలహా అడిగినప్పుడు, ‘తొందరపడి మాట్లాడకపోవడం’ తెలివైనపని అని అర్థమౌతుంది.—యాకో. 1:19.
8. సలహా ఇచ్చేముందు మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పడానికి ఇంకో కారణం ఏంటి?
8 సలహా ఇస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పడానికి ఇంకో కారణం కూడా ఉంది. అదేంటంటే, ఒకవేళ మనం ఇచ్చిన సలహా వల్ల ఎదుటివ్యక్తికి ఏదైనా నష్టం జరిగితే, దానికి బాధ్యత కొంతవరకు మనం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే, సలహా ఇచ్చేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది.
ఎదుటివ్యక్తి అడగకపోయినా సలహా ఇవ్వాల్సి వచ్చినప్పుడు
9. సంఘపెద్దలు సలహా ఇవ్వడానికి ముందు ఏ విషయాన్ని నిర్ధారించుకోవాలి? (గలతీయులు 6:1)
9 కొన్నిసార్లు ఒక బ్రదర్ గానీ, సిస్టర్ గానీ “తప్పటడుగు” వేయవచ్చు. అప్పుడు సంఘపెద్దలు వాళ్లకు సలహా ఇవ్వాలి. (గలతీయులు 6:1 చదవండి.) ఈ వచనానికి ఉన్న స్టడీ నోట్‌లో ఇలా ఉంది: “ఆ వ్యక్తి ఘోరమైన పాపం చేసుండకపోవచ్చు. కానీ తప్పుదారిలో అడుగులు వేస్తుండవచ్చు. కాబట్టి సంఘపెద్దల లక్ష్యం, ఆ వ్యక్తిని తిరిగి జీవ మార్గంలోకి నడిపించడమే.” (యాకో. 5:19, 20) అయితే, సంఘపెద్దల సలహా చక్కగా పనిచేయాలంటే, అసలు ఆ వ్యక్తి నిజంగానే తప్పటడుగు వేశాడో లేదో ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోవాలి. మనందరం మన సొంత మనస్సాక్షిని బట్టి నిర్ణయాలు తీసుకునేలా యెహోవా అనుమతిస్తున్నాడు. (రోమా. 14:1-4) అయితే, ఒకవ్యక్తి నిజంగానే తప్పటడుగు వేసినప్పుడు, అతనికి సంఘపెద్దలు సలహా ఇవ్వాలనుకుంటే, అప్పుడేంటి?
10-12. అడగకపోయినా సలహా ఇవ్వాల్సి వచ్చినప్పుడు సంఘపెద్దలు ఏం చేయాలి? ఉదాహరణ చెప్పండి. (చిత్రాలు కూడా చూడండి.)
10 ఒకవ్యక్తి అడగకపోయినా సంఘపెద్దలు సలహా ఇవ్వాలంటే అది కొంచెం కష్టమే. ఎందుకంటే అపొస్తలుడైన పౌలు చెప్పినట్టు, తప్పటడుగు వేసిన వ్యక్తి తప్పుదారిలో ఉన్నాడనే విషయం గుర్తించకపోవచ్చు. కాబట్టి సంఘపెద్దలు ఎవరికైతే సలహా ఇవ్వాలనుకుంటున్నారో, ఆ వ్యక్తి దాన్ని తీసుకునేలా అతని మనసుని సిద్ధం చేయాలి.
11 అడగకపోయినా సలహా ఇవ్వడం అనేది, గట్టి నేలమీద విత్తనాలు నాటడం లాంటిది. ఒక రైతు విత్తనాలు వేయడానికి ముందు నేలను దున్నుతాడు. దానివల్ల నేల మెత్తబడుతుంది. ఆ తర్వాత ఆయన విత్తనాలు చల్లుతాడు, అవి ఎదగడానికి నీళ్లు పోస్తాడు. అదేవిధంగా, అడగకపోయినా సలహా ఇచ్చేముందు, ఒక సంఘపెద్ద హృదయం అనే నేలను సిద్ధం చేస్తాడు. ఉదాహరణకు, ఆయన సమయం చూసుకుని సలహా ఇవ్వాలనుకుంటున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి, అతన్ని నిజంగా పట్టించుకుంటున్నాడని, అతనితో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాడని చెప్తాడు. సలహా ఇచ్చే వ్యక్తికి చాలా ప్రేమ, దయగలవాడనే పేరుంటే సలహా తీసుకోవడం ఇతరులకు తేలికౌతుంది.
12 ఆ సంఘపెద్ద, ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు పొరపాట్లు అందరూ చేస్తారని, సలహా అందరికీ అవసరం అనే విషయాన్ని గుర్తుచేస్తూ, అతని హృదయం అనే నేలను మెత్తబరుస్తూ ఉండవచ్చు. (రోమా. 3:23) తర్వాత, ఆ వ్యక్తి ఎక్కడ తప్పటడుగు వేశాడో అర్థం చేసుకునేలా ఆ సంఘపెద్ద లేఖనాల్ని చూపిస్తూ చాలా మృదువైన స్వరంతో, మనసు నిండా గౌరవంతో మాట్లాడతాడు. సంఘపెద్ద మాట్లాడిన తర్వాత, ఆ వ్యక్తి తన తప్పును తెలుసుకుంటే, దాన్ని సరిచేసుకోవడానికి ఏం చేయాలో ఆ సంఘపెద్ద వివరిస్తాడు. అలా ఒకరకంగా విత్తనాన్ని నాటుతాడు. ఆఖరికి, ఆ సంఘపెద్ద ఆ వ్యక్తిని మనస్ఫూర్తిగా మెచ్చుకుని, అతనితో కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ విత్తనానికి నీళ్లు పోసినట్టు అవుతుంది.—యాకో. 5:15.
అడగకుండా సలహా ఇవ్వాలంటే ప్రేమ, నేర్పు ఉండాలి (10-12 పేరాలు చూడండి)
13. ఒకవ్యక్తి సలహాను సరిగ్గా అర్థం చేసుకున్నాడో లేదో పెద్దలు ఎలా తెలుసుకోవచ్చు?
13 కొన్నిసార్లు సలహా ఇచ్చే వ్యక్తి ఒకటి చెప్తుంటే, వినే వ్యక్తి ఇంకొకటి అర్థం చేసుకోవచ్చు. ఈ గందరగోళం జరగకూడదంటే పెద్దలు ఏం చేయవచ్చు? వాళ్లు అసలు విషయం రాబట్టడానికి గౌరవపూర్వకంగా, తెలివిగా కొన్ని ప్రశ్నలు వేయవచ్చు. (ప్రసం. 12:11) ఆ జవాబుల్ని బట్టి, సలహా తీసుకునే వ్యక్తి విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నాడో లేదో పెద్దలు తెలుసుకోవచ్చు.
సరైన సమయంలో, సరైన విధంగా సలహా ఇవ్వడం
14. కోపంగా ఉన్నప్పుడు మనం ఎందుకు సలహా ఇవ్వకూడదో వివరించండి.
14 మనందరం అపరిపూర్ణులం కాబట్టి కొన్నిసార్లు వేరేవాళ్లను బాధపెడతాం. (కొలొ. 3:13) అప్పుడప్పుడు, ఎదుటివ్యక్తి మనకు కోపం తెప్పించవచ్చని బైబిలు చెప్తుంది. (ఎఫె. 4:26) కానీ మనం కోపంలో ఉన్నప్పుడు అస్సలు సలహా ఇవ్వకూడదు. ఎందుకంటే, “మనిషి కోపం దేవుని నీతిని నెరవేర్చదు.” (యాకో. 1:20) ఒకవేళ మనం కోపంగా ఉన్నప్పుడు సలహా ఇస్తే, పరిస్థితి ఇంకా ఘోరంగా తయారవ్వొచ్చు. అంటే మనకు కోపం తెప్పించిన వ్యక్తితో మనకు ఎలా అనిపిస్తుందో అస్సలు చెప్పకూడదని కాదు. బదులుగా, మన కోపం చల్లారేవరకు ఆగి, ఆ తర్వాత మాట్లాడితే చాలా ఉపయోగం ఉంటుంది. నమ్మకస్థుడైన యోబుకు సలహా ఇచ్చిన ఎలీహు ఉదాహరణ గమనించండి.
15. ఎలీహు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (చిత్రం కూడా చూడండి.)
15 తన కపట స్నేహితులు చెప్పినవి తప్పని నిరూపించడానికి యోబు చాలా రోజులు మాట్లాడాడు. వాటిని ఎలీహు విన్నాడు. ఆయనకు యోబు మీద జాలేసింది. కానీ యోబు యెహోవా గురించి తప్పుగా అనుకుంటూ, తనే ఎక్కువ నీతిమంతుడు అన్నట్టు మాట్లాడినప్పుడు ఎలీహుకు చాలా కోపం వచ్చింది. అయినాసరే, ఎలీహు తన వంతు వచ్చే వరకు ఆగి, ఆ తర్వాత మాట్లాడాడు. ఆయన యోబుకు సలహా ఇస్తున్నప్పుడు చాలా మృదువుగా, మనసు నిండా గౌరవంతో మాట్లాడాడు. (యోబు 32:2; 33:1-7) ఎలీహు ఉదాహరణ మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని నేర్పిస్తుంది. అదేంటంటే, ఒక సలహా సరైన సమయంలో, సరైన విధంగా ఇస్తేనే అది మంచి సలహా అవుతుంది. అందులో గౌరవం, ప్రేమ ఉట్టిపడాలి.—ప్రసం. 3:1, 7.
కోపం వచ్చినా సరే, ఎలీహు చాలా మృదువుగా, మనసు నిండా గౌరవంతో సలహా ఇచ్చాడు (15వ పేరా చూడండి)
సలహా ఇస్తూ ఉండండి, తీసుకుంటూ ఉండండి
16. కీర్తన 32:8 నుండి మీరేం నేర్చుకున్నారు?
16 ఈ ఆర్టికల్ ముఖ్య లేఖనం చెప్తున్నట్టు, ‘యెహోవా మనమీద దృష్టి ఉంచి మనకు సలహా ఇస్తాడు.’ (కీర్తన 32:8 చదవండి.) దీన్నిబట్టి, ఆయన మన వెన్నంటే ఉంటూ మనకు సహాయం చేస్తాడని అర్థమౌతుంది. అంటే ఆయన కేవలం సలహా ఇవ్వడమే కాదు, దాన్ని ఎలా పాటించాలో కూడా నేర్పిస్తాడు. ఆయన మనకు ఎంత మంచి ఆదర్శమో కదా! ఒకవేళ మనం సలహా ఇచ్చే స్థానంలో ఉంటే, యెహోవాలాగే సలహా తీసుకునేవాళ్ల మీద దృష్టిపెట్టి, వాళ్లు సలహాను పాటించేలా సహాయం చేద్దాం.
17. మనకు సరిగ్గా సరిపోయే సలహాను బైబిలు ఆధారంగా ఇచ్చే సంఘపెద్దలు ఎలా ఉంటారు? (యెషయా 32:1, 2)
17 మంచి సలహా ఇచ్చిపుచ్చుకోవడం ముందెప్పటికన్నా ఇప్పుడు చాలా అవసరం. (2 తిమో. 3:1) మనకు సరిగ్గా సరిపోయే సలహాను బైబిలు ఆధారంగా ఇచ్చే సంఘపెద్దలు, “నీళ్లులేని దేశంలో నీళ్ల కాలువలా” ఉన్నారు. (యెషయా 32:1, 2 చదవండి.) మన స్నేహితులు మనం వినాలని అనుకునేది కాకుండా, మనకు అవసరమైన సలహా చెప్తే, మనకు ఒక విలువైన బహుమతి ఇచ్చినట్టే. వాళ్ల మాటలు “వెండి పళ్లెంలో ఉన్న బంగారు ఆపిల్ పండ్ల” లాంటివి. (సామె. 25:11) కాబట్టి మనం మంచి సలహా ఇవ్వడానికి, అలాగే తీసుకోవడానికి కావాల్సిన తెలివిని సంపాదించుకుంటూ ఉందాం!
పాట 109 మనస్ఫూర్తిగా ప్రగాఢమైన ప్రేమ చూపించండి