జ్ఞాపకార్థ ఆచారానికి సిద్ధపడుతున్నారా?
అది సా.శ. 33, నీసాను 13. తన మరణానికి ముందు తనకు ఎంతో ప్రియమైన స్నేహితులతో గడపడానికి ఆ ఒక్క సాయంత్రమే ఉందని యేసుకు తెలుసు. వాళ్లతో చివరిసారి పస్కాను ఆచరించి తర్వాత ఓ కొత్త ఆచారాన్ని మొదలుపెడతాడు, అదే ప్రభువు రాత్రి భోజనం. అలాంటి ప్రాముఖ్యమైన సందర్భం కోసం సిద్ధపాటు ఖచ్చితంగా అవసరం. అందుకే, కావాల్సినవి ఏర్పాటు చేయడానికి యేసు పేతురును, యోహానును పంపించాడు. (లూకా 22:7-13) అప్పటినుండి ప్రతీ సంవత్సరం, జ్ఞాపకార్థ ఆచారాన్ని జరుపుకోవాలనుకునే క్రైస్తవులు దానికోసం తప్పకుండా సిద్ధపడతారు. (లూకా 22:19) ఏప్రిల్ 3న జరిగే జ్ఞాపకార్థ ఆచారానికి సిద్ధపడడానికి మనం చేయాల్సిన పనులు ఏమిటి?
ప్రచారకులు చేయాల్సినవి:
జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమంలో సాధ్యమైనంతగా పాల్గొనేలా ఏర్పాటు చేసుకోండి.
మీ బైబిలు విద్యార్థుల, బంధువుల, తోటి విద్యార్థుల, సహోద్యోగుల, స్నేహితుల లిస్టు తయారుచేసుకొని వాళ్లను ఆహ్వానించండి.
“జ్ఞాపకార్థ ఆచరణ కోసం బైబిలు పఠనం” చదివి, ధ్యానించండి.
ఆచరణకు వచ్చేవాళ్లను ఆహ్వానించడానికి ముందే రండి.