కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 మార్చి పేజీలు 2-7
  • బాప్తిస్మానికి ఆలస్యం చేయవద్దు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బాప్తిస్మానికి ఆలస్యం చేయవద్దు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సమరయులు బాప్తిస్మం తీసుకున్నారు
  • తార్సుకు చెందిన సౌలు బాప్తిస్మం తీసుకున్నాడు
  • కొర్నేలి బాప్తిస్మం తీసుకున్నాడు
  • కొరింథీయులు బాప్తిస్మం తీసుకున్నారు
  • మీ విశ్వాసం కొండల్ని కూడా కదిలిస్తుంది
  • బాప్తిస్మం వైపు అడుగులు వేస్తూ ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • బాప్తిస్మానికి ఉన్న అర్థం తెలుసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • బాప్తిస్మం తర్వాత కూడా యేసును “అనుసరిస్తూ ఉండండి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • కొత్త వ్యక్తిలా మారాడు
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 మార్చి పేజీలు 2-7

అధ్యయన ఆర్టికల్‌ 9

పాట 51 దేవునికి సమర్పించుకున్నాం!

బాప్తిస్మానికి ఆలస్యం చేయవద్దు

“ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? లేచి బాప్తిస్మం తీసుకో.”—అపొ. 22:16.

ముఖ్యాంశం

సమరయులు, తార్సుకు చెందిన సౌలు, కొర్నేలి అలాగే కొరింథీయుల ఉదాహరణల్ని చూసి బాప్తిస్మం వైపు అడుగులు వేయడానికి ధైర్యం తెచ్చుకోండి.

1. బాప్తిస్మం తీసుకోవడానికి కొన్ని మంచి కారణాలు ఏంటి?

అన్నీ ఇచ్చిన, ఆఖరికి ప్రాణం కూడా ఇచ్చిన యెహోవా అంటే మీకు ఇష్టమా? ఆ ఇష్టాన్ని చూపించాలని అనుకుంటున్నారా? అలాగైతే దానికొక మంచి పద్ధతి, మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవడమే! అలా చేస్తే మీరు యెహోవా కుటుంబంలో ఒకరు అవుతారు. అప్పుడిక మీరు ఆయన సొంతం కాబట్టి మీ తండ్రి, మీ స్నేహితుడు మిమ్మల్ని చేయి పట్టుకుని నడిపిస్తాడు, కంటికిరెప్పలా చూసుకుంటాడు. (కీర్త. 73:24; యెష. 43:1, 2) సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకుంటే అంతులేని జీవితానికి కూడా తలుపు తెరుచుకుంటుంది.—1 పేతు. 3:21.

2. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

2 బాప్తిస్మం తీసుకోకుండా మిమ్మల్ని ఏదైనా వెనక్కి లాగుతుందా? అలాగైతే బాధపడకండి. మీ ఒక్కరికే కాదు మీకన్నా ముందు లక్షలమందికి అలాగే జరిగింది. వాళ్లు బాప్తిస్మం కోసం అర్హత సాధించడానికి ముందు వాళ్ల ఆలోచనల్లో, ప్రవర్తనలో మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు వాళ్లు యెహోవా సేవలో సంతోషంగా, ఉత్సాహంగా దూసుకెళ్తున్నారు. అయితే, మొదటి శతాబ్దంలో బాప్తిస్మం తీసుకున్నవాళ్ల నుండి మీరేం నేర్చుకోవచ్చు? వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు వచ్చాయో, వాళ్లనుండి మనం ఏం నేర్చుకోవచ్చో ఇప్పుడు పరిశీలిద్దాం.

సమరయులు బాప్తిస్మం తీసుకున్నారు

3. బాప్తిస్మం తీసుకోవడానికి కొంతమంది సమరయులకు ఏ విషయాలు అడ్డొచ్చి ఉంటాయి?

3 యేసు కాలంలో సమరయులు ఒక మత గుంపుగా ఉండేవాళ్లు. వాళ్లలో చాలామంది యూదయకు ఉత్తరాన ఉన్న షెకెము అలాగే సమరయ ప్రాంతాల్లో ఉండేవాళ్లు. సమరయులు బాప్తిస్మం తీసుకోవడానికి ముందు దేవుని వాక్యాన్ని పూర్తిగా అంగీకరించి, దాన్నుండి నేర్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే, సమరయులు బైబిల్లో ఉన్న మొదటి ఐదు పుస్తకాల్ని అంటే ఆదికాండం నుండి ద్వితీయోపదేశకాండం అలాగే బహుశా యెహోషువ పుస్తకాన్ని మాత్రమే దేవుడు ప్రేరేపించి రాయించాడని నమ్మేవాళ్లు. కానీ ద్వితీయోపదేశకాండం 18:18, 19 లో దేవుడు మెస్సీయ గురించి మాటిచ్చిన దాన్ని మాత్రం సమరయులు నమ్మి, ఆయన కోసం ఎదురుచూశారు. (యోహా. 4:25) అయితే, వాళ్లు బాప్తిస్మం తీసుకోవాలంటే యేసును వాగ్దాన మెస్సీయగా అంగీకరించాలి. నిజానికి “చాలామంది సమరయులు” అలా అంగీకరించారు. (యోహా. 4:39) అంతేకాదు, అప్పట్లో ఉన్న క్రైస్తవుల్లో చాలామంది ముందు యూదులుగా ఉండేవాళ్లు. కాబట్టి యూదులకు, సమరయులకు మధ్యవున్న తేడాల్ని వాళ్లు తీసేసుకోవాల్సి వచ్చింది.—లూకా 9:52-54.

4. అపొస్తలుల కార్యాలు 8:5, 6, 14 ప్రకారం, ఫిలిప్పు ప్రకటించినప్పుడు కొంతమంది సమరయులు ఎలా స్పందించారు?

4 సమరయులు ఎలా బాప్తిస్మం తీసుకోగలిగారు? సువార్తికుడైన ఫిలిప్పు వాళ్లకు ‘క్రీస్తు గురించి ప్రకటించినప్పుడు’ కొంతమంది సమరయులు “దేవుని వాక్యాన్ని అంగీకరించారు.” (అపొస్తలుల కార్యాలు 8:5, 6, 14 చదవండి.) నిజానికి ఫిలిప్పు ఒక యూదుడు. కానీ, ఆయన మాటలు వినడానికి సమరయులు ఇబ్బందిపడలేదు. ఎందుకంటే బహుశా ఆదికాండం నుండి ద్వితీయోపదేశకాండంలో (పెంటాటుక్‌లో) దేవుడు పక్షపాతి కాడు అని చెప్పే వచనాల్ని వాళ్లు గుర్తుతెచ్చుకుని ఉంటారు. (ద్వితీ. 10:17-19) ఏదేమైనా, క్రీస్తు గురించి ఫిలిప్పు చెప్పిన మాటల్ని సమరయులు “మనసుపెట్టి విన్నారు” అలాగే ఫిలిప్పు వెనక దేవుడు ఉన్నాడనే స్పష్టమైన రుజువుల్ని వాళ్లు చూడగలిగారు. ఎందుకంటే రోగుల్ని బాగుచేయడం, చెడ్డదూతల్ని వెళ్లగొట్టడం లాంటి చాలా అద్భుతాల్ని కూడా ఫిలిప్పు చేశాడు.—అపొ. 8:7.

5. సమరయుల్ని చూసి మనం ఏం నేర్చుకోవచ్చు?

5 ఫిలిప్పు ఒక యూదుడనీ, ఆయన చెప్పేవి ముందెప్పుడూ వినని విషయాలనీ సమరయులు బాప్తిస్మం వైపు అడుగులు వేయకుండా ఆగిపోలేదు. ఫిలిప్పు చెప్పేవి సత్యమని సమరయులు నమ్మిన తర్వాత ఇక బాప్తిస్మం తీసుకోవడానికి ఆలస్యం చేయలేదు. బైబిలు ఇలా చెప్తుంది: “ఫిలిప్పు వాళ్లకు దేవుని రాజ్యం గురించిన, యేసుక్రీస్తు పేరు గురించిన మంచివార్త ప్రకటించిన తర్వాత వాళ్లు అతన్ని నమ్మి పురుషులు, స్త్రీలు అందరూ బాప్తిస్మం తీసుకోవడం మొదలుపెట్టారు.” (అపొ. 8:12) దేవుని వాక్యం సత్యమని, యెహోవాసాక్షులు రంగు-రూపం లాంటి తేడాలు చూపించరని, నిజక్రైస్తవులకు గుర్తుగా ఉన్న ప్రేమను చూపించుకుంటారని మీకు నమ్మకం కుదిరిందా? (యోహా. 13:35) అలాగైతే, బాప్తిస్మం తీసుకోవడానికి ఆలస్యం చేయకుండా ముందడుగు వేయండి. యెహోవా మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు!

6. రూబెన్‌ నుండి మీరేం నేర్చుకున్నారు?

6 జర్మనీలో ఉండే రూబెన్‌ యెహోవాసాక్షుల కుటుంబంలో పుట్టిపెరిగాడు. కానీ చిన్నప్పుడు, అసలు యెహోవా ఉన్నాడా అనే డౌట్‌ తనకు ఉండేది. మరి ఆయన వాటిని ఎలా తీసేసుకున్నాడు? ముందుగా, దానిగురించి తనకు తెలీదని గుర్తించి, ఎక్కువ విషయాలు నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆయన ఇలా అంటున్నాడు: “వ్యక్తిగత అధ్యయనం చేసి నా డౌట్స్‌ అన్నీ తీసేసుకున్నాను. నేను పరిణామ సిద్ధాంతం గురించి చాలాసార్లు చదివాను.” మిమ్మల్ని పట్టించుకునే సృష్టికర్త ఉన్నాడా? (ఇంగ్లీష్‌) అనే పుస్తకాన్ని చదివాక, దేవుడు ఉన్నాడు అనే నమ్మకం ఆయనకు పెరిగింది. అప్పుడు తనలోతాను ఇలా అనుకున్నాడు: ‘వావ్‌! యెహోవా నిజంగా ఉన్నాడు.’ అంతేకాదు, ఆయన ప్రపంచ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడానికి వెళ్లినప్పుడు, మన బ్రదర్స్‌సిస్టర్స్‌ అందరూ ఒక కుటుంబంలా ఎలా ఐక్యంగా ఉన్నారో చూసి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఆయన జర్మనీకి తిరిగొచ్చాక 17 ఏళ్ల వయసులో బాప్తిస్మం తీసుకున్నాడు. మీరు నేర్చుకుంటున్న విషయాల మీద మీకు కూడా డౌట్స్‌ ఉంటే, మన ప్రచురణలో పరిశోధన చేసి వాటిని తీసేసుకోండి. ‘సరైన జ్ఞానంతో’ మీ డౌట్స్‌కి చెక్‌ పెట్టండి. (ఎఫె. 4:13, 14) వేర్వేరు దేశాల్లో ఉన్న యెహోవా ప్రజల మధ్యున్న ప్రేమ-ఐక్యత గురించి మీరు విన్నప్పుడు, మీ సంఘంలో కూడా ఆ ప్రేమను కళ్లారా చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన బ్రదర్స్‌సిస్టర్స్‌ మీదున్న ప్రేమ మీకు ఇంకా పెరుగుతుంది.

తార్సుకు చెందిన సౌలు బాప్తిస్మం తీసుకున్నాడు

7. సౌలు ఎలాంటి ఆలోచనల్ని మార్చుకోవాల్సి వచ్చింది?

7 తార్సుకు చెందిన సౌలు గురించి చూడండి. ఆయన యూదా మతంలో ఆరితేరినవాడు, యూదుల మధ్య మంచి పేరు-ప్రతిష్ఠలు పొందాడు. (గల. 1:13, 14; ఫిలి. 3:5) ఒకానొక సమయంలో, చాలామంది యూదులు క్రైస్తవుల్ని మతభ్రష్టులుగా చూసేవాళ్లు. అప్పుడు సౌలు కూడా క్రైస్తవుల్ని దయాదాక్షిణ్యాలు లేకుండా హింసించేవాడు. అవన్నీ దేవుని ఇష్టంలో భాగమని తప్పుగా అనుకునేవాడు. (అపొ. 8:3; 9:1, 2; 26:9-11) ఒకవేళ యేసును అంగీకరించి, క్రైస్తవునిగా బాప్తిస్మం తీసుకుంటే అవే హింసలు సౌలు కూడా రుచి చూడడానికి సిద్ధంగా ఉండాలి.

8. (ఎ) సౌలు ఎలా బాప్తిస్మం తీసుకోగలిగాడు? (బి) అపొస్తలుల కార్యాలు 22:12-16 ప్రకారం, అననీయ సౌలుకు ఎలా సహాయం చేశాడు? (చిత్రం కూడా చూడండి.)

8 సౌలు ఎలా బాప్తిస్మం తీసుకోగలిగాడు? యేసు పరలోకం నుండి సౌలుతో మాట్లాడినప్పుడు ఆ వెలుతురు తట్టుకోలేక సౌలు చూపు పోయింది. (అపొ. 9:3-9) ఆ తర్వాతి మూడు రోజులు సౌలు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు. అప్పుడు జరిగినదాని గురించి సౌలు బాగా ఆలోచించి ఉంటాడు. అలా యేసే మెస్సీయ అని, ఆయన అనుచరులే నిజమైన మతాన్ని పాటిస్తున్నారని సౌలుకు నమ్మకం కుదిరింది. అప్పుడు స్తెఫనును చంపుతుంటే పక్కన చేతులు కట్టుకుని చూస్తూ నిలబడినందుకు ఆయన కుమిలిపోయి ఉంటాడు. (అపొ. 22:20) మూడు రోజుల తర్వాత అననీయ అనే శిష్యుడు సౌలు దగ్గరికి వచ్చి తనకు చూపు తెప్పించాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాప్తిస్మం తీసుకోమని చెప్పాడు. (అపొస్తలుల కార్యాలు 22:12-16 చదవండి.) సౌలు వినయంగా ఆ సహాయాన్ని అంగీకరించి, కొత్త జీవితానికి స్వాగతం పలికాడు.—అపొ. 9:17, 18.

సౌలు బాప్తిస్మం తీసుకోవడానికి నీళ్లలోకి దిగుతున్నాడు. చూసేవాళ్లందరి ముఖాల్లో సంతోషం కనిపిస్తుంది.

బాప్తిస్మం తీసుకోమని ఎవరైనా ప్రోత్సహిస్తే మీరు సౌలులా స్పందిస్తారా? (8వ పేరా చూడండి)


9. సౌలు నుండి మీరేం నేర్చుకోవచ్చు?

9 మనం సౌలు నుండి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఆయన బాప్తిస్మం తీసుకోకుండా గర్వం, మనుషుల భయం అడ్డుపడేలా అనుమతించవచ్చు. కానీ ఆయన వాటిని అడ్డురానివ్వలేదు. క్రీస్తు గురించిన సత్యాన్ని అంగీకరించిన తర్వాత సౌలు వినయంగా తన జీవితాన్ని మార్చుకున్నాడు. (అపొ. 26:14, 19) తనకు హింసలు వస్తాయని తెలిసినా ఆయన క్రైస్తవునిగా మారడానికి ఇష్టపడ్డాడు. (అపొ. 9:15, 16; 20:22, 23) బాప్తిస్మం తర్వాత, ప్రతీ కష్టంలో యెహోవా వైపు చూస్తూనే ఉన్నాడు. (2 కొరిం. 4:7-10) మీరు ఒక యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకున్నాక విశ్వాస పరీక్షలు, కష్టాలు రావచ్చు. కానీ మీరు ఒంటరివాళ్లు కాదు మీకు యెహోవా, యేసుక్రీస్తు తోడుగా ఉంటారు. వాళ్లు ఎప్పుడూ మీ చెయ్యి వదిలిపెట్టరనే నమ్మకంతో ఉండండి!—ఫిలి. 4:13.

10. ఆనా నుండి మీరు ఏం నేర్చుకోవచ్చు?

10 తూర్పు యూరప్‌లోని కుర్దీష్‌ కుటుంబంలో పుట్టిపెరిగిన ఆనా గురించి చూడండి. ఆమెది ఉమ్మడి కుటుంబం. వాళ్ల అమ్మ బాప్తిస్మం తీసుకున్న తర్వాత, ఆనా తొమ్మిదేళ్ల వయసులో వాళ్ల నాన్న అనుమతితో బైబిలు స్టడీ తీసుకుంది. కానీ ఆమెకు బంధువుల నుండి సమస్యలు వచ్చాయి. అంతేకాదు, వాళ్ల తాతముత్తాతల నుండి వస్తున్న మతాన్ని ఎవరైనా వదిలేసి వెళ్తే అది చాలా అవమానమని వాళ్ల బంధువులు అనుకునేవాళ్లు. ఆనాకు 12 ఏళ్లున్నప్పుడు ఒకరోజు వాళ్ల నాన్న దగ్గరకు వెళ్లి, తను బాప్తిస్మం తీసుకోవచ్చా అని అడిగింది. ఆ నిర్ణయం ఆమె మనస్ఫూర్తిగా తీసుకుందా లేదా ఎవరైనా బలవంతపెట్టారా అని ఆయన అడిగాడు. అప్పుడు ఆమె ఇలా చెప్పింది: “నాకు యెహోవా అంటే ఇష్టం.” ఆమె బాప్తిస్మం తీసుకోవడానికి వాళ్ల నాన్న ఒప్పుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆనా బంధువులు రాబందుల్లా ఆమెను సూటిపోటి మాటలతో, పనులతో పీక్కుతిన్నారు. వాళ్ల బంధువుల్లో ఒకాయన ఆమెతో ఇలా అన్నాడు: “నువ్వు ఒక యెహోవాసాక్షిగా మారడం కన్నా సిగరెట్లు తాగుతూ, ఎవడితోపడితే వాడితో తిరిగినా బాగుండు.” మరి వాటన్నిటిని ఆనా ఎలా భరించగలిగింది? ఆమె ఇలా చెప్తుంది: “వాళ్ల మాటల్ని, పనుల్ని తట్టుకోవడానికి నా గుండెను రాయి చేసుకునేలా యెహోవా సహాయం చేశాడు. మా అమ్మానాన్న కూడా ఎప్పుడూ నావైపే నిలబడ్డారు.” అంతేకాదు, ఆనా తన జీవితంలో యెహోవా ఎప్పుడెప్పుడు సహాయం చేశాడో వాటన్నిటిని ఒక పుస్తకంలో రాసుకునేది. అలా యెహోవా చేసిన సహాయాన్ని మర్చిపోకుండా అప్పుడప్పుడు వాటిని తిరగేస్తూ ఉంటుంది. మీకు ఒకవేళ వ్యతిరేకత వస్తుందని భయంగా ఉంటే, యెహోవా మీకు కూడా సహాయం చేస్తాడని మర్చిపోకండి.—హెబ్రీ. 13:6.

కొర్నేలి బాప్తిస్మం తీసుకున్నాడు

11. కొర్నేలి బాప్తిస్మం తీసుకోకుండా ఏది అడ్డుపడి ఉండేది?

11 బైబిల్లో కొర్నేలి ఉదాహరణ కూడా ఉంది. ఆయన ఒక “సైనికాధికారి.” రోమా సైన్యంలో తన కింద దాదాపు 100 మంది సైనికులు ఉండేవాళ్లు. (అపొ. 10:1) దానివల్ల మిలిటరీలో అలాగే సమాజంలో ఆయనకు మంచి పలుకుబడి ఉండేది. పైగా, “అతను ప్రజలకు ఎన్నో దానధర్మాలు చేసేవాడు.” (అపొ. 10:2) తనకు మంచివార్త చెప్పడానికి యెహోవా అపొస్తలుడైన పేతురును పంపించాడు. మరి కొర్నేలి తనకున్న పేరు-పలుకుబడి బాప్తిస్మం తీసుకోకుండా అడ్డుపడేలా అనుమతించాడా?

12. కొర్నేలి బాప్తిస్మం ఎలా తీసుకోగలిగాడు?

12 కొర్నేలి బాప్తిస్మం ఎలా తీసుకోగలిగాడు? ఆయన అలాగే ఆయన “ఇంటివాళ్లందరూ దేవునికి భయపడేవాళ్లు” అని బైబిలు చెప్తుంది. అలాగే కొర్నేలి ఎప్పుడూ దేవునికి ప్రార్థిస్తూ ఉండేవాడు. (అపొ. 10:2) పేతురు కొర్నేలికి మంచివార్త చెప్పినప్పుడు ఆయన, ఆయన కుటుంబం క్రీస్తును అంగీకరించి, వెంటనే బాప్తిస్మం తీసుకున్నారు. (అపొ. 10:47, 48) తన కుటుంబంతో కలిసి యెహోవాను ఆరాధించడానికి ఏమేమి మార్పులు చేసుకోవాలో వాటన్నిటిని చేసుకోవడానికి కొర్నేలి అస్సలు వెనకాడివుండడు.—యెహో. 24:15; అపొ. 10:24, 33.

13. కొర్నేలి నుండి మీరు ఏం నేర్చుకోవచ్చు?

13 సౌలులాగే కొర్నేలికి కూడా క్రైస్తవునిగా మారడానికి తన పలుకుబడి అడ్డుపడే అవకాశం ఉండేది. కానీ ఆయన అలా జరగనివ్వలేదు. సత్యాన్ని అంగీకరించాలంటే, మీ జీవితంలో కూడా పెద్దపెద్ద మార్పులు చేసుకోవాల్సి వస్తుందా? అలాగైతే, యెహోవా మీకు తోడుంటాడు. బైబిలు సూత్రాలకు అనుగుణంగా తనకు సేవచేయాలనే మీ గట్టి నిర్ణయాన్ని ఆయన దీవిస్తాడు.

14. సుయోషి నుండి మీరేం నేర్చుకోవచ్చు?

14 జపాన్‌లో ఉంటున్న సుయోషి బాప్తిస్మానికి అర్హత సాధించడానికి ముందు తన ఉద్యోగంలో మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. ఆయన పువ్వుల్ని ఎలా అలంకరించాలో నేర్పించే ఒక పెద్ద స్కూల్లో హెడ్‌ మాస్టర్‌కి అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. ఏదైనా అంత్యక్రియలకు హెడ్‌ మాస్టర్‌ వెళ్లలేకపోతే సుయోషి వెళ్లి, ఆయనకు బదులుగా బౌద్ధుల ఆచారాల్ని చేయాల్సి వచ్చేది. కానీ చనిపోయినవాళ్ల గురించి సత్యాన్ని తెలుసుకున్నాక సుయోషి బాప్తిస్మం తీసుకోవడానికి ఆ ఆచారాలు ఒక అడ్డంకుగా మారాయి. ఇక బౌద్ధుల ఆచారాలకు దూరంగా ఉండాలని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. (2 కొరిం. 6:15, 16) దానిగురించి ఆ హెడ్‌ మాస్టర్‌తో మాట్లాడాడు. ఆ తర్వాత ఏమైంది? సుయోషి ఆ ఆచారాల్లో పాల్గొనకుండానే తన ఉద్యోగాన్ని కొనసాగించగలిగాడు. బైబిలు స్టడీ మొదలుపెట్టిన ఒక సంవత్సరం తర్వాత ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. ఒకవేళ దేవుణ్ణి సంతోషపెట్టాలంటే మీ ఉద్యోగంలో మార్పులు చేసుకోవాలా? అలాగైతే మీ అవసరాల్ని మీ కుటుంబ అవసరాల్ని యెహోవా చూసుకుంటాడనే నమ్మకంతో ఉండండి.—కీర్త. 127:2; మత్త. 6:33.

కొరింథీయులు బాప్తిస్మం తీసుకున్నారు

15. కొరింథీయులు బాప్తిస్మం తీసుకోవడానికి ఏది అడ్డొచ్చి ఉండేది?

15 ఒకప్పటి కొరింథు నగరం సిరిసంపదలకు, విచ్చలవిడి జీవితానికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండేది. అక్కడున్న చాలామంది దేవునికి ఇష్టంలేని పనులు చేస్తుండేవాళ్లు. అలాంటి ఒక నగరంలో మంచివార్తను అంగీకరించడం ఎవరికైనా చాలా కష్టంగా ఉంటుంది. కానీ అపొస్తలుడైన పౌలు ఆ నగరానికి వచ్చి క్రీస్తు గురించిన మంచివార్తను ప్రకటించిన తర్వాత, “కొరింథీయుల్లో చాలామంది విశ్వాసముంచి, బాప్తిస్మం తీసుకోవడం మొదలుపెట్టారు.” (అపొ. 18:7-11) ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు పౌలుకు ఒక దర్శనంలో కనిపించి ఇలా అన్నాడు: “ఈ నగరంలో నా మీద విశ్వాసం ఉంచబోయేవాళ్లు ఇంకా చాలామంది ఉన్నారు.” కాబట్టి పౌలు అక్కడే ఒకటిన్నర సంవత్సరాలపాటు ఉండి ప్రీచింగ్‌ చేస్తూ ఉన్నాడు.

16. కొరింథులో ఉన్న కొంతమంది బాప్తిస్మానికి అడ్డొచ్చే వాటిని ఎలా తీసేసుకోగలిగారు? (2 కొరింథీయులు 10:4, 5)

16 కొరింథీయులు బాప్తిస్మం ఎలా తీసుకోగలిగారు? (2 కొరింథీయులు 10:4, 5 చదవండి.) దేవుని వాక్యం అలాగే శక్తివంతమైన పవిత్రశక్తి సహాయంతో వాళ్లు జీవితంలో పెద్దపెద్ద మార్పులు చేసుకున్నారు. (హెబ్రీ. 4:12) కొరింథులో క్రీస్తు గురించిన మంచివార్తను అంగీకరించినవాళ్లు తాగుబోతుతనం, దొంగతనం, స్వలింగ సంపర్కం లాంటి అలవాట్లను, పనుల్ని మానుకోగలిగారు.—1 కొరిం. 6:9-11.a

17. కొరింథీయుల నుండి మీరేం నేర్చుకున్నారు?

17 కొరింథులో ఉన్న కొంతమందికి చెడు అలవాట్లు నరనరాల్లో ఇంకిపోయినా, క్రైస్తవులు అవ్వడం తమవల్ల కాదని అనుకున్నారా? లేదు. వాళ్లు శాశ్వత జీవితమనే ఇరుకు ద్వారంలో నడవడానికి చాలా గట్టిగా కష్టపడ్డారు. (మత్త. 7:13, 14) మీరు కూడా బాప్తిస్మం తీసుకోవడానికి ఏదైనా ఒక చెడ్డ అలవాటునో లేదా చెడ్డ పనినో మానుకోవడానికి కష్టపడుతున్నారా? అయితే మీ పోరాటాన్ని ఆపకండి! చెడు చేయాలనే మీ కోరికను చంపేసుకోవడానికి సహాయం చేసే పవిత్రశక్తి కోసం యెహోవాను బతిమాలండి.

18. మోనికా నుండి మీరేం నేర్చుకున్నారు?

18 జార్జియా దేశంలో ఉంటున్న మోనికా అనే అమ్మాయి గురించి ఆలోచించండి. ఆమె చెడ్డ మాటలు మాట్లాడడం, చెడ్డ సినిమాలు చూడడం ఆపేసి బాప్తిస్మం వైపు అడుగులు వేయడానికి చాలా కష్టపడింది. ఆమె ఇలా చెప్తుంది: “నా టీనేజీలో ప్రార్థనే నా శక్తి. నేను సరైనది చేయాలనుకుంటున్నాను అని యెహోవాకు తెలుసు. అందుకే ఆయన నా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ, ఎప్పుడూ నా వెన్నంటే ఉన్నాడు.” మోనికా 16 ఏళ్ల వయసులో బాప్తిస్మం తీసుకుంది. మీరు కూడా యెహోవా ఇష్టపడే విధంగా సేవచేయడానికి ఏవైనా అలవాట్లు మానుకోవాలా? అలాగైతే మార్పులు చేసుకోవడానికి కావాల్సిన బలం కోసం యెహోవాను అడుగుతూ ఉండండి. ఎందుకంటే, యెహోవా తన పవిత్రశక్తిని ధారాళంగా ఇస్తాడు.—యోహా. 3:34.

మీ విశ్వాసం కొండల్ని కూడా కదిలిస్తుంది

19. పర్వతాలు లాంటి అడ్డంకుల్ని దాటడానికి మీకు ఏది సహాయం చేస్తుంది? (చిత్రం కూడా చూడండి.)

19 యెహోవాకు మీరంటే ఇష్టమని, మీరు తన కుటుంబంలో ఒకరిగా ఉండాలనేది ఆయన కోరిక అని మర్చిపోకండి. బాప్తిస్మం తీసుకోవడానికి మీకు ఎలాంటి అడ్డంకులు ఉన్నాసరే, యెహోవా మీ విషయంలో అదే కోరుకుంటాడు. మొదటి శతాబ్దంలో ఉన్న కొంతమంది శిష్యులతో యేసు ఇలా చెప్పాడు: “మీకు ఆవగింజంత విశ్వాసం ఉండి, ఈ కొండతో, ‘ఇక్కడి నుండి అక్కడికి వెళ్లు’ అని అంటే, అది వెళ్తుంది; మీకు ఏదీ అసాధ్యంగా ఉండదు.” (మత్త. 17:20) ఈ మాటల్ని విన్నవాళ్లు యేసుతో కొన్ని సంవత్సరాలే ఉన్నారు కాబట్టి వాళ్లు ఇంకా విశ్వాసం పెంచుకోవాలి. కానీ వాళ్లు సరిపడేంత విశ్వాసం పెంచుకుంటే, పర్వతాల్లాంటి అడ్డంకుల్ని కూడా కదిలించేలా యెహోవా వాళ్లకు సహాయం చేస్తాడని యేసు ధైర్యం చెప్పాడు. యెహోవా మీకు కూడా అలాగే సహాయం చేస్తాడు.

సమావేశంలో అప్పుడే బాప్తిస్మం తీసుకొని వస్తున్నవాళ్లను చప్పట్లతో సంతోషంగా ఆహ్వానిస్తున్న బ్రదర్స్‌-సిస్టర్స్‌.

యెహోవాకు మీరంటే ఇష్టం, మీరు తన కుటుంబంలో ఒకరిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు (19వ పేరా చూడండి)b


20. మొదటి శతాబ్దంలో అలాగే మనకాలంలో ఉన్న ఉదాహరణలు ఏం చేసేలా మిమ్మల్ని కదిలిస్తున్నాయి?

20 బాప్తిస్మం తీసుకోవడానికి ఏవైనా అడ్డంకులు ఉన్నాయని మీరు గుర్తిస్తే, వాటిని తీసేసుకోవడానికి ఆలస్యం చేయకండి. మొదటి శతాబ్దంలో అలాగే మనకాలంలో ఉన్న క్రైస్తవుల ఉదాహరణలు మీకు ఓదార్పును, బలాన్ని ఇస్తాయి. యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకునేలా వాళ్ల ఉదాహరణలు మిమ్మల్ని కదిలిస్తాయని ఆశిస్తున్నాం. బాప్తిస్మం తీసుకోవాలనే నిర్ణయం మీ జీవితంలో మీరు తీసుకోగల బెస్ట్‌ నిర్ణయం!

మీ బాప్తిస్మానికి ఉన్న అడ్డంకుల్ని తొలగించుకోవడానికి వీళ్ల నుండి మీరు ఏం నేర్చుకున్నారు?

  • సమరయులు

  • తార్సుకు చెందిన సౌలు అలాగే కొర్నేలి

  • కొరింథీయులు

పాట 38 ఆయనే నిన్ను బలపరుస్తాడు

a jw.orgలో ఉన్న ‘బాప్తిస్మం తీసుకోవడానికి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు?’ అనే వీడియో చూడండి.

b చిత్రం వివరణ: అప్పుడే బాప్తిస్మం తీసుకొని వస్తున్నవాళ్లను చప్పట్లతో సంతోషంగా ఆహ్వానిస్తున్న బ్రదర్స్‌-సిస్టర్స్‌.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి