పాత పత్రికలను సద్వినియోగం చేయండి
పాత పత్రికలను దాచిపెట్టుకుంటే లేదా పారవేస్తే ఎవ్వరూ ప్రయోజనం పొందలేరు కాబట్టి, వాటిని ఇతరులకు అందించడానికి ప్రయత్నించాలి. ప్రజలు ఒకే ఒక్క పత్రిక చదివినా సత్యంపట్ల వాళ్లలో ఆసక్తి పెరిగి, యెహోవా నామమున ప్రార్థించడం మొదలుపెట్టవచ్చు. (యోవే. 2:32) పాత పత్రికలను సద్వినియోగం చేయడానికి కొన్ని సూచనలు గమనించండి:
కేవలం అడపాదడపా పరిచర్య చేసే ప్రాంతాల్లో, ఏదైనా ఇంటికి తాళం వేసివుంటే ఆ ఇంటిదగ్గర బయటికి కనిపించకుండా ఒక పత్రికను పెట్టవచ్చు.
ప్రజలు వేచివుండే స్థలాల్లో అంటే బస్స్టాండ్ల దగ్గర, రైల్వేస్టేషన్ల దగ్గర బహిరంగ సాక్ష్యమిస్తున్నప్పుడు, చదవడమంటే ఆసక్తి ఉందేమోనని అక్కడున్న వాళ్లను అడగండి. ఒకవేళ వాళ్లకు ఆసక్తి ఉంటే, కొన్ని పాత పత్రికలు చూపించి వాటిలో కావాల్సినవి తీసుకోమని చెప్పండి.
మీ సంఘ క్షేత్రంలో ఉన్న హాస్పిటల్, క్లినిక్ల వంటివాటికి వెళ్లినప్పుడు వేచివుండే గదిలో కొన్ని పాత పత్రికలను పెట్టవచ్చు. దాన్ని చూసుకునే వ్యక్తి అక్కడుంటే ముందుగా వాళ్ల అనుమతి తీసుకోవడం మంచిది. ఒకవేళ అప్పటికే అక్కడ కొన్ని పత్రికలు ఉంటే, మరికొన్ని పత్రికలు పెట్టకండి.
పునర్దర్శనాలు చేసేముందు, మీరు మళ్లీ కలవాలనుకుంటున్న ఒక్కో వ్యక్తి అభిరుచుల గురించి ఆలోచించండి. అతనికి కుటుంబం ఉందా? ప్రయాణాలు అంటే అతనికి ఇష్టమా? తోటపని చేయడం అంటే అతనికి సరదానా? మీ దగ్గర ఉన్న పాత పత్రికల్లో అతను చదవడానికి ఇష్టపడే ఆర్టికల్ ఏదైనా ఉంటే, అతని దగ్గరకు వెళ్లినప్పుడు ఆ పత్రికను ఇవ్వండి.
మీరు ఎన్నిసార్లు వెళ్లినా, ఆసక్తి చూపించిన వ్యక్తిని కలవలేకపోతున్నారా? ఒకవేళ ఆయన కలిస్తే, ఆయన ఇప్పటివరకూ చదవని కొన్ని పాత పత్రికలు చూపించండి.