ప్రవక్తల్ని ఆదర్శంగా తీసుకోండి—నహూము
1. నహూము పుస్తకం నుండి మనమేమి నేర్చుకుంటాం?
1 యెహోవా తన శత్రువులను నాశనం చేస్తాడని, వాళ్లు ఎంత భయంకరులైనా యెహోవా ముందు నిలవలేరని నహూము ప్రవచించాడు. అది నిజమని ప్రాచీన నీనెవె పట్టణ శిథిలాలు రుజువు చేస్తున్నాయి. (నహూ. 1:2, 6) నహూము ప్రవచనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, పరిచర్యలో ఉపయోగపడే కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు.
2. మనం పరిచర్యలో ముఖ్యంగా దేని గురించి చెబుతాం?
2 ఓదార్పు, నిరీక్షణ ఇవ్వండి: నహూము పుస్తకాన్ని మొదటిసారి చదివినప్పుడు, అందులో అష్షూరు రాజధాని నీనెవె నాశనం గురించిన ప్రకటన మాత్రమే ఉందని అనిపిస్తుంది. (నహూ. 1:1; 3:7) అయితే, ఆ ప్రకటనలో యెహోవా ప్రజలకు శుభవార్త కూడా ఉంది. నహూము అంటే “ఓదార్చేవాడు” అని అర్థం. నహూము తన పేరుకు తగినట్లే, తోటి యూదులకు శత్రువులు నాశనం కాబోతున్నారనే ఓదార్పును ఇచ్చాడు. అంతేకాదు, “శ్రమ దినమందు ఆయన [యెహోవా] ఆశ్రయదుర్గము” అని కూడా చెప్పాడు. (నహూ. 1:7) మనం కూడా పరిచర్యలో ముఖ్యంగా మంచివార్తే చెబుతూ, యెహోవాను ఆశ్రయించమని ప్రజలను ప్రోత్సహిస్తాం.—నహూ. 1:15.
3. ఉదాహరణలు లేదా ఉపమానాలు ఉపయోగించడంలో నహూమును ఎలా అనుకరించవచ్చు?
3 ఉదాహరణలు, ఉపమానాలు ఉపయోగించండి: నహూము యెహోవా సహాయంతో నీనెవె నాశనాన్ని, అష్షూరు చేతిలో నాశనమైపోయిన ఐగుప్తులోని థీబ్స్ పట్టణంతో (నోఅమోను) పోల్చాడు. (నహూ. 3:8-10) మనం కూడా ఈ దుష్టలోకం నాశనమైపోతుందని చెబుతున్నప్పుడు, పొల్లు కూడా పోకుండా నెరవేరిన బైబిలు ప్రవచనాలను చూపించి యెహోవా వాగ్దానాలను నిలబెట్టుకుంటాడని చెప్పవచ్చు. ఉదాహరణకు సా.శ.పూ. 632లో బబులోనీయులు, మాదీయులు నీనెవె పట్టణం మీదికి దండెత్తి వచ్చినప్పుడు, భారీ వర్షాలకు టైగ్రీస్ నది పొంగి బలమైన నీనెవె పట్టణ గోడల్లో కొంత భాగం కూలిపోయింది. అలా యెహోవా చెప్పినట్లే నీనెవె పట్టణాన్ని సులువుగా జయించారు.—నహూ. 1:8; 2:6.
4. పరిచర్యలో స్పష్టంగా, అర్థమయ్యేలా ఎలా మాట్లాడవచ్చు?
4 స్పష్టంగా అర్థమయ్యేలా మాట్లాడండి: నహూము చాలా వివరంగా, కళ్లముందు జరుగుతున్నట్లు రాశాడు. స్పష్టంగా చెప్పాడు. (నహూ. 1:14; 3:1) అలాగే మనం కూడా సులభంగా అర్థమయ్యే భాష ఉపయోగించాలి. (1 కొరిం. 14:9) మొదటిసారి కలిసినప్పుడే ఎందుకు వచ్చామో స్పష్టంగా చెప్పండి. బైబిలు అధ్యయనాలు చేస్తున్నప్పుడు యెహోవాపైన, ఆయన వాక్యంపైన నమ్మకం పెంచుకోవడానికి, నేర్చుకునే విషయాలు వాళ్లు ఎలా పాటించవచ్చో అర్థం చేసుకోవడానికి విద్యార్థులకు సహాయం చేయండి.—రోమా. 10:14.
5. నహూము ప్రవచనం మనకెలా ధైర్యాన్నిస్తుంది?
5 యెహోవా మాటలు ఖచ్చితంగా నెరవేరుతాయని నహూముకున్న నమ్మకం ఆయన రాసిన పుస్తకంలో స్పష్టంగా కనిపిస్తుంది. సాతాను లోకం నాశనానికి దగ్గరౌతుండగా, “బాధ రెండవమారు రాకుండ” చేస్తానని దేవుడిచ్చిన మాటలో ఓదార్పు పొందుతాం.—నహూ. 1:9.