ప్రవక్తల్ని ఆదర్శంగా తీసుకోండి—హబక్కూకు
1. మనకు కూడా హబక్కూకులాగే ఎందుకు అనిపించవచ్చు?
1 మన చుట్టూ ఉన్న లోకంలో అంతకంతకూ పెరిగిపోతున్న చెడుతనాన్ని చూసినప్పుడు, మనకు కూడా హబక్కూకులాగే అనిపించవచ్చు. ఆయన యెహోవాను ఇలా అడిగాడు, “నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు?” (హబ. 1:3; 2 తిమో. 3:1, 13) మనం హబక్కూకు ప్రకటించిన సందేశాన్ని, అలాగే దేవునికి నమ్మకంగా ఉండడంలో ఆయన ఉంచిన ఆదర్శాన్ని ధ్యానించాలి. అలా చేస్తే, దుష్టలోకంపై యెహోవా తీర్పుతీర్చే సమయం కోసం మనం నమ్మకంగా కనిపెట్టుకొని ఉంటాం.—2 పేతు. 3:7.
2. నేడు, మనం విశ్వాసంతో జీవిస్తున్నామని ఎలా చూపించవచ్చు?
2 విశ్వాసంతో జీవించండి: హబక్కూకు తన చుట్టూవున్న చెడు పరిస్థితుల గురించే ఆలోచిస్తూ కృంగిపోయే బదులు ఆధ్యాత్మికంగా మెలకువగా, చురుగ్గా ఉన్నాడు. (హబ. 2:1) తన వాగ్దానం సరిగ్గా సమయానికే నెరవేరుతుందని యెహోవా ఆయనకు అభయమిచ్చాడు. అంతేకాదు, ‘నీతిమంతుడు విశ్వాసం మూలంగా’ బ్రతుకుతాడని కూడా యెహోవా ఆయనకు చెప్పాడు. (హబ. 2:2-4) అంతానికి చాలా దగ్గర్లో జీవిస్తున్న మనం దీనినుండి ఏమి నేర్చుకోవచ్చు? అంతం ఎప్పుడు వస్తుందనేది తెలుసుకోవడం కన్నా, అది ఖచ్చితంగా వస్తుందని నమ్మడమే చాలా ప్రాముఖ్యం. విశ్వాసం ఉంటే, మనం అప్రమత్తంగా ఉంటూ పరిచర్యకు మొదటి స్థానం ఇస్తాం.—హెబ్రీ. 10:38, 39.
3. యెహోవా సేవలో మన ఆనందాన్ని ఎందుకు కాపాడుకోవాలి?
3 యెహోవాయందు ఆనందించండి: మాగోగు దేశపువాడగు గోగు యెహోవా ప్రజలమీద దాడి చేసినప్పుడు, మన విశ్వాసానికి పరీక్షలు ఎదురౌతాయి. (యెహె. 38:2, 10-12) ఏదైనా పోరాటం జరిగినప్పుడు, దాంట్లో గెలిచినవాళ్లు కూడా కష్టాలపాలౌతారు. ఆహారకొరతలు ఏర్పడవచ్చు, ఆస్తి నష్టం జరగవచ్చు, జీవన ప్రమాణాలు దిగజారిపోవచ్చు. అలాంటి కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా స్పందిస్తాం? తనకు కష్టాలు వస్తాయని హబక్కూకు ముందే ఊహించి, యెహోవా సేవలో తన ఆనందాన్ని కాపాడుకోవాలని నిశ్చయించుకున్నాడు. (హబ. 3:16-19) అలాగే, మనం కూడా “యెహోవాయందు ఆనందించుటవలన” భవిష్యత్తులో వచ్చే కష్టాల్ని తట్టుకోగలుగుతాం.—నెహె. 8:10; హెబ్రీ. 12:1, 2.
4. ఇప్పుడు, అలాగే భవిష్యత్తులో మనకు ఏ అవకాశం ఉంది?
4 త్వరలో రానున్న అంతాన్ని తప్పించుకున్న తర్వాత కూడా, దేవుని ప్రజలు యెహోవా మార్గాల్ని నేర్చుకుంటూనే ఉంటారు. (హబ. 2:14) అంతేకాదు, పునరుత్థానమైనవాళ్లు కూడా యెహోవా గురించి నేర్చుకుంటారు. కాబట్టి, మనం యెహోవా గురించి, ఆయన అద్భుతకార్యాల గురించి మాట్లాడే ప్రతీ అవకాశాన్ని ఇప్పుడు కూడా ఉపయోగించుకుందాం.—కీర్త. 34:1; 71:17.