తోటి ప్రచారకునికి సహాయం చేయండి
1. పరిచర్య చేస్తున్నప్పుడు మనం పౌలు మాదిరిని ఎలా అనుకరించవచ్చు?
1 అపొస్తలుడైన పౌలు, తోటి విశ్వాసులతో తాను గడిపిన సమయాలను ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి చక్కని అవకాశాలుగా ఎంచాడు. (రోమా. 1:11) పరిచర్య చేస్తున్నప్పుడు మీరు కూడా తోటి ప్రచారకుణ్ణి ప్రోత్సహించడానికీ అతనికి సహాయం చేయడానికీ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా? మౌనంగా ఉండే బదులు, పరిచర్యను సమర్థవంతంగా చేయడానికి ఏ విషయాలు మీకు తోడ్పడుతున్నాయో అతనితో పంచుకోవచ్చు.
2. మనతో పరిచర్య చేస్తున్న వాళ్లలో ధైర్యాన్ని నింపడానికి మనం ఏమి చేయవచ్చు? అలా చేయడం ఎందుకు ప్రాముఖ్యం?
2 ధైర్యాన్ని నింపండి: కొందరు ప్రచారకులకు పరిచర్య అంటే భయం ఉంటుంది. అది వాళ్ల ముఖంలో, స్వరంలో తెలిసిపోతుంది. హృదయపూర్వకంగా మెచ్చుకుంటే వాళ్లకు ధైర్యం వస్తుంది. ఇంకా ఏయే విధాలుగా వాళ్లలో ధైర్యాన్ని నింపవచ్చు? ఒక ప్రయాణ పర్యవేక్షకుడు, తనకూ భయాలు ఉన్నాయనీ వాటిని అధిగమించడానికి తరచూ ప్రార్థిస్తాననీ తనతో కలిసి పరిచర్య చేసే వాళ్లతో నిర్మొహమాటంగా చెబుతుంటాడు. మరో సహోదరుడు ఇలా అన్నాడు: “చిన్న చిరునవ్వుతో నాకు ధైర్యం వస్తుంది. అయితే కొన్నిసార్లు అలా నవ్వడానికి కూడా నేను ప్రార్థన చేసుకోవాల్సి వస్తుంది.” ధైర్యంగా పరిచర్య చేయడానికి మీకు ఏది సహాయం చేసింది? మీతో పరిచర్య చేస్తున్న వాళ్లతో దాన్ని పంచుకోండి.
3. తోటి ప్రచారకులు పరిచర్యలో రాణించేలా మనం ఏయే విషయాలు పంచుకోవచ్చు?
3 మెళకువల్ని పంచుకోండి: మీ క్షేత్రంలోని ఏదైనా సంఘటనను ఉపయోగించి కొన్ని మాటలతో లేదా చిన్న ప్రశ్నతో సంభాషణను చక్కగా ప్రారంభించగలిగారా? మన రాజ్య పరిచర్యలోని నమూనా అందింపును మీ ప్రాంతానికి అనుగుణంగా మలచుకొని మంచి ఫలితాలు సాధించారా? గృహస్థుని అవసరాలకు తగినట్లు మీ అందింపును ఎలా మలుచుకున్నారు? వాటిని మీతో పరిచర్య చేస్తున్న వాళ్లతో పంచుకోండి. (సామె. 27:17) పునర్దర్శనానికి వెళ్తున్నప్పుడు, మీ లక్ష్యం ఏమిటో దాన్ని ఎలా సాధించాలని అనుకుంటున్నారో మీతో ఉన్న ప్రచారకునికి చెప్పవచ్చు. బైబిలు అధ్యయనం ముగించుకొని వెళ్తున్నప్పుడు, విద్యార్థితో చర్చించడానికి మీరు ఫలానా అంశాన్ని, లేఖనాన్ని, బోధనా పద్ధతిని ఎందుకు ఉపయోగించారో చెప్పవచ్చు.
4. తోటి ప్రచారకులకు సహాయం చేయడం గురించి మనం ఎందుకు ఆలోచించాలి?
4 మొదటి శతాబ్దంలోని సువార్తికులు కేవలం అవిశ్వాసులకు సహాయం చేయడంపైనే దృష్టి పెట్టలేదు. ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, బలపరచుకోవడం కూడా ముఖ్యమేనని వాళ్లు గుర్తించారు. (అపొ. 11:23; 15:32) అపొస్తలుడైన పౌలు యౌవనస్థుడైన తిమోతికి శిక్షణనిచ్చాడు, నేర్చుకున్న వాటిని ఇతరులతో పంచుకోమని ఆయనను ప్రోత్సహించాడు. (2 తిమో. 2:2) పరిచర్య చేస్తున్నప్పుడు, తోటి క్రైస్తవులకు ‘ఉపకారం చేయడం మర్చిపోకుండా’ ఉందాం. అలాచేస్తే వాళ్ల సంతోషాన్ని, సమర్థతను పెంచినవాళ్లమౌతాం; మన పరలోక తండ్రిని సంతోషపెడతాం.—హెబ్రీ. 13:15, 16.